[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
పందిరి గుంజకి పని చెప్పటం
[dropcap]పం[/dropcap]దిరి వెయ్యటానికి నాలుగు పక్కలా సర్వి బాదులో, ఇనప స్తంభాలో భూమిలో గట్టిగా కదలకుండా పాతుతారు.
కొందరికి కనిపించిన ప్రతివారికి పని చెప్పే అలవాటు ఉంటుంది. ఆ అలవాటుకి చిన్న-పెద్దా, ఆడా-మగా, ముసలి-ముతకా అనే తారతమ్యం ఏమి ఉండదు. వారికున్న ఈ విపరీత.. విచిత్ర అలవాటు గురించి చెప్పేటప్పుడు.. కదలకుండా భూమిలో పాతేసిన పందిరి గుంజని కూడా వదలకుండా పని చెప్పగల సమర్థులని అతిశయోక్తిగా చెబుతూ ఈ సామెత వాడతారు.
***
“ఇదిగో ఓ సారిలా వస్తావా.. భుజం పట్టేసిందోయ్.. కాస్త అయొడెక్స్ రాస్తావా” అన్నాడు పరాంకుశం, భార్య కమలతో.
“ఏం.. బరువేమయినా ఎత్తారా? అవునూ మొన్న, నిన్న ఫైల్స్ అన్నీ తెగ సర్దేస్తున్నారు.. దేని కోసమైనా వెతుకుతున్నారా” అన్నది.
“అయినా ఏక బిగిన అంత చేటు చెయ్యకపోతేనేం? బాలా కుమారుడ్ని అనుకుంటున్నారా? మధ్యాహ్నం అలా నడుమన్నా వాల్చకుండా ఉదయం నించి సాయంత్రం వరకు ఒకటే సర్దుడు!”
“మీ నాన్న విల్లు రాశారని ఎవరేనా చెప్పారా? అయినా నా బొంద విల్లు రాయటానికి ఆయన దగ్గరేముందని? మీరు కాక ఇంకా ఆయనకి పిల్లలెక్కడున్నారు” అని తన ధోరణిలో తన నిష్ఠూరాలు.. విరుపులు అయొడెక్స్‌తో కలిపి మర్దనా చేసేస్తోంది, కమల.
“ఆపుతావా నీ ధోరణి.. వాగ్దేవీ! నీ సుపుత్రుడు నా రిటైర్మెంట్ తరువాత ఇచ్చిన బహుమతి.. ఆ ఫైల్స్ సర్దటం! ‘నాన్నగారూ.. మా చిన్నప్పటి నించి దాచి పెట్టిన ఆ ఫైల్స్ నిధిలోనించి అక్కరలేని కాయితాలు అన్నీ తీసేస్తే సగం ఇల్లు ఖాళీ అవుతుంది. కొత్త ఇంట్లోకి ఆ పాత చెత్త ఎందుకు.. రేపటికి ఆ అలమార ఖాళీ చేస్తే.. రేపు ఇంకొక అలమార ఖాళీ చెయ్యచ్చు. జాగ్రత్త ఆ కాయితాల్లో మన వ్యక్తిగత వివరాలుంటాయి.. అందుకని అలా డైరెక్ట్‌గా చెత్తబుట్టలో పడేస్తే ప్రమాదం. వాటిని చిన్న చిన్న ముక్కల కింద చింపి పడెయ్యండి’ అని కూడా అన్నాడే నీ పుత్ర రత్నం. అలా చింపుతూ వెళ్ళేసరికే భుజం పట్టేసింది” అన్నాడు భుజం నిమురుకుంటూ.
“ఓరి వాడి అసాధ్యం కూలా.. వాడు చెయ్యాల్సిన పని ఈ వయసులో మిమ్మల్ని చెయ్యమని అప్పగించాడా.. వాడు చిన్నప్పటి నించీ అంతే” అన్నది.
***
“అక్కా స్నానానికి వెళ్ళాలి టవలిస్తావా”తో మొదలయి “నా యూనిఫార్మ్ తీసి పెట్టవా.. నా బ్యాగ్ ఎక్కడుంది” అని ప్రతి రోజు స్కూల్‌కి వెళ్ళే ముందు అక్కకి పని చెబుతాడు ప్రదీప్!
“నేనూ స్కూల్‌కి వెళ్ళాలి కదరా.. నాకు టైం లేదు.. నువ్వే తీసుకో” అంటుందే కానీ ప్రదీప్ నస భరించలేక.. అడిగినవన్నీ చచ్చినట్టు తీసి రెడీగా పెడుతుంది వాసవి.
“చిన్నా నా షూ తీసివ్వవా.. అర్జెంట్.. నా టై ఎక్కడుందో కొంచెం వెతికి పెట్టవా” అని తమ్ముడ్ని షంటేస్తూ ఉంటాడు.
“అమ్మా హోం వర్క్ చెయ్యలేదు. టీచర్ వాయించేస్తుంది. ఆ టిఫినేదో నువ్వే నోట్లో పెట్టేస్తే నేను హోం వర్క్ పూర్తి చేస్తా” అంటాడు తల్లితో!
“బామ్మా నువ్వు తల ఎంత బాగా దువ్వుతావో.. కాస్త నూనె రాసి తల దువ్వవా” అని బామ్మ దగ్గర గారాలు పోతాడు.
“పెద్దయ్యాక వీడ్ని ఎవత్తి చేసుకుంటుందో కానీ దాని ఆయుర్దాయం సగం అవుతుంది.. వీడితో వేగలేక! లేదా వీడిని మూడో నాడే వదిలేసి పోతుంది” అంటుంది తల్లి కమల.
నిత్యం ఉదయం ఈ ప్రహసనం నడవాల్సిందే.
***
“ఒరేయ్ ప్రదీప్.. అలా బజార్ దాకా వెళ్ళి ఓ పాతిక తమలపాకులు, డజను అరటిపళ్ళు పట్రా. రేపు నాగుల చవితి” అన్నది కమల.
అరగంట తరువాత పక్కింటి రమేష్ బెల్లు కొట్టి “ఆంటీ ప్రదీపన్న అరటి పళ్ళు, తమలపాకులు కొని మీకిమ్మని చెప్పాడు.. డబ్బులిస్తారా” అన్నాడు.
“వాడెక్కడికెళ్ళాడు? వాడికి చెప్పిన పని నీకు చెప్పాడా.. వీడెప్పుడు మారతాడో” అనుకుంటూ వంద రూపాయలు తెచ్చి రమేష్ చేతిలో పెట్టింది.
“పొద్దున్న అనగా సైకిలేసుకెళ్ళావ్? తిండి తినకుండా ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావ్? అరటి పళ్ళు తేరా అంటే పక్కింటి రమేష్‌కి చెప్పావ్..” అని అరిచింది కమల తిరిగి తిరిగి ఎండన పడి వచ్చిన కొడుకు ప్రదీప్ మీద.
“ఫ్రెండ్స్ కలిసి సినిమాకెళదాం అంటే వెళ్ళాను. అయినా నీకు పనయింది కదా! నేను చేస్తే ఏం.. ఇంకొకరు చేస్తే ఏం” అన్నాడు ప్రదీప్ అమ్మ భుజాల మీద చేతులేస్తూ!
“ఇంకా నయం.. భడవకానా.. ఇంత బద్ధకస్తుడివి రేపు నీ పెళ్ళాంతో కాపురం ఎలా చేస్తావురా” అని బామ్మ మేలమాడింది.. మనవడి బుగ్గలు నొక్కుతూ!
***
“పండూ ఆ కూరల సంచి నీకెందుకురా? నువ్వు మొయ్యలేవు అక్కడ పెట్టు” అన్నది రజని నాలుగేళ్ళ కొడుకు ఎర్రబడిన చేతులు చూస్తూ!
“వాకిట్లో ఆటో అంకుల్ నన్ను పిలిచి ఈ బ్యాగ్ ఇంట్లో పెట్టమన్నారమ్మా” అన్నాడు అమ్మతో అమాయకంగా చిన్ను.
“నాన్నెక్కడికెళ్ళారు? అయినా నీ చేతికి అంత బరువున్న కూరల బ్యాగ్ ఇవ్వటమేంటి” అన్నది రుస రుసలాడుతూ రజని.
“చూడండత్తయ్యా.. మీ అబ్బాయి బద్ధకం అంతకంతకీ ఎక్కువై పోతున్నది. పసి వెధవ చేతికి అంత బరువున్న కూరల సంచి ఇచ్చి ఎక్కడికెళ్ళినట్టు ఈ పెద్ద మనిషి” అన్నది చిరాకుగా మొహం పెట్టి.
***
“అమ్మా నీ చేతి ముద్ద అమృతం.. గోంగూర పచ్చడి నీ చేత్తో కలిపితేనే బావుంటుంది. కలిపి పెట్టవా” అన్నాడు ప్రదీప్ టీవి ముందు కూర్చుని.
అమ్మ నోట్లో పెడుతుంటే ఇంకో ముద్ద ఎక్కువ తిని.. ‘హమ్మయ్యా.. చెయ్యి కడుక్కోవటానికి లేచి వెళ్ళక్కరలేదు’ అనుకుంటూ టీవి రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు.
“అమ్మా నాన్నేరి” అన్నాడు టీవి మీద నించి చూపు మరల్చకుండా.
“పడుకున్నారు. భుజం నొప్పి చేసింది. ఏదో వెంట్రుక రాక్షసుడి పని అప్పచెప్పావుట కదా! అయినా ఈ వయసులో ఆయన అవన్నీ ఎలా చేస్తారు” అన్నది నొచ్చుకుంటున్నట్లు.
“మన పని మనమే చేసుకోవాలి. అయినా భుజం నొప్పెట్టేలా చెయ్యమన్నానా ఏంటి? కాస్త చూసుకోవచ్చు కదా! మందేమైనా వేశావా? ఇంట్లో లేకపోతే ఆ షాపు వాడిని తెమ్మంటాను” అన్నాడు.
“నువ్వు ఫోనూ చెయ్యక్కరలేదు. మందులు తెప్పించక్కరలేదు.”
‘పందిరి గుంజకి పని చెప్పే’ అలవాటు మానుకుంటే చాలు.
“ఉదయం.. నాలుగేళ్ళు లేని పసి వెధవ చేతికి కూరల సంచి ఇచ్చి పంపించావు”
“నీ చుట్టూ మనుషులున్నంత వరకూ సాగుతుంది. ఎవ్వరూ లేనప్పుడే నీ పాట్లు తెలుస్తాయి. కొన్ని పనులైనా నీకు నువ్వు చేసుకోవటం అలవాటు చేసుకోకపోతే ముందు ముందు కష్టం” అన్నది కమల.
“నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉండి చిన్నప్పటి నించీ పని చేసే అవసరం పడలేదు. ఇక నేర్చుకుంటాలే అమ్మా” అంటూ “అమ్మా.. దిండు తెచ్చి పెడతావా” అన్నాడు సినిమా చూడటానికి సోఫాలో సర్దుకు పడుకుంటూ!
‘వీడిక మారడు’ అని గొణుక్కుంటూ లోపలికెళ్ళింది కమల.