Site icon Sanchika

సామెత కథల ఆమెత-24

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

నవ్విన నాప చేనే పండింది

[dropcap]వ[/dropcap]రి పండే పొలాన్ని చేను అంటారు. అన్ని నేలల్లోను వరి పండదు. భూసారం.. నీటి వసతి.. వాతావరణ సమతుల్యత మంచి వరి దిగుబడికి ముఖ్యం.

నాప చేను అంటే పైన చెప్పినవేవీ అందుబాటులో లేనివన్నమాట. ఒక రకంగా బంజరు భూమి అనుకోవచ్చు. నాకు పొలం ఉంది అని తుప్పలు, పిచ్చి మొక్కలు ఉండి నేలంతా ఎగుడు దిగుళ్ళుగా ఉండి.. ఏ విధమైన నీటి వనరు లేని చోట ఎవరయినా వరి పండించగలను అని ధీమాగా ఉంటే, వారిని చూసి అందరు నవ్వుతారు.

ఇతరులు హేళన చేసి హాస్యమాడినా పట్టించుకోకుండా.. పట్టుదలతో కష్టపడి అలాంటి భూమిని సాగు చేసి ఫలసాయం పొందగలిగితే ఈ సామెత వాడతారు.

***

కిశోర్ పుట్టినప్పుడు ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు. మూడవ నెలలో బాలసారె చేద్దామనుకుంటుండగా.. తల్లి రమ్యకి ఆరోగ్య సమస్య వచ్చింది. ఐదో నెలలో బాలసారె చేసి పేరు పెడదాం అనుకుంటూ ఉండగా తండ్రి కిరణ్‌కి జబ్బు చేసింది.

ఆరో నెల అయితే ఏకంగా బాలసారె.. అన్నప్రాశన చేసెయ్యచ్చు అని నాయనమ్మ పూర్ణమ్మగారు నిర్ణయించారు.

చాలా కాలానికి ఇంట్లో మగపిల్లవాడు పుట్టాడు.. వేడుకలు ఏవీ వదలకుండా చేసుకోవాలి అనుకున్నారే కానీ ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.

ఇక ఇప్పుడు వాయిదా వేస్తే.. పిల్లవాడికి పాల ఆహారం చాలదు అని వేడుకకి అందరూ సిద్ధమయ్యారు.

కిశోర్ చిన్నప్పటి నించి అనుకున్న అన్ని వేడుకలకి పరిహారంగా ఇది గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.

వేడుకలో పాల్గొనటానికి వచ్చిన చుట్టాలు.. స్నేహితులు అందరూ బొద్దుగా.. ముద్దుగా ఉన్న కిషోర్ చేతిలో బహుమతులు పెడుతూ.. బుగ్గలు పుణికి ముద్దులు పెట్టారు.

“భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ భోజనాలు చేసి వెళ్ళండి” అని పూర్ణమ్మగారు పేరు పేరునా అందరిని మర్యాదగా భోజనాల దగ్గరకి పంపిస్తున్నారు.

***

పిల్లవాడికి పాలుపట్టి.. వచ్చిన బంధువులని పలకరించటానికి రమ్య.. కిరణ్ భోజనశాలలోకి వచ్చారు. అన్నం తింటూ పిల్లవాడి గురించి గుసగుసగా మాట్లాడుకుంటున్న అందరూ వాళ్ళని చూసి, ఉన్నట్టుండి మాటలు ఆపేసి తినటంలో మునిగిపోయారు.

ఒక్కసారి అందరు సంభాషణ ఆపెయ్యటం ఆశ్చర్యం అనిపించింది.. భార్యాభర్తలిద్దరికి.

“వంటలు బాగున్నాయా.. ఆలస్యమయింది, నిదానంగా అన్నీ వడ్డించుకు తినండి” అంటూ రమ్య చెబుతూ అందరినీ పలకరిస్తోంది.

“పాపం.. ఇంత వేడుక చేసుకున్నారు! పిల్లాడేమిటో వింతగా ఉన్నాడు కదా! చిటికేస్తే తల తిప్పటం కానీ.. నవ్వటం కానీ లేదు కదా! వీళ్ళు గమనించారో లేదో! పూర్ణమ్మగారు అందరిని పట్టి పట్టి చూసి నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. అడిగినా అడక్కపోయినా అందరికీ చిన్నవో.. పెద్దవో సలహాలు.. సూచనలు ఇచ్చేస్తూ ఉంటుంది” అంది కామేశ్వరి వంగి మెల్లగా.. అటు ఇటూ చూస్తూ ఎవరయినా వింటారేమో అని.

“మీకూ అలాగే అనిపించిందా? నాకే అనిపించిందేమో అనుకున్నా. ఏదో తేడా ఉందండి పిల్లవాడిలో. ఈ వయసులోనే ఎవరయినా స్పెషలిస్టులకి చూపిస్తే మంచిదేమో” అన్నది విశాలి సైగలతో! “అయినా ఎవరేమయితే మనకెందుకు? మంచి ఉద్దేశంతో చెప్పినా వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు” అని ముక్తాయించింది.

అందరి కళ్ళల్లోను ఏదో సందేహం.. జాలో.. బాధో.. హేళనో.. అర్థం కాని ఒక భావం.. రమ్య గమనించింది.

సైగ చేసి భర్తని లోపలికి పిలిచి “అనవసరంగా నలుగురిని పిలిచి పిల్లవాడి లోపం ప్రకటించినట్టయింది చూడండి.. అందరూ తలా ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. మన వరకు క్లుప్తంగా వేడుక చేసుకుందాం అంటే అత్తయ్యగారు వినలేదు” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

“ఊరుకో.. ఏమీ తెలీనట్టే ఉండు. నువ్వు చిన్నబుచ్చుకున్నట్టు తెలిస్తే నలుగురు మాటలతో సానుభూతి ఎక్కువ చూపిస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాలా సాధారణం! వాళ్ళకి చదువు చెప్పి తర్ఫీదు ఇచ్చే బోలెడు సంస్థలు వచ్చాయి. ఇవ్వాళ్టి సందర్భం అయిపోనివ్వు.. వాడిని ఎవరికి చూపించాలో నాకు తెలుసు” అని భార్య భూజం మీద చెయ్యి వేసి బయటికి తీసుకొచ్చాడు కిరణ్.

ఏ తేడా కనిపడనివ్వకుండా.. మొహాన చిరునవ్వుతో వచ్చిన బంధువులందరిని సాగనంపి భార్యాభర్తలు భవిష్యత్ప్రణాళిక గురించి కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. తృప్తిగా గుండెల నిండా గాలి పీల్చుకుని.. తల్లి పూర్ణమ్మగారికి విషయం అంతా వివరించారు.

కొడుకు నిర్ణయాన్ని విని చిన్నబుచ్చుకున్న పూర్ణమ్మగారు.. మనవడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పైకి ఏమీ అనకుండా నిబ్బరంగా ఊరుకున్నారు.

***

వినలేని.. మాట్లాడలేని ప్రత్యేక లక్షణాలతో ఉన్న పిల్లలకి చదువు చెప్పి.. బంగారు భవిష్యత్తునిస్తున్న ఒక సంస్థ వాళ్ళు ఆ సంవత్సరం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఆ కాలనీలో నిర్వహించారు.

కాలనీలో ప్రముఖులని ఆ వేడుకకి ఆహ్వానించారు. అలా వెళ్ళిన కృష్ణమాచారి గారు.. అక్కడి పిల్లలు పాల్గొన్న యోగాసనాలు.. నృత్య నాటికలు… ఇంకా వారు ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో వారి ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయారు. ఆ సంస్థ వాళ్ళు పిల్లలు వేసిన చిత్రలేఖనాలతో ఒక ప్రదర్శన కూడా నిర్వహించారు.

“ఈ పిల్లలకి ఇంత మంచి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుల ఓర్పు సహనాలకి జోహార్లండి. మామూలు పిల్లలతో పోలిస్తే వీరికి చదువు చెప్పటం కష్టమేమో కదా” అన్నారు.

మళ్ళీ ఆయనే “వీళ్ళకి వినబడుతుందా? అసలు వీరికి మాట్లాడటం కష్టమా.. వినటం కష్టమా? అందరికీ ఒకే భాషలో పాఠాలు చెబుతారా? ఇంతకీ వీళ్ళకి ఏ భాషలో చెబితే ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది” అన్నారు.

కృష్ణమాచారి గారి ప్రశ్నకి సమాధానంగా.. “ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది. పసితనంలో వినలేకపోవటంతో కొందరికి శబ్దం తెలియక మాట్లాడలేరు. అందుకే డాక్టర్స్ 3-4 నెలలు వచ్చిన పిల్లలకి టార్చ్ లైట్ వేసి ఆ కాంతిని గది చుట్టూ తిప్పుతూ వాళ్ళు ఆ కదలికని తెలుసుకుంటున్నారా లేదా అని పరీక్షిస్తారు. అలాగే చెవి దగ్గర చిటికె వేసి ఆ శబ్దానికి స్పందిస్తున్నారో లేదో గమనిస్తారు. అలా చెయ్యలేని పిల్లలని ఆ వయసులోనే గుర్తించి వెంటనే పరిష్కారం వెతికితే త్వరగానే వాళ్ళు సాధారణ పిల్లల స్థాయికి వస్తారు” అన్నారు ఆ స్కూల్ డైరెక్టర్.

“కొందరికి చెవికి చిన్న ఆపరేషన్ చేసి సమస్యని సరి చెయ్యచ్చు. కొందరికి ఆపరేషన్‌తో పాటు వినికిడి మిషన్ ఏర్పాటు చేస్తే శబ్దాలు వినటంలో ఉండే ఆటంకాలు తొలగి మాట్లాడగలుగుతారు. వారికి స్పీచ్ థెరపీ కూడా ఇప్పిస్తాము. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకం చికిత్స ఉంటుంది.”

“అలా చికిత్స అందిస్తూనే వారికి చేతి, పెదవుల కదలికల ద్వారా సైగల భాష (సైన్ లాంగ్వేజి) నేర్పిస్తాము. వారు అన్ని విషయాలు అలాగే నేర్చుకుంటారు” అని చెబుతూ.. డైరెక్టర్ గారు ఎవరినో పిలిచారు.

కిషోర్ వచ్చి తమ డైరెక్టర్ గారికి నమస్కరించి ఏంటి అన్నట్టు సైగచేస్తూ పక్కన నిలబడ్డాడు.

“ఈ అబ్బాయి మా స్కూల్‌కి వచ్చినప్పుడు రెండేళ్ళ పిల్లవాడు. ఇక్కడే చదువుకుని ఎంటెక్ పాస్ అయి ఇప్పుడు డెలాయిట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి చిన్నప్పుడు 5-6 నెలల వయసులో వినికిడి సమస్య ఉందని గమనించి ఇతని తల్లిదండ్రులు డాక్టర్స్‌ని సంప్రదించి చెవిలో మిషన్ పెట్టించారు. ఇతని నాయనమ్మగారు ఇష్టపడలేదని ఇంటికి దూరంగా ఉండే స్పెషల్ స్కూల్లో చేర్పించి అక్కడే ఇల్లు తీసుకుని ఉండేవారు. మా స్కూల్ గురించి విని ఇతని రెండవ ఏట ఈ స్కూల్లో వేశారు.”

“భలే తెలివైనవాడు. మ్యాథ్స్‌లో జీనియస్. ఎప్పుడూ స్కూల్ ఫస్టే! బ్రహ్మాండంగా డ్రాయింగ్ వేస్తాడు. ఇలాంటి పిల్లలకుండే స్పెషల్ కోటాలో ఇంజనీరింగ్ చదివాడు. ఇప్పుడు నెలకి లక్షన్నర సంపాదిస్తున్నాడు” అని ఊపిరి తీసుకోవటానికి ఆగారు డైరెక్టర్ గారు.

ఆశ్చర్యంతో నిశ్చేష్టులైన కృష్ణమాచారి గారు లేచి కిషోర్‌ని దగ్గరకి తీసుకుని అభినందించారు.

అలా అక్కడ ఒక్కొక్క విద్యార్ధికి సంబంధించిన విజయ గాథలు విన్న కృష్ణమాచారి గారు చివరి వరకు కూర్చుని అన్ని కార్యక్రమాలు వీక్షించి.. ఆ స్కూల్ డైరెక్టర్ గారిని, విద్యార్థులని.. వారి విషయ పరిజ్ఞానాన్ని, కళా కౌశలాన్ని మనస్ఫూర్తిగా అభినందించి తనని వేధిస్తున్న సమస్యకి ఒక పరిష్కారం దొరికిందన్నట్టు.. మనసులోనే ఒక సంకల్పానికి వచ్చి.. తృప్తిగా ఇంటికి తిరిగి వచ్చారు.

***

“కాముడూ ఇలా రా.. నీకు ఒక మంచి విషయం చెప్పాలి. ఇలా కూర్చో” అన్నారు.

“ఏమిటి అంత సంతోషంగా ఉన్నారు. ఈ వయసులో లాటరీ గాని తగిలిందా ఏంటి? అయినా మీకలాంటి అలవాట్లు లేవుగా” అన్నది పక్కనే కూర్చుంటూ!

“మన స్వాతికి మంచి సంబంధం దొరికింది. కిషోర్ అని ‘డెలాయిట్’ లో పని చేస్తున్నాడు. ఆరడుగుల అందగాడు. మనకి తెలిసిన వారే” అని ఆగారు.

“మనకి తెలిసిన వాళ్ళల్లో ఇప్పటి వరకూ మన దృష్టికి రాని వాళ్ళెవరబ్బా” అన్నది బుగ్గన చెయ్యి పెట్టుకుని.

“మన రవి చిన్నప్పుడు మనం ఉన్న కాలనీలో ఉండే పూర్ణమ్మ గారు గుర్తున్నారా? వాళ్ళ మనవడు కిషోర్” అని ఆవిడ ముఖంలో వచ్చే మార్పులని గమనిస్తున్నారు.

“ఎవరూ ఆ అబ్బాయా? అతనికి చెవులు వినపడవు.. మాటలు కూడా రావనుకుంటా కదా!! ఏడ్చినట్టుంది.. ఇదా మీరు చూసిన సంబంధం! దేశం గొడ్డుపోయిందా ఏం.. ఈ చెవిటి.. మూగ పిల్లాడు తప్ప ఎవరూ దొరకలేదా” అని ఈసడించింది.

“అలా తీసి పడెయ్యకు. ఆ అబ్బాయిని చూస్తే నువ్విలా మాట్లాడవు. మొన్న నేను ఒక దివ్యాంగుల స్కూల్ ఫంక్షన్‌కి వెళ్ళాను గుర్తుందా? అక్కడ కలిశాను ఆ అబ్బాయిని. అతని చదువు, ఉద్యోగం, జీతం.. డ్రాయింగ్ వెయ్యటంలో అతని ప్రతిభ చూసి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాను.”

“సాధారణ పిల్లవాడి కంటే అతను ఏ రకంగా తీసిపోడు. ఆ వినయం, పెద్దలంటే అతనికున్న గౌరవం చూసి ముచ్చటేసింది. భగవంతుడు ఒక లోపం పెడితే మరొక వరంతో వారి జీవితాన్ని చక్కదిద్దుతాడనిపించింది. వారు వికలాంగులు కాదు కాముడూ.. దివ్యాంగులు.. విచిత్రాంగులు అనిపించింది. అతను ఒక మంచి భర్త కాగలడు అనిపించింది. స్వాతితో మాట్లాడి, అది ఇష్టపడితేనే ముందుకెళదాం” అన్నారు.

***

స్వతహాగానే ఇతరుల పట్ల జాలి, దయ కలిగిన స్వాతి తాతగారు చెప్పిన విషయాన్ని ఓపికగా విన్నది. జీవితంలో అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఏదయినా సాధించాలనుకునే స్వభావమున్న ఉద్దేశంతో ఉన్నందువల్ల కిషోర్‌ని కలిసి మాట్లాడింది. చిత్రకళ మీద అమితాసక్తి కల స్వాతి అతని చేతిలో ఉన్న కళకి ఫిదా అయిపోయింది. బేషరతుగా అతనితో పెళ్ళికి ఒప్పుకుంది.

పెళ్ళి వేడుకల్లో ఇరుపక్షాల వారు ఒకరితో ఒకరు పరాచికాలాడుకుంటున్న వేళ రమ్య.. కామేశ్వరి గారితో “పిన్ని గారూ మా వాడి అన్నప్రాశన నాడు వాడి గురించి మీకు కలిగిన సందేహాలు, చిన్న చూపు పోయినట్లేనా?”

“నవ్విన నాప చేను పండి, ఆ పంట ఫలం మీ ఇంటికి రావటం పూర్తిగా దైవ ఘటన. కాలం అన్నిటికంటే బలీయమైనది అనటానికి ఇదే నిదర్శనం కదా” అన్నది.

“అవునమ్మా.. ఒక సమస్య కలిగినప్పుడు బెంబేలెత్తిపోకుండా ఆలోచించి సకాలంలో పరిష్కరించుకున్న మీ దంపతులకి నా హృదయ పూర్వక అభినందనలమ్మా” అన్నారు.

మనస్ఫూర్తిగా కిషోర్‌ని భర్తగా స్వీకరించిన ఆనందంతో స్వాతి సైగల భాషతో అతనికేదో చెబుతూ నవ్వుతున్నది.

Exit mobile version