Site icon Sanchika

సామెత కథల ఆమెత-25

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది

[dropcap]మ[/dropcap]నిషికి పూర్వ జన్మ వాసనలు ఈ జన్మలో కూడా కొనసాగుతాయని భారతీయ సనాతన ధర్మం నమ్ముతుంది. పునర్జన్మ సిద్ధాంతం ఈ వాదనని బలపరుస్తుంది.

అందుకే పిల్లలకి అన్నప్రాశన చేసేటప్పుడు వారి ముందు కలము-కాగితం, బంగారము, ఆట బొమ్మలు, ఆధ్యాత్మిక గ్రంథాలు పెడతారు. ఇప్పుడైతే ఫోన్స్, కంప్యూటర్స్ లాంటివి కూడా పెడుతున్నారేమో! వారి వారి పూర్వజన్మ వాసనలని బట్టి ఏ వస్తువు ముట్టుకుంటే.. భవిష్యత్తులో వారు ఆ రంగంలో రాణిస్తారు అని నమ్ముతారు.

ఈ సామెతకి ఆ నమ్మకం కొంతవరకు ఆధారం అనుకోవచ్చు.

***

“ప్రదీప్.. స్కూల్ బ్యాగ్ రెడీనా? హోం వర్క్ చేశావా? త్వరగా రా.. డైనింగ్ టెబుల్ మీద టిఫిన్ చల్లారిపోతోంది” అని శ్రీలక్ష్మి ఎనిమిదేళ్ళ కొడుకుని నాలుగో సారి కేకేసింది.

శ్రీలక్ష్మి అరుపే కానీ.. బ్యాగ్ సర్దుతున్న ప్రదీప్‌లో కదలిక లేదు. అటు ఇటూ చూస్తూ బ్యాగ్ లోపల్లోపల ఏదో దాచే పనిలో ఉన్నాడు.

“ఏంటి ప్రదీప్ అమ్మ అంత సేపటి నించి అరుస్తుంటే.. ఉలుకు పలుకు లేదు. స్కూల్ టైమై పోతోంది” అంటూ చదివే పేపర్ పక్కన పడేసి మూర్తి బయటికొచ్చాడు.

ప్రదీప్ ముఖంలో భయం.. ఏదో దాచాలన్న అతని ప్రయత్నం చూసి “ఏమిటి అంత భద్రంగా దాస్తున్నావు” అంటూ దగ్గరకి వచ్చి బ్యాగ్ చేతిలోకి తీసుకుని చూశాడు.

“ఈ డబ్బెక్కడిది? అసలు నీకు డబ్బెవరిచ్చారు? వేలెడెంత లేవు.. డబ్బుతో నీకేం పని” అని గుడ్లురుముతూ చెయ్యెత్తాడు.

శ్రీలక్ష్మి వంటింట్లో నించి పరుగున వచ్చి “ఉండండి.. నేను చూస్తాను. మీరెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ తినండి” అని భర్తని పక్కకి పంపించి

“ప్రదీప్ ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నావు? మొన్న కూడా ఎవరిదో వాటర్ బాటిల్ తెచ్చేశావ్? పాపం బాటిల్ పడేసుకొచ్చావని ఆ అబ్బాయిని వాళ్ళ అమ్మా- నాన్నాకేకలేసి ఉంటారు. అసలు చిన్న పిల్లలు డబ్బు ముట్టుకోకూడదని ఎన్ని సార్లు చెప్పాను? నీకు కావలసినవన్నీ నేను.. నాన్నా కొనిస్తున్నాం కదా! ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చెయ్యకు” అని బుజ్జగించి తీసుకొచ్చింది.

పిల్లలు అపసవ్యమైన పద్ధతిలో వెళుతున్నప్పుడు తల్లీ-తండ్రీ ఇద్దరూ కలగజేసుకుని గట్టిగా దండించినట్టు మాట్లాడితే వాళ్ళు మొండికెత్తేస్తారు. ఎలాగూ పెద్ద వాళ్ళకి తెలిసిపోయిందని బరితెగించి.. ఎదిరిస్తారు. అప్పుడు వారిని చక్కదిద్దటం కష్టం!

అందుకే బుజ్జగించి కొడుకు మానసిక స్థితి కనుక్కోవాలని శ్రీలక్ష్మి భర్తని పక్కకి పంపేసింది.

***

“వాడికేం తక్కువ చేస్తున్నాం లక్ష్మీ? ఎందుకిలా తయారవుతున్నాడు? వాడు అడగటం ఆలస్యం.. కొనివ్వగలిగినవన్నీ వెంటనే అమరుస్తున్నాం! మన స్థితికి కష్టమై కొనలేని వాటి గురించి వాడిని ఒప్పించే పద్ధతిలో మాట్లాడుతున్నాం. మనమేమీ టాటా.. బిర్లాలం కాదు కదా.. అడిగినవన్నీ సమకూర్చటానికి?”

“వీడి ఈడు వాడే.. పక్కింటి రాహుల్ చూడు.. క్లాసులో ఫస్ట్! పెద్ద వాళ్ళు కనిపిస్తే చక్కగా నవ్వుతూ ‘నమస్తే’ అని రెండు చేతులు జోడిస్తాడు. రాహుల్ ఎప్పుడూ ఏదో ఒక కూని రాగం తీస్తూ ఉంటాడు. రోజూ నేను వాక్‌కి వెళుతున్నప్పుడు సంగీత సాధన చేస్తుంటాడల్లే ఉంది.. చక్కటి శాస్త్రీయ సంగీతం వినిపిస్తూ ఉంటుంది.”

“రాహుల్ వాళ్ళ నాన్న గారు చెప్పారు.. పుట్టిన ఏడాది లోపే ఎక్కడ వాద్య పరికరాలు కనిపించినా వాటి ముందుకెళ్ళి కూర్చునేవాడుట. టీవీలో కార్యక్రమాల్లో వచ్చే నేపధ్య సంగీతానికి శరీరం లయబద్ధంగా ఊపుతూ ఉండేవాడుట. టీవీలో వచ్చే బొమ్మలు చూడకుండా సంగీతానికి ఊగుతూ చప్పట్లు కొట్టేవాడుట”

“ఆ పిల్లడికి వాళ్ళు అదనంగా చేస్తున్నదేం ఉంది? మనం వీడికి చెయ్యనిదేమున్నది” అన్నాడు ఆవేదనగా మూర్తి.. కొడుకు స్కూల్‌కి వెళ్ళాక భార్యతో!

“అలా మీరు తనకేదో తక్కువ చేస్తున్నందువల్లే వాడలా తప్పు చేస్తున్నాడని.. మీకు తోచిన పద్ధతిలో.. విశ్లేషించుకోకండి. పిల్లలకైనా.. పెద్దలకైనా పూర్వ జన్మ వాసనలనేవి ఉంటాయని అందరూ అంటుంటారు.”

“అమెరికాలో పుట్టి పెరిగిన ఒక చిన్న అబ్బాయి.. పెద్ద మేధావులు చేసినట్టు అవధానం చేశాడుట. విదేశాల్లో పుట్టి పెరిగిన.. ఎంత మంది తెలుగు పిల్లల ఉచ్చారణ మనం వినలేదు? మాటలే సరిగా ఉండవు? అలాంటిది ఇంక అవధానం లాంటి సాహిత్య ప్రక్రియ గురించి.. అందులో నైపుణ్యం గురించి.. మనం ఊహించనే లేము. ఆ అబ్బాయికి ఎవరు నేర్పి శిక్షణ ఇచ్చారు అనుకుంటాం? ఇవన్నీ పూర్వ జన్మ సుకృతాలండి”.

“మా అన్నయ్య బావమరిది కొడుకు పదేళ్ళ వాడు. చక్కటి కవిత్వం రాస్తాడుట. మొన్న మా అన్నయ్య చెబితే ఆశ్చర్య పోయాను” అన్నది లక్ష్మి.

“అవును నువ్వు చెబుతుంటే ఇప్పుడు గుర్తొస్తున్నది.. మా బాస్ కొడుకు ఆరేళ్ళ వాడు ఛెస్ బాగా ఆడతాడు. టోర్నమెంట్స్‌కి వెళుతూ ఉంటాడు. చాలా షీల్డ్స్, బహుమతులు గెల్చుకున్నాడుట. అంత చిన్నవాడికి ఎవరు నేర్పారంటావు. అవన్నీ పుట్టినప్పటినించీ ఉండే టాలెంట్స్!” అన్నాడు మూర్తి.

“పక్కింటి వాళ్ళ రాహుల్ అయినా.. మన ప్రదీప్ అయినా, మీ బాస్ కొడుకైనా.. మా మేనల్లుడైనా ఇదే నేపథ్యం అనుకోవచ్చు కదా! నా కొడుకుని సమర్థిస్తున్నాననుకోకండి” అన్నది శ్రీలక్ష్మి.. భర్త మొహంలోకి చూస్తూ!

“పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అంటారు కదా!

“ఈ పిల్లలకి అన్నప్రాశన చేసేటప్పుడు వాళ్ళు ఏం పట్టుకునుంటారంటారు? సాధారణంగా పిల్లలు ఆ సమయంలో ఏది ముట్టుకుంటే పెద్దయ్యాక ఆ రంగంలో రాణిస్తారు అంటుంటారు కదా మన పెద్ద వాళ్ళు! ఇంతకీ మనవాడేం పట్టుకున్నాడో గుర్తుందా మీకు” అంది సరదాగా వాతావరణం తేలిక చెయ్యాలనే ఉద్దేశంతో.

“ఏమో లక్ష్మి నువ్వంటున్నావు కానీ.. ఈ సిద్ధాంతం చెబితే బయట ప్రపంచం మన పిల్లవాడి తప్పుని మనం ఈ విధంగా సమర్థిస్తున్నాం అనుకోవచ్చు కదా! నమ్మకం వేరు.. వాస్తవం వేరు”.

“పోనీ ఒక పని చేద్దాం.. మన వాడిని ఒక మానసిక నిపుణుడికి చూపిద్దాం.. ఏమంటారు? కౌన్సిలింగ్ ద్వారా కొంత గుణం కనిపించచ్చు” అన్నాడు.

“ఆఁ ఆ పని చేద్దాం. మీరు మనసు పాడు చేసుకోకండి. ఆఫీసుకెళ్ళి రండి. మంచి మానసిక నిపుణుడి గురించి మీకు తెలిసిన వారిని అడిగి చూడండి. మన అదృష్టం బావుంటే సమస్య తేలిగ్గా పరిష్కారమవచ్చు” అని భర్తని పంపించి.. తలుపేసి ఇంట్లోకెళ్ళింది శ్రీలక్ష్మి.

Exit mobile version