సామెత కథల ఆమెత-29

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది

[dropcap]కో[/dropcap]డి ఇల్లెక్కి కుయ్యటమేంటి అనుకుంటున్నారా?

ఒకరింటి తిండి తినేటప్పుడు వారిపట్ల ఒద్దికగా.. కృతజ్ఞతగా ఉండటం న్యాయం.

కష్టపడకుండా నోటి దగ్గరకి తిండి తెచ్చి పెడుతున్న వారినే ఇబ్బంది పెట్టే మనుషుల విషయంలో ఈ సామెత వాడతారు.

***

తండ్రి చనిపోయి.. పదిహేను రోజుల కార్యక్రమాలు ముగిశాక, కాస్త మార్పుగా ఉంటుందని దేవేందర్.. భార్య, మూడు నెలలు పిల్లల దగ్గర గడిపి వద్దామని అమెరికా వెళ్ళారు.

పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయిన దేవేందర్ జీవితం ఇప్పటికీ బిజీగానే ఉంటుంది.

ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ కంపెనీ అతనికి కారు, డ్రైవరు ఇచ్చింది.

తను స్వయంగా డ్రైవింగ్ చెయ్యగలిగినా వెనక సీట్లో కూర్చోవటం అలవాటయిన దేవేందర్ డ్రైవింగ్ దాదాపుగా మానేశాడు. భార్యకి అసలు డ్రైవింగే రాదు.

అందువల్ల.. అమెరికా వెళ్ళి తిరిగొచ్చాక ఇబ్బంది ఉండకూడదని తన రెగ్యులర్ డ్రైవర్‌కి తను లేనప్పుడు కూడా జీతం ఇచ్చే ఏర్పాటు చేశాడు.

***

తాము తిరిగొచ్చే రోజు ఎయిర్‌పోర్ట్‌కి రమ్మని డ్రైవర్ ముకుంద్‌కి ఫోన్ చేశాడు.

“మీరు అనుకున్న ప్రకారం వస్తారో రారో అనే అనుమానంతో.. మీరు లేనప్పుడు తోచక నేను వేరే చోట పనికి కుదిరాను సర్. అందుకని రాలేను” అన్నాడు డ్రైవర్ ముకుంద్.

“అదేంటి.. ఫుల్ జీతం నెల నెలా తీసుకుంటూనే ఉన్నావు కదా! ఇప్పుడు హఠాత్తుగా డ్రైవర్ లేకుండా ఎట్లాగయ్యా? ఈ ఇబ్బంది ఉండకూడదనే కదా.. మూడు నెలలు పని చెయ్యకపోయినా జీతం ఇచ్చింది? తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా.. ఎవరినైనా ఎయిర్‌పోర్ట్‌కి పంపించు” అన్నాడు దేవేందర్ ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోతూ!

ఎయిర్‌పోర్ట్ నించి ఇంటికొచ్చేసరికి పార్కింగ్‌లో ముకుంద్ ఎదురయ్యాడు. ఎవరితోనో కబుర్లు చెబుతూ.. దేవేందర్ని చూసి నవ్వి పక్కకి వెళ్ళిపోయాడు.

తన దగ్గర పూర్తిగా డబ్బు తీసుకుని కూడా వేరే వాళ్ళ దగ్గర పనికి కుదిరినందుకు మొహం చెల్లలేదేమోలే అనుకున్నాడు.

***

దేవేందర్ ఫ్రెండ్ కృష్ణ ఫోన్ చేసి “సాయంత్రం అబిడ్స్ తాజ్ హోటల్లో మా మనవడి బర్త్ డే పార్టీ. నువ్వు.. మీ మిసెస్ తప్పకుండా రావాలి. లక్కీగా ఊళ్ళోకొచ్చేశావ్ కదా” అన్నాడు.

“మాకు డ్రైవర్ లేడురా. సాయంత్రం ట్రాఫిక్‌లో డ్రైవింగ్ అంటే టెన్షన్! చూస్తాను.. డ్రైవర్ దొరికితే వస్తాను” అన్నాడు.

“నాకు తెలిసిన కుర్రాడొకడున్నాడు. ఆ మధ్య కనిపించినప్పుడు పని కావాలని అడిగాడు. ఉన్నాడేమో కనుక్కుంటానన్నాడు” అన్నాడు కృష్ణ.

అలా కృష్ణ పంపగా వచ్చిన రమేష్‌ని నెల జీతం మీద మాట్లాడుకున్నాడు దేవేందర్.

పనిలోకి రావటం మొదలుపెట్టి నాలుగు రోజులకి ‘హమ్మయ్యా’ అనుకునే లోపే “రేపటి నించి రాను సర్” అన్నాడు రమేష్.

దేవేందర్ వాకబు చెయ్యగా తెలిసిందేంటంటే.. రమేష్‌కి ఇక్కడి కంటే ఎక్కువ జీతం వచ్చే చోటు దొరికిందని!

రెండు రోజులు ఇబ్బంది పడ్డాక.. ముకుంద్‌కి ఫోన్ చేసి “నీకు ఎక్కువ జీతం వస్తే పాడు చేసే వాడిని కాదు. డ్రైవర్ లేక ఇబ్బంది అవుతోంది. నీకు తెలిసిన డ్రైవర్ ఉంటే చూడు” అని చెప్పాడు.

రెండు.. మూడు రోజులకి ప్రసాద్ వచ్చాడు. అతను పది రోజులొచ్చి “రేపటి నించి రాను సర్” అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

ఇలా రమేష్ అయ్యాక ప్రసాద్ తరువాత హనుమంతు, అబ్దుల్ వరసగా రావటం.. నాలుగు రోజులు చేసి వెళ్ళిపోవటం!

దేవేందర్ కి చిర్రెత్తుకొచ్చింది.

లోపాయకారీగా తెలిసిన విషయం ఏంటంటే.. ఇది దేవేందర్ పాత డ్రైవర్ ముకుంద్ నిర్వాకం అని!

“దేవేందర్ రిటైర్ అయిపోయాడు కాబట్టి జీతం తప్ప ఏమీ ఇవ్వడు, వారానికి ఆరు రోజులు పని చెయ్యాలి. అలా నెలకి ఇరవయ్యారు రోజులు పని చెయ్యాలి. అదనం డబ్బు ఏమి ఇవ్వడు. ప్రాణం మీదికి వచ్చే పరిస్థితి అయినా పైసా విదల్చడు. పిల్లా.. పాప కలవాళ్ళం.. అవసరాలు రాకుండా ఉంటాయా? ఇలాంటి వాళ్ళ దగ్గర పని చెయ్యటం అంటే మన తల వాళ్ళకి తాకట్టు పెట్టినట్టే”

“అదే కంపెనీ ఉద్యోగం అయితే.. వారానికి ఐదు రోజులే వర్కింగ్‌తో, నెలకి ఇరవై రెండు రోజులు పని చేస్తే చాలు. మిగిలిన ఎనిమిది రోజులు హోటల్స్, హాస్పిటల్స్‌లో వాలెట్ పార్కింగ్ డ్యూటీ చేస్తే అదనపు డబ్బు సంపాదించుకోవచ్చు. యజమాని క్యాంపుకి వెళితే.. వర్కింగ్ అవర్స్ తగ్గుతాయి..” అని ముకుంద్ ఇలా ఏవేవో తాయిలాలు చూపించి వచ్చిన ప్రతి డ్రైవర్‌ని నాలుగు రోజులకే పంపించేస్తున్నాడు.

చాలా కాలం దేవేందర్ దగ్గర పని చేసినందువల్ల.. అతని గురించి ముకుంద్ చెప్పే మాటలు నమ్మి డ్రైవర్స్ వెళ్ళిపోతున్నారు.

ఒక రోజు దేవేందర్ ముకుంద్ చేస్తున్న పని గురించి నిలదీశాడు.

“అవును నేను చేసే దానిలో తప్పేముంది సర్. మీరు రూల్స్ మాట్లాడతరు. మావి చిన్న జీవితాలు. మా పిల్లలని మంచి కాలేజిల్లో పెద్ద చదువులు చదివించుకోలేం! మీ లాగా కోట్లు సంపాదించలేం! మా బోటి వాళ్ళ మీద మీకు జాలి ఉండదు.”

“మీరు పిల్లల్ని పెద్ద కాలేజిల్లో చదివించుకుంటరు. ఆ చదువులతో పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తరు. ఎక్కువెక్కువ పెన్షన్స్ వస్తయ్.”

“డ్రైవర్ ఉద్యోగమంటే నెల జీతం తప్ప పెన్షన్స్ ఉండవు.. వయసులో ఉన్నప్పుడే కొంచెమెక్కువ కష్టపడగలం! పెద్దోళ్ళమయినంక రోగమొస్తె మా బతుకులు ఎట్ల గడుస్తయ్ సర్” అన్నాడు ముకుంద్.

ముకుంద్ మాటలకి దేవేందర్ బుర్ర తిరిగి పోయింది.

“అందుకే గదయ్యా ప్రభుత్వం మీకు ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకాలు పెట్టింది. ఉచిత ఆహార పథకాలు, ఉపాధి హామీ పథకాలు, వృద్ధాప్యపు పెన్షన్స్ అంటూ ఒకటా.. రెండా ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకుంటున్నాయి” అన్నాడు దేవేందర్.

“ఇంటద్దెలకే మా జీతంలో ఎక్కువ పోతది. వచ్చే జీతాలతో సొంతమిల్లు కూడా కొనుక్కోలేం” అన్నాడు ముకుంద్ ఏ మాత్రం తగ్గకుండా!

“ప్రభుత్వాలు మీ కష్టం, బాధ ఆలోచించే గదయ్యా.. తక్కువ రేట్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇస్తున్నది. అక్కడ ఉండటం మీకు నామోషి. ఇన్నీ అనుభవిస్తూ మా మీద పడి ఏడుస్తారేంటయ్యా”

“విదేశాల్లో లాగా ఎవరి కారు వారే డ్రైవ్ చేసుకుంటే మీకు ఈ ఉపాధి కూడా దొరకదు. మేము ఉద్యోగం ఇవ్వబట్టే కదా మీకు నెల తిరిగేసరికి ఆ పదిహేను వేలో ఇరవై వేలోజీతం వస్తోంది! అది తెలుసుకోండి.”

“అవన్నీ మర్చిపోయి ‘పాలు తాగి రొమ్ము గుద్దితే’ అది మంచిదనుకుంటున్నావా? నా దగ్గరకొచ్చే డ్రైవర్లతో నేను పైసా విదల్చను అని చెబుతున్నావుట. మా నాన్న గారు ఉన్నన్నాళ్ళూ మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టారు. నీకు వంద గజాల స్థలం కొనిచ్చారు.”

‘తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంటే ఇదే’ ఇట్లా ఎన్నాళ్ళు చెయ్యగలవో చెయ్యి. మీరు బాగు పడాలనుకోవటం తప్పు కాదు. మమ్మల్ని పాడు చెయ్యాలనుకుంటే మీకే మంచిది కాదు” అని లోపలికొచ్చి పళ్ళు నూరుకుంటూ..

జరిగిందంతా భార్యకి చెప్పి “వీళ్ళు తెలివి మీరిపోతున్నారు. ఇంతకు ముందు లాగా వీళ్ళతో మాట్లాడలేం! ‘ఊరికే పెట్టే అమ్మా నీ మొగుడితో సమానంగా పెట్టు’ అన్నట్టు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో వీళ్ళ బతుకులు బాగు పడాలని ఆలోచిస్తుంటే వీళ్ళు మన మీద పడి ఏడుస్తూ.. మనని ఏడిపిస్తున్నారు”.

‘వీళ్ళకి కడుపులో ఇంత కసి, ఇన్ని ఆలోచనలున్నాయా? నేనెప్పుడూ ఊహించలేదు’ అనుకున్నాడు.

ప్రస్తుతానికి డ్రైవర్ సమస్యకి పరిష్కారంగా.. అవసరం వచ్చినప్పుడు మన పనికి ఇబ్బంది కలగకుండా ఏ రోజుకా రోజు ‘యాప్’ ద్వారా పిల్చుకుంటే సరిపోతుంది అనుకున్నాడు.

“బుర్ర వేడెక్కిపోయింది. ఓ కప్పు కాఫీ ఇవ్వు” అని భార్యకి చెప్పి టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్ చూడటానికి హాల్లోకి వెళ్ళాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here