సామెత కథల ఆమెత-3

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

తన్నుమాలిన ధర్మం..

[dropcap]త[/dropcap]న్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు పెద్దలు.

అంటే మనం పరసేవా పరాయణులవ్వచ్చు కానీ మన ఉనికికే ప్రశ్నార్థకం అయ్యేటంత కాకూడదు.

మనమంటూ ఉంటే కదా.. ఎవరికైనా ఏదయినా ఉపకారం చేసేది.

ఈ సామెత ఆధారంగా ఒక కధ చెప్పుకుందాం!

***

ఆ రోజు కాశీ ఆఫీసుకి వచ్చేసరికి అందరూ ఏదో విషయం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. తనకి కొలీగ్, ఆప్త మిత్రుడు అయిన విశ్వేశ్వర్‌ని పిల్చి

“ఏంట్రా ఏదో ప్రపంచ యుద్ధం వస్తున్నట్టు అందరూ సీరియస్ మొహాలు పెట్టి చర్చించేసుకుంటున్నారు. రష్యా వాళ్ళు కాని మన ఊరి మీద బాంబ్ వెయ్యలేదు కదా” అన్నాడు హాస్యంగా.

“మన అకౌంట్స్ సెక్షన్ శ్రీరాం తెలుసు కదా! అతనికి తెలిసిన వాళ్ళెవరో ఊరి చివర ‘లే ఔట్’ చేస్తున్నారుట. నాలుగేళ్ళల్లో అక్కడికి దగ్గరలో రెండు వందల ఎకరాల్లో ఫార్మా సిటీ వస్తుందిట.”

“వీళ్ళు చేసే ‘లే ఔట్’లో ఒక్కొక్క ప్లాట్ కనీసం 250 గజాలుంటుందిట. కొన్ని అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయిట. మొత్తం 300 ప్లాట్లుట. ఇప్పుడే బుక్ చేసుకుంటే తక్కువలో వస్తాయి. అవసరమైన వారికి వాళ్ళే సొసైటీ ద్వారా బ్యాంక్ లోన్ కూడా ఏర్పాటు చేస్తారుట. మామూలుగా అయితే స్థలాలకి బ్యాంక్స్ లోన్ ఇవ్వవు.”

“కావాలనుకుంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవచ్చు. మనం స్థలం వద్దనుకుంటే ఫార్మా సిటీలో పని చేసే వాళ్ళు ఎక్కువ రేట్‌కి కొనుక్కోవచ్చు. లేదా ఫార్మా సిటీకి కావలసిన కొన్ని మౌలిక సదుపాయాల కోసం వాళ్ళే కొన్ని ప్లాట్స్ కలిపి ఎక్కువ రేట్‌కి కొనచ్చు.”

“ఇది మనకి మంచి అవకాశం అని శ్రీరాం చెబుతుంటే విన్నాం. అందరికీ కొనటానికి కావలసిన మొత్తం డబ్బు ఉండక పోవచ్చు కదా! ఇందాకటి నించి అందరూ అదే చర్చించుకుంటున్నారు” అన్నాడు విశ్వేశ్వర్.

“నేను 250 గజాల ప్లాట్ తీసుకుందామనుకుంటున్నాను. ముందుగా ఆలోచిస్తే మంచి లొకేషన్లో తూర్పు ముఖంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనిద్దరం పక్క పక్కన తీసుకుందాం! ఇంకేం ఆలోచించకు. వాళ్ళకి చెప్పేస్తాను” అన్నాడు స్నేహితుడి తరఫున తనే నిర్ణయం తీసుకుంటూ.

“నన్ను ఆలోచించుకోనివ్వరా” అంటూ “ఇంతకీ ఎడ్వాన్స్ ఎంత కట్టాలి” అన్నాడు.

“మొన్న మన కో-ఆపరేటివ్ సొసైటీలో నీ ఎఫ్.డి మెచ్యూర్ అయింది కదా! బహుశః అది సరిపోవచ్చు. కాస్తో కూస్తో తక్కువ పడితే పర్సనల్ లోన్ తీసుకుందాం” అన్నాడు అప్పటికే నిర్ణయం తీసుకున్న విశ్వేశ్వర్ ఉత్సాహంగా.

“అది అమ్మాయి పెళ్ళికని వేశానురా. ఇంకా మూడేళ్ళు టైముందనుకో! అయినా సంబంధాలు కలిసి వస్తే అప్పటికప్పుడు తడుముకోవాలని.. బోనస్ వచ్చినప్పుడు ఇలా వేసి పెట్టా. ఇప్పుడు అది కాస్తా స్థలం మీద పెడితే పెళ్ళికి ఇబ్బందౌతుందిరా” అన్నాడు ఆలోచిస్తూ.

“అప్పటికి ఈ స్థలాలు రేట్స్ పెరిగితే అమ్మి చెయ్యచ్చులే. అవకాశాలు అనుకున్నప్పుడల్లా రావు. ఊరికే మీనమేషాలు లెక్క పెట్టకు. 250 గజాలవి ఎక్కువ లేవు. త్వరగా అయిపోవచ్చు. నడు.. ‘లే ఔట్’ చూసి మనకి నచ్చిన ప్లాట్స్ టిక్కు పెట్టి వద్దాం.” అన్నాడు విశ్వేశ్వర్.

అలా కాశీ స్థలం కొనే కార్యక్రమం విశ్వేశ్వర్ చొరవతో నిర్విఘ్నంగా పూర్తయింది.

***

“నాన్నా మా కాలేజికి ఇవ్వాళ్ళ రిక్రూట్మెంట్ చేసుకోవటానికి రెండు కంపెనీల వాళ్ళొచ్చారు. మా లెక్చరర్ గారి మాటతో నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను సెలెక్ట్ చేశారు నాన్నా. ఇక్కడున్న వాళ్ళ ఆఫీసులోనే చేరమన్నారు” అని చెప్పింది శర్వాణి ఉత్సాహంగా తండ్రి కాశీతో.

అలా చదువవ్వగానే చేద్దామనుకున్న కూతురు పెళ్ళి అనుకున్న దానికంటే రెండేళ్ళు ఆలస్యమయింది.

ఈ లోపు ఇతర ప్రయత్నాలతో చెయ్యి కూడ దీసుకున్న కాశీ.. వియ్యాలవారి మంచి మనసుతో పెద్దగా ఖర్చవకుండా కూతురి పెళ్ళి చేశాడు.

కొడుకు వినయ్ కూడా క్యాంపస్ సెలెక్షన్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ తను ఆ ఉద్యోగం చెయ్యనని.. అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చెయ్యాలని ఎప్పటి నించో అనుకుంటున్నానని.. అందుకు తగిన ఏర్పాట్ల కోసం తండ్రికి అర్జీ పెట్టాడు.

“ఇంకో రెండేళ్ళల్లో రిటైర్ అవుతాను. ఇప్పుడు వాడి చదువుకి అంటూ లోన్స్ పెడితే పూర్తి పెన్షన్ రాక ఇబ్బంది పడతాను. నా స్థలం నీకమ్మేస్తాను. తీసుకోరా” అన్నాడు కాశీ.. మిత్రుడు విశ్వేశ్వర్‌తో!

“నీకేమయినా మతి పోయిందా? ఆ స్థలం అమ్ముతానంటావేమిటి? ఇప్పుడు అవి రేట్స్ బాగా పెరిగాయి. మళ్ళీ నీ జన్మలో అలాంటి చోట కొనలేవు. వాడిని ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోమను. చదువయ్యాక వాడే తీర్చుకుంటాడు.. ఇప్పటి వరకు క్వార్టర్స్‌లో ఉంటున్నాం కనుక ఇంటి సమస్య మనకి తెలియలేదు. అక్కడ ఇల్లు కట్టుకోవటమో.. లేక ఆ స్థలం అమ్మేసి ఒక ఫ్లాట్ కొనుక్కోవటమో చెయ్యచ్చు”

“మనది వచ్చే వయసా.. పోయే వయసా? పిల్లలదేముంది.. బాధ్యత లేని మాటలు మాట్లాడతారు. రేపు కాలు చెయ్యి ఆడని వయసులో ఇల్లు కూడా స్వంతం కాకపోతే ఇబ్బంది పడాలి. వాడి దగ్గరకి వెళ్ళి అమెరికాలో నువ్వు ఉండగలవా?”

“నువ్వెక్కడి నించి తెచ్చిస్తావనే ఆలోచన లేకుండా.. వచ్చిన ఉద్యోగం వద్దని అమెరికా వెళతానంటున్న వాడు నిన్ను తీసుకెళ్ళి అట్టిపెట్టుకుంటాడా? నువ్వెళ్ళి ఉండగలవా” అన్నాడు.

“తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం” అని “వాళ్ళు ఎదుగుతున్న సూర్యులు.. మనం అస్తమించబోతున్న సూర్యులం. ఎలా బతకాలో వాళ్ళకి ఇప్పుడునన్ని సౌకర్యాలు.. అవకాశాలు ఆ రోజుల్లో మనకి లేవు.. ఇంకా ఎక్కువ ఆలోచించకు.. అలాగే చెప్పు వాడికి” అన్నాడు నిశ్చలంగా విశ్వేశ్వర్.

విశ్వేశ్వర్ చెప్పిన దానిలో అసత్యం కానీ, అసంబద్ధమైనది కానీ ఏమి లేకపోయినా.. కొడుకు వినయ్ చిన్నబుచ్చుకుంటాడేమో అనిపించింది కాశీకి.

తన దగ్గర అతనికిచ్చి అమెరికా పంపేటంత సొమ్ములేదని.. వీలైతే నాలుగేళ్ళు ఉద్యోగం చేసి సంపాదించుకుని ఆ డబ్బుతో వెళ్ళమని చెప్పాడు.

తండ్రి సమాధానం విన్న వినయ్ అక్కసుతో “నా పాట్లు ఏవో నేను పడతాలెండి. ఒకసారి ఉద్యోగంలో జేరితే చదువు మీద శ్రద్ధ పోతుంది. మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడే వెళుతున్నారు. నేనూ ఇప్పుడే వెళ్ళాలనుకుంటున్నాను” అని ఉక్రోషంతో బయటికెళ్ళిపోయాడు.

***

తన ఫ్రెండ్స్‌ని సంప్రదించి, వారిలాగే తనూ చెయ్యచ్చు అనుకున్న వినయ్‌కి ప్రయత్నాలు పెద్దగా కలిసి రాలేదు.

ఏమి చెయ్యలేని అసంతృప్తితో ఉద్యోగంలో చేరాడు. మూడేళ్ళు ఇట్టే గడిచిపోయింది.

ఆ రోజు ఇంటికొచ్చిన వినయ్ “నాన్నా మీరు అమెరికా పంపించనన్నారు గానీ మా కంపెనీ వాళ్ళు నన్ను ప్రాజెక్ట్ మీద అక్కడికి పంపిస్తానన్నారు. ప్రస్తుతానికి రెండేళ్ళు. నేను వెళ్ళాక, ఇంకొక ప్రాజెక్ట్ అక్కడే దొరికితే కంటిన్యూ చేస్తానన్నారు” అన్నాడు ఉత్సాహంగా.

“సంతోషం నాయనా నీ కోరిక నెరవేరుతున్నందుకు” అన్నాడు కాశీ హృదయపూర్వకంగా.

“ఒకసారి వెళితే మళ్ళీ ఎప్పటికి రాగలవో? అక్కడున్న నిన్ను కంప్యూటర్స్‌లో చూపించి పెళ్ళి చెయ్యటం కంటే, వెళ్ళే లోపే ఆ బాధ్యత కూడా తీర్చేసుకుంటే ‘కృష్ణా రామా’ అనుకుంటూ కాలక్షేపం చేస్తాం అన్నది తల్లి పద్మ.

అందరూ ఒక నిర్ణయానికి వచ్చాక తెలిసిన వారిని విచారించి, ఇంజనీరింగ్ పూర్తయి ఇంకా ఉద్యోగంలో చేరని కల్పనతో వినయ్ వివాహం జరిపించారు.

***

అప్పుడే వినయ్ అమెరికా వెళ్ళి మూడేళ్ళయింది.

కల్పన కూడా దగ్గరున్న యూనివర్సిటీలో ఏదో కోర్స్ చేసి, ఉద్యోగంలో చేరింది.

వినయ్ ఒక కొడుక్కి తండ్రి అయ్యాడు.

వినయ్ మధ్యలో ఒకసారి.. ఒక్కడే వచ్చి వారం రోజులుండి వెళ్ళాడు.

“నాన్నా వినయ్ అమ్మకి మొన్న మెట్లు దిగుతుంటే పడి కాలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆపరేషన్ చెయ్యాలంటున్నారు డాక్టర్స్. నువ్వేమైనా రాగలవా” అని కాశీ కొడుక్కి ఫోన్ చేశాడు.

‘తండ్రి తనని ఊరికే రమ్మంటున్నాడా? లేక తన నించి డబ్బేమైనా ఆశిస్తున్నాడా’ అని తర్జన భర్జన పడి.. అవసరాలనేవి ఆర్థికమైనవి మాత్రమే అని ఆలోచించే స్వభావమున్న వినయ్.. “నాన్నా.. నేను ఇప్పుడేమి సర్దుబాటు చెయ్యలేను. ఆ స్థలం అమ్మి అమ్మకి ఆపరేషన్ చేయించండి. సెలవు దొరికినప్పుడు వీలైతే ఓ వారం వస్తాను” అన్నాడు.

“నిరుడు స్థలం అమ్మి కొంత డబ్బుతో చిన్న ఫ్లాట్ కొని, మిగిలినది బ్యాంకులో వేశాను. డబ్బుకేం ఇబ్బంది లేదు. అమ్మ నిన్ను చూడాలంటే ఫోన్ చేశాను అంతే” అన్నాడు కాశీ, చిన్నబుచ్చుకున్న మనసుతో!

కొడుకుతో మాట్లాడి తిరిగొచ్చిన కాశీతో.. “ఏరా వాడు వస్తానన్నాడా? అయినా వాడొచ్చే దాకా ఆపరేషన్ ఆపే అవసరమేం లేదనుకో!” అన్నాడు.

“నేను డబ్బు కోసం ఫోన్ చేశాననుకున్నాడు. స్థలం అమ్మి ఆపరేషన్ చేయించమన్నాడు” అన్నాడు కాశీ తల దించుకుని నెమ్మదిగా.. భార్యకి వినపడకుండా!

“అడగ్గానే వాడిని చదువుకి అమెరికా పంపలేదన్న కోపం అలాగే ఉండిపోయినట్టుంది. సరిలే మనమేం చేస్తాం!”

“అవునురా నువ్వు ఆ రోజు నన్నలా బలవంత పెట్టి స్థలం కొనిపించి ఉండకపోతే.. ఇవ్వాళ్ళ స్వంత ఫ్లాట్ కొనుక్కుని మరీ ధైర్యంగా ఈవిడకి ఆపరేషను, పిల్లకి రెండు సార్లు పురిటి ఖర్చు ఇంత వెసులుబాటుతో పెట్టగలిగేవాడిని కాదు. మనబోటి మధ్య తరగతి జీవులకి అనుకోకుండా వచ్చే ఖర్చులు పెద్ద సవాలే!” అన్నాడు కాశీ హృదయపూర్వకంగా స్నేహితుడి సహాయాన్ని తల్చుకుని కృతజ్ఞతా భావంతో.

“సరేలేరా. అదొక పెద్ద సహాయమా? ఆ మాత్రం నాకు నువ్వెన్ని సార్లు చెయ్యలేదు? పద అలా వెళ్ళి కాఫీ తాగొద్దాం” అన్నాడు.

“నాకేమి ఇంత వణ్ణం ఉంటే చాలదా? ఇంట్లో పిల్లలు, పెద్దలు కడుపు నిండా తింటే నేను తిన్నట్టే” అనే గర్భిణి ఇల్లాలి డైలాగ్‌తో ప్రభుత్వం వారి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వారి ప్రకటన క్యాంటీన్‌లో టీవీలో వస్తోంది.

“అదిగో చూశావా.. ఆ తల్లి ‘తన్ను మాలిన ధర్మం’తో తిండి తినటం మానేస్తే ఎదుగుదల లేని పిల్లలు పుడతారనే ప్రభుత్వ ప్రకటనని. అది మనకి కూడా సందేశమే!” అన్నాడు విశ్వేశ్వర్ సాలోచనగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here