Site icon Sanchika

సామెత కథల ఆమెత-32

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

పొమ్మనలేక పొగ పెట్టినట్లు

[dropcap]కొం[/dropcap]తమంది వచ్చి కూర్చుంటే ఓ పట్టాన వదలరు. మరి కొందరు అవతలి వారి ఆసక్తితో సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ.. వీడెప్పుడు వదులుతాడురా అనిపిస్తారు. కానీ అమర్యాదగా ఉంటుందని వెళ్ళిపొమ్మని మొహాన చెప్పలేరు.

అలాంటప్పుడు.. ఎదుటి వ్యక్తి వారంతట వారే వెళ్ళిపోయేలా చేసే సందర్భంలో ఈ సామెత వాడతారు.

***

ఆదివారం ఆఫీసుకి పరుగెత్తక్కర లేదు.. నిదానంగా లేవచ్చు అని శ్రీనివాస్ రాత్రి పొద్దుపోయే వరకు టీవీలో సినిమా చూశాడు.

ఉదయం ఆరున్నర అయ్యేసరికల్లా ఠంగు ఠంగు మని కాలింగ్ బెల్ మోగుతుంటే.. “సరూ కొంచెం తలుపు తీసిరావా” అన్నాడు దుప్పట్లో నించే శ్రీనివాస్.

“అబ్బా మీరే వెళ్ళి తియ్యండి.. నాకు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారు ఝామునే నిద్రపట్టింది. అయినా ఇంత పొద్దున్నే ఎవరో శాడిస్టులు! ఆదివారం అనైనా చూసుకోకుండా పొద్దున్నే దిగబడ్డారు” అన్నది విసుగ్గా.. సరూ అనబడే సరసి.

ఇద్దరూ కాసేపు ఇలా ఒకరిని వెళ్ళమని ఇంకొకరు అర్థిస్తూ ఉండగా.. విరామం లేకుండా బెల్ మోగుతూనే ఉంది.

లేవక తప్పని పరిస్థితి వచ్చింది. కొన్ని ఇళ్ళు ‘మధురై’ లైతే (స్త్రీ ఆధిక్యత) మరి కొన్ని ఇళ్ళు ‘చిదంబర’ క్షేత్రాలన్నమాట (పురుషాధిక్యం).

ఇల్లు చిదంబరం కాబట్టి సరసికి లేవక తప్పలేదు.

నిద్ర లేచి, బట్టలు సరి చేసుకుని, జుట్టు పై పైన సవరించుకుని.. సగం నిద్రలో లేచినందు వల్ల ఆవులిస్తూ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని.. వెళ్ళి తలుపు తీసింది.

ఎదురుగా ఉన్న వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండక పోవటంతో.. “ఎవరు కావాలి? ఇది ఫ్లాట్ నం. 402” అన్నది.

“ఆఁ నాకు కావలసిందీ 402 నే. నేను శ్రీను గాడికి వరసకి మామయ్య  నవుతాను. వాడు చిన్నప్పుడు నా భుజాల మీదే పెరిగాడు. చెప్పటానికి చుట్టరికం దూరమే కానీ.. మా అక్క.. అదే మీ అత్తగారి ప్రేమ ముందు చుట్టరికాలవసరం లేదు” అని గడ గడా మాట్లాడుతూ.. లోపలికొచ్చి కూర్చున్నాడు.

సరసి లోపలికెళ్ళి.. “ఎవరో మీ మామయ్యట.. పేరు అడగలేదు. అసలు నాకు మాట్లాడటానికి చాన్స్ ఇస్తే కదా! ఆయనే గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు. తప్పదు.. లేవండి.. బాగా అయింది.. మీ తిక్క కుదిరింది. నన్ను లేపేశారుగా! ఇప్పుడెళ్ళి ఆయనకి బలి అవ్వండి” అన్నది వెక్కిరిస్తూ!

శ్రీనివాస్ ఇహ తప్పదన్నట్టుగా లేచి.. దంతధావనం చేసి తనకో కప్పు, ఆయనకో కప్పు కాఫీతో డ్రాయింగ్ రూంలోకి వెళ్ళాడు.

“నువ్వా మామయ్యా.. ఊళ్ళోకి ఎప్పుడొచ్చావ్? ఇల్లు ఎలా తెలిసింది? వెతుక్కోకుండా తేలిగ్గా రాగలిగావా? ఇదిగో కాఫీ తీసుకో” అంటూ కబుర్లు మొదలు పెట్టాడు.

ఇక చేసేదేం లేక.. సరసి కూడా ఓ కాఫీ కప్పు తీసుకుని వచ్చి మొహమాటంగా ఆయనతో రెండు మాటలు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది.

ఆ పూట శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేసి.. విశ్రాంతి తీసుకుని.. సాయంత్రం అతన్ని వెంట పెట్టుకుని తన కూతురికి చూసిన పెళ్ళి సంబంధం వారింటికి వెళ్ళాలనుకున్నాడు జగన్నాధం.

ఆ రోజు.. షాపింగ్‌కి వెళ్ళి అటు నించటే హోటల్‌కి వెళ్ళి భోజనం చేసి ఫ్రెండ్స్ ఇంట్లో గడిపి సాయంత్రం సినిమా చూసి జాలీ జాలీగా ఎంజాయ్ చేసి ఇంటికి చేరాలనేది శ్రీనివాస్ వాళ్ళ ప్రోగ్రాం.

జగన్నాధం రాకతో శ్రీనివాస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

ఆయన్ని పొమ్మనలేరు.. అలా అని ఉండమనలేరు.

వారం అంతా శ్రమపడతారు కాబట్టి ఆదివారాన్ని ఆటవిడుపుగా గడపటం వాళ్ళకి అలవాటు.

***

“సరూ ఇవ్వాళ్ళ ఆఫీసులో పని ఉన్నది. తప్పని సరిగా వెళ్ళాలన్నావు కదా! రెడీ అవుతున్నావా? నిన్ను దింపి నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి. మా ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయిందని రాత్రి పడుకునేటప్పుడు చెప్పాను కదా! వాడికీరోజు ఆపరేషన్ చేస్తారుట. నేను కూడా బ్లడ్ ఇస్తున్నాను.”

“నువ్వు లంచ్ మీ క్యాంటీన్‌లో చేస్తావా? నేను మా మిగిలిన మిత్ర బృందంతో అక్కడే తినేస్తాను” అన్నాడు.. లోపలికి చూస్తూ!

“మామయ్యా.. హాయిగా స్నానం చేసి విశ్రాంతి తీసుకో.  పనమ్మాయి వచ్చాక ఇంకొకసారి కాఫీ చేసి ఇస్తుంది. రాత్రి పదార్థాలు ఫ్రిజ్‌లో ఉన్నాయి. కావాలంటే ఆ అమ్మాయే వెచ్చ చేసి ఇచ్చేస్తుంది.. లేక అలా తినేసినా సరే.. మేము పని అయిపోగానే వచ్చేస్తాం. మేం వచ్చే దాని బట్టి నువ్వెళ్ళాల్సిన చోటికి వెళదాం. సరేనా.. ఏమి అనుకోకు.”

“రాక రాక వచ్చిన నీతో గడపలేక పోతున్నాం. గడియారంలో ముల్లు లాగా.. మాకు ఆదివారాలు కూడా అవిశ్రాంతంగా.. ఇలాగే ఉంటాయి మా జీవితాలు. అత్తయ్య కులాసా కదా! ఈసారి వచ్చినప్పుడు నాలుగు రోజులు ఉండేలాగా రా” అన్నాడు.

శ్రీనివాస్ మాటలకి ఏమనాలో తెలియక.. నోట మాట రాక చూస్తున్న జగన్నాధం.. ఒక నిముషం తరువాత “అయ్యో ఫరవాలేదురా. ముందుగా చెప్పక పోవటం నేను చేసిన పొరపాటే! మీరు ఇబ్బంది పడకండి. మీరు ఉండగానే స్నానం చేసి.. బయటికెళతాను. మళ్ళీ పనిమనిషికెందుకు శ్రమ. తాళం వేసుకెళ్ళండి. నా బ్యాగ్ మాత్రం ఇక్కడ పెట్టుకుంటాను. రాత్రికి మీరొచ్చాక ఫోన్ చెయ్యండి. వచ్చి పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోతాను” అన్నాడు.

***

“మీ మేనల్లుడింటికి వెళ్ళారా? వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారా? అతని భార్య ఎలా ఉంటుంది. మీతో బాగా మాట్లాడిందా? పెళ్ళివారేమన్నారు” అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నాస్త్రాలు సంధించింది రుక్మిణి.

జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పి.. “వాళ్ళకి నేను వెళ్ళటం ఇష్టం ఉన్నట్టు లేదు. ‘పొమ్మనలేక పొగపెట్టినట్టు’ వాళ్ళకి ఆ రోజు చాలా ముఖ్యమైన పనులున్నట్టు చెప్పి.. పనిమనిషి పెట్టే తిండి తిని నన్ను విశ్రాంతి తీసుకోమని.. అన్యాపదేశంగా బయటికి దయచేయమని చెప్పారు” అన్నాడు.

“అవును లెండి ఈ కాలపు పిల్లలకి వాళ్ళ జీవితాలు తప్ప ‘అతిథి.. అభ్యాగతి’ అనే  మర్యాదలు.. మొహమాటాలు ఉండట్లేదు. తప్పు వారిది కాదు.. కాలానిది” అని “బాధపడకండి.. మనమే మారటం నేర్చుకుంటే సరి.. ఈ తరం మనుషులు అర్థం అవుతారు” అన్నది రుక్మిణి.

Exit mobile version