Site icon Sanchika

సామెత కథల ఆమెత-33

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

ఇంటింటికో ఇటుకల పొయ్యి..

[dropcap]ఆ[/dropcap]ఫీసులో అన్యమనస్కంగా పని చేసుకుంటున్న అరుణ.. లంచ్ టైం ఎప్పుడవుతుందా అని మాటి మాటికీ గడియారం వంక చూసుకుంటోంది.

“ఒంట్లో బాగా లేదా? ఇందాకటి నించి చూస్తున్నాను ఏదో చికాకుగా ఉన్నట్టున్నావ్” అంది లత.. అరుణ మొహంలోకి చూస్తూ.

“అబ్భా.. ఈ మొగుళ్ళు.. మొగాళ్ళని చూస్తే.. మన అమ్మల తరంలో నోరెత్తకుండా.. పతివ్రతల్లాగా ఎలా భరించారో ఆశ్చర్యం వేస్తోంది” అన్నది ఉపోద్ఘాతంగా.

“ఇప్పుడు కొత్తగా ఏమయింది?” అన్నది లత చిరునవ్వుతో.

“పద లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. అక్కడ మన మిగతా గ్యాంగ్ కూడా చేరతారు కదా.. మన ఘోష వాళ్ళూ వింటారు” అన్నది అరుణ లంచ్ బాక్స్ చేతిలోకి తీసుకుంటూ.

“నిన్న రాత్రి మా మామయ్య కూతురు వాళ్ళు వచ్చారు. ఈ ఊళ్ళో ఏదో ఫంక్షన్ ఉంటే అది చూసుకుని.. నన్ను చూసి వెళదామని వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి రాత్రి 8.15 అయి ఉంటుంది. మేము భోజనాలకి కూర్చోబోతున్నాం. వాళ్ళని కూడా పిలుద్దామనుకుంటుండగా.. తనే ‘మేం భోజనం చేసే వచ్చామే. నువ్వేం హైరాన పడకు. మేము అక్కడే కూర్చుని కబుర్లు చెబుతాం. మీరు భోజనాలు కానిచ్చేయండి’ అన్నది.”

“ఇక చూసుకో.. నేను ఎక్కడ వాళ్ళని ఈ రోజు రాత్రికి రమ్మంటానో అని మా ఆయన సల సల లాడిపోయారు. నా వెనకే తిరుగుతూ.. కంటితో సైగ చేస్తూ.. ‘ఇప్పుడు వాళ్ళని ఆహ్వానించే పని పెట్టుకోకు’ అని నాతో గుసగుసగా చెబుతుంటే చిరాకేసింది. వాళ్ళు వింటారేమో.. తన గురించి ఏమనుకుంటారో అని నాకు దుగ్ధ!”

“అయినా తను నాకు ఫస్ట్ కజిన్! చిన్నప్పుడు కలిసి పెరిగాము. ఆప్యాయంగా నన్ను చూడటానికి వచ్చినవారిని.. మర్యాద కోసమైనా రమ్మనకుండా ఎలా ఉంటాను? పెళ్ళిళ్ళై పోగానే మనం పాత జీవితాన్ని మర్చిపోయి.. వీళ్ళ చేతుల్లో కీ ఇస్తే ఆడే మర బొమ్మలై పోవాలా? మనం ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ ఉంటేనే ఇలా ఉన్నారు. మన అమ్మల రోజులైతే.. కానీ సంపాదన లేకుండా ఏ ఆర్థిక స్వాతంత్ర్యం లేని పరిస్థితుల్లో వారి స్వంతవారిని అసలు రమ్మని పిలిచే పరిస్థితి ఉండేదా అని ఆశ్చర్యం వేస్తోంది.”

“నేను ఆయన నస పట్టించుకోకుండా.. వచ్చే తుఫానుని అంచనా వేసి కూడా.. మా వదినా వాళ్ళని వచ్చి ఈరోజు రాత్రి మా ఇంట్లో  ఉండమన్నాను. ఎక్కడో అక్కడ తెగించక పోతే.. వీళ్ళు మారరు. మనకి ఉనికే లేకుండా చేస్తారు” అన్నది అరుణ.. ఊపిరి తీసుకుంటూ!

“అంత నస పెట్టే మనిషి.. నువ్వు అలా చెప్పగానే ఊరుకున్నారా?” అంది వాణి సంభాషణలో మాట కలుపుతూ.. ఉత్సుకతతో.

“ఆఁ అంత తేలికగా వదులుతారా? రాత్రి 12 గం ల వరకు నాకు క్లాస్ పీకారు.  ‘ఇలా వచ్చిపోయే వాళ్ళకి మర్యాదలు చేసే రోజులా ఇవి? తిండి ఖర్చు, బహుమతుల ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఇలా బంధువులని పిలిచి మర్యాదలు చెయ్యలంటే మనం ఎన్నో అవసరాలు.. సరదాలు మానుకోవాలి. రేపు రాత్రి నేను లేట్‌గా వస్తాను.. నీ తిప్పలు నువ్వు పడు’ అని అటు తిరిగి పడుకున్నారు” అంది అరుణ.

“మీ ఆయన ఒక ‘అతి రకం’ అయితే.. మా బావ ఇంకొక ‘అతి రకం’. ఇంటికి ఎవరొచ్చినా రెండు రోజులు ఉండమని.. అతి మర్యాదలు చేసి.. మా అక్క చేత వాళ్ళకి పది రకాలు వండించి పెడతాడు. వాళ్ళు పొరపాటున ఇంట్లో వస్తువులు ఏవైనా చూసి బాగున్నాయని  ప్రశంసిస్తే.. వాళ్ళకిచ్చి పంపేస్తాడు. ఉద్యోగం చేసుకునే మనిషి అది.. చచ్చిపోతోంది ఆయన అతిథి మర్యాదలతో!”

“ఆయనేమో ‘తిండికి తిమ్మ రాజు.. పనికి పోత రాజు’  ఇటు పుల్ల తీసి అటు పెట్టడు. షాపింగ్ దగ్గరనించి.. ఇంటి పని, వంట పని, పిల్లల చదువులు, అతిథి మర్యాదలు.. దానికి రోజుకి ఇరవై నాలుగు గంటలు చాలట్లేదు” అంది లత.

“మీదొక రకం సమస్య అయితే.. మా ఇంట్లో ఇంకొక రకం. సంవత్సరమంతా యూనిఫామ్స్ వేసుకు తిరిగే పిల్లలకి వద్దంటే వినకుండా తడవకి నాలుగైదు ఫ్యాన్సీవి.. ఖరీదైనవి బట్టలు తెస్తారు మా ఆయన. వాళ్ళేమో ఎదిగే పిల్లలు. నాలుగు నెలలకే సరిపోవు. పొట్టై పోతాయి.. పోనీ ఎవరికైనా ఇద్దామంటే పని వాళ్ళకి కూడా నిక్కూ.. టెక్కూ ఎక్కువై.. వాడేసిన బట్టలు వాళ్ళు తీసుకోవట్లేదు అని నేనంటే.. ‘మా అన్నయ్య పిల్లలు.. అక్క పిల్లల ముందు నా పిల్లలు నాసిగా కనపడకూడదు’ అని వితండ వాదం చేస్తారు.”

“సర్దలేక దుంప తెగుతోంది. ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే! కప్ బోర్డ్స్ చాలట్లేదు. డబ్బు చెట్లకి కాస్తోందా? ఇద్దరం నెలంతా తినీ.. తినక కష్టపడేది రేపన్న రోజుకి ఓ రూపాయి జాగ్రత్త చేసుకోవాలని కదా! ఈ అర్థం లేని ఖర్చులకి ఆరోగ్యం పాడు చేసుకుంటూ నేను  కూడా సంపాదించటం ఎందుకు.. ఉద్యోగం మానేస్తానని నేను.. రోజూ ఇదే ఘర్షణ మాకిద్దరికి” అంది వనజ.

“అమ్మో ఆ పని మాత్రం చెయ్యకు. ఇక్కడ ఉన్న కాసేపే మనకి ఊరట! మంచి చెడు మాట్లాడుకుంటుంటే.. మన ఆరోగ్యాలు కాస్త బాగుంటాయి. డబ్బు చేతిలో ఆడనంత మాత్రాన వాళ్ళ స్వభావం మారదు” అన్నది లత.

“మనం కూడా సంపాదిస్తుంటే పుష్కలంగా చేతి నిండా డబ్బు ఉండేసరికి ఈ మగ వాళ్ళ ధోరణి భరించలేకుండా ఉన్నాం. మొన్న మావారి ఫ్రెండ్ ఎవరో ఇంటీరియర్ డిజైనర్.. లైట్ల షాపుకెళ్ళి షాండిలియర్ కొంటుంటే.. మా వారు కూడా నచ్చిందని ఒకటి కొనుక్కొచ్చారు. తీరా అది హాల్లో బిగించేసరికి మిగిలిన లైట్స్ అన్నీపాతబడి దిష్టి బొమ్మల్లాగా ఉన్నాయని.. నిన్న నేను ఇంటికెళ్ళేసరికి ఇంటినిండా కొత్త లైట్స్ తాలూకు ప్యాకెట్స్.. బిగించేటందుకు ఎలెక్ట్రీషియన్.. ఇల్లు పీకి పందిరేస్తున్నారు.”

“ఆ బీభత్సం చూసి నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఉంటే.. మార్కెట్లో కొత్తగా ఏ వస్తువులు వస్తే అవన్నీ కొనుక్కొచ్చి.. ఇంట్లో పెట్టేసుకోవాలనే తాపత్రయం! అబ్బో ఈ రోజుల్లో ఈ వినిమయ సంస్కృతి మనుషులని నిలవనివ్వట్లేదంటే అతిశయోక్తి కాదు. విచ్చలవిడిగా బట్టలు, చెప్పులు, వంటింటి సామాను కొనే ఆడవాళ్ళూ ఉన్నారు. మా పక్కింటావిడ వంటింట్లో ఇంతకు ముందు ఉన్న డబ్బాలన్నీ మార్చి టప్పర్‌వేర్ కొని అలమార్లు నింపింది. పైగా ఇప్పుడెందుకండీ అంటే సంపాదించే డబ్బేం చేసుకుంటాం అని నా వంక వింతగా చూసింది” అంది తల పట్టుకుని జానకి.

‘ఇంటింటికో ఇటుకల పొయ్యి మా ఇంటికో మట్టి పొయ్యి’ అన్నట్టు ఈ మధ్య మా అన్నయ్య.. చెక్కకి చెదలొస్తున్నాయి అని ఏకంగా మునుపు పెట్టిన చెక్క కిటికీలు పీకించి.. పివిసి కిటికీలు అని కొత్తగా వస్తున్నాయిట.. అవి పెట్టిస్తున్నాడు. ఇల్లంతా సున్నం, సిమెంట్, దుమ్ము. పని వాళ్ళు ఒక రోజు వస్తే ఒక రోజు రారు. మా వదినకేమో ఆస్తమా! పాపం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే వచ్చి మా ఇంట్లో ఉండమన్నాను” అన్నది విమల నిట్టూరుస్తూ!

“మనవి సమస్యలా అంటే బయటి వారికి పెద్ద సమస్యల్లాగా కనబడక పోవచ్చు! కానీ.. ప్రతి రోజూ పగలంతా ఉద్యోగం చేసి.. ఇంటికెళ్ళి ప్రశాంతంగా గడుపుదాం అనుకునే మన బోటి వాళ్ళకి ఇవి పెద్ద విషయాలే మరి. ఇంటికెళ్ళగానే పిల్లల చదువులు, మరునాటికి వంట ఏర్పాట్లు.. చిన్నా చితకా ఆరోగ్య సమస్యలు.. ఇలా ఏవో ఒకటి చూసుకోవాలి కదా! కనీసం ఇలా ఒకరి ఘోష మరొకరం పంచుకోవటంతో ఒకరి సమస్య ఇంకొకరికి ‘చిన్న గీత పక్కనపెద్ద గీత’ లాగా కొంత ఊరటనిస్తుందనుకుందాం” అని ముక్తాయించింది లలిత పెద్దరికంగా!

అవండీ ప్రస్తుత జీవితాల్లో ఉండే కొత్త కోణాలు.

[పూర్వం ప్రతి ఇంట్లో పొయ్యిల మీదే వంట చేసుకోవటం.. నీళ్ళు కాచుకోవటం చేసేవారు. మూడు ఇటుకలు త్రిభుజాకారంలో పేర్చి.. మళ్ళీ వాటి మీద ఎత్తు కోసం రెండు.. మూడు వరుసలు పేర్చి పొయ్యి తయారు చేసేవారు. కొందరు సిమెంట్‌తో శాస్వత నిర్మాణం చేస్తే.. మరి కొందరు మధ్యలో మట్టితో అతికి.. పైన గోమయంతో అలికేవారు. ఆ మట్టి పొయ్యి మడి.. ఆచారం కోసం కానీ.. గట్టిదనం కోసం కానీ ప్రతి రోజూ అలికేవారు.

సమస్యలు లేని ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లోను ఉంటాయి. ఎటొచ్చీ అవి ఎంత తీవ్రమైనవి? ఎన్నిటికి పరిష్కారాలు ఉంటాయి? చూసీ చూడనట్లు వదిలేసేవి ఎన్ని ఉంటాయి అనేది ఆ ఇంటి వారి ఆలోచనా విధానం మీద.. వారి పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి సందర్భంలో వాడే సామెత ఇది.]

Exit mobile version