[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]
ముందొచ్చిన చెవులకంటే..
[dropcap]“వ[/dropcap]దినా ఏం కావాలి” అన్నది మంజుల వంటింటి వైపొచ్చిన ఆడపడుచు సుందరిని చూసి.
“ఆఁ ఏం లేదు.. అప్పుడే ఎనిమిదైనట్టుంది.. అమ్మ కాఫీ తాగినట్టు కనిపించలేదు. అమ్మ కాఫీ తాగకుండా ఇంత సేపు ఉండలేదు. అందుకని అమ్మకి కాఫీ కలిపిద్దామని..” అన్నది మెల్లిగా.
“అత్తయ్య స్నానం, పూజ అయ్యేవరకు కాఫీ తాగరు. ఇదిగో పూజ అయినట్టుంది. ఇక తాగుతారులే” అన్నది మంజుల.
అత్తగారు పూజ అయ్యాకే కాఫీ తాగుతారని ఆమె భావన.
అమ్మ ఉదయం ఐదు గంటలకల్లా లేస్తుంది.
“వెంటనే కాఫీ కడుపులో పడాలే అమ్మాయి.. ఇంధనం పడకపోతే బండి పట్టాలెక్కదు” అంటుంది.
‘ఇది ఆవిడకి దాదాపు నలభయ్యేళ్ళ అలవాటు. తనకి ఊహ తెలిసినప్పటి నించీ అమ్మది ఇదే పద్ధతి. ఇప్పుడు.. ఈ పూజ చేసుకుంటే కానీ కాఫీ తాగదు అనే లెక్కేమిటో’ అనుకుంది సుందరి స్వగతంలో!
***
సుందరి.. మంజుల ఇంచుమించు ఒకే ఈడువాళ్ళు. ఇద్దరూ ఒకరినొకరు వదినా అని పిలుచుకుంటారు.
సుందరికి పెళ్ళయి అప్పుడే మూడేళ్ళయింది. మంజుల ఆ ఇంట్లో కోడలిగా కాలు పెట్టి మూడు నెలలే అయింది.
నెల తప్పిన సుందరికి వేవిళ్ళతో బాధపడుతూ ఉదయం పూట నీరసంగా ఉంటోందని నాలుగు రోజులు ఉంచుకుని పంపిస్తామని తీసుకొచ్చారు.. తల్లిదండ్రులు.
***
“అమ్మా” అంటూ లోపలికెళ్ళింది.
వసుమతి నీరసంతో పడుకుని ఉంది. అప్పటికే లేచి షుమారు మూడు గంటలయింది.. అందులో షుగర్ పేషెంట్!
గబ గబా కాఫీ కలిపి పెద్ద గ్లాసుతో తీసుకెళ్ళి ఇచ్చింది.
“ముందు రోజు పాలు ఉంచితే లేవగానే కాఫీ తాగచ్చు.. ఒక ప్యాకెట్ అట్టే పెట్టు అని ఎన్ని సార్లు చెప్పానో ఈ అమ్మాయికి. అహఁ వింటేనా!”
“ ‘పొద్దున్నే వస్తాయిగా! ముందు రోజు ప్యాకెట్ అట్టేపెడితే పాలు విరిగిపోతాయ్ అత్తయ్యా’ అని అన్ని పాలు కాచి తోడు పెట్టేస్తుంది.” అన్నది అంతకు ముందు తన కాఫీ అలవాటు గురించి కూతురు.. కోడలు సంభాషణ విన్న వసుమతి.
విషయం అర్థమైన సుందరి.. కోడలిగా వదిన గారు ఇంట్లో కాలు పెట్టి కొంతకాలమే కదా అయింది! ఇంకా ఇంట్లో వాళ్ళ అలవాట్లు అర్థమవటానికి, వారి ఆరోగ్య సమస్యలు తెలియటానికి.. ఆమోదించటానికి కొంత టైం పడుతుందిలే అని సరిపెట్టుకుంది.
అయినా నాలుగు రోజులు ఉండి పోయే దానికి.. ఈ లోపు వదిన గారితో గట్టిగా మాట్లాడితే గొడవ అవుతుందని.. అన్నయ్య అపార్థం చేసుకుంటాడేమో అని ఊరుకుంది.
***
“ఈ పూట వంట నే చేస్తాలే అత్తయ్యా” అన్నది మంజుల ఫ్రిజ్ లోంచి కూరలు తీస్తూ.
వంట పని లేకపోవటంతో.. వసుమతి ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది.
“అమ్మాయి అసలే ఓపలేని పిల్ల. అప్పుడే ఎనిమిదవుతున్నట్టుంది. భోజనాలు చేద్దామా” అన్నారు ప్రకాశం గారు.
డైనింగ్ టేబుల్ మీద కంచాలు.. మంచినీళ్ళు పెట్టి.. వంట పదార్థాలు తెద్దామని వంటింట్లో గట్టు మీద వెతికితే రైస్ కుక్కర్‌లో అన్నం, పక్కన చిన్న గిన్నెతో చారు కనిపించాయి.
“అమ్మా కూర చెయ్యలేదా?” అంది స్టవ్ పక్కన వెతుకుతూ.
“ఈ పూట వంట వదిన చేసింది” అన్నది వసుమతి.
“మంజూ కూర చెయ్యలేదా? ఇందాక ఫ్రిజ్ లోంచి కూరలేవో తీసినట్టున్నావు కదా!” అన్నది వసుమతి.
“రాత్రి పూట కూర హెవీ అవుతుంది. మధ్యాహ్నం చేసిన పచ్చడి, చారు చాలు అన్నారు మీ అబ్బాయి. అందుకే చెయ్యలేదు” అన్నది.
“కడుపుతో ఉన్న పిల్లకి కూర వెయ్యకుండా అలా పచ్చడితో గొడ్డన్నం పెడతామా? బలమేం పడుతుంది” అని వసుమతి అంటూ ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చిన శేఖర్..
“పోనీలే అమ్మా.. దానికంత చర్చ.. రచ్చ ఎందుకు? మధ్యాహ్నం కూర ఉంటే చెల్లికి వేసి పెట్టు ఈ పూట. మనం పచ్చడి, చారుతో తినేద్దాం” అన్నాడు అదో పెద్ద విషయమా.. అన్నట్టుగా.
ఏ రోజయినా ఓపిక లేక కానీ.. ఇంట్లో కూరలు లేకపోవటం వల్ల కానీ.. కూర, పులుసు చెయ్యకపోతే..
‘అమ్మా పగలు మా క్యాంటీన్‌లో తినేది చెత్త తిండి. రాత్రి పూటే కదా నేను ఇంట్లో అన్నం తినేది. ఇప్పుడు కూడా ఇలా పచ్చడి మెతుకులు తినమంటే ఎలా’ అని నానా గొడవ చేసే కొడుకు, పెళ్ళాన్ని వెనకేసుకు రావటం.. ‘రాత్రి పూట కూర హెవీ అవుతుందని మీ అబ్బాయే వద్దన్నారని’ ఆ పెళ్ళాము వత్తాసు పలకటం.. భలే ఉందే అనుకుంది, వసుమతి మనసులో!
‘మార్పులు మొదలయ్యాయన్నమాట ఇంట్లో’ అనుకుంది స్వగతంగా!
***
“దీపావళి పండుగ వస్తోంది. కొత్త బట్టలు తేవాలోయ్, నువ్వు కూడా వస్తావా అలా బజారుకి” అన్నారు ప్రకాశం గారు.
“మీ అబ్బాయి సాయంత్రం నన్ను రెడీగా ఉండమన్నారు. మేమిద్దరం వెళ్ళి తెస్తాం లెండి మామయ్యగారూ” అన్నది మంజుల.
కొడుకు-కోడలు పండుగ బట్టలు తెస్తామన్నందుకు వసుమతి సంతోషించింది.
మూడు గంటలు షాపులన్ని తిరిగి.. ఇంట్లో అందరికి బట్టలు.. స్వీట్స్.. దీపావళి టపాసులు తెచ్చారు.
“అమ్మా తెచ్చినవన్నీ ఒక్కసారి ఇటొచ్చి చూడు. మేము ఫ్రెష్ అయి భోజనానికి వస్తాము” అని తమ రూం లోకి వెళ్ళారు శేఖర్ దంపతులు.
“ఈ స్కై బ్లూ షర్ట్ ఎవరికి? పైగా ఫుల్ హాండ్స్ తెచ్చావు” అంది వసుమతి.
కాలేజిలో చదువుకునేటప్పుడు స్కై బ్లూ షర్ట్ నీకు బాగా నప్పుతుంది. కొంటానంటే ఖస్సుమనేవాడు. ‘ఫ్యాక్టరీలో పని చేసే వాళ్ళ లాగా నాకా బ్లూ షర్ట్ ఒద్ద’ని చచ్చినా కొననిచ్చేవాడు కాదు.
అలాగే శేఖర్‌కి ఫుల్ హాండ్ షర్ట్స్ ఇష్టం ఉండదు. అతనికిష్టమైన కలర్స్ లో కొన్ని ఫుల్ హాండ్స్‌లో మాత్రమే ఉంటే ‘గాలాడదు నాకొద్దు పొమ్మనేవాడు’.
అలాంటిది ఇప్పుడు ఫుల్ హాండ్ బ్లూ షర్ట్ తెచ్చుకున్నాడు అని వసుమతి.. ప్రకాశం ఒకరి వంక ఒకరు చూస్తూ తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు.
“మంజులకి నేను ఫుల్ హాండ్ షర్ట్ వేసుకుంటే ఇష్టంట. అందుకని తనే సెలెక్ట్ చేసిందమ్మా. ఇంత చిన్న విషయానికి తనని చిన్నబుచ్చటమెందుకు అని నాకలవాటు లేకపోయినా తెచ్చాను” అన్నాడు తేలికగా!
“అమ్మా ఇది చెల్లికి చీర, ఇదేమో మంజులకి” అన్నాడు.
ఇద్దరి చీరల ధరలో ఉన్న వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనపడటంతో
“అదేమిట్రా నేను ఇద్దరికీ ఒకే రకం కొంటాను అని నీకు తెలుసు కదా! ఈ చీర చూసి చెల్లి చిన్నపుచ్చుకుంటుందనిపించలేదా” అంది వసుమతి కొడుకు వంక చూసి.
“మంజుకి, చెల్లికి ఒకే రకం కొంటే మంజు ఏమైనా అనుకుంటుందేమో అని ఇలా వేరే వేరే రకాలు తీసుకున్నానమ్మా” అన్నాడు.
“ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు పెద్దలు. పెళ్ళాన్ని గౌరవించు తప్పు లేదు. కానీ వాళ్ళు చెప్పేవాటన్నిటికీ గంగిరెద్దు లాగా తలూపక్కరలేదు.”
“జంతువు పుట్టినప్పటి నించి ఉండేవి చెవులు. ఎదుగుతూ ఉండగా వచ్చేవి కొమ్ములు. ఎంత కాలం గడిచినా పుట్టినప్పటి నించీ ఉన్న చెవులు ఏ హానీ చెయ్యవు. ఒద్దికగా ఉంటాయి. అదే మధ్యలో వచ్చే కొమ్ములు, పెరిగి వాడిగా తయారై పొడవటానికి సిద్ధ పడతాయి.”
“మనిషి పుట్టేటప్పటికే ఉన్న తల్లిదండ్రులు.. చిన్నప్పటి నించి కలిసి పెరిగే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు చెవుల్లాంటి వారు. ఎంత కాలం గడిచినా చెవులతో ఇబ్బంది ఉండదు.”
“పెద్దయ్యాక మనిషి జీవితంలోకి ప్రవేశించేది భార్య. ఆ భార్య.. తన భర్త తనతో సమానంగా ఇతర కుటుంబ సభ్యులని చూస్తే తనని తప్పు పడుతుందేమో అనే భావనతో, ఆమెని ప్రసన్నం చేసుకోవటానికి భర్తలు తమ జీవితంలో మెత్తనైన చెవుల్లాంటివారిని చులకన చేస్తూ ఉంటారు.”
“కానీ భార్య స్థానం, ఆమె పాత్ర కొంత ప్రత్యేకమైనదే! అయినా మనిషి జీవితంలో ఎవరి ప్రాధాన్యం వారిదే. ఆ విషయం వారికి అర్థమయ్యేలా చెయ్యటం పురుషుల పని. ఇంట్లో పురుషులు అలా ప్రవర్తించగలిగితే కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు రావు” అన్నది వసుమతి.
“నేనంత దూరం ఆలోచించలేదమ్మా!”
“మీ దగ్గర ఉండే చనువు చొప్పున మనసులో ఉండే ఇష్టాయిష్టాలని చెప్పేస్తాం!”
“భార్య అనే వ్యక్తి నాకూ కొత్తే కదా. తను ఎలా ఆలోచిస్తుందో తెలియదు.”
“ఆ చీర అలా ఉంచెయ్యి. చెల్లికి చూపించకు. నేను మంజు రేపు బజారుకెళ్ళి చెల్లికి ఇంకొక చీర తెస్తాం” అన్నాడు శేఖర్ తేలిక పడిన మనసుతో .
భార్యకి ఎలా చెప్పాలో అలా చెప్పి నొప్పించకుండా ఒప్పించగలిగి.. వెంటనే సానుకూలంగా ఆలోచించగలిగితే, పెళ్ళాలు పొడిచే కొమ్ములూ కారు.. అమ్మలు చిన్నబుచ్చుకునే చెవులూ కారు.
ఏమంటారు?