సామెత కథల ఆమెత-6

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

తినబోతూ రుచి

[dropcap]ఆ[/dropcap] రోజు ఆఫీసంతా కోలాహలంగా ఉంది.

తెల్లటి ఇస్త్రీ షర్ట్ టక్ చేసుకుని నీట్‌గా తల దువ్వి, ‘రాముడు మంచి బాలుడు’ లాగా తయారై వచ్చాడు ఆనంద్.

రోజూ కనీసం గంటయినా లేట్‌గా ఆఫీసుకి వచ్చే సరోజ ఆ రోజు అందరి కంటే అరగంట ముందే వచ్చేసింది.

ఇక మురళి.. సరైన టైంకే ఆఫీసుకి వచ్చినా.. కారిడార్లో సిగరెట్ దమ్ము కొడుతూ ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కొట్టేవాడు.. ఈ రోజు బుద్ధిగా సీట్లో కూర్చుని ఫైల్లో తల దూర్చేసి లెక్కలతో కుస్తీ పడుతూ మధ్య మధ్యలో ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు.

ఒంటికి అతుక్కుపోయే బట్టలతో.. నయగారాలు పోతూ తన మాటలతో మగ కొలీగ్స్‌ని ఆకట్టుకునే స్వప్న ఆ రోజు ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుని.. ‘ఈవిడకి చీర కట్టుకోవటం వచ్చే’ అని నలుగురు ఆశ్చర్యపోయేలా పది నిముషాలు ముందే వచ్చి, పనిలో పడిపోయింది.

రామారావు గారు మాత్రం రోజూ లాగే కరెక్ట్ టైంలో ఆఫీసుకి వచ్చి.. నిన్న సగంలో ఆపిన వర్క్ గురించి తన కింది ఉద్యోగి రంగా తో మాట్లాడుతున్నారు.

అరగంట గడిచినా తమ కుతూహలానికి తెరపడనందుకు.. మురళి “స్వప్న గారూ.. ఇంతకీ ఈ రోజేనా మన కొత్త బాస్ చార్జి తీసుకునేది” అన్నాడు నెమ్మదిగా!

“ఆమె చూడటానికి ఎలా ఉంటారో మీకేమయినా ఐడియా ఉందా” అన్నది సరోజ చేసే పనిలోంచి తలెత్తి.

“నల్లగానా.. తెల్లగానా? లావుగా ఉంటుందా? సన్నగా ఉంటుందా? పొట్టా.. పొడుగా? కొంచెం అయినా తెలిస్తే బాగుండు.. ఈ టెన్షన్ తగ్గుతుంది” అన్నది సరోజే మళ్ళీ.

“ఆఁ ఆవిడేమైనా దేవలోకం నించి దిగొచ్చే అప్సరసా ఏంటి? లేక దెయ్యమో భూతమోనా! మన లాగే ఉంటుంది” అన్నాడే కానీ ఆనంద్ కూడా కుతూహలాన్ని ఆపుకోలేక.. ఏ నిముషంలో అయినా ఆవిడ రావచ్చన్నట్టుగా వాకిలి వైపు చూస్తున్నాడు.

“ఆవిడ బాగా స్ట్రిక్ట్‌ట కదా! పాత బ్రాంచ్‌లో ఇద్దరికి మెమో ఇచ్చిందిట. పని సరిగ్గా చెయ్యట్లేదని ఒకరిని దూరం బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించిందిట” అన్నాడు మురళి.

“ఐదేళ్ళు ఆవిడ ఆఫీసులోనే పని చేసింది నా ఫ్రెండ్. ఆవిడ నవ్వగా ఒక్కసారి కూడా చూడలేదుట. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భాల్లో ఆడవారితో మాత్రమే ఆడించే మ్యూజికల్ చెయిర్స్ లాంటి ఆటల్లో కూడా ముభావంగా ఉంటుందిట” అన్నది సరోజ.

“నలుగురితో సరదాగా ఉండటం ఆవిడ హోదాకి భంగమేమో” అన్నది స్వప్న కొంచెం కినుకగా!

“మనమిన్ని మాట్లాడుకుంటున్నా.. ఈ రామారావు గారేంటి ఉలుకు.. పలుకు లేకుండా ‘బెల్లం కొట్టిన రాయి’ లాగాబాహ్య స్మృతే లేనట్టు ఒక్క మాటా మాట్లాడటలేదు” అన్నాడు ఆనంద్.

“హుష్ .. ఆయన వింటారు”.

“ఆయన.. ఆవిడ ఇంతకు ముందు ఒకే చోట కలిసి పని చేశారుట. ఆవిడేమో చక చకా పరీక్షలు పాసయి ప్రమోషన్లతో పెద్ద హోదాలోకి వెళ్ళిపోయింది. ఈయన మాత్రం ఏవో ఒకటి.. రెండు స్థాయిలు మాత్రమే ఎదిగారు” అన్నాడు మురళి రహస్యంగా.

***

ఆ ఆఫీసుకి కొత్త బాసుగా వస్తున్న రంజనిది మధ్యస్థంగా ఉండే పర్సనాలిటీ! చూడగానే ఆకట్టుకునే అందమేమీ కాదు. అలా అని అనాకారి కాదు.

తన వస్త్ర ధారణ.. హావభావాలతో చూపరులకి గౌరవంగా.. హుందాగా కనిపించే వ్యక్తి.

ముఖంలో ప్రశాంతత కనిపించినా రిజర్వ్డ్ అనే భావం కలిగిస్తుంది.

అందువల్ల ఎవరూ అతి చనువు తీసుకోలేరు.

నాలుగు రకాల మనుషులు.. అందులోను పురుషులు.. మధ్యలో ఏ వివాదాలు లేకుండా పని చెయ్యాలంటే ఆ మాత్రం హుందా.. బింకం అవసరమే అని నమ్ముతుంది.

***

ఆఫీసులో వాళ్ళందరు తన గురించి చేస్తున్న రకరకాల ఊహాగానాలు, వారి ముఖ కవళికలు, హావభావాలు, వ్యాఖ్యలు.. ఉదయం 8.30 కే వచ్చి దూరంగా కూర్చున్న రంజనికి వినిపిస్తూనే ఉన్నాయి.

‘తనని ఇక్కడివాళ్ళు ఇంతకు ముందు చూసి ఉండక పోవటం వల్ల తనని ఎవరూ గుర్తు పట్టలేదు. అందుకే ఆఫీసుకి సంబంధించిన అన్ని ముఖ్య విషయాలు.. స్టాఫ్ మనస్తత్వాలు.. ప్రవర్తన గమనించే అవకాశం దొరికింది’ అనుకుంది.

***

అప్పటికే కొత్త బాస్ గురించి చాలా సేపుగా మాట్లాడుకున్న ఉద్యోగులకి ఇక ఓపిక నశించి రామారావు గారి దగ్గరకి వచ్చి

“ఏంటి సర్.. ఆవిడ గారు ఈ రోజు రావట్లేదా? మేమందరం ఇంతగా వేచి చూస్తుంటే.. ఇంకా మా సహనాన్ని పరీక్షిస్తే ఎలా? రారంటే అలా క్యాంటీన్‌కి వెళ్ళి చాయన్నా తాగొస్తాం” అన్నాడు మురళి మిగిలిన వారికి లీడ్ తీసుకుంటూ

“మీరందరూ ఆమె గురించి మీ ఊహకొచ్చినంత మాట్లాడేశారు కదా! తినబోతూ రుచెందుకయ్యా. ఆవిడ ఎప్పుడో వచ్చారు. తన క్యాబిన్‌లో కూర్చున్నారు. వెళ్ళి కలిసి పరిచయం చేసుకోండి” అన్నారు రామారావు గారు.

టక్ చేసుకున్న షర్ట్‌తో టిప్ టాప్‌గా ఉన్న ఆనంద్, అలవాటు లేని పని చేస్తూ ఉగ్గబట్టుకున్న మురళి, ఎలా ఉంటుందో అని కుతూహలపడుతున్న సరోజ, ఆవిడేమైనా దేవతా అని నిరసనగా మాట్లాడిన స్వప్న.. ఒక్కొక్కరే లోపలికి వెళ్ళి రంజనిని చూసి.. అరే ఇందాకటి నించి దూరంగా కూర్చున్న వ్యక్తి ఈవిడే కదా, తెలియక ఏవేవో మాట్లాడేశాం. ‘తప్పుగా ఏమి అనలేదు కదా’ అని ఎవరికి వారే భుజాలు తడుముకోసాగారు. రంజనిని పలకరించి మొహాన నవ్వు పులుముకుని ఆవిడ క్యాబిన్ లోంచి బయటికొచ్చారు.

కాసేపు నోరు మూసుకుని వేచి చూస్తే సరిపోయేది. ఆవిడ అసలే స్ట్రిక్ట్ అన్నారు. మనమీద ఇప్పుడు క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటుందో ఏమో.

ఇందుకేనేమో ‘తినబోతూ రుచెందుకు’ అంటారు పెద్దలు.

తినబోయే ముందు రుచి తెలుసుకోవాలనుకోవటం తప్పు కాదు. బావుంటే మరి కాస్త తింటాం. ఎవరెంత చెప్పినా.. తినకుండా ఎవరికి వారికి రుచి తెలిసే అవకాశం ఉండదు.

ఎందుకంటే ‘లోకో భిన్న రుచి’ కదా!

మనకి కూడా ఆఫీసుల్లో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎటొచ్చీ నోరు కాస్త అదుపు చేసుకోవటం.. అనవసరపు వివాదాల్లోకి వెళ్ళకుండా కాపాడుకోవటం అవసరం.

ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here