సామెత కథల ఆమెత-7

0
2

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం

[dropcap]ఉ[/dropcap]ద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్న ప్రభాకర్ తన కూతురు లావణ్య చేత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ తన స్వరాష్ట్రమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా రాయించాడు.

అతనికి హైదరాబాద్‌లో బోలెడంత మంది బంధువులున్నారు. సీటంటూ వస్తే ఎవరో ఒకరికి దగ్గరగా పెట్టి చదివించ్చనుకున్నారు ప్రభాకర్ దంపతులు.

నాలుగేళ్ళ అమ్మాయి చదువు హైదరాబాద్‌లో ఇట్టే అయిపోతుందని ఆలోచించి.. అక్కడ కూడా ఎంట్రన్స్ రాయించారు.

“ఢిల్లీలో పుట్టి పెరిగిన అమ్మాయిలు దక్షిణ భారత దేశ సంస్కృతిలో ఇమడటం కష్టం ప్రభాకర్” అని వైజాగ్‌లో ఉండే ప్రభాకర్ అక్క గారు సుందరమ్మగారు హెచ్చరించింది.

“మా అమ్మాయ్ అంత ఫాస్ట్ ఏమి కాదులే అక్కా. మధ్య మధ్య లో మేము వచ్చి చూస్తూ ఉంటాం. నాలుగేళ్ళు ఎంతలోకి గడుస్తాయ్? మేం కూడా రిటైర్ అయ్యాక ఇక్కడొచ్చి ఉండేవాళ్ళమే కదా! అప్పటికి ఇక్కడి మనుషులు, పరిస్థితులు దానిక్కూడా అలవాటవుతాయి.”

“చదువయ్యాక ఉద్యోగం, పెళ్ళీ దేవుడి దయ వల్ల ఇక్కడే కుదిరితే దానిదీ, మాదీ జీవితాలు ఇక్కడే కుదుట పడతాయ్. అయినా సీట్ రానీ చూద్దాం” అన్నాడు ప్రభాకర్.

***

ప్రభాకర్ ఆశించినట్టు.. లావణ్యకి హైదరాబాద్‌లో కోరుకున్న బ్రాంచ్‌లో సీట్ దొరికింది.

ప్రభాకర్ పిన్ని కొడుకు వేణు హైదరాబాద్‌లో సెక్రెటేరియట్‌లో పని చేస్తాడు. మధ్యతరగతి కుటుంబమే అయినా అతని భార్య లక్ష్మి క్రమశిక్షణ కలిగిన, పద్ధతైన ఇల్లాలు. పిల్లలని స్వేచ్ఛ పేరుతో ఫ్రెండ్స్‌తో ఇష్టం వచ్చినట్టు తిరగనివ్వదు.

“సినిమాలు, షికార్లు, హోటళ్ళు అంటూ చదువు ఎగ్గొట్టి కాలక్షేపం చేస్తే.. ఆనక మీరే కష్టపడాలి. మాదేముంది.. ముందున్న జీవితమంతా మీదే” అంటుంది.

తను కూడా ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల పిల్లలకి ఇంట్లో పని సహాయం చెయ్యటం చిన్నప్పటి నించీ అలవాటు చేసింది.

వేణు కుటుంబం గురించి అందరూ మాట్లాడుకునే మాటలని బట్టి అక్కడైతే లావణ్య క్షేమంగా నాలుగేళ్ళ చదువు పూర్తి చెయ్యగలదు అనే నమ్మకంతో వేణుకి ఫోన్ చేశాడు.

“నాకు కానీ, లక్ష్మికి కానీ ఏ అభ్యంతరం లేదన్నయ్యా. కానీ ఈ కాలపు పిల్లలు బయట అంత తేలికగా అడ్జస్ట్ అవరు. పిల్లల జీవన శైలిలో చాలా తేడా ఉంటుంది. అలవాట్లల్లో తేడా గమనిస్తే లక్ష్మి ఊరుకోదు. బయటి పిల్లలైనా బాధ్యతగా హెచ్చరిస్తుంది. గబుక్కున తప్పు పట్టుకుంటావేమో అని ముందే చెబుతున్నాను” అన్నాడు.

“ఏమి ఫరవాలేదు. అచ్చంగా మీ ఇంట్లో పూర్తిగా ఏమి ఉండదు. వచ్చినప్పుడు ముందు మీ ఇంట్లో దిగుతుంది. దగ్గరలో ఆడపిల్లల హాస్టల్ ఉందేమో చూసి అక్కడికి మారుతుంది” అన్నాడు ప్రభాకర్.

***

ప్రభాకర్.. అతని భార్య విశాలి వచ్చి కూతురిని దింపి.. జాగ్రత్తలు చెప్పి, కావలసినవన్నీ కొనిచ్చి వేణు ఇంట్లో నాలుగు రోజులుండి వెళ్ళారు.

లావణ్య హైదరాబాద్‌లో ఇంజనీరింగులో చేరి నెల రోజులయింది. క్లాసులు మొదలయ్యాయి.

లావణ్య ఫ్రెండ్స్ నలుగురు.. వేణు ఇంటికి దగ్గరలో రూం తీసుకున్నారు. లావణ్య అక్కడికి షిఫ్ట్ అయింది.

శనివారం రాత్రి వచ్చి.. ఆదివారం ఉండి వెళుతూ ఉండేది. వచ్చినా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చునేదే కానీ చేతిలో పని అందుకునేది కాదు. వేణు కూతురు వింధ్య కుక్కర్ పెడుతున్నా.. కూరలు తరుగుతున్నా.. భోజనాలకి టేబుల్ సర్దుతున్నా లావణ్య తనకేం పట్టనట్టు హాలో సోఫాలో కూర్చునేది.

అంతకు ముందు వారం వచ్చినప్పుడు “మాకు నెక్స్ట్ సోమవారం సెలవు. మా కాలేజిలో ఫంక్షన్ ఉంది. నాకు షాపింగ్‌కి తోడొస్తావా ఆంటీ” అనడిగింది లక్ష్మిని.

“శనివారం నేను ఆఫీసు నించి వచ్చాక చూద్దాంలే!” అన్నది లక్ష్మి.

ఆ శనివారం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో వస్తానంటే “నాకు బయట పనుంది. వచ్చాక ఫోన్ చేస్తాను అప్పుడు రండి” అని చెప్పింది వాళ్ళకి.

అనుకున్న ప్రకారం లావణ్య శనివారం వేణు ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదో ఫోన్ కూడా చెయ్యలేదు. లక్ష్మి ఫోన్ చేస్తే జవాబు లేదు.

ఏదో పనుండి రాలేదేమో అని ఊరుకున్నారు వేణు.. లక్ష్మి.

“వేణూ.. లావణ్య మీ ఇంటికొచ్చిందా? ఫోన్ తియ్యట్లేదు. నిన్న రాత్రి.. ఇవ్వాళ్ళ పొద్దున కూడా సైలెంట్ మోడ్‌లో ఉంది. ఔట్ ఆఫ్ కవరేజి అనే మెసేజి వస్తోంది” అన్నాడు కంగారుగా ప్రభాకర్.

“నే వెళ్ళి చూసొస్తాలే అన్నయ్యా. మామూలుగా ప్రతి వారం వస్తుంది. అలా నిన్న రాకపోతే మేము కూడా ‘ఏదో పని ఉండి ఉంటుందిలే’ అని సరిపెట్టుకున్నాం. కంగారుపడకు. వదినని కూడా కంగారు పడద్దను” అన్నాడు వేణు.

వేణు లావణ్య ఉండే రూంకి వెళ్ళి అడిగితే.. “నిన్న సాయంత్రం అందరూ బయటికెళ్ళారు. రాత్రికి రాకపోతే బంధువుల ఇంటికి వెళ్ళారేమో అనుకున్నాం” అన్నారు ఆ ఇంటి వాళ్ళు.

“అందుకే స్టూడెంట్స్‌కి ఇల్లివ్వం అన్నాము. ఈ కాలపు పిల్లల పోకడ సరైన పద్ధతిలో ఉండట్లేదు. ఎక్కడికెళతారో.. ఎప్పుడెళతారో.. ఎప్పుడొస్తారో.. ఒక లెక్క ఉండదు. రాత్రి పొద్దుపోయే వరకు మేడ మీద కూర్చుని సెల్ ఫోన్లో కబుర్లు చెబుతూ ఉంటారు. మిమ్మల్ని ఈ కాలనీలో ఎప్పటి నించో చూస్తున్నాం అని ఇల్లివ్వటానికి ఒప్పుకున్నాను “ అన్నది ఇంటి ఓనర్ పెద్దావిడ.

“ఏరా.. లావణ్య వచ్చిందా” అనడిగాడు అరగంట తరువాత ఫోన్ చేసి.

“లేదన్నయ్యా.. తను ఉండే ఇంటికి వెళ్ళి అడిగి వచ్చాను. నిన్న సాయంత్రమే దాని ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళారుట. ఇంకా రాలేదు అని చెప్పింది ఆవిడ” అన్నాడు.

ఆదివారం అంతా లావణ్య గురించిన ఆచూకి కంగారే సరిపోయింది వేణుకి.. లక్ష్మికి. ‘పోలీసి కంప్లెయింట్ ఇస్తే అన్నయ్య ఏమనుకుంటాడో.. ఆడపిల్ల అనవసరంగా నలుగురి నోళ్ళల్లో పడుతుందేమో.. ఇవ్వకపోతే ఏదయినా జరగరానిది జరిగితే మనమే బాధపడాలి’ అని పరి పరి విధాల ఆలోచిస్తున్న వేణు దంపతులకి తిండి-నిద్ర లేదు.

సోమవారం సాయంత్రం ఏమీ జరగనట్టు ఫోన్ చేసి “సారీ అంకుల్.. శనివారం రావటం కుదరలేదు. ఆంటీ నా కోసం ఎదురు చూసిందేమో కదా” అని “అమ్మా నాన్నలతో కూడా ఇప్పుడే మాట్లాడాను” అని ఇంకొక మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది.

అది మొదలు అప్పుడప్పుడు ఇలా శని ఆదివారాలు ఫ్రెండ్స్‌తో బయట గడపటం.. ఎక్కడికెళ్ళిందో చెప్పకపోవటం లావణ్యకి అలవాటు కింద మారింది.

“అన్నయ్యకి ఇవన్నీ తెలుసో.. తెలియదో? ఒక వేళ అతనికి తెలియకపోతే చెప్పకపోవటం లోకల్ గార్డియన్‌గా తన తప్పేమో” అని వేణు మథనపడసాగాడు.

ఒక ఆదివారం హఠాత్తుగా మధ్యాహ్నం టైంలో ప్రభాకర్ ఊడిపడ్డాడు.

అప్పటివరకు ఏమి జరగనట్టు మామూలుగా తమ్ముడు.. మరదలితో మాట్లాడాడు. ప్రభాకర్ వస్తున్నట్టు ముందే తెలిసినట్టు లావణ్య కూడా వేణు ఇంటికి భోజనానికి వచ్చింది. భోజనాలయ్యాక తండ్రి కూతురు బయటికెళ్ళి వచ్చారు.

ప్రభాకర్ ఆ రాత్రికి ఉన్నాడు. మరునాడు కాలేజికి త్వరగా వెళ్ళాలని లావణ్య తన రూంకి వెళ్ళిపోయింది.

“లావణ్యకి క్లాసెస్.. ప్రాజెక్ట్స్ వల్ల పని ఒత్తిడి ఉంటోంది. శని ఆదివారాల్లో ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కూర్చుని పని చూసుకుంటున్నారు. అందుచేత అదివరకు లాగా అన్ని వీకెండ్స్ రాలేదు. రాదల్చుకున్నప్పుడు ముందుగా ఫోన్ చేస్తానంది” అన్నాడు నిద్రకి ఉపక్రమిస్తూ.

***

“ఆంటీ రెండు కూరలు, సాంబారు, చట్నీ చేసిస్తే మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడే రైస్ కుక్కర్‌లో అన్నం వండుకుని తింటాం” అని ఫోన్ చేసింది లావణ్య ప్రభాకర్ వచ్చి వెళ్ళిన పది రోజుల తరువాత.

అలా మధ్య మధ్యలో లక్ష్మి చేత పదార్థాలు చేయించుకు తీసుకెళ్ళటం తప్ప ఆ మూడేళ్ళు వీకెండ్స్‌కి రావటం మానేసింది.

చదువైపోగానే “అక్కడే ఉద్యోగానికి ట్రై చేస్తాను అంకుల్” అని చెప్పిఢిల్లీ వెళ్ళిపోయింది.

ఆ తరువాత ప్రభాకర్ మళ్ళీ ఫోనూ చెయ్యలేదు.. హైదరాబాదు రానూ రాలేదు.

***

వేణు బావమరిదికి ఉన్నట్టుండి వాంతులవటం.. అందులో రక్తం పడటం జరుగుతోందని తెనాలి నించి హైదరాబాద్ తీసుకొచ్చారు.

తనకి తెలిసిన డాక్టర్స్‌కి చూపించాడు వేణు. ఇదమిత్థంగా సమస్య ఇదీ అని చెప్పలేకపోయారు. ఆ టెస్టులనీ.. ఈ టెస్టులనీ వాళ్ళు రాసిన లిస్టు చూసి..

వేణు ఆఫీస్ కొలీగ్ “వేణు గారూ.. ఢిల్లీలో ఎయిమ్స్‌లో మంచి డాక్టర్స్ ఉన్నారు. మీ బావమరిది వయసు కూడా చిన్నది. పాపం పిల్లలున్నారు. మా బంధువే అక్కడ డాక్టర్. ఆయన చూసి కరెక్ట్ ట్రీట్‌మెంట్ చెబుతాడు” అని చెప్పి వేణుని ఢిల్లీ బయలుదేరదీశాడు.

ఢిల్లీ లాంటి కొత్త చోట ఒకరికొకరు తోడుగా ఉండటం అవసరమని బావమరిది భార్య పద్మని పిల్లలకి తోడుగా ఉంచి లక్ష్మిని కూడా బయలుదేరదీశాడు వేణు.

“అన్నయ్యా.. నేను, లక్ష్మి, మా బావమరిది రేపు మధ్యాహ్నం ఫ్లైట్‌లో ఢిల్లీ వస్తున్నాం. అతనికి ఆరోగ్యం బాగాలేదు. తెలిసిన వాళ్ళు ఎయిమ్స్‌లో ఉన్నారు. ఆయనకి చూపించాలి” అన్నాడు వేణు.. ప్రభాకర్‌కి ఫోన్ చేసి.

“నేను ఇవ్వాళ ఆఫీసు పని మీద బయట ఊరికి ఇనస్పెక్షన్‌కి వెళుతున్నాను. వచ్చేసరికి రెండు రోజులవుతుంది. మీ వదినకి చెబుతాను. తను మీకు ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఎయిర్‌పోర్ట్ నించి మీరు వచ్చెయ్యగలరు కదా! ఎడ్రెస్ వాట్సాప్‌లో పెడతాను. నేను తిరిగొచ్చాక కలుద్దాం” అన్నాడు ప్రభాకర్.

జూలై-ఆగస్టులు వచ్చినా ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు. ఒంటిగంటకి ఫ్లైట్ దిగిన వేణు వాళ్ళకి ఢిల్లీ ట్రాఫిక్‌లో వెతుక్కుంటూ ఇల్లు చేరేసరికి నాలుగయింది. ఆకలి, దాహం, ప్రయాణపు అలసటతో ముగ్గురూ బాగా డీలా పడిపోయారు.

తీరా ప్రభాకర్ ఇంటి ముందుకి వెళ్ళి తలుపు కొడితే పక్కింట్లో నించి ఒకమ్మాయి వచ్చి కీస్ ఇచ్చి.. “విశాలి ఆంటీ ఆఫీస్ కు గయీ. ఆప్కో చాబీ దేనే కే లియా బోలీ. అందర్ జాకే బైఠియే. మై పానీ లాకే దేతీ హుఁ” అని లోపలికెళ్ళింది.

వేణు వాళ్ళకి విపరీతమైన నిస్పృహ వచ్చింది. వదిన గారి ఈ విధమైన రిసెప్షన్‌కి వాళ్ళ ఆకలి ఎప్పుడో చచ్చిపోయింది.

లోపలికెళ్ళి చెప్పులు విప్పి.. ముగ్గురూ మొహాలు చల్లటి నీటితో కడుక్కుని డ్రాయింగ్ రూంలో సోఫాల్లో జారిగిల పడ్డారు. దారిలో ప్రభాకర్ వాళ్ళ కోసం అని కొన్న పళ్ళే తిని పక్కింటి అమ్మాయి ఇచ్చిన మంచి నీళ్ళు తాగారు.

ఇంకో రెండు గంటల తరువాత ఆఫీసు నించి వచ్చిన విశాలి “మీరొచ్చి ఎంత సేపయింది? అన్నాలు తిన్నారా” అని “టీ పెడతాను” అంటూ వంటింట్లోకి దారి తీసింది.

“ఇక్కడ మేము ఎక్కువగా చపాతీలే తింటాం. అన్నం తినటం తక్కువ. పొద్దుటే రెండు పూటలకి కూర చేసేస్తాను. వేడి చేసేస్తాను. స్నానాలు చెయ్యండి భోజనం చేద్దాం” అన్నది.

చపాతీలు అలవాటు లేని వేణు బావమరిది.. విశాలి వేడి చేసిన పొద్దుటి కూరతో భోజనం చెయ్యలేక యాతన పడి అర్ధాకలితో పడుకున్నాడు. ఒక పక్క అనారోగ్య సమస్య.. మరో పక్క ఆకలి, అలసట.. నిద్ర పట్టలేదు.

“తప్పు చేశామేమోనండి. హైదరాబాద్ లోనే మనకి తెలిసిన డాక్టర్‌కి చూపించి ఉంటే సరిపోయింది. ఈవిడ వాలకం చూస్తే.. రేపు కూడా మన తిప్పలు మనని పడమని.. నాలుగు చపాతీలు చేసి పెట్టి ఆఫీసుకి వెళ్ళిపోతే.. తిండి లేక మా అన్నయ్యతో పాటు మనమూ పేషెంట్స్ అవుతాం. మనకి ఊరు కొత్త.”

“ఇంట్లో అసలు బియ్యం ఉన్నాయో లేదో తెలియదు. ఈవిడ గారి నిర్లక్ష్యం చూస్తే మనం గతి లేక వీళ్ళింటికొచ్చి ట్రీట్‌మెంట్ అయ్యే వరకు నెలల తరబడి ఉంటామనుకుంటుందేమో! నాకు భయమేస్తోంది. రేపు హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకున్నాక.. ఏదయినా సౌత్ ఇండియన్ హోటల్‌కి వెళ్ళి భోజనం చేసి వద్దాం.”

“వాళ్ళ అమ్మాయిని మన దగ్గర పెట్టినప్పుడు మనం ఇలాగే చేశామా?”

“ఆ అమ్మాయి నాలుగేళ్ళు ప్రతి వారం దబాయించి మరీ వంటలు చేయించు కెళ్ళింది కదండీ”

“మా అమ్మ మొదటి నించీ చెబుతూనే ఉంది ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ ఇలాంటి బంధువులని అసలు దగ్గరకి చేర్చుకోకూడదు అని. మనమే అక్కరలేని మంచితనాలకి పోయాం” అని వాళ్ళ తరువాతి ప్రోగ్రాంని నిర్ణయించేసింది.

“ఏమీ కంగారు పడకండి. పేగుల్లో చిన్న కణితి లాగా కనిపిస్తోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఉద్దేశంతో మా వాడు మిమ్మల్ని ఇంతదూరం పంపించాడు.”

“అది పెరగచ్చు.. పెరగక పోవచ్చు. ముందు మందులతో ప్రయత్నిద్దాం. తగ్గకపోతే సర్జరీకి వెళ్ళచ్చు. నా స్టూడెంటే ఏఐజిలో ఉన్నాడు. అతన్ని కలవండి” అని డాక్టర్ చెప్పాక ధైర్యం వచ్చింది అందరికీ.

తేలిక పడిన మనసుతో సౌత్ ఇండియా హోటల్‌కి వెళ్ళి భోజనం చేసి.. రాత్రికి అన్నం ప్యాక్ చేయించి తెచ్చుకున్నారు.

“వదినా రేపు మధ్యాహ్నం ఫ్లైట్‌కి టికెట్స్ దొరికాయి. మేము ఉదయమే బయలుదేరుతాం. అన్నయ్య వచ్చాక చెప్పు. మేము బయలుదేరేటప్పుడు తలుపు లాగేసి వెళతాం” అన్నాడు.. ఉదయమే ఆఫీసుకి బయలుదేరిన విశాలితో.

‘వెళ్ళిపోతాం’ అని వేణు చెప్పిన మాటతో విశాలి మొహంలో కనిపించిన రిలీఫ్ లక్ష్మి దృష్టిని దాటిపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here