సాంగత్య ఫలం

0
2

[dropcap]మ[/dropcap]నం చేసే సాంగత్యమే మన ఉన్నతికి దుస్థితికి కారణమౌతుంది అన్నది శాస్త్ర వాక్యం. ఈ ప్రపంచంలో సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం అని రెండు రకాలు. కలి ప్రభావం వలన లోకంలో సజ్జనులు తక్కువగాను, దుర్జనులు ఎక్కువగాను ఉంటున్నారు. సజ్జన సాంగత్యం చేయాలని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. దుర్జనుల వల్ల సమాజానికి భయోత్పాతాలు ఏర్పడితే సజ్జనుల వల్ల సమాజాభివృద్ధి కలుగుతుంది.

‘సజ్జన సాంగత్యం’ అంటే ‘సత్యం తెలుసుకున్న జనులతో కలవడం’, ‘సజ్జన సాంగత్యం’ అంటే జ్ఞానుల ద్వారా సత్య ప్రవచనాలు వినడం, ‘సజ్జన సాంగత్యం’ అంటే యోగుల ద్వారా ధ్యానానుభవాలు వినడం అని శాస్త్రం నిర్వచించింది. ఈ లోకంలో అడుగు పెట్టామంటే అప్రమేయంగా అనేక బంధాలకు బందీ అయినట్లే అని తెలుసుకోవాలి. మనలను సక్రమ మార్గం వైపు నడిపే శక్తి కేవలం సజ్జనులకే ఉంటుంది. ఒక మనిషి సజ్జనుడుగా పేరు ప్రతిష్ఠలు గడించినా, దుర్జనుడిగా అపకీర్తి పాలైనా అది సాంగత్యం వలననే సాధ్యం. “ఎంత దుష్ట సంస్కారాలు గలవాడైనా సాధు సాంగత్యం చేత వృద్ధిలోకి వస్తాడు. అత్తరు దుకాణంలోకి పోతే ఆ వాసన నీకు ఇష్టం లేకపోయినా నీ ముక్కుకు సోకుతుంది” అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస.

మానవులలో దానవ మానవ గుణాలు రెండు నిక్షిప్తమై వుంటాయి. సమయం సందర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది అని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.. దుర్జనులతో సాంగత్యం చేస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులు చేస్తాం. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలు తగ్గించి సాత్విక భావాలు పెంచుతుంది.

మానవుడు ఎంత మంచి వాడైనా, తనలో ఎన్నో సద్గుణాలు వున్నా, ఎన్ని శాస్త్రాలు చదివి అంతులేని విజ్ఞానాన్ని పోది చేసుకున్నా, ఒక దుర్మార్గుడితో సహవాసం చేస్తే , స్వచ్ఛమైన పాలను ఒక విషపు చుక్క విషమయం చేసినట్లు, అతడి సద్గుణాలు అన్నీ నాశనమైపోయి, చివరకు దుర్జనుడిగానే గుర్తింపబడతాడనడానికి మహా భారతంలో కర్ణుడి ఇతివృత్తమే మంచి ఉదాహరణ. పుట్టుకతో చెడ్డవాడు కాని కర్ణుడు కుంతీదేవి, సూర్య భగవానుల సంతానం. సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు, అన్ని శస్త్ర విద్యలలో ఆరితేరాడు. శిబి చక్రవర్తి తర్వాత దాన గుణంలో కర్ణుడినే పేర్కొంటారు. తన ప్రాణం పోతుందని తెలిసినా, ఇంద్రుడు అడిగాడు కాబట్టి తన కవచ కుండలాలను దానంగా ఇచ్చిన కర్ణుడిది స్వతహాగా  గొప్ప వ్యక్తిత్వం. అయితే పరిస్థితుల ప్రభావం వలన పరమ నీచుడైన ధుర్యోధనుడితో స్నేహం చేసి అతని మెప్పు కోసం అని చెడ్డ పనులనే చేస్తూ వచ్చాడు. అంతిమంగా యుద్ధభూమిలో దారుణంగా మరణించాడు. కేవలం నీచుడితో సహవాసం చేసిన కారణంగా కర్ణుడి వ్యక్తిత్వం మసకబారిపోయింది. చరిత్రలో ఒక చెడ్డ వ్యక్తిగా మిగిలిపోయాడు. సజ్జనులతో సహవాసం చేస్తే పూలదండను ధరిస్తే ఆ పరిమళం మనకు అంటినట్లు వారి మంచి గుణాలలో కొన్నయినా మనకు అబ్బుతాయి. అదే సారూప్యత దుర్జన సాంగత్యానికి కూడా వర్తిస్తుంది. అవతలి వారి వ్యక్తిత్వం బట్టే మనకు చీత్కారాలైనా, గౌరవ మర్యాదలైనా దక్కుతాయి.

సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం మనపై చూపించే ప్రభావానికి శాస్త్రంలో ఒక మంచి ఉదాహరణ వుంది.  పూలదండ ఒక్కటే. అయితే దానినే దేవుని ఆరాధనలోను, మనిషి పార్థివ శరీర అలంకరణ లోనూ వాడతారు. దేవుని అలంకరించిన పూలదండ నుండి ఒక్క పుష్పం లభించినా దానిని ఎంతో పవిత్రంగా కళ్ళకు అద్దుకొని తలలో కాని చెవిలో గాని పెట్టుకుంటాము. అదే పార్థివ శరీరంపై వేసిన పూలదండను చూసి ఏవగించుకుంటాము. తాకితే వెంటనే స్నానం చేసి మైల తొలగించుకుంటాము. ఆ పూలదండ తనంతట తనుగా ఏ పుణ్యం, పాపం చేయలేదు. కేవలం భగవంతుని పాదాలకు చేరితే బోల్దంత గౌరవం అందుకుంది. అదే శవంపై పడితే చీత్కారాన్ని పొందింది.

మంచి సహవాసం బుద్ధి మాంద్యం తొలగిస్తుంది. నిర్భీతిగా మన చేత నిజాన్ని పలికిస్తుంది. పాపాన్ని పోగొడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తెచ్చి పెట్టి మన కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది. అందుకే ఆచితూచి స్నేహం చేయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here