Site icon Sanchika

సాఫల్యం-10

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఐ[/dropcap]దుగంటలకల్లా హైదరాబాదు నగరంలోకి ప్రవేశించింది లారీ. “ఎక్కడ దిగాల నువ్వు” అనడగితే, “నయాపూల్‌ బ్రిడ్జిదాటింతర్వాత సైడు కాపు” అన్నాడు.

పావుగంట తర్వాత అట్లే ఆపాడు. అక్కడ హమాలీలు, ట్రాలీ రిక్షాలు ఉన్నాయి.

ఇద్దరు వచ్చి అడిగారు లారీ దిగిన పతంజలిని.

 “కాంజానా?” అంటూ. “సిద్ధియంబర్‌ బాజార్మే, రాజ్‌ధాని హోటల్‌ హైనా, ఉస్‌ కీ పీ ఛే అహ్మద్‌ షరీఫ్‌ కే మండీ కు జానా” అన్నాడు. ఐదారుసార్లు హుబ్లీ వెళ్లి రావడం వల్ల హిందీ కొంచెం పట్టుబడిరది.

“చలో ఉతా రేంగే” అంటూ వెళుతుంటే

“క్యాదేనా! చాలీస్‌ పర్‌ తీన్‌ థైలియాహై. నీంబుకా” అన్నాడు.

“క్యాదేనేకే జరూరత్ నహీ! హమ్‌కు, రిక్షావాలోంకీ భీ, షరీఫ్‌ సాబ్‌ దేతే” అన్నారు వాళ్లు. “హుబ్లీలోలాగే” అనుకున్నాడు.

సంచులన్నీ దించారు. నలభైమూడు లెక్కపెట్టుకున్నాడు. దిగి చూస్తున్న ఓబులేసుకు వందరూపాయల నోటిచ్చాడు. చిల్లర పదిరూపాయలు, ఒక ఐదు రూపాయల నోటు తిరిగియిచ్చాడు. రూపాయి నాణెం ఇవ్వబోతుంటే, ‘చొచ్చొచ్చొ వద్దు సామీ నీ దగ్గర తీసుకున్నదే శాన. పోయొస్తామల్ల” అని చెప్పి పతంజలికి నమస్కారం చేసి వెళ్లిపోయాడు ఓబులేసు.

మొత్తం 3 రిక్షాలకెత్తారు బస్తాలు. హమాలీ ఒకడు పతంజలిని తన సైకిలు వెనుక సీటుమీద కూర్చోబెట్టుకున్నాడు. పదినిమిషాల్లో మండీ చేరుకున్నాడు.

షరీఫ్ మండీ చాలా పెద్దది. ఏకాండంగా ఒకేహాలు. గోడకానించి పెద్ద అరుగు. దానిమీద పరుపులు పరిచి, ఆనుకోడానికి పెద్ద పెద్ద దిండ్లు. కూర్చొని రాసుకోడానికి బల్లలు. పతంజలి తెచ్చిన సరుకంతా గ్రేడ్‌ల వారీగా ఒకచోట చేర్చారు. ఒకాయన అంత పొద్దున్నే ఒక బల్ల దగ్గర ఒక రిజిష్టరులో వచ్చిన సరుకు వివరాలు రాసుకుంటున్నాడు. ఒక హమాలీ పతంజలిని తీసుకుని ఆయన వద్దకు వెళ్లి బస్తాల వివరాలు రాయించాడు. ఇంకా ట్రాలీ రిక్షాలు వస్తున్నాయి. ఈలోగా ఒక లారి వచ్చి ఆగింది.

“అప్‌ దస్‌ బజే ఆయియే” అన్నాడతడు.

లారీలోంచి ముగ్గురు నలుగురు దిగుతున్నారు. వారిలో నాయుడిని గుర్తించి గబగబా అక్కడికి వెళ్లాడు పతంజలి.

“సామీ! వచ్చినావా! ఇట్ట జాబు రాసినా అట్ట వచ్చేస్తివే. నీ దెబ్బగాల” అన్నాడు నాయుడు. పతంజలి అభిమానంగా నాయుడి చేయిపట్టుకున్నాడు. “బాగున్నావా?” అని అడిగాడు.

“నాకేం ఇనప తుంట మాదిరుండ్ల్యా” అన్నాడు నాయుడు నవ్వుతూ. “మేం సరుకు దింపిచొచ్చాంగానీ, నీవు బోయి పక్క సందులోనే లాడ్జీ ఉండాది ఆడ నాలుగు మడతమంచాలు దీస్కుని ఉండుపో. పక్కనేలే. దాని పేరు… ఏందబ్బా… మతికిరాదు దానెమ్మ… ఆ ఇంపీరియల్‌ లాడ్జికదూ” అన్నాడు “అదే, అదే” అన్నాడు పక్కనున్నాయన.

బ్యాగ్‌ తీసుకొని లాడ్జి వెతుక్కుంటూ వెళ్లాడు పతంజలి. కనపడింది. రూములు కూడ ఉన్నాయి. మళ్లీ సాయంత్రానికి బయలుదేరాలి. కాబట్టి మడతమంచాలు చాలనుకున్నాడు. రిసెప్షన్‌లో అడిగాడు.

“నాలుగు మంచాలు కావాలి” అని

“ఎంత సేపుంటారు?”

“సాయంత్రం వరకు”

“పైకి వెళ్లండి. అక్కడ మా మనిషి ఉంటాడు”

పైకి వెళ్లాడు మెట్లెక్కి. అక్కడ ఒక యువకుడున్నాడు. విషయం విని “చార్‌ ఏకీ జగా నైమిల్‌తే” అన్నాడు. ‘సరే’ అన్నాడు పతంజలి.

“బారా గంటే కేలియే సాడేరూపయే హోతా!” అన్నాడు. “పాంచ్‌రూపయే అడ్మాన్స్‌ దీజియే” అని డబ్బు తీసుకున్నాడు. మంచాలు చూపించాడు. కొందరింకా నిద్రపోతున్నారు. అంత నీట్‌గా లేదు. ఏదో ముక్క వాసన వేస్తూంది. బ్యాగ్‌ మంచంమీద పెట్టుకొని హాలు వెనక ఉన్న బాత్‌రూంకెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. బాత్‌రూంలో బకెట్‌, మగ్‌ పాకుడు పట్టి ఉన్నాయి. కొళాయిల గొట్టం తుప్పు పట్టి ఉంది.

లారీలో పంచెతోనే వచ్చాడు. ప్యాంటు, షర్టు మార్చుకున్నాడు. అవి చిత్తూరులో రామ్మూర్తి బావ కొనిచ్చినవి. గోడకున్న అద్దంలో తల దువ్వుకొని నాయుడు వాళ్లు వచ్చేంతవరకు నడుం వాల్చాడు సంచి తలక్రింద పెట్టుకొని.

గట్టిగా నాయుడి గొంతు వినపడితే లేచి కూర్చున్నాడు పతంజలి. లాడ్జి కుర్రాడు తన వైపు చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. నాయుడు తన వాళ్లతో వచ్చి, ‘మంచాలు తీసుకొన్నావే. ఉండు ముకం కడుక్కుని తానం జేసివచ్చాం” అని బ్యాగులు అవే చేతి సంచులు తమతమ మంచాలమీద పెట్టి బాత్‌రూంల వైపు వెళ్లారు. ఇరవై నిమిషాలలో తిరిగి వచ్చారు.

“ఇంకేం సామీ! ఇసేసాలు!” అన్నాడు నాయుడు.

“నిన్ను కలవడమే విశేషం” అన్నాడు పతంజలి.

“ఈడ ఉబ్లీలో మాదిరుండదు. షరీఫ్‌ మండీకి వస్తే ఇదే గతి” అన్నాడు.

“మరీ గబ్బుగబ్బుగుండ్ల్యా” అన్నాడొకాయన.

“నీవిచ్చే రూపాయిన్నరకు రిడ్జ్‌ ఓటలొచ్చాదా?” అన్నాడు యింకో ఆయన. అందరూ నవ్వుకున్నారు. “పాండి టిపిన్‌ జేచ్చాం” అంటూ మెయిన్‌ రోడ్‌ మీదికొచ్చారు. ఒకటి రెండు ఇరాని హోటళ్లు కనపడ్డాయి. కెఫ్‌ భక్తియార్‌, గౌస్ పీర్, ఇలా ఉన్నాయి పేర్లు. “ఈడ బన్నులు, సమోసాలు టీ తప్ప ఏంవుండవు” అన్నాడు అలా నడుచుకుంటూ ‘విక్రాంతి’ ధియేటరు వరకు వస్తే ఒక హోటలు కనపడింది. ‘ఉడిపి శ్రీనివాస భవన్‌’. అమ్మయ్య అనుకున్నారు. అందరూ వెళ్లి కూర్చున్నారు.

ఇడ్లీ సాంబారు తెప్పించుకున్నారు. ఫర్వాలేదు. తర్వాత పూరీ తిన్నారు. అందులో మైదా కలిపారేమో తుంచితే తునగకుండా ఎలాస్టిక్‌లా సాగుతూంది. కూర మరీ పలుచగా ఉంది పూరీకందటంలేదు.

“ఈడ టీ బాగుండదు గాని సాయబులు ఓటల్లో తాగుదాం రాండి!” అన్నాడు నాయుడు. ఎవరి బిల్లు వాళ్లకిమ్మన్నారు.

“రాజదాని హోటల్లో బాగుంటాదిగాని మిడిమ్యాలెందరలు” అన్నాడొకాయన ఇరానీ హోటల్లో చాయ్‌ తాగి మండీకి వెళ్లారు.

రైతులా కాకుండా ప్యాంటు, టీషర్టుతో స్టూడెంట్‌ మాదిరి ఉన్న తనను మిగతావాళ్లు ఒక రకంగా చూడటం గమనించాడు పతంజలి. నాయుడు అతని గురించి చెప్పాడు.

“ఈమధ్యే మద్రాసు ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసినా” అన్నాడు పతంజలి.

“పులిపిల్ల మాసామి. నిమ్మతోటలోనే సదువుకున్నాడు సూడండి” అని వాళ్లతో చెప్పి, “నీ మీద నాకు బో కోపంగుండాది పో” అన్నాడు నాయుడు.

“ఏం చేసాను” అన్నాడు పతంజలి.

“మద్రాసుకువచ్చి కోడూర్లో దిగకుండా బోయినావు సూడు. అదే నీవు జేసిన తప్పు” అన్నాడు నాయుడు.

“ఈసారి తప్పకుండా వస్తా” అని నాయుడిని శాంతింపజేశాడు.

అందరూ మండీలో కూర్చున్నారు. చాలా సరుకు వచ్చింది. పదిన్నరకు షరీఫ్‌ మహాశయుడు విచ్చేశాడు. ధర బాగా పడిపోయింది. పెద్ద రకమే అరవై దాటలేదు. సరుకంతా అమ్మేటప్పటికి రెండయింది. ఒక చీటీ మీద లెక్కవేసిచ్చారు. నలభైమూడు బస్తాలకు వెయ్యిరూపాయలు కూడ రాలేదు. చాలా నిరుత్సాహం అనిపించింది పతంజలికి. “తూ దీ నెమ్మ యాపారం” అంటూ తిట్టుకున్నాడు నాయుడు. “ఇంతకంటె సెడిపోయేదేమీ లేదుగాని పాండి రాజధాని ఓటలు కెళదాం. కనీసం తిండన్నా మంచిది తిందాం” అన్నాడు. డబ్బు సాయంత్రం ఐదు గంటలకిస్తారు.

“రాజధాని’లో భోజనం చాలా బాగుంది. ఎ.సి రెస్టారెంట్‌ కానీ ఆరు రూపాయలు. చాలా ఎక్కువనిపించింది. కానీ భోజనం క్వాలిటీ బాగుంది. స్వీటు, పాన్‌, అరటిపండు కూడ యిచ్చారు. భోజనం తర్వాత లాడ్జికి వెళ్లి కాసేపు పడుకున్నారు.

ఐదు గంటలకల్లా మండీ చేరుకుని డబ్బు తీసుకుని భద్రపరచుకున్నారు. ఏడు గంటలకు అఫ్జల్ గంజ్‌కు వెళ్లారు. నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతం నుండి జొన్న చొప్ప ఫిల్ప్ లారీలు వచ్చింటాయట సిటీకి. అవి కడపవరకు వెళతాయట. దాంట్లో ఐతే ఐదు రూపాయలకు కర్నూల్లో దింపుతాడట. కడపకైతే పది.

కష్ట సుఖాలు చెప్పుకున్నారు. బావుల్లో నీళ్లు చాలడం లేదని, కూలీల రేట్లు బాగా పెరిగాయనీ, గిట్టుబాటు కావడం లేదని బాధపడ్డారు. ఇంతలో చొప్ప ఫిల్ప్ లారీ వచ్చింది. “కర్నూల్‌, కడప” అంటూ కేక వేశాడు క్లీనరు, క్యాబిన్‌లో నుంచి వీళ్లు వెళ్లి అడిగితే ‘వెనకెక్కండి’ అన్నాడు.

“మా సామి మాత్రం క్యాబిన్‌లో వస్తాడు సదువుకున్నాయన ఎనక కూర్చోబెడితే బాగుండదు” అన్నాడు నాయుడు.

“రాండి” అని పతంజలిని క్యాబిన్‌లోకి ఆహ్వానించాడు క్లీనర్‌.

పదిగంటలకు జడ్‌చర్లలో టిఫిన్‌ చేశారు. రోడ్డు పక్క హోటల్లో ‘పరోట’ బాగానే ఉంది. రెండుగంటలకు కర్నూల్లో దింపాడు. నాయుడు వాళ్లు వెనక బాడీలో నిద్రలో ఉన్నారు. డిస్టర్బ్‌ చేయడమెందుకని వెళ్లిపోతూంటే లారీలోంచి “ఏంది సామీ! సెప్పకుండా ఎల్లిపోతాండావే” అని నాయుడి అరుపు వినపడింది.

“అదేంలేదు. నిద్రలో ఉంటారు కదా అని”

“నీకంటే నిద్ర ఎక్కువయితాదా! బలేటోనివే” అంటూ లారీ దిగి, పతంజలి దగ్గరకొచ్చి అభిమానంగా చేయందుకున్నాడు.

“తెల్లవారేంతవరకు బస్టాండులోనే ఉండు. మేం పోయొచ్చాం. సదువు మాత్రం నిలబడిపోనీగాకు. మాకంటే ఇది తప్ప గతిలేదు. నీవు బాగా సదివి మంచుజ్జోగం సెయ్యాల. ఆ” అని చెప్పి లారీ ఎక్కి వెళ్లిపోయాడు. సరిగ్గా ఇదే మాట కొంచెం తేడాతో రామ్మూర్తి బావ కూడ అన్నాడు తాను చిత్తూరునుండి వస్తూంటే.

బస్టాండుకు వెళ్లాడు. ఎక్కడా కూర్చోడానికి కూడ జాగాలేదు. రాత్రంతా పనిచేసే ఒక టీకొట్టు దగ్గర బెంచీ ఉంటే దాని మీద కూర్చుని గడిపాడు. తెల్లవారే వరకు. మధ్యలో రెండు టీలు తాగాడు. ఐదు గంటలకు అనంతపురం ఫస్టు బస్‌ ఎక్కి ఆరు కల్లా వెల్దుర్తిలో దిగాడు. డబ్బు తండ్రికిచ్చి చెప్పాడు. “ధర బాగా పడిపోయింది నాన్నా” అని. తండ్రి ముఖంలో దిగులు కనపడిరది.

వెళ్లి పడుకున్నాడు. బాగా అలసిపోయాడేమో ఉదయం పదిగంటల వరకు ఒకటే నిద్ర.

లేచి స్నానం, సంధ్య భోజనం ముగించుకొని తోటకు వెళ్లాడు. మిరపచేనుకు ఈ రెండు రోజుల్లో ముడత తెగులు సోకింది. తోకోడికి చెప్పి, ‘గెమాక్సిన్‌’ తెచ్చుకొని కొట్టమన్నాడు. ఇంజను రూం వద్దకు వెళ్లాడు. ఎప్పటిదో పాతకాలం 5 హెచ్‌పి మోటరు. పెద్దగా సౌండ్‌ చేస్తూంది. బేరింగులు అరిగిపోయాయన్నాడు మెకానిక్‌. స్టార్టరు కూడ మార్చాలి. కరెంటు పోతే అదంతట అది ఆగిపోయే “కిల్‌ బర్న్‌” స్టార్టర్లు వచ్చాయి. కొనాలంటే ఏడెనిమిది వందలవుతుంది. ఇంజను రూములోంచి బావిలోకి తొంగి చూశాడు. నీటి ఊట రాను రాను తగ్గిపోతూ ఉంది.

సాయంత్రం ఇంటికి వెళ్లాడు పతంజలి. బొరుగులు ఉప్పుకారం కలిపి యిచ్చిందమ్మ. ఈవెనింగ్‌ స్నాక్స్‌ అన్నమాట.

సాయం సంధ్య వార్చుకున్న తర్వాత, పడసాలలో ఉన్న తండ్రి పిలిచాడు. “బ్యాంకుకు వెళ్లి, పట్టుపురుగుల పెంపకానికిచ్చే సబ్సిడీ సంగతి కనుక్కోకూడదూ” అన్నాడాయన.

“రేపే వెళతాను నాన్నా!” అన్నాడు.

మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకల్లా భోజనం చేసి బ్యాంకుకు వెళ్లాడు పతంజలి. స్టేట్‌ బ్యాంకు. స్టాఫ్‌ అందరూ కర్నూలు నుంచి రోజూ వచ్చిపోయేవారే. మేనేజరు క్యాబిన్‌లోకి వెళ్లబోయేముందు డోర్‌ కొద్దిగా తెరచి,

“మే ఐ కమిన్‌ సర్‌!” అన్నాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో.

‘ఇంతచక్కని ఇంగ్లీష్‌ ఈ ఊర్లో ఎవరికి వచ్చునబ్బా’ అనుకుంటూ తల ఎత్తి చూశాడు మేనేజర్‌.

“ప్లీజ్‌ కమిన్‌” అన్నాడు.

“షల్‌ ఐ టేక్‌ దిస్‌ సీట్‌?” అనడిగాడు పతంజలి.

“ప్లీజ్‌” అంటూ సీటు చూపించాడు మేనేజరు. “చెప్పండి” అన్నాడు.

“సార్‌ మేము పట్టు పురుగుల పెంపకం కోసం రెండెకరాలు ‘మల్బరీ’ పంట సాగు చేస్తున్నాము. సెరికల్చర్‌ డిపార్టుమెంటువారు పట్టు రైతులకు సబ్సిడీ యాభై శాతం వరకు ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. దాని వివరాలు తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు పతంజలి వినయంగా.

పతంజలి మాట తీరు, మన్నన, మేనేజరును ఆకట్టుకున్నాయి. “అవునుబాబూ! ఎకరానికి ఐదువేలు లోన్‌ ఇస్తాము. దాంట్లో సగం ప్రభుత్వమే భరిస్తుంది! వడ్డీ కూడ క్రాప్‌ లోన్‌ కంటె తక్కువ. రెండెకరాలు అంటున్నారు కాబట్టి పదివేలు వస్తుంది.” అని ఆగి టేబుల్‌ మీద ఉన్న బెల్‌ కొట్టాడు. వచ్చిన అటెండరుకు, “ఫీల్డాఫీసరు గారిని రమ్మను” అని చెప్పాడు.

టేబుల్‌మీద రోజ్‌వుడ్‌ నేమ్‌ ప్లేట్‌ మీద “కె. మల్లికార్జునయ్య, ఎం.కామ్‌” అన్న అక్షరాలు బంగారు రంగులో మెరుస్తూ కనిపించాయి.

“మీ పేరు?” అనడిగాడు మేనేజరు.

“పతంజలి”

“మీ నాన్నగారు…”

“మార్కండేయశర్మగారు. పౌరాణికులు, అష్టావధాని” తండ్రి గురించి చెబుతూన్నపుడు పతంజలి ముఖంలో ఒక రకమైన ‘గర్వం’ మెరిసింది.

“స్వామిగారి కొడుకా మీరు! వారిని తెలియనివారెవరు? మీరు… వ్యవసాయం”  అని అర్థోక్తిలో ఆగాడాయన.

“అవునండీ. వ్యవసాయమే చేస్తున్నాను.”

“మరి చదువు?”

“మొన్ననే M.P. ఇంటర్‌ పరీక్షలు ప్రయివేటుగా వ్రాశాను.”

“చాలా సంతోషం బాబూ. మీలాంటి వారు చదువు కొనసాగించాలి”

ఈలోగా ఫీల్డాఫీసరు వచ్చాడు.

“డేవిడ్‌ గారు, పట్టు పరిశ్రమకు లోన్‌ గురించి ఈయన వచ్చారు. విధి విధానాలు చెప్పండి” అన్నాడు మేనేజర్‌.

“నమస్తే సర్‌” అన్నాడు పతంజలి డేవిడ్‌తో.

 “నమస్తే. మీరు ల్యాండ్‌ డాక్యుమెంట్‌, మీరు పట్టుపురుగులు పెంచుతున్నట్లు సెరికల్చర్‌ డిపార్టుమెంటు నుండి సర్టిఫికెట్‌ తెచ్చుకోండి. షెడ్‌ నిర్మించుకోవాలి. మరి?”

“మా యింట్లోనే పశువులశాలలో ఏర్పాటు చేసుకుంటాం సార్‌” అన్నాడు పతంజలి.

“అలా చెప్పకండి. షెడ్‌ కొత్తగా నిర్మించినట్లు సెరికల్చర్‌ వారు సర్టిఫికెట్‌ ఇస్తారు. మీరు కొనే స్టాండ్లు, బుట్టలు, చంద్రవంకలు, అన్నింటికి బిల్లులు పెట్టాలి. పట్టుగూళ్లు ఫలానా మార్కెట్‌కు పంపుతున్నామని ‘అండర్‌టేకింగ్‌’ ఇవ్వాలి. షెడ్‌ వేసుకోవడం లేదంటే లోన్‌ అమౌంట్‌ తగ్గే ప్రమాదముంది. మేమిచ్చే లోన్‌ ఎలాగూ మీకు చాలదు” అన్నాడాయన.

“పొలం ఎవరి పేరున ఉంది?”

“నాన్నగారి పేరునే”

“అయితే లోన్‌ అప్లికేషన్‌ నింపి, నాన్నగారితో సంతకం పెట్టించి, నేను చెప్పిన డాక్యుమెంట్స్‌ అన్నీ తీసుకురండి. వారంరోజుల్లో మేనేజరుగారు శాంక్షన్‌ చేస్తారు.”

“చాలా థాంక్స్‌ సార్‌” అన్నాడు పతంజలి.

ఈలోగా ఎవరో కుర్రాడు ‘టీ’ తెచ్చాడు.

“మీరు టీ తాగుతారు కదా!” అని అడిగాడు మేనేజరు.

తాగుతానని చెప్పాడు పతంజలి. టీ చాలా బాగుంది. సెలవు తీసుకొని బయటకు వస్తూంటే మేనేజరు మాటలు వినపడ్డాయి.

“నైస్‌ యంగ్‌ మేన్‌” అని.

అక్కడి నుండి బస్టాండుకు వెళ్లి డోన్‌ బస్సు ఎక్కాడు పతంజలి. డోన్‌కు చేరుకొని సెరికల్చర్‌ ఆఫీసుకు వెళ్లాడు. ఇన్‌స్పెక్టర్‌ చలపతిగారు లేరు. అనంతపురంలో మీటింగ్‌కు వెళ్లారట. ఆయన అసిస్టెంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి అడిగాడు.

“మాది మల్బరీ పంట మరోవారం రోజుల్లో కోత కోస్తుంది సార్‌. పట్టు సీడ్‌ ఇక్కడికే తెప్పిస్తున్నామని సారు చెప్పినారు. మరి…”

“అవును. వచ్చేవారం వస్తుంది సీడ్‌. మీరు సోమవారం నుండి ఎప్పుడయినా సరే తీసుకోవచ్చు. అన్నట్లు మీ A.D. (అగ్రికల్చర్ డిమాన్‌స్ట్రేటర్) గారివద్ద మీరు రెండెకరాలు మల్బరీ సాగు చేస్తున్నట్లు ఒక సర్టిఫికెట్‌ తేవాలి” అన్నాడు అసిస్టెంటు.

ఆయనకు వెళ్లొస్తానని చెప్పి, వెల్దుర్తికి వచ్చేశాడు పతంజలి. ఇంటికి వెళ్లి తండ్రికి విషయమంతా వివరించాడు.

మరుసటి రోజు ఉదయం జీతగాళ్లతో పశువులశాల శుభ్రం చేయించారు. ఎద్దులు ఆవులు కనబడకుండా మధ్యలో ఒక తడికె అల్లించి పెట్టాలని అనుకున్నారు. మేదరివాడికి కొలతలు ఇచ్చి తడికె అల్లేపని సుంకన్న చూసుకుంటానన్నాడు. గోడలు అక్కడక్కడ సున్నం పెచ్చులు ఊడిపోయింది. కొద్దిగా సిమెంటు ఇసుక కలిపి పెచ్చులు పోయిన చోట పూస్తే సరిపోతుంది. నీట్‌గా సున్నాలు వేయిస్తేసరి. క్రింద మట్టినేల గోనెపట్టాలు పరిస్తే సరిపోతుంది. వంటింట్లోంచి వైరులాగి, రెండు బల్బులు ఏర్పాటు చేసుకుందామనుకున్నారు. క్రింద శుభ్రంగా ఊడిపించి, చిల్లర సామానంతా తీసేసి, పేడతో అలికించి పెడితే సరిపోతుంది.

రెండ్రోజుల్లో షెడ్‌ నీట్‌గా తయారయింది. పశువుల శాలలోంచి వీధిలోకి మరో తలుపుంది. కాబట్టి. సమస్యలేదు పశువులకు సంబంధంల లేకుండా తడికె బిగించారు.

మల్బరీ పైరు నాటి నెలదాటింది. దాదాపు మూడడుగులకు పైగా పెరిగింది. బుధవారం మంచిరోజని చెప్పి డోన్‌కు వెళ్లాడు పతంజలి. ముందురోజే రాధాసారు దగ్గర సర్టిఫికెట్‌ తీసుకున్నాడు.

సెరికల్చర్‌ ఆఫీసులో చాలామంది రైతులు వచ్చి ఉన్నారు. విత్తనానికి చలపతి సారు రూంకి వెళ్లి నమస్కారం పెట్టాడు.

“రాండి స్వామీ” అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. పతంజలి తెచ్చిన సర్టిఫికెట్‌ను చూసి, ఫైల్లో పెట్టుకున్నాడు. అసిస్టెంటును పిలిచి “రెండు షీట్లు తీసుకురా” అని చెప్పాడు.

రెండు మందపాటి కాగితాలమీద వృత్తాకారపు బేస్‌లు ఉన్నాయి. వాటిమీద సన్న  ఆవాలంత గుడ్లు పెట్టబడి ఉన్నాయి. రెండు షీట్లు పెట్టుకోవడానికి, రెండు పెద్ద బ్రౌన్‌ కవర్లిచ్చారు. రెండూ విడివిడిగా ఉండాలి. ప్రెస్‌ అవకూడదు.

24 గం॥ దాటిన తర్వాత గుడ్లు పగులుతాయనీ ఆ రోజు అసిస్టెంటును పంపిస్తాననీ చెప్పాడు చలపతిసారు. రేపు ఉదయంవరకు షీట్లకు దారం కట్టి వేలాడదీయమన్నాడు. గాలి వెలుతురు బాగా సోకాలన్నాడు.

బస్సులో జాగ్రత్తగా గుడ్లను తీసుకొనివచ్చాడు పతంజలి. షీట్లకు ఒక మూల చిన్న కన్నం దబ్బనంతో వేసి విడివిడిగా వేలాడదీశాడు. మరుసటి రోజు సాయంత్రం అసిస్టెంటు వచ్చాడు. షీట్లు దింపి ఒక వెడల్పుగా ఉన్న ‘తట్ట’ (ప్లేటు) సిద్ధంగా ఉంచుకొన్నాడు.

ఒక ‘కోడి ఈక’ కావాలన్నాడు అసిస్టెంటు. ఏడు గంటలకు గుడ్లు పగిలాయి. మిల్లీ మీటరు పొడుగున పట్టు పురుగులు బయటికి వచ్చాయి. కానీ షీట్‌కు అంటుకునే ఉన్నాయి. తట్టలో న్యూస్‌ పేపరు పరచి, షీటు మీద ఉన్న పురుగులన్నింటిని, చాలా జాగ్రత్తగా పేపరు మీదకు తోశాడు అసిస్టెంటు. “పురుగులకు ఏమాత్రం ఒత్తిడి కలగకూడదు. కోడి ఈక తప్ప ఏది వాడినా అవి నలిగిపోతాయి” అని చెప్పాడు.

తోటనుండి జీతగాళ్లు మల్బరీ ఆకులు తెచ్చారు. ముందుగానే చెప్పడం వల్ల మొక్క చివరి భాగంలోని చిగురు టాకులు వదిలేసి, రెండో ఆకు, మూడో ఆకు కోయాలి. అలాగే తెచ్చారు.

అసిస్టెంటు ఒక పదునైన పది పన్నెండంగుళాల కత్తి, ఆకు తరగడానికి రెండంగుళాల మందం 2/2 కొలతలుగల టేకు పలక తెచ్చి ఉన్నాడు. అవి కూడ ప్రభుత్వమే రైతులకు ఉచితంగా సరఫరా చేస్తుంది.

తొడిమలు తీసేసి, ఆకునంతా ఎడమచేత్తో కలిపి పట్టుకుని, సన్నగా, కొబ్బరి కోరు (తురుము) లాగా తరిగి చూపించాడు. పతంజలితో, సుంకన్నతో, తోకోనితో కూడ తరిగించాడు. పురుగులన్నీ ప్లేట్‌లో పేపరు మీద కదులుతున్నాయి. వేళ్ల మధ్య ఆకు తరుగు తీసుకొని, వాటికి సమీపంగా పట్టుకొని, పురుగుల మీద పరచినట్లుగా వేశాడు.  అంతే పురుగులు ఆకువాసన గ్రహించి, గబగబ తినసాగాయి. పాణిని, మల్లినాధ, మహిత కూడ వచ్చి ఆసక్తిగా చూడసాగారు.

“ఈ తట్ట రెండు రోజులు సరిపోతుంది. ఎల్లుండికి మీరు వెదురు తట్టలు తెచ్చుకోండి. ఎల్లుండి ఉదయం డోన్‌కు రండి. ప్యాపిలిలో డిపార్టుమెంటు వారు ఆధరైజ్‌ చేసిన మేదరివారున్నారు. వాళ్ల దగ్గర అన్నీ దొరుకుతాయి. ప్రస్తుతానికి తట్టలు, స్టాండ్లు తెచ్చుకోండి. చంద్రవంకలు చివర్లో తెచ్చుకోవచ్చు. ఒక్కసారి కొంటే అన్నీ ప్రతి పంటకు పనికొస్తాయి” అని చెప్పాడు అసిస్టెంటు.

“ప్రతి రెండుగంటలకొకసారి ఆకు తరిగి వేయాలి. ముందే తరిగి పెట్టుకోకూడదు. ప్రతిసారీ ఫ్రెష్‌గా తరగాల్సిందే. రాత్రి 11 నుండి ఉదయం నాలుగు వరకు గ్యాప్‌ యివ్వండి చాలు” అని చెప్పాడు. తట్ట నేలమీద కాకుండా ఒక స్టూలు మీద పెట్టించాడు.

మరుసటిరోజు ఉదయానికి పురుగుల సైజు రెండింతలు పెరిగింది. రెండు మూణ్నిమిషాల్లో వేసిన ఆకు తినేసి పైకి వస్తున్నాయి. ఆ రోజంతా జాగ్రత్తగా మేత వేశాడు పతంజలి. మరుసటి రోజు సుంకన్నకు అప్పచెప్పి, డోన్‌కు వెళ్లాడు. అసిస్టెంటు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరూ కలసి ‘ప్యాపిలి’కి వెళ్లారు బస్సులో.

దిగి మేదరి వీధికి వెళ్లారు. ఐదారు కుటుంబాలవాళ్లు ఇదే పనిమీద ఉన్నారు. ఒకతని దగ్గరకు తీసుకుని వెళ్లాడు అసిస్టెంటు. “ఏం ఉరుకుందప్పా, బాగుండావా?” అని పలకరించి, “ఈసామిది వెల్దుర్తి. పురుగులు పెంచుతాండారు. రెండెకరాలు ఆకు. రెండు షీట్ల విత్తనం. తట్టలు, స్టాండ్‌లు, చంద్రవంకలు కావాల” అన్నాడు.

ఉరుకుందప్పకు యాభై ఏండ్లుంటాయి. చేవదేరిన చింతమానులా బలంగా, ఎత్తుగా ఉన్నాడు.

“రెండు షీట్లంటున్నావు కాబట్టి, వరుసకు ఆరు తట్టలు వేసుకున్నా ఐదొరుసలకు ముప్ఫై తట్టలు గావాల. స్టాండ్లకు పన్నెండు నిలువు బొంగులు, ముప్ఫై అడ్డ బొంగులనుకో, టెంకాయతాల్లు మూడు సుట్టలేసుకో. స్టాండ్ల కింద సీమలెక్కకుండా నీల్లు బోసి పెట్టుకోనీకె సత్తుప్లేట్లు పది పన్నెండు గావాల. అవి మీరు దెచ్చుకున్నాసరే, నన్నియ్యమన్నా ఇచ్చా” అని ఆగి, మనసులోనే లెక్కలు వేసి,

“చంద్రవంకలు గాక ఇవిటికే దగ్గర్దగ్గర పదైదునూర్లయితాది సామి” అని తేల్చాడు. “మీయింటికాడి షెడ్డులో స్టాండ్‌ కట్టిచ్చినందుకు నూర్రూపాయలియ్యాల. ఈసారుకు అన్నీ దెలుసులే” అన్నాడు.

“మరి చంద్రవంకలు?” అనడిగాడు పతంజలి.

“అవిటికి రొండు పద్దతులుండాయి. వాటితో రెండు రోజులే పనిగాబట్టి బాడెక్కిచ్చాం. మీ పంటకు పదన్నా గావాల. ఒక్కోదానికి రోజుకు యాభై, ఏసుకొచ్చి, తీస్కబోయే కర్చులుగాక. లేదంటే కొనుక్కుంటే ఒక్కటి మూడొందలైతాది” అన్నాడు.

“ఈసారికి బాడిగకు తీసుకుందాములేసామీ” అన్నాడు అసిస్టెంటు.

“సూడుమల్ల సామోల్లు బాపనోల్లు తగ్గించాలమరి” అన్నాడు.

పతంజలి గిల్టీగా ఫీలయ్యాడు.

“నేను సెప్పింది సెప్పినా తర్వాత నీ దయ నా అదురుట్టం” అన్నాడు ఉరుకుందప్ప.

“ఒక రెండు వందలు తగ్గిచ్చుకో. చంద్రవంకలకు బాడిగ నలభై చేసుకో” అన్నాడు అసిస్టెంటు.

“సరేసార్‌” అన్నాడతడు.

“ఖాళీ బిల్లులు సంతకం పెట్టి మూడో నాలుగో యియ్యి సామికి. బ్యాంకికి కావల్సినట్టు రాసుకుంటాడు” అని చెప్పి.

“సామీ, మీరు ఇప్పుడు రెండు తట్టలు వెంబడి తీస్కబోండి. ఉరుకుంద మిగతావి రెండు మూడు రోజుల్లో వేసుకొని వస్తాడు. ఇప్పుడేమయినా ఉంటే ‘సంచకారం’ (అడ్వాన్సు) ఇవ్వండి” అన్నాడు.

జేబులోంచి రెండు వందలు తీసి యిచ్చాడు పతంజలి. అతను రెండు తట్టలు తెచ్చిచ్చాడు. వెదురు బద్దలతో అల్లినారు వాటిని. రెండున్నర అంగుళాల ఎత్తు ఉండి, వృత్తాకారంలో దాదాపు మూడడుగల వ్యాసం కలిగి ఉన్నాయవి. కొత్తవేమో మంచి పచ్చివాసన వస్తున్నాయి.

(సశేషం)

Exit mobile version