Site icon Sanchika

సాఫల్యం-12

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“బ[/dropcap]స్సు టాపు మీద వేయించుకోండి సంచులు, కదలకుండా బస్సు క్యారేజీకి పురికోసలు కట్టించండి. వీలుంటే నేను డోన్‌ బస్టాండుకు వస్తాను. మీరు ఎనిమిదిన్నర కల్లా సంచులు తీసుకొని వచ్చేయండి. వానాకాలం కాదు కాబట్టి పరవాలేదు. గూళ్లు అస్సలు తడవకూడదు. రాత్రి బస్సులో నిద్రబోగాకండి. వాన వస్తాదేమో సూసుకుంటా ఉండాల. మన సంచుల మీద ఎటువంటి బరువు వేయకూడదు” అన్నాడు అసిస్టెంటు.

సాయంత్రం నాల్గు గంటలకు ప్యాకింగ్‌ దగ్గరుండి చేయించాడు. గూళ్లు టైట్‌గా కాకుండా లోపల సులభంగా కదిలేలా కట్టారు. అట్టల మీద వివరాలు రాసి కట్టారు. అసిస్టెంటు వెళ్లిపోయాడు.

ఏడుగంటలకల్లా స్నానం, సంధ్య పూర్తి చేసుకొని, దేవుని దగ్గర దీపారాధన చేశాడు పతంజలి. ఒక చేతి బ్యాగులో జత బట్టలు, చదువుకోడానికి కొడవటిగంటి వారి ‘చదువు’ నవల, టవలు, దుప్పటి అన్నీ సర్దుకున్నాడు. ఏడున్నరకల్లా అమ్మ అన్నం పెట్టింది. బండిమీద బస్తాలు వేసుకొని బస్టాండుకు వెళ్లారు. ప్యాపిలి వరకు వెళ్లే పాలబస్సు వచ్చింది. టాపుమీద సంచులు వేసి, తోకోడు, సుంకన్న వెళ్లిపోయారు బస్సు కదిలింది.

పతంజలికి ఉద్వేగంగా ఉంది. నానా కష్టాలు పడి పండించిన పంట. నిమ్మకాయలయితే ఎలా పడేసినా ఏంకావు. మరి ఇవి? చాలా సున్నితం. నరసింహస్వామిని తల్చుకున్నాడు. “స్వామీ! క్షేమంగా మార్కెట్‌కు చేర్చు అని వేడుకున్నాడు.” ‘ఉగ్రం వీరం మహావిష్ణుం’ చదువుకున్నాడు. అంతే మనసులో ఆందోళన తగ్గింది.

డోన్‌ బస్టాండులో బస్సాగింది. ఆ టైంలో హమాలీలు ఎవ్వరూ లేరు. తానే బస్సు టాపు మీదకెక్కి, పైనుండి బస్తాలు ఒక్కొక్కటి కండక్టర్‌కు అందించాడు. నెమ్మదిగా కింద పెట్టమని అభ్యర్థించాడు.

ఇంకా బెంగుళూరు బస్సు రావటానికి అరగంట పైగా టైముంది, ఆకాశం నిర్మలంగా ఉంది. “అమ్మయ్య వర్షం వచ్చే సూచనలే లేవు” అనుకున్నాడు. అక్టోబరు నెల అది. వాతావరణం చల్లగా ఉంది.

దూరంగా అసిస్టెంటు వస్తూ కనబడ్డాడు. అతని వెంట ఎవరో ఇంకొకతను వస్తున్నాడు.

“స్వామీ! వచ్చేసినారా, ఈ టైములో ఈ హమాలీలుండరని, మా ఇంటిదగ్గర ఉన్న ఇతన్ని పిల్చుకొచ్చినా. సుద్ద ప్యాక్టరీలో పని చేస్తాడు” అన్నాడు వస్తూనే.

“మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు” అన్నాడు పతంజలి.

“అంతమాటనకండి. మీలాంటోల్లకు ఆమాత్రం చెయ్యకపోతే ఎట్లా. మా సారుకు కూడ మీరంటే అభిమానమే” అన్నాడతను.

సంస్కారానికి, నిగర్వితనానికి, మనిషి అంతస్తుతో సంబంధం లేదని అర్థమయింది పతంజలికి. అతనితో వచ్చినవాడు అన్నాడు “ఈన ఎవరికైనా ఇట్టే సాయం చేచ్చాడు సామీ! మన్సికి కొంచెమైనా గోరోజనం లేదు”

బెంగుళూరు బస్సు హారన్‌ కొడుతూ వచ్చి ఆగింది. తళతళ మెరుస్తూ ఉంది. బాడీ పొడుగునా లైట్లు వెలుగుతున్నాయి. లోపల సీట్లు కూడ మెరుస్తున్నాయి.

అసిస్టెంటు డోరు దగ్గరకు వెళ్లి “బెంగుళూరుకు సీట్లుండాయా?” అని అడిగాడు.

“ఆ ఉండాయి. ఎక్కు” అన్నాడు కండక్టరు.

“నేను కాదు. ఈయనొచ్చాడు. మూడు సంచులు పట్టుగూళ్లుండాయి. టాపు మీదేసుకోవాల” అన్నాడు. కండక్టరు దిగి బస్తాలను చూశాడు.

“ఎన్ని కేజిలుంటాది ఒక్కోటి?”

“పదిపన్నెండు కేజీలుంటాది” కొంచెం తగ్గించి చెప్పాడు.

ఒకదాన్ని చేత్తో ఎత్తి చూశాడు కండక్టరు.

“బో జెప్పినావులే. ఇరవై కేజీలకు తక్కువుండదు”

“సరే ఎంతయితాది?”

ఈలోపల డ్రయివరు కూడ దిగివచ్చాడు.

‘ఆరు రూపాయలు లగేజి కొట్టాల ఒక్కోదానికి. మొత్తం ముప్ఫై రూపాయలిస్తే ఏసుకొని బోతాం” అన్నాడు.

“ఇరవై ఐదిస్తాంలే. కొంచెం సూడన్నా” అన్నాడు అసిస్టెంటు.

“సరే. బెయ్యండి పైన” అన్నాడు కండక్టరు.

అసిస్టెంటు, పతంజలి క్రింది నించి ఎత్తిపట్టుకుంటే, ఆ వచ్చినతను పైకి లాక్కున్నాడు జాగ్రత్తగా పురికొసలతో బస్సు క్యారేజికి సంచులను కట్టేని, దిగాడు.

“భద్రం సామీ! మేం పోయొచ్చాం. ఎక్కండి” అని పతంజలి బస్సెక్కింతర్వాత వాళ్లిద్దరూ వెళ్లిపోయారు.

పతంజలికి మూడో వరుసలో సీటిచ్చాడు కండక్టరు. ఆరు రూపాయల లగేజ్‌ టిక్కెట్లు మూడు, ఇరవై ఏడు రూపాయల ప్యాసింజర్‌ టికెట్టు చింపి ఇచ్చాడు. యాభై రూపాయల నోటు ఇచ్చాడు పతంజలి. ఐదురూపాయలు చిల్లర యివ్వలేదు. “దిగినప్పుడడగు” అని వెళ్లిపోయాడు.

బస్సు అతివేగంగా వెళ్లసాగింది బెంగుళూరు హైవే మీద. పతంజలి విశ్రాంతిగా కూర్చున్నాడు.

***

ఉదయం ఐదుగంటలకల్లా బెంగుళూరు మెజిస్టిక్‌ బస్టాండు బయట దింపాడు. హమాలీలను పిలిచి, పట్టుగూళ్ల సంచులు దింపించుకున్నాడు. మైసూరు వైపు వెళ్లే బస్సు మీద వెయ్యాలని చెప్పాడు. సంచులు వాళ్లు తీసుకురాగా మైసూరు బస్సులు ఆగే చోటికి వెళ్లాడు. రెండు బస్సులున్నాయి. వాటిమీద “నిలుగడ రహిత” అని ఉండడం చూసి వాటిని నాన్‌స్టాప్‌లుగా అర్థం చేసుకున్నాడు. ఇంతలో మరొక బస్సు వచ్చింది. దానిమీద వయా ‘రామనగర’ అని ఉంది. కండక్టరుతో మాట్లాడి టాపుమీద సంచులు వేయించుకున్నాడు. బస్సు బయలుదేరటానికి ఇంకా అరగంట టైముందని తెలుసుకొని, బ్రష్‌, టవలు, సోపు, పేస్టు తీసుకుని దగ్గరలో ఉన్న బాత్‌రూంలకు వెళ్లాడు.

కాలకృత్యాలు తీర్చుకుని, తలదువ్వుకుని, అక్కడే బట్టలు మార్చుకున్నాడు. బయట క్యాంటీన్‌లో కాఫీ తాగి, బస్సు వద్ద వచ్చి నిలబడ్డాడు. అప్పటికే టాపుమీద మరో ఏడెనిమిది పట్టుగూళ్ల సంచులు వేసి ఉండటం గమనించాడు.

బస్సు కదిలింది. రామ్‌నగరకు టికెట్‌ తీసుకున్నాడు. పట్టు గూళ్ల బస్తాలకు లగేజ్‌ ఛార్జీ వసూలు చేయకుండా కర్నాటక ప్రభుత్వం పట్టు రైతులకు వెసులుబాటు కల్పించిందని తెలిసి సంతోషించాడు. ప్రక్కనే ఒక రైతు కూర్చున్నాడు.

“నీవు ఎక్కడకు బోతుండావప్పా” అని అడిగాడు పతంజలిని.

“రామ్‌ నగర్‌కు” పట్టుగూళ్ల మార్కెట్‌కని బదులిచ్చాడు.

‘నాను కూడ అక్కడికే. నీవు యాడినుంచి వస్తువు?” అని అడిగాడు.

“కర్నూలు జిల్లామాది. వెల్దుర్తి”

“ఆంధ్రావాండ్లు, ఆంధ్రాలో వేడి జాస్తి అని అంటుంటిరి. పురుగు బాగానే పెరుగుతాదా?” అని అడిగాడు.

“ఇదే మాకు మొదటి పంట. ఎండాకాలం పెంచము”

“మాది యిక్కడే దొడ్డ బళ్లాపుర. ఎన్ని కేజీలు దిగినాది?”

“ఏమో యాభై వరకు”

“నీకు కొత్త కదా నా వెంట ఉండు” అని అభయం ఇచ్చాడాయన. ఆయన పేరు బసవప్ప అనీ తెలుసుకున్నాడు. తన పేరు చెప్పాడు.

ఎనిమిది గంటలలోపే ‘రామనగర’ లో దిగారు. హమాలీలు బస్తాలు దింపారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్నిటికి రేటు ఫిక్స్‌ చేసింది. ప్రభుత్వం. బేరాలు సారాలు అవసరం లేదు.

లగేజి రిక్షాలు ఉన్నాయక్కడే. ప్రతి బస్సు టాపుమీద పట్టుగూళ్లే. బసవప్పతో పాటు రిక్షాల్లో వేసుకొని మార్కెట్‌కు వెళ్లారు. మార్కెట్‌ చాలా పెద్దది. గేటు దగ్గరే ఒక వ్యక్తి కుర్చీ టేబుల్‌ వేసుకుని కూర్చుని వచ్చిన సరుకు వివరాలు ఒక రిజిస్టర్‌లో నోట్‌ చేసుకుని అట్టముక్క ఒకటి ఇస్తున్నాడు. దానిమీద ఒక నంబరు వేసి ఉంది. విశాలమైన షెడ్లు వేసి ఉన్నాయి. దాదాపు అరకిలోమీటరు విస్తీర్ణంలో ఉంది మార్కెట్‌. లోపల అట్టముక్క చూపిస్తే గవర్నమెంటు వారి హమాలీలే బస్తాలు తీసుకువెళ్లి, అట్టముక్కమీద నంబరు వేసి ఉన్న చోట దింపారు. రైతుకొక ‘స్లాట్‌’ చొప్పున కేటాయించారు. పన్నెండడుగులు పొడవు, పన్నెండడుగుల వెడల్పుగల చతురస్రాకారపు స్థలం తెల్లని పెయింట్‌తో హద్దులు వేయబడి ఉన్నాయి. నేల చక్కగా సిమెంట్‌ గచ్చు చేసి ఉంది. ప్రతిస్లాట్‌కూ ఒక పల్చని టార్పాలిన్‌ లాంటి గుడ్డ ఇచ్చారు. హమాలీలే ఆ గుడ్డ పరచి, పట్టుగూళ్లన్నీ దాని మీద పరచినట్లుగా పోశారు. ప్రతి స్లాట్‌ మీద ఫ్యానుండి. పురుగుల కోసం రైతులు కూర్చోడానికి బెంచీలు వేసి ఉన్నాయి.

పతంజలికీ, బసవప్పకూ, పక్కపక్కనే స్లాట్స్‌ వచ్చాయి. ఏర్పాట్లు చూసి ముగ్ధుడయ్యాడు పతంజలి. అప్పటికి తొమ్మిది కావస్తూంది. “అటు పక్క గవర్నమెంటు వారి క్యాంటీను ఉండాది” నాస్తా చేసి వస్తాము రాప్పా” అని పిలిచాడు బసవప్ప.

“మరి గూళ్లను వదిలిపెట్టి పోతే ఫరవాలేదా?” అని అడిగాడు.

“అయ్యో ఎవ్వరూ వేరే వాండ్ల గూట్లను ముట్టుకోరప్పా. పోదాముపా” అన్నాడాయన. “నీ బ్యాగు కూడ ఈడనే పెట్టుకో”

ఇద్దరూ క్యాంటిన్‌కు వెళ్లారు. తిరునాళ్లలాగా ఉందక్కడ. అట్టముక్క అక్కడ ఐడి కార్డుగా ఉపయోగపడింది. క్యూలో నిలబడి ఒక ప్లేటులో వాళ్లిచ్చిన పొంగల్‌ తీసుకొని ప్రక్కకు వచ్చారు. దానిమీదే పల్చని చట్నీ పోశారు. పొంగల్‌ చాలా రుచిగా ఉంది. పొగలు కక్కుతూ ఉంది. మిరియాలు దంచి వేశారు.  టిఫిన్‌ కూడ ఫ్రీ. రైతులకు ఇంతమందికి ఉచితంగా టిఫిన్‌ పెడుతున్నందుకు కర్నాటక ప్రభుత్వాన్ని మనసులోనే అభినందించాడు.

టిఫిన్‌ తిని ప్లేట్లు ఒక పెద్ద ప్లాస్టిక్‌ టబ్బులో వేశారు. చేతులు కడుక్కోవడానికి వరుసగా ఇరవైకి పైగా కొళాయిలు. ఒకచోట ఒకతను పెద్ద క్యాన్‌ నుండి కాఫీ వంపి, చిన్న స్టీలుగ్లాసుల్లో పోసి యిస్తున్నాడు.

కాఫీ కూడ తాగి గూళ్ల దగ్గరకు వచ్చారు. పది గంటలకల్లా స్లాట్లన్నీ నిండిపోయాయి. మళ్లీ రెండుగంటలకు రెండో సెషన్‌ ప్రారంభమవుతుందట. ఒంటిగంట కల్లా ఈ సెషన్‌ అయిపోతుందట.

పదిన్నరకు మైకులో చెప్పారు. ఈ రోజు పట్టుగూళ్ల ధర కేజీకి 62 రూ. అని. ప్రతి వరుసకు ఒక ఆఫీసరు, ఒక గుమాస్తా, ఇద్దరు హమాలీలు బయలుదేరారు. హమాలీలు ఒక పెద్ద త్రాసును మోసుకొని వస్తున్నారు. అది చక్కగా నిలబడటానికి మధ్యలో స్టాండ్‌ ఉంది.

ప్రతిస్లాబ్‌ వద్ద ఉన్న గూళ్లను తూకం వేసి, రిజిస్టరులో నోట్‌ చేస్తున్నారు. స్లాట్‌ నంబరు, రైతుపేరు, ఊరు, పట్టుగూళ్లు ఎన్ని కేజీలు తూగాయి, ఆరోజు రేటు చొప్పున వచ్చే మొత్తం అన్ని వివరాలు ఒక రశీదులాగా ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఆఫీసుకువెళితే డబ్బు చెల్లిస్తారు.

ప్రభుత్వమే రైతుల నుండి డైరెక్టుగా పట్టుగూళ్లను కొంటుందని తెలుసుకున్నాడు బసవప్పద్వారా. అతనికి నిమ్మకాయల ఏజెంట్లు పదిశాతం కమీషన్‌ తీసుకోవడం గుర్తొచ్చింది.

పతంజలి గూళ్లు 47 కేజీలు తూగాయి. వాటిని వేరే సంచుల్లోకి ఎత్తి తీసుకుపోయారు. బసవప్పవి 58 కేజీలు తేలాయి. పతంజలికి రెండువేల తొమ్మిది వందల చిల్లర వచ్చింది. డబ్బు చెల్లించడానికి ఐదారు కౌంటర్లున్నాయి. క్యూలో నిలబడి డబ్బు తీసుకున్నారు. డబ్బుతో పాటు మీల్స్‌ కూపన్‌ ఇచ్చారు. అప్పటికి పన్నెండున్నర దాటింది.

డబ్బు నడుము చుట్టూ కట్టుకునే సంచిలో పెట్టి భద్రపరచుకున్నాడు. క్యాంటీనుకు వెళ్లారు. పులిహోర, పెరుగన్నం పాకెట్లు యిచ్చారు. తినేసి, చేతులు కడుక్కొని నీళ్లు తాగారు.

రాంనగర్‌ బస్టాండు కొచ్చారు. ఆ చుట్టుపక్కలే షోలే హిందీ సినిమా షూటింగ్‌ జరుగుతుందని తెలిసింది. ధర్మేంద్ర, అమితాబ్‌, హేమమాలిని అంతా ఉన్నారట.

రాంనగర్‌లో బస్సెక్కి మెజిస్టిక్‌లో దిగారు. అనంతపురం వెళ్లే RPGT ఎక్స్ ప్రెస్‌ బస్సు సిద్ధంగా ఉంది. ఎక్కి కూర్చుని టికెట్టు తీసుకున్నాడు. బాగా అలిసిపోవడం వల్ల కూర్చునే నిద్రపోయాడు. లేచేసరికి బస్సు పెనుగొండలో ఆగి ఉంది. అందరూ టీ తాగారు. అనంతపురం చేరే సరికి ఎనిమిది దాటింది. కర్నూలు వెళ్లే లాస్ట్‌ బస్‌ ఆరున్నరకే వెళ్లిపోయిందట.

“ఏం చేద్దామా?” అని ఆలోచించాడు మళ్లీ ఉదయం 6 గంటలకే బస్సు. బస్టాండుకు దగ్గరలోని ‘రాఘవేంద్ర విలాస్‌’లో టిఫిన్‌ చేశాడు. ఇడ్లీ, ఉతప్పం తిన్నాడు. ఎదురుగా శ్రీకంఠం టాకీసు కనబడిరది. ఎన్‌టిఆర్‌ సినిమా “విచిత్ర కుటుంబం” ఆడుతూంది. అందులో బెంచీ టికెట్టు తీసుకొని వెళ్లి కూర్చుని సినిమా చూశాడు. సినిమా పూర్తయిన తర్వాత బస్టాండు దగ్గరలో “మాడరన్‌ లాడ్జి” లో ఒక మడతమంచం తీసుకొని పడుకున్నాడు.

ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. కాఫీ తాగి ఆరు గంటలకు కర్నూలు బస్సు ఎక్కాడు. “బ్రహ్మం బస్‌ సర్వీసు” పదిగంటలకు వెల్దుర్తిలో యింటికి వెళ్లిపోయాడు.

***

రాంనగర్‌ విశేషాలన్నీ తల్లిదండ్రులకు వివరించాడు పతంజలి. “ఒక్క నెలరోజులు కష్టపడితే మూడువేలు రూపాయలు కళ్ల చూడడమంటే చిన్న విషయం కాదు నాయనా” అన్నాడు మార్కండేయశర్మ.

భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని, తోటకు వెళ్లాడు. ఈ హడావుడిలో గమనించలేదు. నిమ్మకాయలు కోతకొచ్చినాయి. “వారం రోజుల్లో హుబ్లీకో మద్రాసుకో ప్రయాణం” అనుకున్నాడు.

మల్బరీ మొక్కలు అప్పుడే, అడుగుకు పైగా పెరిగాయి. “పదిహేను రోజుల్లో మళ్లీ పట్టు సీడ్‌ తెచ్చుకోవచ్చు అనుకున్నాడు.

మళ్లీ సుంకన్న ఘటవాయిద్యం, పతంజలి గాన స్వారస్యం కలిసి, ఇంజను రూములో ప్రతిధ్వనించాయి.

మిరపతోటలో కలుపు తీస్తున్నారు. ఆడకూలీలు. అందులో సుంకన్న భార్య, తోకోని భార్య ఉన్నారు. మిరపపంట పచ్చిది కోయకుండా పండు మిరపకు వదిలారు. ఎర్రని ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా నిలువుగా వేలాడుతన్నాయి. పండు మిరపకాయలు. ఒకామె గొంతెత్తి పాడుతూంది. ప్రతీ నుడుగునూ అందుకొని మిగతావాళ్లు గొంతు కలుపుతున్నారు. శ్రీరామచంద్రున్ని, తల్లి కౌసల్య, ఉయ్యాలలో పడుకో బెట్టి, ఊపుతూ నిద్రపుచ్చే సందర్భాన్ని పాటగా మలచారని అర్థమయింది. “ఆ పాట స్వరకర్త ఎవరోగాని, కాసేపు వింటే, పెద్దవాళ్లకయినా కునుకు రావల్సిందే” అనుకున్నాడు పతంజలి. పాట ఇలా సాగుతూన్నది.

“రామ సెందూరూడా, నా బుజ్జి రామ సెందూరూడా

పండుకో నా తండ్రి, పండుకోరా వేగ                  ॥ రామసెందూరుడా॥

పాల బువ్వా దీని పవళించునా సామి

కలువ కండ్లను మూసి కాస్త బజ్జో కన్న

దరమంపు ఏలికా దశరతా మారాజు

నినుజూడ వచ్చేను పండి లేవుము వేగ             ॥ రామసెందూరుడా॥

నిన్ను కడుపున గన్న పున్నాన కవుసల్య

జనమ ధన్నెత గాంచె జగములనుగా చేటి

మేటి వీరుడ వగుచు మేదిని నేలరా                 ॥ రామసెందూరుడా॥

పాట వింటూ ఉండిపోయాడు పతంజలి. పల్లె పదాలలో ఎంత ఆర్ద్రత ఉంటుంది. అనుకున్నాడు. మిరప చేనికి కొంచెం దూరంలో నిమ్మ చెట్టు లోపలి కొమ్మలకు చీరతో ఉయ్యాల కట్టి వుంది. దాంట్లో సుంకన్న కొడుకును పడుకోబెట్టారు. ఇంజను రూము వైపు వెళుతూ ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశాడు. ఐదు నెలలవాడు. పతంజలి వాడిని దాటి వెళ్లాడోలేదో, వాడు లేచి కెవ్వున ఏడవటం ప్రారంభించాడు.

ఎవరయినా వస్తున్నారేమోనని చూశాడు పతంజలి. అందరూ శ్రీరామచంద్రుడిని నిద్ర బుచ్చే పనిలో ఉండి వీడి ఏడుపు వినలేదు. ఉయ్యాల దగ్గరకు వెళ్లి కాసేపు ఊపసాగాడు. అయినావాడు ఏడుపు ఆపలేదు ఇక లాభం లేదని, మెల్లిగా ఉయ్యాలలోంచి పైకి తీసి ఎత్తుకున్నాడు.

టక్కున ఏడుపు మానేశాడా పసివాడు. కళ్లు తెరిచి పతంజలిని చూసి చాలాకాలంగా పరిచయమున్న వాడిలా బోసినవ్వులు చిందించసాగాడు. వాడు చామన చాయలో బొద్దుగా ఉన్నాడు.

“ఆహా! నేను నీకు తెలుసా! ఏదీ మళ్లీ నవ్వు! దొంగ వెధవా!” అని వాడిని పలకరిస్తూ, వాళ్లమ్మ దగ్గరకు తీసుకుని వెళుతూన్నాడు.

సరిగ్గా మిరపచేనులోంచి మార్కండేయశర్మ బయటకు వస్తున్నాడు. మాదిగల పిల్లవాడి ఎత్తుకొని, ముచ్చట్లాడుతూ వస్తూన్న కొడుకును చూసి నిశ్చేష్టుడయ్యాడాయన.

పతంజలిని చూసి, సుంకన్న భార్య పరుగు పరుగున వస్తూంది. పెద్దసామిని తన కొడుకునెత్తుకొని నిలబడిన చిన్న సామిని చూసి ఆగిపోయింది తండ్రి ముఖంలో కోపాన్ని గమనించాడు పతంజలి.

“పిల్లవాడు ఏడుస్తూంటే… పాపం కదా అని…” అంటూ సంజాయిషీ ఇవ్వబోయాడు తండ్రికి. ఆయన వినిపించుకోకుండా గిరుక్కున వెనక్కు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

పతంజలివైపు ఆడ కూలీలందరూ ఆరాధనగా చూశారు. ఒకామె అన్నది “నీ కొడుకు అదురుట్టమంతుడే! చిన్న సామి ఎత్తుకున్నాడు!”

…..

పతంజలి అన్నాడు.

“దానిలో అంత అదృష్టమేముందమ్మా! పసిపిల్లలు దేవునితో సమానం” సుంకన్న భార్య అంది. “మావోనికి పతంజలిసామే సుధాకరని పేరు బెట్టింది”

“తండ్రి కంత కోపం రావడం ఎప్పుడూ చూడలేదు. కులాధిక్యత నరనరానా జీర్ణించుకున్న వంశం తమది. కానీ శాస్త్రాలు వేరుగా చెబుతున్నాయే వెంటనే “అపవిత్రః పవిత్రోవా” శ్లోకం గుర్తొచ్చింది.

పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎత్తుకోమని తన అంతరంగం చెప్పింది. దాంట్లో తప్పేముంది? కాళిదాసు శాంకుతలంలో దుష్యంతునిచేత అనిపిస్తాడు. అది తన పాఠ్యభాగంలోనే ఉంది. తండ్రే దానిని తనకు వివరించాడు కూడ.

“సతాం హి సందేహ పదేషు వస్తుషు

ప్రమాణమంతః కరణ ప్రవృత్తయః”

ఉత్తములకు ఏ విషయంలోనైన సందేహం ఏర్పడినపుడు, వారి అంతఃకరణం (మనస్సు) చెప్పినట్లు నడుచుకోవాలి.

“God manifests Himself in children” అని అన్నాడు కదా టాల్‌స్టాయ్‌ మహాశయుడు! సాక్షాత్తు మహాత్మాగాంధీకే ఆయన అభిమాన రచయిత.

తనకెందుకో అందరూ ఇష్టమే. కూలీలు, డ్రైవర్లు, కండక్టర్లు, హమాలీలు… ఇంట్లో వేరే వాళ్లొచ్చి కాఫీలు తాగినా, గ్లాసులు కడగటం, బోర్లించడం, మళ్లీ వాటి మీద నీళ్లు చిలకరించటం. వాళ్లు తిన్న చోట శుద్ధి చేయించటం, ఇదంతా పతంజలికి యిష్టముండదు. చేసేవాళ్లు కూడ పెద్దగా పట్టించుకోరు. తమపట్ల వివక్షగా భావించరు.

పంచాంగం చెప్పించుకోవటానికి వచ్చిన వారు తాంబూలంలో పెట్టిన ‘దక్షిణ’పై కూడా నీళ్లు చల్లుకొని తీసుకుంటారు నాన్న. నోట్లకు మాత్రం ఇది వర్తించదు!

ఇంటి చాకలి, మడి బట్టలన్నీ శుభ్రంగా ఉతికి, పిండుకొని మూట కట్టుకొని వస్తాడు. అమ్మేమో ఆ మూట మీద బక్కెట్‌ నీళ్లు గుమ్మరించి అన్నీ పిండుకుంటుంది మళ్లీ.

ఇవన్నీ ప్రశ్నించాలని ఉంటుంది పతంజలికి కానీ తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడే ధైర్యం చాలదు. వారి పట్ల గౌరవం కూడ అతన్ని ప్రశ్నించకుండా ఆపుతుంది.

కవి సామ్రాట్‌ విశ్వనాధ అంటే ప్రాణం పతంజలికి ఆయన భావ నైశిత్యం, పదునైన భాష, సంక్లిష్టమయిన వాక్య నిర్మాణం అతనికెంతో యిష్టం. ఆయన కూడ వర్ణ వ్యవస్థకు అనుకూలమే. అదే నచ్చదు పతంజలికి

“చాతుర్వర్ణం మయాసృష్టం, గుణ కర్మవిభాగశః” అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. ‘డివిజన్‌ ఆఫ్‌ లేబర్‌’ అన్నమాట. అంతవరకు బాగుంది. శ్రీకృష్ణుని మాటలో ‘గుణ’ అనే పదం లేకపోయి ఉంటే బాగుండేది. చేసే పనులను బట్టి చాతుర్వర్ణములు ఏర్పడినవి. గుణాన్ని బట్టి కులం ఏర్పడటానికి వీలులేదే? మరి ధర్మ వ్యాధోపాఖ్యానంలో, ధర్మవ్యాధుడు మహా తపశ్శాలి యైన కౌశికునికి ధర్మోపదేశం చేసే అర్హత ఎలా సంపాదించగలిగాడు? జ్ఞానం ఒక కులానికే సొంతం కాదు అని నిరూపించాడు కదా! మాంసం దుకాణం నడుపుకునే వాడాయన. మరి.

“జన్మనా జాయతే శూద్రః, కర్మణాజయతే ద్విజః” అంటుందిశాస్త్రం. పుట్టుకతో అందరూ శూద్రులే. చేసిన సత్కర్మల వల్ల బ్రాహ్మణులౌతారు అని కదా దానర్థం.

ఆది శంకరునికీ, చండాల రూపంలో ఆయనను పరీక్షించవచ్చిన పరమశివునికీ జరిగిన సంవాదం ఎంత బాగుంటుంది. ఏ శరీరంలోనైనా ‘పరమాత్మ’ నివసిస్తాడని చెప్పి అద్వైత మత స్థాపకునికి జ్ఞానోదయమయ్యేలా చేశాడు శివుడు.

ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ యిల్లు చేరుకున్నాడు. పతంజలి కోసం అమ్మ నిల్చుని ఉంది.

“ఏమి నాయనా నీవు చేసిన పని? అనాచారం చేశావు కదరా” అన్నది ఆమె ముఖంలో దుఃఖం. కోపం లేదు.

“ఆ బట్టలు విడిచి, తలస్నానం చేసిరా” అన్నది తల్లి.

స్నానం చేసి దేవుని గూటి దగ్గరకు వెళ్లాడు. తండ్రి రుద్రాభిషేకం పూర్తి చేసినట్లున్నాడు. దగ్గరకు రమ్మని, విభూతి శరీరానికి పూశాడు. అభిషేక జలం తలమీద ప్రోక్షణ చేశాడు. ఒక చిన్న గిన్నెలోని పదార్ధాన్ని ఉద్ధరిణతో మూడుసార్లు దోసిట్లోవేసి తాగమన్నాడు. ‘పంచ గవ్యం’ అది. గోమూత్రం, గోమయం, మొదలైనవి కలిపిన చిక్కని ద్రావకం. దాని రుచి దుర్భరంగా ఉంది.

చిన్న దర్భ ముక్కను దీపారాధనలో వెలిగించి, ఆరిపోయిన తర్వాత, నాలుక చాపమని, పతంజలి నాలుకపై పెట్టాడు. సురుక్కున మండింది నాలుక. బాధను నిగ్రహించుకున్నాడు.

పతంజలిలో వీసమెత్తయినా పశ్చాత్తాపంగాని, తప్పు చేసిన భావంగాని కనపడలేదు మార్కండేయశర్మకు.

“వీడు చేయిదాటి పోతున్నాడే” అనిపించింది.

వారంరోజుల తర్వాత నిమ్మకాయల బస్తాలు వేసుకుని మద్రాసు వెళ్లొచ్చాడు. పంట బాగా పండి, మార్కెట్‌కు విపరీతంగా నిమ్మకాయలు వచ్చాయి. పెంచలయ్య మండీకే 350 బస్తాలు వచ్చాయి. ధర బాగా పడిపోయి గ్రేడు-1 కాయ నలభైరూపాయలు కూడ పలుకలేదు. పతంజలి తీసుకువెళ్లిన 28 బస్తాలుకు వెయ్యిరూపాయలు కూడా రాలేదు.

పట్టుగూళ్లమ్మితే వచ్చిన డబ్బులో పదిహేనువందలు ‘లోన్‌’కు కట్టాడు. రెండో పంటకు సీడ్‌ తెచ్చుకున్నాడు. ఆకు రడీగా ఉంది. ఈ లోగా నవంబరు నెలలో తుపాను వచ్చింది. మిరపతోట దెబ్బతినింది. పండు మిర్చి అంతా రాలిపోయి, తడిసిపోయింది. వాటిని ఏరి, ఆరబెట్టుకున్నారు. కాయలు రంగుమారి మచ్చలు ఏర్పడటంతో కొనడానికి వ్యాపారస్థులు ముందుకు రాలేదు. ఈత చాపల్లో, ఎండిన పండుమిర్చిని గోతాల్లో లాగా కుట్టి పశువుల శాలలో ఒకమూల పేర్చారు. కొన్ని రోజులకు, వీధుల్లో కారంపొడి అమ్ముకునేవారు మిర్చిని అతి చౌకగా కొన్నారు.

పట్టుగూళ్లు రెండో పంట కూడ బాగానే దిగింది. నలభై రెండు కేజీలయ్యాయి. అప్పటికి హిందూపురంలో ప్రయివేటు వ్యాపారుల మార్కెట్‌ తయారయ్యంది. కర్నాటక రేట్‌ ఇస్తుండటం వల్ల ఆక్కడికి వెళ్లాడు పట్టుగూళ్లను వేసుకొని, వచ్చిన డబ్బులో ఒక వెయ్యి రూపాయలు లోన్‌ కట్టాడు.

మూడో పంట ఫిబ్రవరిలో వచ్చింది. ఎండలు ముదరకపోయినా చల్లదనం పోయింది. కిటికీకి, ద్వారాలకు పల్చని గోనెపట్టాలు తడికి వేలాడదీశారు. షెడ్డులో ఫ్యాన్‌ వేయించారు. మూడవ జ్వరం నుండి లేచిన తర్వాత “పాలపురుగు” తెగులు ఏర్పడింది. పురుగులు తెల్లగా మారి, కుళ్లిపోసాగాయి. నాలుగు రోజుల్లో అన్నీ చనిపోయాయి.

అసిస్టెంటు వచ్చి చూచి బాధపడ్డాడు. మళ్లీ జూన్‌ వరకు పంట వద్దన్నాడు. మిగిలిన మల్చరీ పంటను అవసరమైన వాళ్లకు యిచ్చేయమన్నాడు. తట్టలు, స్టాండు, కత్తిపీటలు అన్నీ ద్రావణంతో తుడిచిపెట్టమన్నాడు. మల్బరీ మొదళ్లను నెలకొకసారి ఆరుతడి పెట్టమన్నాడు.

మార్చి నుండి నిమ్మపంట కూడ తగ్గిపోతుంది. కాని ధర పలుకుతుంది. రోజూ రాలిపోయిన కాయలు ఒక బస్తావరకు వస్తాయి. ఊర్లో ఖర్చవవు. అందుకని రోజూ ఉదయం అనంతపురం – శ్రీశైలం బస్సులో ఆ బస్తా కాయలు వేవుసుకొని కర్నూలు వెళ్లేవాడు. శ్రీశైల దేవస్థానంవారి బస్సు అది. అక్కడ నుంచి రిక్షాలో వేసుకొని మున్సిపల్‌ హాస్పిటల్‌ దగ్గర ఉన్న గౌస్‌ మండీకి వేసేవాడు. అక్కడవారు, గ్రేడింగ్‌ చేసి, వంద ఇంతని గంపలవాళ్లకు అమ్మి, 11 గంటలకల్లా డబ్బులిచ్చేవారు. మళ్లీ ఖాళీ గోనెను తీసుకుని బస్సులో వెల్దుర్తికి వచ్చేవాడు. రోజూ నలభై యాభై రూపాయలు వచ్చేది.

ఉదయం మండీ దగ్గరే మార్కెట్‌ ఉడిపి హోటల్లో టిఫిన్‌ చేసి, మధ్యాహ్నం భోజనానికి యింటికి వచ్చేవాడు. భోజనం చేసి మళ్లీ తోటకు వెళ్లేవాడు.

వాగ్దేవి అక్క పెళ్లి కోసం చేసిన అప్పు అలానే ఉంది. పట్టు పరిశ్రమ అప్పు కూడ మళ్లీ కొంచెమైనా కట్టలేదు. గేటు చేనులో వేరుశనగ వేసేవారు. కంది పంటకూడ మధ్యలో వేసేవారు. దాన్ని ‘సరికోరు’ కిచ్చారు. ‘సరికోరు’ అంటే పొలం మనది, దున్నడం విత్తనాలు వేయటం, గుంటకతోలడం, ఇలాంటి పనులన్నీ ఒక రైతుకప్పచెప్పుతారు. ఎరువుల ఖర్చు కూడ చెరిసగం. వచ్చిన పంటను భూమి స్వంతదారు. రైతు చెరిసగం పంచుకుంటారు.

(సశేషం)

Exit mobile version