[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]మ[/dropcap]రుసటి రోజు శ్రీశైలం బస్సులో నిమ్మకాయలు వేసుకొని వెళ్లాడు. అక్కడ ‘తాండ్రపాడు’కు చెందిన రైతు బాజిరెడ్డి కలిశాడు. ఆయనకూ నిమ్మతోట ఉంది. వాళ్ల ఊరు కర్నూలుకు చాలా దగ్గర ఐదు కిలోమీటర్లు కూడా ఉండదు. నంద్యాల రోడ్‌లో ఉంటుంది. ఆయన పెద్ద రైతు. దాదాపు ముప్ఫై ఎకరాలుంటుందాయనకు. ఐదెకరాలలో నిమ్మతోట వేశాడు. సొంత ట్రాక్టరు ఆయనే నడుపుకుంటూ నిమ్మకాయ మూటలు వేసుకొని వస్తాడు. ఇంతకుముందు మూడు నాలుగుసార్లు కలిశారు గాని పెద్దగా మాట్లాడుకోలేదు.
కాయలు అమ్మకమై, డబ్బులు తీసుకున్న తర్వాత బాజిరెడ్డే పలకరించాడు.
“ఏంసామీ, ఈ మధ్య రాలేదు కర్నూలికి?”
“అవును వేరే పనులుండినాయి.”
“తోటకు పశువుల ఎరువుగాక, ఇంకా ఏం పెడతాండారు స్వామీ!”
“వేపపిండి.”
“మొన్న తాడిపత్రి పెండ్లికి పోయుంటిలే. ఆడ మా బందువు నర్సిరెడ్డని కలిసె. ఆయనకూ రాయల చెరువులో నిమ్మతోట ఉండాది. ఆయన ఒక విసయం జెప్పె. నిమ్మ చెట్లకు ఎండు శాపల చెత్త ఎరువుగా వేస్తే బలె పనిజేచ్చాదంట. కర్నాటకలో శాన అగ్గవకిచ్చారంట. దాని ధరకంటె లారీ బాడుగే ఎక్కువైతాదంట. కాని అదేసినాంక చెట్లు బలె తిరుక్కుండాయంట. పూత కూడ బ్రెమ్మాండంగా వచ్చి పిందె రాలడం కూడ తగ్గిందంట” అన్నాడు బాజిరెడ్డి.
“ఎండుచేపల చెత్త అంటే” అని అడిగాడు పతంజలి.
“సముద్దరం ఒడ్డున శాపలు ఎండబెట్టినాంక, అవి ఎక్స్‌పోర్టు జేచ్చారంట. ప్యాకింగు జేసినపుడు ఇరిగిపోయినవి, రాలిపోయిన పొట్టు, ఎముకల్లాంటివన్నీ పక్కకు బెట్టేచ్చారు. అదే మనకు ఎరువుగా పనికొచ్చాది. పెద్ద పెద్ద జల్లెడ లుంటాయంట. ఎండు శాపల నందులో పోసి జల్లెడపడతారంట. జల్లెడలో కింద మిగిలిన సెత్త కూడ ఎరువే”
“అది ఎక్కడ దొరుకుతుందట?”
“మంగులూరు, గోకర్ణం కాడ దొరుకుతుందట. రెండ్రోజులుండి ముగ్గురు నలుగురి దగ్గర సేకరిచ్చి కోవడమే. లారీ లోడు ఎయ్యి రూపాయలలోపే అయితాదంట. ఆడి నుంచి మనకాడికి లారీ బాడిగ పదైదు నూర్ల వరకు ఉంటాదట. పెద్ద బండి పద్మూడు టన్నులదయితే మనకు ఎక్కి తొక్కి”
“మీరు చెప్పింది బాగుంది. కాని అంతదూరం నుండి తెచ్చుకోవాలా అని”
“మనకు యాప పిండైనా, ఆముదం పిండైనా, తక్కువకేం రావడం లేదుగదా. ఇంక బుడ్డల చెక్కైతే మనం బరించలేం. మూడు మనం భరించలేం. మూడు వేలలోపు లారీ లోడు వస్తూందంటే అగ్గవే అనిపిచ్చుంది. నీవు గూడ వచ్చావంటే ఇద్దరం బోయి ఏసుకొచ్చుకొని చెరిసగం లోడు తీసుకోవచ్చు.”
కాసేపు ఆలోచించాడు పతంజలి.
“మానాన్నగారితో ఆలోచించి ఏ విషయం మూడు నాలుగు రోజుల్లో చెబుతాను”
“అట్టనేగానీ, తొందరేముంది? నేను మల్ల బుధవారం వచ్చా కాయలేసుకొని. నివు గూడ్క బుధవారం వచ్చావా?”
బుధవారం ఇంకా మూడు రోజులుంది. ఈ రోజు శనివారం. ఆ రోజు తనకూ రెండు మూటలు కాయలవుతాయి. “సరే” అన్నాడు.
వెంట పుస్తకం తెచ్చుకున్నాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. బస్సులో, మండీలో వెయిటింగ్ చేసే సమయంలో చదువుకుంటున్నాడు.
మధ్యాహ్నం ఇల్లు చేరుకున్నాడు. తండ్రి భోజనం చేసి తోటకు వెళ్లాడని అమ్మ చెప్పింది. తానూ భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని తోటకు వెళ్లాడు. వంకాయలు, దోర టమాటలు కోయిస్తున్నాడు తండ్రి. అవొక పది కేజీలు, ఇవొక పది కేజీలు దిగాయి.
“రేపు ఎత్తండం బేరమోల్లకు చెప్పి తోలుకొచ్చా సామీ” అన్నాడు తోకోడు. “తూకం వెయ్యడానికి మేదరి వీధికి బోయి రెండు వెదురు తట్టలు రెండు కేజీలు పట్టేవి తీసుకొని, వాటికి మూడు తాళ్లు గట్టి, ఒక అడ్డకర్ర వెదురు బొంగు సన్నది తీసుకో. మధ్యలో కమ్మరోని దగ్గర బొక్కపొడిపించు. తక్కెడ తయారు జేసుకోని రా. తూకం రాళ్లు యాడకొంటాం గానీ, రెండు కేజీల తూకం రాయికి సరిసమానమైన గుండ్రాయి యాదైనా జూడు” అన్నాడు పతంజలి.
సుంకన్న అన్నాడు “టమోటలు దోరవే తెంపాలి. రెండు రోజులకు ఎర్రగైతాయి. వంకాయలు కూడ ముదర కుండానే తెంపాల”
“కరెక్టు” అన్నాడు పతంజలి. “ఈ లెక్కన రోజూ అవి పది, ఇది పది ఇరవై కేజీలు తెగుతాయి”
“పదిరోజులుపోతే రోజూనలభై కేజీలు తెగుతాయనుకుంటున్నా” అన్నాడు మార్కండేయశర్మ.
పలగాడి పక్కనే గడ్డివామినానుకొని చిన్నపాక ఉంది. అందులో వంకాయలు టమోటాలు రెండు కుప్పలు పోసి, గోనె పట్టాలు కప్పారు. “మునక్కాయలు ముదిరిపోతుండాయి. ఇయాల తెంపాల” అన్నాడు తోకోడు.
“ఆ పని జూడు పోండి” అన్నాడు పతంజలి.
తోటలో నీళ్లకాలువ నానుకొని రెండు మునగ చెట్లున్నాయి. వాటి సీజన్‌లో విపరీతంగా కాస్తాయి. పెద్ద వృక్షాలవి. తెంపినప్పుడల్లా ఐదారువందల కాయలు వస్తాయి.
మూడు కాయలు ఒక కట్ట చొప్పున ఈతాకులతో కట్టి, కట్ట పావలా చొప్పున గంపల వాళ్లకమ్ముతారు. ఆనుకుల దేవమ్మ, మానుకింద గడ్డయ్య పెండ్లాం మారెమ్మ ఇవి కొనుక్కొని, కట్ట నలభై పైసలు, అర్ధరూపాయి, అట్లా అమ్ముకుంటారు.
తండ్రీకొడుకు లిద్దరూ మునగ చెట్టుకు కొంచెం దూరంగా కాలువ గట్టుమీద కూర్చున్నారు. చేపల ఎరువు గురించి బాజిరెడ్డి చెప్పిందంతా తండ్రికి వివరించాడు పతంజలి. ఆయన శ్రద్ధగా విన్నాడు. “వేప పిండి కూడ బస్తా 30, 35 వరకు వుంది. చెట్టుకు ఐదారు కేజీలు వేసుకున్నా నలభై బస్తాలు కావాలి. దాదాపు పన్నెండు వందలు. వేపనూనె జిన్ను (మిల్లు)లో హమాలీలకు, రెండు మూడు రోజులు మన బండిలో తోలినా జీతగాండ్ల కూలీ, ఇంకో నూర్రూపాయలు వేసుకో. ఆ బాజిరెడ్డి చెప్పిన ప్రకారం, ఇంకో రెండు వందలు పెడితే దాదాపు ఆరు టన్నుల చేపల పొట్టు వస్తుంది. మన మూడు వందల చెట్లకు ఒక్కో దానికి ఇరవై కేజీలు వెయ్యొచ్చు” అన్నాడు.
“వేపపిండి జిన్నువాడు మన శిష్యుడే కాబట్టి అప్పుగా యిస్తాడు. మరి దీనికి సద్యోజాతంగా డబ్బు కావాల్నే” అన్నాడు. “దీని గురించి ఒకసారి రాధాసార్ను కూడ అడుగుతా నాన్న, ఆయన కూడ మంచిదే అంటే మన శెట్టి ఉన్నాడు కద ఈ నెల నెలన్నర కూరగాయలపంట డబ్బులోంచి ఒక వెయ్యి చెల్లువేస్తే సరి” అన్నాడు పతంజలి.
“అదే మంచిది” అన్నాడాయన. “ఏదో పుస్తకం తెచ్చినట్లున్నావ్!”
“సంస్కృతం పుస్తకం తెచ్చాను కాసేపు పాఠం చెప్పించుకుందామని”
తండ్రి ముఖం ప్రసన్నమవడం గమనించాడు పతంజలి.
“ఏదీ, తియ్యి, శ్రీకృష్ణ కర్ణామృతం చెప్పుకుందాం”. ముందు లీలా శకుడు ఎవరో చెప్పాడాయన. “వ్యాసుని పుత్రుడు శుకమహర్షి కాదీయన. కృష్ణతత్వాన్ని ఆపోశన పట్టిన మహా కవి. నీకు 25 శ్లోకాలు పెట్టారన్నావు కదా! ఏదీ అందులో మొదటి శ్లోకం చదువు”
పతంజలి ఒక శ్లోకం చదువుతుంటే, ఖండాన్వయం, దండాన్వయం చేసి, వివరిస్తున్నాడాయన. ఒక్కసారి వింటే చాలు. మళ్లీ అడగడు. అంత ధారణ. మరి అవధాని కదా! శ్రీకృష్ణుని అల్లరి చేష్టలు అత్యంత హృద్యంగా వర్ణిస్తున్నాడు లీలాశకుడు. వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికతను తండ్రి వివరిస్తూంటే శ్రద్ధగా విన్నాడు. వాటిని ఇంగ్లీషులోకి ఎలా తీసుకురావాలో మనసులో ఒక చిత్రం రూపు దిద్దుకుంటూంది పతంజలికి. ఐదు శ్లోకాలు. దాదాపు గంట పట్టింది. ఆ గంటసేపూ బాలకృష్ణుడు తమ తోటలో కాలవగట్టున అల్లరి చేస్తున్నట్లే అనిపించింది.
పొద్దుపడమటికి వాలుతూంది. మునక్కాయలు భుజానికెత్తుకొని జీతగాండ్లు పాకకు వెళ్లారు. ఈతాకులు చీల్చి వాటిని రేపు కట్టలుగా కడతారు. కూరగాయలవాండ్లు ఎలాగూ వస్తారు కాబట్టి వాళ్లతో ఒకరో ఇద్దరో తీసుకుంటారు.
బండిలో రాత్రికి మేత వేసుకొని, ఆవును బండి వెనుక కట్టేసుకుని, ఇంటికి బయలుదేరారు. ఆవు చూలుతో ఉంది. మరో నెలలో ఈనవచ్చు.
తండ్రీ కొడుకులు మాట్లాడుకుంటూ బండి వెంట నడక సాగించారు. చీకటి పడినా, బాగా అలవాటు పడ్డ తోవ కాబట్టి వాళ్లకేమీ ఇబ్బందిగా లేదు. ఆరుబయట చీకటికీ, మన యిళ్లలో చీకటికీ తేడా ఉంటుంది. ఎంత చిమ్మ చీకటయినప్పటికీ పొలాల్లో అస్పష్టంగా అన్నీ తెలుస్తుంటాయి.
***
ఇంటికి పోయి, అమ్మ యిచ్చిన కాఫీ తాగి, రాధాసారు యింటికి వెళ్లాడు పతంజలి. ఏ పనైనా అనుకుంటే దాని అంతు చూసేంతవరకూ నిద్రపట్టదు పతంజలికి. రాధాసారు ఇంట్లోనే ఉన్నాడు.
“రా సామీరా. ట్యూషన్లు బాగా జరుగుతూండాయా” అని అడిగాడు. “మీ దయవల్ల ఇంకా పిల్లల పెరిగినారు సార్” అన్నాడు. “నా దయేముండాది నా పాడె. అంతా నీ తెలివిని జూసి వచ్చాంటారుగాని” అన్నాడాయన.
సారు భార్య వచ్చి పలుకరించింది. ఇద్దరికీ ఉడకబెట్టిన బుడ్డలు తెచ్చిచ్చింది. తింటూ ఎండు చేపల పొట్టు గురించి వివరించాడు. నిమ్మ చెట్లకు అది మంచిదేనా, మీ సలహా తీసుకుందామని వచ్చానన్నాడు. “మంచిదే మంచిదే, చెడ్డదేంగాదు అన్నాడాయన” “ఎండిన చేపల పొట్టు, ఎముకలు, ఇవన్నీ పోషకాలే. కాని వేడి ఎక్కువ జేస్తాది. కొన్ని రోజులు మీద మీద నీళ్లు బెట్టల్ల. ల్యాకపోతే చెట్లు వాడు బట్తయి. పద్మూడు టన్నుల లోడు పది పదిహేనువందలకే వచ్చాది అంటుండావు సూడు. అది మాత్రం శానా అగ్గవ. ఒక్కసారి పెట్టి సూస్తే తప్పేమి. బూమికి గూడ ఎరువు మారుస్తుండాల” అన్నాడు.
హైదరాబాదుకు పోయి, అప్లికేషన్, సిలబస్ పుస్తకాలు తెచ్చుకున్నానని చెప్పాడు. ఆరువందలయిందనీ, ఏడువందలు బ్యాంకులో ఉందనీ చెప్పాడు.
“నీ పాసుగూల అప్పుడే దిగినావే రంగంలోకి. పానం బోయినా సరే ఆ బ్యాంకులో డబ్బులు ముట్టుకోగాకు. పరీక్షలపుడు సుమారు పదారు పదేడు రోజులుండాల్సొస్తది. అప్పుడది కాపాడ్తది మనల్ను. నా డబ్బు తిరిగియ్యాలని తొక్కులాడబాకు” అన్నాడాయన.
సెలవు తీసుకొని వచ్చేశాడు. వచ్చేసరికి ట్యూషన్ పిల్లలంతా బుద్ధిగా చదువుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రంనుండీ వాళ్లను రమ్మని చెప్పినట్లు గుర్తొచ్చింది.
తాను పనులమీద వేరే ఊర్లకు పోయినపుడు వాళ్లందరికీ తాను వచ్చేంతవరకు సరిపోయినంత వర్క్ ఇచ్చిపోతాడు పతంజలి. వెళ్లి వాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఒక చెక్క పెట్టి మీద పాత దుప్పటి మడత వేసి దానిమీద కూర్చుంటాడు.
“వచ్చే ఆదివారం ట్యూషన్ అందరికీ ఉంటుంది. గ్రామర్ క్లాసు వాళ్లతో బాటు” అని ప్రకటించాడు. ఒకటో తేదీ మూడు రోజులే ఉంది. ఫీజులు ‘కలెక్ట్’ చేయాలి అనుకున్నాడు. ఒక పుస్తకంలో అందరి పేర్లు తరగతి వారీగా రాసి పెట్టుకున్నాడు. పైన నెలల పేర్లు అడ్డంగా రాసి, ప్రతి నెలలో ఫీజు అందిన వెంటనే ఆ విద్యార్థి పేరుకు ఎదురుగా టిక్ పెట్టుకుంటాడు. వీళ్లకు సాంవత్సరిక పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఆ రోజు అరగంట ఎక్కువ చదివించి పంపించాడు. రేపట్నుంచి ప్రతి ఒక్కరూ కనీసం 3 ప్రశ్నలు తాను యిస్తే, చూడకుండా జవాబులు రాయాలని ఆదేశించాడు.
మరుసటి రోజు ఉదయం భోజనం చేసి, తోటకు వెళ్లాడు. ఉదయం నాలుగు గంటలకే లేచి ఆరు వరకు చదువుకుంటాడు. ట్యూషన్ పిల్లలొచ్చేలోపు స్నానం చేసి పూజ చేస్తాడు. పదమూడు పేపర్లు ఇలలో కలలో కంటిముందు నిలచి కలవర పరుస్తున్నాయి. ఫిబ్రవరి నెల ముగియబోతూంది. గట్టిగా ఎనిమిది నెలలున్నాయి పరీక్షలు. ఒక్కోసారి అనిపిస్తూంటూంది, హాయిగా 13 గైడ్లు తెచ్చుకొని వుంటే పోయేది అని. కాని తాను స్వంతంగా కష్టపడి చదివ అర్థం చేసుకొని, నోట్సు తయారు చేసుకుంటే, అదంతా మెదడులో పదిలంగా నిక్షిప్తమవుతూ ఉన్నది. ఎకనమిక్సే కొరుకుడు పడకుండా ఉంది. కొంచెం ఎవరయినా గైడెన్స్ ఇస్తే బాగుండుననిపించింది.
తోటకు వెళ్లేసరికి మునక్కాయలు కట్టలు కడుతూన్నారు. అయిపోవచ్చింది. లెక్కపెట్టాడు. నూట ఎనభై కట్టలు. కాసేపటికి ఎత్తండం గంపల వాళ్లూ వచ్చారు. నలుగురయిదుగురు బిలబిలమంటూ, అంతా ఆడవాళ్లే. వక్కాకు నములుతున్నారు. వారి బొడ్లో ఎప్పుడూ చిన్న ‘చిత్తి’ (సంచి) ఉంటుంది. దాంట్లో ఆకులు వక్కలు, సున్నం డబ్బా ఉంటాయి. అందరూ శుభ్రంగా ఉతికిన చీరలు వెలిసిపోయినవైనా, గోచీపోసి కట్టుకున్నారు. తలలకు బాగా ఆముదం పట్టించారు. వారి నుదుటన కుంకుమ బొట్లు మెరుస్తున్నాయి. వక్కాకుతో పండిన వాళ్ల నోళ్లు మనోహరంగా ఉన్నాయి. కాళ్లకు కడియాలు ప్రతి ఒక్కరి చంకలో ఒక జల్ల (గంప), బరువుమోసేటప్పుడు నెత్తికి ఒత్తిడి కలగకుండా ఒక చుట్ట కుదురు. దానివల్ల కూరగాయల గంప నెత్తిన స్థిరంగా ఉంటుంది. ఒకామె చంకలో సంవత్సరం కూడ నిండని పాప ఉంది.
ఎవరి ముఖంలోనూ దిగులుగాని నైరాశ్యంగాని కనపడలేదు పతంజలికి. అందరూ అమ్మవార్లే. ఎల్లమ్మ, సుంకులమ్మ, మారెమ్మ, మరియమ్మ, ఫాతింబీ ఇలా అందరూ బక్కపలచగా ఉన్నారు. “శ్రమశక్తి స్వరూపిణులు” అనుకున్నాడు పతంజలి. ఒక్కొక్కరు దాదాపు పదిపదేను కేజీల కూరగాయలు మోస్తూ వెల్దుర్తిలో, చుట్టుపక్కల పల్లెల్లో తిరిగి కూరగాయలు అమ్ముకుంటారు.
చిన్న నోట్ బుక్ తెచ్చుకున్నాడు పతంజలి. ఎవరెవరు ఎన్ని కేజీలు వంకాయలు, టమోటాలు కొన్నారో వివరాలు రాసుకోడానికి. తోటకు వస్తూ ‘దస్తుమియ కట్ట’ (రామళ్లకోట బస్టాండు) దగ్గర చిన్న మార్కెట్ లాగా ఉంటుంది ఇద్దరు, ముగ్గురు కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకొని అమ్ముతుంటారు. వాళ్ల దగ్గర రేట్లు కనుకున్నాడు. వంకాయలు రెండు రూపాయలు కేజీ, టమోట రూపాయిన్నర అని చెప్పాడు.
వాళ్లు వచ్చి పది నిమిషాలయినా, జీతగాండ్లు తాత్సారం చేస్తుంటే, “తొందరగా రండిరా నా బట్టల్లారా!” అనరచింది ఒకామె. తోకోడు అదిరిపడి “ఉండమ్మే. నీ పాసుగూల. బయపడి సస్తిని అదేం గొంతు తల్లే” అన్నాడు. అందరూ నవ్వారు.
“దాని గొంతు దాటికి బయపడే గద దాని పెనిమిటి దేశాలు పట్టుకుపాయె” అన్నాదొకామె.
“నాకు బయపడిగాదే నా సవితి. రాయచూర్లో కంపెనీల పనిజేస్తున్నాడు మావోడు” అన్నది పెద్దగొంతామె రోషంగా. “నీ మాదిరి మొగునికి బయపడి సంపాయించిన డబ్బులు ఆనా బట్ట కల్లు కర్చులకిచ్చే రకంగాదు నేను” అని రిటార్టిచ్చింది.
మిగతావాళ్లు కూడ నవ్వుతూ చూస్తున్నారు. ‘పనిలో స్ట్రెస్ తెలియకుండా భగవంతుడే వాళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను, రఫ్‌గా మాట్లాడ్డం ప్రసాదించాడేమో’ అనుకున్నాడు పతంజలి.
“తక్కువే ఉండాయి గద సామీ!” అన్నాదొకామె.
“రెండు రోజులు పోనివ్వండి. రోజూ ఇరవై కేజీలు పైగా తెగుతాయి” అన్నాడు. జీతగాళ్లిద్దరు తలా రెండు కేజీల వంకాయలూ, రెండుకేజీలు టమోటలూ తూకం వేసి వాళ్ల గంపల్లో పోశారు. వెదురు తట్టలు బరువు లేక అటూ ఇట్టు ఊగుతున్నాయి.
“నీ పెండ్లాం బుడ్డక్క మాదిరే నీ తక్కెడ కూడ బో వొయ్యారం జేచ్చుందిగదరా తోకనా బట్టా” అనిందొకామె.
తోకోనితో సహా అందరూ నవ్వారు. వాళ్ల చమత్కారమంతా స్వచ్ఛమయినదిగా, ఇతరులను ‘అఫెండ్’ చేయకుండా, అభిమానంగా ఉండటం గమనించాడు పతంజలి.
మారెమ్మ అనే ఆమె అన్నది.
“సామీ, ములక్కాయలన్నీ నాకెయ్యి”
“మొయ్యలేక చచ్చావ్ బక్కముండ. ఈరోజు మునక్కాయలన్నీ అందరం పంచుకుందాము” అన్నది ఫాతింబీ. ఆమె నల్లని బురఖా ధరించింది గానీ, ముఖాన్ని కప్పుకోలేదు. ఆమె చాలా అందంగా ఉంది. మరియమ్మ చంకలో పాప, చంకలో కూర్చొనే వాళ్లమ్మ దగ్గర పాలు తాగుతూంది. జాకెట్లోంచి ఆమె చనుమొన పాప చీకడం కనపడుతుంది. ఆ మాతృమూర్తిని చూచి ఒక పవిత్ర భావన కలిగింది పతంజలికి.
“ఆసెట్టు కింద కూకోని పిల్లను సముదాయించే దర్బేసిదానా! నీ కూరగాయలు మేమేం ఎత్తుకొనిపోంలే” అన్నదొకామె. మరియమ్మ చెట్టు కిందికి వెళ్లి కూర్చుని పాపకు పాలు పట్టసాగింది. అమ్మ తనకు అనుకూలంగా కూర్చోని పాలివ్వడం ఆ పాపకు చాలా హుషారునిచ్చింది. కాళ్లు చేతులూ ఉషారుగా కదుపుతూ పాలు తాగసాగింది.
తూకాలయి పోయినాయి. మునక్కాయలు తలా ముప్ఫై ఆరుకట్టలు వచ్చినాయి. వాళ్లు రేట్లడగకపోవడం ఆశ్చర్యం కలిగించింది పతంజలికి. అయినా చెప్పాడు.
“సరేలే సామి. నీవేం మాదగ్గర ఎక్కువ దీస్కుంటావా ఏందీ?” అన్నాదొకామె. అందరిపేర్లు, వివరం, ఇవ్వాల్సిన డబ్బు రాసుకున్నాడు. ఇద్దరు వెంటనే ఆకువక్క సంచిలోంచి డబ్బులు తీసి కట్టినారు. మిగతావాళ్లు మాత్రం “రేపిచ్చాంలే సామీ” అని వెళ్లిపోయారు.
మరియమ్మ గంపనెత్తుకుంటుంటే, పాపను తీసుకున్నాడు పతంజలి. “ఏం పేరు పెట్టావమ్మా” అని అడిగాడు.
“సువార్తమ్మ” అన్నదామె సిగ్గుపడుతూ. పాప పతంజలి జేబులో పెన్ను లాగటానికి ప్రయత్నించింది. జట్టు పీకింది.
“శానా తులగ (అల్లరి) పిల్లసామీ” అన్నదామె పిల్లను తీసుకుంటూ “మీ సావాసగాడు అగస్టీనుకు నేను సిన్నమ్మనైతా. వాళ్లమ్మ, నేను అక్కసెల్లెల్లం” అంది వెళ్లిపోతూ.
“అట్లనామ్మా, అగస్టీన్ నా ప్రాణ స్నేహితుడు” అన్నాడు పతంజలి సంతోషంగా అందరూ గంపలు నెత్తినపెట్టుకొని, చేతుల్తో పట్టుకోకుండా, అసలు నెత్తిమీద గంపలే లేనట్టు అవలీలగా అడుగులు వేస్తూ పలగాడి దాటారు.
“సామీ, పోయి మోటరెయ్యిపో. వంగ టమోట తోటకు నీళ్లు పెడదాం” అన్నాడు సుంకన్న.
“వద్దురా. ముందు కాయలు తెంపండి. నీళ్లు పెడితే బురదలో తెంపలేం” అన్నాడు పతంజలి. ఇంతలో వారి భార్యలూ వచ్చారు మొగుళ్లకు సద్దులు తీసుకొని. మగవాళ్లు పొద్దున అంబలి తాగి వచ్చేస్తారు. వారి భార్యలు మధ్యాహ్నం భోజనం తెస్తారు. వారికి పని లేనపుడు వీళ్లే వచ్చేటపుడు తెచ్చుకుంటారు.
వాళ్లు కాయలు తెంపుతుంటే పాకలో గోనెపట్టా పరుచుకొని చదువుకోవడం ప్రారంభించాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొదటి పేపరు తెచ్చుకున్నాడు. ‘ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ తదేక దీక్షతో చదువుతూ, ముఖ్యమైన వాక్యాలను అండర్‌లైన్ చేస్తూ, ప్రక్కన సబ్ హెడింగ్స్ రాసుకుంటూ ఉండిపోయాడు. సరస్వతీ దేవిని గురించి తపస్సు చేస్తున్న మునీశ్వరుడిలా.
రెండు ఛాప్టర్లు పూర్తి చేసేటప్పటికి ఒంటిగంట దాటింది. కాయలు తెంపడం పూర్తయింది. దాదాపు ఇరవై కేజీలు అయ్యాయి. పాకలో కుప్పబోసి, గోనెపట్టా కప్పారు.
“సామీ పైటాలయ్యింది. బువ్వదిందాంపా” అన్నాడు సుంకన్న. అందరూ ఇంజను రూం దగ్గర కానుగ చెట్టుక్రింద కూర్చున్నారు. పతంజలి కూడ కొంచెం దూరంలో కూర్చున్నాడు. అమ్మ ఒక కవర్లో బొరుగులు (మరమరాలు), పుట్నాల పప్పులు, ఉప్పుకారం, కొంచెం నెయ్యి వేసి కలిపియిచ్చింది మధ్యాహ్నం తినమని.
ఉదయం 9 గంటల సమయాన్ని, అంబటి పొద్దు అనీ, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాన్ని ‘పైటాల’ అనీ అంటారు. 9 గంటలకు కర్నూలు నుండి డోన్‌కు వెళ్లే రైలు అంబటి పొద్దు బండనీ, మధ్యాహ్నం కాచిగూడ నుండి డోన్‌కు వెళ్లే బండిని పైటాల బండనీ పిలుస్తారు. రైళ్లనీ తోటకు అతిదగ్గరగా ఉన్న రైల్వేలైను మీదుగా వెళుతూ వీళ్లకు కనబడతాయి. ప్రతి రైలు వెళ్లినంత సేపూ అందరూ నిలబడి దానివైపు చూస్తారు. రోజూ చూసినా విసుగురాదు. కాపేపు రైలు కట్ట వెంబడి ఎద్దులను ఆవును మేపుతారు ఎవరో ఒకరు.
సుంకన్న కొడుకు ‘సుధాకర్’ పతంజలి వైపు దోగాడుతూ రాసాగాడు మట్టిలోనే. వాళ్లమ్మ గాభరాపడుతూ వస్తూంటే, ‘రానియ్యమ్మా. పెద్దసామి యిప్పుడు రాడులే” అంటూ వాడిని ఎత్తుకున్నాడు వాడి మోకాళ్ల కంటిన మట్టి తుడిచాడు. వాడు కూడ పతంజలి జేబులోని పెన్ను లాక్కోవాలని చూశాడు. పతంజలి బొరుగుల కవరును పీకుతున్నాడు. “కారం రా నాన్నా, నీవు తినలేవు” అన్నాడు పతంజలి.
“లచ్చనంగా తింటాడు సామీ, కొర్రన్నంలో కొంచెం గొడ్డుకారం కలిపితే గాని నచ్చదు” అని చెప్పింది సుంకన్న భార్య. నాలుగు బొరుగు గింజలు నోట్లో పెడితే మహదానందంగా తిన్నాడు వాడు. రెండు మూడుసార్లు పెట్టించుకున్నాడు.
నలుగురూ చుట్టూ కూర్చుని సద్దులు విప్పుకున్నారు. గిన్నెలు లేవు. అన్నీ పాత గుడ్డల్లో కట్టుకొని వచ్చారు. ఒక గుడ్డతీసి క్రింద పరిచారు. తోకోని భార్య కొర్రన్నం, కొరివి కారం దాంట్లో వేసింది. సుంకన్న భార్య జొన్నసంగటి, ఊరుబిండి దాంట్లోవేసింది. తోకోడు అన్నింటినీ కలిపి పిసకడం ప్రారంభించాడు. ఆహారాన్ని కలపడంలో వాడు నిపుణుడు. కలపడం అయింతర్వాత
“రా సామీ, బువ్వతిందాం” అని పిలిచారు. ప్రతిరోజూ వాళ్లు అలా పిలవడం “మీరు తినండిరా” అని పతంజలి చెప్పడం మామూలే. కానీ ఈరోజెందుకో తోకోడు కలిపినది చూస్తుంటే నోరూరింది.
వాళ్ల దగ్గరికి వెళ్లి చేయి చాపాడు. “నాకు ఒక ముద్ద పెట్టడి” అంటూ. నిర్ఘాంతపోయి చూస్తున్నారు అందరూ.
“ఏం పరవాలేదు పెట్టురా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సాక్షాత్తూ ఆ దేవుని స్వరూపమే” అన్నాడు.
తోకోడు తేరుకుని, ఒక పెద్ద ముద్ద చేసి పతంజలి చేతిలో పెట్టాడు భక్తిగా. వాడి చేతులు వణుకుతూండడం గమనించాడు పతంజలి. ఆ ముద్ద ఎంత పెద్దదంటే దోసిలి పట్టాల్సి వచ్చింది.
దోసిట్లో ఉండగానే నోటితో అందుకుని తిన్నాడు. అద్భుతంగా ఉంచి రుచి. మొత్తం తినేసి చేతులు కడుక్కోవడానికి పంపు దగ్గరికి వెళ్లాడు. బుడ్డక్క చేతులెత్తి నమస్కరించింది పతంజలికి.
“సాచ్చాత్తు ఏసుపెబువే మనస్వామి” అన్నది. పతంజలి ఇదంతా గమనించలేదు. తిరిగి వచ్చి, కవర్లో ఉన్న బొరుగులన్నీ వాళ్ల తిండిలో పోశాడు. “ఇవి కూడ కలుపుకోండి. బాగుంటుంది” అన్నాడు.
తర్వాత గొంతు తగ్గించి చెప్పాడు వాళ్లతో “నేను తిన్నట్లు ఎవ్వరితో అనకండి”. ఇంట్లో తెలుస్తే ఏం జరుగుతుందో ఊహించి భయపడ్డాడు. ‘తాను స్వతంత్రుడినయ్యేవరకు తల్లిదండ్రుల ఆచారాన్ని పాటించాలి. తప్పదు’ అనుకున్నాడు.
భోజనం ఐన తర్వాత ముగ్గురూ బావిలో కాసేపు ఈత కొట్టారు. కేవలం డ్రాయర్లతో. వాళ్లిద్దరూ ఇంజనురూం లోంచి డైరెక్ట్‌గా బావిలోకి దూకుతారు. దాదాపు ఇరవై అడుగులుంటుంది. పతంజలికి అలా దూకాలంటే భయం. రూం పక్కన స్లోపులోంచి నీళ్లు అంచువరకు వెళ్లి బావిలో ఈదుతాడు. దీనికి కూడ గురువు తోకోడే.
పైకివచ్చి పంచెతో తల, ఒళ్లు తుడుచుకొని, పుస్తకాలు తీసుకొని ఇంజను రూములోకి వెళ్లాడు. వెళ్లేముందు “కంచె వెనక వైపు పెరిగింది. దాన్ని ఒక గంట సేపు సమంగా కొట్టి, తరువాత నిమ్మకాయలు ఏరండి” అని చెప్పాడు.
(సశేషం)