[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]తో[/dropcap]ట చుట్టూ ‘ప్రతాప కంప’ వేశారు. అది పశువులు మనుషులూ లోపలికి రాకుండా కంచెలా ఉంటుంది. రెండు మూడు నెలలకొకసారి వాటి కొమ్మలు పెరుగుతాయి. వాటిని ఎరుకల కొడవళ్లతో నరికి కంచెకు అడ్డంగా వేయాలి. ఒకరు పంగల కర్రతో పట్టుకుంటే, మరొకరు నరుకుతారు. చేతికి ముళ్లు కుచ్చుకోకుండా. పంగల కర్రతో నరికిన కొమ్మలను కంచెలో క్రింద ఏర్పడిన సందుల్లో దూరుస్తారు.
దాదాపు గంటకు పైగా చదువుకొని బయటకు వచ్చాడు. ఆడవాళ్లు నిమ్మకాయలు రాలినవి ఏరుతున్నారు. తానూ కంచె దగ్గరికి వెళ్లి, ఎరుకల కొడవలి తీసుకొని, ఒక అరగంట ప్రతాప కొమ్మలు ఒడుపుగా నరికాడు. బాగా చెమటపట్టింది.
“కాపోల్లు యాడ బోవాల్నో మా సామి ముందర. రాని పని లేదు. మొగోడు” అని పొగిడారిద్దరు జీతగాళ్లూ. ఈ పొగడ్త పతంజలికి రోజూ అలవాటై ఏమీ అనిపించదు. కర్నూలు జిల్లాలో రెడ్లను ‘కాపులు’ అంటారు.
ఐదవుతుండగా ఆడవాళ్లను పంపించాడు. సుధాకర్‌కేమయినా కొనిపెట్టమని వాళ్లమ్మకు పావలా ఇచ్చాడు. నిమ్మకాయ మూటలు, రాత్రికి పశువులకు మేత బండిలో వేసుకొని ఇంటికి బయలుదేరారు. పతంజలే బండి తోలాడు.
***
ఇంటికి పోతూనే అమ్మ ఇచ్చిన కాఫీ తాగి. ట్యూషన్ పిల్లల దగ్గరకి వెళ్లాడు. అందరికీ తలా నాలుగు ప్రశ్నలు ఇచ్చి చూడకుండా రాయమన్నాడు. వాళ్లు రాయటానికి ఎలాగూ అరగంట పడుతుంది. తానూ ఆ రోజు స్టడీ చేసిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు ఛాప్టర్లకు నోట్సు రాసుకోసాగాడు. రేపే ఒకటో తేదీ. పిల్లలందరూ రేపటి నుండి ట్యూషను ఫీజు కట్టడం మొదలు పెట్టాలనీ వారం రోజుల్లో అందరూ కట్టేయాలనీ చెప్పాడు.
తొమ్మిది, పది తరగతుల పిల్లలకు కాసేపు కొశ్చన్ టాగ్స్, వాటిలోని రకాలు, రూలుకు మినహాయింపులు అన్నీ బోర్డు మీద వివరించి, వాళ్ల టెక్స్ట్‌లో ఉన్న ఎక్సర్‌సైజ్ రేపటికి చేసుకురమ్మన్నాడు. ఒకవారం రోజుల తర్వాత, పబ్లిక్ పరీక్షలకు వెళ్లే ఏడు, పది పిల్లలు రాత్రి ఇక్కడే ఉండిపోవాలనీ, రాత్రి పదివరకు, తెల్లవారు జామున ఐదుకు లేపి చదివిస్తానని చెప్పాడు.
మార్చి నెల, ఫీజలు ఏప్రిల్ మొదటి వారంలో వస్తాయి. ఏప్రిల్, మే నెలల్లో ట్యూషన్లుండవు. ఆ రెండు నెలలూ ఇంగ్లీషు గ్రామర్ క్లాసులు పెడితే, కొంతైనా వస్తుంది అనుకున్నాడు.
ఆరు, ఏడు వాళ్లకు కారణాంకములు, క.సా.గు. గ.సా.ప్ర. లెక్కలు చెప్పాడు. ఎనిమిదిన్నరకు అందరూ కోరస్‌గా “గుడ్ నైట్ సార్” అని రాగయుక్తంగా చెప్పి వెళ్లిపోయారు. దాదాపు నలభైమంది పైగా ఉన్నారు. “వీళ్లే లేకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏమయ్యేదో” అనిపించింది.
టెంత్ పిల్లవాడొకడు వెనక్కు వచ్చి పతంజలితో చెప్పాడు. “సార్, ఆజంసారు ఈ రోజు వచ్చారు. రేపు యిల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారట. ఆయన వచ్చినపుడు నన్ను గుర్తు చేయమన్నారు కదాసార్” అన్నాడు. వాళ్ల యిల్లు ఆజం సారు వాళ్ల యింటికి రెండిళ్లవతలే. “చిత్తారిగేరి’ అంటారు ఆ వీధిని.
“సరే నేను ఇప్పుడే వస్తున్నాను పద” అన్నాడు పతంజలి.
సిలబస్, కొన్ని పుస్తకాలు సంచిలో పెట్టుకొని బయలుదేరాడు. ఆజంసారు యింట్లోనే ఉన్నాడు. ‘గుడీవినింగ్ సార్” అని విష్ చేశాడు సారును.
“రా స్వామీ! బాగున్నావా?” అంటూ లోపలికి పిలిచాడాయన. ముందు వరండాలో రెండు గాద్రెజ్ కుర్చీలున్నాయి. ఒక దాంట్లో తాను కూర్చుని. మరో కుర్చీ పతంజలికి ఆఫర్ చేశాడు. పతంజలి కిందనే కూర్చున్నాడు వినయంగా. శంకరయ్య సారింట్లో కూడ యింతే.
తన చదువు గురించి వివరించాడు, చాలా ఉత్సాహంగా “ఏం గ్రూపు తీసుకున్నావు?” అని అడిగాడు సారు. పతంజలి చెప్పాడు. “మంచి గ్రూపు. రేప నీవు ఐ.ఎ.ఎస్‌కు వెళ్లాలన్నా ఆప్షనల్స్ ఇవే తీసుకోవచ్చు”
తన గురువులకు తనమీద ఉన్న నమ్మకానికి కళ్లు చెమ్మగిల్లాయి పతంజలికి. శంయరయ్యసారూ ఇదే మాటన్నాడు.
సారు సిలబస్ అంతా తిరగేశాడు. “బాగుంది స్వామీ. గైడ్లు ఫాలో అవకుండా సొంతంగా నోట్సు తయారు చేసుకుంటున్నావు కదా. దానికి నిన్నభినందిస్తున్నా. ఇంగ్లీషు మీడియం తీసుకోవడం మరీ మంచిదయింది. ఇట్ విల్ ఎన్‌హాన్స్ యువర్ ఎఫిసియన్సీ ఇన్ ఇంగ్లీష్” అన్నాడు. సారు ముస్లిం అయినా, ఆయన భాషలో ఇసుమంతయినా ఉర్దూ ప్రభావం ఉండదు. ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది.
లోపల్నుంచి సారు భార్య వచ్చింది, ఇద్దరికీ చాయ్ తీసుకొని. “నమస్తే అమ్మా” అన్నాడు.
“జీతే రహా బేటా” అన్నదామె.
“సయ్యదయ్య శతకం పూర్తయిందా సార్” అన్నాడు టీ తాగుతూ.
“ఎప్పుడో. దాన్ని ప్రచురించాలని ఉంది. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా” అన్నాడు సారు నవ్వుతూ.
“ఎకనమిక్స్ సబ్జెక్టు కష్టంగా ఉంది సార్” అన్నాడు.
ఆయన కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు. “మన ఖాజాహుసేన్ కొడుకు ఇద్రూస్‌బాష తెలుసా నీకు?” తెలియదన్నాడు పతంజలి.
“కోలన్న బావి దగ్గరే వాళ్ల యిల్లు. అతను నాగపూర్ యూనివర్సిటీలో, ఎమ్.ఎ. ఎల్.ఎల్.బి చేశాడు. కర్నూల్లో పెళ్లి చేసుకున్నాడు. ఎమ్.ఎ.లో అతని సబ్జెక్ట్ ఎకనామిక్సే. కర్నూల్లో వాళ్ల మామ అడ్వొకేట్. పేరు కరీంఖాన్. మామ దగ్గరే ప్రాక్టీసు చేస్తూంటాడు. ప్రతి ఆదివారం తల్లిదండ్రులను చూడటానికి వెల్దుర్తికి వస్తాడు. ఒకసారి వెళ్లి కలువు. అతను ఎకనమిక్స్‌లో నీకు సాయం చేయగలడు” అన్నాడాయన.
ట్యూషన్లు చెపుతున్నట్లు కూడ చెప్పాడు. “వ్యవసాయం, ట్యూషన్లు, నీవు ఎప్పుడు చదువుకుంటావు స్వామీ” అన్నాడాయన అభిమానంగా.
ఆయన పాదాలకు నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. సారు పతంజలిని దగ్గరకు తీసుకున్నాడు.
“బాగా చదువుకో. జాబులు రాస్తూండు. ఎప్పుడయిన సంజామలకు రా” అన్నాడు.
సారును వదలి వస్తూంటే గుండె బరువెక్కింది పతంజలికి.
మొదటి వారంలో దాదాపు మూడు వందల రూపాయలు ట్యూషన్ ఫీజు వసూలయింది. పాలు పోసే మద్దమ్మకు ఇచ్చేశాడు. కరెంటు బిల్లు ఇంటిదీ తోటదీ కట్టేశాడు. సుబ్బరాయుని అంగట్లో నెలవారీ కిరాణా సామాన్లన్నీ తెచ్చేశాడు. రాధాసారు ఎంత వారిస్తున్నా వినకుండా ఆయనకు వందరూపాయలిచ్చి వచ్చాడు.
రోజూ కూరగాయలు బాగా దిగుతున్నాయనుకొనేలోపే, టమేటో పంట విపరీతంగా వచ్చి ధర పడిపోయింది. రిటైల్‌గానే అర్ధరూపాయి కేజీ అమ్ముతున్నారు. ఎత్తండం వాళ్లకు కిలో ముప్ఫై పైసలకే వేయాల్సి వచ్చింది. వంకాయలే కొంత బెటర్. కేజీ రూపాయికి తగ్గడం లేదు. మరొక నెల రోజుల తర్వాత ఈ ఆదాయమూ ఉండదు.
పరీక్షకు అప్లికేషను ఫారం నింపాడు, చలానా ఎలాగూ హైదరాబాదులోనే కట్టేశాడు. కాబట్టి సమస్యలేదు. టెంత్ ఫోటోలో ఉన్న ముఖానికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. షేవింగ్ సెట్ కొనుక్కొని రోజుమార్చి రోజు షేవ్ చేసుకుంటున్నాడు. మీసాలు పెంచాడు. తండ్రి అభ్యంతరం చెపుతాడేమో అనుకున్నాడు. ఆయనేమీ అనలేదు.
నిమ్మకాయలు వేసుకొని కర్నూలుకు పోయినప్పుడు ఫోటో తీయించుకున్నాడు. అప్లికేషన్ ఫారం మీద హాల్ టికెట్ల మీద మూడు అతికించాడు. టెంత్, ఇంటర్ సర్టిఫికెట్లు, మార్క్ లిస్ట్, టి.సి. రెండు కాపీలు టైపు చేయించిపెట్టుకున్నాడు. రాధాసారుతో అన్నీ ఫోటోలతో సహా అటెస్టేషన్ చేయించి, స్టాంపు వేయించుకున్నాడు. అన్నీ జాగ్రత్తగా దారంతో కుట్టి, కవర్లో పెట్టి, రిజిస్టరు పోస్టులో యూనివర్సిటీకి పంపాడు. రశీదు భద్రపరచుకున్నాడు.
పబ్లిక్ పరీక్షలు రాసే పిల్లలు పదిహేడు మంది రాత్రి ఇక్కడే ఉండి చదువుకుంటున్నారు. వాళ్లను తెల్లవారుజామున లేపి, గంట చదివిస్తున్నాడు. తండ్రి వద్ద సంస్కృత పాఠాలు సాగుతున్నాయి. బాజిరెడ్డి మళ్లీ అడిగాడు చేపల పొట్టుకు వెళదామని. వచ్చే నెలలో తప్పక వెళదామని, తన ట్యూషన్లు అయిపోతాయనీ, మళ్లీ గ్రామర్ ప్రారంభమయ్యే లోపల వెళ్లిరావొచ్చని చెప్పాడాయనకు.
ఒక ఆదివారం ఖాజాహుసేన్ వాళ్లింటికి వెళ్లాడు పతంజలి. ఆయనా రైతే. ఇంటిముందే ఎద్దుల కొట్టం ఉంది. గేదెలు కూడ ఉన్నాయి. ఐదారు మేకలు. రెండు పొట్టేళ్లు ఒక వైపు కట్టేసి ఉన్నాయి. కొట్టం అటకమీద నాగళ్లు, గుంటకలు, తోళ్లు, గొర్రు (విత్తనం వేసే సాధనం) పెట్టి ఉన్నాయి పేడవాసన వస్తూంది.
పతంజలి రావడం చూసి ఖాజాహుసేన్ గబగబ ఎదురొచ్చాడు. “రాండి రాండి సామీ, ఈ రోజు మాకు మంచిదినం. సామి మాయింటికి వచ్చినాడు. నమస్కారం” అంటూ లోపలికి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. పశువుల కొట్టానికి పూర్తి భిన్నంగా ఉంది వరండా. ద్వారానికి కిటికీలకు చక్కని తెరలు కట్టారు. కుర్చీలు టేకువి. వాటికి ‘మెత్తలు’ (కుషన్స్) వేసి ఉన్నాయి. గోడకు మక్కా క్షేత్రం ఫ్రేము కట్టిన పటం, ఖురాను సూక్తులు రాసి ఉన్న రెండు మూడు చిన్న పటాలు తగిలించి ఉన్నాయి.
“చెప్పండి సామీ” అన్నాడాయన వినయంగా. వెల్దుర్తిలోని పెద్దమనుషుల్లో ఆయన ఒకరు. పతంజలి గురించి విని ఉన్నాడు.
“మీ అబ్బాయి ఇద్రూస్ భాషాగారిని కలవాలి. నా చదువు విషయంలో” అన్నాడు పతంజలి.
“మా తమ్ముని కొడుకు యింతియాజ్ మీ దగ్గరే ట్యూషన్ చదువుతాడు. తొమ్మిది” అన్నాడు ఖాజాహుసేన్. “ఊరంతా మీది పేరే చెప్పుకుంటారు. బహుత్ సమజ్ దార్ హై ఆప్” అన్నాడు.
“మా వాడు పొద్దున వచ్చినాడు. మళ్లీ సాయంత్రం వెళ్లిపోతాడు. లోపల ఉన్నాడు. పిల్చుకొస్తానుండండి” అంటూ లోపలికి వెళ్లాడు.
కాసేపటికి కొడుకుతో తిరిగి వచ్చాడు. నిలబడి నమస్కరించాడు పతంజలి. దాదాపు ముప్ఫై సంవత్సరాలలోపు యువకుడు ఇద్రూస్ భాషా. తెల్లని లాల్చీ, పైజమా ధరించాడు. ఇంట్లో కూడ హవాయి చెప్పులు వేసుకున్నాడు. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. అందమయిన కళ్లజోడు అతనికొక ‘ఇంటలెక్చువల్ లుక్’ ఇచ్చింది.
“మార్కండేయశర్మ సామి కా బేటా, పతంజలి సామి. తుమ్ సే మిల్నే ఆయే” అంటూ పరిచయం చేశాడు. చిరునవ్వుతో షేక్ హాండ్ యిచ్చుకున్నారు.
ఇద్దరూ కూర్చున్న తర్వాత తన విషయం చెప్పాడతనికి. ఎకనమిక్స్ పుస్తకాలు మూడు చూపించాడు. సిలబస్, మాడల్ పేపర్లతో సహా. అన్నీ చూసి అన్నాడతను.
“ఐ విల్ హెల్ప్ యు సర్టన్లీ పతంజలీజీ. కం ఎవ్విరీ సండే టు మి. ఐడెంటిఫై ది డిఫికల్ట్ టాపిక్స్ ఫర్ యు. యాజ్ ఆల్ ఆర్ ఎస్సే క్వశ్చన్స్ దేర్ విల్ బి నో ప్రాబ్లం”
“ఐ విల్ బి ఇన్‌డెటెడ్ టు యు ఫర్ దిస్. అవర్ టీచర్ సయ్యద్ మహమ్మదాజం టోల్డ్ మి అబౌట్ యు.”
“హి వజ్ మై టీచర్ టూ, వెన్ అయ్ వజ్ ఇన్ హైస్కూల్. హి ఈజ్ ఎ గ్రేట్ టీచర్”
లోపల్నుంచి బూబమ్మ మజ్జిగ తీసుకొని వచ్చింది యిద్దరికీ. “బడాసామి శర్మసాబ్ కా బేటా” అని చెప్పాడామెకు భర్త. మజ్జిగ చూసి, “చాయ్ బనానా థా మా” అన్నాడు కొడుకు.
“బొమ్మన్ లోగ్ హమారే ఘరోం మే కుచ్ నై లేతే. ఇస్‌లియే మై ‘మోర్’ లాయాహు” అన్నదామె.
“అదేంలేదమ్మా, నాకలాంటి పట్టింపులు లేవు. చాయే తాగుతాను. మీ యిళ్లల్లో చాయ్ చాలా బాగుంటుంది” అన్నాడు పతంజలి.
బూబమ్మ ముఖం ప్రసన్నమయింది. లోపలికి వెళ్లింది. ఇదురూస్ భాషా పతంజలితో “ఐ అప్రీసియేట్ యు ఫర్ యువర్ లిబరల్ ఆటిట్యూడ్” అన్నాడు.
చాయ్ వచ్చింది. ఏలకులు వేసి చేసిందామె. ఘుమఘుమలాడుతూంది. యింటి పాడి వుంది కాబట్టి పాలు కూడ చిక్కనివే వాడింది.
“వచ్చే ఆదివారం నుండి వస్తాను. ఏటయింలో రమ్మంటారు?”
“ఈ టైమే ఐడియల్” అన్నాడతను.
‘బై’ చెప్పి వచ్చేశాడు. ఖాజాహుసేన్ మాత్రం వీధి వరకూ వచ్చి, నమస్కారం చేసి సాగనంపాడు పతంజలిని.
***
ఆరోజే రామ్మూర్తి బావకు వివరంగా ఉత్తరం వ్రాశాడు ఇన్‌ల్యాండ్ కవర్లో. తన చదువు విషయమంతా, గద్వాలలో సాగర్‌గారిని కలవడం నుంచి ఇదురూస్ భాషా వరకు వివరించాడు.
మరో నాలుగు రోజుల్లో టమోటా పంట ఎక్కువై. కేజి పది పైసలకు పడిపోయింది. గంపలవాళ్లు వంకాయలు మాత్రమే చాలు టమేటాలు వద్దనసాగారు. రైతులు టమోటాలను ఎరువు దిబ్బలకు తోలుతున్నారు. తోటలో పంటంతా కొనేవారు లేక కుళ్లిపోసాగింది. విధిలేని పరిస్థితిలో టమోటో మొక్కలను భూమిలోనే కలయ దున్నారు కనీసం ఎరువుగా మారుతుందని.
మహిత టెంత్ పూర్తియింది. చదువు అక్కడితో ఆపి ఇంట్లో అమ్మకు సహాయం చేస్తూంది. మల్లినాధ ఎనిమిదికీ, పాణిని ఆరుకూ వచ్చారు. వర్ధనమ్మ ఆరోగ్యం కూడ బాగుండటం లేదు. మాటిమాటికి దగ్గు వస్తూంది.
మార్చి చివరి వారంలోనే టెంత్ పరీక్షలు అయిపోయాయి. పరీక్షల సమయంలో కూడ పిల్లలు రాత్రి ఉండి చదువుకొన్నారు. ప్రతి పరీక్షముందు రోజు ఇంపార్టెంట్ ప్రశ్నలు సెలెక్ట్ చేసి చదివించాడు. సెవెన్త్ పిల్లలకు ఏప్రిల్ మూడవ వారంలో పరీక్షలు అందరికీ ఏప్రిల్ మొదటివారంలో సెలవులిచ్చేశాడు. అందరూ ఫీజులు కట్టేశారు. ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల వారికి గ్రామర్‌లో స్పెషల్ క్లాసులుంటాయనీ, రోజూ 2 గంటల పాటు ఉదయం 8 నుండి పదివరకు చెబుతానని, మన ట్యూషనుకు రాని పిల్లలకు కూడ ఈ విషయం తెలియజేయమనీ తన పిల్లలందరికీ చెప్పాడు.
రామ్మూర్తి బావ, వాగ్దేవక్క ఉత్తరం వ్రాశారు. పతంజలి డిగ్రీ చదువు బాగా జరుగుతున్నందుకు సంతోషిస్తూ, బెస్ట్ విషెస్ తెలియచేశాడు బావ. తనకు నంద్యాలకు ట్రాన్స్‌ఫర్ అయిందని, మరో వారం రోజుల్లో చేరతానని తెలిపాడు. తాము వెల్దుర్తికి దగ్గరగా వస్తున్నామని అక్కయ్య సంబరపడుతూ రాసింది. ‘శశి’ అల్లరి రోజురోజుకు ఎక్కువవుతూన్నదట. మొన్ననే తొలి పుట్టినరోజు చేశామనీ, చుట్టుపక్కల నలుగురిని పిలిచి పేరంటం చేశాననీ రాసింది. తాను మళ్లీ కడుపుతో ఉన్నాననీ, రెండవ నెలనీ తెలిపింది. ఇంటిల్లిపాదీ సంతోషించారు.
ఎండు చేపల పొట్టు తెచ్చుకుంటే బాగుంటుందని ఆలోచన చేశారు. ప్రతి ఎండాకాలం తోటకు ఎరువు పెట్టాలి. రోజూ బండితో చెరువులోని ఒండ్రు మట్టి తోలి, నిమ్మచెట్లకు వేస్తున్నారు, జీతగాళ్లిద్దరూ. ఆవు ఈనింది కోడెదూడను పెట్టింది. కాని నెల తిరక్కుండానే వాతం కమ్మి ఆవు చనిపోయింది. కోడె దూడకు ‘గణపతి’ అని పేరు పెట్టారు. బట్టది (అంటే గోధుమ, తెలుపు పొడల మిశ్రమం). పశది అంటే తెల్లని తెలుపు రంగు అన్ని అర్థం. కొన్ని రోజులు తల్లి మీద బెంగతో అరిచింది. తర్వాత మరిచిపోయింది. రోజూ పతంజలి వెంట తోటకు పోతుంది. మెడకు తాడు కూడ అవసరం లేదు. గొర్రెపిల్లలాగా వెంట వస్తుంది.
పశువుల శాలలో ఎద్దుల దగ్గరుండదు. ఇంట్లోకొచ్చి పడుకుంటుంది. కాలువ గట్టుమీద లేతగడ్డి రోజూ తెస్తారు. వారం పదిరోజులుపాలు లేక శుష్కించినా, తర్వాత తేరుకుని బలంగా తయారయ్యింది. తోటలో పతంజలి చదువుకుంటూంటే పక్కన వచ్చి పడుకుంటుంది. తల్లిలేని పిల్ల అని జీతగాళ్లతో సహా అందరికీ గారాబమే గణపతంటే.
ఇంట్లో సాంబారు చేసుకున్నప్పుడు రాత్రి వడియాలు వేయించుకుంటారు. ఒక్కోసారి అప్పడాలు. ఆ వాసన తగిలితే చాలు వంటింట్లోకి వచ్చేస్తుంది. పాణిని నాలుగు వడియాలో, అప్పడాలో నోటికందిస్తే తింటుంది. పతంజలి పూజ చేస్తుంటే వచ్చి చూస్తూ నిలబడుతుంది. మార్కండేయశర్మ రాత్రి నులకమంచం మీద ఆరుబయట పడుకుంటే, ఆయన వద్దకు వెళ్లి, పొట్టమీద తలపెట్టి, నిమరమంటుంది. అలా గణపతి మరో కుటుంబ సభ్యుడయ్యాడు.
ఒకరోజు మార్కండేయశర్మ రామలింగయ్య శెట్టి దగ్గరకెళ్లి పదిహేను వందలు అప్పుకావాలనీ, నిమ్మతోటకు ఎరువులు తెచ్చుకోవాలనీ చెప్పాడు. ఆయన సరేనని రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తానన్నాడు. “నీవేమో ఉదారంగా ఇస్తున్నావు నాయనా. మేము తీర్చలేకపోతున్నాము.” అంటూ శర్మ బాధపడితే శెట్టి ధైర్యం చెప్పాడు.
“మన పతంజలి సామి సమర్థుడు. ఆయన మీ అప్పులన్నీ ఏదో ఒకరోజు తీరుస్తాడు సామీ” అన్నాడు.
“అదే నాయనా నాకున్న ఆలంబన. వాడు అహర్నిశలు కష్టపడుతూ, ట్యూషన్లు చెబుతూ, కుటుంబం కోసం శ్రమిస్తున్నాడు. చిన్న వయసున వాడి నెత్తిమీద బరువులెత్తినాను” అన్నాడు ఆ నిస్సహాయ తండ్రి.
రెండు రోజుల తర్వాత నిమ్మకాయలు వేసుకుని కర్నూలుకు పోయినాడు పతంజలి. బాజిరెడ్డి కూడ వచ్చినాడారోజు. ఎండు చేపల ఎరువుకు రావటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడాయనకు. “ఇంకేమయితే. పొయ్చొచ్చాం పా మంచి రోజు సూడు” అన్నాడాయన.
మూడు రోజుల తర్వాత బుధవారం బాగుందని తేల్చాడు పతంజలి. బెంగుళూరు వెళ్లి, అక్కడినుండి వెళ్లాలని చెప్పాడు బాజిరెడ్డి. కాయలు అమ్మకమై, డబ్బు తీసుకున్న తర్వాత, ‘మార్కెట్ ఉడిపి’ హోటల్లో కూర్చుని చెరో ఆలూ బోండా తిని, కాఫీ తాగుతూ ప్రయాణం ప్లాన్ చేసుకున్నారు.
బుధవారం తెల్లవారు ఝామున అంటే (తెల్లవారితే గురువారం) అనగా బెంగుళూరుకు రైల్లో పోయేట్టు అక్కడినించి గోకర్ణం వెళ్లేలా అనుకున్నారు. తాను వెల్దుర్తిలో ఎక్కుతాననీ, బాజిరెడ్డిని ఇంజను వెనుక రెండో పెట్టెలో ఎక్కి రమ్మనీ, వెల్దుర్తిలో తలుపు దగ్గర నిలబడితే, తాను కనుక్కోడానికి సులభమనీ చెప్పాడు. తాను పదిహేను వందలు తెస్తానన్నాడు.
తాను రెండు వేలు తీసుకొస్తాననీ, ఏదైనా తక్కువబడితే అడ్జస్టు చేస్తాననీ చెప్పాడు బాజిరెడ్డి. ఇద్దరూ విడిపోయారు.
హోటలు బయట సేద్యానికి పనికివచ్చే తాళ్లు ఎద్దుల మెడలో వేసే మువ్వల పట్టెడ అమ్ముతున్నాడొకాయన. పతంజలి వెళ్లి చూస్తే, గుణపతికి సరిపోయే బుజ్జి పట్టెడ కనపడింది. అరంగుళం వెడల్పుతో అక్కడక్కడ రంగురంగుల పూసలు, గవ్వలు కుట్టినారు. మెడ క్రింది భాగంలో చిన్న గంట వేలాడుతుంది. చాలా ముచ్చటగా వుంది. బేరం చేసి మూడు రూపాయలకు కొన్నాడు. దాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని బస్సెక్కాడు.
గణపతి యింట్లోనే ఉన్నాడు. పతంజలి పిలుపు విని పరుగుపరుగున వచ్చేశాడు. తాను తెచ్చిన పట్టెడ సరిగ్గా సరిపోయింది. తనకు కొత్త ఆభరణం వచ్చిందని, గణపతికి తెలిసిపోయింది. నడుస్తుంటే గంట గణగణ శబ్దం చేస్తుంటే వాడికి గమ్మత్తుగా ఉంది. వంటింట్లోకి వెళ్లి వర్ధనమ్మకు, మహితకూ చూపించాడు. ఇక పశువుల శాలలో ఒకటే గంతులు.
మరుసటి రోజు శెట్టిగారి వద్దకు వెళ్లి డబ్బు తెచ్చుకున్నాడు. బుధవారం రానే వచ్చింది. బ్యాగులో మూడు జతల బట్టలు, పంచెలు, ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలు రెండు పెట్టుకున్నాడు.
తెల్లవారు ఝామున మూడుకే లేచి, స్నానం చేసి, పూజ చేసుకున్నాడు. లక్ష్మీనరసింహస్వామికి దీపారాధన చేసి, అష్టోత్తర శతనామావళి అర్చన చేశాడు. అమ్మకూ నాన్నకూ నమస్కరించి, నాలుగు గంటలకల్లా స్టేషన్ చేరుకున్నాడు.
స్టేషనంతా నిశ్శబ్దంగా ఉంది. ప్లాటుఫారంమీది రావిచెట్టు ఆకులు గాలికి చేసే గలగలలు తప్ప వేరే సవ్వడిలేదు. పది నిమిషాలలో రైలు వస్తున్నట్లు గంట కొట్టారు. పతంజలి ఇంజను వైపుకు వెళ్లి నిలబడ్డాడు. కాసేపట్లో రైలు పొగలు కక్కుతూ ఆవిర్లు వెలువరిస్తూ, ఆ చీకట్లో ఒంటి కంటి రాక్షసుడిలా స్టేషన్‌లో ప్రవేశించింది. సరిగ్గా ఇంజను నుండి రెండో జనరల్ పెట్టెలో తలుపు దగ్గర బాజిరెడ్డి నిలబడి ఉన్నాడు.
“సామీ, సామీ, ఇక్కడ ఇక్కడ” అని అరుస్తున్నాడు.
అక్కడ నిముషం కంటే ఆగదు. పతంజలి గబగబా వెళ్లి పెట్టెలోకి ఎక్కాడు.
“అమ్మయ్య! వచ్చావు కచ్చితంగా అని తెలుసులేగాని, నిన్ను చూసేంతవరకూ మనసు నిమ్మలించల్యా” అన్నాడు.
ప్రయాణమని ఏమో, నీట్‌గా షేవ్ చేసుకుని, మీసాలు, జుట్టు చక్కగా దువ్వుకొని, తెల్లని అడ్డపంచె, ఎమ్మెల్యే అంచుది, తెల్లని టెర్లిన్ షర్టు వేసుకున్నాడు. భుజానా కొత్త టర్కిష్ టవలు. చెయ్యెత్తు మనిషి చామన చాయగా, ధృఢంగా ఉన్నాడు. నలభైదాటి ఉంటాయనుకున్నాడు పతంజలి.
“ఏం సామీ, అట్టా జూచ్చాండావు?” అన్నాడు.
“రైతుబిడ్డ సినిమాలో యన్టీరామారావు మాదిరుంటే”
“ఆ మగానుబావునితో మనకు పోలికేందిగాని, ఏదో పయానం గదా అని” అన్నాడు సిగ్గుపడుతూ.
ఇద్దరూ కూర్చున్నారు. పెట్టెలో అందరూ జోగుతున్నారు. పతంజలి కూడా కాసేపు నిద్రపోయాడు కూర్చునే. బాజిరెడ్డి మాత్రం కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు.
ఉదయం ఏడుగంటలకు గుంటకల్ స్టేషనొచ్చింది. అక్కడ చాలా సేపు ఆగుతుందని తెలుసు పతంజలికి. ఇంజను మార్చాలి. స్టాఫ్ కూడ మారతారు.
“టిఫిన్ జేచ్చాం పా” అన్నాడు బాజిరెడ్డి.
“ఈ ప్లాట్‌ఫారం మీద బాగుండదు. బ్రాడ్‌గేజ్ ప్లాటుఫారం మీద మంచి రెస్టారెంటుంది. అక్కడ బాగుంటుంది” అన్నాడు పతంజలి.
తమ బ్యాగులు చూస్తుండమని అక్కడున్నతనికి చెప్పి, బ్రాడ్‌గేజ్ ప్లాట్‌ఫారం మీదికి చేరుకున్నారు ఓవర్ బ్రిడ్జి ఎక్కి.
ప్లాట్‌ఫారం మీద బొంబాయి -` మద్రాసు మెయిలు ఆగి ఉంది. రెస్టారెంటు రద్దీగా ఉంది. కౌంటరు దగ్గర టికెట్టు కొనుక్కున్నారు. ఇడ్లీ వడ, మసాలా దోశ. బాజిరెడ్డి డబ్బులిచ్చాడు. పతంజలి అదేమని అడిగితే, “సివరాకరికి సూసుకుందాంలే. పెతిసోట ఎవులి డబ్బులు ఆళ్లు ఇచ్చుకుంటాబోతే సూన్నీకె బాగుండదు” అన్నాడు.
“నీవు కూసోపో, నేను తెచ్చా” అని, కౌంటర్ దగ్గరికి వెళ్లి ఇడ్లీ వడ ప్లేట్లు తెచ్చి పతంజలికిచ్చి, మళ్లీ వెళ్లి దోసెల ప్లేట్లు తెచ్చాడు.
ఇద్దరూ తినడం పూర్తయ్యాక, బయట కాఫీ తాగి, తమ రైలు దగ్గరకొచ్చారు.
“టేసన్లో టిపను బాగానే ఉండాది. నీకెట్టా తెలుసు ఆడ బాగుంటాదని”
“నేను హుబ్లీకి నిమ్మకాయలు వేసుకుని వెళ్లి వచ్చేటప్పుడు ఇక్కడే తింటాను” అన్నాడు పతంజలి.
“నేను మాత్రం మన గౌసు భాయికే తోలతా, బైటికి బోల్యా ఎప్పుడూ” అన్నాడు బాజిరెడ్డి.
రైలు బయలుదేరింది. హిందూ పత్రిక ముందే కొనుక్కున్నాడు. చదవడం ప్రారంభించాడు. అది పూర్తయిన తర్వాత, సంచిలోంచి ‘లిటరరీ క్రిటిసిజం’ టెక్స్ట్ బుక్ తీసి, పెన్ను చేతిలో పట్టుకొని, స్డడీ చేయడం ప్రారంభిచాడు. అండర్‌లైన్లు, సబ్‌హెడింగ్‌లు మార్క్ చేస్తున్నాడు. అరిస్టాటిల్ నుండి ప్రారంభించి సాహిత్య విమర్శకులు ముఖ్యమైన వారందరికీ ఒక్కో ఛాప్టర్ కేటాయించారు. దాదాపు రెండు గంటలపాటు దాంట్లో లీనమయ్యాడు.
బాజిరెడ్డి పతంజలిని డిస్టర్బ్ చేయలేదు. దాదాపు పదకొండు గంటలకు రైలు ధర్మవరం జంక్షన్ చేరింది. “దీచ్చబట్టినట్టు సదువుతుంటివే. పల్కరించుదామంటే బయమేసె” అన్నాడు బాజిరెడ్డి. ధర్మవరంలో పదినిమిషాలాగింది రైలు. చూరునీళ్లలాంటి ‘టీ’ తాగారు. వేడివేడిగా అలసందలతో చేసిన మసాలా వడలు వచ్చాయి. చెరో రెండు తీసుకున్నారు. వాటితో నంచుకోవటానికి పచ్చిమిరపకాయలు కూడ యిచ్చాడు. చాలా రుచిగా ఉన్నాయి.
“టీ తాగి నోరంతా పాడైపోయె అనుకుంటే ఈ వడలు రచ్చించాయి” అన్నాడు బాజిరెడ్డి.
దారిలో ఏమీ తినలేదు. ఎలా వుంటాయో ఏమో అనే భయంతో. మధ్యాహ్నం మూడు గంటలకల్లా రైలు బెంగుళూరు చేరింది.
బెంగుళూరు స్టేషను బయటే బస్టాండు పట్టుగూళ్లు వేసుకొని రాంనగర్ పోయినపుడు బెంగుళూరు స్టేషన్, బస్టాండు పరిచయమే.
ఇద్దరూ బస్టాండుకు పోయి విచారించారు. బెంగుళూరు నుండి రాత్రి ఏడుగంటలకు ‘కార్వార్’ పోయే బస్సు ఉందనీ, అది ఉదయానికి కార్వార్ చేరుతుందనీ, అక్కడి నుండి గోకర్ణం దగ్గరనీ, అదంతా సముద్ర తీరమేననీ, ఎండు చేపల ఏరువు అక్కడి నుండే అన్ని చోట్లకూ సరఫరా అవుతుందనీ తెలిసింది.
కార్వార్ బస్సు ఎక్స్‌ప్రెస్. దానికి టికెట్లు ముందుగానే ఇస్తారని చెప్పారు. రెండు టికెట్లు తీసుకున్నారు. బాగా ఆకలిగా ఉందిద్దరికీ. బస్టాండు ఎదురుగ్గా ‘డీలక్స్ కృష్ణ భవన్’ లోకి వెళ్లి భోజనం చేశారు.
బాజిరెడ్డికి భోజనం నచ్చలేదు. ఉప్పుకారం బాగా తక్కువ కూరల్లో, సాంబారులో సమృద్ధిగా కొబ్బరికోరు వేశారు. సాంబారు రసం తియ్యగా ఉన్నాయి.
“ఈ సప్పిడి కూడు ఎట్ట తింటారో ఈ నాయాల్లు” అని విసుక్కున్నాడు బాజిరెడ్డి.
“అలా అనకూడదు. వీళ్లు మన కర్నూలు కొచ్చి అజంతా హోటల్లో తింటే ఇంత కారం ఎలా తింటారో…. అని నీవన్నట్టే అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి. ‘లోకోభిన్న రుచిఁ’ అన్నారు కదా మన పెద్దలు” అన్నాడు పతంజలి.
“కరెక్టే” అన్నాడు బాజిరెడ్డి.
సాయంత్రం వరకు బస్టాండులోని వెయిటింగ్ రూంలో గడిపారు. పతంజలి మళ్లీ రెండు చాప్టర్లు ‘లిటరరీ క్రిటిసిజం’ స్టడీ చేశాడు జాన్సన్, కార్లైల్‌ల విమర్శనారీతులు ఆకళింపు చేసుకున్నాడు.
(సశేషం)