Site icon Sanchika

సాఫల్యం-2

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఒ[/dropcap]కరోజు ఇంగ్లీషుక్లాసు జరుగుతూంది. ‘వేర్‌ ది మైండ్‌ ఈజ్‌ వితవుట్‌ ఫియర్‌’ అనే టాగూర్‌ గీతాంజలిలోని పద్యం వివరిస్తున్నాడు సారు. ఆ భావానికి పతంజలి ముగ్ధుడయ్యాడు. చివర్లో డౌట్స్‌ అడగమన్నాడు సారు.

‘‘సార్‌ ‘వేర్‌ నాలెడ్జ్‌ ఈజ్‌ ఫ్రీ’ అన్నాడు కదా, ఫ్రీగా ఎలా వస్తుంది? స్కూలు ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి. వీటన్నిటికి డబ్బు కావాలి కదా సార్‌’’ అన్నాడు పతంజలి.

‘‘ఒరేయ్‌ బాపనయ్యా! మంచి ప్రశ్నవేశావురా! పూర్వం కొన్ని కులాలకు విద్యార్హత ఉండేది కాదు. ఇప్పుడు కూడ ఆడపిల్లలను చదివించేది తక్కువ కదా! విద్య విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన భావం’’ అన్నాడు. పాఠం తర్వాత ‘వొకాబులరీ’ అని హెడ్డింగ్‌ పెట్టి కఠిన పదం = దానికి ఇంగ్లీషులో సులభపదం = తెలుగులో అర్థం, చివర బ్రాకెట్‌లో ఆ పదం ఏ భాషా భాగమో బోర్డు మీద రాసేవాడాయన.

మరుసటిరోజు ఆ పదాలు, స్పెల్లింగ్‌లు, అర్థాలు అప్పచెప్పించుకొనేవాడు. పతంజలి ఎంతో శ్రద్ధగా అవన్నీ నేర్చుకుని వచ్చేవాడు.

ముందు కొందరిని అడిగి, వాళ్లు చెప్పకపోతే నుంచుండపెట్టేవాడు. తర్వాత పతంజలి వంతు.

డెలివరెన్స్‌?

Freedom ముక్తి Noun ఇలా చెప్పేవాడు టకటక జవాబులు.

‘‘ఒరేయ్‌ నిలబడినవాళ్లందరికీ ముక్కు చెంపలు వెయ్యి’’

అందరూ స్నేహితులే. ఒక చేత్తో ముక్కు పట్టుకుని మరో చేత్తో సుతారంగా గంధం పూసినట్లు కొడితే, అందరూ ముసిముసిగా నవ్వుకోవడం.

శంకరయ్య సారుకు ఇది చూసి కోపం వచ్చిందొకసారి.

‘‘బాపనయ్యా! ఇక్కడికి నా దగ్గరికి రా! గంధం పూస్తున్నావా గంధం! ముక్కు చెంపలు ఎలా వేయాలో చూపిస్తా’’ అని పతంజలి చెంపలు చురుక్కుమనేలా వాయించి చూపాడు ఆయన.

సైన్స్‌ చెప్పడానికి కాంతారెడ్డిసారు వచ్చేవాడు. ఆయన ఆ కాలానికే నీట్‌గా టక్‌ చేసుకుని, షూస్‌ వేసుకొనేవాడు. మంచి సైన్స్‌ ల్యాబ్‌ ఉండేది. ‘ఆక్సిజన్‌ తయారు చేయు విధానం’ కేవలం పుస్తకంలో మాత్రమే చదువుకోకుండా, కాంతారెడ్డిసారు పిల్లలను ల్యాబ్‌కు తీసుకొని వెళ్లి ఆక్సిజన్‌ వారితోనే తయారు చేయించేవారు. ‘పారలాక్స్‌ దోషము’ లేకుండా ఎలా చూడాలి అని నేర్పేవారు.

తొమ్మిదిలో సయ్యద్‌ మహమ్మద్‌ అజం అనే సారు ఇంగ్లీషు, సోషల్‌ చెప్పేవారు. ఆయన పూర్తిగా ముస్లిం వేషధారణలో ఉండేవారు. పైజామా, కుర్తా, గడ్డం, టోపీతో. ఆయన మాట్లాడే తెలుగు అద్భుతంగా ఉండేది. ఎక్కడా ఉర్దూ ప్రభావం కనబడేదికాదు. ఆయన తెలుగులో మంచి కవి కూడ. ఒకసారి మృత్యుంజయశర్మ చేసిన అవధానంలో పృచ్ఛకుడుగా పాల్గొన్నాడాయన. ఆయన ఒక శతకం వ్రాస్తున్నాడపుడు.

‘‘సయ్యదయ్య మాట సత్యమయ్య’’ అనే మకుటంతో అప్పుడప్పుడు ఆ పద్యాలు రాగయుక్తంగా పాడి వినిపించేవాడాయన పిల్లలకు. ఒకసారి,

‘‘ఎన్నిగుడులు తిరిగి ఎన్ని పూజలు సేయ

దేవుడెటుల మెచ్చు జీవులార

సాటి మానవునికి సాయంబె పూజ రా

సయ్యదయ్యమాట సత్యమయ్య’’

సరిగ్గా పతంజలి హృదయానికి తాకింది ఈ పద్యం! లేచి చప్పట్లు కొట్టాడు.

‘‘ఏంరా! అంత నచ్చిందా’’ అన్నాడు సారు.

ఇంటర్వల్‌లో రఫ్‌లో దాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు పతంజలి.

“Going to temples, worshipping the Lord

Never pleases  the Almighty God

Service to   fellowmen is the true devotion

The words of syed are always true”

మరుసటిరోజు ఆజం సారు వస్తూనే భయం భయంగా వెళ్లి సారుకు పద్యం చూపాడు.

‘‘ఏమిటిరా రాసుకొచ్చావు?’’ అంటూనే ఆ పద్యాన్ని చదివిన ఆయన మోము పరిఫుల్లమయింది.

‘‘యా అల్లా! బహుత్‌ ఖూబ్’’ అనే ప్రశంస అప్రయత్నంగా ఆయన మాతృభాషలో వెలువడింది. ఆయన కన్నుల్లో తడి చేరింది.

పతంజలిని ఒక్కసారిగా హత్తుకుని, నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆజం సారు. ఇదంతా ఊహించని ఆ బుజ్జి ఆంగ్ల కవి ఉక్కిరి బిక్కిరి కాసాగాడు. సారు ఆ పద్యాన్ని పిల్లలకు వివరించి, ‘‘శహభాష్‌!’’ అని మరోసారి వీపు తట్టి పంపాడు. పతంజలిని ఆయన అడిగాడు.

‘‘మంచి మంచి పదాలు వాడావు కద రా! ఎక్కడ నేర్చుకున్నావు?’’

‘‘అంతా శంకరయ్య సారు దయ సార్‌’’ అన్నాడు పతజంలి వినయంగా

‘‘గుడ్‌. మృత్యుంజయశర్మగారి కొడుకువనిపించుకున్నావురా’’ అన్నాడాయన మనస్ఫూర్తిగా.

పదవ తరగతికి వచ్చాడు పతంజలి. 1969 నుండి S.S.L.C స్థానే S.S.C వచ్చింది. యూనివర్సిటీల పరిధిలోని P.U.C. కోర్సు రద్దు చేసి రెండేళ్ల ఇంటర్మీడియట్‌ కోర్సు ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఏర్పాటయింది.

పదిలో కృష్ణ శర్మసారు తెలుగు చెప్పేవారు. ఆయన పతంజలి వాళ్లకు దూరపు బంధువు కూడ. మహా పండితుడు. ఆయన క్లాసుకు వస్తూనే ఉత్తరీయం తీసి కుర్చీ మీద వేసి, ‘‘పత్తులూ, విష్ణువర్ధనా రండి నాయనా’’ అనగానే పతంజలి విష్ణువర్ధనుడు వెళ్లి చెరో ప్రక్కన నిలబడాలి. చిన్న చేతి సంచిలోంచి ఒక చిన్న సీసా తీసి ఇద్దరికీ కొంచెం ఆరచేతుల్లో పోస్తాడు. వాళ్లిద్దరూ ఆయన కణతలు, నుదురు, మాడూ చక్కగా మర్దన చేసేవారు కాసేపు. తర్వాతే ఆయన పాఠం మొదలు పెట్టేవాడు.

‘‘ఈ రోజు ఏం చెప్పుకుందాం రా? ’’

‘‘పద్యభాగం సార్‌! ప్రవరుని తీర్థయాత్ర’’

‘‘అవును కదూ! సరే’’

యిక ప్రారంభమయ్యేది గంగాఝరి. ఆయనకు పాఠ్య పుస్తకం అవసరము లేదు. ఔషధసిద్ధుడు ప్రవరుని యింటిని పావనం చేసి, అర్ఘ్యపాద్యాలు స్వీకరించి విశ్రమించిన పిదప ప్రవరుడు ఆయనను

‘‘ఏయే దేశములన్‌ చరించితిరి మీరే యేగిరుల్‌ చూచినా

రే యే పుణ్యవనాళి ద్రిమ్మరితిరి…. ….

ఆయా చోటుల గల్గు వింతలు మహాత్మా! నాకెరింగింపరే!’’

అని వేడగా, అతని తీర్థయాత్రా కౌతూహలము గమనించి ఆ సిద్ధయోగి, ‘‘అది యట్లుండె వినుము గృహస్థరత్నంబ! …. …..’’ అని తాను చూచిన ప్రదేశాలన్నీ ఏకరువు పెడతాడు. ఆ వర్ణన ఒక పెద్ద వచనం ప్రింటులో దాదాపు 25-30 లైన్లుంటుంది. ఆ మొత్తం వచనాన్ని కృష్ణశర్మ సారు అరమోడ్పు కళ్లతో గడగడా చదువుతూ ఉంటే పిల్లలు అబ్బురపడి చూసేవారు. తర్వాత దాన్ని సమాసాలు విడదీసి అర్థం వివరించేవాడు. దాన్ని అప్పజెప్పినవారికి ఒక పెన్ను ఇస్తానన్నాడు

పతంజలి దీనిని ఒక సవాలుగా స్వీకరించి, ఆ రోజు రాత్రి పొద్దుపోయే వరకు సాధన చేసి నేర్చుకుని మరుసటి రోజు క్లాసులో అప్పచెప్పాడు.

కృష్ణశర్మసారు అంతా విని, ‘‘భేష్‌ రా అల్లుడు! మా బావ పేరు నిలబెడతావు’’ అని మెచ్చుకున్నాడు. బావ అంటే పతంజలి వాళ్ల నాన్న ‘‘మరి పెన్ను?’’ అని పతంజలి అడిగితే

‘‘పెన్నుదేముందిలేరా! ఇస్తానులే’’ అని వెళ్లిపోయాడు.

అలా హైస్కూలులో తెలుగు ఇంగ్లీషు భాషలపై పట్టు సాధించాడు పతంజలి.

పబ్లిక్‌ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. హాల్‌టికెట్‌ మీద, పరీక్ష ఫారం మీద అతికించడం కోసం మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు తెచ్చుకోవాలని సర్కులర్‌ వచ్చింది.

వెల్దుర్తిలో ఫోటో స్టూడియో లేదు. కర్నూలు వెళ్లాల్సిందే. పతంజలి, అల్లాబక్ష్‌, అగస్టీన్‌, దశరథరెడ్డి కలిసి వెళదామనుకొన్నారు. ఇంట్లోవాళ్లు కూడ సరే అన్నారు. పతంజలికి ఐదు రూపాయలిచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టమన్నాడు తండ్రి.

ఉదయం 7 గం॥లకు డోన్‌ – కర్నూలు లోకల్‌ ట్రెయినెక్కారు స్నేహ బృందం. 8 కల్లా దిగారు. ఉపనయనము చేసుకున్నపుడు వచ్చిందే పతంజలి. దశరథకు బాగా తెలుసు కర్నూలు. వాళ్ల నాన్న Z.P Vice Chairman గా చేశారు. వాళ్ల కుటుంబం కర్నూల్లో ఉండేది. దశరథ వెల్దుర్తిలో చిన్నాన్న గారింట్లో ఉండి చదువుకునేవాడు.

రైల్లో అందరూ టికెట్టు కొన్నారు. 40 పైసలు. పార్క్‌రోడ్‌లో ‘హోటల్‌ ఉడిపి బృందావన్‌’ కు వెళ్లారు టిఫిన్‌ చేయడానికి. పతంజలికి కర్నూలు భూలోక స్వర్గంలా కనబడిరది. ఆ హోటలు వైభోగం చెప్పనలవికాదు. అందరూ ఒక టేబుల్‌ చూసుకొని కూర్చున్నారు.

సర్వరు వచ్చి మంచినీళ్లు గ్లాసులు పెట్టాడు.

‘‘ఒరేయ్‌ పతంజలీ! మీరు బ్రాహ్మలు కదా! ఇలా హోటల్లో తింటే మీ అమ్మ నాన్న ఏమీ అనరా?’’ అన్నాడు అగస్టీన్‌ నవ్వుతూ..

‘‘ఇప్పుడిపుడే కొంచెం మారుతున్నారు లేరా! బయటి ఊర్లకు వెళ్లినపుడు తప్పదని మా వాళ్లకు తెలుసు. అయినా ఇది బ్రాహ్మణ కాఫీ భోజన హోటలే కదా! బయట బోర్డు మీద చూశాను’’ అన్నాడు పతంజలి.

‘‘హోటలు యజమాని మాత్రమే బ్రాహ్మడు రోయ్‌. వండేవాళ్లు వడ్డించే వాళ్లు మాత్రం కాదు. చూసుకోమరి’’ అన్నాడు దశరథ. స్నేహితులందరూ తనను ఆటపట్టిస్తున్నారని అర్థమయింది పతంజలికి నవ్వుతూ వారివంక చూశాడు.

‘‘వాడికి కులం పట్టింపులు లేవులేరా!’’ అన్నాడు అల్లాబక్ష్‌. ఆ విషయం వాళ్లందరికీ తెలుసు.

మొదట ఇడ్లీ సాంబారు తిన్నారు. చిన్న స్టీలు బకెట్లో పొగలు కక్కే సాంబారు. చట్నీ. ఆ సాంబారు అమృతోపమానంగా తోచింది పతంజలికి తర్వాత మసాలాదోసె. దాని మీద స్పూన్‌తో వెన్నముద్ద వేసియిచ్చారు. పొట్టలు నిండిపోయాయి నల్గురికీ. ఇడ్లీ 15 పైసలు, మసాలదోసె పావలా. మొత్తం ఒక్కొక్కరికి 40 పైసలయింది .  కాఫీలు తాగలేదు.

ప్రక్కనే ‘అన్వర్‌ ఫోటో స్టూడియో’ అని బోర్డు కనబడిరది. ఇంకా తెరవలేదు. సరే అని కొద్ది దూరంలో ఉన్న ‘పీపుల్స్‌ పార్క్‌’కు వెళ్లి కాసేపు తిరిగారు. స్టూడియో తెరిచిన తర్వాత ఫోటోలు తీయించుకున్నారు.

‘‘వెనకవైపు వరండాలో బకెట్‌లో నీళ్లున్నాయి. శుభ్రంగా ముఖాలు కడుక్కొని, తల దువ్వుకొని, పౌడర్‌ వేసుకోండి’’ అన్నాడు అన్వర్‌. స్టూడియో అతను నల్లని ముసుగు కప్పుకొని, ఫ్లాష్‌ లైట్లు వేసి ఫోటోలు తీశాడు.

‘‘4 ఫోటోలు విత్‌ నెగిటివ్‌ రూపాయిన్నర. తలా రూపాయిన్నరయ్యింది’’ అన్నాడు.

డబ్బు తీసుకొని చిన్న రశీదు చింపి యిచ్చాడు అందరికీ. ‘‘సాయంత్రం 5 గంటలకు రండి’’ అన్నాడు.

కర్నూలులో సినిమాలు చూడాలనే ప్లాన్‌తోనే వచ్చారు. బృందావన్‌ హోటల్‌ ఎదురుగానే జంట ధియేటర్లు నవరంగ్‌, అలంకార్‌ టాకీసులున్నాయి. వెళ్లి చూశారు. నవరంగ్‌లో ‘కర్పూరహారతి’ కృష్ణ వాణిశ్రీ, చంద్రమోహన్‌ అలంకార్‌లో ‘ధర్మదాత’ నాగేశ్వర్రావు కాంచన. టైమింగ్‌లు కూడా రాశారు. ఉ.11:00 మ. 2:30 సా6:30 రా. 9:30 అని.

ఉ – మ – సా – రా అని అనుకొని నవ్వుకొన్నాడు సరే మొదట కృష్ణ సినిమా చూశారు. ఇంటర్వల్‌లో వేయించిన బుడ్డలు (కర్నూలు జిల్లాలో వేరుశనక్కాయలను అలా పిలుస్తారు మరి) తిన్నారు. పెదవులకు మసి అంటింది. ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఒంటిగంటకు సినిమా పూర్తయింది. పొద్దున్న తిన్న టిఫిన్‌ అరిగిపోయి ఆకలేస్తూంది నలుగురికి

‘‘ఒరేయ్‌ దశరథ! భోజనం ఎక్కడ చేద్దాం’’

‘‘బస్టాండు దగ్గర అజంతా హోటలని ఉంది. అక్కడకు వెళదాం పదండి’’ అన్నాడు దశరథ.

నడుచుకుంటూ వెళుతున్నారు.

దారిలో పోలీస్‌ కంట్రోల్‌ రూం. కోల్స్‌ మెమోరియల్‌ హైస్కూలు, పెద్ద పోస్టాఫీసు దాటి కొండారెడ్డి బురుజు మీదుగా ‘అజంతా హోటలు’ చేరుకున్నారు. కిటకిటలాడుతూ ఉంది. అజంతా హోటల్‌. కౌంటర్లో భోజనం టికెట్లు తీసుకున్నారు. ఫుల్‌ భోజనం 75 పైసలు. అప్పటికింకా ప్లేటు భోజనాలు రాలేదు. భోజనం చివరి దశకు వచ్చి, పెరుగన్నం తింటూన్న వారి ఆకుల ప్రక్కన టికెట్లు టేబుల్‌ మీద పెట్టించాడు దశరథ.

‘‘ముందే ఎందుకు అక్కడ పెట్టడం? మన దగ్గర ఉంచుకుంటే ఏం?’’ అనడిగాడు పతంజలి.

‘‘వాళ్లు తినడం పూర్తయిన వెంటనే, మనవంతు అని ముందే రిజర్వు చేసుకున్నామన్న మాట’’ అన్నాడు బక్ష్‌. నలుగురికీ ఒకే టేబుల్‌ దొరికింది.

హోటళ్లలో టిఫిన్లు భోజనాలు చేయడం అదే ప్రథమం పతంజలికి. ఖాళీ అవగానే ఒక పాత గుడ్డతో టేబులు తుడిచాడు క్లీనరు.

‘‘నీళ్లతో కడగరా?’’ పతంజలి.

‘‘ఆ నీ కోసం పసుపు ఆవుపేడతో అలుకుతారులేరా’’ అన్నాడు దశరథ.

అందరూ గొల్లున నవ్వుకున్నారు.

అరిటాకులు పరచి వెళ్లాడొకాయన. గ్లాసులతో నీళ్లు పెట్టాడో అబ్బాయి.

ఆకులపై నీళ్లు చల్లుకొని చేత్తోనే తుడిచారు. ముందుగా ఉప్పు, కందిపొడి, ఊరగాయ వచ్చాయి. తర్వాత వంకాయనించుడుకాయ, బంగాళాదుంప ముద్దకూర, టమోటా పప్పు, కొబ్బరి పచ్చడి వచ్చాయి. తర్వాత పొగలు కక్కే అన్నం. ఇంకొకాయన వచ్చి అన్నం మీద నెయ్యి వేసి వెళ్లాడు.

కడుపునిండా భోంచేశారు మిత్రులు. కబుర్లు చెప్పుకుంటూ దగ్గరలో ఉన్న ‘విక్టరీ’ టాకీసుకు వెళ్లారు. దానిలో శోభన్‌బాబు సినిమా ‘‘మనుషులు మారాలి’’ ఆడుతూ ఉంది. మహిళా ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నారు. నేల టిక్కెట్లు నాలుగు కొన్నారు.

అప్పుడు సినిమా టిక్కెట్లు ధరలు ఎలా వుండేవంటే నేల 28 పైసలు (పావలా అర్ధణా) బెంచి 51 పైసలు, కుర్చీ 70 పైసలు, బాల్కనీ 90 పైసలు.

సినిమాలో లీనమయ్యాడు పతంజలి. తన మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయింది.

సినిమా అయ్యాక బయటకొచ్చారు.

‘‘టీ తాగుదాం పదండి! మనం ఎలాగూ ఫోటో స్టూడియోకు వెళ్లాలి కదా. ఆ రోడ్డులోనే ఉంటుంది. నేషనల్‌ టీ ప్యాలెస్‌. చాలా బాగుంటుంది’’ అన్నాడు అగస్టీన్‌.

జీవితంలో మొట్టమొదటిసారి టీ తాగాడు పతంజలి. దాని రుచి అద్భుతం అనిపించింది. వాళ్లింట్లో కాఫీనే తాగుతారు. కంచు గ్లాసుల్లో పువ్వులు లతలున్న పింగాణీ కప్పుల్లో టీ తాగుతుంటే ఎంతో బాగనిపించింది. టీ పదిపైసలు ‘‘మనం టీలు తాగకూడదు. టీలు తాగేది సాయిబులే’’ అని ఎప్పుడో నాన్న అన్న మాటలు గుర్తొచ్చి నవ్వుకొన్నాడు.

‘‘ఎందుకురా నవ్వుకుంటున్నావు’’ అడిగాడు బక్ష్‌.

‘‘నాన్న మాటలు గుర్తొచ్చి’’

‘‘ఏమన్నాడేమిటి?’’

‘‘టీ బ్రాహ్మలు తాగకూడదట. సాయిబులే తాగుతారట’’

‘‘అందరూ తాగొచ్చుకాని, తయారు చెయ్యాలంటే మాత్రం మా సాయిబులే చెయ్యాలి రోయ్‌’’ అన్నాడు బక్ష్‌.

‘‘కరెక్ట్‌’’ అన్నారు మిత్రులు.

స్టూడియోకు వెళ్లి ఫోటోలు తీసుకొన్నారు. చిన్న కవర్లో ఫోటోలు నెగెటివ్‌ వేసి యిచ్చాడు. ఒకరి ఫోటోలు ఒకరు చూసుకొని సంతోషించారు.

‘‘అగస్టీన్‌ గాడు అచ్చు పద్మనాభంలా ఉన్నాడే’’ బక్ష్‌.

‘‘నీవు మాత్రం అంజిగాడిలా ఉన్నావా లేదా?’’ అగస్టీన్‌.

ఎన్ని హాస్యాలాడుకున్నా వారిలో అసూయ లేదు. సమాజంలో భిన్న వర్గాలకు చెందిన వాళ్లయినా పొరపొచ్చాలు లేవు. దశరథ సంపన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. అయినా వీళ్లతో పాటు నేల క్లాసులో కూర్చొని సినిమా చూశాడు. పతంజలి సంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలోని వాడు. బక్ష్‌ చాలా పేదవాడు. వాళ్ల నాన్న మాంసం దుకాణం నడుపుతాడు. తిరునాళ్లలో జంతువులు బలి యివ్వడానికి ఆయన్ను పిలుస్తారు. ఆయన పేరు ‘హుస్సేను సాహెబ్‌’.

సాయంత్రం ఏడున్నరకు మళ్లీ డోన్‌ లోకల్‌లో వెళ్లిపోదామని అనుకున్నారు మొదట్లో. కాని ఎలాగూ వచ్చాము. డబ్బులు కూడ సరిపోతాయి. ఫస్టుషో, సెకండ్‌ షో కూడ చూసి తెల్లవారు జామున నాలుగు గంటలకు కర్నూలుకు వచ్చే బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌లో వెళదామని తీర్మానించారు. నాన్న, అమ్మ తిడతారేమో అని భయం ఉన్నా, ధీమాగా ఒప్పుకొన్నాడు పతంజలి. స్నేహితులతో కర్నూల్లో ఇలా ‘ఎంజాయ్‌’ చేయడం చాలా బాగుందా పిల్లలందరికి.

ఎదురుగ్గా ‘అలంకార్‌’ టాకీసులో ‘ధర్మధాత’ ఆడుతూంది. టికెట్లు తీసుకొని వెళ్లి కూర్చున్నారు. రంగుల సినిమా కాదు గాని, మధ్యలో వచ్చే పాటలు రంగుల్లో చూపించారు. అలంకార్‌ టాకీసు పై కప్పు ఎలా ఉందంటే లైట్లన్నీ నక్షత్రాల్లాగా అమర్చి మధ్యలో ఒక గుండ్రని పెద్ద లైటు చంద్రునిలా అమర్చారు. వెల్దుర్తిలో టూరింగ్‌ టాకీసులో అప్పుడప్పుడు సినిమాలు చూశాడు గాని పతంజలి, దేవేంద్ర భవనాలు అనిపించాయి. కర్నూల్లో ధియేటర్లు.

వెల్దుర్తిలో ప్రాజెక్టరు ఉండే రేకుల రూము, ఎదురుగా తెర. తెరవెనుక ఒక ఖాళీ డ్రమ్ము మీద మైకుసెట్టు స్పీకరు. సింగిల్‌ ప్రొజేక్టరు మాత్రమే. రెండు రీళ్లు అయిన తర్వాత సినిమా ఆపేసి, మళ్లీ రెండు రీళ్లు ఎక్కించేవరకు యింటర్వల్లే. అలా ఎనిమిదో పదో ఇంటర్వల్స్‌. పై కప్పు ఉండదు. వర్షం వస్తే సినిమా ఉండదు. ‘‘ఏ కారణము చేతనయినా ఆట ఆగిన యెడల డబ్బు వాపసు యివ్వబడదు’’ అని స్లయిడు వేస్తారు గాని, వర్షం వస్తే అందరికీ పాస్‌లు యిచ్చి పంపి, మరుసటిరోజు చూపిస్తారు. రాత్రి 8 గం॥ ప్రారంభమై ఒంటి గంట వరకు ఒకే షో వేస్తారు. ఒక్కోసారి రెండు బాక్సులు ఉంటాయి. గుంతకల్‌ నుండి ఏజెంటు వచ్చి బాక్సు తీసుకొని వెళ్లకపోతే వెంటనే ఎద్దులబండి మీద మైకు పెట్టుకొని, ‘‘ఒకే టిక్కట్టుపై రెండు ఆటలు, రండి చూడండి. ఆలసించిన ఆశాభంగం’’ అని అరుస్తూ ఊర్లో చుట్టుప్రక్కల ఊర్లలో తిరుగుతారు. లవకుశ, సత్యహరిశ్చంద్ర, జయభేరి, దేవదాసు లాంటి సినిమాలు వేసినపుడు తీర్థ ప్రజ, బళ్లు కట్టుకొని కుటుంబాలతో వచ్చి వంటలు చేసుకొని తిని సినిమా చూసి ఏ తెల్లవారు జామునో వెళతారు.

ధర్మదాత సినిమా అయిపోయింది. స్నేహితులు బయటకు వచ్చారు. లెక్కలు వేసుకున్నారు. ఒక్క దశరథ వద్ద తప్ప అందరివద్ద ఇంకా మూడు రూపాయల వరకు ఉన్నాయి. అజంతా భోజన ప్రభావమేమో అంత ఆకలిగా లేదెవ్వరికీ. దగ్గరలో ‘ఎలైట్‌’ హోటలుకు వెళ్లి తలా ఒక చపాతీ తిన్నారు. అంత పెద్ద చపాతీని పతంజలి ఎప్పుడూ చూడలేదు.

తర్వాత ‘చాంద్‌’ టాకీసులో ‘మొగలే ఆజం’ అనే హిందీ సినిమాకు వెళ్లారు. టిక్కెట్లు అయిపోయినాయన్నారు. ఏం చేద్దామా అనుకుంటుంటే ఒకడు కనపడి ‘‘గేటువద్ద ఉన్నవాడికి పదిపైసలు ఇవ్వండి లోపలికి వదుల్తాడ’’ని చెప్పాడు. అలాగే జరిగింది కాని పూర్తి స్క్రీన్‌ దగ్గరగా కిటికీల గట్టు మీద కూర్చోని చూడవలసి వచ్చింది. హిందీ అర్థం కాదనుకున్నాడుగాని పతంజలికి కథ బాగానే అర్థమయింది. ‘‘ఏమంటున్నాడు’’ అని అర్థం కాని చోట్ల బక్ష్‌ను అడిగితే వాడు వివరించాడు.

ఒంటిగంటన్నరకు సినిమా వదిలారు. అక్కడ్నించి రైల్వేస్టేషన్‌ దాదాపు మూడు మైళ్లుంటుంది. నడుచుకుంటూ స్టేషన్‌ చేరుకున్నారు. బాగా అలసిపోయారు. నిద్రముంచుకొస్తున్నా, రైలు వెళ్లిపోతుందని బలవంతంగా ఆపుకున్నారు. నాలుగున్నరకు రైలు వచ్చింది. దానికి ఛార్జి ఎక్కువ. 65 పైసలు తీసుకున్నాడు. ఇంజను వైపు వెళ్లి జనరల్‌ పెట్టెలో ఎక్కుదామంటే చాలా రద్దీగా ఉన్నాయి. అవీ రెండే ఉన్నాయి. వెనక్కు వెళ్లి చూద్దామంటే రైలు కదిలిపోతుందేమోనని భయం. ఎలాగో ఎక్కి టాయిలెట్‌ దగ్గర ఇరుగ్గా నిలబడుకొని ప్రయాణించారు. మధ్యలో ఆగదు వెల్దుర్తివరకు. ఐదున్నరకు దిగి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. నిద్ర కళ్లతో తలుపు తట్టిన పతంజలి, అమ్మ తలుపు తెరవగానే వెళ్లి, బట్టలు మార్చుకుని, తమ్ముళ్ల ప్రక్కన పడుకొని గాఢంగా నిద్రపోయాడు.

***

ఉదయం ఆలస్యంగా లేచి బడికి వెళ్లడానికి తయారవుతుంటే నాన్న పిలిచాడు.

‘‘నిన్న ఫోటో తీయించుకొని రావడానికి 5 రూ. ఇచ్చాను కదా! ఎంత మిగిలింది నాయనా’’ అని అడిగాడు.

జేబులో మిగిలింది తీసి తండ్రికిచ్చాడు పతంజలి. దాదాపు రెండు రూపాయలకు తక్కువ ఉంది.

‘‘మూడు రూపాయలు ఖర్చయిందా! ఏం చేశావురా?’’

తలవంచుకొని చెప్పాడు పతంజలి’’ నాలుగు సినిమాలు చూశాం’’

‘‘కరువేమో కాలమేమో అని నాలుగా! బుద్ధిలేకపోతే సరి. ఇప్పట్నుంచి డబ్బు ఇలా దుబారా చేసుకుంటూ పోతే ఇంకేం బాగుపడతావు’’ అన్నాడాయన కోపంగా.

నిస్సహాయంగా తల్లివైపు చూశాడు పతంజలి.

‘‘ఏదో జన్మకో శివరాత్రి అన్నట్లు పిల్లవాడు లేకలేక సరదాపడి వెళ్లొస్తే అంతకోపమెందుకండీ. నీవు బడికిపోయిరా నాయనా’’ అన్నది తల్లి.

కానీ కొన్ని రోజులు పతంజలిని ‘గిల్టీనెస్‌’ వెంటాడిరది.

స్కూల్లో ‘మాక్‌ పార్లమెంటు’ జరుపుతారని, పాల్గొనే వాళ్లు పేర్లివ్వాలనీ సర్కులర్‌ వచ్చింది. పతంజలి కూడ పేరిచ్చాడు. సాయంత్రం వీళ్లందరినీ స్టాఫ్‌ రూంకి పిలిపించాడు శంకరయ్యసారు. క్లుప్తంగా కార్యక్రమం ఎలా జరుగుతుందో వివరించి, ఎవరెవరు ఏ పాత్ర పోషించాలో, నిర్దేశించాడాయన.

అగస్టీన్‌ స్పీకరు, దశరథ ప్రధానమంత్రి, పతంజలి ప్రతి పక్ష నాయకుడు. లోక్‌సభ కార్యక్రమాలు జరుగుతాయి. కొందరు పిల్లలు సభ్యులుగా కూర్చుంటారు. రెండు రోజులు రిహార్సల్‌ చేయించారు. నిర్ణయించిన రోజున కార్యక్రమం జరిగింది. ఊరిలోని పెద్దలను కూడ ఆహ్వానించారు.

పతంజలి ఆవేశంగా ప్రభుత్వాన్ని విమర్శించాడు.  ప్రధాని అలసత్వాన్ని ఎండగట్టాడు. దశరథ ఎంతో సంయమనంతో జవాబు చెప్పాడు. స్పీకర్‌ స్థానంలో ఉన్న అగస్టీన్‌ చక్కగా సభను నడిపాడు. అట్లా పిల్లలకు పార్లమెంటు పని తీరుపై అవగాహన కలిగింది. అప్పటి చదువుల్లోని నాణ్యతకు ఈ మాక్‌ పార్లమెంటొక మచ్చుతునక.

హోప్‌ టెస్ట్‌లు (ఫ్రీ ఫైనల్‌) జరిగాయి. అందరూ బాగా రాశారు. పబ్లిక్‌ పరీక్షలు రానే వచ్చాయి. వెల్దుర్తిలో పరీక్ష కేంద్రం ఇవ్వలేదు. డోన్‌ ఎస్‌.కె.పి హైస్కూల్లో వేశారు. వీళ్లందరినీ. డోన్‌లో పతంజలికి చిన్నాన్న వరుసయ్యే రామచంద్రశర్మ గారింట్లో ఉండి పరీక్షలు రాయాలని నిర్ణయించాడు తండ్రి. ఆయనకు పినతండ్రి కొడుకే ఈయన. బంధువర్గంలో ఆయనను డోన్‌ రాముడంటారు. అదే స్కూల్లో హిందీ పండిట్‌గా పని చేస్తూన్నాడాయన.

డోన్‌ హైస్కూలు చాలా పెద్దది. చక్కగా వ్రాసుకోవడానికి బెంచీలు, బల్లలు, ఆవరణంతా పెద్ద పెద్ద చెట్లు.

హాల్‌టికెట్‌, పరీక్ష రాయటానికి ఒక అట్ట, పెన్ను, పెన్సిలు, రబ్బరు కొనుక్కున్నాడు పతంజలి. స్నేహితులందరూ వాళ్లకు తెలిసినవాళ్లు, బంధువుల యిండ్లలో సెటిలయినారు. వెల్దుర్తికి డోన్‌కు మధ్య దూరం ఇరవై కిలోమీటర్లే గాని బస్సులు తక్కువ. పరీక్ష సమయానికి చేరుకుంటామో లేదో అని ప్రతి రోజూ ప్రయాణించే పని ఎవరూ పెట్టుకోలేదు.

మృత్యుంజయశర్మ వచ్చి దిగబెట్టి వెళ్లాడు పతంజలిని. రోజూ 11:30 నుండి 2 గం॥ల వరకు పరీక్ష. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు యాభై మార్కులకు హిందీ మాత్రం ఒక్క పేపరే. బిట్‌ పేపరు 13 మార్కులు. 26 బిట్లు ఉంటాయి. అబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయి ప్రశ్నలు. మిగతా 37 మార్కులకు చిన్న ప్రశ్నలు ఆరింటికి పన్నెండు మార్కులు, పెద్ద ప్రశ్నలు 7 ఒక్కోదానికి ఐదు మార్కులు. పెద్ద ప్రశ్నలు రెండు సెక్షన్స్‌గా ఉంటాయి.

మొదటి రోజు స్నానం చేసి దేవుని గూటి దగ్గర కూర్చొని సంధ్య వార్చుకొని, బొట్టు పెట్టుకొని, పరీక్షా కేంద్రానికి వెళ్లాడు పతంజలి. ఎందుకో చాలా టెన్షన్‌గా ఉందా పిల్లవాడికి. అరచేతులు చెమటలు పడుతున్నాయి. జేబులోంచి గుడ్డ (కర్చీఫులు లేవు) తీసి తుడుచుకొన్నాడు.

ముందు తెలుగు పరీక్ష. బిట్‌ పేపరు ముందిచ్చారు. తెలిసిన వాటికి ముందుగా జవాబులు వ్రాశాడు. తర్వాత మెయిన్‌ కొశ్చన్‌ పేపరు, ఆన్సర్‌ పేపరు యిచ్చారు. పేపరు చదువుకొన్నాడు. అన్నీ వచ్చినవే ‘‘చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న’’ అనే పద్యానికి ప్రతిపదార్ధం, తాత్పర్యం వ్రాశాడు. చేతిరాత చాలా బాగుంటుంది పతంజలిది. సందర్భ సహిత వ్యాఖ్యలు, సంధులు, సమాసాలు, గణ విభజన, అలంకారాలు చకచకా వ్రాసుకుంటూ పోతున్నాడు.

ఇన్విజిలేటరు దగ్గరగా వచ్చి నిలబడి, వంగి పతంజలి చెవిలో అన్నాడు ‘‘పంతులూ, నీ బిట్‌ పేపరు ఒకసారివ్వు. ప్రక్కరూంలో మా ఊరి పిల్లలున్నారు. రాసుకొని యిచ్చేస్తారు’’ అంటూ పతంజలి బిట్‌ పేపరు తీసుకొని వెళ్లాడు. పావుగంట తర్వాత తెచ్చిచ్చాడు. అంతవరకు ఆందోళనే.

వార్నింగు బెల్‌ కొట్టారు. ఆన్సరు పేపరు, అడిషనల్స్‌, బిట్‌ పేపరు కలిపి కట్టడానికి దారపు పోగులిచ్చారు.

‘‘ఒకసారి మీ హాల్‌ టికెట్‌ నంబరు సరిగ్గా వేశారో లేదో ఆన్సర్‌ పేపరు మీద చూసుకోండి’’ అని అరిచాడు ఇన్విజిలేటరు.

(సశేషం)

Exit mobile version