Site icon Sanchika

సాఫల్యం-22

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]‘కా[/dropcap]లం’ తన పని తాను చేసుకుపోతూంది. మళ్లీ ట్యూషన్లు ప్రారంభించాడు పతంజలి. ఈ సంత్సరం పిల్లలు ఎక్కవయ్యారు. పతంజలి దగ్గర చదువుకున్న పిల్లలకు మార్కులు బాగా వస్తున్నాయి. ‘ఇంగ్లీషు’లో బాగా రాణిస్తున్నారు.

చదువు బాగా సాగుతూ ఉంది. ఆగస్టు నెలాఖరుకల్లా నోట్సులన్నీ వ్రాయటం పూర్తయింది. గట్టిగా రెండు నెలలున్నాయి పరీక్షలకు అన్నీ రివిజన్‌ చేసుకుంటున్నాడు.

అక్టోబరులో చాగలమర్రి నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు నిమ్మ, చీనీ తోటల పంటను ‘గుత్త’ కు తీసుకుంటారు. చెట్ల సంరక్షణ, ఎరువులు అన్నీ వాళ్లే చూసుకుంటారు. సంవత్సరమంతా వచ్చే దిగుబడి వారికే చెందుతుంది.

మార్కండేయశర్మ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు వీళ్లు. చాప వేస్తే కూర్చున్నారు.

“సామీ, మాది శాగలమర్రి. ఆళ్లగడ్డ కాడ, తోటలు గుత్తకు దీసుకుంటాం. మీది నిమ్మతోట ఉండాదని కర్నూల్లో చెప్పిండారు. సూద్దామని వచ్చినాం” అన్నారు.

“మాకు మా తోట గుత్తకిచ్చే ఉద్దేశం లేదే” అన్నాడు పతంజలి.

మార్కండేయశర్మ పతంజలిని లోపలికి పిలిచాడు. “నాయనా, ఆలోచించు. నీకు నవంబరంతా పరీక్షలంటివి. అక్టోబరంతా చదువుకోవద్దా. నవంబరు నుండే నిమ్మకాయ ఎక్కువగా దిగేట్టుంది. కర్నూల్లో అయ్యేపనిగాదు. హుబ్లీకో మద్రాసుకో పోవలసిందే. కనీసం నెలకు మూడుసార్లన్నా పోవాల. నేను పోలేను. తోట మంచి కాపులో ఉంది కాబట్టి, వీళ్లు గుత్త ఎంత ఇస్తారో తెలుసుకుని, లాభసాటిగా అనిపిస్తే ఇద్దాము. మనకూ ఒక్కసారి డబ్బువస్తే కొంత ఋణ బాధతీరుతుంది కదా!” అన్నాడు.

పతంజలి కూడ లోలోపల తర్కించుకున్నాడు.

“నిజమే నాన్నా ఇంతవరకూ చదివింది ఒక ఎత్తు, ఈ రెండు నెలల చదువూ ఒక ఎత్తు. తోట చూపించి ఏమంటారో చూద్దాం” అన్నాడు.

వచ్చినవారిలో ఒకతనిపేరు ఓబులప్ప. రెండవవాడు సంజీవరాయుడు. ఇద్దరూ బావ, బావమరదులట. సంజీవరాయుని చెల్లెల్నే ఓబులప్ప చేసుకున్నాడట. ఇద్దరూ కలిసే ‘గుత్తలు’ చేస్తారట. ఓబులప్పకు నలభై ఏండ్లుంటాయి. ఎత్తుగా, దృఢంగా ఉన్నాడు. సంజీవరాయుడు యువకుడే. పతంజలి కంటే సంవత్సరమో, రెండేండ్లో పెద్ద అయివుండొచ్చు. ఇంకా పెళ్లి కాలేదు.

“చేచ్చామని పిల్లను చూచ్చాండారు”

సంజీవరాయుడు ప్యాంటు, ఫుల్‌ షర్టు వేసుకున్నాడు. షర్టు చేతులు పైకి మడిచాడు. చేతికి వాచీ ఉంది. ఓబులప్ప పక్కారైతులా ఉన్నాడు. అడ్డపంచె, ముతక ఖద్దరు అంగీ వేసుకున్నాడు. బీడీలు ఎక్కువ తాగుతాడేమో పెదవులు నల్లగా ఉన్నాయి.

“ఈడనే ‘పుల్లగుమ్మి’లో ఒక తోట తీసుకున్నాము. చీనీ తోటలే. ఇంకో తోట కూడ ఉంటే సూసుకోనీకే బాగుంట్యాదని ఇట్ల వస్తిమి” అన్నాడు ఓబులప్ప.

పతంజలి వాళ్లిద్దర్నీ తీసుకుని తోటకు వెళ్లాడు. దారిలో ఎల్లమ్మతల్లి దర్శనం చేసుకున్నారు. ఎల్లమ్మగుడి పూజారి తంబళ్ల గురుస్వామి. పతంజలిని చూసి నమస్కరించి, “పూజ నీవే చేయి సామీ!” అని అడిగాడు. గురుస్వామికి పూజావిధానం, కొన్ని శ్లోకాలు నేర్పించింది పతంజలే.

అమ్మవారికి పూజ చేసి హారతిచ్చాడు పతంజలి. ఓబులప్ప హారతి పళ్లెంలో పదిరూపాయలు వేశాడు. చాలా ఎక్కువది. గురుస్వామి ముఖం వెలిగింది.

ఎల్లమ్మతల్లి నిలువెత్తు విగ్రహం కర్రతో చేయబడింది. చేరెడు కళ్లు. నాలుక ఎర్రగా చాపి ఉంటుంది. నాలుగు చేతుల్లో కత్తి, తామర పువ్వు, ఢక్క, చామరము ధరించి ఉంటుంది.

క్రింద నల్లగా నిగనిగ మెరిసే ‘బొడ్రాయి’ ఉంది. దానికి పెద్ద పెద్ద పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. అమ్మవారి ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు తిరునాళ్లు (తిర్నాల అంటారు) జరుగుతాయి. వందల కొద్దీ జనం బళ్లు కట్టుకొని వచ్చి వంటలు చేసుకొని, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. వందల కొద్దీ కోళ్లు, యాటలు (మేకలు, గొర్రెలు) తెగుతాయి. వెల్దుర్తికి గ్రామ దేవత ఎల్లమ్మ తల్లే.

తోటంతా తిప్పి చూపించాడు పతంజలి. చెట్లన్ని ఉసిరికాయ పరిమాణంలో ఉన్న నిమ్మకాయలతో నిండి ఉన్నాయి ఆకుల కంటె కాయలే ఎక్కువగా కనబడుతున్నాయి.

తోటను చూసి వాళ్లిద్దరూ చాలా ‘ఇంప్రెస్‌’ అయినట్లు  గుర్తించాడు పతంజలి. ఇంజను రూం దగ్గరికి పోయి బావిలో ‘జల’ ఎలా ఉందో పరిశీలించారు.

“ఎండాకాలం ఊట తగ్గుంది. రోజుకు మూడు నాలుగు గంటల కంటె నీళ్లందవు” అన్నాడు పతంజలి.

“ఎండల్లో మూడు నాలుగు గంటలు కొడతాదంటే మొనగాని బాయే” అన్నాడు ఓబులప్ప.

ముగ్గురూ ఇంటికి వెళ్లారు.

“సామీ ఒకే మాట. ఎనిమిది వేల ఐదువందలిచ్చాం. మొత్త కర్చులన్నీ మావే. మీరు ఏదైనా పంటకు నీళ్లు పారిచ్చుకుంటే మట్టుకు, కరెంటు ఖర్చు సగం బరించుకవాల” అన్నాడు ఓబులప్ప.

పతంజలి తండ్రిని పడసాలలోకి పిలిచాడు.

“నాన్నా, నాలెక్క ప్రకారం సంక్రాంతి కల్లా ఐదు వందల మూటలు దిగుతాయి. మళ్లీ అక్టోబరు వరకు ఎంతలేదన్నా పదమూడు వందల మూటలకు తగ్గవు. సారాసవుటు (సగటున) మూట వందరూపాయలు వేసుకున్నా పదమూడు వేలు. ఖర్చులు మూడు వేలు తీసేసినా హీన పక్షం పదివేలకు తక్కువ రాదు. ఏమంటావు?” అన్నాడు.

మార్కండేయ శర్మ ఆలోచించి “అయితే ఎంత చెబుదామంటావు?” అన్నాడు. “పన్నెండు వేలకు తక్కువయితే ఇవ్వమని చెప్పండి” అన్నాడు పతంజలి.

ఇద్దరూ బయటకి వెళ్లారు.

“చాలా తక్కువ చెబుతున్నారు నాయనా, పన్నెండు వేలకయితే ఆలోచిస్తాము” అన్నాడాయన.

బావ బావమరిది వీధిలోకి వెళ్లి మాట్లాడుకున్నారు. తిరిగి వచ్చింతర్వాత సంజీవరాయడన్నాడు.

“తొమ్మిది వేల అయిదునూర్లంటుండాడు మా బావ”

దగ్గరికి వచ్చారనుకున్నాడు పతంజలి.

“చివరగా ఒక్కమాట చెప్పమంటారా, ఇంకో వెయ్యి రూపాయలు వేసియివ్వండి, సంతోషంగా యిస్తాము” అన్నాడు.

కాసేపు మౌనం రాజ్యమేలింది. కాపు కళ్లతో చూశారు వారు. సద్యోజాతంగా ఐదారు వందల మూటలు కాయకనపడుతూనే ఉంది. పుల్లగుమ్మి వద్ద తీసుకున్న చీనీ తోటకు దగ్గర.

బావను చూసి తల ఊపాడు సంజీవరాయుడు. ఓబులప్ప తన జేబులోంచి ఐదు వందల రూపాయల నోట్లు తీసి పతంజలి కివ్వబోయాడు. “మా నాన్నగారికివ్వండి” అన్నాడు పతంజలి.

నోట్లు శర్మ చేతికిచ్చి కాళ్లకు మొక్కాడు ఓబులప్ప. సంజీవరాయుడు చూస్తుంటే,

“నీవూ మొక్కరా దొమ్మ పొగరు నాయాల. సామోల్లురా” అన్నాడు.

సంజీవరాయుడు కూడ మొక్కాడు

“సామీ! ఐదొందలు సంచకారం (అడ్వాన్సు) ఇచ్చినాము. మరో పదిరోజుల్లో వచ్చి మిగతా లెక్క (డబ్బు) కట్టేచ్చాము. మీ తోటను మా తోట మాదిరే సూస్కుంటాము” అన్నాడు ఓబులప్ప.

ఇద్దరూ సెలవు తీసుకొని వెళ్లిపోయారు. “పరవాలేదులే నాన్నా అంతకంటే మనం సొంతంగా చేసుకున్నా గిట్టదు” అన్నాడు పతంజలి.

 “యావత్‌ ప్రాప్తం, తావల్లభ్యం” అన్నాడా పౌరాణికరత్న. ‘స్థితప్రజ్ఞుడు మా నాన్న’ అనుకున్నాడు పతంజలి.

అన్నట్లుగానే  పదిరోజుల్లోపే మిగతా డబ్బు తెచ్చియిచ్చారు. ఇద్దరు జీతగాండ్లకు పని ఉండదు. ఒకర్ని పని మానేయమని చెప్పడం ఎలాగా అని ఆలోచించారు. ఈలోపే ఓబులప్ప అన్నాడు. “సామీ మాకొక మనిసి గావాల తోటను సూపెట్టుకోనికె. మా ఊరునుండి తెచ్చుకుందామంటే బో ఆశగా అడుగుతూండారు మూడు గాసుల నాయాండ్లు. ఆయాల తోటలో ఇద్దర్ని జూసినాం. ఒకన్ని మేం బెట్టుకుంటాం. మీరిచ్చిన దానికంటె ఎక్కువే యిచ్చాం” అన్నాడు.

సమస్య తీరినట్లయింది. సుంకన్నను వాళ్ల దగ్గరపెట్టి, తోకోన్ని తాముంచుకుందామన్నాడు పతంజలి. “మేమొచ్చినప్పుడు ఉండనీకె ఆ వామికాడి కొట్టాన్ని మాకిచ్చే, దాన్ని కొంచెం బాగు జేయిచ్చుకుంటాం” అన్నాడు. అంగీకరించారు. “మా దగ్గరకొచ్చే ఆయప్ప పేరేంది సామీ”

“సుంకన్న చాలా మంచివాడు, నమ్మకస్తుడు”

“మనతోటలో అనుబోగం (అనుభవం) ఉన్నాడే కాబట్టి సింతలేదు” అన్నాడు ఓబులప్ప.

సుంకన్న కూడ సరేనన్నాడు.

డబ్బు జాగ్రత్తగా దేవుని అరుగు క్రింద డబ్బాలో దాచారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి జాగ్రత్తగా దాన్నెలా ఖర్చు పెట్టాలో ప్లాన్‌ చేశారు. రెండు వేల రూపాయలు బ్యాంకు లోన్‌కు కట్టాలనీ, రెండు వేలు శెట్టికి చెల్లు వేయాలనీ నిర్ణయించారు. రాధాసారుకు ఐదు వందలిద్దామన్నాడు పతంజలి. మహిత పెళ్లికి ఎదుగుతూ ఉంది కాబట్టి దాని మెడలోకి ఏమయినా చేయిద్దామంది వర్ధనమ్మ. అది కూడా సమంజసంగానే తోచింది. అప్పుడు బంగారం తులం పన్నెండు వందలు దాకా ఉంది. తులంన్నర పెట్టి మహితకు ఒక గొలుసు చేయించడానికి నిశ్చయించారు.

నెలవారీ ఖర్చులకు ట్యూషన్లు ఆదుకుంటాయి. ఈ మధ్య పతంజలి గమనించిందేమంటే ట్యూషన్ల డబ్బులో కూడా చాలామటుకు తోట ఖర్చులకు పోతూందని. కూలీలకు కూడ కొన్నిసార్లు ఆ డబ్బేవాడారు.

ఇక నాలుగు వేలు మిగిలింది. దాన్ని బ్యాంకులో ఉంచుకొని ‘ఎమర్జెన్సీ ఫండ్‌’గా ఉంచుకుందామనుకున్నారు. ఇక నుండి పెద్దగా కూలీల ఖర్చు ఉండదు.

ఇప్పుడు మహితకు పదిహేనేళ్లు దాటాయి. మరో మూడు నాలుగేళ్లకయినా పెండ్లిచేసి పంపాల్సిందే కదా. అప్పటికి వేలు కావాలి.

డబ్బు తీసుకుని రాధాసారు దగ్గరకు వెళ్లాడు పతంజలి. “ఎందుకు సామీ నా డబ్బు నాకిచ్చేయాలని తొక్కులాడతాండావు? ఇప్పుడేం కొంప ములిగిందని. నాకొద్దు పో. ముందల సదువుపూర్తిగానీ, పరీచ్చలు దగ్గరకొస్తుండ్ల్యా” అన్నాడు ఆయన. విధిలేక వెనక్కు తీసుకొచ్చి అవి కూడ బ్యాంకులో వేశాడు.

మహతికి కంసాలి వీరబ్రహ్మం దగ్గర గొలుసు చేయించారు. చాలా బాగుంది. చిన్న డాలరు కూడ వచ్చింది. దానిమీద లక్ష్మీదేవి రూపం కూడా ఉంది. రోజు పెట్టుకోకూడదనీ, పండగలకూ పబ్బాలకు మాత్రమే వేసుకోవాలని వర్ధనమ్మ అన్నది.

ఓబులప్పవాళ్లు తోటలోని కొట్టాన్ని బాగు చేయించారు. పైకప్పు మార్పించి కొత్త బోదె గడ్డి మందంగా కప్పించారు. చుట్టూ ఈతాకుల దడి విప్పించి చుట్టూ ఇటుకలతో మూడడుగల గోడలేపి, గోడమీద తాటి దూలాలు నిలబెట్టి, వాటి మీదకు కప్పు దించారు. కింద కలుగొట్ల నాప బండలు పరిపించారు. గోడకు లోపలి వైపున ప్లాస్టరింగ్‌ చేయించారు. కొట్టం స్వరూపమే మారిపోయి, అందంగా, విశాలంగా తయారయింది. ఒక నవారు మంచం కూడ వేసుకున్నారు. ఇంజను రూము దగ్గర కరెంటు స్తంభం నుండి వైరులాగి, షెడ్‌లో అరవై కాండిల్స్‌ బల్బు ఒకటి వేసుకున్నారు. అక్కడ నుండి ఇక్కడి వరకు వైరు నిలబడడానికి మధ్యలో ఐదారు ఇనుప గొట్టాలు పాతారు. విశేషమేమంటే వాళ్లకు కూడ కులదైవం ఓలమయ్యే. అహోబిలాన్ని అక్కడి వారంతా ఓలం అంటారు. ప్రహ్లాత సమేతుడైన లక్ష్మీ నరసింహస్వామి వారు ఫోటో ప్రేములో కొలువుతీరి తాటి దూలాన్ని అలంకరించారు.

వేరుశనగ చేసు పచ్చగా కళకళలాడుతూంది. పూత పూసింది. చిన్న చిన్న లేత ఎరుపు రంగు పూలు మరో పదిరోజుల్లో చేట్లు పీకుతారు నేలకాయ అయితే గుంటక తోలితే కాయలతో సహా వస్తాయి. గుత్తికాయకు అట్లా కుదరదు. చెట్టును కాయలతో సహా పీకాలి.

పతంజలికి బాగా తీరుబాటు దొరికింది. తోటకు నాలుగు రోజులకొకసారి వెళుతున్నాడు. రివిజన్‌ చేస్తున్నాడు. సమాధానాలు మరింత ప్రభావంతంగా ఉండటం కోసం కొటేషన్స్ ప్రతి సబ్జెక్ట్‌ నుండీ తయారు చేసుకొని ఆన్సర్లలో సరియైన చోట చొప్పించాడు. కొన్ని ఇంగ్లీషు పద్యాలు సొంతంగా క్రిటికల్ ఇంటర్ ప్రిటిషన్  చేసుకుంటున్నాడు.

అక్టోబరు చివరి వారంలో యూనివర్సిటీ నుండి హాల్‌ టికెట్‌ వచ్చింది. హైదరాబాదులో ‘నిజాం కాలేజి’ సెంటరు. నవంబరు 9వ తేదీ నుండి 26వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రోజూ ఒక పరీక్ష. మొత్తం 13 పేపరు 13 రోజులుంటాయి. మధ్యలో ఒక రెండవ శనివారం, రెండు ఆదివారాలు వచ్చాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 2:30 ని॥ లనుండి సాయంత్రం 5:30 ని॥ల వరకు పరీక్ష జరుగుతుంది. పతంజలి మనస్సు ఉరకలేసింది. ద్విగుణీకృతోత్సాహంతో చదవడం ప్రారంభించాడు.

ఓబులప్ప నిమ్మకాయలు దింపించాడు. వాళ్ళకది తొలిపంట . పతంజలినీ, మార్కండేయశర్మనూ ఆహ్వానించి, తొలిచెట్టు దగ్గర కొబ్బరి కాయ కొట్టించాడు. చేపల ఎరువు వల్ల కాయ సైజు కూడ మునుపటి కంటే బాగుంది. పదిమంది కూలీలు కాయ తెంపారు. రెండు రోజులు పట్టింది. యాభై ఎనిమిది మూటలయ్యాయి.

‘పుల్లగుమ్మి’ లో వాళ్లు గుత్తకు తీసుకున్న బీనీ (బత్తాయి) తోటలో కూడ కాయ దింపుతున్నారట. అవి ఒక లారీ లోడు అవుతాయట. వాటిని ‘నాగపూరు’ మార్కెట్‌కు తీసుకొని పోతారట. ఖర్చులు కలిసి వస్తాయి కాబట్టి, చీనీకాయల లోడు మీదే నిమ్మకాయల మూటలు కూడ వేసుకొని ‘నాగపూరు’కు పోయినారు. చీనీ కాయలు కూడ బాగా దిగినాయట.

పరీక్షలు తేదీ రానే వచ్చింది. ఒక బ్యాగులో బట్టలు, మరొక బ్యాగులో పుస్తకాలు సర్దుకున్నాడు పతంజలి. నరసింహస్వామికి పురుష సూక్తంతో అభిషేకం, పంచామృత స్నానం, సహస్రనామార్చన చేశాడు. అమ్మ తొందరగా వంట చేసేసింది. వాంగీ బాత్‌, పొట్లకాయ బజ్జీలు, సగ్గుబియ్యం పరమాన్నం చేసింది. అటక మామిడాకు పప్పు,  చారు.

అన్నీ స్వామికి నైవేద్యం పెట్టి, స్వామికి కర్పూర నీరాజనవిచ్చాడు పతంజలి.

‘తండ్రీ! నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఈ పరీక్షలు. దిగ్విజయంగా రాసేటట్లు అనుగ్రహించు’ అని వేడుకున్నాడు. ఎందుకో భక్తితో కూడిన ఉద్వేగంతో దుఃఖం వచ్చింది

పదకొండు గంటలకల్లా అందరితో పాటు భోంచేశాడు. ఆకులో కొంత వాంగీబాత్‌, బజ్జీలు కట్టిచ్చిందమ్మ సాయంత్రం తినడానికి. అమ్మకూ నాన్నకూ పాదాలకు నమస్కరించి స్టేషన్‌కు బయలుదేరాడు. ఆ రోజు ఎనిమిదవ తేదీ. రేపటి నుండే పరీక్షలు.

ముందురోజే ఆరువందలు బ్యాంకు నుండి తెచ్చుకున్నాడు. హాల్‌ టికెట్‌ జాగ్రత్తగా పెట్టుకున్నాడు.

పన్నెండుంబావుకు స్టేషన్లో ఉన్నాడు. సరిగ్గా పన్నెండు నలభైకి ద్రోణాచలం – కాచిగూడ ప్యాసింజరు వచ్చింది. టికెట్‌ ముందే తీసుకొన్నాడు ట్రయిన్‌ చాలా రద్దీగా ఉంది. బ్యాగులు కాళ్ల దగ్గర పెట్టుకొని నిలబడ్డాడు.

రైలు ఎల్లమ్మగుడి దాటిపోతూంటే అమ్మవారికి నమస్కరించాడు. తోట పలగాడి దగ్గర తోకోడు సుంకన్న నిలబడి ఉండటం కిటికీలోంచి చూశాడు. తాను తలుపు దగ్గరికి వెళ్లి వారికి కనపడే అవకాశం లేదు.

కర్నూల్లో చాలామంది దిగారు. రెట్టింపు మంది ఎక్కారు. కానీ కిటికీ వద్ద సీటు దొరికింది. నాలుగు వరకు ఇంగ్లీషు సబ్జెక్టు చదువుకున్నాడు. మహబూబ్‌నగర్‌లో రైలాగింది. వాంగీ బాత్‌, పొట్లకాయ బజ్జీలు తిని, క్యాంటీన్‌లో టీ తాగాడు.

రైలు కదిలింతర్వాత కూర్చొని ఆలోచించసాగాడు ఎక్కడ ఉంటే మంచిది? సెంటరుకు దగ్గరగా అయితే బాగుంటుంది అనుకున్నాడు. హాల్‌ టికెట్‌లో నిజాంకాలేజీ, బషీర్‌ బాగ్‌ అని ఉంది.

ఎనిమిది గంటలకు రైలు కాచిగూడ చేరింది. బ్యాగులు పట్టుకొని బయటకు వచ్చాడు. బయట రిక్షాలున్నాయి. ఒకతన్ని పిలిచి, “బషీర్‌బాగ్‌కు దగ్గర్లో ఏవయినా బెడ్స్‌ అద్దెకిచ్చే లాడ్జిలున్నాయా?” అని అడిగాడు.

“ఇక్కడ అలాంటివి లేవు గాని ‘గన్‌ఫౌండ్రీ’లో ఒకటి ఉంది. శుభ్రంగా ఉంటుంది. రూములు కూడ తక్కువ ధరలో దొరుకుతాయి. రూపాయి యివ్వండి తీసుకొని పోతాను” అన్నాడా రిక్షావాడు.

గన్‌ఫౌండ్రీల్లో యస్బిహెచ్ కేంద్ర కార్యాలయం దాటిం తర్వాత కొంచెం దూరం ప్రయాణించి ఒక సందులోకి తిరిగింది రిక్షా. ‘శాంతి విహార్‌’ అని బోర్డున్న బిల్డింగ్‌ ముందాపాడు. ‘వసతి గృహము మరియు డార్మెటరీ సౌకర్యము కలదు’ అని రాసి ఉంది బోర్డు మీద.

“నేనిక్కడ ఉంటాను మీరు చూసి రండి. నచ్చకపోతే ఇంకొక చోటికి వెళదాం” అన్నాడు రిక్షా అతను. చాలా నెమ్మదస్తుడులా ఉన్నాడు.

మెట్లెక్కి లోపలికి వెళ్లాడు. బ్యాగులు రిక్షాలోనే ఉన్నాయి. ‘బ్యాగులతో ఉడాయించడుకదా!’ అనిపించిందొక క్షణం. కానీ ఎందుకో అతన్ని నమ్మాలనిపించింది.

కుడివైపు చిన్న రిసెప్షన్‌లో ఒక పెద్ద వయసుగల వ్యక్తి కూర్చుని ఉన్నాడు. కౌంటర్‌ మీద ఓ ప్రక్కకు వినాయకుని కంచు విగ్రహం ఉంది. వెనుక గోడకు పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఫ్రేము పెద్దది వేలాడుతూంది.

పతంజలిని చూసి “రా, బాబూ! ఎక్కడినుండి?” అని అడిగాడు. “కర్నూలు నుండి వస్తున్నానండి. నమస్కారం” అన్నాడు  పతంజలి.

“ఇక్కడ నిజాం కాలేజీలో బి.ఎ. పరీక్షలు రాయడానికి వచ్చానండి. ఈ నెల 26వ తేదీ వరకు ఉంటాను. ఉండటానికి వసతి కావాలి” అన్నాడు.

ఆయన కౌంటరు పక్కన ఉన్న చిన్న డోరు తీసుకొని బయటకువచ్చాడు.

“చూపిస్తా పద” అంటూ మెట్లెక్కసాగాడు.

“నా పేరు పెరుమాళ్లు. మాది అనంతపురం జిల్లా గోరంట్ల. ఈ లాడ్జిలో పని చేస్తున్నా మేనేజరుగా. ఈ లాడ్జి మాకు తెలిసినవాళ్లదే” అన్నాడు.

పైన పెద్దహాలు. రెండు వరసల్లో బెడ్స్‌ వేసి ఉన్నాయి. వాటిని దాటుకొని తీసుకువెళ్లాడాయన అక్కడ ప్లైవుడ్‌తో పార్టిషన్‌ చేసిన చిన్న చిన్న గదులు అటువైపు రెండు ఇటువైపు రెండూ ఉన్నాయి. చాలా చిన్న గదులు. చిన్న సింగిల్‌కాట్‌, ఒక చెక్కకుర్చీ, ఒక చిన్న టేబుల్‌ ఉన్నాయి అద్దం ఒకటి బిగించి ఉంది. సామాన్లు పెట్టుకోడానికి చిన్న షెల్ఫ్‌ మూడు అరలది ఉంది. దానికి తలుపులు కూడ ఉన్నాయి తాళం కూడ వేసుకోవచ్చు. గది శుభ్రంగా ఉంది. పైన చిన్న రెక్కలున్న ఫ్యాన్‌ కూడ ఉంది.

“నీవు చదువుకోవడానికి ఈ రూమైతే బాగుంటుంది. బయట హాల్లో డిస్టర్బెన్స్‌ ఉంటుంది. బెడ్‌ అయితే రోజుకు నాలుగు రూపాయలు. రూం కయితే ఏడు రూపాయలు. బాత్‌ మాత్రం కామనే. హల్లో బెడ్స్‌ వారికి, రూముల్లో వారికి కూడ.” అన్నాడాయన.

“ఎక్కువ రోజులుండాలి కదా! ఏమయినా తగ్గిస్తారా?” అని అడిగాడు పతంజలి.

“రూంకయితే మావాడికి చెప్పి ఒక రూపాయి తగ్గించే ఏర్పాటు చేస్తానులే” అన్నాడాయన.

“చాలా థాంక్సండీ!” అన్నాడు పతంజలి.

ఇద్దరూ క్రిందికి వెళ్లారు. బ్యాగులు తీసుకుని రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపేశాడు. ‘బాయ్‌’ని పిలిచి రూం శుభ్రం చేసి, దుప్పటి దిండు కవరు మార్చమని చెప్పాడాయన. ప్లాస్టిక్‌ జగ్గుతో మంచినీళ్లు పెట్టమన్నాడు.

రిజిస్టరులో వివరాలు రాసుకొని 30 రూ అడ్వాన్స్‌ తీసుకున్నాడు.

“ఉదయం స్నానానికి వేడినీళ్లు కావాలంటే ఇరవై పైసలిస్తే సగం బకెట్టు వేడి నీళ్లు తెచ్చిస్తాడు” అన్నాడాయన.

వెల్దుర్తిలో కంటే హైదరాబాదులో చలి ఎక్కువగా ఉంది. పతంజలికి చన్నీటి స్నానం కూడ అంత ఇబ్బందేం కాదు.

“మెయిన్‌ రోడ్‌ మీద ‘అమ్మ మెస్‌’ అని ఉంది. భోజనం బాగుంటుంది. రెండు రూపాయలు తీసుకుంటాడు. ముఫై కూపన్లున్న కట్ట ఒకేసారి తీసుకుంటే పావలా తగ్గుతుంది. దానికివతలే ఉదయం సాయంత్రం ఇద్దరు భార్యాభర్తలు టిఫిన్‌ బండి పెడతారు. బాగానే ఉంటుంది” అన్నాడాయన.

“దగ్గర్లో ఏదైనా గుడి ఉందాండి” అనడిగాడు పతంజలి.

“లేదు” అన్నాడాయన.

పైకి వెళ్లి రూములో బ్యాగులు పెట్టుకున్నాడు. అమ్మ మెస్‌కు వెళ్లి భోజనం చేశాడు. బాగుంది. కానీ రాత్రి తనకు టిఫినే మంచింది. పొట్ట తేలికగా ఉంటే రాత్రి పొద్దుపోయే వరకు చదువుకోవచ్చు.

వస్తూ వస్తూ కిరణా షాపులో ఒక రూపాయి పెట్టి తాడు కొన్నాడు. ఒక ఫోటో ఫ్రేముల షాపు కనబడిరది. అందులో లక్ష్మీనరసింహ స్వామి ఫోటో ఒకటి చిన్నసైజు కొనుక్కున్నాడు.

రూంకు వచ్చి, టవలు, పంచె ఆరవేసుకోవడానికి తాడు కట్టుకున్నాడు. స్వామిని తగిలించటానికి గోడకు ఏవయినా మేకులున్నాయా అని వెతికాడు. ఒకటి కనబడింది. స్వామి వారు పతంజలి రూములో కొలువుతీరారు.

బట్టలు, పుస్తకాలు షెల్ఫ్‌లో సర్దుకొన్నాడు. ‘రెండ్రూపాయలు ఎక్కువయినా ప్రత్యేకంగా ఉంది పైగా కుర్చీ టేబులు ఉన్నాయి చదువుకోడానికి’ అనుకున్నాడు.

రేపు ఇంగ్లీష్‌ పేపర్‌-1 పరీక్ష కొన్ని ప్రశ్నలు ఎన్నిక చేసి చదవడం ప్రారంభించాడు. అన్నీ రాయగలడు గానీ, కొన్నింటి మీద ప్రత్యేక శ్రద్ద పెట్టి చదివితే మరింత బాగుంటుంది. రాత్రి 12 గంటల వరకు చదువుకొని పడుకున్నాడు పతంజలి.

మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు కల్లా  తేచాడు. వాష్‌ బేసిన్‌ దగ్గర మొహం కడుక్కొని, క్రిందికి వెళ్లి ఇరానీ చాయ్‌ తాగి వచ్చారు. బాత్‌ రూంల వద్ద అప్పటికి రద్దీలేదు. స్నానం చేసి, బట్టలు మార్చుకున్నాడు. స్వామి దగ్గర నిలబడి ద్వాదశనామస్తోత్రం, కరావలంబ స్తోత్రం చదువుకున్నాడు. ‘ఉగ్రంవీరం….’ అన్న నారసింహ మూలమంత్రాన్ని పదకొండుసార్లు జపం చేశాడు.

9 గంటల వరకు చదువుకొని టిఫిన్‌ చేయడానికి వెళ్లాడు. టిఫిన్‌ బండిదగ్గర చాలా జనం ఉన్నారు. దాదాపు అన్ని రకాల టిఫిన్స్‌ ఉన్నాయి. అర్ధరూపాయికి ఐదు ఇడ్లీలు, లేదా మూడు ఇడ్లీ రెండు వడ, మసాలదాదోసె అరవై పైసలు. పూరీ కూడ అరవై పైసలే.

మూడిడ్లీ రెండు వడ తిన్నాడు పతంజలి. చట్నీలు కూడ రుచిగా ఉన్నాయి. సైజు చిన్నవి కడుపుకు చాలలేదు. తొందరగా భోంచేస్తే మంచిదని, చాలానుకున్నాడు.

రూంకు తిరిగి వచ్చి మళ్లీ చదువుకున్నాడు. ఒంటిగంటకు తయారై, హాల్‌ టికెట్‌, పెన్ను, అన్నీ పెట్టుకొని ‘అమ్మ మెస్‌’కు వెళ్లాడు. భోజనం చేశాడు. అక్కడే బస్టాఫ్‌ ఉంది. అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ వైపు వెళ్లే బస్సులన్నీ నిజాం కాలేజీ దగ్గర ఆగుతాయని తెలుసుకొని బస్సెక్కాడు.

బస్సు ఛార్జీ ముఫై పైసలు. పదే పది నిమిషాల్లో నిజాం కాలేజి బస్‌స్టాఫ్‌ దగ్గర దింపేశాడు. బస్సు దిగి కొంచెం నడచి కాలేజి మెయిన్‌ గేటుగుండా లోపలికి వెళ్లాడు పతంజలి. అంత పెద్ద కాలేజీని ఇంతవరకు చూడలేదు. రాజప్రసాదాల్లాగున్నాయి బిల్డింగ్‌లు. పెద్ద పెద్ద చెట్లు, లాన్స్‌, క్రోటన్స్‌, చాలా ఆహ్లాదకరంగా ఉంది.

బి.ఎ. ఎక్స్‌టర్నల్‌ పరీక్షలు జరిగేదెక్కడో కనుకున్నాడు. అది ఒక పెద్ద ఆడిటోరియం. దాని తలుపు దగ్గరే ఒక బోర్డు పెట్టి ఉంది. ‘ఉస్మానియా యూనివర్సిటీ బోర్డు ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినేషన్స్‌ నవంబరు 1977. సీటింగ్‌ ఆరేంజ్‌మెంట్‌ సిల్వర్‌ జూబ్లీ హాల్‌’ అని ఉంది దానిమీద.

జేబులో నుంచి హాల్‌ టికెట్‌ తీసి తన నంబరు చూసి బోర్డు మీద ఉందో లేదో చూసుకున్నాడు. రూం నంబర్లు వేసి ఉన్నాయి.

అప్పటికి రెండు గంటలు కాలేదు. రెండుం పావుకు లోపలికి వదిలారు. పరీక్ష రాసేవారికనువుగా, చెక్క కుర్చీ కుడిచేతికీ ఒక ప్లాంక్‌ అమర్చి ఉంది. దానిమీదే నంబరు వేసి ఉంది. చాక్‌పీస్‌ తడిపి రాసినారేమో చెరిపినా చెరిగిపోదు.

వెళ్లి తన స్థానంలో కూర్చున్నాడు పతంజలి. ఆన్సర్‌ బుక్‌ ఇచ్చారు. పన్నెండు పేజీలు ఉంది. మొదటి పేజీలోనే హాల్‌ టిక్కెట్‌ నంబరు, పరీక్ష పేరు, పేపరు, కేంద్రం పేరు అన్నీ నింపాడు. సరిగ్గా రెండున్నరకు గంట మోగింది. ప్రశ్నాపత్రం అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. తన పేపరు తీసుకొని, ఒక్కసారి నరసింహస్వామిని మనసులో స్మరించుకొని పేపరు చూస్తే, ఏవయితే తాను విశేషంగా ప్రిపేరయి వచ్చాడో, అవే ప్రశ్నలున్నాయందులో.

చకచక సమాధానాలు రాయడం ప్రారంభించాడు. గంటన్నరలో మెయిన్‌ ఆన్సర్‌ బుక్‌ పూర్తయింది. అడిషినల్‌ తీసుకున్నాడు. ఇద్దరు ఆడవాళ్లు మంచినీళ్ళు ప్లాస్టిక్‌ గ్లాసులతో సర్వ్‌ చేస్తున్నారు. ఐదు గంటలకల్లా రాయడం పూర్తయింది. మూడు అడిషనల్స్‌ వాడాడు. అన్నీ కలిపి కట్టడానికి దారం ఇచ్చారు.

ఒక్కసారి రాసిందంతా సరిచూసుకొని, హాల్‌ టికెట్‌ నంబరు సరిగ్గా వేశాడో లేదో చెక్‌ చేసుకొని, ఆన్సర్‌ పేపర్‌ ఇన్విజిలేటరుకిచ్చి, ఐదు ఇరవైకి బయటకు వచ్చాడు. పరీక్ష బాగా రాశానన్న తృప్తి అతని ముఖంలో ప్రతిఫలిస్తూంది.

Exit mobile version