Site icon Sanchika

సాఫల్యం-23

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ద[/dropcap]గ్గరే కదా అని నడచుకుంటూ వస్తున్నాడు. మిరపకాయబజ్జీలు బండి కనబడింది. ఆగి రెండు తిన్నాడు. బజ్జీలమీద ఏదో మసాలా పొడి చల్లి ఇస్తారు. దానివల్ల రుచి పెరుగుతుంది. బండి ప్రక్కన స్టూలు మీదనున్న స్టీలు క్యాన్లోంచి నీళ్లు పట్టుకొని తాగాడు. ఎందుకో రామ్మూర్తి బావ గుర్తొచ్చాడు. ఆయనక్కూడ బజ్జీలంటే చాలా ఇష్టం. కాని ఆయనకు ఒకటి రెండూ చాలవు.

దారిలోనే పాన్‌షాపులో నాలుగు కార్డులు కొని, ఒకటి తండ్రికి, ఒకటి రామ్మూర్తి బావకు రాశాడు. హైదరాబాదు క్షేమంగా చేరుకున్నాననీ, మొదటి పరీక్ష బాగా రాసినాననీ, లాడ్జి, భోజన సౌకర్యాలు బాగానే కుదిరాయనీ రాశాడు. కొంత దూరం నడిచింతర్వాత కనబడిన పోస్టు బాక్కులో వేశాడు.

‘స్టార్‌ కేఫ్‌’ కనబడింది. దాన్ని తెలుగులో ‘స్టార్‌ కెఫె’ అని రాసి ఉండడం చూసి నవ్వుకున్నాడు. లోపలికి వెళ్లి ఇరానీ చాయ్‌ తాగాడు.

రిసెప్షన్‌లో పెద్దాయన “పరీక్ష బాగా రాసినావా బాబూ” అని అడిగాడు. చాలా బాగా రాశానని చెప్పి పైకి వెళ్లాడు. రూం తెరిచిన వెంటనే నరసింహస్వామి పాదాలు తాకి కళ్లకద్దుకున్నాడు. బట్టలు మార్చుకొని, పంచె కట్టుకుని, టవలు సోపు తీసుకొని వెళ్లి, శుభ్రంగా మొహం కడుక్కున్నాడు. కొద్దిగా వంగి, మెడ వీపు కూడ తడిసేట్లు పోసుకున్నాడు. తోకోని బాషలో దాన్ని ‘అడ్డపయ్యి’ పోసుకోవడం అంటారు. పయ్యి అంటే శరీరమని. పై మీద అంగీ లేకుండా తిరుగుతున్నాడంటారు.

రూములో కూర్చుని ఇంగ్లీషు-2 ప్రిపేరవసాగాడు. అది అంతా కాంపోజిషన్‌కు సంబంధించి ఉంటుంది. జనరల్‌ ఎస్సే, పేరాగ్రాఫ్‌ రైటింగ్‌, ప్రెసీ (సమ్మరైజింగ్‌) ఎక్స్‌పాన్షన్‌ ఆఫ్‌ గివెన్‌ ప్రావర్చ్‌ర్ట్ ఇలాంటివన్నమాట. కొన్ని స్వంతంగా రాసి ప్రాక్టీసు చేశాడు. ఎనిమిదిన్నరకు టిఫిన్‌ బండివాడి దగ్గర ఒక రవ్వదోసె, ఒక పరోటా తినివచ్చాడు.

రెండోరోజు కూడా చాలా బాగా రాశాడు పతంజలి. సంస్కృతం పేపర్లు కూడ సంస్కృతం జవాబుల్లో కొటేషన్లను దేవనాగరి లిపిలో వ్రాశాడు.

ఎకనామిక్స్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరీక్షలు జరుగుతున్నపుడు ఐదు ప్రశ్నలు ప్రత్యేక శ్రద్ధతో ప్రిపేరయ్యాడు. అన్నీ వ్యాస రూప ప్రశ్నలే. పది యిచ్చి ఐదు రాయమంటారు. ఒక్కొ ప్రశ్నకు 20 మార్కులు. స్వామి అనుగ్రహం పతంజలి పట్ల ఎలా ఉండేదంటే, గన్‌షాట్  కొట్టినట్లు ఇచ్చిన పదిలో ఆ ఐదు ప్రశ్నలూ ఉండేవి.

ఎకనామిక్స్‌ మొదటి పేపరునాడు రెచ్చిపోయి మొదటి ప్రశ్నకు జవాబు 50 నిమిషాలు దాదాపు ఎనిమిది పేజీలు రాసి, ఐదవ ప్రశ్నకు సమయం సరిపోలేదు. రెండో పేపరు నుండి జాగ్రత్తపడి ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా అరగంట వినియోగించుకొన్నాడు.

గ్రూప్‌ ఇంగ్లీషు మొదటి పేపరు పరీక్ష. గంట కొట్టింతర్వాత ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఆ సెంటరు కంతటికీ ఇంగ్లీషు లిటరేచర్‌ గ్రూప్‌లో తీసుకున్నవాడు పతంజలి ఒక్కడే. స్వామిని యథాధాప్రకారం ధ్యానించి, కొశ్చన్‌ పేపరు చూస్తే, తెలిసిన ప్రశ్న ఒక్కటి కూడ లేదు. కళ్లు బైర్లు కమ్మాయి. నిమ్మళించుకొని ఇన్విజిలేటర్‌ను పిలిచాడు. “సార్‌, ఇది మా సిలబస్‌ కాదు. వేరే పేపరిచ్చారు. దయచేసి సరియైన పేపరివ్వండి” అని అడిగాడు.

ఆయన విసుక్కున్నాడు.

“చీఫ్‌ సూపరింటెండెంట్‌ మాకు ఇచ్చిన సీల్డు కవర్లోదే నీకిచ్చాను. నీవొక్కడివే ఈ పరీక్ష రాస్తున్నావు. మా ప్రాణం తీయడానికి కాకపోతే ఏ హిస్టరీయో, సోషియాలజీయో తీసుకొని ఏడవచ్చుగా” అన్నాడాయన దురుసుగా.

పతంజలి ఎంత బ్రతిమిలాడినా కరుణించలేదు. “రాస్తే రాయి లేకపోతే పో” అన్నట్లు చూశాడు.

పతంజలి కాళ్లు వణకసాగాయి. లోపల్నుంచి ఏడుపు వస్తూంది. పది నిమిషాలు చూసి ఇక లాభం లేదని హాల్‌టికెట్‌ తీసుకొని బయటకు వచ్చాడు. నోరంతా చేదుగా అనిపిస్తుంది. కళ్లు తిరుగుతున్నట్లనిపిస్తుంది. ‘తండ్రీ! నరసింహా! ఎందుకిలా జరిగింది!’ అని మనసులో ఆక్రోశిస్తూ మెయిన్‌ గేటు దాటబోతున్నాడు. మరికొద్ది సెకన్లలో రోడ్‌ క్రాస్‌ చేసి ట్రాఫిక్‌లో కలిసిపోయేవాడే.

ఇంతలో వెనుకనుంచి కేకలు వినబడ్డాయి. టక్‌ చేసుకున్న ఒకాయన “ఇదిగో అబ్బాయ్‌! నిన్నే! ఆగు! ఆగాలి!” అని అరచుకుంటూ వస్తున్నాడు. పతంజలికి అర్థం కాలేదు. ఆయన దగ్గరకు వచ్చి పతంజలి చేతులు పట్టుకొని, “సారీ! వెరీ సారీ! ఇంగ్లీషు గ్రూప్‌ క్యాండిడేట్‌వి నువ్వే కదూ! స్టోరేజీ పాయింటులో నుండి పొరపాటున ఓల్డ్‌ సిలబస్‌ పేపర్లున్న కవరు కూడ తెచ్చాము. ఓల్డ్‌ సిలబస్‌ రాసేవారు ఎవరూ లేరు. పొరపాటు జరిగింది. ఆ కవరే రూంకు పంపాను. ఇన్విజిలేటర్‌ అదే నీకిచ్చాడు. న్యూ సిలబస్‌ కవరు నా దగ్గరుండి పోయింది. పదపద! పరీక్ష రాద్దువుగాని” అన్నాడు ఆయాసపడుతూ.

పతంజలి ముఖం మబ్బువీడిన చందమామలా వెలిగిపోయింది. “థ్యాంక్యూ సార్‌, ధ్యాంక్యూ సార్‌ వెరీ కైండాఫ్‌ యు సార్‌” అంటూ రెండు చేతులెత్తి ఆయనకు నమస్కరించాడు కళ్ల నిండా నీళ్లతో.

ఆయన పతంజలి భుజం మీద చేయివేసి హాల్లోకి తీసుకొనివెళ్లాడు. పతంజలిని కూర్చోబెట్టి చల్లని మంచినీళ్లు తాగించాడు. వేడిగా ‘టీ’ తెమ్మని పురమాయించాడు.

క్యాండిడేట్‌ తనకు సరైన ప్రశ్నాపత్రం అందలేదని ఫిర్యాదు చేస్తే, తన దృష్టికి వెంటనే తీసుకురానందుకు ఇన్విజిలేటర్‌ను తీవ్రంగా కోప్పడి, రేపటి నుండి ఇన్విజిలేషన్‌ విధుల నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడు.

పతంజలికి సరైన పేపరిచ్చారు. స్థిమితపడి, నిదానంగా రాయమన్నాడు చీఫ్‌. తమవల్లే టైం వృథా అయ్యింది కాబట్టి అరగంట గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తానన్నాడు. పతంజలి ‘టీ’ కూడ తాగిన తర్వాత వెళ్లిపోయాడు ఆయన.

పతంజలి మెదడు క్రమంగా యథాస్థితికి వచ్చింది. అన్నీ తాను బాగా ప్రిపేరయినవే. ప్రశాంతంగా సమాధానాలు రాయడం మొదలుపెట్టాడు. గ్రేస్ పీరియడ్‌ పూర్తిగా వినియోగించుకున్నాడు. మెయిన్‌ బుక్‌ కాకుండా ఐదు అడిషనల్స్‌ తీసుకున్నాడు. అన్నీ జాగ్రత్తగా కలిపి కట్టి, ఇన్విజిలేటర్‌కు అప్పగించి తేలికయిన మనస్సుతో బయటకు వచ్చాడు.

లాడ్జికి నడుస్తూ పోతుంటే, జరిగిందంతా ఒక కలలా అనిపించింది. ఒక్క నిమిషం… ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే తాను వెళ్లిపోయేవాడు. అంత కష్టపడి చవివిందంతా వృథా అయిపోయేది. నరసింహ స్వామే సమయానికి కాపాడాడని భావించాడు. మిగతా రెండు పరీక్షలు కూడా చాలా బాగా రాశాడు పతంజలి. చివరి పరీక్షలో ‘క్రిటికల్‌ ఇంటర్‌ ప్రిటేషన్‌’లో అనుసరించాల్సిన సిద్ధాంతాలను విపులంగా వ్రాశాడు. సరోజినీ నాయుడు వ్రాసిన “ది పాలంక్విన్‌ బేరర్స్‌” అన్న పద్యాన్నిచ్చారు క్రిటికల్‌గా ఇంటర్‌ప్రిట్‌ చేయమని.

పద్యాన్ని జాగ్రత్తగా చదివాడు. అందులో ఔచిత్యం ఏమీ కనపడలేదు. నాన్న సంస్కృతపాఠం చెప్పేటప్పుడు తరచుగా చెప్పే విషయం గుర్తొచ్చింది. క్షేమేంద్రుడు తన ‘ఔచిత్య విచార చర్చ’ అనే గ్రంథంలో ఔచిత్యం (appropriateness/propriety) లేని కవిత్వం ఎంత సుందరమైనదైనా వ్యర్థం అని వాక్రుచ్చాడు.

“అనౌచిత్యాదృతే కావ్యం రసభంగస్య కారణమ్‌” అన్నాడాయన.

‘సరోజినీ దేవి’ ‘భారత కోకిల’గా ప్రసిద్ధిగాంచిన కవయిత్రి, రాజనీతిజ్ఞురాలు, మంచి వక్త. ఇండో ఆంగ్లియన్‌ (భారతీయులు రాసిన ఆంగ్ల) సాహిత్యంలో ముఖ్యంగా ఆమెకు చాలా పేరుంది. కానీ “ది పాలంకిన్‌ బేరర్స్‌” అనే పద్యంలో ఆమె వ్యక్తం చేసిన భావాలు అసహజంగా ఉన్నాయి.

“పల్లకీలో బోయీలు ఒక రాజవంశ స్త్రీని ‘మోసుకొని’ పోతూంటారు. ఆమె చాలా అందంగా రాజసంగా ఉంది. సరే దాంతో మనకు పేచీ లేదు. బోయీలు పల్లకీని ఆనందంగా ఉత్సాహంగా మోస్తున్నారట. గాలిలో తేలిపోతూన్నట్లుగా ఉందట వారికి. వారు లయబద్ధంగా చేసే శబ్దాలు చెవులకింపుగా ఉన్నాయట.”

అస్సలు పల్లకీ అనేదే బానిసత్వానికి ప్రతీక. (a symbol of servitude) ఒక మనిషిని నలుగురు మనుషులు మోయడమే అమానుషం పల్లకీ చాలా బరువుంటుంది. అంతదూరం మొయ్యాలంటే అది ఎంతో శ్రమతో కూడినది. శ్రమను మరచిపోవడానికి వారు లయబద్ధంగా శబ్దాలు చేస్తారు తప్ప ఉత్సాహంతో కాదు. ఆ పనిలో విధిలేక (Forced) తప్ప, ఆనందంగా పాల్గొనరు.”

“ఇండో ఆంగ్లియన్‌ కవుల్లో ఒక వర్గం భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని, వలస పాలకులకు colonial rulers అందంగా, పంచరంగుల్లో చూపే ప్రయత్నం చేశారు. అదే కోవలోకే ఈ పద్యం కూడ వస్తుంది” అని జవాబు రాశాడు.

రాసింతర్వాత భయమేసింది. కానీ విమర్శించే హక్కు కూడ పాఠకునికి ఉంది కదా అనుకున్నాడు. ఆ పద్యంలో చెప్పిన విషయం తనకు నచ్చలేదు. సామాజిక దృక్కోణంలో అది తప్పుగా తోచింది. తన మనస్సు తననెప్పుడూ సరిగానే గైడ్‌ చేస్తుంది అనుకున్నాడు. మళ్ళీ కాళిదాసు గుర్తొచ్చాడు.

“సతాంహి సందేహపదేషు వస్తుషు

ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః”

అంటాడాయన శాకుంతలంలో.

సుంకన్న కొడుకు ఏడుస్తూంటే వాడిని ఎత్తుకొని బుజ్జగించడం కూడ తనకు ఏ మాత్రం తప్పనిపించలేదు. అప్పుడూ కాళిదాసే ఆదుకున్నాడు.

‘ఒకవేళ పేపరు దిద్దేవాడు సరోజినీ దేవి అభిమాని అయితే’ అనిపించింది. అయినా పరవాలేదు. తన వాదనే కరెక్ట్‌. ‘విమర్శనా సిద్ధాంతాల్లో కూడ కవిని వ్యతిరేకించవచ్చునని ఉంది కదా’ అని ధైర్యం తెచ్చుకున్నాడు.

ఆన్సర్‌ పేపరు అప్పచెప్పి, కాలేజి బయటకు వచ్చాడు పతంజలి. ఒక్కసారి వెనక్కి తిరిగి నిజాం కాలేజీ భవనాలను చూసుకున్నాడు. మనసంతా హాయిగా, తేలికగా ఉంది.

మిరపకాయ బజ్జీలు రెండు తిని, ఇరానీ చాయ్‌ తాగాడు. లాడ్జికి వెళ్ళి పెద్దాయనతో పరీక్షలయిపోయాయని, ఎనిమిది గంటలకు ఖాళీ చేస్తాననీ చెప్పాడు. ఆ రోజు ఇచ్చిన అడ్వాన్సే. మళ్లీ ఆయన డబ్బు అడగలేదు. మిగతా అద్దె చెల్లించాడు. రూంలోకి వెళ్లి నరసింహస్వామి పాదాలకు ప్రణమిల్లి, ఫోటోను తీసి జాగ్రత్తగా సంచి అడుగున దాచాడు.

ఫ్రెష్‌గా స్నానం చేసివచ్చి, పుస్తకాలు, బట్టలు అన్నీ రెండు బ్యాగులలో సర్దుకున్నాడు. ఎనిమిది గంటలకు బ్యాగులతో సహా క్రిందికి వచ్చి, పెద్దాయనకు నమస్కారం చేసి, మెయిన్‌ రోడ్‌ మీదికి వచ్చి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సెక్కాడు. రాత్రి 9.40కి బయలుదేరే బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌లో వెల్దుర్తికి పోవాలని ప్లాను. 9 గంటల లోపే స్టేషను ముందు దిగి, ‘పద్మజ’ హోటల్లో భోజనం చేశాడు.

బండిమీద యాపిల్స్‌ అమ్ముతున్నాడు. అరడజను యాపిల్స్‌ కొని సంచిలో పెట్టుకున్నాడు. ఒక పెద్ద స్వీటు షాపు కనబడిరది. ‘అగర్వాల్‌ మిఠాయి భండార్‌’ వెళ్లి అన్ని రకాల స్వీట్లు అరకేజీ ప్యాక్‌ చేయించుకున్నాడు. చాక్‌లెట్ల ప్యాకెట్‌ ఒకటి 250 గ్రాముది కూడ తీసుకున్నాడు.

పుట్‌పాత్‌ మీదే అందమైన హారాలు అమ్ముతున్నాడొకతను. రెండు వరుసలు ముత్యాలవంటివి, మధ్యలో అందమయిన పగడాలవంటి పూసలతో, క్రింద అందంగా వేలాడుతున్న చెమ్కిలతో చాలా బాగున్నాయి. మహితకు ఐదు రూపాయలు పెట్టి ఒక హారం, రెండు జతల ఫ్యాన్సీ గాజులు తీసుకున్నాడు.

దాదాపు తొమ్మిదింబావు దాటింది. గబగబా స్టేషనులోకి వెళ్లి టికెట్‌ తీసుకుందామంటే నాలగు కౌంటర్ల దగ్గర పెద్ద పెద్ద క్యూలున్నాయి. టికెట్‌ దొరికే సరికి రైలు వెళ్లిపోతుందేమోనని భయమేసింది.

ఆడవాళ్ల క్యూ తక్కువగా ఉంది. కౌంటరు దగ్గరగా ఉన్న ఒకామె దగ్గరకు వెళ్లి అభ్యర్థించాడు.

“అమ్మా! దయచేసి నాకొక టికెట్‌ తీయండి. చేతిలో సంచులున్నాయి. రైలుకు టైం అవుతూంది” అన్నాడు. ఆమె ముఖం తిప్పుకుంది. ఆమె వెనక ఉన్నామె, “ఇలా ఇవ్వండి. నేను తీస్తాను” అన్నది.

పతంజలి ఆమెకు డబ్బులిచ్చి “వెల్దుర్తి. బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌” అని చెప్పాడు.

ఐదు నిమిష్లాల్లో టికెట్‌ తెచ్చిచ్చిందా పుణ్యాత్మురాలు. ఆమెకు కృతజ్ఞతలు చెప్పిన, పరుగు పరుగున ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి ఆరవ నంబరు ప్లాటు ఫారం మీద ఉన్న ట్రెయిన్‌ దగ్గరికి వెళ్లాడు. జనరల్‌ పెట్టెలన్నీ నిండి ఉన్నాయి. ఏం చేయాలో తోచలేదు. ట్రైన్‌ కదలటానికి ఐదు నిమిషాలే ఉంది.

ఇంతలో TTE కనబడ్డాడు. నల్లకోటు వేసుకొని, చార్టు పట్టుకొని, ఆయన వద్దకు వెళ్లి నమస్కరించాడు.

“సర్‌, విత్‌ యువర్‌ కైండ్‌ పర్మిషన్‌, కెన్‌ ఐ ట్రావెల్‌ అప్‌ టు వెల్దుర్తి? ఐ కుడ్‌నాట్‌ బోర్డ్‌ ది జనరల్‌ కంపార్టుమెంట్‌ ప్లీజ్‌ హెల్ప్‌మి” అన్నాడు.

ఆయన పతంజలి వైపు ప్రసన్నంగా చూసి, “గో అండ్‌ సిట్‌ ఇన్‌ యస్‌-5, ఇన్‌ మై బెర్త్‌ ఐ విల్‌ బి కమింగ్‌” అన్నాడు.

యస్‌-5 ప్రక్కనే ఉంది. తలుపుదగ్గరే TTE అని ఉన్నచోట బ్యాగలు పెట్టుకొని కూర్చున్నాడు. రైలు కదిలింది. ‘తిమ్మాపూర్‌’ దాటిన తర్వాత TTE వచ్చాడు. పతంజలి టికెట్‌ తీసుకొని రశీదు రాశాడు. “ఐదు రూపాయల్విండి” అన్నాడు .డబ్బు తీసుకొని రశీదిచ్చాడు. “థర్టీ ఎయిట్‌లో పడుకోండి. దాంట్లో కర్నూల్లో జాయిన్‌ అవుతారు. కర్నూల్లో దిగి కింద ఎక్కడయినా కూర్చోండి. నెక్స్ట్‌ స్టేషనే కద మీరు దిగేది” అన్నాడు.

రశీదు చూస్తే మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలకు ఉంది. మిగతా చిల్లర ఆయన ఇవ్వలేదు. పతంజలికర్థమయింది. అది బెర్తు ఇచ్చినందుకు ఆయన ‘తీసుకున్న’ బహుమతి.

38 అప్పర్‌ బర్త్‌. బాత్‌ రూంకు పోయి వచ్చి, బాగ్యులు పైన పెట్టి చెప్పులు కింద విడిచి, బెర్త్‌ మీదికి ఎక్కి పడుకున్నాడు. మామూలుగా అయితే, అనవసర ఖర్చు అని పెట్టేవాడు. ప్రస్తుతం పరీక్షలు బ్రహ్మాండంగా రాసిన ఊపులో ఉన్నాడు.

జేబులో డబ్బు తీసి లెక్కపెట్టుకున్నాడు పతంజలి. ఇంకా రెండు వందల పది రూపాయలు మిగిలాయి! మొత్తం నాలుగు వందలతో పరీక్షలు పూర్తయ్యాయన్న మాట! అనుకుని హాయిగా నిద్రబోయాడు.

తెల్లవారి మూడున్నరకు కర్నూల్లో ఆ బెర్తాయన వచ్చిలేపాడు. దిగి, బ్యాగులతో సహా తలుపు వద్ద నిలుచున్నాడు. నాలుగుంపావుకు రైలు వెల్దుర్తి చేరింది.

ఈ రైలుకు పతంజలి వస్తాడని అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు. అన్నీ వాళ్లకు వివరించాడు. ప్రశ్నపత్రం వేరేది ఇచ్చినపుడు ఎంత కలవర పడ్డాడో, నరసింహుడు ఎలా కాపాడాడో చెప్పాడు. తెచ్చినవన్నీ అమ్మకిచ్చాడు. మార్కండేయశర్మ అన్నాడు “మన స్వామే ఆ చీఫ్‌ రూపంలో వచ్చి నిన్ను ఆదుకున్నాడు నాయనా”

మహిత తన కోసం తెచ్చిన గొలుసు, గాజులు చూసి మురిసిపోయింది. నిమ్మకాయలకు నాగపూర్‌లో మంచి ధర పలికిందనీ ఖర్చులు పోను వాళ్లకు ఐదు వేలు మిగిలిందనీ గుత్తదారులు సంతోషంగా ఉన్నారనీ చెప్పాడు తండ్రి పతంజలి కూడ సంతోషించాడు.

రామ్మూర్తి బావకూ, గద్వాల సాగర్‌ బావకూ, ఆజం సారుకూ పరీక్షలు బాగా రాశానని ఉత్తరాలు వ్రాశాడు. పదిగంటలకల్లా భోజనంచేసి పడుకున్నాడు. ఈ పదహారు రోజులూ పడిన మానసిక శ్రమనంతా మరచిపోయేలా మధ్నాహ్నం 3 గంటల వరకు పడుకున్నాడు. రేపటి నుండి ట్యూషన్‌ పిల్లలు వస్తారు. చాలా రోజులు గ్యాప్‌ వచ్చింది. వాళ్లకు ఆదివారాలు కూడ క్లాసులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

నాలుగ్గంటలకు వర్ధనమ్మ వాము కారాలు (జంతికలు) చేసింది. కరకరలాడుతూ వాము రుచితో చాలా బాగున్నాయి. తిని కాఫీ తాగి మొదట శంకరయ్య సారు ఇంటికి వెళ్లాడు, కొశ్చన్‌ పేపర్లన్నీ తీసుకుని సారుకు అన్నీ చెప్పాడు. సరోజినీనాయుడు. పద్యానికి తన విశ్లేషణ చెప్పాడు. ఆయన అభినందించి ఆశీర్వదించాడు.

తర్వాత రాధాసారింటికి వెళ్లాడు. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. పరీక్షలు బాగా రాసినట్లు విని ఇలా అన్నాడు.

“నీవు రాయకపోతే ఇంకెవరు రాస్తారు సామీ. నీ గాచారం బాగలేక ఈ వూల్లో ఉండావు గాని, లేకపోతే ఎంత దూరం బొయ్యేటోనివో మరి”

సారు భార్య కూడ వచ్చి అభినందించింది. “నిమ్మతోట గుత్తకిచ్చినారంట గదా సామీ” అన్నాడు రాధాసారు.

“అవుసార్‌, నా పరీక్షలు. వాళ్ళు కూడ మంచిరేటు చెప్పినారు. కొంత అప్పు బరువు తీర్చుకుందామని…” అన్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు.

నంద్యాల నుండి అక్క జాబు రాసింది. తనకు పది పన్నెండు రోజుల్లో తొమ్మిదో నెల వస్తుందనీ, కాన్పు నంద్యాలలోనే చేసుకుంటామనీ తన అత్తగారికి కూడ ఆరోగ్యం బాగలేదు కాబట్టి సాయానికి రాలేకపోవచ్చుననీ రాసింది.

అందరూ ఈ విషయమై చర్చించుకున్నారు. ఒక వారం రోజుల్లో మహితను అక్క దగ్గరకు పంపాలనీ, కాన్పుకు రెండు మూడు రోజులు ముందు వర్ధనమ్మ వెళితే సరిపోతుందనీ అనుకున్నారు.

ఒకరోజు కర్నూలుకు వెళ్లి విశ్వేశ్వరశాస్త్రిగారిని కలిసి సంస్కృతం రెండు పేపర్లూ చూపించి, తాను ఎలా రాశాడో వివరించాడు పతంజలి. ఆయన చాలా సంతోషించి ఆశ్వీరించి పంపాడు.

ట్యూషన్స్‌ మీద ఎక్కువ దృఫ్టిపెట్టాడు పతంజలి. డిసెబంరు మొదటి వారంలో ఫీజులన్నీ వసూలయ్యాయి. తోటకు వెళ్లి చూశాడు. వేరుశనగ పంట చేతికొచ్చింది. తొందరగా చెట్లు పీకించడం మేలనుకున్నాడు. ఏదయినా అకాల వర్షమో, తుపానో పట్టుకుందంటే ఆకు నల్లబడి పశువుల మేతకు పనికిరాదు. చెట్లు పనికిరాదు. చెట్లు పీకాలంటే భూమి మెత్తగా ఉండాలి. ఒక తడి నీరు పారించమని తోకోనికి చెప్పాడు. రెండ్రోజుల్లో పదిమంది కూలీలను పిలవమన్నాడు.

నిమ్మచెట్లల్లో తిరిగి చూశాడు. రెండవసారి కూడా కాయ దింపినట్లు తోకోడు చెప్పాడు. 45 బస్తాలయినాయట. రాలిన కాయలు రోజు మార్చి రోజు 3 బస్తాలవుతున్నాయట. ఓబుళప్ప పుల్లగుమ్మిలో ఉన్నాడట. సంజీవరాయుడు మొన్న వచ్చిపోయాడట. మరో వారంరోజుల్లో ఇంకో యాభై బస్తాలు దిగొచ్చని అంచనా వేశాడు పతంజలి. “గుత్తదార్లు అదృష్టవంతులే రోయ్‌” అన్నాడు సుంకన్నతో.

“శానా మంచోడు సామీ ఆ ఓబులప్ప. ఆ సంజీవరాయుడే రోంత రెట్టమతమోడు” అన్నాడు సుంకన్న.

మళ్లీ ముగ్గురూ ఇంజను రూములో పాట కచేరీ పెట్టారు కాసేపు.

పెట్టిన తడి ఆరింది. కూలీలు వచ్చేటప్పటికి, రాత్రి మిగిలిన అన్నం చిత్రాన్నంగా మార్చి అమ్మ పెట్టింది తిని, తోటకు వచ్చేశాడు పతంజలి. తోకోడు, బుడ్డక్క గాక ఎనిమిది మంది ఆడవాళ్లు వచ్చారు.

తలా ఒక సాలు పట్టుకొని జాగ్రత్తగా వేరుశనగ చెట్లు పీకడం ప్రారంభించారు. సాలును ‘మునెం’ అంటారు. పతంజలి కూడ ఒక మునేనికి వంగాడు. ‘పనికొంగడం’ అంటే ఉపక్రమించడం అని అంటారు. మబ్బులు కమ్మి వర్షం ప్రారంభమైతే కూడ ‘దేవుడు వంగ్యాడు’ అంటారు. అంటే కరుణించాడని అర్థం.

అందరూ నాల్గవ మునెం పూర్తి చేసింతర్వాత పనిలో వేగం తగ్గింది. ఇంతలో ఒక ఆడకూలీ అన్నది.

“అప్పుడే శావశచ్చిందేమే మూడు గాసుల ముండల్లారా! పైటాల దాటే తలికి పేకేదయిపోతే సామి ఆ కొక్కదుడ్లిచ్చాడు. పీకండి పీకండి” అని ఉత్సాహపరిచింది. ఆమెకు అరవై ఏండ్లు పైనే ఉంటాయి. నడుము వంచి చకచక చెట్లు పీకు తూంది.

“శేషమ్మత్తా, ఏదయినా పదమందుకోయే” అన్నదొకామె.

“ముసిలి ముండను నాకేమ్మొచ్యాది! వైసు పిల్లలు మీరు బాడాల గాని” అన్నదామె.

“ముసిలోడయినా బసిరెడ్డే మేలాయె అంటారు గదనే” అన్నదింకోపిల్ల.

శేషమ్మత్త అందుకొంది. ఆమె గొంతు పంట పొలంలో ఖంగున మోగసాగింది.

గొంతులో ఒక జీర, ఒక విధమైన వణుకు ఆమె గాత్రాన్ని సుసంపన్నం చేశాయి.

“లింగా నిన్ను మరువలేనుర

లింగా నిన్ను మరువలేనుర” అని ఎత్తుకుని

“పాడండే అందరూ” అన్నది

ప్రతి చరణాన్నీ మిగతా అందరూ అందుకొని పాడసాగారు.

ఓ గద్దువాల ముద్దుల మరది

లింగా నిన్న మరువలేనుర

కూలికి బోతె నాతో రార

నలికి బోతె నాతో రార

కొర్రా గొయ్యా ఇద్దరమె బోతే

నీ మునెమే నేనే గోచ్చ

నా మునెమే నీవు గోచ్చె

మునెము గోసి ముద్దు చెడతర

నా సామిరంగ గద్దూవాల ముద్దుల మరది

లింగా నిన్ను మరవ లేనుర.

పాటపూర్తయ్యేసరికి మునెం పూర్తయింది. తోకోడు ఆనందం పట్టలేక శేషమ్మత్తను కౌగిలించుకొని రెండు చేతులతో పైకి లేపాడు.

“తియ్‌ రా దొంగ నా బట్ట. దించురా గబ్బునా కొడక. ఓయమ్మొ కింద పడేచ్చాడేమో” అంటూ తోకోన్ని తిట్టిందామె మురిపెంగా.

అందరూ భోజనాల కోసం ఇంజను రూముకు చేరుకున్నారు. ఇంతలో మహిత, మల్లినాథ, చిన్నోడు అన్నయ్యకు భోజనం తీసుకుని వచ్చారు. మునగ చెట్టు కింద కూర్చున్నారు. ఒక గిన్నెలో అన్నం. ఒక గిన్నెలో నిమ్మకాయపప్పుఇంకో దాంట్లో వంకాయ నించుడు కాయ ఒక సీసాలో మజ్జిగ తెచ్చారు.

కందిపప్పు మెత్తగా ఉడికించి, మెనిపి దాంట్లో ఉప్పుకారం, కలిపి, కాసేపు మగ్గించి, వేడి తగ్గింతర్వాత నిమ్మకాయ రసం పప్పులో పిండి, తిరగమోతపెడుతుంది వర్ధనమ్మ. దాని రుచి అద్భుతంగా ఉంటుంది. ముళ్ల వంకాయల్లో నువ్వులపొడి కూరి నించుకాయ చేసింది.

చెల్లెలికీ తమ్ముళ్లకీ తలా రెండు ముద్దలు పెట్టాడు పతంజలి.

“ఇక చాలు అన్నయ్యకు సరిపోదు” అన్నది మహిత.

“అయితే నీవు తినొద్దు” అన్నాడు చిన్నోడు. అందరూ నవ్వారు. “అమ్మ ఎక్కువే పెట్టింది లేమ్మా” అన్నాడు అన్నయ్య. తోటలో చెట్టు క్రింద పచ్చికలో తినడం వాళ్లకిష్టం. మజ్జిగకన్నం మిగలలేదు. సీసా ఎత్తి తాగేశాడు.

కాసేపు తోటంతా తిప్పాడు వాళ్లను. మగపిల్లలిద్దరూ హైస్కూల్లో చదువుతున్నారు. మహితను గురించి ఆలోచించసాగాడు. చాలా తెలివైంది. టెంత్‌లో ఆపేసి ఇంట్లోనే ఉంది.

నాలుగు కల్లా చెట్లు పీకడం పూర్తయింది. రేపు కూడ అందర్నీ రమ్మన్నారు. ఇంకో నలుగురిని కూడా తీసుకు రమ్మన్నారు. రేపు చెట్ల నుండి కాయలు విడిపిస్తే శనగ కట్టె వామి వేసుకోవచ్చు. దాన్ని పశువులు చాలా ఇష్టంగా తింటాయి. ఎండిన వేరుశనగ చెట్లను కట్టె అంటారు.

రెండో రోజు రెడ్డిగారింట్లో అడిగి రెండు పెద్ద జల్లలు (గంపల కంటె మూడు రెట్లు పెద్దవి) తెమ్మన్నాడు తోకోడిని. కూలీలు వచ్చేసరికి తోకోడు సుంకన్న కలిసి జల్లలతో పలగాడికి దగ్గరగా వేరు శనగ చెట్లను నాలుగు అయిదు కుప్పలుగా వేశారు. ఒక్కో కుప్ప చిన్న గుట్ట అంత ఉంది.

కూలీలు రాగానే ప్రతి కుప్ప దగ్గర ఊదు కడ్డీ వెలిగించి అరటి పండులో గుచ్చారు. తొలి కుప్ప దగ్గర టెంకాయ కొట్టి కాయలు విడిపించడం ప్రారంభించారు. మొత్తం పదహారమంది. ఇద్దరిద్దరు చొప్పున కూర్చొని కాయలు వేర్ల నుండి పీకుతున్నారు.

పతంజలి కాయలు పట్టి చూశాడు. లొత్తలు లేకుండా లోపల గింజ నిండుగా ఉంది. పీకినవి పీకినట్లు తెచ్చి, ఈత చాపల మీద పోస్తున్నారు. భోజనాల వేళకు సగం కూడ కాలేదు. గబగబాతిని వచ్చి మళ్లీ పనికి ‘ఒంగారు’.

ఈత చాపల మీద వేరుశనగ కాయలు పెద్ద గుట్టగా రూపు దిద్దుకుంటున్నాయి. సాయంత్రం ఆరుగంటల వరకు సాగింది. తోకోడు కాయల గుట్టను బట్టి అంచనా వేశాడు.

“నూటిరవై మూటలకు తక్కువుండవు” అన్నాడు.

కూలీలందరికీ డబ్బులిచ్చి పంపసాగాడు పతంజలి. “సామీ! ఊరిబిండికి బుడ్డలు ఇయ్యవా” అని అడిగారు. తలా ఒక దోసిలి కాయలు వాళ్ల చద్ది మూటగుడ్డల్లో పోశాడు.

7 గంటలకు మార్కండేయశర్మ ఒక పెద్దగిన్నెతో చింతపండు పులిహోర తీసుకుని, టార్చిలైటు వేసుకుని వచ్చాడు. తోకోడు పతజంలి రాత్రి కాయల దగ్గరే పడుకుంటారు. తోకోనికి కూడ పులిహోర తెచ్చాడాయన. కాయలు చూసి సంతోషించాడు.

ఇంజను రూము దగ్గరికి పోయి ఇద్దరూ తిని వచ్చారు. కాసేపుండి శర్మ వెళ్లిపోయాడు. తోకోడు, పతంజలి, పాక తలుపు తెరిచి ఉంచి, కుప్ప కనపడేలాగ పడుకున్నారు. పతంజలి ఓబులప్పవాళ్ల నవారు మంచం మీద పడుకుంటే తోకోడు కింద పడుకున్నాడు. పతంజలితో తోకోడు తన మనసులో బాధ చెప్పుకున్నాడు.

“సామీ! మా పెండ్లయి ఎనిమిదేల్లవుతాంది. పిల్లలు పుట్టల్యా అని మా బుడ్డక్క ఏడచ్చుండాది. మా యమ్మ నాకు ఇంకో పెండ్లి జేచ్చా అని బెదిరిచ్చుంది. శానా బాదగుండాది” అన్నాడు.

“మొన్న నీవు పరీచ్చలు రాయనీకె బోతివిగదా! అప్పుడు పెద్ద సామినడిగినాము. బనగానిపల్లెకాడ కొత్తూరు అని ఉందంట. ఆ వూల్లో సుబ్బరాయుని దేవళం ఉందంట. ఆడ నాగుల పతిష్ట జేపిచ్చే పిల్లలు పుడతారని సామి చెప్పె.”

“నాన్న చెపితే తిరుగుండదు. శనక్కాయ మిల్లుకు తోలింతర్వాత రెండ్రోజులు కొత్తూరుకు బోయిరాండి. అక్కడ నిద్ర జేయాల” అన్నాడు పతంజలి.

“నాకు నూర్రూపాయలియ్యి. కూలీలో పట్టుకుందువుగాని’ అన్నాడు తోకోడు.

“సరే! దానికేంలే” అన్నాడు పతంజలి.

తెల్లవారు ఝామున బాగా చలిపెట్టింది. ఇద్దరూ లేచారు. ఎండుపుల్లలు ఏరుకొచ్చి, పైన కొంచెం వరిగడ్డి వేసి మంట చేశాడు తోకోడు. ఇద్దరూ చలి కాచుకున్నారు.

(సశేషం)

Exit mobile version