Site icon Sanchika

సాఫల్యం-25

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“ఓ[/dropcap]లం బోతాండావా?”

“అవునండీ”

“బాపనోల్లా? సూత్తే తెలుచ్చాండ్ల్యా. మాది పెద్దకందుకూరులే. రుద్రారంలో బిడ్డనిచ్చినా. అల్లునికి పానం బాగలేదంటే సూన్నీకే బోతుండా’ అన్నాడాయన.

బస్సు అంత లోడున్నా చాలా వేగంగా వెళుతూంది. ఒక పావుగంట తర్వాత నల్లమల ఫారెస్టు మొదలయింది. చాలా దట్టంగా ఉంది. ఎండగా ఉన్నా అడవి ప్రభావం వల్లనేమో చల్లగా ఉంది. రుద్రవరం మెట్ట దగ్గర పెద్దాయన దిగిపోయాడు. కండక్టరు క్రింద టికెట్లివ్వడం పూర్తి చేసి పైకొచ్చి అందరికీ టికెట్లు కొట్టాడు. ఏమాత్రం విసుగు లేదతని ముఖంలో. నవ్వుతూ డ్యూటీ చేస్తున్నాడు. కొందరిమీద జోకులు వేస్తున్నాడు. కొందరతని మీద కూడ జోకులు వేశారు.

‘యోగః కర్మసు కౌశలమ్‌’ అన్న గీతా వాక్యం ఈ కండక్టరుకు సరిగ్గా సరిపోతుందనుకున్నాడు పతంజలి. బస్సు ముందుకు సాగే కొద్దీ అడవి మరింత దట్టం కాసాగింది. సూర్య భగవానుడు అడవిలో ప్రవేశించేందుకు విఫల యత్నం చేస్తున్నా, అడవి ఆయనను రానివ్వడం లేదు.

దిగువ అహోబిలం చేరటానికి సరిగ్గా గంట పట్టింది. ఎనభై శాతం మంది దిగిపోయారు. ఐనా పైనున్న కొందరు దిగకుండా అట్లే కూర్చున్నారు.

“య్యోవ్‌, దిగి కిందికి రాండి” అని కండక్టరు కేక పెట్టినా వాళ్లు చలించలేదు.

“ఈ రోంతకు యాడ దిగుతాంలే నీవు పానీ” అన్నాడొకడు

పతంజలి మాత్రం క్రిందికి దిగి లోపల సీట్లో కూర్చున్నాడు. బస్సు కదలలేదు. పైన పూజారి రావాలంట. కాసేపటికి స్వామి వచ్చాడు. పట్టు పంచె ధరించి, నుదుట ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకొని, జట్టును వెనుకముడి వేసుకున్నాడు. జుట్టులో అరమూర పూలు తురుముకున్నాడు. ఆయన శరీరం పచ్చగా మెరిసిపోతుంది. ఈగ వాలినా జారిపోయేంత నునుపుగా ఉంది.

ఆయన బస్సెక్కగానే డ్రైవరు, కండక్టరు ఆయనకు నమస్కరించారు. ముగ్గురు కూర్చోవలసిన ఒక సీటు ఖాళీ చేసి ఆయనను కూర్చోబెట్టారు. ఆయనకు నమస్కరించాడు పతంజలి. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆయన నవ్వు పరమ మనోహరంగా ఉంది.

బస్సు కదిలింది. అక్కడ్నించి ఘాట్‌ రోడ్డు. మెలికలు తిరుగుతూ బస్సు కొండ ఎక్కసాగింది. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వము అటవీ శాఖ పులుల అభయారణ్యము’ అని బోర్డు కనపడింది.

పతంజలి ఒళ్లు ఎందుకో గగుర్పొడిరచింది. ‘లక్ష్మీనృసింహమమదేహి కరావలంబం’ అనుకున్నాడు. బస్సుపైకి చేరి చదునుగా ఉన్న ప్రదేశంలో రివర్స్ చేసుకొని ఆగింది.

దిగి చూశాడు పతంజలి. తల పూర్తిగా ఎత్తితే గాని కనబడనంత ఎత్తయిన కొండలు, వాటినిండా దట్టమయిన రకరకాల చెట్లు. ఎదురుగా ఒక జలపాతం శబ్దం చేస్తూ దూకుతోంది కిందికి. రకరకాల పక్షుల అరుపులు. ఒక కొత్త లోకంలోకి వచ్చినట్లయింది.

మొత్తం ఇరవైమంది ప్రయాణీకులు కూడ లేరు. పుష్కరిణిలో నిండా నీళ్లున్నాయి. పైన ఉన్న గుడిని చేరుకోవడానికి దాదాపు ఎనభై మెట్లున్నాయి. ఇంతలో యాత్రా స్పెషల్‌ టూరిస్టు బస్సు ఒకటి వచ్చి ఆగింది. మరాఠీ వాళ్లులా ఉన్నారు. బిలబిలమంటూ బస్సు దిగి మెట్లెక్కసాగారు.

పతంజలి కూడా మెట్లెక్కి పైకి చేరుకున్నాడు. కొండల్లోంచి అక్కడక్కడా నీటిధారలు పడుతున్నాయి. గుడి దగ్గరే అహోబిలమఠం ఉద్యోగి దర్శనం, అర్చన టికెట్లమ్ముతున్నాడు. ఆయనను అడిగాడు.

“స్నానం చేయడానికి సౌకర్యం ఉందాండి?” అని.

“అయ్యో నాయనా వెనక వైపుగా వెళితే పెద్ద జలపాతమే ఉంది. పోయి స్నానం చేసిరాపో. ఈ లోపల ఈ హిందీవాళ్లు అంతా దర్శనం చేసుకుని వెళ్లిపోతారు. నీ బ్యాగులు లోపల కటాంజనం (గ్రిల్స్‌)లో గరుత్మంతుని విగ్రహం దగ్గర పెట్టుకో. నేను చూస్తుంటా” అన్నాడాయన.

బ్యాగులొంచి టవలు, పంచె తీసుకొని, బ్యాగులు ఆయన చెప్పిన చోట పెట్టి, గుడి వెనక్కు వెళ్లాడు. అక్కడి దృశ్యం అతన్ని విభ్రమానికి గురి చేసింది. వెనక కొండల్లోంచి జలాలు పారుతూ వచ్చి ఒకచోట కలిసి దాదాపు ముప్పై అడుగులపై నుండి జలపాతంలా దూకుతున్నాయి. నీరు క్రిందపడే చోట పెద్ద మడుగులా ఏర్పడి ఉంది. నీరు పడుతున్న శబ్దం ఒక హోరులా వినిపిస్తున్నది. కొందరక్కడ మడుగులో దిగి జలపాతం నీరు క్రింద నిలబడి స్నానం చేస్తున్నారు. మరి కొందరు జలపాతం వెనుక వైపుకు వెళ్లి ప్రవాహంలో స్నానం చేస్తున్నారు.

కోతులు చాలా ఉన్నాయి. తన బ్యాగులు లోపల ఎందుకు పెట్టించాడో అర్థమయింది. ప్యాంటు షర్టు విప్పి, టవలు, పంచె అన్నీ ఒకచోట పెట్టి మడుగులో దిగాడు పతంజలి. జలపాతం క్రింద నిలబడ్డాడు. రెండు నిమిషాలకే తల దిమ్మెక్కింది. నీటి ధాటికి ప్రక్కకు ఒరిగిపోసాగాడు. దాదాపు ఇరవై నిమిషాలు ఆ స్వచ్ఛమయిన నీటిలో స్నానం చేశాడు. దోసిలితో తీసుకుని తాగితే, ఎంతో తియ్యగా ఉన్నాయి. ‘కొండల్లో ఎన్ని ఓషధులను కలుపుకున్నాయో’ అనుకున్నాడు. ఇంతలో ఆంజనేయులవారొచ్చి పతంజలి బట్టల్లో ఏమన్నా తినడానికి దొరుకుతుందేమో అని వెతకసాగారు. జేబులో ఉన్న నోట్లను తీసి పక్కన బెట్టారు. టవలు, పంచె విదిలించి చూశారు. పతంజలిని చూసి కోపంగా పళ్లు చూపించి వెళ్లిపోయారు.

పైకి ఎక్కి వచ్చి టవలుతో శుభ్రంగా తల ఒళ్లు తుడుచుకున్నాడు. పంచె కట్టుకుని, టవలు భుజాన వేసుకున్నాడు. ప్యాంటు షర్టు మడత పెట్టి పట్టుకొని దేవాలయంలోకి వచ్చాడు. టూరిస్టులందరూ వెళ్లిపోయినట్లున్నారు. బట్టలు బ్యాగులో పెట్టి పూజా ద్రవ్యాల బ్యాగు మాత్రం తీసుకుని, అర్చన టికెట్టు తీసుకున్నాడు.

క్యూలో ఎవరూలేరు. దేవాలయం లోపల స్తంభాలు, పైకప్పు పురాతన చెక్కడాలతో అలరారుతున్నది. కొండ అంచున ఏర్పడి ఉన్న గుహలోకి ప్రవేశించాడు. స్వయంభూమూర్తి. తన యిష్ట దైవం, లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడక్కడ కొంచెం పొడుగ్గా ఉన్నవాళ్లు తలవంచి నిలబడేంత క్రిందికి ఉంది గుహ పై కప్పు, స్వామి గుహకు ఒక మూల ఒక శిలా వితర్దికపై ఉన్నాడు. చీకటిగా ఉంది. కేవలం దీపారాధన వెలుగులో స్వామి జాజ్వల్యమానంగా వెలుగుతున్నాడు. రెండడుగుల నల్లని విగ్రహం. రాతిలోనే సింహవదనం ఏర్పడి ఉంది. వెండి మీసాలు, కళ్లు అమర్చినారు.

నిలువెల్లా పులకరించాడు పతంజలి. ‘ఇన్నాళ్లకు నీ దర్శన భాగ్యమిచ్చావా తండ్రీ!’ అనుకున్నాడు. గొంతు పూడకుపోయింది. కళ్లనిండా నీళ్లు కమ్ముకున్నాయి. భక్త్యుద్వేగంతో దుఃఖం పొంగి వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాడు.

పూజారి, పతంజలి లోనయిన ఆ అలౌకికావస్థను అర్థం చేసుకుని, అతన్ని పలుకరించకుండా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకుని సంచిలోంచి పూలమాల తమలపాకులు, ఊదు కడ్డీలు, పళ్లు, కొబ్బరికాయ, ఎదురుగ్గా ఉన్న ఇత్తడి ప్లేటులో ఉంచాడు, అర్చన టికెట్టుతో సహ.

గోత్ర నామాదులడిగాడాయన. కౌండిన్యస గోత్రం. మార్కండేయ శర్మ, వర్ధనమ్మ, అని తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. తర్వాత అక్కా బావల పేర్లు, శశి పేరు, తాను, చెల్లెలు, తమ్ముళ్ల పేర్లు చెప్పాడు. సంకల్పం చెప్పి అష్టోత్తరంతో పూజ ప్రారంభవించాడాయన. పతంజలికి కూడ ఆ నామాలన్నీ కంఠతా వచ్చు ఆయనతో పాటు నామాలు చెప్పాడు. ‘శ్రీమత్పయోనిధి నికేతన’ శ్లోకం రాగయుక్తంగా చదివాడు. ‘ఉగ్రంవీరం’ అనే నారసింహ మూలమంత్రం జపించాడు. ‘ప్రథమంతు మహా బాహో’ అన్న స్వామి వారి ద్వాదశ నామస్తోత్రం చెప్పుకున్నాడు.

కొబ్బరి కాయ కొట్టి, చిప్పలు, అరటిపళ్లు నైవేద్యం పెట్టాడు ఆయన స్వామి వారికి. పతంజలి తెచ్చిన కర్పూరంతోనే హారతి వెలిగించి ఇచ్చాడు. హారతి వెలుగులో స్వామి ధగధగ మెరిశాడు.

“మీరు అనుమతిస్తే మంత్ర పుష్పం చదువుతా” నన్నాడు పతంజలి.

ఆయన సరే ప్రారంభించమన్నట్లు తల ఊపి, పతంజలితో గొంతు కలిపాడు.

“రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే

నమో వయంవైశ్రణాయ కుర్మహే”

అంటూ సుస్వరంగా సాగిన మంత్రపుష్పం గుహాంతర్భాగంలో ప్రతిధ్వనించింది. తీర్థ ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రశాంతంగా గుహలోనే ఎవరయినా భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా, ఒక మూల కూర్చున్నాడు. “పొద్దున ఫస్టు బస్సులో వచ్చినావు కద నాయనా?” అన్నాడు ఆయన. “ఇంత చిన్న వయసులో స్వామి వారి పట్ల తాదాత్మ్యం చెందుతున్నావు. పూర్వ జన్మ పుణ్యం నాయనా. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. అత్యంత మహిమాన్వితుడైన ఈ అహోబిల నారసింహుడు సర్వదా నీకు తోడుగా ఉంటాడు. మానవ ప్రయత్నాన్ని విస్మరించక స్వామిపై ఇదే భక్తిని కొనసాగించు” అని దీవించాడాయన. భగవంతుని సన్నిధిలో పూజారికి పాదాభివందనం చేయకూడదనే నియమాన్ని తెలిసినవాడు కాబట్టి కూర్చున్న చోటే పూజారికి తలవంచి అభివాదం చేశాడు.

“ఇక్కడ ఏకాగ్రత కుదరదు. భక్తులు వచ్చిపోతుంటారు. బయట మంటపంలో కూర్చో నాయనా” అన్నాడాయన.

మళ్లీ స్వామి వారున్న అరుగుమీద తలవాల్చి నమస్కరించి, మళ్లీ కళ్లారా ఆయన రూపాన్ని దర్శించి బయటకు వచ్చి మంటపంలో స్తంభానికానుకొని కూర్చున్నాడు. కళ్లు మూసుకొని మూలమంత్రం నూట ఎనిమిదిసార్లు, ద్వాదశ నామస్తోత్రం పదకొండుసార్లు, జపం చేసుకున్నాడు. కరావలంబస్తోత్రం, నృసింహకవచం చదువుకున్నాడు. కళ్లలోంచి నీరు ధారగా కారసాగింది. స్వామి తనను ఒడిలోకి తీసుకుని ఓదారుస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూన్నది. అలా దాదాపు అరగంట సేపు భక్తి పారవశ్యంతో మునిగిపోయాడు.

చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన చేయించాడు. కొంచెం కుంకుమ పొట్లం కట్టి యిచ్చాడు పూజారి. మళ్లీ బట్టలు వేసుకుని, పంచె టవలు బ్యాగులో పెట్టుకున్నాడు. ప్రసాదంగా ఇచ్చిన అరటిపండు తిన్నాడు.

మఠం గుమాస్తానడిగాడు “క్రిందికి వెళ్లడానికి ఇప్పుడు బస్సుందాండి” అని. పన్నెండున్నరకు వస్తుందని చెప్పాడాయన. రాత్రి నిద్ర చేయాలనుకుంటున్నాననీ, స్వామికి తలనీలాలు ఇవ్వాలనీ చెపితే ఆయన అన్నాడు.

“పైన రాత్రి ఎవరూ ఉండరు. మేమే ఆరుగంటలకల్లా అందరం క్రిందికి వచ్చేస్తాము. మీరు ఇప్పుడు బస్సులో క్రిందికి వెళ్లండి. దిగువన ఆరగింపు సేవ అయింతర్వాత ప్రసాదం పెడతారు. టి.టి.డి. వాళ్ల సత్రముంది. దానిలో గది తీసుకొండి. ఉదయం లేచి తలనీలాలిచ్చి, రూంలోనే స్నానం చేసి, స్వామివారిని దర్శించుకొని వెళ్లిపోవచ్చు”

ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొని మెట్లు దిగి బస్సు ఆగే చోటుకు వచ్చాడు. పావు తక్కువ ఒంటిగంటకు బస్సు వచ్చింది. దిగువ అహోబిలంలో దిగిపోయాడు. అప్పటికి ఒకటిన్నర దాటింది. బస్సులోనే ఒకాయన చెప్పాడు గుడి తలుపులు మూసేస్తారని మళ్లీ ఐదుగంటలకే తెరిచేది అని.

క్రింద ఒకటో రెండో పాక హోటళ్లున్నాయి. వెళ్లి అడిగితే భోజనం ఉండదన్నారు. పొద్దున చేసిన ఉగ్గాని, బజ్జీలున్నాయి. ఇంకో హోటల్లో దోసెలున్నాయని వేడిగా పోసిస్తామని చెప్పారు.

రెండు దోసెలు తిన్నాడు. గొడ్డుకారం పులిమి కాల్చారు. దోరగా, చాలా రుచిగా ఉన్నాయి. చట్నీ కూడా బాగుంది.

‘అమ్మయ్య. ఆత్మారాముడు శాంతిచినట్లే’ అనుకొని డబ్బు చెల్లించి దగ్గరలోనే ఉన్న టి.టి.డి సత్రానికి వెళ్లి రూం తీసుకున్నాడు. అద్దె రోజుకు మూడు రూపాయలేగాని మెయింటెనెన్స్‌ అసలు బాగలేదు. రూం ఊడ్చలేదు. దుప్పటి మార్చలేదు. బాత్‌రూంలో మాత్రం నీళ్లొస్తున్నాయి. పడుకొని నిద్రపోయి సాయంత్రం ఐదుకు లేచాడు.

ముఖం కడుక్కుని, బస్టాండుకు వెళ్లి వేడివేడిగా రెండు మిరపకాయ బజ్జీలు తిని, టీ తాగాడు. కనుచూపు మేరలోనే దేవాలయ శిఖరం సమున్నతంగా కనబడుతూంది. నడుచుకుంటూ వెళ్లి ప్రాంగణంలో ప్రవేశించాడు. విజయనగర రాజుల నిర్మాణశైలి అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద స్తంభాలు రకరకాల శిల్పాలతో వైభవంగా ఉంది. విశాలమైన ప్రాంగణం. చుట్టూ ఎత్తయిన ప్రాకారం. దాదాపు అర చ.కి. మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. భక్తులెవరూ లేరు. దర్శనం టికెట్‌ తీసుకుని గర్భాలయంలోకి వెళ్లాడు.

చాలా పెద్ద నల్లరాతి విగ్రహం. లక్ష్మీ సమేతుడై స్వామి ప్రశాంతవదనుడుగా అవతరించి ఉన్నాడు. చాలా సేపు స్వామినే చూస్తూ మైమరచిపోయాడు. తీర్థం తీసుకుని, టిక్కెట్లిచ్చే ఆయన దగ్గరకొచ్చి అడిగాడు.

“రేపు ఉదయం స్వామికి తలనీలాలివ్వాలనుకుంటున్నాను ఎన్నిగంటలకు సాధ్యమవుతుంది?”

“ఉదయం ఏడు గంటలకు ఇక్కడ టికెట్‌ తీసుకొని గుడికి కుడివైపుకు వెళితే కల్యాణకట్ట ఉంటుంది. అక్కడ చేయించుకోవచ్చు” అన్నాడాయన.

దాదాపు గంటకు పైగా ఆ స్తంభాల మధ్య తిరిగాడు. అమ్మ వారిని దర్శించుకున్నాడు. టైము చూసుకుంటే ఎనిమిదయింది. మళ్లీ బస్టాండుకు వచ్చి మధ్యాహ్నం తిన్న హోటల్లోనే ఇడ్లీలు తిన్నాడు. రూముకు వెళ్లిపోదాం అనుకుంటుండగా ఎక్కడో భజన జరుగుతున్నట్లుగా కీర్తనలు, డోలక్‌, హార్మోనియం శబ్దాలు వినిపించాయి.

అటువైపు వెళ్లి చూస్తే ఒక విశాలమయిన మంటపంలో భజన చేస్తున్నారు. దాదాపు ఇరవై మంది కూర్చుని ఉన్నారు. ఒకాయన పాడుతూ ఉంటే ఒకాయన హార్మోనియం వాయిస్తున్నాడు. ఇంకొక యువకుడు డోలక్‌తో సహకరిస్తున్నాడు.

“జయహే నవ నీల మేఘశ్యామా, వనమాలికాభిరామా” అన్న పాట పాడుతూన్నాడు. చరణాలను రకరకాలుగా, మిగతా అందరూ వంత పాడటానికి అనువుగా విరిచి పాడుతున్నాడు. వాళ్లంతా హరినామ సంకీర్తనా వివశులై ఒక ట్రాన్స్‌లో ఉన్నట్టున్నారు.

పతంజలి వెళ్లి ఒక స్తంభాన్నానుకొని కూర్చున్నాడు. తానూ వారితో గొంతు కలపసాగాడు. రెండే నిమిషాల్లో గుర్తించారు. ఆ గొంతులో మార్దవం, మాధుర్యం, గాంభీర్యం ఉన్నాయి. పాట ముగిసింది.

“శ్రీమద్రమారమణ గోవిందా – గోవింద!

ఓబిల లక్ష్మీనరసింహ గోవిందా – గోవిద!

ప్రహ్లాద వరద గోవిందా – గోవింద!

మాలోల నరసింహ గోవిందా – గోవింద!

వారితో పాటు స్వామికి జై కొడుతూంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి పతంజలికి. శరీరంలోని అణువణువూ నరసింహుడే ఉండి, నిండిపోయాడు. పాట పాడిన ఆయన పతంజలిని ఆహ్వానించాడు. “రాండి ఈడ కూసోండి” అంటూ.

పతంజలి వెళ్లి కూర్చున్నాడు. ఇంకొకాయనవచ్చి పాటందుకున్నాడు.

“కృష్టాయదు భూషణా, గోవిందా ముకుందా హే పావనా” అంటూ.

వారి గొంతుల్లో ప్రొఫెషనలిజం లేదు. కాని భక్తి ఉంది. భగవంతుని దర్శింప చేసే శక్తి ఉంది. పాటను స్లోగా పాడుతున్నారు హార్మోనియం డోలక్‌లకనుగుణంగా.

మళ్లీ గోవింద, నరసింహ నామస్మరణ చేశారు. ఒకాయన అడిగాడు.

“యాడ నుండి వచ్చినారు?”

చెప్పాడు పతంజలి.

“రెండు పాటలు పాడండి”

తనకు పాడటం వచ్చని వాళ్లకు తెలిసిపోయిందన్నమాట. నరసింహ క్షేత్రంలో స్వామి భజనలో పాల్గొనే అవకాశం వచ్చింది. చాలు అనుకున్నాడు.

“భజన సంప్రదాయానికి తగినట్లుగా నేను పాడలేనండీ” అన్నాడు.

“ఏం పరవాల్యా. ఒక పాట సూచ్చాం. అందరికీ కుదిరితే మరీ మంచిది. ల్యాకపోయినా మీరొక్కరే పాడండి. సూచ్చుంటే మంచి కలాకారుని మాదిరనిపిచ్చాంది” అన్నాడింకొకాయన

గొంతు సవరించుకొని, హార్మోనిస్టుతో చెప్పాడు.

“మాధవా, మౌనమా సనాతనా,

కనరార గరుడ గమనా” – సత్యనారాయణ మహాత్యంలోనిది. వాయిద్య కారులిరువురూ ‘సిద్ధమే’ అన్నట్లు తల ఊపారు. రెండు చేతులెత్తి ఆలయ శిఖరానికి నమస్కరించాడు.

“ముందుగా ఒక శ్లోకం” అంటూ

‘కల్యాణి’లో ‘శ్రీమత్పయోనిధి నికేతన’… అంటూ ఎత్తుకున్నాడు.

మరుక్షణంలో హార్మోనిస్టు రాగ ప్రస్తారాన్ని గ్రహించి, అద్భుతంగా అనుసరించాడు. డోలక్‌ అతనికి అవకాశం లేదు. చివరికొచ్చేసరికి ఆరున్నర శృతికి చేరుకున్నాడు. శ్లోకం ముగిసేటప్పటికి కరతాళ ధ్వనులు మోగాయి.

“సార్‌. ఏం గాత్రం ఏం గాత్రం, గంటసాల ఓలానికి ఇయ్యాల దిగినాడు” అన్నాడొకాయన.

“మాధవా… అన్న పాటను ముక్కలుగా విరిచి అందరూ పలికేలా ప్రయత్నించాడు కాని అది వాళ్లు ప్రాక్టీసు చేసిన పాట కాదు. తడబడ్డారు.

“మీరొక్కరే ఇంకోటి పాడాల”

‘భక్తతుకారాం’ నుండి ‘ఘనాఘనసుందరా’ పాడాడు. వాళ్లు వదలలేదు. బుద్ధిమంతుడు సినిమాలోది ‘ననుపాలింపగనడచీ వచ్చితివా’,      ఘంటసాలవారిదీ జయదేవుని అష్టపది ‘రమతే, యమునా పులినవనే’ ఇలా పాడించుకుంటూనే ఉన్నారు. పాట పాటకూ గొంతు పదును తేలసాగింది. అలా దాదాపు పది పన్నెండు పాటలు పాడించుకున్నారు.

“పజ్యాలు ఏమయినా పాడండి” అనడిగారు.

లవకుశలోని ‘రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీర దాల్చె’ అన్న పద్యం పాడాడు. ‘ఎటువంటి తల్లికి ఎటువంటి కష్టం వచ్చింది!’ అన్న భావాన్ని విరోధాభాసాలంకారంలో కంకంటి పాపరాజు అద్భుతంగా వర్ణించాడు. ఘంటసాల వారు దానికి ప్రాణం పోశారు. చిత్తూరు నాగయ్యగారు వాల్మీకిగా ఆ పద్యానికి అద్భుతంగా అభినయించారు. మరి పద్యం కంకంటి వారిదో లేదా సముద్రాల వారే రాశారో పతంజలికి తెలియదు. ఆ పద్యానికి ఉన్న ప్రభావం ఎంతటిదంటే, సీతమ్మవారి దురవస్థ తలచుకొని భజన బృందమంతా చింతాక్రాంతులైనారు.

తర్వాత శ్రీకృష్ణ తులాభారంలో భగవత్‌ తత్త్వాన్ని విప్పి చెప్పే పద్యాన్ని పాడివినిపించాడు.

“సర్వేశ్వరుండగు శౌరి కింకరుజేయ

ధనమున్నదే భక్తి ధనముగాక”

ఒకాయన అడిగాడు “సన్ముకి పజ్యమేదయినా అనండి”

“అలుగుటయే ఎరుంగనీ….” అంటూ షణ్ముఖివారి లాగే హైపిచ్‌లో రాగాలతో సరాగమాడుతూ ఆ పద్యాన్ని పాడుతూ ఉంటే వాళ్లందరూ ఉత్సాహంతో ఊగిపోయారు. పద్యం తరువాత రాగం మొత్తం ఒక్క నోట్‌ మిస్సవకుండా పాడి వినిపించాడు.

చప్పట్లతో మంటపం మారుమ్రోగింది. కొందరు లేచివచ్చి పతంజలి చేతులు కళ్ల కద్దుకున్నారు. ఘంటసాలవారి కంటే ఈ ప్రాంతంలో షణ్ముఖ ఆంజనేయరాజుగారికున్న ప్రాబల్యం అర్థమయింది. “ఇంకొక్కటి. హరిశ్చంద్రలోని కాటిసీను నుంచి” అన్నారెవరో.

“వాకొనరాని గొప్ప ధనవంతుని నిక్కపుపాలరాతిగో

రీకడ పారవేయబడి……..” అన్న పద్యాన్ని డి.వి. సుబ్బారావుగారిని అనుకరిస్తూ పాడాడు. ప్రశంసలు వెల్లువెత్తాయి,

రాత్రి పదిదాటింది. పెద్దాయన ముక్తాయింపునిచ్చాడు భజనకు “పవమాన సుతుడు బట్టు పాదారవిందములకు” తో ముగిసింది. పళ్లెంలో కర్పూరం వెలిగించి గోపురం వైపు చూపిస్తూ హారతిచ్చారు.

ప్రతి ఒక్కరూ పతంజలి దగ్గరకొచ్చి సెలవు తీసుకొని వెళుతూన్నారు. ఒకతను అడిగాడు.

“సార్‌, రేపు రాత్రి కిష్టిపాడులో బజన ఉండాది వచ్చారా?”

“గొంతుకనేల్‌మంటాది బోపనోడు”

“సన్ముకి మాదిరే గుక్కపట్టినాడు”

“ఆ ఓలమయ్యే మనకాడికి పంపించినాడు.”

“సిన్నవగిసే. ఇరవై కూడ ఉంటాయో ఉండవో మల్ల”

“మనిషిలో ఏదో కలవుండ్ల్యా”

అంతా కలలా ఉంది పతంజలికి. కనీసం గొంతు కీచుపోలేదు. శృతి తప్పలేదు. శిఖరంవైపు తిరిగి రెండు చేతులెత్తి నమస్కరించాడు. ఆయనే పాడించుకున్నాడని అనుకున్నాడు.

‘నాహంకర్తాహరిః కర్తా’ అన్న సూక్తిని మననం చేసుకున్నాడు. ‘మహాగాయకుడైన మార్కండేయ శర్మ రక్తం నాలో ప్రవహిస్తూండటం కూడా ఈ రోజు నా ప్రదర్శనకు ఒక కారణం’ అనుకున్నాడు. తండ్రి నిజంగా సంగీతంలో మేరువు. ఇలా అనుకరణ కాదు. పురాణం, ప్రవచనాల్లో ఆయన పాడే పద్యాలు, శ్లోకాలు ఆయనే స్వరం కూర్చి పాడతాడు.

రూము కొచ్చి పడుకున్నాడు. నిద్రలో కూడ అదే ఫీలింగ్‌. ఎగువ స్వామి దగ్గర పొందినది. స్వామి తనను దగ్గరకు తీసుకొని లాలిస్తున్నట్లు ఆ సింహవదనుని కళ్లల్లో అంతులేని కరుణ.

పొద్దున్నే లేచి పంచె టవలుతో గుడికి వెళ్లాడు. తలనీలాలకు టికెట్టు తీసుకొని, కల్యాణకట్టలోనికి వెళ్లాడు. ఒకే క్షురకుడు పని చేస్తున్నాడు. పతంజలికి ముందు ఇద్దరున్నారు. తనవంతు వచ్చాక వెళ్లి అతని ముందున్న చిన్న రాయి మీద కూర్చున్నాడు. పంచె అక్కడి మేకుకు తగిలించి, కేవలం టవలుతో కూర్చున్నాడు. తలను నీటితో తడుపుతూ అడిగాడు “యావూరు సామీ?”

చెప్పాడు.

“యాడ దిగితివి?”

“టి.టి.డి. సత్రంలో”

ఐదు నిమిషాల్లో గుండు తయారయింది. చిన్న అద్దంలో చూపించాడు. తర్వాత మీసాలు, గడ్డం శుభ్రంగా షేవ్‌ చేశాడు. లేచి, ఒక రూపాయి ఇచ్చాడతనికి.

“ఈడనే బాయి కాడ స్నానం చేచ్చారా? ఉడుకునీళ్లు కావాలంటే పావలా ఇస్తే బక్కెటుతో ఇచ్చారు.” అంటూ బావి వెనుకవైపు చూపించాడు. అక్కడ ఒకామె మూడు రాళ్లమీద పెద్ద డేగిశాపెట్టి కింద జొన్న చొప్ప మంట పెట్టి నీళ్లు కాస్తూంది. రూములో కంటే ఇదే మేలనిపించింది. వెళ్లి ఆమెకు, నీళ్లు కావాలని చెప్పి, పావలా ఇచ్చాడు. ఐదు నిమిషాల్లో బకెట్‌తో వేడినీళ్లు సగానికి తెచ్చిచ్చింది.

బావికి గిలక, ఒక చిన్న ఇత్తడి బిందె, తాడు ఉన్నాయి. లోపలికి చూస్తే నీరు పాతాళంలో ఉంది. రెండు బిందెలు తోడి బక్కెట్లో పోసుకొని సమపాళంగా చేసుకున్నాడు. డ్రాయరు తోనే స్నానం చేశాడు.

టవలుతో శుభ్రంగా తుడుచుకొని పంచె కట్టుకుని రూంకు వెళ్లి పూజా ద్రవ్యాలున్న సంచి తీసుకున్నాడు. పంచె టవలు పిండి రూం బయట ఎండలో వేశాడు.

వేరే ప్యాంటు షర్టు వేసుకొని పూజా ద్రవ్యాలు తీసుకుని గుడికి వెళ్లాడు. చాలామంది భక్తులున్నారు క్యూలో. అర్చన టికెట్‌ తీసుకుని క్యూలో నిలబడ్డాడు.

దర్శనం అవడానికి, అర్చనకు అరగంట పట్టింది. స్వామిని కళ్లారా చూసుకున్నాడు. మళ్లీ దుఃఖం వచ్చింది. బయటకు వచ్చి ఒక స్తంభం వద్ద కూర్చుని నరసింహమూలమంత్రం జపం, స్తోత్ర పఠనం చేసుకున్నాడు. అమ్మవారి దర్శనం అయింది. అక్కడ ఒకాయన పెద్ద ఇత్తడి పాత్రలో చక్కెర పొంగలి ప్రసాదం అందరికీ యిస్తున్నాడు. పతంజలికి ఒక దొప్పలో పెట్టి ఇచ్చాడు. చాలా వేడిగా ఉంది. నెయ్యి ఓడుతుంది. ఊదుకుంటూ తిన్నాడు.

తాను నిన్న వచ్చిన బస్సు పైకి వెళ్లి వచ్చేసరికి పది దాటుతుందని ఊహించాడు. టైము తొమ్మిదిన్నర దాటుతూంది. గబగబ నడుస్తూ వెళ్లి హోటల్లో కూర్చున్నాడు. ఉదయం పూట కాబట్టి సందడిగా ఉంది. టిఫిన్లన్నీ ఉన్నాయి. నిన్న దోసె, ఇడ్లీ అయింది కాబట్టి ప్లేటు పూరీ ఆర్డరిచ్చాడు. వేడి వేడి పూరీలు మూడు, బొంబాయి చట్నీ, బుడ్డల చట్నీ తెచ్చిచ్చింది ఒకామె.

ఎందుకోచాలా ఆకలిగా అనిపించింది. పూరీలు తిన్న తర్వాత శాంతించింది. కాఫీ తాగి, రూముకు వెళ్లి సంచి తీసుకొని బస్టాండుకు వచ్చాడు. సరిగ్గా పది ఇరవైకి పై నుండి బస్సు వచ్చింది. అంత రష్‌గా లేదు. సీటు దొరికింది.

బస్సు కదిలింది. స్వామివారి ఆలయ శిఖరానికి నమస్కరించాడు. ఏవేవో కోరుకుందామనుకున్నాడు. అసలు అవేవీ గుర్తుకురాలేదు. సరిగ్గా గంటలో ఆళ్లగడ్డ బస్టాండులో దిగాడు.

***

ఆళ్లగడ్డలో దిగి ‘సంజామల’కు ఎలా వెళ్లాలని అడిగాడు ఎంక్వయిరీలో. ఎక్కడో తప్ప ప్రయివేటు బస్సులు కనబడటం లేదు. ఇక్కడ నుండి కోవెల కుంట్లకు వెళ్లమనీ అక్కడనుంచి ఉంటాయనీ చెప్పారు. కోవెల కుంట్ల బస్సు రడీగా ఉండటం చూసి ఎక్కి కూర్చున్నాడు. అన్నీ పల్లెలే. బీదరికం కనపడుతూంది బాగా. అన్నీ చిన్న చిన్న మట్టి మిద్దెలు గుడిసెలు. నల్లరేగడి నేలలు. కెసి కెనాల్‌ ఆయకట్టు ఎంత సస్యశ్యామలంగా ఉందో, ఈ ప్రాంతం అంత బీదగా ఉంది. ఈ మండలాన్ని ‘రేనాడు’ అంటారని విన్నాడు.

(సశేషం)

Exit mobile version