Site icon Sanchika

సాఫల్యం-27

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[అహోబిలం నరసింహ స్వామి వారిని సందర్శించుకుని అక్కడి నుండి కోవెల కుంట్ల మీదుగా సంజామల చేరుకుని ఆజం సార్ ఇంటికి వెడతాడు పతంజలి. సార్ బడిలో ఉంటారావేళకి. ఆయన భార్యనీ, పిల్లల్నీ ఆప్యాయంగా పలకరిస్తాడు పతంజలి. ఇంటికి వచ్చిన ఆజం సార్ పతంజలి చూసి సంతోషపడతారు. తమ ఊరి వివరాలను తెలియజేస్తారు. ఇంటికి అవసరమైన నీళ్ళు పంపు నుంచి తెచ్చిపెడతాడు పతంజలి. మాటల సందర్భంగా తన గతం వివరించి తాను ఎంచుకున్న జీవన విధానం పట్ల ఎలాంటి ఫిర్యాదులు లేవని చెబుతారు సార్. తాను రచించిన ‘సయ్యదయ్య శతకం’ పుస్తకం రెండు కాపీలు పతంజలికి ఇస్తారు. దాన్ని చదివిన పతంజలి మెచ్చుకోలుగా, గౌరవభావంతో గురువుగారి చేతులను కళ్లకద్దుకుంటాడు. భోజనాలు వడ్డించడంతో, తినడానికి ఉపక్రమిస్తారు. – ఇక చదవండి.]

[dropcap]గోం[/dropcap]గూర పచ్చడి అద్భుతంగా ఉంది. దాంట్లో సమృద్ధిగా ఉల్లిపాయలు తరిగి వేసింది. వంకాయ పప్పు చాలా కొత్త రుచితో ఉంది. మటిక్కాయ కూరలో కూడ ఉల్లిపాయలు దండిగా సందడి చేస్తున్నాయి.

“ఈ వంకాయలు కూరకు బాగుండవు కాని, కొంచెం ముదిరి, పండినాయి కాబట్టి పప్పుకు ప్రశస్తంగా ఉంటాయి. రుచి కూడ భిన్నంగా ఉంటుంది. గమనించావా?” అనడిగాడు సారు.

“అవునుసార్‌! నిజమే” అన్నాడు.

అన్నింట్లో తిరగమోతలో వెల్లుల్లి ఘాటు తగులుతూ ఉంది. వెల్దుర్తిలో తమయింట్లో వాడరు గాని పతంజలికి ఇవన్నీ యిష్టమే.

చారు వడ్డించిందామె. కొత్తిమీర వాసనతో ఘుమఘుమలాడుతూంది.

“చారు ఎందుకంత ప్లేవరుగా ఉందో చెప్పు చూద్దాం” అన్నాడు సరు

“కొత్తిమీర వల్ల కదా”

“కాదు కాదు కొత్తిమీరతో పాటు పచ్చి ధనియాలు దంచి వేయటం వల్ల”

నిజంగా చారుకు అరుదైన రుచి వచ్చింది. బాషాకు అన్నీ కలిపియిస్తే తింటున్నాడు. తండ్రి కలిపిస్తే ఇష్టమట.

మజ్జిగ గ్లాసుల్లో పోసుకొని తాగారు. భోజనం ముగించి బయట అరుగుమీద కాసేపు కూర్చున్నారు.

“నేను రేపుదయం బయలుదేరతాను సార్‌” అన్నాడు పతంజలి.

“తొందరేం, రెండ్రోజులుండి వెళ్లు” అన్నాడాయన అభిమానంగా. “లేదు సార్‌ క్షమించండి. కర్నూల్లో మా మిత్రుడొకాయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనను చూసి వెళ్లాలి.”

“సరేలే అయితే, మామూలుగా అయితే నీవు కర్నూలుకు పోనవసరం లేదు. కొలిమిగుండ్ల తాడిపత్రి మీదుగా గుత్తికి బస్సుంది. గుత్తి నుండి వెల్దుర్తికి పోవచ్చు”

“కర్నూలుకు డైరెక్ట్‌గా బస్సులుండవనుకుంటాను!”

“అవును కోవెల కుంట్లకు వెళితే ప్రొద్దుటూరు నుండి కర్నూలు పోయే బస్సులు దొరుకుతాయి. కోవెల కుంట్లకు ఉదయం 8 గంటలకు బస్సుందిలే”

“సార్‌ అయితే నేను తెల్లవారు ఝామునే లేచి, ఏటికి వెళ్లి స్నానం చేసి వస్తాను. మన వెల్దుర్తిలో వంకలో వర్షాకాలంలోనే నీళ్లుంటాయి. ఈ ఊర్లో ఏరు చాలా బాగుంది” అన్నాడు.

“అయితే ఇద్దరం పోదాంలే పతంజలీ! వచ్చేటప్పుడు నీకిక్కడ ఒక పురాతన శివాలయం చూపిస్తాను. ఎవరు ఎప్పుడు నిర్మించారో గాని బాగుంటాది. దేవున్ని రాజేశ్వరస్వామి అంటారు”

హాల్లో బొంత పరుచుకుని పడుకున్నాడు. సరిగ్గా ఐదుగంటలకు లేచాడు. పిల్లలు తప్ప, సారు, గురుపత్ని అప్పటికే లేచి ఉన్నారు. కాలకృత్యాలు తీర్చుకుని, ముఖం కడుక్కున్నాడు. ఆమె చక్కని ‘టీ’ ఇచ్చింది.

బ్యాగులోంచి పంచె టవలు తీసుకున్నాడు. సారు కూడ స్నానం చేసి మార్చుకునే బట్టలు తీసుకున్నాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఏరు దగ్గర చేరుకున్నారు. శీతాకాలం ముగియబోతుంది. చిరు చలిగా హాయిగా ఉంది. చీకట్లు ఇంకా తొలగిపోలేదు. తూరుపు దిక్కు తెల్లబడుతూ ఉంది. తెల్లని కొంగలు రెక్కలు సాచి, వరసలుగా ఆకాశంలో వెళుతున్నాయి.

అప్పటికే ఏట్లో మంచినీళ్ల పీపా బండ్లు రెండు మూడున్నాయి. “కొంచెం ఎగువకు వెళదాం పద” అంటూ దారితీశాడు సారు. గట్టున ఇసుకలో బట్టలు పెట్టి డ్రాయర్లతో నీళ్లలో దిగారు. అప్పటి డ్రాయర్లు మోకాళ్ల వరకు వచ్చేవి. సైను గుడ్డతో కుట్టించుకొనేవారు. నడుముకు బిగించి, జారిపోకుండా కట్టుకోడానికి గుడ్డతోనే కొంచెం లావుగా దారాలుంటాయి. వాటిని ‘లాడెలు’ అంటారు. కంపెనీల కట్‌ డ్రాయర్లు మధ్య తరగతి వారు వాడేవారు కాదు. మరీ వయస్సు మళ్లిన వాళ్లయితే వాటినే మోకాళ్ల క్రిందకి కుట్టించుకొని, వాటితోనే తిరుగుతారు. అలాంటివాటిని ‘సల్యాడాలు’ అంటారు. అవే ఆధునిక కాలంలో షార్ట్స్‌గా, త్రీఫోర్త్స్‌గా రూపాంతరం చెందాయి.

నీళ్లు గోరువెచ్చగా ఉన్నాయి. నడుము లోతు వరకు వెళ్లాడు. “మరింత ముందుకు వెళ్లకు పతంజలీ” అని హెచ్చరించాడు సారు. “నడేట్లో వడి ఎక్కువ. దాదాపు పదడుగులకు పైనే లోతుంటుంది.”

ఇరవై నిమిషాలపాటు స్నానం చేశారు. పతంజలిది గుండు కాబట్టి మరీ హాయిగా ఉంది.

‘బోడి గుండంత సుఖం దేనికీ రాదు’ అన్న నానుడి గుర్తొచ్చి నవ్వుకున్నాడు. బయటకు వచ్చి తుడుచుకున్నారు. వేరే పంచలు కట్టుకున్నారు. సారు తన విడిచిన బట్టలు పిండి భుజాన వేసుకున్నాడు. ఇద్దరూ నడుచుకుంటూ శివాలయం చేరుకున్నారు. చాలా పెద్ద ఆవరణ. ఒక మూల రావిచెట్టు మహా వృక్షంలా ఎదిగింది. దాని ఆకులు గలగలమంటున్నాయి. దానికివతల మారేడు చెట్టు, తెల్ల గన్నేరు చెట్టు ఉన్నాయి. గన్నేరు పూలు చెట్టునిండా వికసించి ఉన్నాయి. నందివర్ధనం చెట్టు కూడ ఉంది గాని దానికి పూలు లేవు.

“పూజారి ఎవరూ లేనట్లుందిసార్‌” అన్నాడు పతంజలి.

“రెగ్యులర్‌గా ఎవరూ ఉండరని విన్నాను. కార్తీకమాసంలో, శివరాత్రికి మాత్ర జనం బాగా వస్తారు.”

గర్భగుడికి తలుపులు లేవు. బయట పెద్ద మంటపం ఉంది. అందులో నందీశ్వరుడు శివుని ఎదురుగా పడుకొని ఉన్నాడు. ఒక మూల బోరింగ్‌ ఉంది. చిన్న సత్తు బక్కెట్‌ ఉంది. పతంజలి పంచెను ధోవతిలాగా మార్చి కట్టుకొని, టవలు నడుముకు బిగించుకున్నాడు. గర్భగుడిలో పుల్లల చీపురు కనబడింది. దాంతో గర్భగుడి శుభ్రం చేశాడు. శివలింగం పెద్దదే. బూడిద రంగులో ఉంది. పానవట్టం కూడ విశాలంగా ఉంది.

“సార్‌ ఒక పదినిమిషాలు!” అన్నాడు సారుతో

“ఓ.కె. టైమింకా ఏడు కూడ కాలేదులే” అన్నాడాయన.

పతంజలి బోరింగ్‌ దగ్గరికి వెళ్లి బకెట్‌ నిండా నీళ్లు కొట్టాడు. బక్కెట్‌కు అడుగున రంధ్రం ఉంది. గబగబా వెళ్ళి లింగాన్ని పానవట్టాన్ని శుభ్రంగా కడిగాడు. రెండోసారి కూడ తెచ్చి నమకంలో ముఖ్యపనస ‘నమస్సోమాయచ రుద్రాయచ’ సుస్వరంగా పలుకుతూ శివుణ్ని అభిషేకించాడు. గర్భగుడిలోని ఒక మూల విభూతి డబ్బా కనబడింది. అందులో విభూతి మూడు వేళ్లకు తీసుకొని శివునికి రేఖలు అడ్డంగా దిద్దాడు. స్నానం చేసి విభూతి రేఖలు ధరించిన స్వామి ఫ్రెష్‌గా కనపడుతున్నాడు.

మారేడు చెట్టు దగ్గరికి వెళ్లి గుప్పెడు బిల్వదళాలలు గుప్పెడు తెల్ల గన్నేరుపూలు తెచ్చుకుని స్వామికి అర్చన చేశాడు. లింగం మీద, చుట్టూరా బిల్వం, పూలు పేర్చాడు.

సారు గర్భగుడి బయటే నిలబడి అంతా చూస్తున్నాడు. చివర్లో ‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరా యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే’ అని చెప్పుకుని బయటకు వచ్చి “పదండి సార్‌ వెళదాం” అన్నాడు.

సారు అన్నాడు “చివర్లో నీవు చదివావే ఆ మంత్రం, దానికి ఇంచుమించు సమానమైనదే మా ఖుర్‌ ఆన్‌ లోనూ ఉంది”

“ఈ మంత్రాలకు పూజలకు తంతుకు అతీతుడే శివుడు. ఆయనే అల్లా ఆయనే అందరు దేవుళ్లూ. అంతే కద!”

“అవును సార్‌! ఏకంసత్‌ విప్రాః బహుథావదన్తి అని శాస్త్రం చెబుతూంది”

“కాని పూజవల్ల, ధ్యానం వల్ల, ప్రార్థన వల్ల మనస్సు ప్రశాంతమౌతుంది”

“నిరాకారుడైన దేవుని ధ్యానించడం కష్టం కాబట్టి హిందూ మతం దేవునికి రకరకాల రూపాలు కల్పించింది.”

“ఆ రకంగా చూస్తే మా మతమే కొంత ‘మెచ్యూర్‌’ అనిపిస్తుంది పతంజలీ! మా మసీదుల్లో కేవలం శూన్యాన్నే ఆరాధిస్తాము”

“ఆ శూన్యానికి కూడా చుట్టూ ఒక పవిత్ర భౌతిక నిర్మాణముంటుంది కదా సార్‌”

“నిజమే. కానీ మా వాళ్లు కొందరు ప్రవక్త తత్త్వాన్ని అవగాహన చేసుకోలేక పెడదారులు తొక్కుతున్నారు”

“పెడదారులు తొక్కడం అన్ని మతాల్లోనూ ఉందిలెండి”

ఇలా మాట్లాడుకుంటూ యిల్లు చేరుకున్నారు. పతంజలి ఐదు నిమిషాల్లో తయారయ్యాడు.

సారు భార్య ఒక ప్లేటులో పొగలు కక్కే బొంబాయి రవ్వ ఉప్మా తెచ్చిచ్చింది. సారు తాను అప్పుడే తిననన్నాడు. ఎండుకొబ్బరి వెల్లుల్లి కలిపి కొట్టిన పొడి దాంట్లోకి నంచుకోవడానికి, చాలా బాగుంది. సారునూ, ఆమెనూ ప్రక్కప్రక్కన నిలబడమని, ఇద్దరికీ కాళ్లకు మొక్కాడు పతంజలి. ఇద్దరూ ఆశీర్వదించారు.

సారు బస్టాండు వరకు వచ్చి కోవెల కుంట్ల బస్సు ఎక్కించారు. కదులుతూన్న బస్సులోంచి సారుకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. వాళ్లు చూపిన అభిమానానికి అతని హృదయం బరువెక్కింది. కోవెల కుంట్లలో దిగి కర్నూలు బస్‌ కోసం ఎదురు చూడసాగాడు. ఒక అరగంటలో ప్రొద్దుటూరు – కర్నూలు బస్సు వచ్చింది. సీటు దొరికింది.

బనగానిపల్లె, సిమెంట్‌నగర్‌, బేతంచెర్లమీదుగా వెళ్లి తిరుపతి కర్నూలు హైవే ఎక్కింది. బేతంచెర్లలో టీ కి ఆపాడు. టీ తాగాడు పతంజలి. ఫ్లోరింగ్‌కు పనికొచ్చే రాతి పలకలకు ఆ వూరు ప్రసిద్ధి. స్లాబ్‌ పాలిషింగ్‌ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. పాలిష్‌ చేసిన తర్వాత గరుగ్గా ఉండే ఆ రాతిపలకలు నున్నగా మెరుస్తాయి. అప్పటికింకా టైల్స్‌ రాలేదు. వీటికే చాలా డిమాండ్‌. బేతంచర్లలో రైల్వే స్టేషన్‌ ఉంది. రెండంగుళాల మందం ఉన్న బండలు కూడ దొరుకుతాయి. కర్నూలు కడప జిల్లాల్లో అప్పుడు యిటుకల వాడకం తక్కువ. ఈ మందం బండలు ఒక దాని మీద ఒకటి పేర్చి గోడ కడతారు. గ్యాప్స్‌కు మాత్రం సిమెంటు ఇసుక మిశ్రమం పూస్తారు. మొత్తం గోడను ప్లాస్టరింగ్‌ చేయాల్సిన పనిలేదు. ఇటుక గోడ కంటె బలంగా ఉంటుంది కూడ.

కర్నూలు బస్టాండుకు వెళ్లకుండా జనరల్‌ హాస్పిటల్‌ వద్దే దిగాడు పతంజలి. టైం దాదాపు రెండు కావస్తుంది. ఆస్పత్రి ఎదురుగా ఉన్న ‘ఉడిపి లక్ష్మీనివాస్‌’లో భోజనం చేశాడు. తిన్న తరువాత ‘అజంతా’కు పోయి ఉంటే బాగుండేది అనిపించింది.

ఆస్పత్రిలోకి వెళ్లి కిడ్నీ వ్యాధుల విభాగంలోకి ప్రవేశించాడు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ’ అని తాటికాయలంత అక్షరాలతో వ్రాసి ఉంది. అక్కడ ఒక్క టేబుల్‌ వెనక కూర్చున్న నర్సమ్మనడిగాడు.

“మేడమ్‌! బాజిరెడ్డి అనే ఆయనకు కిడ్నీలో రాళ్లు తొలగించే ఆపరేషన్‌ అయిందీమధ్యే. ఆయన్ను చూసిపోతాను. పర్మిషన్‌ ఇవ్వండి.”

“విజిటింగ్‌ అవర్స్‌ నాలుగంటలకని తెలియదా? నాలుగు తర్వాత రండి” అని విసుగ్గా చెప్పిందామె.

ఒక వార్డు బాయ్‌ ఇతన్ని చూసి పక్కకు పిలిచాడు. “రెండ్రూపాయలు ఇవ్వండి సార్‌. నేను తీసుకుపోతా” అన్నాడు. విధిలేక జేబులోంచి తీసియిచ్చాడు. “పేషంటుది ఏవూరు?” అనడిగాడు. “బి. తాండ్రపాడు”

“రండి” అని ఆమె దగ్గరకు పోయి రిజిస్టరులో చూశాడు. “నిన్నే జనరల్‌ వార్డుకు మార్చారాయనను” అని చెప్పాడు బాయ్‌. ఆమె కిమ్మనలేదు. ఆ రెండు రూపాయల్లో ఒక రూపాయి ఆమెకిస్తాడేమో అనుకున్నాడు.

బాయ్‌ వెంట జనరల్‌ వార్డులోకి వెళ్లాడు. “బెడ్‌ నం 23” అని చూపించి బాయ్‌ వెళ్లిపోయాడు. “త్వరగా వచ్చేయండి. డాక్టర్లెవరైనా రౌండ్స్‌కు వస్తే మాకు మాటొస్తుంది” అన్నాడు వెళ్లేముందు.

బెడ్‌మీద పడుకొన్ని ఉన్నాడు బాజిరెడ్డి. పతంజలిని చూసి, “రా సామీ, నేనీడ జేరినట్లు నీకెవరు జెప్పిరి?” అన్నాడు. “నిమ్మకాయల మండీలోనే చెప్పారు” అన్నాడు. బాజిరెడ్డి భార్య మంచం ప్రక్కన స్టీలు స్టూలుపై కూర్చున్నామె లేచి “కుచ్చో సామీ” అన్నది. సెలైన్‌ ఎక్కువతూ ఉంది. స్టూలు మంచం దగ్గరకు జరుపుకొని, బాజిరెడ్డి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.

“ఇదేం పెద్దాపరేషనేం కాదు. దిగులు పడకు. నాలుగు రోజుల్లో ట్రాక్టరు తోలుకొని కర్నూలుకు వస్తావు” అన్నాడు.

“నాకేం దిగుల్ల్యా. సేద్యం తోట ఆగమవుతుండాయనే నా దిగులు”

“నాల్రోజులకు కొంపలు మునిగేదేముందిలేయ్యా అంటే ఇనడు సామీ! ఆస్పత్రిలో ఉన్నా పొలంమీదే ద్యాస ఈ మన్చికి” అన్నదామె.

ముఖం కొంచెం వాడిందేగాని, బలహీనపడలేదు బాజిరెడ్డి. ‘కాయకష్టం చేసిన శరీరం కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువుంటుంది’ అనుకున్నాడు. బ్యాగులోంచి హోటలు దగ్గర కొన్న దానిమ్మ పండ్లు తీసి ఆమెకిచ్చాడు.

“ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తామన్నారు?”

“మూడు రోజుల తర్వాత. నెల రోజులు బరువు పనులు చేయొద్దన్నారు”

“నెలకాదు రెండు నెలలు జాగ్రత్తగా ఉండు. ఆరోగ్యం బాగుంటే తర్వాత ఏమైనా చేయొచ్చు. జీతగాండ్లున్నారు కదా వాండ్లు చూసుకుంటారులే”

“ఏంజేచ్చాం మరి. కానీ” అన్నాడు బాజిరెడ్డి.

కాసేపు కూర్చుని, ధైర్యం, జాగ్రత్తలు చెప్పివచ్చేశాడు. జనరల్‌ ఆస్పత్రి చాలా పెద్దది. వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రక్కనే మెడికల్‌ కాలేజి, ప్రయివేటు వైద్యం అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కర్నూలు హాస్పిటలే అందరికీ దిక్కు. అందులో పని చేసే హేమాహేమీలంతా ఎక్కువ శాతం రెడ్లే కావడం ఒక విశేషం. రాయలసీమలోని భూస్వాములు, ఫాక్షనిస్టులు తమ పిల్లలను పెద్ద చదువులు చదివిస్తారు.

హాస్పిటల్‌ బయటకు వచ్చి ‘కశిరెడ్డి శ్యాలమ్మ సత్రము’ ముందు నిల్చున్నాడు. అనంతపురం, నంద్యాల, శ్రీశైలం వైపు పోయే బస్సులన్నీ అక్కడ ఆపుతారు. ఒక బస్సులో సీట్లు లేవు. ఇంతలో ఎకనామిక్స్‌ గురువు ఇదురూస్‌ బాషా స్కూటరు మీద వెళ్తూ పతంజలిని చూసి ఆపాడు. “స్వామీ, వెల్దుర్తికేనా? రండి నేనూ అక్కడికే” అని పిలిచాడు. పతంజలి వెళ్లి మధ్యలో సంచి పెట్టి వెనక కూర్చున్నాడు.

“రిజల్టు ఎప్పుడు వస్తుంది స్వామీ” అనడిగాడు భాషా.

“ఈ నెలాఖరులోగా రావొచ్చునని అనుకుంటున్నాను”

“వాట్‌ ఆర్‌ యువర్‌ ప్యూచర్‌ ప్లాన్స్‌?”

“ఐ వాంట్‌ టు గో ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌”

“గుడ్‌! ఆల్‌ ది బెస్ట్‌”

పతంజలిని యింటిదగ్గర దింపి ఆయన వెళ్లిపోయాడు.

***

1978

నంద్యాల, అహోబిలం, సంజామల విశేషాలన్నీ కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు పతంజలి. తండ్రికి చెప్పి తోకోడికి వందరూపాయలిచ్చాడు. కొత్తూరు సుబ్బరాయుడి క్షేత్రానికి వెళ్లి నాగప్రతిష్ఠ చేసి రమ్మని.

నాలుగు రోజులుగా టూషన్లకు సెలవిచ్చాడు కాబట్టి దాన్ని కాంపెన్సేట్‌ చేయడానికి రెండు పూటలా అరగంట ఎక్కువ చెపుతున్నాడు పిల్లలకు. రోజూ లైబ్రరీకి వెళ్లి ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రిక చదివి వస్తున్నాడు. దాంట్లోనే తన ఫలితాలు వచ్చేది.

గుత్తదారులకు వాళ్ల పదివేలు వచ్చేసుంటుందని గ్రహించాడు. ఇంకా యాభై అరవై బస్తాలకాయ దిగుతుందని లెక్క గట్టాడు. పోనీలే వాళ్లకు కూడ ఇంత దూరం వచ్చినందుకు లాభం ఉండాలి కదా అనుకున్నాడు.

పెసలు మినుములు తెచ్చి, వేరుశనగ పీకిన చేనంతా దుక్కిదున్నించి, గుంటక తోలించి ఒక తడి నీరు పారించి, పొలంలో చల్లించాడు. సుంకన్న సాయం చేశాడు.

ఓబులప్ప ఒక రోజు ఇంటికి వచ్చి ఒక ప్రతిపాదన తెచ్చాడు. తోటకు మళ్లీ సత్తువ (ఎరువు) పెట్టాలనుకుంటున్నామనీ, చాపల పొట్టు ఎరువు చెట్లు లాగేసుకుని ఉంటాయనీ, చెట్లు కాండం చుట్టూ ఎత్తుగా మన్ను పోసి నీళ్లు పాదు బయట నింపుతున్నారనీ, అది సరైన పద్ధతి కాదనీ అన్నాడు.

ఆముదపు చెక్క (పిండి) చెట్లకు చలువ చేస్తుందనీ, కాండం చుట్టూ ఎత్తుగా మన్ను ఉండటం వల్ల చెట్లకు తగినంత నీరందటం లేదనీ, ఆ మట్టినంతా సలికెలతో బయటకు లాగించి, పాదులు సమతలంగా చేసి ఆముదపు చెక్కవేయాలనుకుంటున్నామనీ అన్నాడు.

దానికి మార్కండేయశర్మ, ఇలా అన్నాడు. “నీవు చెప్పింది నిజమే కావచ్చు కానీ, మాది నల్లరేగడిలో కొంత శాతం చవుడు కలిసిన భూమి. నీళ్లు త్వరగా పీల్చదు. వర్షాకాలంలో పాదుల్లో నీళ్లు ఎన్ని రోజులకూ ఆరవు. అందుకే మేము తెలిసిన వాళ్లను విచారించి చెట్ల కాండం చుట్టూ మూడడుగుల వెడల్పున, బోదెలు కట్టించాం. మా భూమికి వేడి నిచ్చే ఎరువులే వాడాలని మీలాంటి వాళ్లే చెబితే, మా వాడు నానాకష్టాలు పడి గోవా బార్డరు వరకు వెళ్లి చేపల పొట్టు, ఎరువుగా తెచ్చి వేయించాడు. దానివల్ల తొందరగా పాదుల్లో నీళ్లు ఆరిపోతున్నాయి. దిగుబడి కూడ బాగా పెరిగింది. ఇప్పుడు మీరు బోదెలన్నీ తీయించి సమంగా చేస్తే నీళ్లు ఆరక చెట్లు దెబ్బ తింటాయేమో”

పతంజలి అన్నాడు. “మీరు గుత్తకు తీసుకుంది ఒక్క సంవత్సరానికే. చెట్లు దెబ్బతింటే తర్వాత మాకు ఎంతో నష్టం కదా”

“ఇంకా తొమ్మిది నెల్లుంది కదా సామి. ఇంకా మూడు దిగుబడులు రావాల మా శిన్నాయనకు శిరువెళ్లలో ఆముదం. నువ్వుల నూనె, కుసుమ నూనె ఆడిరచే మిల్లుండాది. ఆముదం సెక్క అగ్గవకొచ్చాదని…”

శర్మ అన్నాడు “ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెండ్లి చేసుకున్నట్లు, చౌకగా వస్తుందని ఆముదపు చెక్క వేస్తే చెట్లకేమయినా అయితే?”

“సత్తువ బెట్టినాంక మూడు నెల్లు జూచ్చాం సామీ! సెట్లలో మార్పు కనబడితే మల్లా మన్ను ఎగనూకి బోదెలు పెట్టిస్తే సరి. మా సిన్నాయనదే లారీ ఉండాది. డీజలు బోయించుకుంటే రెండు లోడ్లు తోలించుకోవచ్చు. కాదనగాకండి. కోడుమూరుకాడ శీనీతోటకు గూడ్క ఇదే చేచ్చామని వాళ్లను ఒప్పిస్తిమి”

“సరే చూద్దాం తేడావస్తే మటుకు మళ్లీ యథాస్థితికి తేవాలి సుమా” అన్నాడు శర్మ. పతంజలి కూడ ఒప్పుకున్నాడు. సంక్రాంతి పోయినంక చేయిస్తామన్నారు.

సంక్రాంతి పండుగ వారం రోజులుందనగా ‘దక్కన్‌ క్రానికల్‌’లో పతంజలి ఫలితాలు వచ్చాయి. వాటిన చూసిన పతంజలి ఆనందానికి అంతులేకపోయింది.. ఎక్స్‌టర్నల్‌ పరీక్షలు దాదాపు పద్దెనిమిది వేల మంది రాశారు. అందులో మూడవ స్థానంలో పతంజలి నిలిచాడు. పదమూడు వందల మార్కులకు పదకొండు వందల ఐదు మార్కులు సాధించి ఎనభై ఐదు శాతం మార్కులు అగ్రిగేట్‌గా తెచ్చుకున్నాడు.

తొలి, రెండవ స్థానం సాధించిన వారికీ పతంజలికీ ఎక్కువ తేడా లేదు. మొదటి వాడు ఎనభై తొమ్మిది శాతం, రెండవవాడు ఎనభై ఆరుశాతం తెచ్చుకున్నట్లు వ్రాశారు. ముగ్గురి పేర్లు వరుసక్రమంలో ఇచ్చారు. ఫలితాలపైన ఉన్న వార్తా వ్యాఖ్యలో ఇలా ఉంది.

“రకరకాల కారణాల వల్ల కాలేజీల్లో చదువుకోవడానకి నోచుకోని ఈ విద్యార్థులు ప్రయివేటుగా చదివి, ఎక్స్‌టర్నల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులవడం ముదావహం. రెగ్యులర్‌ విద్యార్థులకంటే వీరి ఉత్తీర్ణతా శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. మొదటి మూడు స్థానాలలో నిల్చిన యువ మేధావులకు దక్కన్‌ క్రానికల్‌ అభినందనలు తెలియజేస్తూన్నది. ఈ ముగ్గురికీ పాస్‌ సర్టిఫికెట్లతో పాటు, ర్యాంక్‌ సర్టిఫికెట్లు కూడా యిస్తామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి”

పేపర్లో తన పేరు మాటి మాటికి చూసుకుని మురిసిపోయాడు పతంజలి. అహోబిలంలోని పై స్వామిని కళ్లముందు నిలుపుకొని నమస్కరించుకున్నాడు. లైబ్రేరియన్‌ను అభ్యర్థించి, ఫలితాలున్న పేపరు భాగాన్ని తీసుకుని ఇంటికి పరుగు పరుగున చేరుకున్నాడు.

తండ్రిని తల్లిని పిలిచి ఉద్వేగంగా శుభవార్త వినిపించాడు. పేపర్లో పడిన తన పేరును అందరికీ చూపాడు తండ్రి ముఖంలో ప్రసన్నత కనపడింది. అంతే. ప్రశంసిస్తూ ఒక్కమాట అనలేదాయన. దేనికీ అతిగా స్పందించడు. తల్లి మాత్రం పతంజలిని అక్కున చేర్చుకుని బుగ్గ మీద ముద్దుపెట్టుకుంది.

“మా పతంజలి ఇలాంటి ఘన విజయం సాధిస్తాడని నాకు ముందే తెలుసు. తోటలో పనిచేసుకుంటూ, ప్రయాణాల్లో చదువుకున్నాడు నా బంగారు నాయన” అన్నది. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. వంటింట్లోకి వెళ్లి చీపురు పుల్లలు కొసలు వెలిగించి పతంజలికి దిష్టి తీసింది. తమ్ముళ్లిద్దరూ “మా అన్నయ్య పేరు పేపర్లో పడింద”ని గంతులేశారు.

“ఈ రోజు వాడికిష్టమైనవి చేసిపెట్టు” అన్నాడు మార్కండేయశర్మ. ఆ పితృ హృదయం తన మనసులోని భావాన్ని అలా వ్యక్తం చేసింది.

“ఏం చేయమంటావురా” అనడిగింది తల్లి.

“శనగబ్యాడల పరమాన్నం, మిరపకాయ బజ్జీలు చేయమ్మా” అన్నాడు.

“అవి కారం. నేను తినను. నాకు ఉర్లగడ్డ బజ్జీలు చేయాల్సిందే” అన్నాడు చిన్నోడు.

“నీ పేరు పేపర్లో వచ్చినపుడు చేస్తుందిలే” అన్నాడు మల్లినాధ.

అందరూ నవ్వుకున్నారు.

పోస్టు కార్డులు తీసుకుని ఆజంసారుకు, గద్వాల సాగర్‌ బావకు, రామ్మూర్తి బావకు ఉత్తరాలు రాశాడు. సాయంత్రం వెళ్లి రాధాసారుకు, శంకరయ్యసారుకు చెప్పి రావాలనుకున్నాడు. బజారుకువెళ్లి న్యూట్రిన్‌ చాక్లెట్ల పాకెట్లు రెండు కొనుక్కొచ్చాడు. సాయంత్రం ట్యూషన్‌ పిల్లలకు పంచి పెట్టడానికి.

అందరూ భోజనానికి కూర్చున్నారు. రెండు రకాల బజ్జీలూ చేసింది వర్ధనమ్మ. తమ్ముళ్లు ఆ రోజు స్కూలు మానేశారు. మహిత లేకపోయిందే అనుకునన్నాడు అన్నయ్య. చుక్క కూర పప్పు, తంబకాయ కూర (తంబకాయలు చిక్కుడు జాతివి. తీగలకు కాస్తాయి. ఒక అడుగు పొడవు, అంగుళం వెడల్పు ఉంటాయి. కూర చేసినా, సాంబారు చేసినా చాలా రుచిగా ఉంటుంది. తంబ తీగె పతంజలివాళ్ల పశువుల శాలలోనే అదంతట అదే మొలిచి, కొమ్మలన్నీ షెడ్డుమీద పరచుకున్నాయి). మజ్జిగచారు చేసింది.

భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని తోటకు వెళ్లాడు. తోకోడు కూడ కొత్తూరు నుంచి వచ్చేశాడు. ఓబుళప్ప వాళ్లు నిమ్మకాయలు దింపుతున్నారు. తోకోనితో సుంకన్నతో ఓబులప్ప చెప్పిన విసయం ప్రస్తావించాడు. “చెట్లు దెబ్బతింటాయోమో చలువ భూమి కదా, ఆముదం చెక్క యింకా చలువ” అన్నాడు తోకోడు.

“మూడు నెల్లు చూద్దాం. చెట్లల్లో తేడా కనపడిన వెంటనే మార్చేద్దాం” అన్నాడు  పతంజలి.

కొత్తూరు సుబ్బారాయుడు దగ్గర నాగప్రతిష్ఠ చేయించుకొని వచ్చిన్న విశేషాలన్నీ చెప్పాడు తోకోడు.

“అయితే సుబ్రమణ్యస్వామి దయతో బుజ్జి హనుమంతు పుడతాడన్నమాట” అన్నాడు పతంజలి.

“సామి దయ, నీ నోటి సలవ. అంతకంటేనా” అన్నాడు తోకోడు.

“నాకెందుకో తప్పనిసరిగా ఫలితం ఉంటుందనిపిస్తూందిరా. కాని వాడిని కూడ నిన్ను, మీ నాన్నను, తాతను పిలిచినట్లు ‘తోకోడు’ అని పిలుస్తేనేనొప్పుకోను. వాడికి మంచి పేరు పెడదాం”

ఓబులప్ప, సంజీవరాయుడు కూడ పాక దగ్గర ఉన్నారు. దింపిన నిమ్మకాయలు పాకలో పోయిస్తున్నారు. ఓబులప్పకు కూడ చెప్పాడు పతంజలి తనకు మూడవ ర్యాంకు వచ్చిందనీ పేపర్లో పేరు కూడ వేశారనీ.

“సదువులు సదవాలంటె బాపనోల్లకే తప్ప వేరేటోల్ల తోటి ఆయ్యే పని గాదు. సామి సేజ్జం జేసుకుంటూ సదువుకునె. గట్టోడే” అని ప్రశంసిచాడు ఓబులప్ప.

సంజీవరాయుడు అక్కడే నిలబడి అంతా విన్నాడు గాని, ఏం మాట్లాడలేదు. పైగా ముఖం మాడ్చుకున్నాడు కూడ. దాన్ని గమనించి పతంజలి మనసులో అనుకున్నాడు.

“వీడికెందుకో నామీద అకారణ వైముఖ్యం! వచ్చినప్పటినుండీ అంతే. కొందరి స్వభావమంతే” అని సమాధానపడ్డాడు.

ఎద్దుల దగ్గర కట్టేసిన గణపతి పతంజలిని చూసినప్పటినుంచి కట్టు తెంపుకొనేంత హడావుడి చేయసాగాడు.

వెళ్లి కట్టుగొయ్యకు కట్టిన పలుపుతాడు విప్పాడు. మెడ క్రింద, వీపున నిమిరాడు. “బంగారు కొండ మా గణపతి” అంటూ ముద్దు పెట్టుకున్నాడు. చిన్నగా మూలుగుతూ గారాలు పోయింది. తాడు పట్టుకుని కాలువకు ఇరువైపులా పెరిగిన పచ్చిక ఒక అరగంట సేపు మేపి, ఇంజను రూం దగ్గర ‘హౌజు’లో నీళ్లు తాపించి, మళ్లీ ఎద్దుల దగ్గర కట్టేశాడు. ఎద్దులు రెండూ మరి మా సంగతేమిటన్నట్లుగా మోరలెత్తి చూశాయి. వాటి దగ్గరకు వెళ్లి కాసేపు ఒళ్లంతా నిమిరాడు. కొడవలితో గడ్డివాము నుండి వేరుశనగ కట్టె దూసి రెండు చేతులతో తెచ్చి గాడిపాట్లో  వేశాడు. గణపతి ముందు కూడ కొంత వేశాడు.

ఐదు గంటలకు ఇంజను రూములో కాసేపు పాటలు, దరువేసుకుందామనకున్నారు. ముగ్గురూ చేరి కూర్చున్నారు. సుంకన్న కుండ బోర్లించి, పదిపైసల నాణెం రెండు వేళ్ల మధ్య పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. “ఎత్తుకో సామీ” అన్నాడు.

“మాంచి ఊపున్న పాట పాడాల సూడు”

‘దసరాబుల్లోడు’ సినిమాలో ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల’ పాడాడు పతంజలి. సుంకన్న దానికి దరువదరకొట్టాడు.

తోకోడు సిగ్గుపడుతూ అన్నాడు “సామీ మొన్న కొత్తూరుకుపోయినప్పుడు సుబ్బారాయుని మీద ఒక పాట గట్టినా. పాడుదునా?”

“పాడురా నీకడ్డమేముంది?” అన్నాడు పతంజలి. తోకోడు ఎత్తుకున్నాడు.

అబ్బొబ్బో సుబ్బన్నా, నిబ్బరంగ సూడుమన్న
కొత్తూరులో కొలువుదీరి, బక్తులనే కాసెటోడ

పిల్లలు లేరని కుమిలే, ఆలూ మగలనుబ్రోచి
వరమునిచ్చిదీవించీ, సంతానము నిచ్చు సామి

ఈసుని మెడలో దండగ, సోకుగ సుట్టుకునుండీ
నెమలినెక్కి నిక్కి నిక్కి స్వారి జేయు పోటుగాడ

గణపయ్యకు తమ్మయ్యవు, గౌరికి ముద్దుల కొడుకువు
శివుడు నిన్ను గోము చేయు, కైలాసపు కంటివెలుగ
అబ్బొబ్బో సుబ్బన్నా, నిబ్బరంగ సూడుమన్న…

పతంజలి సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాడు. వాడిలోని సృజనాత్మకత అతన్ని ఆశ్చర్యచకితున్ని చేసింది.

“నాగ పతిష్ఠ అయినంక నేనూ మా బుడ్డక్కా ఆడనే ఒక సెట్టు క్రింద కూసొని ఉంటిమి. ఎందుకో స్వామి మింద ఒక పాటగడదామనే బుద్ధి పుట్టె. నుడుగు తర్వాత నుడుగు ఆ సామే పలికించినాడు” అన్నాడు వాడు.

భగవంతుడు ఎవర్ని ఎప్పుడనుగ్రహిస్తాడో తెలియదు అనుకున్నాడు పతంజలి. వాడి మాటలు విన్న తర్వాత పోతనగారి ‘పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట’ అన్న పద్యం గుర్తొచ్చింది. వాడు పాడిన విధానం కూడ రాగయుక్తంగా, ఒక రిథమ్‌ను పలికించింది. ఆ సందర్భంగా ఇద్దరికీ చెరో రెండ్రూపాయలు ‘ఇనాం’ ఇచ్చాడు. టూరింగ్‌ టాకీసులో కృష్ణ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ ఆడుతూంది. వెళ్లమన్నాడు. ఇంటర్వల్‌లో అలసంద వడలు, సోడాలకు కూడ సరిపోతుందా డబ్బు.

వాళ్లిద్దరూ బీడీలు తాగరు. సారాయి కల్లు లాంటివి ముట్టరు.

బండిలో మేత వేసుకొని, గణపతిని బండి వెనక కట్టేసి ఇంటికి బయలుదేరారు. దారిలో సుంకన్న అన్నాడు.

“కోడెదూడ (గణపతి) కు మకురుతనం జాస్తయింది సామీ! ముకుదాడు వేయించాల. నీ దగ్గర బోగోము జేచ్చాదిగాని, మాకు ఈ మజ్జ మాటినడంల్యా”

“ఉగాది బోయింతర్వాత కాడిమరపాల” అన్నాడు తోకోడు. “ఈ ఎద్దులకు వయసైపోతున్నాది. వాటిని గోరంట్ల తిర్నాలలో అమ్మేసి కోడెదూడకు జత దెచ్చుకుంటె బాగుంటాది”

“రెండువేలు పెడితే గాని మన దానికి జతరాదు” అన్నాడు సుంకన్న.

(సశేషం)

Exit mobile version