Site icon Sanchika

సాఫల్యం-28

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[ఆజం సార్‌తో పాటు భోం చేసి, కబుర్లు చెప్పుకుని ఆ రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు పతంజలి. మర్నాడదయమే సమీపంలోని ఏరులో స్నానం చేసి, స్థానికంగా ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకుని స్వయంగా పూజలు నిర్వహిస్తాడు పతంజలి. సార్ వద్ద, ఆయన భార్య వద్ద వీడ్కోలు తీసుకుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న బాజిరెడ్డిని పరామర్శించి ఇల్లు చేరుతాడు. పతంజలి పరీక్షా ఫలితాలు వస్తాయి. 85% మార్కులతో అందరిలోకీ మూడవ ర్యాంకు సాధిస్తాడు. అందరూ అభినందిస్తారు. పాత ఎడ్లకు వయసైపోతోందని, గణపతికి తోడుగా కొత్త ఎద్దుని కొనాలని అంటారు తోకోడు, సుంకన్న. – ఇక చదవండి.]

[dropcap]“మ[/dropcap]నం భరించలేము రా. చూద్దాం టైముంది గదా. దసరా దాటినాక దానికి మూడో ఏడు వస్తుందనుకుంటా” అన్నాడు పతంజలి.

“ముక్కుకు తాడు వేసేటప్పుడు రంధ్రం వేస్తే పాపం నొప్పిగా ఉంటుందేమోరా గణపతికి”. జీతగాండ్లిద్దరూ గొల్లున నవ్వారు.

“నొప్పయితాదని ముకుతాడెయ్యకపోతే మాటింటాదా. ఇంకో సంవత్సరం పోయినంక వట్ట గొట్టించాల. అప్పుడేమంటావో మల్ల” అన్నాడు తోకోడు.

కోడెలకు వట్ట గొట్టేది గుర్తొచ్చి పతంజలి బాధపడ్డాడరు. రెండు కాడి మాన్ల చివర టైర్లు ట్యూబు కట్టి, కోడెను పడుకోబెట్టి కాడిమాన్ల మధ్య దాని వృషణాలను ప్రెస్‌ చేస్తారు. వృషణాలు గుమ్మడికాయంత వాచి, నరకయాతన పడుతుంది కోడె. నడవలేకపోతుంది. కొన్ని రోజులకు తగ్గిపోతుంది.

అలా చేయకపోతే నిరంతరం ఆవులమీద మరులుగొని, సెక్స్‌ ధ్యాసతో, తిండినీళ్లు కూడ తినవు. వట్ట కొట్టింతర్వాత అతి  కామోద్రేకం తగ్గిపోయి తేరుకుంటాయి. నెమ్మది వస్తుంది. పనిలో శ్రద్ధ చూపుతాయి.

ఇల్లు చేరుకొని ట్యూషను పిల్లల దగ్గరికి వెళ్లాడు. అమ్మ అక్కడికే మల్లినాధతో కాఫీ పంపింది. దాదాపు రెండు గంటలు వాళ్లందరికీ చెప్పాల్సింది చెప్పాడు. నోట్సు సరిదిద్దాడు. ఫిబ్రవరి మొదటి వారానికల్లా సిలబస్‌ పూర్తి చేసి, రివిజన్‌ చేయాలి. మార్చి నుండి సెవెన్త్‌ టెంత్‌ పిల్లలను రాత్రి యిక్కడే పడుకోమని చదివించాలి.

భోజనం చేసి, ముందు శంకరయ్యసారు ఇంటికి వెళ్లాడు. తన ర్యాంక్‌ సంగతి వింటూనే ఆయన షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, దగ్గరకు తీసుకున్నాడు.

“కంగ్రాచ్యులేషన్స్‌ రా పతంజలీ. యు డిజర్వ్‌ ది ర్యాంక్‌. అయాం ప్రౌడాఫ్‌ యు” అన్నాడు.

తర్వాత రాధాసారింటికి వెళ్లాడు. విషయం విన్న ఆయనను పట్టశక్యం కాలేదు. పతంజలిని కౌగిలించుకున్నాడు. భార్యను కేకేశాడు. “స్వామీ! నీ పాసుగూల తోటలో సదువుకోని ర్యాంకు తెచ్చుకుంటివే! అబ్బ! నాకెంత కుశాలగుండాదో! ఏమ్మీ ఇంట్లో ఏదయినా తీపి పదార్తముందేమో సూడు తొందరగా” అన్నాడు.

ఆమె వంటింట్లోంచి మైసూరుపాకు ముక్కలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. పతంజలి తినబోతూంటే.

“య్యోవ్‌! నీవు తినగాకు. నేనే నీ నోట్లో బెట్తా” అని తన చేతిలోని మైసూరు పాకు పతంజలి నోట్లో కుక్కాడు.

లోపలికి పోయి మూడు వందలు తెచ్చి పతంజలికిచ్చాడు. వద్దని ఎంత మొత్తుకున్నా వినలేదు.

“ఇదిగో సామీ, సెపుతూండా ఇను. ర్యాంకు హోల్డరంటే ఎట్లుండాల? ఈ డబ్బు లెత్తుకొని రేపే కర్నూలు బోయి మంచివి ఒక జత బట్టలు చింపిచ్చుకో. నీ చెప్పులు సూడలేకపోతుండా. బాటా కంపెనీవి వెనక్కు బెల్టు టైపువి ఒక జత కొనుక్కో. ఆ వాచీ పాతదైపోయినాది. మంచిది కొత్తది కొనుక్కో. ఫేవర్‌లూబా కంపెనీ బాగుంటాయి.సూడు, ‘సీకో’ ఐనా ఫరవాల్యా. డబ్బులు సాలకపోతే నేనే ఇచ్చా” అంటూ మూడు వందల రూపాయల నోట్లు పతంజలి జేబులో కుక్కి, మరేం మాట్లాడనివ్వకుండా బయటకు తోశాడు. పతంజలి వచ్చేస్తుంటే వెనుకనుండి అరిచాడాయన.

“రేపు రాత్రి అన్నీ తెచ్చి సూపిచ్చాల”

ఆయన అభిమానానికి, బోళాతనానికీ పతంజలి కళ్లు చెమర్చాయి. మూడు వందలంటే చాలా పెద్ద మొత్తం. రేపే కర్నూలుకు వెళ్లాలనుకున్నాడు. విశ్వేశ్వర శాస్త్రి గారిని కలిసి విషయం తెలిపి కృతజ్ఞతలు చెప్పి రావచ్చునని భావించాడు. తాండ్రపాడుకు పోయి బాజిరెడ్డికి కూడ చెప్పాలి. ఇదురూస్‌ భాషా వచ్చే ఆదివారం వరకు కలవడు.

ఇంటికివెళ్లి తండ్రితో రాధాసారు మూడువందలిచ్చినట్లు చెప్పాడు. ఆయన అన్నాడు.

“ఆయన బాగా విద్యాధికుడు ఉన్నతోద్యోగి కాబట్టి నీ యోగ్యతను గుర్తించాడు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం’ అని కదా ఆర్యోక్తి. ఆయన అండ దొరకడం మన అదృష్టం నాయనా”

“అవును నాన్నా” అన్నాడు పతంజలి మనస్ఫూర్తిగా.

మరునాడుదయం ట్యూషన్లు ముగించుకొని, భోజనం చేస్తే లేటవుతుందని, రాత్రి మిగిలిన అన్నంలో ఉలవపొడి, నెయ్యి కలుపుకుని తినేశాడు. మళ్లీ సాయంత్రం ట్యూషన్ల టయానికి రావొచ్చుకదాని. తొమ్మిదిగంటలకల్లా బస్సు దిగి రిక్షాలో విశ్వేశ్వరశాస్త్రి గారింటికి వెళ్లాడు. దారిలో అరడజను అరటిపళ్లు తీసుకున్నాడు.

ఆయన కోర్టుకు బయలు దేరుతున్నాడు. పతంజలిని చూసి “రా నాయనా! పరీక్షలు బాగా వ్రాసినావా? రిజల్టు ఇంకా రాలేదా?” అంటూ సాదరంగా పిలిచాడు. పతంజలి పళ్లు ఆయన చేతిలో పెట్టి, పాదాభివందనం చేశాడాయనకు.

“విద్యావాన్‌, ఆయుష్మాన్‌ భవ” అంటూ ఆశీర్వదించాడాయన.

“మొన్ననే రిజల్టు వచ్చిందండి. దక్కన్‌ క్రానికల్‌లో వేశారు. ఉస్మానియా ఎక్స్‌‌టర్నల్‌ పరీక్షలు వ్రాసిన మొత్తం పద్ధెనిమిదివేల మందిలో, మీలాంటి గురువుల ఆశీర్వాదంతో, మూడో ర్యాంకు తెచ్చుకున్నాను. ఎనభై ఐదు శాతం వచ్చింది” అన్నాడు.

ఆయన వెంటనే పతంజలిని అక్కున చేర్చుకున్నాడు. “భేష్‌, భేష్‌ శర్మగారి కొడుకువనిపించుకున్నావురా. ఆర్ట్స్‌ గ్రూపులో అంత పర్సెంటేజి రావడం అరుదు. సైన్సువాళ్లకొస్తుంది గానీ. చాలా మంచివార్త చెప్పావు నాయనా. ఉండు. ఇప్పుడే వస్తా” అంటూ లోపలికి వెళ్లాడు. ఒక అందమైన ఎగ్జిక్యూటివ్‌ డైరీ, ఖరీదైన ‘మర్చెంట్‌’ కంపెనీ పెన్ను తీసుకొని లోపల్నించి వచ్చాడు.

“నా శిష్యుడు సాధించిన విజయానికి నా చిరుకానుకలివి. స్వీకరించు” అన్నాడు ఆ రెండిరటినీ పతంజలి చేతిలో పెట్టి.

పతంజలి వినయంగా వాటిని అందుకున్నాడు.

“ఇప్పుడు నీ వెక్కడికి వెళతావు?” అని అడిగాడాయన.

“తాండ్రపాడులో మా మిత్రుడు అనారోగ్యంతో ఉన్నాడండీ. అక్కడికి వెళుతున్నాను.”

“అయితే నాతో రా బస్టాండు దగ్గర దింపుతాను”

బయట నీలిరంగు అంబాసిడర్‌ కారు సిద్ధంగా ఉంది. పతంజలి డ్రయివరు ప్రక్కన ముందు కూర్చోబోతే, వెనక్కు పిలిచి తన ప్రక్కనే కూర్చో బెట్టుకున్నాడు.

“తరువాతేం చేద్దామని?”

“పోటీ పరీక్షలకు సిద్ధమవుదామనకుంటున్నాను సార్‌.”

“మంచిది. సంస్కృతం కాకుండా ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్‌ చెయ్యి.”

“నీకు ఇంగ్లీషంటే ప్రాణం, అభినివేశమూ ఉంది. ఇంగ్లీషు ఎమ్‌.ఎ. చెయ్యి.”

“అలాగే నండి”

“లా చేసే ఉద్దేశం ఏమయినా ఉందా?”

“లేదు సార్‌. మీ కోర్టులో ఇదురూస్‌ భాషా అని మా ఊరాయన చేస్తున్నాడు మీకు తెలుసా సార్‌?”

“ఆ తెలుసు. అడ్వొకేట్‌ కరీంఖాన్‌ అల్లుడే గద. తెలివైన వాడే సాయిబు. త్వరలో వాళ్ల మామను మించిపోతాడు.”

కోర్టు గేటు దగ్గర కారు దిగి ఆయనకు నమస్కరించి, వెనుదిరుగుతూంటే కాకతాళీయంగా స్కూటరు పై వస్తున్న ఇదురూస్‌ భాషా కనబడ్డాడు. వెళ్లి విష్‌ చేశాడు.

“వాటే సర్ప్రయిజ్‌! ఎప్పుడూ కర్నూల్లోనే కలుస్తున్నాం” అని కరచాలనం చేశాడతను.

“రేపాదివారం మీ యింటికే వద్దామనకుంటున్నాను”

“ఏమిటి సంగతి? రండి. క్యాంటిన్‌లో కూర్చుని మాట్లాడుకుందాం”

కోర్టు క్యాంటీను ఒక పెద్ద చెట్టు కింద ఆజ్‌ బెస్టాస్‌ రేకుల షెడ్‌లో ఉంది. భాషా నల్ల కోటు వేసుకుని ఉన్నాడు.

“టిఫిన్‌ చేశారా?”

“ఉదయం కొంచెం అన్నం తినివచ్చానులెండి”

“అయితే మీ అనుమతితో నేను టిఫిన్‌ చేస్తాను. తర్వాత ఇద్దరం టీ తాగుదాం”

“అయ్యో! దానికేం?”

భాషా ఉగ్గాని, బజ్జీ తెప్పించుకున్నాడు. బజ్జీలు అప్పుడే వేసినవిలా ఉన్నాయి. వేడిగా ఉన్నాయి.

“పోనీ రెండు బజ్జీలు తింటారా? అని భాషా అన్న వెంటనే తల ఊపాడు. మిరపకాయ బజ్జీల మహిమ అలాంటిది. “రెండు చాలు” అన్నాడు. బజ్జీలు తిని టీ తాగారు.

తన రిజల్టు గురించి చెప్పాడు.

బాషా ఎక్సయిట్‌ అయ్యాడు. “వాటే గుడ్‌ న్యూస్‌! యు డిజర్వ్‌ ది ర్యాంక్‌. కంగ్రాట్స్‌” అన్నాడు.

“ఐ వో యు ఫర్‌ యువర్‌ కైండ్‌ గైడెన్స్‌ ఇన్‌ ఎకనామిక్స్‌, భాషాగారు” అన్నాడు పతంజలి.

“మై కాంట్రిబ్యూషన్‌ ఈజే స్మాల్‌ థింగ్‌. ఇటీజ్‌ యువర్‌ ఇంటలెక్ట్‌ అండ్‌ ఇండస్ట్రీ దట్‌ కాజ్డ్‌ యువర్‌ అచీవ్‌మెంట్‌”

“థ్యాంక్స్‌”

“మొన్న మనమిద్దరం బండిమీద వెళుతూన్నపుడు కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు వెళతానన్నారు కదా! ఈ వారం బ్యాంక్‌ ఆప్‌ బరోడా వాళ్ల నోటిఫికేషన్‌ వచ్చింది. ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు నింపుతున్నారట. ‘హిందూ’లో పడింది చూడండి. పరీక్ష ఏప్రిల్‌లో నట. మన కర్నూల్లో కూడ సెంటరున్నట్లుంది. అప్లయి చేయండి” అన్నాడు బాషా. “తప్పకుండా” అన్నాడు పతంజలి. అతని వద్ద సెలవు తీసుకొని బస్టాండు చేరుకున్నాడు. నన్నూరు మీదుగా వెల్దుర్తికి పోయే బస్సు సిద్ధంగా ఉంది.

అది నంద్యాల రోడ్‌లో నన్నూరు దగ్గర డైవర్టయి, పుల్లగుమ్మి, కలుగొట్ల రామళ్లకోట మీదుగా వెల్దుర్తికి వెళుతుంది. ఈ మధ్యనే ఆర్‌.టి.సి వాళ్లు వేశారు.

తాండ్రపాడు చెరువు కట్టమీద దిగాడు. దూరంగా బాజిరెడ్డి పొలాలు, నిమ్మతోట కనబడుతున్నాయి. ఇంచుమించు ఒక అరకిలోమీటరు కంటే ఎక్కువుండదు. నడుస్తూ పది నిమిషాల్లో బాజిరెడ్డి యిల్లు చేరుకున్నాడు.

బాజిరెడ్డి భార్య పతంజలిని చూసి నమస్కరించి కుర్చీ వేసి కూర్చోబెట్టింది.

“ఈయప్ప వద్దన్నా ఇనకుండా తోటలోకి పోయినాడు సూడు సామీ! సెట్ల కింద కూలోండ్లు సలికెపని జేచ్చాండారు. సూసొచ్చానని బోయినాడు.” అన్నదామె.

“అయితే నేనూ పోయి అక్కడే కలుస్తా” అంటూ తోటలోకి పోయాడు.

సలికెల చప్పుళ్లు విని అటువైపుకు వెళితే బాజిరెడ్డి ఎండలో నిలబడి వాళ్లకు సూచనలిస్తున్నాడు.

వెనగ్గా వెళ్లి, “డాక్టర్లు చెప్పిందేమి నీవు చేస్తున్నదేమీ మహాశయా” అని అడిగాడు.

“ఓర్నీ. ఉన్నట్టుండి ఎట్లొచ్చబ్బా మా సామి? రా. రా.అందరూ బాగుండారా యింటికాడ” అని ముఖం ఇంత చేసుకొని పలుకరించాడు. పతంజలి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకున్నాడు.

“మాట మార్చద్దు. రెస్టు తీసుకోవాలని చెబితే వినకుండా….”

“రెస్టు గాక ఏ మేడుచ్చుండా. ఇంట్లో మీ రెడ్డమ్మ గూడ ఇదే పల్లాయి (పల్లవి) బాడ్తూండె. మజ్జన వచ్చి సూసిపోకుంటే ఈ నాయండ్లు సక్కరమంగా పని జేచ్చారా యేమన్నానా. ఊకె వచ్చినా అంతే. నేనేమయిన సలికెశాదానం జేచ్చుండానా?” అని.

“ఇంటి కాడికి పోదాం పా సామీ” అంటూ పతంజలిని పిల్చుకుబోయినాడు. మధ్యలో వెనక్కు తిరిగి,

“పైటాలకు కానుగ శెట్ల కాడికి అయిపోవాల” అని కూలీలనుద్దేశించి కేకవేశాడు.

ఇంట్లోకి వెళ్లి కూర్చున్నారు. బాజిరెడ్డిని నులకమంచం మీద చేరగిలబడి పడుకోమన్నాడు పతంజలి.

“కాపీ యేమన్న తాగుతావా సామీ” అన్నాడు. “పన్నెండయితుండాది ఇంకో గంటతాలి, బోజనమే సేద్దాంలే” అన్నాడు మళ్లీ.

“అసలు మీ యింట్లో భోజనం చేద్దామనే వచ్చినా” అన్నాడు పతంజలి.

ఆ మాట లోపలికి వినబడినట్లుంది. రెడ్డమ్మ ఒక్క పరుగున వచ్చి “నిజంగానా సామీ! అంత బాగ్గెమా మాకు. మా యిండ్లల్లో మీరు తినరేమో నని ఆలోచిచ్చాండా” అన్నదామె.

“మా సామి కట్టాంటివేం లేవు. ఆయననట్లా అంటాడుగాని, నన్ను సూడనీకె వచ్చినాడు” అన్నాడు బాజిరెడ్డి.

“వండినావా, వండుతుండావా ఇంకా?” అనడిగాడు భార్యను.

“అయితుండాది. నీవో పాలి లోనికిరా రెడ్డీ” అని పిలిచింది.

“అంత రగస్యమెందుకులే. మనసామి దగ్గర, చెప్పు”

“ఏం ల్యా, మన సెట్టువే మామిడి పిందెలు పప్పులో బేసినా. జొన్న పిండి తడిపి పెట్టుకున్న్యా. సామి కొరివికారం తింటాడా?”

“లక్షణంగా తింటా” అన్నాడు పతంజలి నవ్వుతూ.

“బాపనోల్లు ఎల్లిపాయ ఉల్లిగడ్డ తినరుగదాని…

“సామి మామూలు బాపనోల్ల లెక్కగాదే తిక్కదగిడీ! ఆయన కిస్ట పరమాత్మలాంటోడు. సరేలే కూరేం చేసినావు?”

“ఎద్దుల కొట్టం మీద సొర్ర కాయ ముదిరిపోతాదని మొన్ననే తుంచుకొని పెట్టినా అదెంత సేపు మగ్గుతాది?”

“ఊరిమిండి యాదన్నా నూరుపో. సామోల్లు రోటూరుమిండి (పచ్చడి) లేకుంటే తినరు”

“సుక్కకూర పచ్చడి చేచ్చాలే”

“ఇంగబో లేటయితాది సామికి”

వాళ్లిద్దరి సంభాషణ వింటూ, నవ్వుతూ వాళ్లద్దర్నీ గమనిస్తున్నాడు పతంజలి. ఆమె లోపలికి వెళ్లిపోయింది.

“మీ వరస చూస్తుంటే భోజనం తర్వాత భుక్తాయాసంతో సాయంత్రం వరకు పడుకుంటానేమో” అన్నాడు.

“ఈ మాత్రందానికేనా. మేమేం బచ్చాలు, బోజ్యాలు జేసిపెడతాండామా” అన్నాడు రెడ్డి.

“పిల్లలు బాగా చదువుకుంటున్నారా? బాగున్నారా?”

“బాగుండారు సామీ. మొన్న సంక్రాంతి సెలవులని వచ్చినాల్రోజులుండి పోయినారు. సదువులంటావా వాల్లేది జెపితే అదే కరెక్టు.”

బాజిరెడ్డికి ఇద్దరూ కొడుకులే. కర్నూల్లో సెయింట్‌ మేరీస్‌లో చదువుతున్నారు. పెద్దోడు ఈ సంవత్సరం టెంత్‌ పరీక్షలు రాస్తాడు. చిన్నోడు టెంత్‌లో కొస్తాడు. ఇద్దరికీ సంవత్సరమే తేడా. ‘సి’ క్యాంపులో ఒక ప్రయివేటు హాస్టల్లో ఉంటారు.

గుత్తదారుల ప్రతిపాదన గురించి చెప్పాడు బాజిరెడ్డికి. ఆముదపు చెక్కవేస్తామన్నారని కూడ.

“నాయాండ్లదేంబోతాది? సమచ్చరం బోయినాంక దొబ్బుకోని బోతారు. ఈపాటికి వాల్ల లెక్క వాల్ల కొచ్చింటాదంటాండావు సరే ఒప్పుకున్నావు గాబట్టి మూడు నెల్లు సూడు. కొమ్మ తెల్లగైనా, ఆకులు మీద మచ్చలు మొదలయినా ఎంట్నే బోదెలు లోపలికి నూకించి నీళ్లు పారకం తగ్గించాల. ఆగమైపోతాము ల్యాకపోతే” అన్నాడు బాజిరెడ్డి. “గుత్తకు దీసుకున్నోనికీ, సొంతం జేసుకునేటోనికీ, మిండగానికీ మొగునికీ ఉన్నంత వారా (తేడా) ఉంటాది” అని జోక్‌ చేసి తన హాస్యానికి తానే పకపక నవ్వాడు.

పతంజలి కూడ గట్టగా నవ్వాడా మోటు పోలికకు.

లోపల్నించి వెల్లుల్లి వేసిన తిరగమోత వాసనలు గుబాళిస్తున్నాయి. పది నిమిషాల తర్వాత రెడ్డెమ్మ బయటకు వచ్చింది. స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకొని, తల దువ్వుకొని, బొట్టు దిద్దుకుంది. అంత ఆస్తిపరురాలైనా ఎక్కడా ఇసుమంత గర్వంగాని, అతిశయంగాని లేవు.

“రాండి సామీ, బోజనాలు వడ్డిచ్చా” అన్నది.

బాజిరెడ్డి భార్యను ఎగాదిగా చూసి అన్నాడు. “సామీ, మా రెడ్డెమ్మ సూడు కిస్నకుమారి లెక్క తయారైనాది.” అన్నాడు. రెడ్డెమ్మకు సిగ్గు ముంచుకొచ్చింది.

“ఏందా పోకిరి మాట్లు. సామేమనుకుంటాడు? ఈ మంచికి ఇంగితం ఎప్పుడొచ్చాదో ఏమో” అనుకుంటూ లోపలికి పోయింది.

బాజిరెడ్డి లేచి చెక్క బీరువాలోంచి తెల్లటి ఇస్త్రీ పంచ తీసి యిచ్చాడు. మెత్తని టర్కీ టవలు కూడ. పతంజలి పంచె కట్టుకుని, ప్యాంటు షర్టు గోడకున్న కొయ్యలకు తగిలించాడు. టవలు భుజాల చుట్టూ కప్పుకున్నాడు. ఇంటి ముందు జామ చెట్టు క్రింద ఒక గోలెంలో నీళ్లు, ఇత్తడి చెంబు ఉన్నాయి. మట్టి అంటుకోకుండా ఒక నాప బండ వేసి ఉంది. దానిమీద నిలబడి కాళ్లు చేతులు ముఖం కడుక్కుని శుభ్రంగా తడుచుకున్నాడు.

ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఒక దుప్పటి నిలువుగా నాలుగు మడతలు వేసి కూర్చోడానికి వీలుగా పరచి ఉంది. రెండు ప్లేట్లు పెట్టి ఉన్నాయి. ఒకటి స్టీలుది, మరొకటి వెండిది. “నీవు ఈడ కూసో” అని వెండి ప్లేటు ముందు కూర్చోబెట్టాడు. తానూ కూర్చున్నాడు.

రెడ్డెమ్మ అన్నం వడ్డించింది. వంటలు అద్భుతంగా ఉన్నాయి. చుక్కకూర పచ్చడి గోంగూర పచ్చడికేం తీసిపోలేదు. జొన్న రొట్టెవేసింది. అది మృదువుగా పొరలు పొరలుగా వస్తూంది. తింటూంటే కొరివికారం ముద్ద వడ్డించి దాని మీద నెయ్యి వేసింది. జొన్న రొట్టెకు అది బ్రహ్మాండమయిన కాంబినేషన్‌. మామిడికాయ పప్పు కూడ బాగుంది. కొత్త పిందెలేమో వగరు చావడానికి కొంచెం చింతపండు వేసినట్లుంది. సొర్రకాయ కూరలో కొంచెం పాలు వేసి, నువ్వుల పొడి దంచి వేసింది. కమ్మగా ఉంది. చారు చేయలేదు. ఇంట్లోనే పాడి ఉంది కాబట్టి పెరుగు కూడ గడ్డగా, రుచిగా ఉంది.

“ఎట్టుండాయో ఏమో నా వంటలు. సామికి నచ్చినాయో లేదో” అన్నదామె.

“అమ్మా, నీ ముందు పొగడకూడదు కాని, ఉల్లిపాయలు, వెల్లుల్లి తప్పిస్తే అంతా మా అమ్మ వంటలాగే ఉంది. ముఖ్యంగా సొర్రకాయ కూర, చుక్కాకు పచ్చడి మా యింట్లో కూడ ఇట్లే చేసుకుంటాము. జొన్న రొట్టె మాత్రం మీరు చేసినంత నేవళంగా మా ఇండ్లల్లో చేయలేరు” అన్నాడు మనస్ఫూర్తిగా పతంజలి.

రెడ్డెమ్మ ముఖం పొద్దు తిరుగుడు పువ్వులా కళకళాలాడిరది. మగనివైపు చూసి నవ్వింది.

“నీవొచ్చినావని, మెచ్చుకోవాలని, ఇయన్నీ యింత బాగా జేసినాది గాని, దినాము నాకు జేసి పెట్టేవి మాత్రం యిట్టుండవులే సామీ. మల్ల పిల్లలు సెలవుల కొచ్చినపుడు గూడ్క బాగా చేచ్చాది” అన్నాడు బాజిరెడ్డి.

“ఆయన మాటలు నమ్మగాకు సామీ” అనిందామె నవ్వుకుంటూ.

వాళ్లిద్దరి పరస్పరాధిక్షేపణలో నిక్షిప్తమై ఉన్న అనురాగాన్ని గ్రహించి, పతంజలికి ముచ్చటేసింది.

చేతులు కడుక్కొని బయట రూములో కూర్చున్నారు. ఒక ప్లేటులో తమలపాకులు, సున్నండబ్బా, వక్కపేళ్లు పెట్టుకొని వచ్చింది రెడ్డెమ్మ “నాకు తాంబూలం అలవాటు లేదమ్మా” అన్నాడు.

బాజిరెడ్డి తమలపాకులకు ఈనెలు తీసి, సున్నం పలుచగా రాసి, వక్క లోపలపెట్టి మడిచి నోట్లో పెట్టుకున్నాడు.

“నేను హైద్రాబాదులో రాసిన పరీక్షల రిజల్టు వచ్చింది. బాజిరెడ్డీ! నూటికి ఎనభై ఐదు మార్కులు వచ్చినాయి. నాతో పాటు పరీక్షలు రాసిన పదివేల మందిలో నాకు మూడో ర్యాంకు వచ్చింది. నా పేరు ఇంగ్లీషు పేపర్లో వేశారు” అని చెప్పాడు పతంజలి. ఆపరేషన్‌ అయింతర్వాత మొన్ననే ఇంటికి వచ్చిన మనిషికి, ముందు అతన్ని పరామర్శించకుండా తన గొప్ప చెప్పుకోవడం బాగుండదని వస్తూనే చెప్పలేదు.

విన్న బాజిరెడ్డి సంతోషం పట్టలేకపోయాడు. పతంజలిని కూర్చుని ఉండగానే వాటేసుకున్నాడు.

“మ్మేవ్‌! బెరీన రా” అని భార్యను పిలిచి, ఆమె వస్తూనే శుభవార్త చెప్పాడు. ఆమె ముఖంలో కూడ సంతోషం వెల్లివిరిసింది.

“నీవు మామూలోనివి కాదు సామీ. సేద్యము, టూషన్లు, ఇన్ని బెట్టుకోని అంత సదువు సదివితివి. నీ పాసుగూల. నీ లెక్క ఊరికొకడుంటే సాలు” అన్నాడు.

లోపలికి వెళ్లి ఎమ్మెల్లే అంచు కావిరంగు కొత్త పంచె కొత్తది టర్కీ టవలు ఒక కవర్లో బెట్టి, తాంబూలంలో నూట పదహార్లు పెట్టి భార్యతో సహా పతంజలి కాళ్లకు నమస్కరించారు. పతంజలి నొచ్చుకున్నాడు.

“పెద్దవాళ్లు. మీరు నాకు నమస్కరించకూడదు” అన్నాడు.

“వగిసులో సిన్నోడివయినా నీలో ఉన్న సరస్వతిదేవికి మొక్కకుంటే ఎట్లా” అన్నాడు.

“నీవు మంచి బట్టలేసుకొని దర్జాగా ఉండాల సూడు. రేప్పొద్దున పెద్ద ఉద్యోగంలో చేరినంక నీకాడికొస్తే నన్ను ఎట్ట జూసుకుంటావో ఏమో!”

“నేనెంతటివాడినయినా నా మూలాలు మరచిపోను బాజిరెడ్డీ!” అన్నాడు పతంజలి.

పతంజలి వెంట తానూ చెరువుకట్ట వరకు వచ్చి బస్సెక్కిస్తానని తయారయ్యాడు. “ఎండలో నీవు అంత దూరం నడవకూడదు” అంటే వినడు. “పోనీ ఎవర్నయినా జీతగాడిని పంపించు అదీ నీ తృప్తి కోసం” అంటే చివరికి ఒప్పుకున్నాడు.

చెరువు కట్ట దగ్గర పది నిమిషాలు నిలబడితే నంద్యాల కర్నూలు ఆర్డినరీ బస్సు వచ్చింది. అక్కడ ఎక్స్‌ప్రెస్‌ లేవీ ఆగవు.

రాజవిహార్‌ సెంటర్లో దిగే సరికి మూడు దాటింది. జిల్లా పరిషత్‌ ఎదురుగా ఉన్న బాటా షోరూంలోకి వెళ్లాడు. తన సైజులో బెల్ట్‌ టైపువి చూపించమన్నాడు. షోకేసులో మాడల్స్‌ చూసుకోమన్నాడాషాపతను. ఒకటి సెలెక్ట్‌ చేసి చూపించాడు.

అలాంటివి మూడు నాలుగు రకాలు పతంజలి ముందు వేశాడు. నేరేడు పండు రంగులో పాదం అంతా కవర్‌ చేస్తూ వెనక బెల్ట్‌ లాంటిది బకిల్‌తో బిగించుకొనేది నచ్చింది. ఇంచుమించు బూటులా ఉంది. ముందు వేళ్లు మాత్రం కనబడతాయి.

“ఈ మోడల్‌ను ‘కవాడీస్‌’ అంటారు సార్‌! ప్యూర్‌ లెదర్‌. తొడిగి అటూ యిటూ నడిచి చూడండి” అన్నాడతను.

వేసుకొని, వెనుక మడమలపైన బెల్టు బిగించుకొని నడిచాడు. మెత్తగా, కంఫర్టబుల్‌గా ఉన్నాయి. విప్పి, రేటు చూసుకున్నాడు. ముఫ్పై తొమ్మిది రూపాయల తొంబై తొమ్మిది పైసలు. బాబోయ్‌ ఇంత ఖరీదా!” అనుకున్నాడు. అంతవరకు పది పన్నెండు రూపాయలకు మించి చెప్పుల కోసం పెట్టలేదు. రాధాసారు గుర్తొచ్చి మంచివి కొనుక్కోకపోతే తిడతాడనుకుని, వాటిని ప్యాక్‌ చేయమన్నాడు. బిల్లు చెల్లించి కవరు పట్టుకుని నడుచుకుంటూ పోలీసు కంట్రోలు రూం కివతల మీనాక్షి లాడ్జి ప్రక్కన ఉన్న ‘అన్వర్‌ వాచ్‌ కో’ లోనికి వెళ్లాడు. షోకేసులో రకరకాల వాచ్‌లున్నాయి.

“ఫేవర్‌ లూబా లో నిన్ననే వచ్చింది. కొత్త మాడల్‌ చూడండి” అంటూ వెనక ఉన్న కేస్‌లో నుండి ఒక వాచ్‌ చూపించాడు. గోల్డ్‌ కలర్‌లో ఉంది. డయల్‌ చాలా అందంగా ఉంది. డేట్‌, నెల కూడ ఉన్నాయి. కీ రాడ్‌ కూడ బంగారం రంగులో మెరుస్తుంది. చెయిన్‌ చిన్న చిన్న పలకలుగా గోల్డు కోటింగ్‌తో మనోహరంగా ఉంది.

“రంగు వెలసిపోతుందా?” అని అడిగాడు.

“సంవత్సరం గ్యారంటీ ఇస్తామండి”

“సీకో కంపెనీవి లేవా?”

“ఉన్నాయి గాని కాస్ట్లీ అండి. జపాన్‌వి కదా”

“చూపించండి”

‘సీకో’ రెండు మూడు రకాలు చూచాడు. నచ్చలేదు.

మొదట చూచింది ధర ఎంతో అడిగాడు.

“నూట ఇరవై ఏడు రూపాయలండి. నా ప్రాఫిట్‌ తగ్గించుకొని నూటిరవైకిస్తాను”

“నూర్రూపాయలకు రాదా”

“రాదండి, నూట పది ఇవ్వండి. చేతికి పెట్టుకుంటారా ఒకసారి?”

పెట్టుకుని చూశాడు. వాచీవల్ల చేతికీ అందం వచ్చినట్లుగా ఉంది. ఒక్కసారి చెల్లెలు తమ్ముళ్లు గుర్తుకువచ్చారు. వాళ్లకు ఏమీ లేకుండా తను విలాసాలకు ఖర్చుపెడుతన్నాడు. ఒక్క క్షణం గిల్టీగా అనిపించింది. కానీ తన మీద అభిమానంతో రాధాసారు ఇస్తున్న కానుకలివన్నీ. లేకపోతే ఆయన ఊరుకోడు.

వాచీని చేతికి అలాగే ఉంచేసుకుని, పాతవాచీని బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఎప్పుడో డోన్‌లో కొన్న వాచీ అది. పాతబడిపోయింది.

అక్కడ నుండి బాస్టియన్‌ రోడ్‌లోని ‘సియారామ్స్‌ షోరూం’కి వెళ్లాడు. రెండు ప్యాంట్లు రెండు షర్ట్సు సెలెక్ట్‌ చేసుకున్నాడు. వెల్దుర్తిలో తిమ్మప్ప టైలరు సరిగ్గా కుట్టడని, వాళ్ల షోరూంకే అనుబంధంగా ఉన్న యాక్స్‌ టైలర్స్‌కు ఇచ్చాడు. బట్టలు కుట్టుకూలీ వెల్దుర్తిలో కంటే ఎక్కువే గాని బాగా కుడతారని పేరు.

టైలరింగ్‌ ఛార్జెస్‌ కూడ చెల్లించగా ఇంకా ముప్ఫై రూపాయలు మిగిలాయి. పిల్లలకు ‘కృష్ణా నేతిమిఠాయి’లో అరకేజీ స్వీట్లు తీసుకున్నాడు. అప్పటికి ఐదున్నర దాటుతూంది. పక్కనే ఉన్న టీ స్టాల్‌లో టీ తాగి, రిక్షా మాట్లాడుకుని రైల్వేస్టేషన్‌ చేరుకున్నాడు. డోన్‌ లోకల్‌ సిద్ధంగా ఉంది. ఎనిమిది లోపలే ఇల్లు చేరాడు. బట్టలు, చెప్పులు, వాచీ, అందరికీ నచ్చాయి. తండ్రి మాత్రం ఏమనలేదు. ఆయనకు ఆడంబరాలు నచ్చవు. ‘కానీ తన పరిస్థితి వేరు. తానొక డిగ్రీ హోల్డర్‌. కాంపిటీటివ్‌ పరీక్షలు రాయడానికి వెళ్లాలి. కొన్ని నెలల తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. కొంచెం డీసెంట్‌గా ఉండటం అవసరం’ అనుకున్నాడు. నాన్నే అంటుంటాడు ‘వస్త్రేణ వపుషావాచా’ అని.

నంద్యాల నుండి బావ ఉత్తరం వ్రాశాడు. వాగ్దేవిని గైనకాలజిస్టు డా॥ నారాయణమ్మ దగ్గరకు తీసుకువెళ్లామనీ, మరో పదిరోజుల్లో డెలివరీ కావొచ్చునని చెప్పారనీ, మహిత, శశిధర్‌ బాగున్నారనీ, అత్తను తీసుకుని పతంజలిని రమ్మనమనీ వ్రాశాడు. ఆ ఇన్‌ల్యాండ్‌ లెటరు మీద డేటు చూశారు. అంటే పోస్టు చేసిన నాలుగురోజులకు వచ్చిందన్నమాట. మరో నాలుగైదు రోజుల్లో పురుడు రావొచ్చు.

(సశేషం)

Exit mobile version