సాఫల్యం-33

4
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[ఎం.ఎ. ఎక్స్‌టర్నల్ పరీక్షలకు దరఖాస్తు చేస్తాడు పతంజలి. హైదరాబాదులో తిరుమలావధానిని కలుస్తాడు. పాఠ్యపుస్తకాలకు, ఫీజు ఆయన ఎబిసిడి సంస్థ ద్వారా సాయం చేయిస్తారు. బాగా వృద్ధిలోకి వచ్చాక పతంజలిని కూడా ఆ సంస్థకు సాయం చేయమంటారు నిర్వాహకులు ఈశ్వరయ్య. ఇంటికి తిరిగి వస్తాడు, పార్సిల్ ద్వారా వచ్చిన పుస్తకాలను తెచ్చుకుంటాడు. ట్యూషన్లు బాగానే సాగుతుంటాయి. గ్రామీణ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం వస్తుంది పతంజలికి. కొన్ని రోజులు చేసి ఆ పని నచ్చక, తండ్రి అనుమతితో రాజీనామా చేస్తాడు. పాత స్నేహితుడు మునికుమార్ కలుస్తాడు. కర్నూలులో రాధాసారుని కలిస్తే – ఆయన కర్నూలులో ట్యూటోరియల్ సెంటర్ పెట్టమని సలహా ఇస్తాడు. మునికుమార్‌ని కూడా కలుపుకుని కర్నూలు వెళ్ళి ట్యూటోరియల్ సెంటర్ కోసం భవనాలు వెతుకుతాడు పతంజలి. ఒక భవనం నచ్చుతుంది. – ఇక చదవండి.]

[dropcap]క్రిం[/dropcap]ద వెల్డింగ్‌ షాపులో అడిగారు ఓనరుగారెక్కడ ఉంటారని. ప్రక్క రోడ్డులోనే గిబ్సన్‌ కాలనీలో దేవసహాయంగారని ఆకుపచ్చ మేడలో ఉంటారని చెప్పారు. వెళ్లి కలిశారాయనను. ఇంటిముందు రెండు నేమ్‌ ప్లేట్‌లున్నాయి. 1. కె. దేవసహాయం. బి.యస్‌.సి. బి.యిడి., స్కూల్‌ అసిస్టెంట్‌, మున్సిపల్‌ హైస్కూల్‌. 2. కె. ఏసుజనని, ఎమ్‌.యస్‌.సి. లెక్చరర్‌ ఇన్‌ కెమిస్ట్రీ, కె.వి.ఆర్‌. గవర్నమెంట్‌ కాలేజ్‌ ఫర్‌ వుమెన్‌.

దేవసహాయంగారు పొట్టిగా నల్లగా ముఖంనిండా స్ఫోటకం మచ్చలతో వికారంగా ఉన్నారు. ఆయన శ్రీమతి మాత్రం అతిలోక సుందరి. ముట్టుకుంటే మాసిపోయే రంగు ఆమెది. పతంజలికి రుక్మిణీ కల్యాణంలోని పోతనగారి పద్యం గుర్తొచ్చింది.

‘వీరిర్వురిన్‌ దగులంగట్టిన బ్రహ్మనేర్పరికదా!’

“రాండమ్మా, ఏం పని మీద వచ్చారమ్మా, కూర్చోండమ్మా” అని కుర్చీలు చూపించాడాయన.

“సార్‌ నా పేరు పతంజలి. ఎమ్‌.ఎ. ఇంగ్లీషు ప్రయివేటుగా చేస్తున్నాను. ఇతను నా స్నేహితుడు మునికుమార్‌. మాది వెల్దుర్తి. S.T.B.C. కాలేజీ ముందు షాపుల మీద మీ టులెట్‌ బోర్డు చూశాము. మేము ట్యూటోరియల్‌ కాలేజీ పెట్టాలనుకుంటున్నాము. మీలాంటి పెద్దల అండదండలు ఆశీర్వాదం కావాలి” అన్నాడు వినయంగా.

“నేను విద్యాసంస్థలకే ఇవ్వాలని చూస్తున్నానమ్మా. మొన్నటివరకు ఒక ఫైనాన్సు కార్పొరేషన్‌ వాళ్లు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్ల కిచ్చి తిప్పలుబడినా. మీరు తీసుకుంటానంటే సంతోషమే. బాడుగ మాత్రం నెలనెలా టంచనుగా ఇవ్వాలమరి. బిల్డింగ్‌ చూపిస్తాను పదండి” అంటూ లుంగీమీదే షర్టు వేసుకొని హవాయి చెప్పులు వేసుకొని వచ్చాడు. మెట్లు ఒక పక్కగా ఉన్నాయి. ఎక్కి పైకి వెళ్లారు. మొదటి రూము చిన్నది. మిగతా నాలుగూ విశాలంగా ఉన్నాయి. అన్నీ చూసి సంతృప్తి చెందారు.

“మెట్ల దగ్గర బాత్‌రూం కమ్‌ టాయిలెట్‌ ఉంది. అది మీకే. నీళ్లకు బోరింగ్‌ ఉంది. తాగడానికి మున్సిపల్‌ వాటర్‌ వస్తుంది. ట్యాప్‌ బాత్‌రూం పక్కనే అని చూపించాడు.

మళ్లీ తన యింటికి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టాడు. “జననీ! టీలు పంపిచు” అని లోపలికి కేకవేశాడు. పనిపిల్ల టీలు తెచ్చింది. మేడం గారు కూడ వచ్చారు. ఆమెకు నమస్కరించారు.

“బాడుగ ఎంతో చెబితే…” అన్నాడు పతంజలి.

“నెలకు ఐదువందలివ్వండి” అన్నాడాయన. ఇంకా ఎంత చెప్తాడో అనుకున్నారు మిత్రులు. అది మెయిన్‌ రోడ్డు. ఎదురుగ్గా కాలేజీ చుట్టూ స్కూలు కాలేజీలే స్టేషన్‌కు దగ్గర.

“సార్‌ మీరేం ఎక్కువ చెప్పలేదుగాని. మేం నిరుద్యోగులం. మామీద దయతో కొంచెం తగ్గిస్తే మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాం” అన్నాడు మునికుమార్‌.

“సరే నూర్రూపాయలు తగ్గించండి” అన్నాడాయన ఉదారంగా.

“థ్యాంక్యూ సార్‌” అన్నారు. మేడంగారు కూడ ప్రసన్నవదనంతో చూస్తున్నారు.

“మరి అడ్వాన్సు?”

“ఒక నెలదివ్వండి చాలు”

“సర్‌ మీరనుమతిస్తే ముందు రూములో ఆఫీసు పెట్టుకుంటాము. మూడు రూముల్లో క్లాసులు జరుగుతాయి. చివరి రూములో మేం ఉంటాం”

“అంతేకదా మరి” అన్నాడాయన.

వెంటనే నాలుగువందలు తీసి ఆయనకిచ్చేశారు. “నాకు వారం టైమివ్వండమ్మా. రూములన్నీ శుభ్రం చేయించి నీట్‌గా వైట్‌వాష్‌ చేయిస్తా” అన్నాడాయన.

ఇద్దరికీ నమస్కరించి వచ్చేశారు.

వెంటనే రాధాసారుకు విషయం చెప్పారు. “మంచి సెంటరది” అన్నాడాయన.

“ఐదు రూములు నాలుగొందలకిచ్చినాడా. మీ మంచితనం చూసి ఇచ్చుంటాడు.”

దేవసహాయం గారి రూపం వెనుక ఉన్న సహృదయతను. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పతంజలి అర్థం చేసుకున్నాడు. తన మంచితనంతోనే బహుశా తనకు రూపంలో ఏమాత్రం పోలిక లేని అందమైన భార్య మనస్సు గెల్చుకుని ఉంటాడని అనిపించింది. విశ్వకవి వాక్యం గుర్తొచ్చింది. “అప్పియరెన్సెస్‌ ఆర్‌ డిసెప్టివ్‌”. మొదట్లో ఆ భార్యాభర్తల మీద తేలిక భావం కలిగినందుకు పశ్చాత్తాపపడ్డాడు.

సరిగ్గా వారం రోజులకు దేవ సహాయంగారు బిల్డింగ్‌ హ్యాండోవర్‌ చేసి తాళాలిచ్చారు. గోడలకు లేత ఆకుపచ్చరంగు డిస్టెంపరు వేయించి, తలుపులకు కిటికీలకు కూడ మెరూన్‌ కలర్‌ వేయించాడు. భవనానికి ఒక కొత్త కళ వచ్చింది.

రాధాసారు మొదటి విడతగా మూడు వేలిచ్చారు వాళ్లకు. ముందు ఆఫీసు రూం సెట్‌ చేయాలి. పార్క్‌ రోడ్‌లోని ‘ఇక్బాల్‌ ఫర్నిచర్‌’ అన్న షోరూంకు వెళ్లి గాద్రెజ్‌ టేబులు, ఆఫీస్‌ ఛెయిర్‌ ఎంతో విచారించారు. వాటి ధర విని బిత్తరపోయారు. షాపు యజమాని అన్నాడు. “మా దగ్గర మంచి కలపతో చేసిన ఫర్నిచరుంది సాబ్‌. టేబుల్‌ మీద సన్‌మైక్‌ షీట్‌ బిగించారంటే నీట్‌గా ఉంటుంది. కుర్చీలు కూడ వుడెన్‌వి ఉన్నాయి. వాటి మీద మంచి డిజైన్‌ చేయించినాము. పదండి చూపిస్తా.”

అతని వెంటన షాపు వెనుకనున్న గోడౌనుకు వెళ్లారు. నిజంగా బాగున్నాయి. గాద్రెజ్‌ రేటుకు నాలుగో వంతు ధరలో ఉన్నాయి. ఒక టేబుల్‌, పతంజలి కూర్చోడానికి ఒక మంచి ఛెయిర్‌, విజిటర్స్‌కు మరో రెండు ఛెయిర్స్‌ సెలెక్ట్‌ చేశారు. అతని దగ్గర మూడు అరలున్న చిన్న వుడెన్‌ బీరువా ఉంది. దాన్ని కూడ తీసుకున్నారు. ఇనుప బెంచీలు కూడ చాలా ఖరీదుగా ఉన్నాయి. వుడెన్‌ బెంచీలు కూడ చూపించాడు. అవి కూడ పాలిష్‌ చేసి, నీట్‌గా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రతిరూమ్‌లో నాలుగు చొప్పున డజను బెంచీలు తీసుకున్నారు. టేబుల్‌ మీద బిగించే సన్‌ మైక్‌ (డెకోలం) షీటును సెలెక్ట్‌ చేశారు. అన్నీ కలిపి పధ్నాలుగు వందలయింది. అన్నింటి మీద నూటయాభై తగ్గించాడతను. ట్రాన్స్‌ఫోర్టు ఖర్చు తానే భరిస్తానన్నాడు. “ఇంతకీ మీ కాలేజి పేరేంది సార్‌?” అని అడిగాడు. అప్పటివరకు వారికి కూడ ఏం పేరు పెట్టాలనే ఐడియా లేదు.

“ఇంకా పేరు పెట్టలేదు” అని చెప్పారు.

అక్కడనుండి వన్‌టౌన్‌కు వెళ్లి ‘రాయలసీమ ఫోటో ఫ్రేం వర్క్స్‌’ అనే షాపుకు వెళ్లారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి ఫోటో ఫ్రేమ్‌ పెద్దది తీసుకున్నారు. ఆయన ఎంత మనోహరంగా ఉన్నాడంటే

“ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ

మన్యేన సింధు తనయామవలంబ్య తిష్ఠన్‌

వామే తరేణ వరదాభయ హస్త ముద్రాం

లక్ష్మీనృసింహమమ దేహి కరావలంబమ్‌”

అని ఆదిశంకరులు వర్ణించినట్లుగా ఉన్నాడు. శ్లోకంలో లేని ప్రహ్లాద కుమారుడు కూడ ఉన్నాడు పటంలో.

వెనక్కు వస్తుంటే గోడమీద వ్యాపార ప్రకటన పెయింట్‌ చేస్తున్న ఒకతను “శర్మా, పతంజలీ!” అని పిలవడం వినిపించి అటు వెళ్లారు. అతనెవరో కాదు తన క్లాస్‌మేట్‌ ఉస్మాన్‌. “అరే ఉస్మాన్‌ నీవా? నీవు ఆర్టిస్టువా! వెరీగుడ్‌. మనం కలిసి చాలా ఏండ్లయింది. నన్నెలా గుర్తుపట్టావ్‌” అన్నాడు పతంజలి.

“గుర్తుపట్టనంత మకురు (పొగరు) ఇంకా ఎక్కలేదులే బొమ్మన్‌” అన్నాడు వాడు. “అంటే నాకెక్కిందంటావా ముసల్మాన్‌!” అన్నాడు పతంజలి. ముని కమార్‌ను పరిచయం చెయ్యబోతే “నాకెందుకు తెలియదు. సుంకయ్య సారు కొడుకు గద!” అన్నాడు.

అందరూ ఎదురుగా ఉన్న టీ కొట్టులో చాయ్‌ తాగారు.

“ఇప్పుడు చెప్పు నీ సంగతి”

“ఆదోనిలో మా మామ కాడ ఉండి చదువుకున్నా. బి.యస్‌సి, బి.యిడి అయింది. టీచరుద్యోగం రాలేదు. ఆదోనిలోనే మా మామ కాడ పెయింటింగ్‌ నేర్చుకున్నా. పెండ్లి కూడ అయింది. ఒక ఆడపిల్ల, మా మామ ఈడనే బంగారుపేటలో ఎలక్ట్రిక్‌ షాపు నడుపుతాడు. ఆయనకీ కొడుకులు లేరు. ఇద్దరూ బిడ్డలే. పెద్దల్లుడు బిడ్డ వనపర్తిలో ఉంటారు. ఆయన సొంత ఊరదే. కూల్ డ్రింక్స్ షాపుంది. మా నాయన చనిపోయినంక అమ్మను మా మామ ఆదోనికి తీస్కపాయె. చెల్లెలికి పెండ్లి జేసినాం. బావ లారీ దోల్తాడు. వాండ్లు గుంతకల్‌లో ఉంటారు. దానికి ఒక కొడుకు. నేను మామకాడనే ఉండా. టీచరు జాబ్‌ వచ్చేంతవరకు ఈ పనులు చేసుకుంటున్నా”

“అయితే ఇల్లరికపు అల్లునివన్నమాట. ఇల్లరికంలో ఉన్న మజా అనుభవించితే తెలియనులే” అన్నాడు పతంజలి.

“అదేం లేదు. ఇంటిబాడుగ తప్ప అన్ని ఖర్చులు లెక్కగట్టి తీసుకుంటాడు మా మామ. అయితే గౌరవంగ చూస్తాడు. మరి మీరు?”

తమ విషయం అంతా చెప్పాడు పతంజలి.

“అయితే నన్నూ మీలో కలుపుకోండి. సైన్స్‌ మ్యాథ్స్‌ చెపుతా. మన అడ్వర్టయిజుమెంట్సు, వాల్‌ రైటింగ్స్‌, అన్నీ చేస్తా. నాకేమీ ఇవ్వక్కరలేదు. మెటీరియల్‌ తీసిస్తే చాలు” అన్నాడు ఉస్మాన్‌.

“తప్పకుండా! నేను ఆర్ట్స్‌, మునికుమార్‌ కామర్స్‌, నీవు సైన్సు, మనకు ఎదురుండదు”

వెన్యూ గురించి చెప్పారు.

“ముందు ఒక మంచి బ్యానర్‌ రాసి బిల్డింగ్‌కు కట్టాల. మన సంస్థ పేరేమిటి?”

“అది రాధాసారు నిర్ణయిస్తారు”

అందరూ రాధాసారు దగ్గరకెళ్లారు. ఫర్నిచర్‌ తీసుకున్నట్లు చెప్పారు.

“మన సంస్థకు పేరు పెట్టండి సర్‌!” అని అడిగారు.

పతంజలి దగ్గరున్న నరసింహస్వామిని చూచి రాధాసారు అన్నాడు

“శ్రీ లక్ష్మీనరసింహ ట్యూటోరియల్స్‌ అని పెడితే?”

“వద్దు సార్‌. అన్ని వర్గాలవాళ్లనూ ఆకర్షించే మాడ్రన్‌ పేరు కావాలి. స్వామి నిరంతరం మాతోనే ఉంటాడు.”

అందరూ ఆలోచనలో మునిగిపోయారు.

చివరికి మునికుమార్‌ అన్నాడు. “సక్సెస్‌! ‘సక్సెస్‌ ట్యూటోరియల్స్‌’ అని పెడితే ఎలావుంటుంది.”

“వండర్‌ఫుల్‌! చాలా బాగుంది!” అన్నాడు రాధాసారు.

పతంజలికీ, ఉస్మాన్‌కూ నచ్చింది. “నేను రేపే బ్యానర్‌ రాసుకొని వచ్చేస్తా. నాకొక ఇరవై రూపాయలివ్వండి. ‘ఓపెనింగ్‌ షార్ట్‌లీ సక్సెస్‌ ట్యూటోరియల్స్‌’ అని మాత్రం ఉంటుంది. మెయిన్‌ రోడ్‌ కాబట్టి అందరూ చూస్తారు” అన్నాడు ఉస్మాన్‌.

అందరూ రాధాసారు దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. ఉస్మాన్‌ కూడ బిల్డింగు చూచి చాలా బాగుందన్నాడు. ఐదు రూముల పొడవునా తలుపుల పైభాగాన మూడడుగుల వెడల్పున గోడ ఉంది. దానిమీద నీలం పెయింట్‌ వేసి, వైట్‌ పెయింటుతో అక్షరాలు రాస్తానన్నాడు. ‘సక్సెస్‌ ట్యుటోరియల్స్‌’ అన్నది క్యాపిటల్స్‌లో వ్రాసి, గోడకు యిరువైపులా కొంత స్థలం వదిలి కోచింగ్‌ యిచ్చే కోర్సుల వివరాలు రాద్దామన్నాడు. ప్రతి రూము ద్వారబంధంమీద ‘ఆఫీస్‌’, క్లాస్‌ రూం 1, క్లాస్‌ రూం 2, క్లాస్‌ రూం3 అని వ్రాస్తే బాగుంటుందన్నాడు. రూముల్లో మంచి మంచి సూక్తులు రూముకు రెండు మూడు ఇంగ్లీషులో సెలెక్ట్‌ చేసి యిస్తే బ్లాక్‌ పెయింటింగ్‌తో రాస్తే ఆకర్షణీయంగా ఉంటుందన్నాడు. అన్ని రూముల్లో వన్‌ ఇంచ్‌ మందం ప్లైవుడ్‌ షీడ్స్‌ గోడకు ఫిక్స్‌ చేయించి దానిమీద బ్లాక్‌ బోర్డు పెయింట్‌ డబుల్‌ కోటింగ్‌ యిస్తే చాక్‌ పీసులు బ్రహ్మాండంగా రాస్తాయన్నాడు.

ఉస్మాన్‌కున్న అవగాహనకు, చొరవకు చాలా సంతోషించారు పతంజలి, మునికుమార్‌.

“టౌన్‌లో అక్కడక్కడ వాల్‌ రైటింగ్స్‌ ఉండాలి”

“అవును కొన్ని చోట్లు ఖాళీ ఉన్నవి చూసుకొని, ముందు వైట్‌ వాష్‌ చేయించి దానిమీద బ్లాక్‌ బోర్డు పెయింట్‌తో రాస్తే సరి. బార్డరిస్తే నీట్‌గా కనపడుతుంది.”

ముని అన్నాడు. “టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో, బుక్‌షాపుల్లో, సెంటర్లలో ఉన్న హోటళ్లలో చిన్న చిన్న సైన్‌ బోర్డులు పెడితే బాగుంటుంది.”

“అవును. టు ఎమ్‌ఎమ్‌ మందం ప్లైవుడ్‌ షీట్లు రెండు మూడు తీసుకొని రెండున్నర అడుగుల పొడవు, అడుగున్నర వెడల్పు ముక్కలు కోయిద్దాము. బ్యాక్‌ గ్రౌండ్‌ వైట్‌ వేసి లెటర్సు ఒక్కోలైను ఒక్కోరంగులో రాస్తాను. రెండు పెద్దషీట్లు కొంటే దాదాపు ఇరవై పీసులపైనే వస్తాయి” అన్నాడు ఉస్మాన్‌.

ఈలోగా ఫర్నిచర్‌ షాపునుండి కుర్చీలు, బెంచీలు, టేబులు, బీరువా అన్నీ ఒక మినీ వ్యానులో పంపించారు. ఇద్దరు వాటిని పైకి అందిస్తుంటే వీళ్లు ముగ్గురూ అందుకున్నారు. అందరూ కలిసి ఫర్నిచరంతా రూముల్లో సర్దారు. టేబుల్‌ మీద రోజ్‌వుడ్‌ కలర్‌లో చిన్న సెల్ఫ్‌ డిజైనున్న డెకొలంషీటు ఫిక్స్‌ చేసి పంపారు. ఇక గ్లాస్‌ గాని, టేబుల్‌ క్లాత్‌గాని అవసరం లేదు. క్రింద వెల్డింగ్‌ షాపువాళ్లను రిక్వెస్ట్‌ చేసి, నరసింహస్వామి పటాన్ని గోడకు ఫిక్స్‌ చేయించారు. పటం క్రింద నాలుగంగుళాల వెడల్పున తెల్లని ఐరన్‌ షీటు కొట్టించారు. దీపారాధన సిమ్మెలు, పూజా ద్రవ్యాలు దానిమీద చక్కగా అమరుతాయి. స్వామి పటం నానుకొని పైన నిరంతరం వెలిగే బల్బును ఏర్పాటు చేయాలనుకున్నాడు పతంజలి. మా మామ షాపులో ఎలక్ట్రీషియన్‌ను పిల్చుకొచ్చి రేపే ఆ పని చేయిస్తానన్నాడు ఉస్మాన్‌.

ప్రతి రూములో దేవ సహాయంగారి ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఉన్నాయి. ముందే రిక్వెస్ట్‌ చేసి అవన్నీ ఉంచేయమని అడగకపోతే ఆయన వాటిని తొలగించి తీసుకుపోయే అవకాశముందని పతంజలి ఆయనింటికి వెళ్లాడు.

“రావయ్యా, యంగ్‌మ్యాన్‌!” అన్నాడాయన.

“సార్‌ ఒక చిన్న మనవి. రూముల్లో ఫ్యాన్లూ లైట్లూ దయచేసి ఉంచేస్తే మీకు ఋణపడి ఉంటాము” అన్నాడు.

“అంతే కదమరి!” అన్నాడాయన. మహానుభావుడు ఆయన నోటివెంట “నో” అన్న పదమేరాదు అనుకున్నాడు పతంజలి. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాడు. వీళ్లిద్దరూ వెల్దుర్తికి, ఉస్మాన్‌ యింటికి వెళ్లిపోయారు.

పొద్దున లోకల్‌కు ఇద్దరూ వచ్చేశారు. ఇన్‌స్టిట్యూట్‌ దగ్గరకు కాసేపట్లో ఉస్మాన్‌ చేరుకున్నాడు. రాత్రే తండ్రినడిగి మంచిరోజు నిర్ణయించుకొని వచ్చాడు. ఎల్లుండి త్రయోదశీ శుక్రవారం. పతంజలి పేరున తారాబలం బాగుందని చెప్పాడు నాన్న. ఆరోజు అందర్నీ కర్నూలుకు రమ్మన్నారు. రాధాసారునూ ఆయన కుటుంబాన్ని పిలిచాడు. శంకరయ్య సారును ఆహ్వానించాడు.

ముగ్గురూ వెళ్లి పెయింట్స్‌, బ్రష్‌లు, ఫ్లైవుడ్‌ పీసులు, బ్లాక్‌ బోర్డు పెయింట్‌, బ్లాక్‌ బోర్డులకు కావలసిన ప్లైవుడ్‌ అంతా తెచ్చుకున్నారు. ఉస్మాన్‌ తనకు సహాయంగా ఒక పెయింటర్‌ కుర్రవాడిని తెచ్చుకున్నాడు. క్రింద ఒక నిచ్చెన సంపాదించి సాయంత్రానికల్లా మెయిన్‌ బోర్డు పెయింట్‌ చేశారు ఉస్మాన్‌. ఆ గోడ దాదాపు యాభై అడుగుల పొడవు మూడుడగుల వెడల్పుంది. అటు పది, ఇటు పది అడుగులు వదిలేసి బ్లూ పెయింట్‌ బాగా ఆరిన తర్వాత ‘సక్సెస్‌ ట్యుటోరియల్స్‌’ ‘SUCCESS TUTORIALS’ అని క్యాపిటల్స్‌లో వ్రాశాడు. ఒక్కో అక్షరం దాదాపు రెండడుగుల వెడల్పు, రెండడుగుల ఎత్తు వచ్చింది. అక్షరాలు వైట్‌ కలర్‌లో రాసి, వాటికి రెడ్‌ కలర్‌ షేడ్‌ యిచ్చాడు. రెండు వైపుల కోచింగ్‌ ఫర్‌ యస్‌.యస్‌.సి. ఇంటర్‌, డిగ్రీ (రెగ్యులర్‌ సప్లిమెంటరీ) ఉస్మానియా బి.ఎ. (వన్‌ సిట్టింగ్‌) ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్ట్‌ డిగ్రీ ఎంట్రన్స్‌, గ్రామర్‌, స్పోకెన్‌ యింగ్లీష్‌, కోరుకొండ సైనిక్‌ స్కూలు ఎంట్రెన్స్‌, వర్కింగ్‌ అవర్స్‌ మార్నింగ్‌ 6PM to 12AM Evening 3 PM to 9PM అని రాయించాడు పతంజలి.

ఇదే మ్యాటర్‌ వాల్‌ రైటింగ్స్‌లో చిన్న సైన్‌ బోర్డుల్లో వస్తుంది. రోడ్డు మీద పోయేవాళ్లు వాహనాలు ఆపి బోర్డు చదువుతున్నారు. కొందరు పైకి వచ్చి ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అడగసాగారు. ఈరోజు రాత్రే తానూ అసిస్టెంటూ వాల్‌ రైటింగ్స్‌కు బ్యాక్‌ గ్రౌండ్‌ వైట్‌ డిస్టెంపర్‌ వేస్తామనీ, అందరం కలసి చోట్లు సెలెక్ట్‌ చేద్దామనీ అన్నాడు.

ముగ్గురూ ఊరంతా తిరిగి మెయిన్‌ రోడ్లునానుకొని ఉన్న కాంపౌండ్‌ వాల్స్‌ మీద దాదాపు ముఫై ప్లేసులు సెలెక్ట్‌ చేశారు. రాజ విహార్‌ సెంటరు నుండి జనరల్‌ హాస్పిటల్‌ వైపు వెళుతూంటే హంద్రీనది బ్రిడ్జి వస్తుంది. అది దాదాపు మూడు వందల మీటర్ల పొడవుంటుంది. దానికిరువైపులా సిమెంట్‌ రెయిలింగ్‌ ఉంది. దాదాపు అరడుగు మందం ఉందది. దాని పైభాగం అడుగు వెడల్పున నీట్‌గా ఉంది. ఉస్మాన్‌కు ఒక ఆలోచన వచ్చింది. రెండు వైపులా పై భాగాన కేవలం సక్సెస్‌ ట్యుటోరియల్స్‌ Opp: S.T.B.C College అని పది పదిహేను చోట్ల వ్రాస్తే బాగుంటుదన్నాడు. దానికి బ్యాక్‌గ్రౌండ్‌ కూడ వేయనవసం లేదు. ఏదో వెలిసిపోయిన లైట్‌ కలర్‌ ఉంది.

మూడువేలూ ఐపోయినాయి. మళ్ల రాధాసారు దగ్గరకు వెళితే ఆయన మరో మూడు వేలిచ్చారు. వీళ్ల టిఫిన్లు, టీలు, భోజనాలకే డబ్బు అవుతూంది. రాత్రికి మాత్రం అందరూ ఇంట్లో తింటున్నారు.

మరుసటి రోజు గౌస్‌ మండీకి పోయి బాజిరెడ్డికి విషయం చెప్పి రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా ప్రారంభోత్సవానికి రెడ్డెమ్మను తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ ముందురోజు రాత్రి వాల్‌ రైటింగ్స్‌కి బ్యాక్‌గ్రౌండ్‌ కోటింగ్‌ వేసేశారు. ఉస్మాన్‌ అతని అసిస్టెంటు రాత్రి ఒంటి గంట వరకు చేశారట. సైకిళ్లు అద్దెకు తీసుకున్నారట. ఈ రోజంతా అసిస్టెంటు చిన్న సైన్‌ బోర్డులకు వైట్‌ పెయింట్‌ వేశాడు. విడివిడిగా ఆరబెట్టారు. ఉదయం వచ్చేటప్పుడే చాప, బొంతలు, దిండ్లు, దుప్పట్లు, రెండు ప్లాస్టిక్‌ బకెట్లు, మంచినీళ్లకు స్టీలు బిందె, రెండు గ్లాసులు, ఒక అద్దం, తెచ్చుకున్నాడు. ముని రెండు పాత గాద్రెజ్‌ ఫోల్డింగ్‌ చెయిర్లు ఇంట్లోవి తెచ్చాడు. ప్రారంభోత్సవం నాటి నుండే రాత్రి ఇన్‌స్టిట్యూట్‌లో నివసించడం ప్రారంభించమని తండ్రి చెప్పాడు.

శుక్రవారం ఉదయమే వర్ధనమ్మ రెండు క్యాన్లతో చింతపండు పులిహోర, చక్కెర పొంగలి చేసింది. అందరూ ఏడు గంటలకల్లా బయలుదేరి వెన్యూ చేరుకున్నారు. ముందురోజే టెంకాయ. పూలు, పండ్లు, ఊదుకడ్లు కర్పూరం లాంటివన్నీ తెచ్చిపెట్టుకున్నారు. ప్రసాదాలు ఇవ్వడానికి చిన్నసైజు విస్తర్లు కూడ స్వామికి వేయడానికి గులాబీల దండ.

ఆఫీసురూములోనే సరిగ్గా తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు రాధాసారుతో రిబ్బన్‌ కట్‌ చేయించారు. మార్కండేయశర్మ పట్టు పంచె కట్టుకొని గణపతి పూజ, నరసింహునికి పురుషసూక్తంతో అభిషేకం, అష్టోత్తర శతనామార్చన చేసి, హారతిచ్చారు. కలశంలోని నీటిని తమలపాకుతో అన్ని రూముల్లో చిలకరిస్తూ, పుణ్యాహవచనం చేశాడాయన. నరసింహస్వామి గులాభీ దండ ధరించి మోరిసిపోతున్నాడు. పటం క్రింది ఐరన్‌ షీట్‌ మీద దీపారాధనలు చేశారు.

పదిన్నరకు కార్యక్రమం పూర్తయింది. పిలిచిన వారంతా వచ్చారు. దేవసహాయం సారు, మేడమ్‌గారు కూడ. అందరికీ విస్తరాకుల్లో ముందు చక్కెర పొంగలి వడ్డించారు వర్ధనమ్మ, మహిత, తర్వాత పులిహోర దాదాపు పదిహేనుమందికి సరిపోయింది. ఇంకా మిగిలితే తీసిపెట్టుకున్నారు.

బాజిరెడ్డి ఐదువందలు పతంజలి చేతిలో పెట్టాడు. శంకరయ్య సారు సరస్వతీ దేవి బొమ్మ ఒక అడుగు ఎత్తున్నది ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసింది బహూకరించాడు. ఆఫీస్‌ టేబుల్‌ మీద దాన్నుంచారు. రాధాసారు తెచ్చిన కానుక విలక్షణంగా ఉంది. పెద్ద గిఫ్ట్ ప్యాక్‌ అది. అది తెరచి చూస్తూంటే నవ్వుతూ చూస్తున్నాడాయన. అందులో ఉన్న వస్తువులివి. ఐదు అందమైన డోర్‌ కర్టెన్లు, ఐదు డోర్‌మ్యాట్‌లు, టేబుల్‌ వెయిట్లు, పిన్‌ కుషన్‌, సక్సెస్‌ ట్యుటోరియల్స్‌ ప్రిన్సిపాల్‌ స్టాంపు, స్టాంప్‌ ప్యాడ్‌, పెన్‌స్టాండ్‌, స్టేప్లర్‌, స్టేప్లర్‌ పిన్స్‌, పంచింగ్‌ మిషను. ఒక ఐదువందల అడ్మిషన్‌ ఫారాలు, ఫీజు రశీదు బుక్కులు ఒక డజను కార్బన్‌ పేపర్లు. కాపీలు తీసే ఒక రోలర్‌ రోనియోమిషన్‌, ఒక గాజు ట్రే, టీలు తెప్పించుకునేందుకు ఒక ప్లాస్కు, పింగాణీ కప్పులసెట్‌, చాక్‌పీస్‌ బాక్సులు డజను, డస్టర్లు ఆరు, వైట్‌ పేపర్లు ఒక గ్రోసు ఇలా తీసేకొద్దీ వస్తున్నాయి. అడుగున పాలిష్‌తో మెరుస్తున్న చెక్క పలకమీద పసుపు పచ్చని అక్షరాలతో పతంజలి శర్మ (ఎమ్‌.ఎ) (లిట్‌), ప్రిన్సిపాల్‌ అని నేమ్‌ ప్లేట్‌ మీద రాసి ఉంది.

పతంజలికి నోట మాట రాలేదు. ఎంత ప్లానింగ్‌! ఎంత ముందుచూపు? ఇంచుమించు ఆఫీసుకు సంబంధించిన స్టేషనరీ, మెటీరియల్‌ అంతా వచ్చినట్లే. కళ్లనిండా నీళ్లతో, గొంతు గద్గదమవగా, రాధాసారు చేతులు పట్టుకొని కళ్లకద్దుకున్నాడు.

దైవసహాయం దంపతులు ఆఫీసులో ఒకవైపు గోడనంతా ఆక్రమించేంత వాల్‌ పోస్టరు బహూకరించారు. జలపాతాలు, అడవులతో, క్రింద పెద్ద తటాకం, బారులుగా ఎగురుతున్న తెల్లని పక్షులతో ప్రకృతి సౌందర్యమంతా ఆయిల్‌ పేపరు మీద ముద్రించబడి ఉంది.

పతంజలిని ప్రిన్సిపాల్‌ సీటులో కూర్చోబెట్టి అభినందనలు, ఆశీస్సులు తెలిపి అందరూ వెళ్లిపోయారు. అమ్మానాన్నలను, చెల్లిని తమ్ముళ్లను బస్సెక్కించి వచ్చాడు.

మరో రెండు రోజుల్లో వాల్‌ రైటింగ్స్‌, హోటల్స్‌, బుక్‌షాప్స్‌, టైప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో చిన్న సైన్‌ బోర్డులు తగిలించడం పూర్తయింది. ఒక వారం తర్వాత క్లాసులు ప్రారంభించాలని అనుకున్నారు. కన్సల్టేషన్‌ వచ్చిన వారితో అడ్మిషన్‌ ఫాం నింపించి, పది రూపాయలు వసూలు చేస్తున్నారు. అది నాన్‌ రిఫండబుల్‌ అని చెబుతున్నారు.

యస్‌.యస్‌.సి వారికి ఉదయం 6 నుండి 8 గంటల వరకు అన్ని సబ్జెక్టులకు ట్యూషన్‌ ఉంటుంది. వారికి నెలకు రూ. 30/- ఫీజు నిర్ణయించారు. ఇంటర్‌ వారికి సాయంత్రం 6 నుండి 8గంటల వరకు వారికి నెలకు యాభై రూపాయలు పెట్టారు. సప్లిమెంటరీ వారికి ఒక్కో సబ్జెక్టుకు నూటయాభై. స్పోకెన్‌ ఇంగ్లీషు కం గ్రామర్‌ క్లాసు రాత్రి 8 నుండి 9 గంటల వరకు అది మూడు నెలల కోర్సు, దాని ఫీజు రూ. 300/- గా నిర్ణయించారు.

రోజూ హోటళ్లలో తినడం వల్ల డబ్బు దుబారా అవుతుందని గ్రహించి, ఇంటినుండి కొన్ని వంటసామాన్లు తెచ్చుకున్నారు. మధ్యాహ్నమే రెండు పూటలకు వండుకుంటున్నారు. ఉస్మాన్‌ మాత్రం ఇంటికి వెళ్లి తిని వస్తున్నాడు. అతను వద్దన్నా వినకుండా అతడు పడిన శ్రమకు రెండు వందలు బలవంతంగా అతని చేతిలో పెట్టారు. యస్‌యస్‌సి వాళ్లు ఇచ్చే ఫీజులను ముగ్గురూ పంచుకోవాలని, సప్లిమెంటరీ వారిచ్చేవి ఎవరి సబ్జెక్టుకు వచ్చే ఫీజు వారికేనని అనుకున్నారు. స్పోకెన్‌ ఇంగ్లీషు ఫీజు మాత్రం పతంజలికే. మిగతా ఇద్దరికీ సంబంధం లేదు. బి.ఎ (ఉస్మానియా) వన్‌ సిటింగ్‌ విద్యార్థులకు వెయ్యి రూపాయలు ఫీజుగా తీసుకుంటారు. ఆర్ట్స్‌ వారిది పతంజలికి కామర్స్‌ వారిది మునికీ చెందుతాయి. అందులో ఉస్మాన్‌కు భాగం లేదు. డిగ్రీ విద్యార్థులకు కూడా ఇదే పద్ధతి. ఎవరు చెప్పుకున్న సబ్జెక్టు ఫీజు వారికే. డిగ్రీ వారికి సబ్జెక్ట్‌ వైజ్‌ ఫీజు నిర్ణయించారు.

***

బోర్డు వర్కు మినిమైజ్‌ చేయడానికి ఇంపార్టెంట్‌ ప్రశ్నలు జవాబులతో స్టడీమెటీరియల్‌ తయారు చేసి ఇవ్వాలని భావించారు. స్టెన్సిల్‌ పేపరు మీద టైపు చేయించి రోనియోమిషన్‌ మీద కాపీలు తీసి ఇవ్వాలని ప్లాను.

పతంజలి ఎమ్‌.ఎ. చదువు సాగుతూంది. తెల్లవారు ఝామున నాలుగుకే లేచి ఒక గంట చదువుతున్నాడు. మధ్యాహ్నం ఒక గంట, రాత్రి పదకొండు గంటల వరకు.

జాయినయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి స్టడీమెటీరియల్‌ తయారు చేసుకుందామనుకున్నారు.

క్రమంగా విద్యార్థులు రాసాగారు. యస్‌.యస్‌.సిలో ముఫై రెండు మంది. ఇంటర్‌ రెగ్యులర్‌ అన్ని గ్రూపులు కలిసి యాభైమంది చేరారు. అక్టోబరులో జరిగే సప్లిమెంటరీ ఇంగ్లీషు, కామర్స్‌, మాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టులకు దాదాపు సబ్జెక్టుకు పది పన్నెండు మంది వచ్చారు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ & గ్రామర్‌ కోర్సు బాగా క్లిక్‌ అయింది. టైమింగ్స్‌ కూడా సౌకర్యంగా ఉండడంతో ఉద్యోగస్థులు, గృహిణులు, వ్యాపారస్తులు, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు దాదాపు ముఫై మంది చేరారు.

ఇన్‌స్టిట్యూట్‌ కళకళలాడసాగింది. పిల్లల సైకిళ్లు, పెద్దల స్కూటర్లు పెట్టుకోవడం ఎక్కడ అనేది ఒక సమస్యగా మారింది. దేవసహాయంగారు పూనుకొని, బిల్డింగ్‌ వెనుకనున్న టింబరు డిపోవారికి చెప్పి, కొంత పార్కింగ్‌ స్థలం ఇప్పించారు.

బిల్డింగ్‌ బాడుగ, కరెంటు ఛార్జీలు, సర్వెంట్‌ మెయిడ్‌ జీతం ముగ్గురూ సమానంగా పంచుకుంటున్నారు. దేవసహాయంగారింట్లో పనిచేసే ఒక నడి వయసులో మహిళ ఇక్కడ కూడ చేస్తూంది. ఉదయాన్నే వచ్చి రూములన్నీ ఊడ్చి, మెట్లు కూడ శుభ్రం చేస్తుంది. బాత్‌ రూంలోని తొట్టిలో పది బిందెల నీళ్లు బోరింగ్‌ నుండి కొట్టి తెచ్చి పోస్తుంది. పిల్లల కోసం, ఒక మూల ఇనుపది స్టాండు, కొళాయి బిగించిన పెద్ద కుండ, తాగునీటి కోసం పెట్టారు. పిల్లలెవ్వరూ రెండు గంటల కంటే ఉండరు కాబట్టి టాయిలెట్ల సమస్య లేదు. పని మనిషి తాగునీటి కుండ కూడా నింపుతుంది. నీళ్లకోసం రూములో వేరే కుండ పెట్టుకున్నారు. దాంట్లో మంచినీరు నింపుతుంది. ఆమెకు నెలకు నలభై రూపాయలు జీతం. ఆమె పేరు మస్తానమ్మ.

మెల్లగా పుంజుకుంది స్ట్రెంగ్త్‌. స్పోకెన్‌ ఇంగ్లీషుకు రెండో బ్యాచ్‌కు కూడ మరో ముఫైమంది అడ్వాన్సు చెల్లించి నమోదు చేసుకున్నారు. ఐదారు నెలల్లో దాదాపు రెండు వందలమందయ్యారు. అంతా కలిపి ఇరవై ఎనిమిదివేలు వచ్చింది. రాధాసారుకు కొంత తీర్చబోతే వద్దన్నాడాయన. ఒక అకడమిక్‌ యియర్‌ గడవనివ్వండి అని చెప్పాడు.

‘సక్సెస్‌’లో బాగా చెబుతారని టౌన్‌లో పేరు వచ్చింది. కోరుకొండ సైనిక్‌ స్కూలు ఎంట్రెన్స్‌కు పదమూడు మంది చేరారు. ఉస్మానియా బి.ఎ. వన్‌ సిట్టింగ్‌ ఆరుమంది.

వెల్దుర్తిలో మార్కండేయ శర్మ కూడా ఇంటి ఖర్చులకు సంపాదించసాగాడు. టి.టి.డి వారి తరపున ప్రవచనాలకు వెళ్లి వస్తున్నాడు. పొలం మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఏదో ఒక పంట వేయడం, ఎరువులు, కలుపులు, బాడుగ సేద్యం, తీరా దిగుబడి చూస్తే పెట్టుబడి రావడం లేదు. ‘సక్సెస్‌’ ఆదాయం కొంత భాగం వ్యవసాయమే తినేస్తూంది. పాత అప్పులేవీ తీరడం లేదు.

రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. స్టడీమెటీరియల్‌ తయారు చేస్తున్నారు. దానికి అదనపు ఫీజు వసూలు చేసినా విద్యార్థులు సంతోషంగా యిస్తున్నారు.

అక్టోబరు నాటికి ఎమ్‌.ఎ. ప్రీవియస్‌ సిలబస్‌ అంతా ప్రిపేరయ్యాడు పతంజలి. నోట్సులన్నీ వ్రాసుకున్నాడు. రెఫరెన్సెస్‌ కంపల్సరీ కొశ్చన్‌ కాక నాలుగే ప్రశ్నలు రాయాల్సి ఉంది. కాబట్టి డిటయిల్డ్‌ 2, నాన్‌ డిటయిల్డ్‌ 2 టెక్ట్స్‌ థరోగా ప్రిపేరయ్యాడు. రిస్క్‌ ఫాక్టర్‌ కోసం మరొక టెక్స్ట్‌ చదివాడు. మిగతా మూడు పాఠ్యాంశాలూ ఇగ్నోర్‌ చేశాడు. ఇన్‌స్టిట్యూట్‌ వల్ల అలా చేయవలసి వచ్చింది. అక్టోబరు చివరి వారంలో హాల్‌ టికెట్‌ వచ్చింది. సికింద్రాబాదులోని మహబూబియా కాలేజి సెంటరు. అక్కయ్య వాళ్లింటికి దగ్గర. నవంబరు 13వ తేదీనుండి వరసగా నాలుగు పరీక్షలు.

పన్నెండవ తేదీ మధ్యాహ్నం బస్సులో బయలుదేరి సికింద్రాబాదులోని అక్కయ్యవాళ్లింటికి చేరుకున్నాడు. ట్యుటోరియల్‌ కాలేజీ బాగా జరుగుతున్నందుకు ఇద్దరూ పతంజలిని అభినందించారు. పరీక్ష మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు వరకు. నరసింహస్వామి గుళ్లో అరుగుమీదే చదువుకుంటున్నాడు. రోజూ స్వామికి మొక్కి ఏ ప్రశ్నలు వస్తే తాను బ్రహ్మాండంగా వ్రాయగలడో స్వామికి చెప్పుకుంటే, సరిగ్గా అవే కొశ్చన్‌ పేపర్లో వస్తున్నాయి. చివరి రోజు అందరూ అబిడ్స్‌లో యన్‌టిఆర్‌ ఎస్టేట్‌లోని రామకృష్ణ 70 ఎంఎం థీయేటరులో ఖుర్బాని సినిమాకు వెళ్లారు. పతంజలే అందరికీ టికెట్లు తీశాడు. ఇంటర్వల్‌లో సమోసా, కూల్‌ డ్రింక్స్ ఇప్పించాడు. మేనల్లుళ్లిద్దరికీ రెడీమెడ్‌ దుస్తులు కొన్నాడు.

“బావమరిది దగ్గర కాసులు గలగలలాడుతున్నాయే?” అన్నాడు బావ.

“ఊరుకోండి. మీ దిష్టే తగిలేట్టుంది” అన్నది అక్కామణి. మరుసటి రోజు ఆదివారం.

“నేను బయలుదేరతాను బావా” అన్నాడు పతంజలి.

“ఆదివారమే కదా! రాత్రి బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌కు వెళుదువుగానిలే. ఈరోజు నాకూ సెలవే. అందరం యాదగిరి గుట్టకు వెళ్లి నరసింహస్వామి దర్శనం చేసుకొని వద్దాము” అన్నాడు బావ.

వెంటనే ఒప్పుకున్నాడు పతంజలి.

“చూశావేమే. నరసింహుని ‘మహిమ.’ మీ తమ్ముడు టక్కున సరే అన్నాడు చూడు” అన్నాడు బావ!

“దేవునితో పరిహాసమాడకండి శ్రీవారూ!” అన్నది అక్క.

“నా జీవితంలో ప్రతి విజయానికీ మూలం ఆయన దయే కద బావా!” అన్నాడు పతంజలి.

“చూస్తూండు. స్వామి నిన్ను ఇంకా ఉన్నతస్థాయికి తీసుకుపోతాడు” అన్నది వాగ్దేవి.

ఆదివారం ఉదయాన్నే స్నానాలు చేసి, కాఫీ తాగి సిటీ బస్సులో ఉప్పల్‌కు వెళ్లారు. అక్కడ నుండి ఘట్‌కేసర్‌, భోన్‌గిర్‌ (భువనగిరి) మీదుగా యాదగిరి గుట్టకు బస్సులో చేరుకున్నారు. దాదాపు 2 గంటల ప్రయాణం. ఆదివారం కాబట్టి యాత్రీకులు చాలా ఎక్కువగా ఉన్నారు. బస్సు దిగి మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్నారు. స్వామికి తలనీలాలు సమర్పించాడు పతంజలి. పుష్కరిణిలో స్నానం చేశాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here