Site icon Sanchika

సాఫల్యం-34

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[క్రింద వెల్డింగ్‌షాపులో అడిగి ఓనరు దేవసహాయం గారింటికి వెళ్ళి ఆ గదులు అద్దెకు తీసుకునే విషయం మాట్లాడి వస్తారు పతంజలి, ముని కుమార్. నెలకి నాలుగువందలకి ఒప్పుకుంటారాయన. ఒక వారం గడువిస్తే సున్నాలు వేయించి ఉంచుతానంటారు. ట్యూటోరియల్ సెంటర్‌కి కావలసిన అన్ని వసతులు సమకూర్చుకుంటారు పతంజలి, ముని కుమార్. ఒకరోజు పతంజలి వీధిలో చిన్ననాటి స్నేహితుడు ఉస్మాన్ కలుస్తాడు. బి.యిడి. చేసినా ఉద్యోగం రాకపోతే, గోడల మీద ప్రకటనలు రాస్తూ జీవిక గడుపుతున్నాని చెప్తాడు ఉస్మాన్. అతన్ని కూడా తమతో చేర్చుకుంటాడు పతంజలి. ముగ్గురు ఏయే సబ్జెక్టులు చెప్పాలో, ఎవరి ఫీజు వారు ఎలా తీసుకోవాలో నిర్ణయించుకుంటారు. తండ్రి చూసిన మంచిరోజున ‘సక్సెస్’ ట్యూటోరియల్ సెంటర్ ప్రారంభమవుతుంది. మార్కండేయ శర్మ పూజాదికాలు నిర్వహిస్తాడు. రాధా సారు గొప్ప కానుక ఇస్తారు.  క్లాసులు మొదలుపెడతారు. చక్కని మెటీరియల్ ఇస్తున్నారనీ, బోధన అద్భుతంగా ఉందని పేరొస్తుంది. ఎమ్‌.ఎ. ప్రీవియస్‌ పరీక్షకి బాగా చదివి, పరీక్షలు రాయడానికి హైదరాబాద్ వెళ్తాడు పతంజలి. అక్క ఇంట్లో దిగుతాడు. పరీక్షలు పూర్తయ్యాకా, వారితో కలిసి యాదగిరి గుట్ట నరసింహ స్వామి ఆలయానికి వెళతాడు. పుష్కరిణిలో స్నానం చేస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]స్వా[/dropcap]మి దర్శనం కావటానికి రెండు గంటలు పట్టింది. యథా ప్రకారం గుహాంతర్భాగంలో కొలువై ఉన్నాడు నరకేసరి. పతంజలికి ఒళ్లు గగుర్పొడిచింది. దుఃఖం వెల్లువలా వచ్చింది. సంభాళించుకొని బిగ్గరగా శ్లోకం పఠించాడు.

“మాతానృసింహశ్చపితానృసింహః
భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః
విద్యానృసింహా ద్రవిణం నృసింహః
స్వామీ నృసింహో సకలం నృసింహః”

బుగ్గల వెంట కన్నీరు కారిపోతూన్నది. పూజారులు కూడ డిస్టర్బ్‌ చేయలేదు. క్యూలోని భక్తులు కూడ పతంజలి భక్త్యావేశాన్ని తిలకిస్తున్నారు. తీర్థం తీసుకొని శఠగోప స్పర్శ చేయించుకొని బయటకు వచ్చారు. కౌంటర్లో ప్రసాదాలు కొన్నారు. అప్పటికి పన్నెండు దాటింది.

పతంజలి తలనీలాలు ఇవ్వడానికి వెళ్లినపుడే కొడుకులిద్దరికీ ఇడ్లీ తినిపించింది వాగ్దేవి. అందరూ స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేశారు. దేవస్థానం వారు వేసిన పందిళ్లు క్రింద కాసేపు విశ్రమించి బస్సులో హైదరాబాదు చేరుకున్నారు.

రాత్రి అక్క మునక్కాయల సాంబారు. వంకాయ పచ్చడి చేసి వడియారు వేయించింది. వడియాలను చూస్తే చిన్నోడు గుర్తోచ్చాడు పతంజలికి. “పులుసు చేసిన రోజు వడియాలు వేయించకపోతే అస్సలు ఒప్పుకోడు పాణిని” అన్నాడు.

“నేను కూడ ఒప్పుకోను” అన్నాడు శశి. అందరూ నవ్వుకున్నారు.

అక్కాబావలకు నమస్కరించి ఎనిమిది ముప్పావుకు బయలుదేరాడు. బావ తన స్కూటర్‌లో స్టేషన్‌కు తీసుకొని వెళ్లి ట్రెయిన్‌ ఎక్కించి వెళ్లిపోయాడు. టు టైర్‌ సిట్టింగ్‌లో సీటు దొరికింది. డైరెక్ట్‌గా వెల్దుర్తికి టికెట్‌ తీసుకున్నాడు. తెల్లవారు ఝామున ఇల్లు చేరుకున్నాడు. కాసేపు పడుకొని లేచాడు. అమ్మ భోజనం చేసి వెళ్లమంది.

మహిత ఎలా చదువుతూందో అడిగి కనుక్కున్నాడు. చిన్నోడు హాఫ్‌ యియర్లీ పరీక్షల్లో 93% తెచ్చుకున్నాడు. ఇంగ్లీషులో 93, లెక్కల్లో మాత్రం 79% మాత్రమే.

“మనది లెక్కల మెదడు కాదులేరా!” అన్నాడు తమ్మునితో.

అందరూ వంటింట్లో కూర్చుని కాఫీలు తాగుతున్నారు. తండ్రి పతంజలితో అన్నాడు. “పొలం చుట్టూ కంచె బాగా పెరిగింది. మొన్న తోకోడొచ్చి గుర్తు చేసిపోయినాడు. తొందరగా కొట్టించకపోతే చుట్టుపక్కల వాళ్ల పొలాలకు అడ్డం వస్తుందట.”

ప్రస్తుతం కూలీ ఎనిమిది రూపాయలైంది. ఎంత కాదన్నా రోజూ నలుగురు పనిచేస్తే ఇరవై రోజులు పడుతూంది. అంటే దాదాపు ఏడు వందలు కావాలి.

మళ్లీ అన్నాడాయన, “ఈసారి మొత్తం చేనంతా కొమ్మ శనగవేస్తే బాగుంటుందిరా. రెండు తడులు పారిస్తే చాలు తర్వాత చలికే పండుతుంది. తోకోనికి చెబితే వారంరోజులు దుక్కి దున్ని, గుంటక మరో రెండ్రోజులు తోలతాడు. శనగ విత్తనం ఖరీదెక్కువ. తోలడానికి మనకెలాగూ ఎరువు లేదు. ఎడెనిమిది బస్తాల గ్రోమోర్‌ వేయిస్తే సరి. ఈసారి ఆదివారం నీవు వచ్చేటపుడు ఒక రెండు వేలు తీసుకురా నాయనా!”

పతంజలికి ఉసూరుమనిపించింది. కంచెను ట్రిమ్‌ చేయించడం ప్రతి మూడు నాలుగు నెలలకూ జరగాల్సిందే. అసలు ఆ ప్రతాప కంప చెట్లన్నీ వేర్లతో సహా తొలగించి రాతిస్తంభాలు పాతించి ఇనుప ముళ్లతీగె చుట్టిస్తే ఈ ఖర్చు తగ్గుతుంది. గానీ, దానికి వేలల్లో ఖర్చవుతుంది. పతంజలి ముఖంలోని భావాన్ని గ్రహించి శర్మ అన్నాడు. “పొలాన్ని బీడు పెట్టకుండా ఏదో ఒకటి చేయలిగద నాయనా!”

పదిగంటలకు అమ్మ భోజనాలు వడ్డించింది. వంకాయలు, అలసందలు (బొబ్బర్లు) కలిపి కూటు చేసింది. చేమగడ్డ ముద్దకూర, చారు తిని బయలుదేరాడు. ప్రీవియస్‌ పుస్తకాలన్నీ ఇంట్లో అటక మీద పెట్టి, కొన్ని ఫైనల్‌ పుస్తకాలు తీసుకున్నాడు. అమ్మ రెండు రకాల పొడులు, రెండు రకాల పచ్చళ్లు యిచ్చింది. ఒక క్యారియర్‌ రాత్రి తినడానికి కూటు పోసియిచ్చింది. పన్నెండుకల్లా ఇన్‌స్టిట్యూట్‌ చేరుకున్నాడు.

***

1979

ఒకరోజు పేపర్లో మైసూరు యూనివర్సిటీ వారి ప్రకటన వచ్చింది. “స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, మానస గంగోత్రి, మైసూరు” అని ఉంది. ఎటువంటి విద్యార్హత లేకుండా, ఎంట్రన్స్‌ పరీక్ష లేకుండా 25 సం॥ నిండిన ఎవరయినా డైరెక్ట్‌గా ఎమ్‌.ఎ. పరీక్షకు వెళ్లవచ్చును. కేవలం డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ ఉంటే చాలునట. స్టడీ మెటీరియల్‌ కూడా యూనివర్సిటీ పంపుతుంది. ఇంగ్లీషు, ఇంకా కొన్ని సోషల్‌ సైన్సెస్‌లో ఎమ్‌.ఎ కోర్సు ఆఫర్‌ చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియం మాత్రమే.

వెంటనే రంగంలోకి దిగారు. ఉస్మాన్‌ ఒక బ్యానర్‌ రాశాడు. “డైరెక్ట్‌ ఎమ్‌.ఎ. నో ఎంట్రన్స్‌, నో ప్రీవియస్‌ క్వాలిఫికేషన్‌”. ఇన్‌స్టిట్యూట్‌ ముందు కట్టారు. రెండువేల కరపత్రాలు వేయించి, న్యూస్‌ పేపరు కుర్రవాళ్లకు చెప్పి పేపర్లలో వాటిని పెట్టించారు.

ఒకవారం రోజుల్లో పన్నెండు మంది జాయినయ్యారు. యూనివర్సిటీ ఫీజు రెండు సంవత్సరాలకు కలిపి ఎనిమిది వందలు. ‘సక్సెస్‌’ వారి ఫీజు వెయ్యి రూపాయలు. వారానికి ఐదు రోజులు కోచింగ్. అప్లికేషన్‌ తెప్పించడం నుండి అన్ని బాధ్యతలు సంస్థవే. సెంటరు హైదరాబాదులో కూడ ఉంది.

ముని మైసూరు వెళ్లి పన్నెండు అప్లికేషన్లు తెచ్చాడు. అందులో నలుగురు ఇంగ్లీషు, ముగ్గురు సోషియాలజీ, ఐదుమంది పొలిటికల్‌సైన్స్‌ తీసుకున్నారు. వాళ్లంతా గవర్నమెంటు ఉద్యోగులే. ఒకామె గృహిణి. ఒకాయన భూస్వామి. పూర్తిగా విద్యార్హత లేనివారెవరూ లేదు. అందరూ కారణాంతరాలవల్ల డిగ్రీ డిస్‌కంటిన్యూ చేసినవారే.

మునికి అక్కడ లింగప్పగౌడ అనే ఒక ఉద్యోగి కలిశాడట. ఐదువందలిస్తే రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థుల అడ్రసులన్నీ టైపు చేయించి ఇస్తాడట. వీళ్లకు ఒక ఆలోచన తట్టింది. ఎలాగూ అన్నీ ఎస్సే ప్రశ్నలే. ప్రతి పేపరుకు ఇరవై చొప్పున ‘వెరీ ఇంపార్టెంట్‌’ ఎస్సేలు తయారు చేసి ప్రతి విద్యార్థి అడ్రసుకే ఒక లెటరు పంపాలి. “మీరు తీసుకున్న సబ్జెక్ట్ లో పేపరుకు ఇరవై అతి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తయారు చేశాము. పరీక్షలలో వాటిలో నుండే ఇస్తారు. వాటిని చదువుకుంటే చాలు మీకు ఫస్ట్‌ క్లాసు గ్యారంటీ పేపరుకు వందరూపాయలు చొప్పున ఎమ్‌.ఓ లేదా చెక్కు లేదా డిడి పంపండి. నెలరోజుల్లో మీకు మెటీరియల్‌ పంపుతాము” అని.

యూనివర్సిటీ వారి స్టడీమెటీరియల్‌ చూశాడట ముని. ‘కుక్‌డ్‌ ఫుడ్‌’ లాగా లేదట. ఇంగ్లీషు, హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రోపాలజీలకు మెటీరియల్‌ తయారు చేద్దామని నిర్ణయించారు.

“లంచమిస్తే లింగప్ప గౌడ యూనివర్సిటీ మెటీరియల్‌ కూడా యివ్వొచ్చు. మనం రాసే పని మానేసి సబ్‌హెడింగ్స్‌ మాత్రం నోట్‌ చేసి టైపిస్టుకిచ్చేద్దాం సరిపోతుంది” అనుకున్నారు.

వెంటనే కామన్‌ లెటర్‌ తయారు చేశారు. ముని ఆ రాత్రికే బయలుదేరి మైసూరు వెళ్లి మూడో రోజు అడ్రసుల లిస్టు, స్టడీమెటిరియల్‌ తెచ్చేశాడు. అంతా పదిహేను వందలయింది. లెటరు స్టెన్సిల్‌ పేపరు మీద టైపు చేయించాడు. దాదాపు అన్ని సబ్జెక్టులకు కలిపి రెండు వేలమందికి పైగా అడ్రసులున్నాయి. రెండు వేల కాపీలు తీయించారు కామన్‌ లెటరును. లెటరును నాలుగు మడతలు చేసి స్టేపిల్‌ చేసి, పైభాగాన అడ్రసుండేలా చేశారు. అడ్రసులు కూడ చేత్తో వ్రాయకుండా లిస్ట్ లోని అడ్రసు భాగాన్ని కట్‌ చేసి లెటరు మీద అతికించారు. పదిపైసలు స్టాంపు అతికించి ‘బుక్‌ పోస్ట్‌’ క్రింద పోస్టు చేశారు.

పదిరోజులు గడవకుండానే రెస్పాన్సు ప్రారంభమయింది. ఎం.వో.లు, చెక్కులు, డిడిలు రాసాగాయి. ఒక్కో సబ్జెక్టుకు నలభై, యాభై మంది దాకా డబ్బు పంపారు. కొందరు అన్ని పేపర్లకూ కావాలని కోరితే మరికొందరు కొన్నింటికే పంపారు. మొత్తం ఎనభై ఏడు వేలు వచ్చింది.

టౌన్‌లోని నాలుగు టైపు ఇన్‌స్టిట్యూట్‌లకు స్టెన్సిల్‌ టైపింగ్‌ అప్పచెప్పారు. వ్యాసాలు క్లుప్తంగా, సులభంగా, సబ్‌ హెడింగ్స్‌తో ఉండేలాగా జాగ్రత్త పడ్డారు. ఆర్డరు సంఖ్యను పట్టి కాపీలు రోనియో తీయించి, స్టేపిల్‌ చేసి అడ్రసుల ప్రకారం బుక్‌ పోస్టులో పంపేశారు. ప్రతి ఆర్డరులో కవరింగ్‌ లెటర్‌ మీద, యం.ఓ ఫారం క్రిందున్న స్పేస్‌లో స్పష్టంగా సబ్జెక్టు, కావలసిన పేపరు నంబర్లు, అడ్రసు వ్రాయమని కామన్‌ లెటర్‌లో చెప్పినందువల్ల పని సులువయింది. మొత్తం వ్యవహారం నెలన్నర పట్టింది. ఎక్కువగా మధ్యాహ్నాలు, రాత్రుల్లో పనిచేశారు.

స్టెన్సిల్స్‌, టైపింగ్‌, కాపీయింగ్‌, పోస్టేజీ అన్ని కలిపి ఇరవై వేల దాకా ఖర్చయింది. తలా పదిహేను వేలు మిగిలాయి. ఇంకా పదివేల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్‌ ఉంది.

స్పోకెన్‌ ఇంగ్లీషు కోర్సు రెండవ బ్యాచ్‌ మొదలు పెట్టాడు పతంజలి. చివరి నెల అంతా స్పీకింగ్‌ స్కిల్స్‌ నేర్పిస్తున్నాడు. లైఫ్‌ లైక్‌ సిచుయేషన్స్‌ క్లాసు రూంలోనే సృష్టించి, విద్యార్థులను ఇన్‌వాల్వ్‌ చేస్తున్నాడు.

పొలం విషయం ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకరోజు బాజిరెడ్డి ‘సక్సెస్‌’కు వచ్చినపుడు చెప్పి బాధపడ్డాడు. అతనిలా అన్నాడు – “వట్టి గొడ్డుకు మేతెక్కువ అని నీవు కట్టపడి సంపాయించుకునే దాంట్లో కూడ సేద్యానికే కర్చయితుంటే ఆ పొలాన్ని వదిలించుకుంటేనే మంచిదనిపిచ్చాండాది సామీ!”

“పొలం అమ్మడమా!” అన్నాడు పతంజలి సాలోచనగా.

“ఔను మల్ల. ఈమజ్జ సీశైలం పాజెక్టుతో మునిగిపోయిన పొలాల రైతులు మన జిల్లాలో తిరుగుతాండారు. మెట్ట భూములు కూడ కొంటుండారులే. మన భూమికి అంతో ఇంతో నీటి వసతుండాది. పంటేచ్చే ఆరుదడన్నా పారిచ్చుకోవచ్చు. నీవు పెద్ద సామితో మాట్టాడు. మంచి బ్యారమొచ్చే సూద్దాము” అన్నాడు.

పతంజలికి కూడ నిజమే అనిపించింది. వచ్చిన డబ్బును అప్పులు తీర్చేసి మిగతాది డిపాజిట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆదివారం అమ్మానాన్నలతో చర్చించాలని నిర్ణయించుకున్నాడు.

మస్తానమ్మను పిలిచి, ఎదురుగా ఉన్న చెరుకు రసం బండి దగ్గర నాలుగు గ్లాసులు చెరుకు రసం తెమ్మన్నాడు. ఆమెను కూడ తాగి రమ్మని డబ్బులిచ్చాడు. అందరూ చెరుకు రసం తాగారు. బాజిరెడ్డి వెళ్లిపోయాడు.

శనివారం రాత్రి శ్రీశైలం – అనంతపురం బస్సులో వెల్దుర్తికి వెళ్లాడు. ఈ మధ్య ప్రతివారం వెళ్లడం లేదు. ఆదివారాలు కూడe ముమ్మరంగా పని ఉంటోంది. వెళ్లినరోజు మాత్రం ఎంత లేటయినా ఇంట్లోనే భోంచేస్తాడు.

ఉదయం కాఫీల దగ్గర తండ్రి అడిగాడు. “డబ్బులు తెచ్చావా నాయనా!”

“లేదు నాన్నా. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. అమ్మా, నీవు కూడ జాగ్రత్తగా విను. మన పొలం మనకొక సమస్యగా తయారయింది. మనం పెట్టే పెట్టుబడి కూడ వెనక్కి రావడం లేదు. కర్నూల్లో సంపాదన కూడ అది కబళిస్తూంది. కూలీల ధరలు చూద్దామా విపరీతంగా పెరిగాయి. బాడుగలు పెట్టి సేద్యం చేయించాలంటే మన తాహతుకు మించిన పని అవుతూంది. అందుకే నేనేమంటానంటే పొలం అమ్మేద్దాము” అన్నాడు.

తల్లీ తండ్రీ ఆక్రోశించారు. “అయ్యో! అదేం మాటరా! పిత్రార్జితమయిన ఆస్తి. అమ్ముకుంటే తర్వాత రెండెకరాలయినా కొనగలమా” అన్నారు ఏకకంఠంతో.

పతంజలి వివరించాడు.

“నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనకు ఇప్పటికే దాదాపు ఇరవై వేల వరకు అప్పులున్నాయి. వడ్డీలు పెరుగుతున్నాయి. అవికాక వెంటనే ఐదారువేలు కంచె కొట్టించడానికి, కొమ్ము శనగ పంట వేయడానికి కావాలి. ఇలా ఎంతకాలం? రెండు మూడేండ్లలో మహితకు పెళ్లి చేయాలి. చిన్నోడ్ని నాలాగ కాకుండా మంచి కాలేజీలో చదివించాలి. నాన్న ఎంతకాలం కష్టపడతాడు? పొలం బాధ్యత లేకపోతే ఆయన యింటి పట్టునే నాలుగు రూపాయలు సంపాదిస్తాడు. ఇంటిని రిపేరు చేయించుకోలేకపోతున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురైన రైతులు మన ప్రాంతంలో పొలాలు కొంటున్నారట. బాజిరెడ్డి మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు. మన పొలానికి కొంత నీటి వసతి కూడ ఉంది. కాబట్టి ధర బాగానే పలుకుతుందన్నాడు. నేనేమంటానంటే అమ్మేసి, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేద్దాము. వెనక పశువులశాల పాడు పడిపోయి పందికొక్కులు తిరుగుతున్నాయి. ట్యూషన్ల షెడ్‌ కూడ తొలగించి, ఉద్యోగస్థులకు నివాసయోగ్యంగా నాలుగు పోర్షన్లు కడదాము. నెలకు నాలుగు వందలు బాడుగ వస్తుంది. పొలానికి ప్రతి సంవత్సరం పెట్టే వ్యర్థమయిన పెట్టుబడి సంవత్సరానికి పదివేలకు పైగానే మిగులుతుంది. మిగిలిన డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకుంటే సరి. అందరం ప్రశాంతంగా ఉండవచ్చు. మనమున్న ఇల్లు కూడ పైకప్పు మార్చించి, చవుడు తోలించుకొనే మట్టి మిద్దె కాకుండా కాంక్రీటు పోయిస్తే శాశ్వతంగా ఉంటుంది. బాగా ఆలోచించి చెప్పండి.”

అని స్నానానికి వెళ్లిపోయాడు. భోజనాల దగ్గర అందరూ మౌనంగా ఉన్నారు.

“మనం తోట అమ్మేస్తే, నాకు కొత్త సైకిలు కొనిస్తావా అన్నయ్యా!” అన్నాడు చిన్నోడు. వాడి మాటలతో వాతావరణం తేలికయింది. మార్కండేయశర్మ అన్నాడు. “పోనీ గుత్తకిచ్చేస్తే?”

“గుత్తదారుడు ఎంత బాగా పొలాన్ని చూసుకుంటాడో మనకు నిమ్మతోటతోనే తెలిసివచ్చింది కద నాన్నా!” అన్నాడు పతంజలి.

“నా లెక్కప్రకారం గుత్తకిచ్చినా ఏడెనిమిది వేలకంటె రాదు. పంట సరిగ్గా పండకపోతే గుత్తడబ్బు ఎగ్గొట్టడానికి వెనుకాడరు. నేను అనుకునే దేమంటే. అప్పులు తీరతాయి. మహిత పెండ్లికి తడుముకోవాల్సిన పని ఉండదు. నెలనెలా ఇంటి అద్దెలు వస్తాయి. మనం ఉన్న యిల్లు బాగుపడుతుంది. నేను సంపాదించే డబ్బు కూడా మిగులుతుంది.”

“నేనూ మీ అమ్మ బాగా ఆలోచించామురా. నీవు చెప్పిందే సబబుగా అనిపిస్తూంది. సరేకానీ, అంతా ఆ నరసింహుడే చేయిస్తున్నాడు. మనకేది మంచిదో మనకంటె ఆయనకే బాగా తెలుసు” అన్నాడు తండ్రి. అమ్మ కూడ అంగీకరించింది.

సోమవారం ఉదయం లోకల్‌కు బయలుదేరి వెళ్లాడు పతంజలి. ఇన్‌స్టిట్యూట్‌లో ఒక రూంలో యస్‌.యస్‌.సి రెగ్యులర్‌ వారికి, మరొక రూంలో ఇంటర్‌ వాళ్లకి క్లాసులు జరుగుతున్నాయి. పతంజలి మూడు క్లాసులు చెప్పాడు. డైరెక్ట్‌ ఎమ్‌.ఎ. కోసం ఒకాయన వచ్చి జాయిన్‌ అయ్యాడు.

ఇంతవరకు వచ్చిన ఫీజుల మొత్తాన్ని దగ్గరే ఉన్న స్టేట్‌ బ్యాంకులోనే జమ చేస్తున్నారు. ఎవరి భాగం ఎంత అనేది ఒక రిజిష్టరులో రాసి పెట్టుకుంటున్నారు. అకౌంటు సంస్థ పేరిట తెరిచి, ముగ్గురిలో ఎవరైనా ఆపరేట్‌ చేసేందుకు వీలుగా జాయింట్‌ పార్టనర్స్‌గా ఉన్నారు.

పన్నెండున్నరకు అన్నం వండుకొని గీతాభవన్‌ నుండి సాంబారు పెరుగు తెచ్చుకుని తిన్నారు. పతంజలి క్రింద షాపు వాళ్లనడిగి సైకిలు తీసుకొని గౌసుమండీకి వెళ్లి అక్కడి గుమాస్తా లతీఫ్‌తో, బాజిరెడ్డి గనుక వస్తే స్వామి రమ్మంటున్నాడని చెప్పమన్నాడు.

రాత్రి క్లాసులు అయింతర్వాత ఉస్మాన్‌ యింటికి వెళ్లాడు. అన్నం పెద్దగా మిగల్లేదు. సాయంత్రమే మస్తానమ్మకిచ్చేశారు. పతంజలి, ముని ‘కల్కూర’ హోటల్లో చపాతీ తిని, జనరల్‌ హాస్పిటల్‌ దాటి, కె.సి. కెనాల్‌ను ఆనుకొని ఉన్న రవి థియేటర్‌లో కృష్ణ సినిమా ‘ఏకలవ్య’ సెకండ్‌ షో చూసి, నడుచుకంటూ కాలేజి చేరుకుని పడుకున్నాడు. పతంజలికి నిద్ర పట్టలేదు. ‘పొలం అమ్మడం సరైన పనేనా కాదా’ అని మథనపడుతూ కలత నిద్రపోయాడు.

మరుసటి రోజు ఉదయం క్లాసులేనపుడు రాధాసారింటికి వెళ్లాడు. ‘భాస్కర్‌నగర్‌’ మీదుగా వెళితే సారిల్లు చాలా దగ్గర. పతంజలి వెళ్లే సరికి సారు టిఫిను చేస్తున్నాడు.

“రా సామీ! రా!’ అంటూ ఆహ్వానించి, “రాజీ! సామొచ్చాడు!” అని వంటింట్లోకి వినపడేలా కేకవేశాడు.

సారు భార్య ప్లేట్లో రెండు దోసెలు వేసుకొని, బుడ్డల చట్నీ ప్రక్కన చిన్న గిన్నెతో పెట్టుకొని వచ్చింది. సారుకెదురుగా డైనింగ్‌ టేబులు కుర్చీలో కూర్చున్నాడు. “ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదామని వచ్చాను సార్‌!” అన్నాడు. “మాట్లాడుదువు గానీ, ముందు దోసెల సంగతి చూడు” అన్నాడాయన నవ్వుతూ.

పతంజలి దోసెలు తింటూ పొలం అమ్ముదామనుకుంటున్న విషయం, దాంట్లో తర్జన భర్జన వివరంగా చెప్పసాగాడు. దోసెలు చాలా బాగున్నాయి. లోపలివైపు ఉల్లికారం పూసి, పల్చగా పుట్నాలపొడి చల్లింది. వేరుశనక్కాయల చట్నీలో వెల్లుల్లివేసి తిరుగమోత పెట్టింది. రెండోది తింటూండగా మరో రెండు వేసుకొచ్చిందామె.

“ఒక్కటి వేయండమ్మా చాలు రెండు తినలేనింక” అన్నాడు. ఒక దోసె వేసి వెళ్లిపోయిందామె.

“నేను ఐదారు తింటా గదా! వైసు పిల్లోనివి అంత పిట్టతిండేంది సామీ!” అన్నాడు సారు. నిజానికి ఆయన రెండే తిన్న విషయం పతంజలి గమనించాడు. తనతో తినిపించాలని అట్లా అంటున్నాడని అర్థమయింది.

చేతులు కడుకున్నాక వరండాలో సోఫోలో కూర్చున్నారు. కాఫీ తాగారు. రాధాసారన్నాడు.

“ఏరకంగా జూసినా అమ్మడం మంచిదే సామీ! గోడకేసిన సున్నం లెక్క ఎంచేపూ డబ్బులు దీస్కపోయి దాంట్లో పోయడమే గాని, నిమ్మచెట్లు ఎండిపోయిన కాడ్నుంచి, ఒక రూపాయకూడ గిట్టుబాటు కావడంల్యా. వెల్దుర్తిలో ఎలిపొలమే ఎకరా పది పన్నెండువేలుండాది. మన దానికి బాయుండె. మోటరుండె. ఆరుదడి పారనీకె డోకాలేకపోయె. ఎన్నెకరాలుంటాది మనది?”

“తొమ్మిదెకరాల ఎనభై సెంట్లు”

“పదేసుకో. ఎకరా ఇరవైవేలకు తక్కువబోదు. రెండు లచ్చలకు పైనే వచ్చాది”

వచ్చే డబ్బుతో ఏమేం చేయాలనుకున్నాడో చెప్పాడు పతంజలి. “మీరున్న యిల్లు బాగు చేయిచ్చుకోండి గాని సామీ, పశువుల శాల ఇప్పించి, ఇండ్లు కట్టేది మాత్రం లాబసాటిగాదు. నా మాటిని అదీ, షెడ్డు అన్నీ తీయించి ఏకాండంగా స్తలం జేసుకుంటే మూడొందల గజాలు అంటే సుమారు ఆరుసెంట్లు. ఆ స్థలం కూడ అమ్మేది మంచిది. నీవేమో కర్నూల్లో వుంటివి. ఇండ్లు కట్టిచ్చేది చిన్నామొన్నా పన్యా? పెద్దసామి తరంగాదు. ఆ డబ్బులు, పొలం డబ్బులు కొంత పెట్టి కర్నూల్లోనో, డోన్‌లోనో రెండొందల గజాల ప్లాట్‌ తీసుకో. ముందుముందు బాగా పెరుగుతాది. నేను కూడ నా రైతులకు చెబ్తాలే” అన్నాడు.

రాధాసారు కూడ తన నిర్ణయాన్ని సమర్థించినందుకు పతంజలి సంతోషించాడు. అసలు ఈ ప్రతిపాదన తన స్నేహితుడు బాజిరెడ్డిదని చెప్పాడు.

సారు దగ్గర సెలవు తీసుకొని వచ్చేశాడు. పది రోజుల్లో ఇద్దరుముగ్గురు పొలం చూసివెళ్లారు. ఒకరోజు బాజిరెడ్డి ఇద్దరిని తీసుకుని ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చాడు. అందరికీ మస్తానమ్మతో టీలు తెప్పించాడు పతంజలి. “సామీ! ఈండ్లది త్రిపురాంతకమంట. నిన్న వెల్దుర్తికి పోయి మన పొలం చూసొచ్చినారు పెద్దసామి దగ్గరుండి చూపిచ్చెనట. మాట్టాడుకుందామని వచ్చినారు” అన్నాడు బాజిరెడ్డి.

స్పోకెన్‌ ఇంగ్లీషు వాళ్లకు బోర్డుమీద టెస్ట్‌ రాసి. ఉస్మాన్‌ను క్లాసులో ఉంచి అందర్నీ తీసుకుని రాధాసారింటికి వెళ్లాడు. సారు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చాడు. పది నిమిషాల్లో ఫ్రెష్‌ అయి వచ్చి కూర్చున్నాడు.

“ఏం బాజిరెడ్డీ, బాగుండావా?” అని పలుకరించాడు.

“బాగుండా సార్‌” అన్నాడు బాజిరెడ్డి.

వచ్చినవారు తనను పరిచయం చేసుకున్నారు. వాళ్లలో పెద్దాయన అన్నాడు. “సార్‌ నా పేరు అంకయ్యనాయుడు. వీడు నా సడ్కుడు (షడ్డకుడు/తోడల్లుడు) మావి బంగారు మాదిరి భూములు ప్రాజెక్టు కింద ములిగే.. అటు బెజవాడ గుంటూరు వైపు భూములు కొందామంటే అలవిగాని రేట్లు. నష్టపరిహారం బాగానే యిచ్చినారు సర్కారోల్లు. మన కర్నూలు జిల్లాలో కూడ నంద్యాల ఆళ్లగడ్డ కాడ ఇశారిస్తిమి. కెసికెనాల్‌ ఆయకట్టు. అమ్మేటోడే కనబడల్యా. కొంచెం నీటి వసతి ఉంటే బాగుంటాదని తిరుగుతాంటే ఈ బాజిరెడ్డన్న తగిలె. సామోల్ల భూమి చూసొచ్చినాం. పెద్దసామి సూపిచ్చె. సామిని సూసి కడుపు నిండిపోయినాది. పోతన లెక్క ఉంటాడు. మేము కమ్మోల్లం సార్‌!” అన్నాడు.

“మేమూ కమ్మోల్లమే. నా పేరు రాధాకృష్ణమూర్తి నాయుడు” అన్నాడు సారు. రాధాసారు, రాధాసారు అనుకోవడమే గాని ఆయన పూర్తి పేరు ఆయన నోటి వెంటనే విన్నాడీ రోజు.

“సరే భూమి చూసినారు గదా! మీరెంతలో ఉండారు?” అన్నాడు బాజిరెడ్డి.

“ఎకరా పదహారువేలయితే సంతోషంగా తీస్కుంటాము”

రాధాసారుకు కోపం వచ్చింది.

“ఏం మాట్లాడుతాండావు నాయుడూ. డోన్‌ తాలూకా మొత్తం మీద నీళ్లు పారించుకునే వీలున్న పొలాలు యాడుండాయి. నీవు ఎలిపొలం (మెట్ట) రేటు అడిగితే ఇయ్యనీకె మేమేం తిక్కోల్లం గాదు” అన్నాడాయన.

“బాగా గడ్డి బలిసింది సారు. పూరా ర్యాగడి భూమి కాదు. కొంత సవుడు గలిసినాది. బాయిలో ఊటకూడ బాగా తక్కువుండాది. రోజుకు అర్ధెకరా కూడ పారేట్టులేదు. సుట్టూ పెతాప కంచెసేట్లేసినారు. కంచెంబడి పగ్గం పట్టువరకు, దాని యేడికి గరిక కూల మొల్వదు. ముందు ఆ కంప సెట్ల కంచె ఏర్లతో సహా తవ్వేస్తే గాని ఆ పొలానికి మోచ్చం లేదు” అన్నాడు నాయుడు.

“కరెక్టుగా చెప్పాడు” అనుకున్నాడు పతంజలి.

“భూమ్మీద దుప్పటి గప్పి బేరం చెప్పడం లేదుగద పెద్ద మనిసీ!” అన్నాడు బాజిరెడ్డి.

“ముకముంది అద్దముంది. దాపెట్టుకొనేదేదీ లేదు. సారు అగ్రికల్చర్‌ ఆఫీసరు. డైరెక్టరు. ఆయనకు తెలియని భూమి లేదు. పైగా వెల్దుర్తిలో ఐదేండ్లు పని జేసి వచ్చినాడు. పతంజలి సామికి ఆయన మాట ఏదం. ఆయనెట్ల చెబితే అట్ల”

రాధాసారు గంభీరంగా ఆలోచించాడు. పతంజలిని లోపలికి పిల్చుకొని పోయాడు. “ఎంత చెబుదాం సామీ!” అన్నాడు.

“సార్‌ మీకు తెలియనిదేముంది?” అన్నాడు పతంజలి.

“ఇరవై ఐదు వేలు చెబ్దాం. ఇరవై రెండు కొచ్చారు” అన్నాడాయన.

బయటికి వెళ్లి చెప్పాడు. “నాయుడూ! నివ్వూ రైతువే. నీవూ నష్టపోరాదు. ఎకరా ఇరవై ఐదువేలకు తక్కువయితే ఇవ్వనంటున్నాడు మాసామి”

నాయుడు తోడల్లుడు నోరు విప్పాడు.

“అంత చెయ్యదు సార్‌ ఆ భూమి”

“సరే మీరెంతలో ఉన్నారో చెప్పండి”

ఇద్దరూ బయటికి వెళ్లి మాట్లాడుకొని వచ్చారు.

“పందొమ్మిది జేసుకొండి సామీ”

సామి రాధాసారు వైపు చూశాడు. రాధాసారు బాజిరెడ్డివైపు. ముగ్గురూ కళ్లతో మాట్లాడుకున్న దాన్నిబట్టి ఒప్పుకోకూడదన్న సందేశం వెలువడిరది.

“ఇది తేలే ఎవహారంగాదుగాని పోయిరాండి” అన్నాడు బాజిరెడ్డి.

అంకయ్యనాయుడు లేవలేదు. “డైరెట్టరుసారు ఎట్లా ఫయిసల్‌ చేస్తే అట్లా” అన్నాడు.

సారన్నాడు. “ఇరవై రెండుకు తెంచుతున్నా. రిజిస్ట్రేషన్‌ కర్చులు మీయే. అంతకు తగ్గితే మా సామోల్లకు అన్నాయం జరుగుతాది” అని లేచాడు.

“కూసోండి సారూ. అంత పెద్దాపీసరు మీరు చెప్పిన తరువాత మాలాంటోల్లం కాదంటామా! సరే! ఊరికెళ్లిపోయొచ్చి ఎల్లుండి అడ్డుమాంచు తెచ్చిస్తాం. ఇరవై వేలు సంచకారం ఇచ్చినంక అగ్రిమెంటు రాసుకుందాం. మొత్తం డబ్బు రిజిస్ట్రేషన్‌ రోజు చుప్తా చేస్తాం” అన్నాడు నాయుడు.

“ఎల్లుండి సాయంత్రానికి రాకపోతే అవులెల్లుండి ఏరేటోల్లకు మాట్లాకుంటాం” అన్నాడు బాజిరెడ్డి.

వీళ్లిద్దరూ సెలవు తీసుకొని వెళ్లిపోయారు.

“పరవాలేదు. మంచిరేటే” అన్నాడు సారు. “కృష్ణా గుంటూరు జిల్లాలలో వీళ్లు పెట్టే రెండు లక్షల ఇరవై వేలకు ఎకరా భూమి కూడ రాదు”

“ఆ భూమి సంగతి ఏరుగా ఉంటాది. వరి నాట్లేసేటపుడు నారు నిలబడి భూమిలోకి ఇడిసినా నాటుకుంటాదట. ఎన్నముద్ద భూములవి” అన్నాడు బాజిరెడ్డి.

పతంజలికి ఉద్వేగంగా ఉంది. రాధాసారుకు కృతజ్ఞతలు చెప్పి ఇద్దరూ వచ్చేశారు.

రాత్రి యింటికి వెళ్లాడు పతంజలి. తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించాడు. తండ్రి అన్నాడు.

“నాయనా పతంజలీ! నీవు ఏ పని చేసినా సహేతుకంగానే ఉంటుంది. రాధాసారు మనకు అన్ని విషయాలల్లో అండగా ఉన్నాడు. అగ్రిమెంటు రిజిస్ట్రేషన్‌ సమయాలలో నేను సంతకాలు పెడతాను.”

తాను లేకుండానే పొలం అమ్మేశాడన్న భావం ఇంచుకైనా కనబడలేదాయన వదనంలో. కొడుకుమీద, కొడుకు సమర్థత మీద అంత నమ్మకం ఆయనకు.

అనుకున్న ప్రకారం ఇరవై వేలు అడ్వాన్సు ఇచ్చారు. రాధాసారింట్లోనే వందరూపాయల స్టాంపు పేపరు మీద అగ్రిమెంటు వ్రాసుకున్నారు. దానిమీద పతంజలి, నాయుడు సంతకాలు చేశారు. సాక్షి సంతకాలు రాధాసారు, బాజిరెడ్డి చేశారు.

మరో పదిహేను రోజుల్లోనే డోన్‌లో రిజిస్ట్రారాఫీసులో రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. మిగతా డబ్బు రెండు లక్షలూ ఇచ్చేశారు. జాగ్రత్తగా దాన్ని యింట్లో దాచారు. డబ్బు తమ దగ్గర డిపాజిట్‌ చేయమని వెల్దుర్తి స్టేట్‌ బ్యాంక్‌ మేనేజరు కబురుపెట్టాడు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ ఏజంటు వర్మ ఇంటికి వచ్చి ఐదున్నర సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అవుతుందని. యన్‌.యస్.సి బాండ్స్ లో పెట్టమని బలవంతం చేశాడు. తన కొచ్చే కమీషన్‌లో సగం వారికే యిస్తానని కూడ చెప్పాడు.

(సశేషం)

Exit mobile version