Site icon Sanchika

సాఫల్యం-39

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[బుక్ షాప్‌ ప్రారంభోత్సవానికి మిత్రుల సహాయంతో అన్ని ఏర్పాట్లు చేస్తాడు పతంజలి. రాధాసార్ నేతృత్వంలో వెళ్ళి ఛైర్మన్ నాగిరెడ్డిగారిని ప్రారంభోత్సవం చేయాల్సిందిగా ఆహ్వానిస్తారు. అనుకున్న సమయానికి ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుంది. నాగిరెడ్డి గారితో బోణీ చేయిస్తాడు పతంజలి. వచ్చినవాళ్ళందరూ కూడా వస్తువులు కొంటారు. షాపులో ఉండడానికి ముని తమ్ముడు శివని కుదుర్చుకుంటారు. ఈ హడవిడిలోనూ ఎం.ఎ. చదువును విస్మరించడు పతంజలి. పతంజలి, ఉస్మాన్, ముని  పుస్తకాలు అమ్మడానికి కర్నూలు, చుట్టు పక్కల జిల్లాలకు తిరుగుతారు. పుస్తకాలు బాగానే అమ్ముడవుతాయి. బుక్ షాపులో గ్రీటింగ్ కార్డులను కూడా అమ్మి లాభం కళ్లజూస్తారు. పుస్తకాలు అమ్మడానికి ఇద్దరు ఫుల్ ‍టైం సేల్స్‌మన్‌లను నియమించుకుంటారు. పుస్తకాలు రెండో ముద్రణ కూడా చేయిస్తారు. రాధాసారు అప్పు తీర్చేస్తారు. బుక్‌షాపు లోను తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టేస్తారు. సంక్రాంతి పండగకు అందరూ ఇంటికి వస్తారు. పండగ తర్వాత మళ్ళీ పనులన్నీ యథాతథంగా ప్రారంభవుతుతాయి. మార్చి నాటికి పుస్తకాలన్నీ అమ్ముడు పోతాయి. మిత్రులు ముగ్గురు ఎవరి వాటా వారు తీసుకుంటారు. మార్చిలో మహిత పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆమెను రాధాసారు ఇంట ఉంచి పరీక్షలు రాయిస్తాడు పతంజలి. – ఇక చదవండి.]

[dropcap]ప్రొ[/dropcap]ద్దుటూరు నుండి అత్తయ్య జాబు వ్రాయించింది. భువనకు పెళ్లి కుదిరిందనీ, వరుడు కాశీభట్ల వారి పిల్లవాడనీ, రైల్వేలో అసిస్టెంటు స్టేషన్‌ మాస్టరుగా పనిచేస్తాడనీ, వాళ్లది అనంతపురమనీ తెల్పింది. పెట్టుపోతలు అవీ మాట్లాడుకోవడానికి అన్నయ్యను రమ్మని, తనకు ధైర్యంగా ఉంటుందనీ వ్రాయించింది.

వసుధ బి.కాం. ఫైనలియర్‌కు వచ్చిందంట. భరత్‌ టెంత్‌కు వచ్చాడట.

అందరూ సంతోషించారు. మార్కండేయశర్మ వెళ్లి వచ్చాడు. శ్రావణమాసంలో వివాహ ముహూర్తం నిశ్చయమయింది.

భువన పెండ్లికి అందరూ బయలుదేరి వెళ్లారు. గుత్తివరకు బస్సులో వెళ్లి అక్కడ గుంతకల్‌ – తిరుపతి ఫ్యాసింజరు పట్టుకుని, ఎర్రగుంట్లలో దిగి అక్కడనుండి ప్రొద్దుటూరు చేరుకున్నారు.

బంధువులతో అత్తయ్య వాళ్ల యిల్లు కళకళలాడుతూ ఉంది. వసుధ కొంచెం ఒళ్లు చేసి, ఇంకా అందంగా తయారయింది. పతంజలిని కళ్లతోనే పలుకరించింది. మగపెళ్లివారు అనంతపురం నుండి తరలివచ్చారు. వారికి వసుధ నాన్నగారి కజిన్‌ సదాశివయ్యగారింట్లో విడిది ఏర్పాటు చేశారు. ఆయన ప్రొద్దుటూరులో ప్రసిద్ధ ఆడిటర్‌ అట. మద్రాసులో సి.ఎ. చేశారట. వాళ్ల యిల్లు చాలా పెద్దది. రెండతస్తులు. పెళ్లి కూడ వాళ్లింటి మిద్దెపైనే షామియానా వేసి చేస్తారట.

వసుధ, పతంజలి పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విడిదింటికి కాఫీలు టిఫిన్లు తీసుకుపోవడం, మగపెళ్లివారికి ఏ మర్యాదాలోపం లేకుండా చూసుకోవడం ఇలాంటి పనులన్నీ నెత్తిన వేసుకున్నారు. పెళ్లికి మల్లినాధ రాలేదు. మహిత, భరత్‌ వాళ్లకు అసిస్టెంట్లు. పెళ్లికొడుకు చాలా ఎత్తు. మనిషి స్ఫురద్రూపి. పేరు మహీధర్‌. రైల్వే సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలో సెలెక్ట్‌ అయి బళ్లారి దగ్గర ‘హగరి’ అనే స్టేషనులో ఎ.యస్‌.ఎమ్‌.గా చేస్తున్నాడు. ఇంచుమించు పతంజలి వయసే ఉంటుంది. అతనికి కూడ తండ్రి లేడు. నలుగురు అన్నదమ్ములు. అందరూ రైల్వేస్‌లోనే ఉండటం ఒక విశేషం. ఈయన రెండవవాడు.

పతంజలికి ఆయన స్నేహితుడయ్యాడు. ఆ రోజు రాత్రి ఎదురుకోలు ఉత్సవం జరిగింది. వసుధ నీలంరంగు చీరలో మెరిసిపోతూ ఉంది. పతంజలి కూడ లైట్‌ కలర్‌ ప్యాంటు, మెరూన్‌ కలర్‌ ఫుల్‌ షర్టు ఇన్‌సర్టు చేశాడు. ఇద్దరూ ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’లా ఉన్నారు.

మర్నాడుదయం పదకొండు గంటలకు పెండ్లి జరిగింది. భోజనాలలో వడ్డన దగ్గరి బంధువులే చేస్తారు. దాదాపు నాలుగు బంతులు లేచాయి. వసుధ, పతంజలి వడ్డనలో దిగారు. చివరి బంతి లేచేసరికి రెండయింది. వసుధ బావకు రెండు అప్పడాలు, ఒక జాంగ్రీ తెచ్చిచ్చింది. “బావా, మన భోజనాలయ్యేసరికి మూడయ్యేలా ఉంది. అందాకా ఇవి తినండి” అంది.

“మరి నీవు?”

“నేనూ తెచ్చుకుంటాను. మీరు తింటూ ఉండండి”

ఇద్దరూ తింటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తన కార్యకలాపాలు షాపు, పబ్లికేషన్‌, ట్యుటోరియల్స్‌ అన్నీ వసుధకు వివరించాడు.

“నాకన్నీ తెలుసు బావా! మామ అప్పుడప్పుడు మా అమ్మకు జాబులు వ్రాస్తూ ఉంటాడు కదా!” అన్నది.

వాళ్ల దూరపు బంధువు ఒకామె, వసుమతి వదినె అంటారు అటుగా పోతూ వీళ్ల దగ్గరికి వచ్చి అంది.

“ఏమే వసుధా, మరి మీ పెళ్లెపుడే?” అని అడిగింది గడుసుగా.

ఇద్దరూ సిగ్గుపడ్డారు.

 “నాకంతా తెలుసులేండర్రా. ఆ భువన పెళ్లయితూనే మీ యిద్దరికీ ముడిపెట్టాలని మీ అమ్మా, మీ మామా ఎప్పటినుండో అనుకుంటున్నారు” అని హడావుడిగా వెళ్లిపోయిందామె.

వసుధ తలదించుకొని ఉంది. ఆమె బుగ్గల్లో మందారాలు విరబూశాయి.

“వసుధ, ఈజిట్‌ ట్రూ?” అని అడిగాడు.

“ఏమోబ్బా, నాకేం తెలుసు?” అంటూ క్రీగంట బావను చూసి, మనోహరంగా నవ్వి, పరుగెత్తింది వసుధ. పతంజలి మనస్సు ఆమె పట్ల ప్రేమతో నిండిపోయింది.

అమ్మావాళ్లు నాలుగు రోజులుండి వస్తామన్నారు. పతంజలి ఆ రోజు రాత్రే ప్రొద్దుటూరు – హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో బయలుదేరి కర్నూలుకు వెళ్లిపోయాడు. వసుధ స్టోరు రూములో ఏవో సర్దుతూంది. వెళ్లే ముందు లోపలికి వెళ్లి “నేను బయలుదేరుతున్నా, వసుధా!” అన్నాడు.

“హ్యాపీ జర్నీ బావా!” అన్నాదా అమ్మాయి. కళ్లలో స్వల్పంగా దిగులు కనబడింది పతంజలికి. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మృదువుగా నొక్కాడు. కళ్లతోనే వీడ్కోలు ఇచ్చింది.

నవంబరులో ఎమ్‌.ఎ. ఫైనల్‌ పరీక్షలు బ్రహ్మాండంగా వ్రాశాడు పతంజలి. అక్కయ్య వాళ్లింట్లోనే ఉన్నాడు. శశిని స్కూల్లో చేర్పించారు. రాష్ట్రపతి రోడ్‌ లోనే ఉంది. బాలభారతి స్కూలు. బావకు ఐదారు నెలల్లో మ్యానేజరుగా ప్రమోషన్‌ రావచ్చట. అప్పుడు మళ్లీ ట్రాన్స్‌ఫర్‌ అవుతుందట. అందరూ కలిసి ‘నాచారం’ అనే నరసింహ క్షేత్రానికి వెళ్లారు. ఈసారి ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లారు. పర్మిషన్‌ తీసుకొని ‘రామకృష్ణులు’ అనే సినిమా షూటింగ్‌ చూశారు. అందులో యన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌ ఇద్దరూ ఉన్నారు. ఏదో కోర్టు సీన్‌ తీశారు చాలాసేపు. సెట్‌ బయట గిరిబాబును, ఛాయాదేవిని చూశారు. రామ్మూర్తిబావ ఆమె దగ్గరకు వెళ్లి నమస్కరించి, “అమ్మా! సూర్యకాంతంగారి కంటే మీరు నటనలో ఏమాత్రం తీసిపోరు. నేను మీ అభిమానిని” అని చెప్పాడు.

“బాగా చెప్పావు నాయనా! సంతోషం!” అన్నదామె. గిరిబాబుకు పతంజలి షేక్‌ హ్యాండిచ్చాడు. “యుఆర్‌ ఎ పాలిష్‌డ్‌ విలన్‌ సర్‌!” అన్నాడు.

“థ్యాంక్‌యు, యంగ్‌మ్యాన్‌!” అన్నాడాయన. ఆ రోజు రాత్రి బావ స్కూటర్‌ మీద యిద్దరూ తిరుమలావధానిగారింటికి వెళ్లారు. బావను ఆయనకు పరిచయం చేశాడు పతంజలి. ఫైనల్‌ పరీక్షలు కూడా బాగా రాసినట్లు చెప్పాడు. ఆయన “యాభై ఐదు శాతం దాటితే ఇంటర్మీడియట్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్లలో లెక్చరర్‌ పోస్టుకు అర్హత వస్తుంది. యూనివర్సిటీలో రెగ్యులర్‌గా చదివే విద్యార్థులకు ప్రొఫెసర్లతో వారికి నేరుగా ఉన్న పరిచయం కారణంగా, ఫస్ట్‌క్లాస్‌ కూడ యిస్తారు. ఇందులో రకరకాల కన్సిడరేషన్స్‌ పనిచేస్తాయి. ఎక్స్‌టర్నల్‌ విద్యార్థులకు మాత్రం, అసాధారణ ప్రతిభ కనబర్చినా, చాలాసార్లు 49 శాతం లేదా 54 శాతం దగ్గర ఆపేసిన సందర్భాలున్నాయి. కానీ నీ విషయంలో అలా జరగదులే. అది నీ డిగ్రీ మార్కుల విషయంలోనే ఋజువైంది” అంటూ పతంజలికి ఆత్మవిశ్వాసాన్నిచ్చాడు.

పతంజలి ఆయనకు పాదాభివందనం చేశాడు “విద్యాభివృద్ధిరస్తు, ఉన్నతోద్యోగ సిద్ధిరస్తు” అంటూ దీవించాడా మనీషి.

మర్నాడు ఉదయాన్నే లేచి, బస్టాండుకు వెళ్లారిరువురూ, బావ ఎంత వద్దన్నా వినలేదు. ‘ఇమ్లీబన్‌’ (దాన్నే సెంట్రల్‌ బస్‌ స్టేషన్‌ అంటారు) లో కర్నూలు బస్సు ఎక్కించి వెళ్లాడు. అక్క పతంజలికిష్టమని రాత్రే తపేలాంట్లు చేసింది. అవే రెండు పొట్లం కట్టి యిచ్చింది. జడ్‌చర్లలో అవి తిన్నాడు. అమ్మ చేసిన వాటికీ, అక్క చేసిన వాటికీ తేడా ఏమంటే అక్క తపేలాంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగి వేస్తుంది. అందుకే రుచి ఎక్కువ. పైగా అవి మరుసటి రోజు ఇంకా బాగుంటాయి. పన్నెండు గంటలకల్లా కర్నూలు చేరుకున్నాడు పతంజలి.

కార్యకలాపాలన్నీ యథావిధిగా జరిగిపోతున్నాయి. మహిత ఇంటర్మీడియట్‌ సెకండ్‌ క్లాసులో పాసయ్యింది. మళ్లీ యస్‌.వి. యూనివర్సిటీ బి.ఎ. ఫస్టియర్‌కు ప్రయివేటుగా కట్టించాడు. ఇంగ్లీషు మీడియం తీయించాడు. మల్లినాధ చదువు పూర్తి చేసుకుని శ్రీశైలం నుండి వచ్చేశాడు. పాణిని టెంత్‌ ఈ విద్యా సంవత్సరంలో పూర్తవుతుంది. వాడికి ఎ.పి.ఆర్‌.జె.సి. (ఆంధ్రప్రదేశ్‌ రెడిసెన్షియల్‌ జూనియర్‌ కాలేజెస్‌) ఎంట్రన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ చేయడం ప్రారంభించాడు. ప్రభుత్వం, నాగార్జున సాగర్‌, కొడిగెనహళ్లి, మరికొన్ని చోట్ల ఈ జూనియర్‌ కాలేజీలు కొన్నేళ్ల క్రిందటే ప్రారంభించింది. అత్యున్నత ప్రమాణాలతో అక్కడ బోధన జరుగుతుంది. విద్యార్థులకు చక్కటి హాస్టల్‌ వసతి ఉంటుంది. లెక్చరర్లు కూడా క్యాంపస్‌లోనే నివసిస్తారు. సీట్లను రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్ష ద్వారా ఎన్నిక చేస్తారు. టెంత్‌లో చదువుతూన్న అన్ని సబ్జెక్టులలో మంచి పట్టున్న పిల్లలు మాత్రమే అందులో విజయం సాధిస్తారు. దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్‌, గైడ్స్‌ తమ్మునికిచ్చాడు. ప్రతి ఆదివారం మాడల్‌ టెస్ట్స్‌ కండక్టు చేయసాగాడు. తాను వెళ్లలేనపుడు చిన్నోడినే రమ్మనేవాడు. వాడు కుశాగ్రబుద్ధి. ఇట్లా చూపిస్తే చాలు అట్లా అల్లుకుపోయేవాడు. ఆ పరీక్ష ‘మే’ లో జరుగుతుంది.

డిసెంబరు చివరి వారంలో ఎమ్‌.ఎ. రిజల్టు వచ్చింది. పతంజలికి సెకండ్‌ క్లాస్‌ వచ్చింది. పదిహేను రోజుల తర్వాత మార్క్స్‌ లిస్ట్‌ వచ్చింది. అగ్రిగేట్‌గా ప్రీవియస్‌, ఫైనల్‌ మార్కులు కలిసి 57 శాతం వచ్చింది. అవధానిగారి దీవెన ఫలించింది.

1980

గ్రీటింగ్‌ కార్డుల బిజినెస్‌ ఈ సంవత్సరం కూడ బాగా జరిగింది. మార్చి పరీక్షల తర్వాత ఎ.పి.ఆర్‌.జె.సి ఎంట్రన్స్‌ కోచింగ్‌ అనౌన్సు చేశారు. మొత్తం నలభై ఐదురోజులు ఇంటెన్సివ్‌ కోచింగ్‌! వీక్లీ టెస్ట్‌లు. సొంతంగా రోనియో మిషన్‌ కొన్నారు. స్టడీ మెటీరియల్‌ తయారు చేశారు. వీళ్ల దగ్గర చదువుకున్న పిల్లల్లో కొందరితోబాటు, కొత్తవాళ్లు కొందరు కలిసి మొత్తం నలభై మంది చేరారు. ఆ ఎంట్రన్స్‌ కూడ ఇంగ్లీష్‌లో నైపుణ్యమే విన్నింగ్‌ ఫ్యాక్టర్‌! రెండు బ్యాచ్‌లు చేశారు. ఉదయం ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు. చిన్నోడిని కూడ ఒక బ్యాచ్‌లో కలిపారు. అన్నయ్యకు స్టూడెంట్‌ అయినందుకు వాడి సంబరం చెప్పనలవి కాదు. ఆదివారాలు కూడ సెలవు కాదు. ఫీజు రెండు వందలు.

మేలో అందరూ అహోబిలం వెళ్లి స్వామిని దర్శించుకొని వచ్చారు. మల్లినాధ నాన్న దగ్గర శిక్షణ పొందుతున్నాడు. వాస్తు, జ్యోతిష్యం, చండీయాగాలు, దేవాలయ ప్రతిష్ఠలు, గృహప్రవేశాలు, వివాహాలు, గ్రహశాంతి హోమాలు మొదలైన అన్ని రంగాలలో శ్రీశైలంలో నేర్చుకున్నది ప్రాతిపదికగా, విద్యకు మెరుగులు దిద్దించుకుంటున్నాడు తండ్రితో. మార్కండేయశర్మకు మహదానందంగా ఉంది. మల్లినాధ మంచి నిష్ఠాపరుడు. చక్కటి వాక్‌ శుద్ధి ఉంది. రోజూ సూర్యోదయాత్‌ పూర్వమే లేచి, సహస్ర గాయత్రీ జపం చేస్తాడు. వాడిని అన్ని రంగాలలో పరినిష్ణితునిగా చేయడం కోసం మార్కండేయ శర్మ తాను స్వయంగా అభ్యసించి, కొడుక్కు నేర్పిస్తున్నాడు. ఒకే ఒక్క సంవత్సరంలో మల్లినాధ పరిపూర్ణుడయ్యాడు. తండ్రి, ప్రాక్టికల్‌గా వాడికి వృత్తి నైపుణ్యం అలవడడం కోసం, ఫుల్‌ టైం పురోహితునిగా రంగంలోనికి దింపాడు. ఇద్దరూ కలిసి కార్యక్రమాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. ఇంకో ముగ్గురు నలుగురు శిష్యులతో ఒక టీమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఒక వంట బ్రాహ్మడు కూడ. పతంజలి సూచన మేరకు కొంత వ్యాపార దృక్పథం కూడ కలిపారు. ఉదాహరణకు ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారనుకుందాం. విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభస్థాపన, జపాలు, హోమాలు, అన్నీ చేయిస్తారు. మొత్తం వ్యవహారం కాంట్రాక్ట్‌ తీసుకుంటారు. సంభావనలు, కావలసిన ద్రవ్యాలు, అన్నీ దాంట్లోనే ఇన్‌క్లూడ్‌ అవుతాయి. వీళ్ల టీంకు మాత్రం తమ వంట బ్రాహ్మడితో వంట చేయించుకుంటారు. ఒక సంవత్సరంలోపే మల్లినాధ బాగా ఎస్టాబ్లిష్‌ అయ్యాడు. తండ్రి లేకుండానే ఎంతటి కార్యమైనా నిర్వహించుకొని వస్తున్నాడు. బళ్లారి, బెంగుళూరు, హైదరాబాదు లాంటి ఊళ్లల్లో కూడ వీళ్లకు కస్టమర్లు ఏర్పడ్డారు. ‘మల్లిస్వామి’గా పేరు తెచ్చుకున్నాడు. అతని డేట్స్‌ కోసం తమ ఇళ్లలో కార్యక్రమాలను జనం వాయిదా వేసుకునేంతవరకు వచ్చింది.

కార్యక్రమాలు లేనపుడు ఇంటిదగ్గర ‘కన్సల్టేషన్‌’ తోనే రోజూ తాంబూలాల్లో వంద రూపాయల వరకు సాగింది. ఏమాత్రం మొగమాటం లేకుండా ప్రతిదానికీ ఫీజు నిర్ణయించి వసూలు చేయసాగాడు మల్లినాధ. మార్కండేయశర్మకు ఈ ‘వ్యాపార దృక్పథం’ కొరుకుడు పడలేదు. క్రమంగా ఆయన తన జోక్యం తగ్గించుకోసాగాడు.

ఒక ఆదివారం పతంజలి వెల్దుర్తిలో ఉన్నాడు. డోన్‌ నుండి ఇద్దరు వచ్చారు. వాళ్లలో ఒకాయన కొడుకు యిల్లు కడుతున్నాడట బెంగుళూరులో. దాని వాస్తు గురించి చర్చించడానికి వచ్చారు. పునాది రాయి వేసి భూమి పూజ చేసినప్పటి నుండి, గృహప్రవేశం వరకు బాధ్యత తీసుకుంటాడు మల్లినాధ. వాస్తు శాస్త్రంలో అతడు చెప్పిన సూచనల ప్రకారమే గృహనిర్మాణం జరుగుతుంది.

మల్లినాధ కర్నూలులో ఏదో గ్రహశాంతి చేయించడానికి వెళ్లాడు. మధ్యాహ్నానికి వచ్చేస్తాడు. మార్కండేయశర్మ వారిని కూర్చోబెట్టి, “వివరాలు చెప్పండి నాయనా. నేను చూస్తాను” అన్నాడు.

“మాకు మల్లిస్వామే చూడాలండి. ఆయన వచ్చేంతవరకు ఉంటాము” అన్నారు వారు. మార్కండేయశర్మ ఇది ఊహించలేదు. పతంజలి ఇదంతా గమనిస్తూన్నాడు. తండ్రి వైపు చూస్తున్నాడు. ఆయన నవ్వి ఇలా అన్నాడు.

“నాయనా, పతంజలీ చూడరా నీ తమ్ముని ప్రతిభ. ‘పుత్రాదిచ్ఛేత్‌ పరాజయం’ అన్నట్లుగా వీళ్లకు నా అవసరం లేదట. నా ఆశయం నెరవేరినట్లే. నిన్నే యిట్లా తీర్చి దిద్దుదామని కలలుగన్నాను. నా కలలను మల్లినాధ నిజం చేశాడు”

పతంజలికి ఎక్కడో చదివిన ఉదంతం గుర్తుకువచ్చింది. యస్‌.డి బర్మన్‌ గొప్ప సంగీత దర్శకుడు. కొడుకు ఆర్‌.డి. బర్మన్‌కు సంగీత శిక్షణనిచ్చి తీర్చి దిద్దించాయనే. సిప్పీ ఏదో చిత్ర నిర్మాణం కోసం (బహుశా షోలే అయివుండవచ్చు) బర్మన్ల యింటికి వచ్చాడట. ముందుగా తండ్రి అతనితో మాట్లాడాడట. తనకీ సంగీత దర్శకత్వ బాధ్యతలు అప్పగించటానికి వచ్చాడు సిప్పీ అనుకున్నాడట పెద్దాయన. సిప్పీ అది గ్రహించి వినయంగా చెప్పాడట.

“క్షమించండి. నేను మీ అబ్బాయి కోసం వచ్చాను”

పతంజలి గమనించిందేమిటంటే తండ్రిలో లేని లౌక్యం, జనరంజకత్వం మల్లినాధలో ఉన్నాయి. నాన్న కేవలం శాస్త్రం మాత్రమే చెబుతాడు. మల్లి వారి యోగక్షేమాలు విచారిస్తాడు. సమకాలీన రాజకీయాలు చర్చిస్తాడు. ‘పర్సనల్‌ రిలేషన్స్‌’ పెంచుకుంటాడు. తనకున్న శాస్త్రపరిజ్ఞానానికి వ్యాపార దృక్పథాన్ని జోడించి ఎలా విజయం సాధించాలో అన్నయ్య దగ్గర నేర్చుకున్నాడు. అందుకే వాడు జనప్రియుడైనాడనుకున్నాడు పతంజలి.

చిన్నోడు ఎంట్రన్సులో నెగ్గి, నాగార్జున సాగర్‌లో ఇంటర్మీడియట్‌లో చేరాడు. పతంజలి వాడిని చేర్పించి వచ్చాడు. హాస్టల్‌ వసతి కూడ చాలా బాగుంది. భవిష్యత్తులో వాడిని ఐ.ఎ.ఎస్‌.కు పంపాలని పతంజలి కల. అందుకే ఆర్ట్స్‌ గ్రూపులో చేర్చాడు. అమ్మానాన్నా మొదట ఒప్పుకోలేదు. “నీవు చదువుకున్నట్లే వాడూ చదువుకుంటాడు కదా” అని వారి వాదన. పతంజలి వారికి నచ్చజెప్పాడు.

“నా పరిస్థితి వేరు. వాడు చాలా తెలివైనవాడు. కష్టపడతాడు కూడా. వాడిని ఐ.ఎ.ఎస్‌. ఆఫీసరును చేయాలని నా కోరిక. మంచి మంచి సంస్థల్లో చదివితేనే అది సాధ్యం”

మరో సంవత్సరం గడిచింది. ఒకరోజు రాత్రి క్లాసులయింతర్వాత బయట నడవాలో కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రోడ్డు మీద వెళుతూన్న ఒకాయన క్రిందినుండే పలుకరించాడు.

“స్వామీ, నమస్కారం! బాగున్నారా?”

ఎవరా అని చూశాడు పతంజలి. కంబగిరి రెడ్డి. వెల్దుర్తి ప్రక్కనే నార్లాపురం వాళ్లది.

“రా రెడ్డీ!” అని పైకి పిలిచాడు. కంబగిరి రెడ్డి భోపాల్‌ యూనివర్సిటీలో ఎమ్‌.వి ఎకనమిక్స్‌ చదివాడు. వాళ్ల నాన్న కోటిరెడ్డి మార్కండేయశర్మ శిష్యుడే.

పైకి వచ్చిన పతంజలి ముందు కూర్చున్నాడతను.

“అప్లికేషన్‌ పంపించినావా స్వామీ” అనడిగాడు. “మీ ఇంగ్లీషు సబ్జెక్టుకే చాలా పోస్టులు చూపించినారు”

పతంజలికి అర్థం కాలేదు. “ఏ అప్లికేషను రెడ్డీ!” అనడిగాడు. అతడు ఆశ్చర్యపోయాడు. “ఏంది స్వామీ! సర్వీస్‌ కమీషన్‌ వాండ్లు నోటిషికేషన్‌ ఇచ్చి ఎన్నిరోజులాయె! నీవు సూడనే లేదా? కొంపముంచినావే!”

తన హడావిడిలో తానుండి పతంజలి అసలు నోటిఫికేషన్‌ చూడనేలేదు.

“ఐనా, మన కెక్కడొస్తాయి ఉద్యోగాలు? ఎన్ని రాయలేదు?” అన్నాడు.

“శానా పొరపాటు పడుతుండావు. అవి వేరు, ఇది వేరు. దీనిలో కాంపిటీషన్‌ సబ్జెక్ట్‌ వైజ్‌ మాత్రమే ఉంటాది. ప్రయివేటుగా చదివి 57% తెచ్చుకున్నోడివి నీకు రాకపోతే ఎవరి కొస్తాది?” అన్నాడు కంబగిరి రెడ్డి.

“ఉండు, నాకాడ నోటిఫికేషన్‌ ఉండాల. ఏమన్నా టయముండాదేమో సూద్దాం” అంటూ బ్యాగ్‌లో నుండి ఎపిపియస్‌సి వారి పేపర్‌ కటింగ్‌ తీశాడు.

“సచ్చినాం రేపే లాస్ట్‌ డేట్‌!” అన్నాడు.

పతంజలి నోటిఫికేషన్‌ చదివాడు. జోన్లవారీగా, సబ్జెక్ట్‌ల వారీగా ఎన్ని ఖాళీలున్నాయో వివరంగా ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్ల నియామక ప్రకటన అది. ఇంగ్లీషులోనే చాలా ఖాళీలున్నాయి. లాస్ట్‌ డేట్‌ రేపే! ఎన్‌క్లోజ్‌ చేయవలసిన సర్టిఫికెట్లు చూశాడు. రాధాసారుతో అటెస్ట్‌ చేయించాడు. కాబట్టి అన్నీ ఉన్నాయి. స్టడీ సర్టిఫికెట్‌ నాలుగు నుండి ఐదో తరగతి వరకు మాత్రం లేదని గుర్తు. అయినా రేపే అంటే కష్టమే! కంబగిరి రెడ్డి అన్నాడు. “స్వామీ! సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయా?”

“ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూలు స్టడీ సర్టిఫకెట్‌ మాత్రం లేదనుకుంటా! అయినా ఇప్పటికిప్పుడంటే కష్టంలే రెడ్డీ! నాకు ప్రాప్తం లేదనుకుంటా!” అన్నాడు నిరాశగా పతంజలి.

“నీవు తిక్కోడి మాదిరి మాట్లాడవాకు. రేపు సాయంత్రం ఐదుగంటల వరకు టైముండాది. జెయల్‌ పోస్టంటే ఏందనుకున్నావు? డైరెక్ట్‌ గెజిటెడ్‌ పోస్టు. స్కేలు జూడొకసారి. ఐదేండ్లకొక తూరి పేరివిజన్లు, సంవత్సరానికొకసారి యింక్రిమెంట్లు, లీవులు, మెడికల్‌ లీవులు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్లు, ప్రమోషన్లు, రిటైరయిన తర్వాత పెన్షను, గ్రాట్యుటీ, అబ్బో! గరవర్నమెంటుద్యోగం అందునా గెజిటెడ్‌ ఆఫీసరు ఉద్యోగం జేయనీకె పెట్టి పుట్టిండాల. నా సంగతేమోగాని, నీకు మాత్రం గన్‌ షాట్‌గా ఈ ఉద్యోగం వచ్చి తీరతాదనిపిస్తాంది.”

“ఇప్పుడు అరగంటలో శ్రీశైలం-అనంతపురం బస్సుండాది. పోదాంరా. ఎలిమెంటరీ స్కూలు హెడ్‌మాస్టరు మన మాదన్న సారేగద! ఆయన కాడికి పోయి ఇదీ పరిస్థితి అని చెబితే స్టడీ సర్టిఫికెట్‌ చేపిస్తాడు! మన ఊరి ఖాజా హుస్సేన్‌ తమ్ముడు బడేమియా హైయర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ రేటులోనే పనిచేసేది. సర్టిఫికెట్లన్నీ తీసుకొని తెల్లవారు జామునే బయలుదేరిపో. పదకొండు పన్నెండుకల్లా హైదరాబాదు చేరుకుంటావు. నాంపల్లిలో గాంధీభవన్‌ ఎదురుగానే ‘గృహకల్ప’ బిల్డింగ్‌ వెనక్కు సర్వీస్‌ కమీషన్‌ ఆఫీసు. బడేమియా ఆఫీసు లతా టాకీసు ఎదురుగ్గా. ఆడనే అప్లికేషన్‌ కొనుక్కొని, ఫోటోలతికిస్తే సరిపాయ. ఫీజు అక్కడే పోస్టాఫీసులో పోస్టల్‌ ఆర్డరు తియ్యి. లెయ్యిమరి. ఆ బస్సుపోతే మరి బస్సులుండవు.

‘ఎంత ప్లానింగ్‌? ఎంత బాగా వివరించాడు? సాక్షాత్తు అహోబిలనాథుడే కంబగిరి రెడ్డి రూపంలో వచ్చి తనను సమయానికి ఆదుకున్నాడు.’ అనిపించింది పతంజలికి వెంటనే బయలుదేరాడు. రిక్షాలో బస్టాండుకు వెళుతూండగా రెడ్డి అన్నాడు.

“స్వామీ, ఈ ట్యుటోరియల్స్‌ బుక్‌ షాపు శాశ్వతం కాదు, ఇయ్యాల జరుగుతాయి. కొన్నేండ్ల తర్వాత? జరుగుతాయని గ్యారంటీ లేదు! ఎన్నిసూడలేదు?”

పతంజలికి నిజమే అనిపించింది. వీళ్లు వెళ్లేసరికి బస్సు కదులుతూ ఉంది. ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. తండ్రి అంతగా స్పందించలేదు. సర్టిఫికెట్లు చూసుకున్నాడు. యస్‌.యస్‌.సి నుండి ఎమ్‌.ఎ. వరకు అన్నీ ఉన్నాయి. 6వ తరగతి నుండి టెంత్‌ వరకూ స్టడీ సర్టిఫికెట్‌ ఉంది. నాలుగు ఐదు తరగతులకు కూడ కావాలి. అది లేదు.

వెంటనే కురవగేరి (వీధి)లోని మాదన్నసారింటికి వెళ్లాడు. తలుపు చప్పుడు చేస్తే ఆయన లేచి వచ్చాడు.

“ఏంది స్వామీ! ఈయాలప్పుడు?” అని ఆశ్చర్యపోయాడు. పతంజలి పరిస్థితిలోని తీవ్రతను, అత్యవసరతను ఆయనకు వివరించాడు.

“దాందేముంది? పా పోదాం!” అని ఐదు నిముషాల్లో తయారయ్యాడు. ఇద్దరూ ఎలిమెంటరీ స్కూలుకు వెళ్లారు. తన రూము తెరిచి స్టడీ సర్టిఫికెట్‌ ప్రొఫార్మా బయటకు తీశాడు.

“రికార్డులు వెరిఫై చేసేంత టైం లేదులే. నీవు, నాలుగు, ఐదు ఎప్పుడు సదివినావు?”

“1964 – 1965 సార్‌” అన్నాడు పతంజలి.

“బాగా మతికుంది గదా!”

“అవును సార్‌ 1966-1971 హైస్కూల్లో చదివినాను. 71లో టెంత్‌ రాసినా”

“సరె. సరె” అని పూర్తిపేరు, మిగతా కాలమ్స్‌ అన్నీ నింపి, సంతకం పెట్టి స్టాంపు వేసియిచ్చాడాయన.

“సార్‌! ఒక రిక్వెస్టు” అన్నాడు పతంజలి.

“చెప్పు స్వామీ!” అన్నాడాయన ఆవులిస్తూ.

“ఇప్పుడు దీనికి డుప్లికేట్‌ కాపీ టైప్‌ చేయించి అటెస్టేషన్‌ చేయించే టైం లేదు. దయచేసి ఇంకోటి ఇవ్వరా?”

“ఉండాల్సినోడివి బాపనయ్యా, నీవు!” అని ఇంకో సర్టిఫికెట్‌ ఇచ్చాడు మాదన్నసారు. ఆయనకు పాదాభివందనం చేశాడు పతంజలి.

“భద్రం స్వామీ! స్టడీ సర్టిఫికట్ల ద్వారానే లోకల్‌. నాన్‌ లోకల్‌ క్యాండిడేట్లను తేల్చేది. పోయిరా! ఈ ఉద్యోగం నీకొస్తాదిలే” అన్నాడు ఆయన.

యింటికి చేరుకునేసరికి ఒంటిగంట. ఫోటోలు కూడ తగినన్ని ఉన్నాయి. రాత్రి నిద్ర పట్టలేదు. పొద్దున్నే నాలుగు గంటలకు లేచి, స్నానం చేసి నరసింహస్వామికి పూజ చేసి దీపారాధన చేశాడు. సర్టిఫికెట్లన్నీ సరి చూసుకొని, అమ్మకూ నాన్నకూ మొక్కి బయలుదేరాడు, అమ్మ ఇచ్చిన కాఫీ తాగి.

బస్టాండుకు వెళ్లగానే కర్నూలు వెళ్లే పస్టు బస్సు కోసం చూస్తూంటే న్యూస్‌ పేపర్సు బండిల్స్‌ తెచ్చే కారు వచ్చింది. డోన్‌ వరకు పేపర్లు సరఫరా చేసి వెనక్కి హైదరాబాదుకు వెళుతున్నాడు డ్రయివరు. పతంజలిని ఎక్కించుకున్నాడు. ఎక్స్‌ప్రెస్‌ కంటే పది రూపాయలెక్కువట. కానీ అఫ్జ్‌ల్‌గంజ్‌ దగ్గర దిగిపోవాలట.

కర్నూలు టౌన్‌లోకి కూడ వెళ్లలేదతడు. బైపాస్‌లోనే కారు నిండింది. వెనకసీట్లో నలుగురు ముందు సీట్లో డ్రైవరు గాక ఇద్దరు ఆ వేగం చూసి భయమేసింది పతంజలికి మధ్యలో కొత్తకోటలో టిఫిన్‌కు ఆపాడు. పదిన్నరకల్లా దింపేశాడు.

ఆటోలో లతాటాకీసు ఎదుట నున్న కమీషనరేట్‌కు వెళ్లాడు. దాని ప్రక్కనే నాలుగంతస్తుల ఇంటర్మీడియట్‌ విద్యా మండలి (బోర్డు) భవనం ఉంది. మెయిన్‌ గేట్‌ వద్ద సెక్యూరిటీవాడు లోపలికి పోనివ్వలేదు. విజిటింగ్‌ అవర్స్‌ మధ్యాహ్నం మూడు గంటలకట. వాడి చేతిలో ఐదు రూపాయలు పెడితే నమస్కారం పెట్టి లోపలికి వదిలాడు.

లోపల రిసెప్షన్‌లో ‘బడేమియాగారిని కలవాలని’ చెప్పాడు. థర్డ్ ఫ్లోర్‌లో ఉంటారని తెలుసుకొని వెళితే జి. బడేమియా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అని నేమ్‌ ప్లేట్‌ కనబడిరది. తలుపు తట్టి “మే ఐ కమిన్‌ సర్‌!” అన్నాడు.

“కోన్‌! అందర్‌ ఆయియే” అని వినపడింది.

“గుడ్‌ మార్నింగ్‌ సార్‌! మాది వెల్దుర్తి” అనగానే ఆయన ముఖం వికసించింది. సాదరంగా కూర్చోబెట్టి చాయ్‌ తెప్పించాడు. పతంజలి శర్మగారి కొడుకని తెలుసుకుని ఆనందించాడు.

తాను వచ్చిన పని చెప్పాడు పతంజలి. ఆయన అన్నాడు. “మన కృష్ణ శర్మసార్‌ బావమరిది అసిస్టెంట్‌ సెక్రటరీ మలక్‌పేట్‌ గవర్నమెంట్‌ క్వార్టర్స్‌లో ఒకే బ్లాకులో ఉంటాం ఇద్దరం. ఆయన దగ్గరికి పోదాం పాండి”

ఇద్దరూ బడేమియా స్కూటరు మీద సర్వీస్‌ కమీషన్‌ ఆఫీసుకు వెళ్లారు. చాలా పెద్ద భవనమది. ఏడెనిమిది అంతస్తులుంది.

చంద్రమౌళి తన ఛాంబర్‌లోనే ఉన్నాడు. బడేమియాను చూసి “ఏంరా, సాయిబూ మా ఆఫీసుకొచ్చావు? పొద్దున సిటీ బస్‌లో కలిసే వచ్చాం కదా!” అన్నాడు.

“సరేగాని, ఈ పిల్లవాడెవరో చెప్పు చూద్దాం”

చంద్రమౌళి పతంజలిని గుర్తించలేదు.

“వెల్దుర్తి మార్కండేయశర్మగారి అబ్బాయి. మీ బావకు శిష్యుడు” అంటూ పరిచయం చేశాడు బడేమియా.

చంద్రమౌళి పరమానందభరితుడయ్యాడు. “ఏమి రా నాయనా, ఇంట్లో అందరూ బాగున్నారు కదా! నేను వెల్దుర్తి హైస్కూలోనే యస్‌.యస్‌.యల్‌.సి చదివాను. మా బావగారింట్లోనే ఉండేవాడిని. మీ నాన్నగారు మహా పండితుడు. ఆయనా మా బావ కలిస్తే ఆ పాండిత్య కోలాహలం అద్భుతంగా ఉండేది. సరే ఏం చేస్తున్నావు?”

పతంజలి విషయం వివరించాడు. “మేము నోటిఫికేషన్‌ ఇచ్చి నెల దాటుతూంటే ఇన్ని రోజులు ఏం చేశావురా? సరేలే యు ఆర్‌ ఆన్‌ టైం” అంటూ బెల్‌ కొట్టి అటెండరును పిలిచి “ఒక జె.యల్స్‌ అప్లికేషన్‌ తీసుకురా. నేను పంపించానని క్రింద కౌంటరులో యాదయ్యకు చెప్పు” అన్నాడు.

బడేమియా ఇద్దరికీ చెప్పి వెళ్లిపోయాడు. చంద్రమౌళి అన్నాడు. “వీడున్నాడే సాయిబు. చాలా మంచివాడురా. కష్టపడి పైకొచ్చాడు. హైయర్‌ ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంటులో మంచి పేరుంది వీడికి. మేమిద్దరం వెల్దుర్తి హైస్కూలు విద్యార్థులమే.”

అప్లికేషన్‌ ఫారం వచ్చింది. రెండు రూపాయలు అటెండరుకిచ్చి పంపాడు. చకచక కాలమ్స్‌ అన్నీ నింపాడు పతంజలి. ఫోటోలు అతికించడానికి గమ్‌ కూడ ఉంది. అటెస్టెడ్‌ కాపీలన్నీ ట్యాగ్‌ చేశాడు. సెక్రెటరీ పేరు మీద ఇరవై రూపాయలకు ఒక పోస్టల్‌ ఆర్డరు తెప్పించాడు చంద్రమౌళి. ఆయనే ఫోటోలో ఇతర చోట్ల అటెస్టేషన్‌ చేశాడు. స్టాంపు వేయించాడు.

“నేను గెజిటెడ్‌ క్యాడరేలే. భయపడకు” అన్నాడు నవ్వుతూ. పరీక్షా కేంద్రం కర్నూలు ఎంచుకున్నాడు. చంద్రమౌళి తాను కూడ అన్నీ చెక్‌ చేసి, అటెండరును పిలిచి, క్రింద సబ్మిట్‌ చేసి, అక్‌నాలెడ్జ్‌మెంట్‌ తెమ్మన్నాడు.

(సశేషం)

Exit mobile version