Site icon Sanchika

సాఫల్యం-4

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“నా[/dropcap]లుగుసార్లు వచ్చే అదే వచ్చాది. అదేం పెద్ద. ‘నేర్చుకునేంతవరకు బ్రహ్మ విద్దే, నేర్చుకున్నాక కోతి విద్దె’ అని మన పెద్దోల్లు సెప్పనే సెప్పిరి” అన్నాడు నాయుడు.

వ్యాపారస్థులు ఒక్కొక్కరే రాసాగారు. పన్నెండు కల్లా ప్రారంభమయింది వేలం. ఒక్కోరైతు బస్తాల నుండి పెద్ద సైజు కొకటి, రెండో సైజుకొకటి, మూడో సైజుకొకటి చొప్పున మాత్రమే తెచ్చి, కుట్టు విప్పి నేల మీద చాప మీద పోస్తున్నాడు. సేటుకు ఒక దిళ్లు అమర్చిన కుర్చీ వేసి, దగ్గరగా పెడెస్టెల్ ఫాన్ అమర్చాడు.

బస్తా గుమ్మరించగానే కాయలసైజు, నైగనిగ్యం మొదలైన వాటిని బట్టి “దస్రుపాయ్” అని సేటు అనగానే చుట్టు పక్కలనిలబడిన వ్యాపారస్థులు,

‘బీస్’ ‘తీస్’ ‘పైంతాలీస్’ ‘చాలీస్’ ‘పచాస్’

ఇలా అరుస్తునారు సేటు వైపు చూస్తూ. పాట ఎవరి దగ్గర ఆగుతుందో వారి చూసి సేటు ‘సిద్ధప్ప, బాగల్కోట్ ఖతం’ అనగానే ప్రక్కనే ఉన్న గుమాస్తా, వివరాలు నమోదు చేశాడు. రైతు పేరు, కొన్నవాడి పేరు బస్తాలు I ధర ఇట్లా. ఒక రకానికి చెందిన ఆ విప్పిన బస్తా తప్ప మిగతావి కనీసం తెరచి కూడ చూడటం లేదు. వ్యాపారం నమ్మకం మీద సాగుతూందనటానికి ఇదొక ఉదాహరణ.

అందరికీ కెటిల్ ప్లాస్టిక్ కప్పులతో ‘చాయ్’ తెచ్చాడు ఒక కుర్రాడు. పంచె మోకాళ్లపైకి కట్టుకొని, పైన ఒక టవల్ వేసుకున్నాడు. నుదుట విభూతి రేఖలు, గంధం, కుంకుమ, మెడలో లింగకాయ. లింగాయతుల కుర్రవాడని అర్థమయింది పతంజలికి. అందర్నీ హుషారుగా పలుకరిస్తున్నాడు. జోకులు వేస్తున్నాడు. సేట్‌కు మాత్రం అందమైన డిజైను వున్న పింగాణీ కప్పు, సాసర్లో పెట్టి భయభక్తులతో యిచ్చాడు.

“హేన్రీ నంజుండా!” అని పలకరించాడు సేటు.

“ఏనిల్ల” అని వినయంగా బదులు చెప్పాడు ఆ పిల్లవాడు. సేటు సైగను గ్రహించి వాడికో రూపాయి ఇచ్చాడు గుమాస్తా.

పతంజలి వంతు వచ్చేసరికి ఒంటిగంటయింది. ఎంత ధర పలుకుతుందో అని ఉద్వేగంగా ఉంది. మొదటి బస్తా ‘సత్తర్’ దగ్గర ఆగింది. నాయుడిని అడిగితే ‘డెభై’ అని చెప్పాడు.

“బాగానే పోయిందిలే” అని కూడ అన్నాడు.

రెండో రకం ‘పైంతాలీస్”కు పోయింది. నలభై ఐదు.

మూడో రకం ‘అఠావీస్’ అంటే ఇరవై ఎనిమిది.

“కౌన్ హై వెల్దుర్తీ వాలా!” అని కేక వేశాడు గుమాస్తా.

పతంజలి అతని దగ్గరికి వెళ్లి, “మై, మై” అన్నాడు.

ఒక చీటీ మీద నమూనా బస్తా ధర, బస్తాల సంఖ్య, మూడు రకాలకు లెక్కవేసి యిచ్చాడు. మొత్తం పదిహేను వందల డెభై మూడు రూపాయలు వచ్చింది. పదకొండు వందల నిమ్మకాయలకు వంద రూపాయలు పలికితే మంచి రేటు అని అర్థం. ఎండాకాలం రెండు వందల వరకు వెళుతుంది అరుదుగా. ఒక్కోసారి అనూహ్యంగా పడిపోయి ఇరవై ముప్ఫై రూపాయలకు కూడ పడిపోతుంది. అందుకే రైతులంటారు.

“కచ్చా బేపార్, లుచ్చా బేపార్’ అని పచ్చి సరుకుతో వ్యాపారమంటే పనికిమాలింది అని దాని భావం.

వ్యాపారుల్లో చాలామంది డబ్బు చెల్లించకుండా బస్తాలు ఎత్తించుకొని వెళుతున్నారు. నాయుడిని అడిగితే, “అమ్ముకోని తెచ్చిచ్చారు. సేట్ మనందరికీ తన డబ్బు లిచ్చాడు. పది పర్సెంట్ దొబ్బేదందుకే తురకసాయిబులు” అన్నాడు. ఎవరయినా వింటారనే భయం కూడ లేదాయనకు.

మధ్యాహ్నం రెండు కల్లా బస్తాలన్నీ అమ్ముడుపోయాయి. ఈ ఒక్క మండీలోనే దాదాపు వెయ్యి బస్తాలు అమ్మివుంటారని గ్రహించాడు పతంజలి.

‘మిత్రసమాజ్’లో భోంచేశాడు. భోజనం రూపాయి పావలా. చాలా బాగుంది. ఉప్పుకారాలు బాగా తక్కువ. చారులో సాంబారులో బెల్లం బాగా వేశారు.

పైన హాల్లో కాసేపు కునుకు తీశాడు పతంజలి. 4 గంటలకు ‘నంజుండ’ అందరికీ ‘టీ’లు తెచ్చిచ్చాడు. సాయంత్రం 7 గంటలకు బిల్లు పేమెంటట. నాయుడు, పతంజలి హుబ్లీ నగరం చూడ్డానికి వెళ్లారు. “నేను శానాసార్లు సూసినాగానీ, నీకు సూపిద్దామని” అన్నాడు నాయుడు. ఒక చోట మిరపకాయ బజ్జీలు, మెత్తని ఉల్లిపాయ పకోడీలు, సమోసాలు వేయిస్తున్నారు.

“సామీ! ఈడ ఏమన్నా తిందాం పా. బాగుంటాయి” అన్నాడు నాయుడు.

మిరపకాయ బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయి. రెండవీ, రెండు సమోసాలు తిన్నాడు. నాయుడు డబ్బులివ్వనివ్వలేదు.

“సరేగాని సామీ, డబ్బులు ఎట్లా తీస్కపోదామనుకుంటుండావు?” అని అడిగాడు నాయుడు.

పతంజలికి ఆ విషయంలో అవగాహన లేదని నాయుడికి తెలిసిపోయింది. ఒక షాపు అరుగుమీద మిషన్ పెట్టుకొని కుట్టుకుంటున్న ఒక టైలర్ దగ్గరికి తీసుకెళ్లాడు నాయుడు.

“పైసా రఖ్నే కేలియే ఏక్ లంబీ థైలీ చాహియే” అన్నాడు టైలరుతో.

“దో రూపాయ్ హోతా” అన్నాడతను.

‘సరే’ అని నాయుడు తల ఊపాడు.

ఒక సైను గుడ్డ తీసి, ఒకటిన్నర అడుగుల పొడవుండేలా గొట్టం ఆకారంలో కుట్టి, ఇరువైపులా లాడాలు కుట్టిచ్చాడు. “దీంట్లో డబ్బులు పెట్టుకొని, తెరిచి ఉన్న వైపు ముడివేసుకొని, నడుముకు కట్టుకో. దానిమీద ప్యాంట్ వేసుకో. పైన అంగీ ఉంటాది. అన్నీ పెద్ద నోట్లు (వంద రూ) ఇప్పిచ్చాలే సేటుకు జెప్పి. ఇంక యా దొంగనాయాలు కొట్టేచ్చాడు లెక్క?” (లెక్క అంటే డబ్బు) అన్నాడు నాయుడు. పతంజలికి పెద్ద భారం తీరినట్లయింది.

రాత్రి 8 గంటలకల్లా వివరంగా వారి లెటర్ హెడ్ మీద బిల్లువేసి, కమీషన్ లెస్ చేసి, ఇచ్చాడు గుమాస్తా. ఇంకోకాయన ఒక యినుప పెట్టి వద్ద కూర్చొని డబ్బు యిస్తున్నాడు. నాయుడి రెకమెండీషన్‌తో పదమూడు వందరూపాల నోట్లు, ఒక యాభై రూపాల నోటు, చిల్లర యిచ్చాడాయన. చాలామందికి ఇవ్వలేదు.

“సబ్కో బడానోట్చాహే తో మై కాంసే లానా!” అని విసుక్కుంటున్నాడు.

రాత్రి 11 గంటల హుబ్లీ`గుంటూరు ప్యాసింజరు. హాల్లో పైన ‘లెక్కచిత్తి’ (డబ్బుల సంచిని) జాగ్రత్తగా పతంజలి నడుముకు కట్టాడు నాయుడు. 9:30కి ‘మార్వాడీ భోజనాలయ’ అని రాసి ఉన్న హోటలుకు తీసుకెళ్లాడు.

“నాకు అన్నం వద్దు” అన్నాడు పతంజలి.

“కావాలన్నా ఉండదులే. పుల్కాలు తిందాం. బాగుంటాయి” అన్నాడు నాయుడు.

పతంజలి జీవితంలో మొదటిసారి పుల్కాలు తినడం. పూరీల్లా పొంగి, చాలా మృదువుగా ఉన్నాయి. పుల్కా ఇరవై పైసలే. కూరమాత్రం 2 రూ. కొంచెం ఎక్కువ అనిపించింది. అటువంటి కూర తన జన్మలో తినలేదనుకున్నాడు. ఉర్లగడ్డ, పచ్చిబటాణీ, ఉల్లిపాయ, టమేటా కలిపి చేశారు. గరిట జారుగా పొగలు కక్కుతూ ఉంది.

“దీన్ని ‘ఆలూమటర్’ అంటారు సామి” అన్నాడు నాయుడు.

పదిగంటలు దాటే సరికి హుబ్లీ స్టేషన్ చేరుకున్నారు. 3వ నంబరు ప్లాటుఫారం మీదికి వస్తుందని యింగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లో చెబుతున్నారు.

పదిన్నరకు షెడ్డు నుండి రైలు మెల్లగా ప్లాట్‌ఫారం మీదికి వచ్చింది. దాని కిటికీలకు ఊచలు లేవు. ‘నీవు యిక్కడే ఉండ’మని చెప్పి నాయుడు కిటికీలోంచి లోపలికి దూరి, జనరల్ కంపార్ట్మెంటులో సీట్లపైన సామాను పెట్టుకొనే, రెండు చెక్క బల్లలపై బెడ్ షీట్లు పరచి, ‘బెర్తులు’ రిజర్వేషన్ చేశాడు.

ఇద్దరూ సంచులు తలక్రింద పెట్టుకుని హాయిగా నిద్రపోయారు. ఉదయం 7 గంటలకు బళ్లారి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకొని రైల్లోనే ముఖాలు కడుకున్నారు. రైల్లోనే టీ తాగారు. 8 గంటల కల్లా గుంటకల్ స్టేషన్ వచ్చింది. అక్కడ నాయుడు దిగిపోవాలి. అక్కడినుండి బొంబాయి-మద్రాసు మెయిల్ ఎక్కితే కోడూరు చేరుకుంటాడు. దాన్ని ‘పెద్దలైను’ అంటారు బ్రాడ్గేజ్ అన్నమాట. గుంటూరు లైను చిన్నది. మీటరు గేజ్.

నాయుడు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిపోయాడు. “మళ్లా ఉబ్లీలో కలుచ్చాంటాంలే” అన్నాడు. ఆయన వెళుతూంటే పతంజలికి ఎందుకో బాధనిపించింది.

గుంటకల్ జంక్షన్లో దాదాపు అరగంటకు పైగా రైలాగింది. ప్లాటుఫారం మీదే ‘ఇడ్లీ వడ’ కొనుక్కుని తిన్నాడు. ‘హిందూ’ కొనుక్కొన్నాడు పదిహేను పైసలకు. 11 గంటలకి ద్రోణాచలం వచ్చింది. కాచిగూడ రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు. అంతసేపు వుండటమెందుకని బస్టాండుకు వెళ్లి కర్నూలు బస్సెక్కాడు. 12 గంటల కల్లా యిల్లు చేరుకున్నాడు.

అపూర్వ స్వాగతం లభించింది పతంజలికి. యింట్లో ప్రయాణ విశేషాలు చెప్పాడు. నాన్న ముఖంలో ఒక విధమయిన మెరుపు కనబడింది. హుబ్లీలో పావుకిలో ‘దూద్ పేడా’ కొనుక్కొని వచ్చాడు. అక్కా, చెల్లి, తమ్ముళ్లు తిన్నారు. చాలా బాగుందన్నారు. పతంజలికి ఎందుకో ఎంతో కాన్ఫిడెంట్‌గా అనిపించింది. తన సమర్థత మీద నమ్మకంతో అంత చిన్న వయసులోనే ధైర్యంగా అంతదూరం తనను పంపిన తండ్రిని చూసి గర్వపడ్డాడు.

వాగ్దేవికి ఒక సంబంధం వచ్చింది. వాళ్లది కడప. మోచంపేట రామకృష్ణ హైస్కూలు దగ్గర సొంత యిల్లుంది. అబ్బాయి కెనరా బ్యాంక్‌లో క్లర్కు, చిత్తూరులో పని చేస్తున్నాడు. పేరు రామ్మూర్తి. ముందు మార్కేండేయ శర్మ వెళ్లి మాట్లాడి పెళ్లి చూపులకాహ్వానించి వచ్చాడు. వియ్యంకుడు కాబోయే ఆయన కడప మున్సిపాలిటీలో హెడ్ క్లర్క్. పిల్లవానికి ఒక తమ్ముడు. ఒక అక్క. అక్కకు పెళ్లయింది. వాగ్దేవికి పదిహేడు సంవత్సరాలు. బంగారు బొమ్మలా ఉంటుంది. పిల్లవాడు కూడా ఆ అమ్మాయికి తగినజోడని మృత్యుంజయశర్మ అన్నాడు.

ఒక మంచి రోజు పిల్లవాని తల్లిదండ్రులు, అబ్బాయితో పెళ్లి చూపులకు వచ్చారు. సాదరంగా ఆహ్వానించి జంపఖానాపై కూర్చోబెట్టారు రెడ్డిగారింటి నుండి ఒక గాడ్రెజ్ కుర్చీ తెప్పించి పెళ్లి కొడుక్కు వేశారు. పతంజలికి మాత్రం ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. తెల్లగా బొద్దుగా, ఉంగరాల క్రాపు, ముదురు నీలం రంగు పాంటుమీద బిస్కెట్ కలర్ ఫుల్‌షర్టు టక్ చేశాడు. పతంజలిని చూసి నవ్వుతూ ‘ఏం చదువుతున్నావ’ని అడిగితే, పతంజలి “టెంత్ అయ్యిందండి. కాలేజీలో చేరలేదు. నాన్నగారికి సాయంగా వ్యవసాయం చూసుకుంటున్నాను” అన్నాడు.

“వెరీగుడ్. అయితే ప్రయివేటుగా ఇంటర్మీడియట్‍కు కట్టొచ్చుగదా” అన్నాడు ఆ అబ్బాయి.

“మన రాష్ట్రంలో యింకా ప్రయివేట‌‍గా కూర్చునే అవకాశం లేదనుకుంటా. మధ్యప్రదేశ‌‍లో యింటర్మీడియట్ చేయొచ్చు. కరస్పాండెన్స్ కోర్సు. పోస్టులో స్టడీ మెటీరియల్ పంపుతారు. పోస్టల్ కోచింగని వినే వుంటావు” వినలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు పతంజలి.

“సులభంగానే ఉంటుంది. నాకు 18 సం॥కే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. S.S.L.C మార్కులతో పోస్టల్ డిపార్టుమెంటులో చేస్తూ, ఇందాక చెప్పానే M.P. ఇంటర్ చేశాను. కాకపోతే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండదు. సంస్కృతం గాని, హిందీ గానీ తీసుకోవాలి” అన్నాడు అబ్బాయి. పతంజలికి అతని మాటలు చెవికింపుగా తోచాయి. తండ్రి వైపు చూచాడు. “ఇంట్లోనే చదువుకునేటట్లయితే ఇంకేం?” అన్నాడాయన.

“నేను కడప వెళ్లిం తర్వాత వివరాలన్నీ పంపుతానులెండి” అన్నాడు రామ్మూర్తి. అతనికి 22 సంవత్సరాలట. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ బి.ఏ. వెంకటేశ్వర యూనివర్సిటీకి ప్రయివేటుగా కట్టాడట.

వాగ్దేవిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. అక్కయ్యను చూస్తూనే అబ్బాయి కళ్లు మెరవడం పతంజలి గమనించాడు. వారి కళ్లలో కూడ అంగీకారమే గోచరించింది.

“ఏమయినా అడుగు నాయనా పాపను, నీకు సందేహాలుంటే” అన్నాడు పిల్లవాడి తండ్రి.

“మీకు వంట చేయడం బాగా వచ్చా? నేను భోజన ప్రియుణ్ని” అన్నాడు వాగ్దేవి నవ్వింది.

“వచ్చు” అన్నది.

“ఎంతవరకు చదువుకున్నారు?”

“ఎనిమిదో తరగతి”

అక్కను బహువచనంలో సంబోధించడం గమనించాడు పతంజలి. సంస్కారవంతుడే అనిపించింది.

“ఒక పాట పాడమ్మా” అని అడిగింది వరుని తల్లి.

తన తల్లివైపు చూసింది వాగ్దేవి. పాడమన్నట్లు సైగ చేసింది వర్ధనమ్మ.

గొంతు విప్పి పాడసాగింది.

“కృష్టా మాయింటికీ రావో… శ్రీకృష్ణా మా ఇంటికి రావో

గోవర్ధనాద్రిని, గోటా నిల్పినవాడ

గోవూల కాచేటి గోపాలకృష్ణయ్య…”

“చాలా బాగా పాడావమ్మా” అన్నారు.

“ఇది ఏ సినిమాలోది?” అని అడిగాడు రామ్మూర్తి వాగ్దేవి కళ్లల్లోకి నవ్వుతూ చూస్తూ

ఆ పిల్ల గుండె జల్లుమంది!

“సినిమా పాట కాదు. మా నాన్నగారు రాశారు. స్వరం కూడా ఆయనే కూర్చారు. పేరంటాల్లో పాడటానికని మా అమ్మ నేర్పించింది” అన్నది.

“వెరీగుడ్” అన్నాడతడు.

పెళ్లివాళ్లు పడసాలలోకి వెళ్లి మాట్లాడుకొని వచ్చారు. పిల్లవాని తండ్రి అన్నాడు.

“మా వాడికీ మాకూ అమ్మాయి నచ్చింది. మీరు మంచి రోజు చూచుకొని కడపకు వస్తే, ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకోవచ్చు”

మృత్యుంజయశర్మ సంతోషంగా అంగీకరించాడు.

“ఇంతకూ మీ అమ్మాయికిష్టమేనా మరి?” అన్నాడా అబ్బాయి.

తలుపు చాటునుండీ అన్నీ వింటున్న వాగ్దేవి నవ్వు ముఖంతో లోపలికి పరిగెత్తడం అందరూ చూశారు. నవ్వుకున్నారు.

మంచిరోజు చూసుకొని మృత్యుంజయశర్మ, వర్ధనమ్మ, డోన్ రాముడు కడపకు వెళ్లారు.

“మీకు తెలియనిదేముంది. మావాడు బ్యాంకు ఉద్యోగస్థుడు. ఐదువేల రూపాయలు కట్నం, మా ఆడపిల్లకు అల్లునికి మూడు వందలు లాంఛనాలకు, పెళ్లి బాగా జరిపిస్తే చాలు” అన్నాడాయన.

“అంత తూగలేనండి. కాస్త దయ చూపండి” అన్నాడు శర్మ.

డోన్ రాముడన్నాడు. “మూడు వేల ఐదు వందలు ఐతే మా అన్నయ్యకు కొంచెం తెరిపిగా ఉంటుంది”

“సరే! అమ్మాయిని మావాడు బాగా యిష్టపడుతున్నాడు కాబట్టి నాలుగు వేలు యివ్వండి. పిల్లవానికి వాచీ, ఉంగరం, సైకిలు, ఎలాగూ పెడతారు. “

అన్నింటికీ ఒప్పుకొని వచ్చారు. నిశ్చితార్థాలు అప్పట్లో ఇంత ఘనంగా చేసేవారు కాదు. ఒక మంచిరోజు వాళ్లు కడపనించి వచ్చి “లగ్నపత్రిక” వ్రాసుకొన్నారు. ముహూర్తాలు శర్మగారే పెట్టారు. వచ్చే వేసవిలోనే మే మాసంలో పెళ్లి. వెల్దుర్తిలో వసతులు లేవు కాబట్టి, కర్నూల్లో పెళ్లి చేసేటట్లు నిశ్చయించారు.

వాళ్లు వెళ్లిన రోజు రాత్రి భోజనాల తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. మృత్యుంజయశర్మ ఇలా చెప్పాడు.

“కట్నం నాల్గువేలు, ఆడపడుచు లాంఛనం, వరోపచారాలు ఒక వెయ్యి, సత్రం అద్దె, వంటవాళ్లు, భజంత్రీలు, సరుకులు సంభారాలు, బంధువులకు బట్టలు అన్నీ కలిసి రెండు వేల ఐదువందలకు పైమాటే. మన గేటు చేను రెండెకరాలు అమ్మేస్తే ఐదు వేలు రావొచ్చును. రామలింగయ్యశెట్టి వద్ద ఒక వెయ్యి అప్పు చేద్దాం. యింకా మూడు నెలలుంది కాబట్టి ఒక మండలం రోజులు ఎక్కడయినా పురాణ ప్రవచనం చేస్తాను. సరిపోతుంది. నిమ్మకాయల దిగుబడి రేటు బాగుంటే ఖర్చులు పోను ఒక రెండువేలు రావొచ్చును. ఆ అహోబిల లక్షీనరసింహస్వామి దయతో గట్టెక్కుతే అంతేచాలు.”

“నాన్నా మనం ‘అహోబిలం’ ఎందుకు ఎప్పుడూ వెళ్లం?” అనడిగాడు చిన్నాడు, పాణిని.

పతంజలి మనసులోనూ ఇదే ప్రశ్న. కాని తండ్రిని అడిగే ధైర్యం లేదు. చిన్నాడికి ఆ బాధలేదు.

“ఇంతమందిమి వెళ్లి రావాలంటే మాటలా నాయనా, బస్సు ఛార్జీలే తడిసి మోపెడవుతాయి. అక్క పెళ్ళయింతర్వాత అక్క, బావతో అందరం వెళదాము లెండి. పెళ్లి ఖర్చులో కలిసిపోతుంది” అన్నాడాయన.

పేదరికం ఇంటి దేవున్ని చూడటానికి కూడ అడ్డం వస్తుంది మరి!

పురాణ ప్రవచనం ఈసారి పల్లెటూళ్లలో కాకుండా ఏదయినా టౌన్లో చేస్తే ఆదాయం బాగుంటుందని, డోన్‍కు వెళ్లి అక్కడి వైశ్య ప్రముఖులను రెడ్డి ప్రముఖులను కలిసి ప్రస్తావించాడు శర్మ. ఆయన విద్వత్తు తెలిసిన వారు కాబట్టి వాళ్లు కూడ సంతోషంగా ఆహ్వానించారు.

వ్యవసాయ పనులుంటాయి కాబట్టి పతంజలి, వాగ్దేవి వాడికి వండిపెట్టడానికి, వెల్దుర్తిలో ఉండేటట్లు, మిగతా అందరూ నలభైరోజుల పాటు డోన్‌లో మకాం వేసేటట్లు అనుకున్నారు. డోన్ చిన్నాన్న వాళ్లింట్లో ఉండమని బ్రతిమాలాడు కాని యింతమంది భారమవుతారని ఒప్పుకోలేదు. డోన్‌లో రైల్వేలైనును ఆనుకొని రామాలయం ఉంది. అందులోనే ప్రవచనం శ్రీమద్భాగవతంలోని ముఖ్య ఘట్టాలు. దేవాలయం వెనుక ఒక సత్రం. దానిలో వంట చేసుకోడానికి ఒక గది వసారాలో కాపురం. వంటపాత్రలు, బియ్యం పప్పులు వగైరా సరంజామాతో, ముగ్గురు పిల్లలతో లోకల్ ట్రైన్లో డోన్‌కు బయలుదేరారు. స్వామిని, కుటుంబాన్ని దింపుకొని, రిక్షాల్లో సామాన్లు వేసుకొని, కార్యక్రమ నిర్వాహకులు సత్రంలో దింపారు. వంటకు ఎండుకట్టెలు వసారాలో పది పదిహేను మోపులు వేయించి ఉంచారు. ఒక బొగ్గుల బస్తా కూడ. గదిలో ఒక మూల పొగ గొట్టం ఉన్న చోట పేడతో అలికి, ముగ్గు కర్రలు వేసి, అంతకు ముందే మట్టి పొయ్యి ఉంది కాబట్టి ఆ రోజు వంట మొదలుపెట్టింది వర్ధనమ్మ. అన్నము, ఉర్లగడ్డల సాంబారు చేసింది రాత్రికి. మజ్జిగ ఎవరో తెచ్చియిచ్చారు. సాంబారులోకి వడియాలు, అప్పడాలు లేవని చిన్నోడు పేచీ పెట్టాడు.

“ఇది మన యిల్లు కాదు కద నాన్నా, అయినా వేయించుకోవచ్చుగాని, తేవడం మర్చిపోయాను నాన్నా. అన్నయ్య వచ్చినపుడు తెస్తాడులే” అన్నది తల్లి.

“వడియాలు లేకపోతే ముద్దదిగదా పాణిని మహాశయునికి?” అన్నాడు తండ్రి వాడంటే ఇద్దరికీ మహాగారాబం. కడగొట్టువాడని. తండ్రిని గూడ దబాయించే స్వతంత్రం వాడికుంది.

పురాణ ప్రవచనం అద్భుతంగా సాగుతూంది. హార్మోనిస్టు కూడ వచ్చేశాడు. శర్మకు ఒక ఉన్నతాసనం, మెత్తలతో ఏర్పాటు చేశారు. ప్రక్కనే ఒక స్టూలు మీద శ్రీకృష్ణ పరమాత్మ ‘గీతాబోధన’ ఫోటో ఉంచి దానికి ఒక పూల మాల వేస్తారు రోజూ. మైకు సెట్ కూడా ఏర్పాటయింది.

ఆయన గళం మృదువుగా గంభీరంగా శ్రావ్యంగా ఉంటుంది. గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర మొదలైన ఘట్టాలు పోతనగారి పద్యాలు, వ్యాసుని శ్లోకాలతో ఆయన వివరిస్తూ ఉంటే జనం మంత్ర ముగ్ధుల్లా విన్నారు. ప్రవచనం చివర ఒక పెద్ద యిత్తడి పళ్లెంలో కర్పూరం వెలిగించి శ్రీకృష్ణ పరమాత్మకు ఆయన హారతినిచ్చింతర్వాత, హార్మోనిస్టు ఆ హారతి పళ్లాన్ని శ్రోతల్లోకి తీసుకొని వెళితే, కళ్ళకద్దుకొని దాంట్లో చిల్లర వేసేవారు. ప్రతిరోజూ ఇరవై రూపాయలకు తగ్గేదికాదు.

ప్రవచనం చివరి రోజున ఒక సభ ఏర్పాటు చేశారు. పురప్రముఖులంతా వేదికనలంకరించారు. శర్మగారినీ ఆయన సతీమణినీ ఘనంగా సన్మానించి పట్టుబట్టలు పెట్టారు. శర్మగారికి ఒక ధనిక భక్తుడు ఉంగరం తొడిగాడు. ‘వాసవి ధార్మిక సంస్థ, ద్రోణాచలం’ వారు శర్మగారికి ‘పౌరాణికరత్న’ అని బిరుదు ప్రదానం చేశారు. స్వామిని సత్కరించేందుకుగాను ఊర్లో వసూలు చేసిన ‘పట్టీసొమ్ము’ రెండువేల నూట పదహార్లు తాంబూలంలో పెట్టి యిచ్చారు.

“మాద్రోణాచల పట్టణంలో నలభైరోజులపాటు ‘శ్రీమద్భాగవతము’ను పురాణ ప్రవచనం చేసిన బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన మార్కండేయ శర్మగారికి ‘పౌరాణికరత్న’ అను బిరుదమును గౌరవముగా సమర్పించుకొనుచున్నాము…” ఇట్లు ద్రోణాచల పురజనులు అని అందంగా ప్రింటు చేయించి, ప్రేము కట్టించి యిచ్చారు.

శర్మగారికి, వర్ధనమ్మకు పంచెలచాపులు, చీరలు, రవికెగుడ్డలు చాలామంది యిచ్చారు. వారికి పాద నమస్కారం చేయడానికి జనం బారులు తీరారు.

సత్రానికి, ఇద్దరినీ ఒక ఎద్దులబండిని అలంకరించి, దానిమీద ఊరేగిస్తూ, మేళతాళాలతో తీసుకువచ్చారు.

అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆయన అన్నాడు.

“ఆ నరసింహస్వామి దయ వల్ల పిల్ల పెళ్లికి డబ్బు సమకూరింది దీనితో. ఈ ఉంగరం అల్లునికి పెట్టవచ్చు.

“ఈ పట్టుచీర అమ్మాయికి పనికొస్తుంది” వర్ధనమ్మ. మధ్యతరగతి సర్దుబాటు!

***

1973.

పొలం రెండెకరాలు అమ్ముడుపోయింది. ఆ సంవత్సరం వేరుశనగ పంట బాగా పండినందువల్ల ధర బాగా పలికి ఐదువేలకు పైగా వచ్చింది. రామలింగయ్య శెట్టి వద్ద పదిహేను వందలు అప్పుచేశాడు, అర్ధరూపాయి వడ్డీకి. వచ్చే నెలలోనే పెళ్లి. కర్నూలు పోయి అందరికీ బట్టలు, బంధువుల పెట్టుపోతల బట్టలు తెచ్చారు. ఇంటి మిద్దె మీద చవిటి మన్ను మార్పించి, సున్నాలు వేయించారు. ద్వారబంధాలకు గడపలకు పెయింటింగ్ వేయించారు. పడసాల, హాలుగది, భోజనాలగది, దేవుడి గదుల్లో రంగవల్లులు పెయింట్ చేయించారు. వాగ్దేవికి మూడు పట్టుచీరలు, వర్ధనమ్మ మెళ్లోని పాతకాలపు పలకలగొలుసు చెరిపించి మంగళ సూత్రం గొలుసు చేయించారు. వియ్యంకులు పిల్లకు ఐదు తులాల బంగారం పెట్టారు. అప్పుడు బంగారం నాల్గువందలు తులం. రెండు గాజులు నల్లపూసల చెయిన్ వచ్చాయి. కడప నుండి పెళ్లివారు తరలివచ్చే రైలు/బస్సు చార్జీలు వీళ్లే పెట్టుకోవాలి. తిరుగు ప్రయాణం ఛార్జీలు వాళ్లే పెట్టుకుంటారు. అది విధాయకం.

పది రోజుల ముందే ప్రొద్దుటూరు నుండి మేనత్త, పిల్లలతో వచ్చేసింది. వర్ధనమ్మకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండగలదామె. వసుధ మరింత అందంగా తయారయింది. పావడా, పైట వేసుకుంటూంది. “బాగున్నావా వసుధా!” అంటూ పలకరించాడు పతంజలి మరదలిని. “ఓ, బాగున్నా బావా! నీవు?” అనడిగింది. పతంజలిని ఆసక్తిగా చూస్తూ.

పతంజలికి నూనూగు మీసాలు వస్తున్నాయి. వ్యవసాయ పనులు చేస్తూండటం వల్ల, శరీరం ధృడంగా ఉంది. ఇద్దరికీ కొత్తకొత్తగా ఉంది. మాటిమాటికీ దొంగ చూపులు చూసుకోసాగారు. యవ్వనారంభంలో ఉన్న ఆ లేత హృదయాల్లో ఏదో మధుర భావన.

వడ్లు కూడ బాగానే పండాయాసారి. ‘ఈతగొలలు’ రకం చాలా సన్నబియ్యం వస్తాయి. మరపట్టించి పెట్టారు. డోన్ నుండి రాముడు చిన్నాన్న భార్య వచ్చింది. కృష్ణ శర్మసారు భార్య ఊర్లో ఇంకా బ్రాహ్మణ ముత్తయిదువలు అందరూ కలసి చక్కిలాలు, కారప్పూస, బూందీ, బూందీలడ్డు పెళ్లికి నాలుగు రోజులు ముందే తయారుచేశారు. మంచినూనె (వేరుశనగ నూనె) 10 కిలోల డబ్బాలు ఐదారు తెప్పించారు. రామలింగయ్య శెట్టి నూనె మిల్లు నుండి. అప్పుడు నూనె 10 కిలోల డబ్బా 30 రూ. చక్కెరకు రేషనుండేది. రెడ్డిగారి రెకమెండేషనుతో ఒక బస్తా దొరికింది. వందకేజీలు నూటముప్ఫై రూపాయలు.

కర్నూలులో మూడు సత్రాల్లో కల్యాణమంటపాలున్నాయి. రాంభొట్ల దేవాలయం, మేడం వారి సత్రం, ఇసిక్యాలవారి సత్రం. బి.క్యాంపులో టి.టి.డి. వారి కల్యాణ మంటపం ఉందిగాని, వీళ్ల ముహూర్తానికి ఖాళీ లేదు. ఇసిక్యాలవారి సత్రం ఖాయం చేసుకున్నారు. మూడు రోజులకు రోజుకు రెండు వందలు అద్దె. వంటపాత్రలకు అదనం.

కర్నూల్లో పెళ్లి వంటలకు ప్రసిద్ధి చెందిన నారాయణప్ప బృందాన్ని వంటలకు వడ్డనకు కుదుర్చుకున్నారు. పదార్ధాలన్నీ వీరివే. వారికి రోజుకు వందరూపాయలు ఇవ్వాలి. మొత్తం నల్గురు వంట బ్రాహ్మలు వస్తారు. లెట్రిన్లు, బాత్రూంలు శుభ్రం చేయటానికి సత్రానికి చెందిన తోటీలే ఉన్నారు. భోజనాలు, టిఫిన్లు తిన్న తర్వాత శుభ్రం చేయడానికి వెల్దుర్తి నుండే ముగ్గురు ఆడవాళ్లను మాట్లాడుకున్నారు. భజంత్రీలు వెల్దుర్తి వాళ్లే. ‘మంగలి తిక్కయ్య సన్నాయి బృందం.’ వారికి రెండు వందల పదార్లు.

పెళ్లికి రెండు రోజులు ముందే రెడ్డిగారి ఇనుప ఖనిజం లారీలో సామాన్లన్నీ వేసుకుని కర్నూలు సత్రం చేరుకున్నారు. లారీని ఉచితంగా పంపించాడు రెడ్డి. పతంజలి మిత్రుడు దశరథ వాళ్ల నాన్నే ఆయన. లారీ ప్రయాణం పిల్లలకు భలే సరదాగా అనిపించింది.

మాటి మాటికీ ఏదో ఒక నెపంతో వసుధను పలుకరించేవాడు పతంజలి. తన హుబ్లీ ప్రయాణాలు, ఆసక్తికరంగా చెప్పేవాడు. కళ్లు విప్పార్చుకొని వినేదా పిల్ల. తను కాలేజీలో చదవకుండా ఇంట్లో ఉండి వ్యవసాయం చేస్తుండటం వల్ల తనను చిన్న చూపు చూస్తుందేమో అనుకున్నాడు. కాని అదేం అనిపించలేదు. అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతూంది వసుధ. ప్రొద్దుటూరు గర్ల్స్ హైస్కూల్లో.

లారీలో ప్యాంటు, ఫుల్ షర్టు వేసుకుని, మంచి చెప్పులు వేసుకున్నాడు పతంజలి. వసుధ నీలం రంగు పావడా, పసుపుపచ్చ జాకెట్, తెల్ల పైట ధరించి మెరిసిపోతూ ఉంది.

“డ్రస్ బాగుంది బావా నీది” అన్నది మెల్లగా పతంజలికి మాత్రమే వినబడేట్టు.

“నేను బాగాలేనా?” అన్నాడు చిలిపిగా చూస్తూ.

“చీపో, నేనలా అన్నానా! ఇంట్లో పంచల్లో చూశాను. ప్యాంటు షర్టులో బాగున్నావు.”

“నీకంటేనా! నీవైతే ముద్ద బంతిలా ఉన్నావు” అన్నాడు ధైర్యం చేసి.

“నీవు చదువు కొనసాగించి ఉంటే బాగుండేది బావా!” అన్నది వసుధ.

“తప్పకుండా చదువుతాను వసుధా! కానీ ప్రయివేటుగా ఇంటర్మీడియట్‌కు కడతాను. వాగ్దేవక్క మొగుడు రామూర్తి బావ దాని వివరాలిస్తానన్నాడు తెలుసా!” అన్నాడు. ఆ మాటలంటున్నపుడు పతంజలిలో ఒక ఆత్మ విశ్వాసం ప్రతిఫలించింది.

“నీవు తప్పకుండా చేయగలవులే. చాలా తెలివయినవాడివి. అందుకనే….” అని ఆగిందా పిల్ల.

“అందుకనే….?”

“ఏం లేదులే” అంది ఆ అమ్మాయి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. కళ్లు వాల్చుకుంది.

పతంజలికి అర్థమయ్యీ కానట్టు వుంది. గుండె నిండా మధుర భావనలు. ఒక ఆడపిల్ల, అందునా ఎంతో యిష్టపడే మరదలు నీవు చాలా తెలివయినవాడివని కితాబిస్తే పడుచుపిల్లవానికి ఏనుగెక్కినట్లు ఉంది.

(సశేషం)

Exit mobile version