Site icon Sanchika

సాఫల్యం-40

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[పొద్దుటూరులో భువనకి పెళ్ళి కుదురుతుంది. భువన పెళ్ళికి పతంజలి కుటుంబమంతా వెళ్తుంది. పెళ్ళి బాగా జరుగుతుంది. వసుధ, పతంజలి ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటారు. ఇంటర్ పాసయిన మహితను ప్రైవేటుగా డిగ్రీలో చేరుస్తాడు పతంజలి. మల్లినాధ తన శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు. పాణినికి ఎ.పి.ఆర్.జె.సి. పరీక్షకి శిక్షణనిస్తాడు పతంజలి. ఎం.ఎ. పరీక్షల ఫలితాలు వస్తాయి. పతంజలికి 57% వచ్చింది. పుస్తకాలు, గ్రీటింగ్ కార్డుల వ్యాపారం బాగా సాగుతుంది. మల్లినాధ తండ్రి దగ్గర మరింత శిక్షణ తీసుకుని పురోహితునిగా రాణిస్తాడు. పాణినిని ఐ.ఎ.ఎస్. చదివించాలనుకుంటాడు పతంజలి. ఒకరోజు మిత్రుడు కంబగిరి రెడ్డి కలిసి సర్వీస్ కమీషన్ వాళ్ళ నోటిఫికేషన్‍కి అప్లికేషన్ పంపావా అని అడిగితే, దాని గురించి తనకి తెలియదంటాడు పతంజలి. కంబగిరి రెడ్డి అప్పటికప్పుడు నోటిఫికేషన్ చూపించి, మరునాడే ఆఖరు తేదీ అనీ అప్లయి చేయమని గట్టిగా ప్రోత్సాహిస్తాడు. మాదన్నసారు స్టడీ సర్టిఫికెట్ సిద్ధం చేస్తారు. మర్నాడు ఉదయం హైదరాబాద్ వెళ్ళి తెలిసిన మిత్రులు బడేమియా, చంద్రమౌళి గార్ల సహాయంతో ఆఫీసులో అప్లికేషన్ అందజేస్తాడు పతంజలి. – ఇక చదవండి.]

“పరీక్ష దాదాపు మూడు నెలలుంది. అంతా సబ్జెక్ట్‌ పరంగానే ఉంటుంది. డిస్‌క్రిప్టివ్‌. యూనివర్సిటీ పరీక్షల మాదిరి కాకుండా డీప్‌గా అనలిటికల్‌గా ఉంటాయి ప్రశ్నలు. ఈ మూడు నెలలు బాగా ప్రిపేరవ్వు” అని చెప్పాడాయన.

అక్‌నాలెడ్జ్‌మెంట్‌ వచ్చింది. “చాలా కృతజ్ఞతలండీ. మీరు చేసిన మేలు..”

“చాల్లే ఆపు. మనలో మనకు ఫార్మాలిటీస్‌ ఎందుకు? ఒంటి గంట దాటింది. పద భోంచేసి వెళుదువుగాని” అన్నాడాయన. తన లంచ్‌ బాక్స్‌ అటెండరుకిచ్చి తినమన్నాడు. ఇద్దరూ కలిసి నాంపల్లి రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ‘అంబీస్‌ కేఫ్‌’ లో భోజనం చేశారు. చంద్రమౌళి పతంజలిని బిల్‌ పే చేయనివ్వలేదు. “యు ఆర్‌ మై గెస్ట్‌” అన్నాడు.

“మరి తరువాత కార్యక్రమం?”

“సికింద్రాబాదులో మా అక్కావాళ్లున్నారన్నా. వాళ్లను చూసి, రాత్రి బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌లో వెళ్లిపోతా”

“వెరీగుడ్‌. రోడ్‌ క్రాస్‌ చేసి పబ్లిక్‌ గార్డెన్స్‌ బస్టాపువద్ద ‘8ఎ’ ఎక్కు. ఆల్‌ ది బెస్ట్‌” అని వెళ్లిపోయాడాయన.

మధ్యాహ్నం కాబట్టి బస్సులు రద్దీగా లేవు. టాంక్‌బండ్‌ దాటి, రాణిగంజ్‌ వస్తూనే అర్థమయింది పతంజలికి. తాను సికింద్రాబాదు స్టేషన్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, నెక్ట్స్‌ స్టాప్‌ జేమ్స్‌ స్ట్రీట్‌లో దిగి బ్యాంకుకు వెళ్లి బావను కలిశాడు.

“వాటె ప్లెజంట్‌ సర్ప్రైయిజ్‌!” అన్నాడు బావ. “ఏమిటీ హఠాదాగమనం? గుణనిధి కథలో ‘చుక్క తెగిపడిన వడుపున’ వచ్చితివే? విశేషమేమి శ్యాలకా?” అన్నాడు నాటకీయంగా.

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుకు అప్లయ్‌ చేయడానికి సర్వీస్‌ కమీషన్‌ ఆఫీసుకు వచ్చానని చెప్పాడు బావతో. లాస్ట్‌ మినిట్‌లో తెలిసిందనీ, చెయిన్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ అన్నీ వివరించాడు.

“ఇట్‌ సీమ్స్‌ లార్డ్‌ నరసింహ ఈజ్‌ బిహైండ్‌ దిస్‌ మిరకిల్‌” అన్నాడు బావ.

పతంజలి మనసులోనే స్వామిని ధ్యానించుకున్నాడు.

క్రిందికి వచ్చి ఇద్దరూ ‘టీ’ త్రాగారు. స్కూటర్‌ మీద పతంజలిని ఇంటిదగ్గర డ్రాప్‌ చేసి వెంటనే వెళ్లిపోతూంటే, “రాత్రి బెంగుళూరు ట్రెయిన్‌కు వెళ్లిపోవాలి బావా” అన్నాడు పతంజలి. “నీ మొహం. అంతా నీ యిష్టమేనా! వాగ్దేవి సామ్రాజ్యమిది. రామ్మూర్తి గారు మహా మంత్రి. సాయంత్రం త్వరగా వస్తాం. నీవెప్పుడు వెళ్లాలో నిర్ణయిస్తాం” అంటూ వెళ్లిపోయాడు, ఇంట్లోకి కూడ రాకుండా.

సడన్‌గా వచ్చిన తమ్ముడిని చూసి ఆశ్చర్యపోయింది అక్కయ్య. తాను హైదరాబాదుకు అనుకోకుండా ఎందుకు రావలసి వచ్చిందో చెప్పాడామెకు. కాసేపు పడుకుని లేచాడు. బావ ఏడుగంటలకల్లా వచ్చేశాడు. సాయంత్రం మేనల్లుళ్లిదర్దర్నీ తీసుకొని నరసింహస్వామినీ, మహంకాళి అమ్మవారినీ దర్శించుకున్నాడు. పిల్లలకు బిస్కెట్స్‌, చాక్లెట్స్‌, అక్కకు పూలు, నాలుగు, యాపిల్లు తీసుకొని వచ్చాడు.

‘మల్లినాధ వైభవం’ గురించి చెప్పాడు పతంజలి అక్కాబావలకు. రామ్మూర్తి అన్నాడు. “వాడికి అనువైన వృత్తినే వాడు ఎంచుకున్నాడు. మామ శిక్షణ వాడికి ప్లస్‌ అయింది. నీవు కూడ నీ మెళకువలు నేర్పి ఉంటావు. ఇక వాడికెదురుండదు.”

“సరేగాని, పాణిని గాడి సంగతేమిటి?”

“మొన్ననే గదా సాగర్‌లో చేరింది? ఇంకా సంవత్సరంన్నర తర్వాతి సంగతి”

“అదే తప్పు. ప్రాప్తకాలజ్ఞుడిలా కాకుండా దీర్ఘదర్శిలా ఆలోచించు. మూడు చేపల కథ తెలిసిందే కదా! వాడిని అయ్యెయెస్‌కు పంపాలని ధ్యేయం పెట్టుకున్నావు కాబట్టి డిగ్రీ స్థాయి నుండే వాడిని సన్నద్ధం చేయాలి. మా ఆర్‌.ఎమ్‌ గారమ్మాయిని ఇంటర్‌ తర్వాత ఢిల్లీలో సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చేర్చారు. మన దేశంలోని పేరిన్నిక గన్న కాలేజీల్లో అదొకటట. డిగ్రీ మూడు సంవత్సరాలూ, ఐ.ఎ.ఎస్‌ ఓరియంటేషన్‌తోనే బోధిస్తారట. ఆర్ట్స్‌ స్ట్రీము వాళ్లే ఎక్కువగా విజయం సాధిస్తారట. వాళ్లు తీసుకునే సబ్జెక్టు కూడ సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సైకాలజీ లాంటివేనట. ఢిల్లీలో ఉంచి చదివించడం అంటే మన లాంటివాళ్లకు తలకు మించిందే అనుకో. కానీ పాణిని డిజర్వ్స్ సచ్ ఎడ్యుకేషన్‌. హి నీడ్స్‌ గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌. ఏమంటావు?”

“తప్పకుండా బావా, నరసింహస్వామి దయవల్ల ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. దాని అడ్మిషన్‌ వివరాలు కనుక్కోండి.”

“తెలుసుకున్నా. ఎంట్రన్స్‌ ఏమీ ఉండదట. ఇంటర్‌లో సాధించిన మార్కులు ఆధారంగానే సీటు ఇస్తారట. కాదురా, అంత సంపాదిస్తున్నారు నీవూ నీ తమ్ముడూ. ఇదిగో బావా ఈ పదివేలు తీసుకో అని ఒక్కమాటైనా వచ్చిందా మీ నోటి నుంచి?” అన్నాడు బావ.

“ఆశకు హద్దుండాలి. సిగ్గులేకపోతే సరి” అన్నది అక్కయ్య నవ్వుతూ.

“నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?”

“బావ సంగతి నాకు తెలుసులేవే! ఊరికే నన్ను ఆట పట్టిస్తాడాయన”

“మైడియర్‌ బ్రదరిన్లా, మీరంతా వృద్ధిలోకి వస్తున్నందుకు నాకు గర్వంగా ఉందిరా. మీ డబ్బు నాకెందుకు? దేవుడు నాకేలోటూ చేయలేదు. నాకు హైదరాబాదుతో ఋణం తీరిపోతోందిరోయ్‌”

“ఎందుకు బావా?”

“వచ్చే నెలలో మేనేజరుగా ప్రమోషన్‌ వస్తుందంటున్నారు. ప్రమోషనూ, ట్రాన్స్‌ఫరూ విడదీయరానివి బాలకా”

“అయితే కర్నూలుకు ట్రై చేయండి. మాకు దగ్గరగా ఉంటారు”

“ఇంకా నయం. వెల్దుర్తిలో బ్రాంచి తెరిచి, అక్కడకు రండి అనలేదు.”

“నీక్కూడా కర్నూలుతో ఋణంతీరిపోబోతూంది లేవోయ్‌”

“అదేమిటి బావా! అలా అన్నావు?”

“నీవు జూనియర్‌ లెక్చరర్‌గా సెలెక్ట్ కావడం తథ్యం. అప్పుడ ఈ ట్యుటోరియల్స్‌, పబ్లికేషన్సు, బుక్‌షాపు అన్నీ ఏం చేస్తావు మరి?”

“వచ్చినపుడు ఆలోచిద్దాం”

“పిల్లల కోసం అశ్వత్థ ప్రదక్షిణాలు చేసి, బొడ్డులో వేలు పెట్టి చూసుకుందట మీలాంటామె ఒకరు. కడుపు పెరిగిందేమోనని. అలా వుంది మీరు చెప్పేది” అంది వాగ్దేవి.

“ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమని అప్లికేషన్‌ ఇచ్చి ఇరవైనాలుగు గంటలు కాలేదు. అప్పుడే ఎంత దూరం ఆలోచిస్తున్నావు బావా?” అన్నాడు పతంజలి.

“దీర్ఘదర్శులలాగే ఆలోచిస్తారోయ్‌! నీవూ మీ అక్క సామెతల మీద సామెతలు గుప్పించినా నేను చెప్పేది జరిగి తీరుతుంది. సరేగాని భామామణీ! సామెతలేనా ‘మేత’ ఏమైనా ఉందా?”

అక్కయ్య పెసరపప్పు నేతితో దొరగా వేయించి, మామిడికాయ పప్పు పలుచగా చేసింది. పొదీనా పచ్చడి నూరింది. బావ ఆలూచిప్స్‌ తెచ్చాడు. అందరూ భోంచేశారు.

“వడియాలు వేయించలేదామ్మా” అని అడిగాడు శశిగాడు.

“వీడికి చిన్నమామ బుద్ధులొచ్చాయే! వాడూ అంతే, పల్చగా ఉన్న పప్పు పులుసైనా, సాంబారైనా, వడియాలు అప్పడాలు వేయించకపోతే ఒప్పుకోడు వెధవ” అన్నాడు పతంజలి.

అందరూ నవ్వుకున్నారు.

“బావా! విత్‌యువర్‌ కైండ్‌ పర్మిషన్‌, షల్‌ ఐ లీవ్ టుమారో మార్నింగ్‌?”

“పర్మిషన్‌ గ్రాంటెడ్‌” అన్నాడు బావ.

మరునాడు మధ్యాహ్నానికి కర్నూలు చేరుకున్నాడు. వెల్దుర్తికి వెళ్లి యమ్‌.ఎ. పుస్తకాలు కొన్ని తెచ్చుకుని సర్వీస్‌ కమీషన్‌ పరీక్షకు ప్రిపేరవడం ప్రారంభించాడు. కంబగిరి రెడ్డి రావడం, తనను మోటివేట్‌ చేయడం, అర్ధరాత్రి మూదన్నసారును లేపి స్టడీ సర్టిఫికెట్‌ తెచ్చుకోవడం, బడేమియా, చంద్రమౌళిగార్ల సహకారంతో అప్లికేషన్‌ సబ్మిట్‌ చేయడం అంతా కలలో జరిగినట్లుగా అనిపిస్తూంది పతంజలికి. కానీ అది నిజం.

మూడు నెలల తర్వాత హాల్‌ టికెట్‌ వచ్చింది. కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కాలేజి సెంటరిచ్చారు. ఆదివారం పరీక్ష. రెండు సెషన్సులో ఉంది. ఉదయం 3 గంటలు మధ్యాహ్నం 3 గంటలు. సిలబస్‌ పరిచితమే గాని అడిగిన ప్రశ్నలు చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. యూనివర్సిటీ పరీక్షలకని చదువుకున్న దాన్ని అప్పటికప్పుడు ప్రశ్నలకనుగుణంగా, సృజనాత్మకంగా వ్రాయవలసి వచ్చింది. వ్రాత పరీక్షకు ఎనభై శాతం, మౌఖిక పరీక్షకు ఇరవై శాతం మార్కులుంటాయిని తెలిసింది. పరీక్షా కేంద్రం దగ్గర ఒకాయన యిలా అంటూంటే విన్నాడు.

“ఈ సర్వీస్‌ కమీషన్‌ నియామకాలు తేలడానికి సంవత్సరాలు పట్టేస్తాయి.”

మొత్తానికి యూనివర్సిటీ పరీక్షలు వ్రాసిందానికంటే సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష చాలా సంతృప్తినిచ్చింది. ఛాలెంజింగ్‌ అనిపించింది. తన భావాలను ధైర్యంగా, చక్కని భాషలో వ్యక్తీకరించాడు. “సరే మన ప్రయత్నం మనం చేశాము. ఫలితం ఎలా వుంటుందో మరి. భగవంతుని అనుగ్రహం ఎంత ఉన్నా, మన కృషి శూన్యమయినపుడు ఆయన మాత్రం ఏం చేయగలడు?” అనుకున్నాడు పతంజలి. ‘హితోపదేశం’లోని శ్లోకం గుర్తొచ్చింది.

కాకతాళీయవత్‌ ప్రాప్తం, దృష్ట్వాపి నిధిమగ్రతః।

న స్వయం దైవమాదత్తే, పురుషార్ధమపేక్షతే॥

‘కాకతాళీయంగా అంటే అనుకోకుండా మనకు ఒక నిధి లభించినా, దేవుడు దాన్ని తెచ్చి మన యింట్లో పెట్టడు. దానిని గునపంతో తవ్వాలి, పారతో మట్టితీసి, రక్షణగా ఉన్న సర్పాన్ని ప్రసన్నం చేసుకొని, శాంతి మంత్రాలు జపించి ఇంటికి తెచ్చుకోవాలి’. అని దానర్థం. ‘సర్వీస్‌ కమీషన్‌ పరీక్ష నిధి అనుకుంటే దానికి అవకాశం కల్పించడం వరకే దేవుని పని. పరీక్షకు బాగా ప్రిపేరయి. అద్భుతంగా రాసి, ఇంటర్వ్యూలో నెగ్గి, ఉద్యోగం సాధించడం మన పని’ అనుకున్నాడు. ఈ మూడు నెలలూ తన బాధ్యతలను కూడ స్వీకరించి, తనకు చదువుకోవడానికి అవకాశమిచ్చిన మునికి, ఉస్మాన్‌కు తానెప్పుడూ రుణపడి ఉండాలి.

ఒకరోజు అశనిపాతంలా ఒక టెలిగ్రాం వచ్చింది. ‘ప్రొద్దుటూరులో మేనత్తకు సీరియస్‌గా ఉంది. కర్నూలు జనరల్‌ హాస్పిటల్‌కు తీసుకొని వస్తున్నాము.’ అని దాని సారాంశం. ఆ రోజు సాయంత్రానికే అత్తను తీసుకొని వసుధ, భరత్‌, వాళ్ల పెద్దబావ వచ్చేశారు. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. ఆమెకు డయాబెటిస్‌ అడ్వాన్సుడు స్టేజిలో ఉంది. అప్పటికి సమాజంలో దానిమీద అవగాహన లేదు. దానికి తోడు ఆమెకు గర్భకోశంలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉంది. హాస్పిటల్‌కు దగ్గరగా కశిరెడ్డి శ్యాలమ్మ సత్రంలో గది తీసుకున్నారు. వసుధ వాళ్ల పెద్దక్క కూడ మరుసటి రోజు వచ్చింది.

వాళ్లకు కావలసినవన్నీ పతంజలి చూస్తున్నాడు. వారం రోజులు మృత్యువుతో పోరాడుతూనే ఉంది. మేనత్త. వసుధ, భరత్‌ బాగా కృంగిపోయారు. వాళ్లిద్దరికీ ధైర్యం చెబుతూ వచ్చాడు పతంజలి. భువన, మహీధర్‌ వచ్చి వెళ్లారు. అమ్మానాన్నా చూసిపోతున్నారు. చివరికి డాక్టర్లు లాభం లేదని పెదవి విరిచారు. మహా అయితే వారం పది రోజులు కన్న బ్రతకదని తేల్చారు.

తనను ప్రొద్దుటూరుకు తీసుకెళ్లమని, తన స్వగృహంలోనే చనిపోతానని మేనత్త వేడుకుంది. ఆమెను ప్రొద్దుటూరుకు తరలించారు. వెళ్లిన వారంరోజుల్లోనే వసుధను, భరత్‌కు అన్యాయం చేసి మేనత్త కానరాని లోకాలకు తరలిపోయింది! వెల్దుర్తి నుండి అందరూ వెళ్లారు. అంత్యక్రియలు, అపరకర్మలు మార్కండేయశర్మ దగ్గరుండి జరిపించాడు. వసుధ భరత్‌ మామను పట్టుకొని విలపించారు. వసుధ వాళ్ల బావకు ప్రొద్దుటూరికే ట్రాన్స్‌ఫరయిందట ఈమధ్యే. వాళ్లు పక్కవీధిలోనే ఉంటారు. ఆమె వయసులో చాలా పెద్దది. తల్లి లేని లోటు ఆమె భర్తీ చేయాలి. పతంజలి బయలుదేరుతూంటే అక్కాతమ్ముళ్లిద్దరూ భోరుమన్నారు. ఇదర్నీ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు.

“బి బ్రేవ్‌ వసుధా, లుక్‌ ఆఫ్టర్‌ యువర్‌ బ్రదర్‌” అన్నాడు. భరత్‌, పాణిని ఒకే వయసు వారు.

కర్నూలుకు తిరిగి వచ్చినా వసుధ దీనవదనమే పతంజలిని వెంటాడసాగింది. కానీ ‘టైం ఈజ్‌ ఎ గ్రేట్‌ హీలర్‌’. ఎంతటి దుఃఖాన్నైనా మాన్పగల శక్తి దానికుంది.

ఆరు నెలలు గడిచాయి. సర్వీస్‌ కమీషన్‌ వారి నుండి హైదరాబాదుకు యింటర్వ్యూకు రమ్మని కాల్‌ లెటరు వచ్చింది. ఆ రోజు వెళ్ళి చంద్రమౌళిని కలిశాడు. ఆయన బెస్ట్ విషెస్‌ చెప్పాడు. వెయిట్‌ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉత్తర కోస్తా జిల్లాల వాళ్లే ఉన్నారని గ్రహించాడు. వేరు వేరు బ్లాకులలో వివిధ సబ్జెక్టులకు యింటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. కంబగిరిరెడ్డి కూడ వచ్చాడు. పతంజలి రిజిస్టర్‌ నంబర్‌ తీసుకున్నాడు.

పతంజలి వంతు వచ్చింది. ఎందుకో చాలా నెర్వస్‌గా అనిపిస్తూంది. నరసింహస్వామిని తల్చుకుని ‘ఉగ్రంవీరం’ చెప్పుకున్నాడు. అంతే. ఆత్మవిశ్వాసం ఆవహించింది.

ఒరిజినల్‌ సర్టిఫికెట్లన్నీ పరిశీలించారు. టెంత్‌ నుండి పి.జి. వరకు ప్రయివేటుగా చదువకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంగ్లీషు సాహిత్యంలోని ప్రశ్నలు వేశారు చివరగా ఒకాయన అన్నాడు.

“మిస్టర్‌ పతంజలీ! ఇమాజిన్‌ యు ఆర్‌ అవర్‌ లెక్చరర్‌ అండ్‌ వి ఆర్‌ యువర్‌ స్టూడెంట్స్‌. ప్లీజ్‌ టీచ్‌ అజ్‌ సంథింగ్‌”

పతంజలి వెంటనే లేచి నిలబడి, “డియర్‌ స్టూడెంట్స్‌!” అని వారి సంబోధించాడు. వెంటనే లోగొంతుకతో “ఎక్స్‌క్యూజ్‌ మి సర్స్‌” అన్నాడు. “నొ. నొ. యు ఆర్‌ రైట్‌. క్యారీ ఆన్‌” అన్నాడింకో ఆయన. పతంజలికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది.

“నౌ లెటజ్‌ టేకప్‌ పొయట్రీ. యు మైట్‌ హావ్‌ హెర్డ్‌ అబౌట్‌ కీట్స్‌. హి ఈజ్‌ ఎ గ్రేట్‌ రొమాంటిక్‌ పొయెట్‌. హిజ్‌ పొయెమ్స్‌ ఆర్‌ నోటెడ్‌ ఫర్‌ దైర్‌ రిచ్ ఇమేజరీ అండ్‌ సెన్సుయస్‌నస్‌. డు యు నో వాట్‌ ఈజ్‌ సెన్సుయస్‌నెస్‌? ఇటీజ్‌ కంప్లీటలీ డిఫరెంట్‌ ఫ్రం సెన్సుయాలిటీ. అఫ్‌కోర్స్‌. బోత్‌ ది టర్మ్స్ ఆర్‌ ఒరిజినేటెడ్‌ ఫ్రం దివర్డ్‌ సెన్సెస్‌”….

అలా కీట్స్‌ గురించి ఆయన కవిత్వం గురించి ఐదు నిమిషాలు ఏకధాటిగా చెప్పాడు. ఎక్కడా తడబడలేదు. ఆగండని వారు చెప్పేంతవరకు ఆపలేదు.

“గుడ్‌ జాబ్‌! ఇన్‌ స్పయిటాఫ్‌ యువర్‌ బీయింగ్‌ ఏ ప్రైవేట్‌ క్యాండిడేట్‌, యువర్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆర్‌ అప్‌ టుది మార్క్‌. యుకెన్‌ గో.”

అమ్మయ్య అనుకొని బయటకు వచ్చాడు. చంద్రమౌళిని కలిసి ఇంటర్వ్యూ బాగా చేశానని చెప్పాడు. ఆయన ఒక సలహా చెప్పాడు. “మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వారిలో గంగాధర్‌ అని ఉస్మానియా ప్రొఫెసర్‌ ఉన్నాడు. మనవాళ్లే. (అంటే బ్రాహ్మడని అర్థం) ఆయనకు కొంచెం ఎవరయినా రెకమెండ్‌ చేయగలిగితే బెటర్‌ ఛాన్సెస్‌ ఉంటాయి”

పతంజలికి తిరుమలావధానిగారు గుర్తుకు వచ్చారు. చంద్రమౌళితో చెబితే, “ఆయన ఈయనకు చెప్పినాడంటే తిరుగుండదు” అన్నాడు.

అక్కడ నుండి బర్కత్‌పురాలోని అవధానిగారింటికి వెళ్లాడు. ఆయన పోయిన సంవత్సరమే పదవీ విరమణ చేశాట. పతంజలి వెళ్లేసరికి ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఏదో రాసుకుంటున్నారు. పతంజలిని చూసి లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించారు. పతంజలి కూర్చున్న తర్వాతే, ఆయన కూర్చున్నారు. ‘వినయ సౌశీల్యం రూపుదాల్సితే అవధానిగారే’ అనిపించిందాక్షణాన. ‘సర్వత్ర సమదర్శినః యోగినః’ అనే సూక్తికి ఆయనే స్ఫూర్తి. రఘువంశం చెప్పేటప్పుడు తన తండ్రి కాళిదాసు వినయాన్ని గురించి అశువుగా చెప్పిన పద్యం గుర్తొచ్చింది. అది అర్ధాంతరన్యాసాలంకారంలో ఉంది. చివర్లో తండ్రి ఇలా చెప్పాడు.

‘ధీ లక్ష్మీ కృపాపత్రులీ వసుధన్‌ గర్వము బొందనేరరు గదా ప్రఖ్యాతులై యొప్పినన్‌’

“చెప్పునాయనా, శర్మగారు కుశలమేనా?” అన్నారాయన.

అవునని చెప్పి, ఇంటర్వ్యూకు సర్వీస్‌ కమీషన్‌కు వచ్చానని, బాగా చేశానని చెప్పాడు. తర్వాత సంశయిస్తూంటే ఆయన “ఫర్వాలేదు చెప్పు” అన్నారు.

‘గంగాధర్‌ గారు ఇంటర్వ్యూలో బోర్డు మెంబరనీ, ఆయనకు అవధానిగారు తన గురించి ఒకమాట చెబితే బాగుంటుందేమో’ననీ వినయంగా చెప్పాడు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమన్నాడు.

అవధానిగారు గంభీర ముద్ర దాల్చారు. “నీ మీద నీకు నమ్మకం ఉందా లేదా అని చెప్పు ముందు” అన్నారు.

“వంద శాతం ఉంది స్వామీ” అన్నాడు పతంజలి.

“ఇంటర్వ్యూలో ఏమడిగారు?” అని తెలుసుకున్నాడు. “గంగాధర్‌ అంటే స్థూలకాయం. పచ్చటి పసిమి ఛాయ. బట్టతల. అతనేనా?” సభ్యులు ముగ్గురిలో ఆ వర్ణనకు సరిపోయేది ఆయనొకడే.

“అవునండి. చివర్లో, ‘నీవు ప్రయివేటుగా అన్నీ చదివినా, నీ భావవ్యక్తీకరణ చాలా బాగుంది’ అని నన్ను ప్రశంసించింది కూడ ఆయనే నండి” అన్నాడు.

అవధానిగారు ఇలా అన్నారు.

“నాయనా! నీకు ఏ రెకమేండేషన్‌ అవసరంలేదు. ఆ గంగాధర్‌ నాకు తెలుసు. యోగ్యుడు. ఇటువంటి ప్రలోభాలకు లొంగడు. మనం చెబితే, విషయం వికటించే ప్రమాదం కూడ ఉంది. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం’ అని, వారు నీ ప్రతిభను గుర్తించారు. ఇంకొక విషయం. వ్రాత పరీక్షకు ఎనభై, ఇంటర్‌వ్యూకు ఇరవై చొప్పున మార్కులుంటాయి. నీవింకేమీ ఆలోచించకు నీకు అన్నిటికంటే పవర్‌ఫుల్‌ రెకమెండేషన్‌ మొదటినుండీ ఉండనే ఉంది. అదేమిటో నేను చెప్పనవసరం లేదు” అన్నాడాయన.

పతంజలి తనువు పులకరించింది. దిగ్గున లేచి, చేతులు జోడిరచుకొని, అరమోడ్పు కళ్లతో,

“లక్ష్మీపతే! కమలనాభ ! సురేశ ! విష్ణో !

యజ్ఞేశ! యజ్ఞ ! మధు సూదన ! విశ్వరూప !

బ్రహ్మణ్య ! కేశవ ! జనార్దన ! వాసుదేవ !

లక్ష్మీనృసింహ ! మమదేహి ! కరాలవమ్బమ్‌ ! “

అంటూ గద్గద స్వరంతో ప్రార్థన చేశాడు.

“నన్ను క్షమించండి!” అంటూ అవధానిగారికి మోకరిల్లాడు.

“విజయోస్తు! ఎప్పుడూ స్వశక్తిని నమ్ముకో. దైవశక్తి కోసం ప్రార్థించు అంతే!” అన్నాడాయన.

మరొకసారి ఆయనకు ప్రణమిల్లి సెలవు తీసుకొని వచ్చేశాడు పతంజలి. అతని మనసిప్పుడు దూదిపింజెలా తేలిపోతూ ఉంది.

కాలం తన పనితాను చేసుకొని పోతూ ఉంది. ఒకరోజు ఆదివారం పతంజలి వెల్దుర్తిలో ఉన్నాడు. ప్రొద్దుటూరు నుండి వసుధ వాళ్ల పెద్దక్క, బావ వచ్చారు. భోజనాలు అయింతర్వాత వసుంధర వదినె తాము వచ్చిన విషయం ప్రస్తావించింది.

“మామా! పతంజలిని మా వసుధకు అడగడానికని వచ్చినాము. అమ్మ పోయిన సంవత్సరం లోపు పెళ్లి జరిగితే అమ్మకు కన్యాదానం ఫలం దక్కుతుందని చెప్పారు. కొంతమంది అది మగవాళ్లకే వర్తిస్తుంది. పైగా ఆమె విధవ అంటున్నారు. వసుధకూ పతంజలి అంటే ఇష్టమే. మీరు సరేనంటే ఆ శుభకార్యం కానిచ్చేద్దాము.”

మార్కండేయ శర్మ అన్నాడు. “శాస్త్ర చర్చ అనవసరం. మగవాడికి ఒక శాస్త్రం ఆడదానికి ఒక శాస్త్రం ఉండదు. అవన్నీ పురుషాధిక్య సమాజం నిర్ణయించిన పక్షపాత సిద్ధాంతాలు. లక్షమ్మ నా చెల్లెలు. చిన్న వయసులో భర్తను కోల్పోయినా అధైర్యపడకుండా మిమ్మల్నందర్నీ కాచుకున్నది. దాని కూతుర్ని నా కొడుక్కు చేసుకోవడమంటే అన్నయ్యగా నా బాధ్యత నిర్వర్తించడం తప్ప ఇంకేమిటి? ఈ శాస్త్రాలు పక్కన బెడితే, ఈ వివాహం వల్ల దాని ఆత్మ శాంతిస్తుంది.” అన్నాడాయన.

వింటూన్న పతంజలి ఆశ్చర్యపోయాడు. తండ్రి ఛాందసుడనుకున్నాడు కాని ఇంత అభ్యుదయవాది అనుకోలేదు. వర్ధనమ్మ కల్పించుకొని అన్నది.

“మీ అమ్మ హాస్పిటల్‌లో చివరి క్షణాల్లోనైనా ఒక్కమాట అనలేదు. నా బిడ్డను నీ యింటి కోడలిగా చేసుకో వదినా అని.”

ఎంతైనా అమ్మకూడ సగటు స్త్రీయే అనిపించింది పతంజలికి. ‘ఆడపడచు పట్ల మాత్సర్యం’ అంటే ఇదేనేమో!

“నా చెల్లెలున్న పరిస్థితిలో అలాంటి ప్రస్తావన ఎలా తెస్తుంది. విచక్షణ లేకుండా మాట్లాడకు. నీ కిష్టము లేదా చెప్పు” అన్నాడు నాన్న.

“మీ యిష్టమూ నా యిష్టమూ కాదండీ ముఖ్యం. వాడికిష్టమా కాదా అడగండి.”

పతంజలి వైపు చూశాడు తండ్రి.

“నాకూ వసుధంటే ఇష్టమే నాన్నా” అన్నాడు పతంజలి. వసుధ వాళ్ల బావ చాలా మితభాషి. ఆయన మౌనంగా అందరి మాటలు వింటున్నాడు.

“అయితే శుభస్యశ్రీఘ్రం. వచ్చే నెలలోనే నిశ్చితార్థం చేసుకుందాము. మాఘంలో ముహూర్తం చూస్తాను” అని పంచాంగం చూశాడు శర్మ.

“వచ్చేనెల 21వ తేదీ, సప్తమి బుధవారం గట్టి తట్ట (తాంబూలాలు) మార్చి 27 దివ్యంగా ఉంది. మేనరికాలకు జాతకాలు చూడవలసిని పని లేదు.” అన్నాడు.

మరుసటి రోజు వసుందర వదినెనూ, అన్నయ్య నూతనతో పాటు కర్నూలు తీసుకొని వెళ్లి ప్రొద్దుటూరు బస్సెకించాడు. ముని, ఉస్మాన్‌ ఈ వార్త విని సంతోషించారు.

నిశ్చితార్థానికి అమ్మ, నాన్న, మహిత వెళ్లారు. పతంజలి వెళ్లలేదు. హైదరాబాదు నుండి అక్కయను పిల్లలను డైరెక్ట్‌గా ప్రొద్దుటూరుకు పంపాడు బావ. నాంపల్లిలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్‌ చేయించాడు. భరత్‌ ఎర్రగుంట్లలో వాళ్లను దింపుకున్నాడు. నిశ్చితార్థం చేసుకుని అందరూ వెల్దుర్తికి వచ్చారు. వసుధకు పట్టుచీర కర్నూల్లో తీసుకొని పంపాడు పతంజలి. నేరేడు పండు కలరు మీద పింక్‌ జరీ వర్కు వచ్చింది. “నీవు పంపిన చీర తనకు చాలా నచ్చిందని చెప్పమందిరా వసుధ!” అన్నది వాగ్దేవి. మామ కోడలికి రెండుతులాలతో గొలుసు చేయించాడు.

అక్కయ్యను కర్నూల్లో హైదరాబాదు బస్సు ఎక్కించాడు పతంజలి. బావ ఆమెను ఇమ్లీబన్‌లో దింపుకుంటాడు. ఆయనకు ముందు రోజే టెలిగ్రాం ఇచ్చారు.

వెడ్డింగ్‌ కార్డ్స్‌ ప్రింట్‌ అయ్యాయి. బంధువులందరికీ పోస్ట్‌ చేశారు. కర్నూల్లో తన సర్కిల్‌లో అందరికీ స్వయంగా ఇచ్చాడు. నిశ్చితార్థంలోనే పెట్టుపోతలన్నీ అనుకుని వచ్చారు. పెళ్లికూతురికి ఎనిమిది తులాల బంగారం వీళ్లు పెట్టేటట్టు, పట్టు చీరలకు ఐదువేల రూపాయలు ఇచ్చేటట్లు వరునికి ఇరవై వేలు కట్నం, పెళ్లివారి బస్సు ఛార్జీలు, ఆడపెళ్లివారే భరించేటట్లు మాట్లాడుకున్నారు. పెళ్లి ప్రొద్దుటూరులోనే, వారి బంధువు ఆడిటర్‌గారింట్లో జరుపుతారు. భువన పెళ్లి జరిగిన చోటే.

వెల్దుర్తి నుండి వీరితో బాటు వచ్చే బంధువులు మిత్రులు దాదాపు యాభై మంది తేలారు. కర్నూల్లో ఒక ప్రయివేటు బస్సు మాట్లాడాడు పతంజలి. కర్నూలు వాళ్లు పదిమంది ఉంటారు.

మార్చి 26 ఉదయం పతంజలిని పెళ్లి కొడుకును చేశారు. భోజనాలయింతర్వాత మూడు గంటలకు బస్సు బయలుదేరింది. డోన్‌ బేతంచెర్ల, బనగానిపల్లె మీదుగా ప్రొద్దుటూరికి రాత్రి ఏడున్నరకు చేరుకున్నారు. అడిటర్‌ గారిల్లే విడిది. అరటికాయ బజ్జీ, హల్వా వచ్చాయి. కాఫీలు త్రాగారు. తొమ్మిది గంటలకు అందరూ ముస్తాబులు చేసుకొని సిద్ధమయ్యారు. విడిదిముందే పెద్ద షామియానా వేశారు. అందులోనే ‘ఎదుర్కోళ్లు’ వేడుక. పతంజలి నేవీ బ్లూ కలర్‌ ప్లెయిన్‌ పుల్‌ షర్టు, బ్రౌన్‌ కలర్‌ ప్యాంటులోనికి టక్‌ చేశాడు.

రెండు వర్గాలూ 50 గజాల దూరంలో మోహరించాయి. వసుధ లేత పసుపు రంగు పట్టుచీర ధరించింది. దానిమీద ఎర్రరంగు చిలుకలు ముద్రించి ఉన్నాయి. బార్డరంతా చిలుకలే. మ్యాచింగ్‌ రవికె ధరించింది. మొగలి రేకులతో జడ కుట్టారు. అసలే అందగత్తె. దానికా అలంకరణ తోడవడంతో జగన్మోహినిలా ఉంది.

దూరం నుంచే చెయ్యి ఊపి వసుధను పలకరించాడు పతంజలి. ‘సూపర్‌’గా ఉన్నావు అనే అర్థం వచ్చే విధంగా చేతివేళ్లతో సూచించాడు. పెళ్లి కూతురు ముగ్ధమనోహరంగా నవ్వింది. ‘నీవు కూడా’ అన్నట్లుగా సంజ్ఞ చేసింది. వసుధ వైపు భువన, మహీధర్‌, పతంజలి వైపు వాగ్దేవి, రామ్మూర్తి ఎదుర్కోళ్ల వేడుక నడిపారు. పాణిని అన్నయ్య ప్రక్కనే నిలబడ్డాడు. చివరకు వధూవరులతో దండలు మార్పించారు. పన్నీరు, గంధంపొడి చల్లుకున్నారందరూ. వధువు వరుడికి ఎడమవైపు చేరింది. ఆమె చిటికెన వేలును పట్టుకోమన్నాడు పురోహితుడు. పతంజలి ఆమె అరచేయిని తన అరచేతిలో ఇముడ్చుకొని నొక్కుతూ స్పర్శాసుఖం అనుభవిస్తూంటే వాగ్దేవి అతని చెవిలో చెప్పింది. “ఓవరాక్షన్‌ చేయకు, ఆయన పట్టుకోమన్నది చిటికెన వేలును మాత్రమే”. టక్కున చేయివదిలి బుద్ధిమంతుడిలా చిటికెన వేలు పట్టుకున్నాడు. వసుధ అతన్ని క్రీగంట చూసి నవ్వింది.

ఇదర్నీ పీటలమీద కూర్చోబెట్టి కొంత తంతునడిపాడు పురోహితుడు. భువన వాళ్ల పెళ్లి చేసింది కూడ ఆయనే. రాత్రి భోజనాలు పూర్తయ్యేసరికి పదకొండు దాటింది.

మర్నాడు పదకొండు గంటల పదమూడు నిమిషాలకు ముహూర్తం. ఉదయం టిఫిన్‌ ఉగ్గాని, బజ్జీ. బాజిరెడ్డి దంపతులు, రాధాసారు కుటుంబం, దేవ సహాయంసారు ఆయన భార్య, ముని, శివ, ఉస్మాన్‌ మస్తానమ్మ, ఆమె కొడుకు వచ్చారు. వెల్దుర్తి పురప్రముఖులు, పతంజలి స్కూల్‌ మేట్స్‌ హాజరయ్యారు. విశేషమేమంటే మద్రాసు నుండి పెంచలయ్య కూడ రావడం.

రామ్మూర్తి బావ స్నఫ్‌ కలర్‌ సఫారీ డ్రస్‌లో హుందాగా తిరుగుతున్నాడు. ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించాడు స్వామి. మంగళసూత్రధారణ పూర్తయింది. వసుధ మెళ్లో తాళి కడుతూన్నపుడు ఆమె కళ్లు చెమ్మగిల్లడం గమనించాడు. కూర్చున్న తర్వాత కళ్లతోనే ప్రశ్నించాడు.

“ఏంలేదు. మా అమ్మ ఉండి ఉంటే ఎంత సంతోషించేదో కదా!” అన్నది. పతంజలికి మేనత్త గుర్తొచ్చింది. తనంటే ఆమెకు చాలా యిష్టం. పోటీలు పడి తలంబ్రాలు పోసుకున్నారివురు. అలా పెళ్లి అనే బంధం వాళ్లిద్దర్నీ మరింత ఆత్మీయుల్ని చేసింది. తర్వాత కొన్ని హోమాలు జరిగాయి.

దాదాపు నూటయాబై మంది భోజనాలు చేశారు. మజ్జిగ పులుసు చివరి బంతికి చాలలేదనీ, భక్ష్యాలు కొందరికి మాడినవి వేశారనీ వరుని వైపు బంధువులు కొన్ని విమర్శలు చేశారు. అవన్నీ సహజం భోజనాలయినతర్వాత పెళ్లి బస్సులో అందరూ వెళ్లిపోయారు. తోడు పెళ్లికొడుకుగా చిన్నోడిని ఉంచి వెళ్లారు. వాడు సెకండియర్‌ పరీక్షలు రాసి, నాగార్జున సాగర్‌ నుండి వచ్చేశాడు. వాడికి వదిన తెగ నచ్చేసింది. పతంజలి వసుధతో స్వీట్‌ నథింగ్స్‌ చెప్పుకుందామంటే మధ్యలో దూరి “వదినా మా కాలేజీలో” అంటూ ఏవో చెపుతున్నాడు. పతంజలి అవస్థ చూసి వసుధ నవ్వు ఆపుకోలేకపోతోంది.

ఆరోజు రాత్రే శోభనం. వసుధ వాళ్లింట్లో మిద్దె మీద గదిలో ఏర్పాటు చేశారు. మంచాన్ని పూలమాలలతో అలంకరించారు. పళ్లేలతో స్వీట్స్‌, హాట్‌, పళ్లు పెట్టారు. కొంతసేపు ఇద్దర్నీ పీటల మీద కూర్చోబెట్టి చిన్న తంతు నడిపించాక ఇద్దర్నీ గదిలోకి పంపించారు.

ఇద్దరూ మంచంమీద పక్కపక్కన కూర్చున్నారు. ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. “అయామ్‌ వెరీ లక్కీ వసుధా!” అన్నాడామె చెవిలో.

“ఐటూ బావా!” అన్నది వసుధ గుసగుసగా. “ఇక మీద మిమ్మల్ని ‘ఏమండీ!’ అని పిలవాలేమో” అన్నది.

“ఏకాంతంలో ‘ఓరేయ్‌’ అని పిలిచినా తప్పులేదని శాస్త్రం” అన్నాడు.

“మరీ అంతవద్దుగాని, మనిద్దరం ఉన్నప్పుడు మాత్రం ‘బావా’ అనే పిలుస్తా.”

“ఆ పిలుపే మధురం”

దిండుమీద వాలి పడుకున్నాడు. వసుధ అతని వక్షం మీద తలవాల్చి పడుకుంది. ఆమె చుట్టూ చేతులు వేశాడు. ఇద్దరికీ తరతరాల స్నేహం ఉన్నట్లుగా అనిపిస్తూంది. అదే భారతీయ వివాహ వ్యవస్థ గొప్పతనం.

“ఐవాంట్‌ యువర్‌కో ఆపరేషన్‌” అన్నాడు ఆమె చెవిలో. “మనిద్దరికీ కొత్తే. చిన్న నర్వస్‌నెస్‌, కన్‌ప్యూజన్‌గా ఉంది”

“గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది, అదియే వలపు పాఠం” అని ఏదో సినిమాలో చెప్పాడుగా యన్‌.టి.ఆర్‌? అయినా ‘సక్సెస్‌’ పేరిట సంస్థలు నడుపుతూ….”

ఇద్దరూ ఒకటయ్యారు. వసుధ అనురాగంతో సహకరించింది. ‘సక్సెస్‌ఫుల్‌ మ్యారేజ్‌ లైఫ్‌’ ప్రారంభమయింది.

ఉదయం పతంజలికి మెలకువ వచ్చే సరికి వసుధ లేదు. కాసేపలాగే పడుకున్నాడు. కాసేపటికి వచ్చింది. తలస్నానం చేసి మెత్తటి కాటన్‌ చీర కట్టుకొని ఉంది. పచ్చని ఆమె మెడలో మంగళసూత్రాలు నుద్టు కుంకుమబొట్టు మెరుస్తున్నాయి.

(సశేషం)

Exit mobile version