Site icon Sanchika

సాఫల్యం-44

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[లైబ్రేరియన్ సూర్యనారాయణ ఇంటికి మారిపోతాడు పతంజలి. ఇద్దరూ కలిసి వంట చేసుకుంటారు. పోలీస్‌ కాలనీలో జగన్నాధరావు అనే రిటైర్డ్ సి.ఐ. ఇంట ఒక పోర్షన్‌ ఖాళీగా ఉందని మల్లి చెబితే వెళ్ళి చూస్తారు. ఆ ఇల్లు పతంజలికి నచ్చింది. అద్దె కాస్త ఎక్కువయినా రెండు రోజుల్లో చేరిపోతాడు. బజారుకు వెళ్లి రెండు స్టవ్‌లు ఒక చాప, దిండు, దుప్పటి కొంటాడు. కిరణా సామాన్లు, అవి పోసి పెట్టుకోడానికి డబ్బాలు, సీసాలు కొంటాడు. లక్ష్మీనరసింహస్వామి పటం తెచ్చుకొని, పూజ చేసి పాలు పొంగిస్తాడు. ఇంట్లో వండుకోవడం ప్రారంభిస్తాడు. సప్లిమెంటరీ పరీక్షలలో ఇన్విజిలేషన్‌ డ్యూటీ చేస్తాడు. దసరా సెలవలికి వెల్దుర్తి వెళతాడు. పలాస విశేషాలు అందరికీ చెప్తాడు. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు వసుధ చెబుతుంది. పండగకి పతంజలిని, వసుధని చిత్తూరుకు రమ్మని ఆమె అక్కయ్య పిలుస్తుంది. ఇద్దరూ వెళతారు. భువన వాళ్ళు కూడా వస్తారు. భువన భర్తకి తాండూరుకు బదిలీ అయిందని తెలుస్తుంది. వాళ్ళు కూడా అమ్మానాన్నలు అవబోతున్నారని చెప్తారు. పండగ అయ్యాకా వసుధ, పతంజలి రైల్లో పలాస చేరుతారు. ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఇంటి వద్ద ఇంగ్లీషు ట్యూషన్స్ ప్రారంభిస్తాడు పతంజలి. బాగా చెప్తాడన్న పేరు వస్తుంది. వసుధకి తొమ్మిదో నెల వస్తుంది. పురిటికి చిత్తూరు తీసుకువెళ్ళడానికి భరత్ వస్తాడు. ఇద్దరినీ రైలు ఎక్కిస్తాడు పతంజలి. – ఇక చదవండి.]

[dropcap]సై[/dropcap]కిలు స్టాండ్‌లో సైకిలు తీసుకొని ఇల్లు చేరుకున్నాడు ఒక్కసారిగా మనసంతా శూన్యం ఆవరించింది. వంటింట్లో గట్టు దగ్గర నిలబడి వసుధ వంట చేస్తున్నట్లుగా భ్రమపడ్డాడు. కిటికీలోంచి కండ్ల నిండా నీళ్లతో తన వైపే బేలగా చూస్తున్న ఆమె వదనమే కనబడసాగింది. ఎంతకీ నిద్ర పట్టలేదు.

ఒకవారం రోజుల్లో విజయవాడ, వెల్దుర్తి, చిత్తూరుల నుండి వసుధ ఉత్తరాలు వ్రాసింది. చిత్తూరులో డాక్టర్‌ వరలక్ష్మి అనే గైనకాలజిస్ట్‌ దగ్గరికి వసుంధరక్కయ్య తీసుకొని వెళ్లిందట. ఆమె పరీక్షించి అంతా నార్మల్‌గా ఉందని చెప్పిందట డెలివరీకి ఇంకా టైం పడుతుందట.

ట్యూషన్లు కూడ పూర్తయ్యాయి. మార్చిలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరిగాయి. పతంజలి ఇన్విజిలేషన్‌ డ్యూటీ చేశాడు రోజూ. ఉదయం 11 గం॥ పరీక్ష ఐపోతే ఇంటికి వచ్చి ఏదో వండుకొనేవాడు. ఒక్కోరోజు మల్లి లేదా తుంబనాధంగారు భోజనానికి పిలిచేవారు. ఇంకా నాలుగయిదు పరీక్షలుండగానే స్పాట్‌ వాల్యుయేషన్‌ ఆర్డర్స్‌ వచ్చాయి. ఇంగ్లీషు, తెలుగు మాస్టార్లకి, పతంజలికి ఖమ్మం వేశారు. ఆ రోజే రిలీవయ్యాడు.

రాత్రి కోణార్క్‌‌లో బయలుదేరి మరుసటి రోజు తొమ్మిదిన్నరకే ఖమ్మం చేరుకున్నాడు. రైల్లోనే కాలకృత్యాలు తీర్చుకొని టిఫిన్‌ చేశాడు. బ్యాగ్‌తో డైరెక్ట్‌‌గా వాల్యుయేషన్‌ సెంటరుకు వెళ్లాడు. అది ఒక ఎయిడెడ్‌ కాలేజి. విశాలమయిన ప్రాంగణం, యల్‌ షేపులో భవనాలు మూడంతస్తులున్నాయి. ఇంటర్‌, డిగ్రీ కూడ ఉంది.

‘క్యాంప్‌ ఆఫీసర్‌’ అని తలుపు మీద స్టిక్కరు అతికించి ఉన్న గదిలోకి వెళ్లాడు. కేవలం ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టులే కాబట్టి లెక్చరర్స్‌ రద్దీలేదట. ఆ రూంలోనే ఒక మూల ఒక టేబులు, కుర్చీ వేసుకొని ఒక సీనియర్‌ లెక్చరర్‌ కూర్చొన్నాడు. ఆయన వెనుక గోడమీద ‘ఎ.సి.వో (వాల్యుయేషన్‌) ఇంగ్లీష్‌’ అని కాగితం అంటించి ఉంది.

వెళ్లి ఆయనను విష్‌ చేశాడు. “మీ అపాయింట్‌మెంట్‌ ఆర్డరు. రిలీవింగ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వండి మాస్టారు!” అన్నాడాయన. తన దగ్గర బోర్డు నుండి వచ్చిన లిస్ట్‌ చూసి పతంజలి పేరు వద్ద టిక్కు పెట్టుకున్నాడు. “మీకు స్క్రూటీనైజర్స్‌‌గా యిస్తాము. కాసేపు వెయిట్‌ చెయ్యిండి” అన్నాడు.

పతంజలి ఆ రూంలోనే బెంచీమీద కూర్చున్నాడు. బ్యాగ్‌లోనుండి ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ వ్రాసిన ‘ది అన్‌టచ్‌బుల్‌’ అనే నవల తీసి చదవసాగాడు. ఇంతలో ఒకతను వచ్చి ప్రక్కన కూర్చున్నాడు.

“అయాం ఉదయకుమార్‌. జె.యల్‌. ఇన్‌ ఇంగ్లీష్‌ ఫ్రం ‘ప్రియాగ్రహారం’, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌” అని పరిచయం చేసుకున్నాడు.

పతంజలి కూడ తనను గురించి చెప్పుకున్నాడు.

“మీరు చాలా అదృష్టవంతులండీ’ అన్నాడతను. “పలాస” మంచి ప్లేసు. రైల్వే స్టేషన్‌, జాతీయ రహదారి మీదే ఉంటుందట కదా! మాది హారిబుల్‌ ప్లేసు. టీ కూడ దొరకదు. ‘నరసన్నపేట’ లో ఉంది రోజూ 28 కి.మీ వెళ్లి రావాలి. బస్సులు కూడ చాల తక్కువ.”

పతంజలి మనసులోనే బడేమియాకు ధ్యాంక్స్‌ చెప్పుకున్నాడు.

లెక్చరర్స్‌ రద్దీ పెరిగింది. ఎ.సి.వో గారు బిజీ బిజీగా ఉన్నారు.

“అంత త్వరగా అవదులేండి. లంచ్‌ టైం వరకు రిపోర్టు చేయవచ్చు. పదండి ఈలోగా ‘ష్టీ’ తాగి వద్దాం” అన్నాడు ఉదయ కుమార్‌ “ష్టీ” అనడంలోనే అతనిలో సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువని గ్రహించాడు పతంజలి.

ఇద్దరూ బయటకు వెళ్లారు. మెయిన్‌ గేటుకు ప్రక్కనే లోపల ఒక రేకుల షెడ్‌లో క్యాంటీన్‌ ఉంది. సీసాల్లో రకరకాల బేకరీ బిస్కట్లున్నాయి. ఒక ట్రేలో చిన్న ఉల్లి సమోసాలు, మరొక దాంట్లో పొడవైన అరటికాయ బజ్జీలు, మరొక దాంట్లో మసాలా వడలు ఉన్నాయి. టిఫిన్‌ ఇడ్లీ, వడ, పూరీ కూడ దొరుకుతున్నాయి. కాఫీ టీ సరేసరి.

“నాలుగు సమోసాలివ్వు” అన్నాడు ఉదయ్‌.

న్యూస్‌పేపర్‌ ముక్కలో పెట్టి ఇచ్చాడు క్యాంటీనతను. అప్పుడే వచ్చాయేమో వేడిగా కరకరలాడుతూ బాగున్నాయి. టీ తాగారు. పతంజలి డబ్బులిచ్చాడు.

“నానేతంతానంతే బోయినాల తర్వాతే మనకు పనిత్తారు. ఏంతంతావు?” అన్నాడు ఉదయ్‌ శ్రీకాకుళం యాసలో. పతంజలికి టక్కున గోరింటాకు సినిమాలో చలం, రమాప్రభ మాట్లాడే విధానం గుర్తుకొచ్చింది.

“నానేతంతను? నువ్వేతంతే నానూ అదే అంతను” అన్నాడు.

‘బి ఎ రోమన్‌ వైల్‌ ఇన్ రోమ్‌’ అన్నారు కదా!

కాసేపట్లో ఇద్దరూ మరింత దగ్గరయ్యారు. ఏకవచనానికి దిగిపోయారు. ఉదయ్‌ భార్య సెకండరీ గ్రేడ్‌ టీచరట. వాళ్లది నెల్లూరు జిల్లా ఐతే చదువంతా వైజాగ్‌ ఆంధ్ర యూనివర్సిటీలో సాగిందట. ఆమె వైజాగ్‌ దగ్గర పెందుర్తి హైస్కూల్లో పనిచేస్తుందని,  తానూ మొన్నటి వరకు వైజాగ్‌లో ఒక ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీలో పని చేసేవాడిననీ చెప్పాడు.

పతంజలి ఇంటర్‌ నుండీ ఎమ్‌.ఎ వరకూ ప్రయివేటుగా చదువుకొన్నాడని తెలిసి అభినందించాడు ఉదయ్‌. ఇద్దరూ క్యాంప్‌ ఆఫీసరుగారి రూంలోకి వెళ్లారు. ఒకాయన పేర్లు బిగ్గరగా చదువుతున్నాడు. ఆ పేరున్న వారు ఆయన దగ్గరికి వెళుతున్నారు.

“పతంజలి శర్మ పలాస, ఉదయకుమార్‌ ప్రియాగ్రహారం” అని పిలిచాడాయన. ఇరువురూ వెళ్లారు.

“అసిస్టెంట్‌ ఎక్జామినర్స్‌ చాలామంది రిపోర్టు చేయలేదు. మీ అందరికీ స్క్రూటీనైజర్స్‌గా బోర్డు నియమించింది. కాని మీలో విల్లింగ్‌ ఉన్నవారిని ఎయిలుగా మారుస్తాం. ఎవరు మారానుకుంటున్నారో చెప్పండి”

ఐదారుమంది చేతులెత్తారు. “మీరిలారండి మాస్టారూ” అని వాళ్లను టేబుల్‌ వద్దకు తీసుకువెళ్లాడు. “మీరు విల్లింగ్‌నెస్‌ రిటన్‌గా వ్రాసి యివ్వండి” అంటూ తలా అరఠావు కాగితం ఇచ్చాడాయన.

రెండు నిమిషాల్లో రాసిచ్చేశారు. “మీరు సెకండ్‌ ఫ్లోర్‌లో రూం నంబరు పదమూడులో కూర్చోండి. బోర్డు ఫాం చేసి పంపుతాము.”

అందరూ ఆ రూంకు వెళ్లి కూర్చున్నారు. పతంజలి ఉదయ్‌ ఒక బెంచీ మీద కూర్చున్నారు. క్లాసు రూమది. కూర్చోనే బెంచీ, వ్రాసుకొనే ఏటవాలు బల్ల కలిసి ఉన్నాయి. అరగంట తర్వాత ఒకాయన హడావుడిగా వచ్చి బోర్డుమీద చాక్‌పీస్‌తో మూడు బోర్డ్సు వివరాలు వ్రాశాడు. ఈ రూములో 13, 14, 15 బోర్డులున్నాయి. బోర్డు నం. ఛీప్‌ ఎక్జామినర్‌ పేరు మొదట వ్రాసి క్రింద వరుసగా అసిస్టెంట్‌ ఎక్జామినర్ల పేర్లు వారికి బోర్డువారిచ్చిన నంబర్లతో సహా రాశాడాయన. ఒక్కొక్క సి.యి క్రింద ఎనిమిది మంది ఎ.యిలున్నారు. తమ సి.యి ‘ఢిల్లేశ్వరరావు’ అని తెలుసుకున్నారు.

కాసేపటికి సి.యి గారొచ్చారు. “బోర్డు 15 ఎ.యిలందరూ దయచేసి ఒక చోట కూర్చోవాలి.” అని అరిచాడు. వీళ్లిద్దరూ ఒక బోర్డులో పడ్డారు. ఫ్యాన్‌ క్రింద ఉండేలా చూసుకొని కూర్చున్నారు. బెంచీలు పెద్దవీ ఒక్కోదాంట్లో ముగ్గురు కూర్చోవాలి. ఎనిమిదిమందిలో ఇంకా ఇద్దరు రాలేదు. “మాస్టారూ! అయాం ఢిల్లేశ్వర్రావు, జి.జె.సి, కొమరాడ, విజయనగరం జిల్లా” అన్నాడాయన. “మీరందరూ లంచ్‌ చేసి ఎలిపొచ్చేయండి. మనకీ రోజు ఒక పూట పనే. పదిహేను పేపర్లే వస్తాయి.”

ఇద్దరూ బయటకు వెళ్లి కొంత దూరం నడిచారు. ఎండ ప్రచండంగా ఉంది. ‘గుంటూరు వారి వెంకట లక్ష్మిమెస్‌. శాఖాహార భోజనశాల’ అని కనబడింది. వెళ్లి టికెట్‌ తీసుకొని కూర్చున్నారు. భోజనం బాగుంది. భోంచేస్తుండగా ఉదయ్‌ అన్నాడు.

“ఖమ్మం తెలంగాణలో ఉన్నా కృష్ణా జిల్లా బార్డరు కాబట్టి దాని ప్రభావమే ఉంటుంది. అన్నటు మీరెక్కడ ఉండాలని?”

“ఏదయినా లాడ్జిలోనే”

“అయితే ఇద్దరం కలిసి ఉందాం”

భోజనం చేసి స్పాట్‌కు నడిచివచ్చేసరికి ఒళ్లంతా చెమటలు రాయలసీమలో కూడ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది గాని ఉక్కపోత చెమటలు ఉండవు. రూంకు వచ్చి ఫ్యాన్‌ క్రింద ఐదు నిమిషాలు సేద తీరారు. సి.యి. గారు అందరికీ ఫస్టియర్‌ కొశ్చన్‌ పేపరు, ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ వాల్యుయేషన్‌ కాగితాలు పంచారు. అటెండెన్స్‌ రిజిస్టరులో సంతకాలు చేయించారు. ఒక రిజిస్టరులో ఒక్కొక్కరికి రెండు మూడు పేజీలు కేటాయిచారు. దాంట్లో ప్రతిరోజూ ఎ.యి. తీసుకున్న పేపర్లు, సంతకం, తిరిగి యిచ్చినట్లు సంతకం, సి.యి గారి సంతకం ఇలా కాలమ్స్‌ ఉన్నాయి.

ఒక పావుగంట సేపు కొశ్చన్‌పేపరు ప్రిన్సిపుల్స్‌ మీద చర్చ జరిగింది. వాల్యుయేషన్‌కు తొలిసారిగా ఎవరు వచ్చారో తెలుసుకన్నాడాయన వీళ్ల బోర్డులో వీళ్లిద్దరే బిగినర్స్‌.

రూముల బయట వరండా పొడుగునా చుట్ట కుదురుల పై కొత్త మట్టి కుండల్లో నీరు నింపి మట్టి మూకుళ్లు మూతలుగా పెట్టారు. నీరు తాగడానికి కొత్త ప్లాస్టిక్‌ గ్లాసులున్నాయి. ప్రతి ఫ్లోర్‌ చివర టాయిలెట్స్‌ ఉన్నాయి.

రెండు గంటలకు ఆన్సర్‌ పేపర్ల బండిల్‌ తలా ఒకటి పంచారు. సి.యి. గారు ప్రతి బండిల్‌లో పదిహేను పేపర్లుంటాయి. ఒకసారి లెక్కపెట్టుకోమన్నారు. క్యాంటీన్‌లోనే రెడ్‌ ఇంక్ పెన్నులు, రీఫిల్స్‌ అమ్ముతున్నారు.

లక్ష్మీనరసింహునికి మనసులో నమస్కరించుకొని మొదటి పేపరు దిద్దసాగాడు పతంజలి. ముందు ఎస్సేలు, యాన్నొటేషన్లు షార్ట్‌ కొశ్చన్లు దిద్ది రెడ్‌ ఇంక్‌తో మార్కులు వేసుకుంటూ వెళ్లాడు. తర్వాత గ్రామరు దిద్దాడు మొత్తం పూర్తయిన తర్వాత మొదటి పేజీలో ప్రశ్నల వారీగా వచ్చిన మార్కులు ఎంటర్‌ చేశాడు. టోటల్‌ చేసి అంకెలలో, అక్షరాలలో రాసి, సంతకం చేసి ఎ.యి. నంబరు వేశాడు. మొత్తం వ్యవహారం పావుగంట పైనే పట్టింది.

దాదాపు నాలుగు గంటల వరకు దిద్దినా ఏడెనిమిది పేపర్లు కూడ పూర్తవలేదు.

“టీ తాగి వద్దాం పద” అన్నాడు ఉదయ్‌

వెళ్లి రెండు బిస్కెట్లు తిని, టీ తాగారు. క్యాంటీన్‌ చాలా రద్దీగా ఉంది. అక్కడ ఇంగ్లీషు వారు మరికొంతమంది పరిచయమయ్యారు. దాదాపు ఇరవై రోజులుంటుందని తెలిసింది.

ఐదు గంటలకు పని ఆపేశారు. బండిల్‌లో ఇంకా నాలుగు పేపర్లు మిగిలాయి. బండిల్‌ సి.యి. గారికి హ్యాండోవర్‌ చేశారు. ఇద్దరికీ ఆయన జ్ఞానబోధ చేశాడు.

“కుర్ర మాస్టార్లూ ఎస్సేలు, షార్ట్‌ ఆన్సర్లు ప్రతివాక్యం చదువుకుంటూ కూర్చోకండి. అక్కడక్కడ చూస్తే చాలు. అన్నం ఉడికిందా లేదా తెలిసిపోతుంది. యాన్నొటేషన్స్‌, గ్రామరు మటుకు జాగ్రత్తగా చూడాలి. ఒక్కోసారి జవాబు రెండుసార్లు వ్రాస్తారు. దానిని కూడా వాల్యూచేసి ‘రిపీటెడ్‌’ అని మార్జిన్‌లో వ్రాయండి. కొందరు ఛాయిస్‌ దాటి అదనపు ప్రశ్నలు కూడ వ్రాస్తారు. వాటిని వ్యాల్యూ చేసి, మార్కులు వేసి, మార్కులు రౌండాఫ్‌ చేసి క్రింద ‘ఎక్స్‌ట్రా’ అని వ్రాయండి. వాటిని ఫ్రంట్‌ పేజీలో పోస్ట్‌ చేయకండి. టోటలింగ్‌ ఎర్రర్స్‌ రాకుండా ఉండాలంటే దిద్దిన వెంటనే ప్రతి ప్రశ్న మార్కులనూ పోస్ట్‌ చేయండి. బయటి టోటల్‌ ఇన్నర్‌ టోటల్‌ ట్యాలీ అవ్వాలి. రెండు రోజులు పోతే అంతా తెలుస్తుందిలెండి. ఇదేం బ్రమ్మవిద్యేటి?”

తత్త్వం బోధపడింది ఇద్దరికీ. ధర్మసూక్ష్మం అర్థమయింది. బయట నోటీసు బోర్డులో పెట్టారు.

“డిగ్రీ పరీక్షలు జరుగుతున్నందువలన క్యాంప్‌ టైమింగ్స్‌ మధ్యాహ్నం పన్నెండున్నర నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు” క్యాంప్‌ ఆఫీసర్‌.

“పద శర్మా, గూడు వెతుక్కుందాం అన్నాడు ఉదయ్‌.

కాలేజికి ఒక కిలోమిటరు దూరం లోనే ‘మణికంఠ డీలక్స్‌ డార్మిటరీ’ అని కనబడింది. ‘ఇచ్చట బెడ్స్‌ లభించును’ అని  బోర్డు.  క్రింద షాపులున్నాయి. పై ప్లోర్‌లో డార్మిటరీ. చాలా నీట్‌గా ఉంది. ఒకే పెద్ద హాలు. దాదాపు ముఫై కాట్స్‌ వాటి మీద బెడ్స్‌ ఉన్నాయి. రెండు కాట్స్‌ మధ్యన సీలింగ్‌ ఫ్యాన్స్‌ ఉన్నాయి. హాలు చివర వరుసగా ఆరు బాత్‌ రూంలు. ఆరు లెట్రిన్లు ఉన్నాయి. నడవాలో ఆరువాష్‌ బేసిన్లున్నాయి. వాటిమీద అద్దాలు బిగించారు. రిసెప్షన్‌ కౌంటర్‌ వెనుక గోడకు పెద్దది అయ్యప్పస్వామి ఫోటో ఉంది.

రోజుకు ఆరు రూపాయలు అద్దె అని చెప్పారు. యాభై రూపాయలు అడ్వాన్సు తీసుకున్నారు. ఇద్దరికీ పక్కపక్కనే బెడ్స్‌ ఇచ్చారు. బెడ్‌ క్రింద భాగంలో పెద్ద లాకరుంది. దానికి తాళం వేసుకోవచ్చు. లుంగీలు టవళ్లు ఆరేసుకోవడానికి నడవాలో ప్లాస్టిక్‌ తాళ్లు కట్టి ఉన్నాయి. హాల్లో మూడు చోట్ల పెద్ద వాటర్‌ ఫిల్టర్లు స్టీలువి ఉన్నాయి.

ఇద్దరూ స్నానం చేసి ఫ్రెష్‌ అయ్యారు. ఎవరి మంచం మీద వాళ్లు పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉదయ్‌ అన్నాడు. “నాకెందుకో ఇది హాస్పిటల్‌ ఐనట్లు, మనం పేషంట్లుగా చేరినట్లు అనిపిస్తోంది” పతంజలి నవ్వాడు. “ఛీ! అదేం పోలిక?” అన్నాడు.

ఏడు దాటితే గాని వాతావరణం చల్లబడలేదు. డ్రస్‌ వేసుకొని అలా టౌన్‌ చూస్తూ వెళ్లారు. తొమ్మిది గంటలకు ద్వారకా భవన్‌లో భోజనం చేశారు.

ఉదయం అర్లీగా కాఫీతో పాటు లైట్‌గా టిఫిన్‌ చేసి పన్నెండు కల్లా లంచ్‌ చేసి స్పాట్‌ సెంటరుకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వచ్చే దారిలో కిళ్లీ షాపులో ఇన్‌లాండ్‌ లెటర్స్‌ తెచ్చుకొని వసుధకు లెటర్‌ వ్రాశాడు. అలాగే వెల్దుర్తికి విజయవాడకు కూడ వ్రాసేశాడు. లాడ్జి అడ్రసు ఇచ్చాడు. అత్యవసరమైతే చేయడానికి లాడ్జి వాళ్ల ఫోన్‌ నంబరు కూడ ఇచ్చాడు.

పొద్దున ఆరుకు లేచి ముఖాలు కడుక్కున్నారు. లాడ్జి ఎదుటే ఒక టిఫిన్‌ బండి ఉంది. రెండిడ్లీలు తిని, టీ కొట్టులో కాఫీ తాగారు లాడ్జిలో రెండు మూడు దినపత్రికలున్నాయి.

పదకొండున్నరకు తయారై గుంటూరువారి మెస్‌లో భోంచేసి పన్నెండుంబావుకు స్పాట్‌ చేరుకున్నారు. ఆ రోజు వాల్యుయేషన్‌ చురుకుగా సాగింది. మధ్యలో సియిగారు పిలిచి రీవాల్యుయేషన్‌ చేసి స్క్రిప్ట్ లను చూపించి, కొన్ని పొరపాట్లు సరిదిద్దారు. ప్రతి ముప్ఫై పేపర్లలో ఆయన మూడు పేపర్లు రీవాల్యూ చేయాలట. ‘సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌’ ఒకామె వచ్చింది. ఆమె పేరు సూర్యప్రభ. చాలా సీనియర్‌. తాడేపల్లిగూడెం జి.జె.సి గర్ల్స్‌ నుండి వచ్చింది. ప్రతి ఎ.యి. వద్ద ఒక పేపరు తీసుకొని, తప్పులు పట్టసాగింది.

“మాస్టారూ! నాన్‌ డిటైల్డ్‌ ఎస్సేకి పదికి తొమ్మిది వేశారు. వీడు అంత బాగా ఏం రాశాడని? ఏడున్నర చాలు.”

“వీడు బాగా వ్రాశాడండీ షార్ట్‌ ఆన్సర్స్‌. మీరు నాలుగుకు రెండే వేశారేమిటీ? ఇంకొకటి వేయండి.”

ఇలా తన ప్రత్యేకతను చాటుకోసాగిందామె. ఉదయ్‌ సాహచర్యంతో రోజులిట్టే గడచిపోయాయి. పదిహేడు రోజులు పట్టింది  ఇంగ్లీషు వాల్యుయేషన్‌ ముగియడానికి. ముందురోజు టి.ఎ. డి.ఎ బిల్‌ ఫాం, వర్క్‌ డన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఒక్కొక్కరికీ ఎన్ని పేపర్లు వస్తాయో క్యాల్కులేట్‌ చేసి చెప్పారు. పతంజలి ఐదువందల రెండు వచ్చాయి. ఒక్కో స్క్రిప్ట్ దిద్దినందుకు రెమ్యూనరేషన్‌ డెభై ఐదు పైసలు. రోజూ డి.ఎ పధ్నాలుగు రూపాయలు. అవుట్‌ స్టేషన్‌ అలవెన్స్‌ ఎనిమిది రూపాయలు. పని చేసే చోటు నుండి ఖమ్మం, మళీ రిటర్న్స్ జర్నీకి ఫస్ట్‌ క్లాస్‌ ట్రెయిన్‌ ఫేర్‌. సి.యి. గారు ఫారాలు నింపడంలో సాయం చేశారు. అన్నీ కలిపి పతంజలికి పదకొండు వందల దాకా వస్తుంది. ‘బాగానే ఉందే’ అనుకున్నాడు.

లాస్ట్‌ డే ఇరవై రెండు పేపర్లే వచ్చాయి. అందరూ నాలుగు గంటలకే దిద్ది ఇచ్చేశారు. పేమెంటు కోసం ఎదురు చూస్తున్నారు. డబ్బు తీసుకొని సి.యిగారు వచ్చే సరికి ఏడయింది. అక్విటెన్స్‌ మీద అందరితో రెవెన్యూ స్టాంపుల మీద సంతకాలు తీసుకొని డబ్బు యిచ్చేశారాయన. తలా ఐదు రూపాయలు కలెక్ట్‌ చేసి టీలు, మంచినీళ్లు తేవడం, బండిల్స్ మోయడం రీఫిల్స్‌ తెచ్చి పెట్టడం లాంటి సేవలు చేసిన బాయ్‌కి యిచ్చారు.

ముందు చిత్తూరుకు వెళదామనకున్నాడు పతంజలి. కానీ ఖమ్మం నుండి సూర్యాపేటకు వెళితే అక్కడ నుండి మూడుగంటల్లో హైదరాబాదు చేరుకోవచ్చు. ఇద్దరూ లాడ్జి ఖాళీ చేసి టిఫిన్‌ చేసి వీడ్కోలు చెప్పుకున్నారు. ఉదయ్‌కు ఖమ్మం నుండి విశాఖకు డైరెక్ట్‌గా ట్రెయినుందట.

బస్టాండుకు వెళ్లి సూర్యాపేట బస్సెక్కాడు. పదకొండు గంటలకు హైదరాబాద్‌ బస్సు దొరికింది. రెండుగంటలకు హైదరాబాద్‌లో దిగాడు. వెంటనే కర్నూలు బస్‌ దొరికింది. ఏడున్నరకు కర్నూల్లో దిగి మునిని కలిసి తన ఉద్యోగ విశేషాలు చెప్పాడు. ముని బుక్‌ షాపు బాగానే నడుపుకుంటున్నాడు.

దేవ సహాయంసారును మేడమ్‌ను కలిసి వచ్చాడు. రాధాసారు వాళ్ల  సొంత జిల్లా, ‘నగరి’కి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని వెళ్లిపోయినట్లు చెప్పాడు ముని. ఇద్దరూ వెళ్లి ‘ఆర్యభవన్‌’లో పూరీ తిన్నారు. పతంజలిని వెల్దుర్తి బస్‌ ఎక్కించి ముని వెళ్లిపోయాడు.

పదిగంటలకల్లా ఇంట్లో ఉన్నాడు పతంజలి. అమ్మానాన్న మల్లినాధ, మహిత అందరూ చుట్టుకున్నారు.

“బాగా చిక్కిపోయి, నల్లబడినావురా నాయనా!” అన్నది వర్ధనమ్మ. ఏ తల్లి కయినా చాలాకాలం తర్వాత కొడుకును చూస్తే అలాగే అనిపిస్తూందేమో. ఎప్పటికప్పుడు ఉత్తరాలు వ్రాస్తున్నా, ప్రత్యక్షంగా పలాస విశేషాలన్నీ చెప్పి తన వాళ్లను సంతోషపెట్టాడు.

మధ్యాహ్నం అమ్మ చప్పని ఆకుకూర పప్పు, అరటిబొందె (దవ్వ)తో మజ్జిగ పులుసు చేసింది. కొబ్బరన్నం కలిపింది. బచ్చలాకుతో బజ్జీలు చేసింది. కడుపు నిండా తిని కంటినిండా నిద్రబోయాడు. సాయంత్రం వలీ ఇంటికివెళ్లి ‘గణపతి’ని చూసి వచ్చాడు. గణపతి కోడె వయసుదాటి వృషభరాజయ్యాడు. పతంజలిని గుర్తుపట్టి మోర భుజం మీద ఆన్చి దువ్వించుకున్నాడు. వలీకి చెప్పి “సామి వచ్చాడని” చెప్పి సుంకన్నను తోకోడిని పిలుచుకు రమ్మన్నాడు.

వెంటనే వచ్చారిద్దరూ తమ మిత్రున్ని కళ్లారా చూసుకొని సంతోషించారు. పిల్లలకేమయినా కొనిపెట్టమని తలా యాభై రూపాయలు ఇచ్చాడు వారికి.

మర్నాడు రాత్రి టెలిగ్రాం వచ్చింది చిత్తూరు నుండి. వసుంధర వదినె ఇప్పించింది.

“వసుధ డెలివర్డ్‌ ఎ మేల్‌ ఛైల్డ్‌ ఇన్‌ ది ఈవెనింగ్‌. మదర్‌ అండ్‌ బేబీ ఆర్‌ సేఫ్‌”

మార్కండేయశర్మగారింట్లో ఆనందం వెళ్లివిరిసింది. ఆయన తిథి వార నక్షత్రాలు చూసి అన్నీ బాగున్నాయి, శాంతి ఏదీ చేయనవసరం లేదని చెప్పాడు. పతంజలికి కాలు నిలవలేదు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు.

“నాన్నా, నేను వెంటనే చిత్తూరు వెళతాను” అన్నాడు తండ్రితో

“నీవు ఆగమన్నా ఆగేట్టు లేవుగాని జాగ్రత్తగా వెళ్లిరా” అన్నాడాయన నవ్వుతూ. “పదహారో రోజు నామకరణానికి మేమందరం వస్తామని కోడలితో చెప్పు”

మల్లినాథ అన్నాడు. “అన్నయ్యా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ అని సికింద్రాబాద్‌ నుండి తిరుపతికి వెళుతుంది. మన ఊర్లో ఆగదు. డోన్‌కి వెళ్లి ఎక్కాలి. ధర్మవరం మీదుగా వెళుతుందట. ఉదయం 9 గంటలకు తిరుపతి చేరతావు. అక్కడినుండి వదినె దగ్గరకు గంటన్నరలో చేరుకుంటావు.”

“మంచి ఐడియా చెప్పావురా” అన్నాడు పతంజలి. భోజనం చేసి బయలుదేరాడు. మల్లినాధ కూడ బస్టాండుకు వచ్చాడు. దారిలో తన వృత్తిలో తాను సాధించిన అభివృద్ధి గురించి చెప్పాడు.

“నాన్నను ఎక్కవగా కార్యక్రమాలకు తీసుకొని వెళ్లడం లేదన్నయ్యా! విశ్రాంతిగా ఉండమన్నాను” అన్నాడు.

“మల్లీ, నేను దూరంగా వెళ్లాను. కుటుంబాన్ని చూసుకొనే బాధ్యత చిన్నవయసులో నీమీద పడింది”

“నీవన్నీ సెటిల్‌ చేసి వెళ్లావు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదులే. అన్నట్లు చిన్నోడికి కూడ వేసవి సెలవులిస్తారట. వాడూ వచ్చే నెలలో వస్తున్నాడు”

“వాడిని చూడాలనిపిస్తూంది రా”

కోడుమూరు – డోన్‌ ఆర్టీసీ బస్‌ వచ్చింది. ఎక్కి కూర్చున్నాడు. మల్లినాధ వెళ్లిపోయాడు. డోన్లో దిగి రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. టి.సి ఆఫీసులో కరెంట్‌ రిజర్వేషన్‌ ఏమయినా దొరుకుతుందేమో అని అడిగాడు. “వెంకటాద్రికి కష్టమండీ. ట్రెయిన్‌లో ప్రయత్నించండి” అని చెప్పాడాయన.

పదకొండు గంటలకు ట్రెయిన్‌ వచ్చింది. టిటి. యిలు ఎవరూ బెర్తు ఇవ్వమన్నారు. విధిలేక ఇంజను వెనుక నున్న జనరల్‌ కంపార్టుమెంటు ఎక్కాడు. సీటు దొరకలేదు. ఎదురుగ్గా సామాన్ల బల్ల మీద ఉన్న యువకుడొకడు “నేను గుంతకల్‌లో దిగిపోతాను. మీరిక్కడ పడుకోవచ్చు” అని ఆఫర్‌ యిచ్చాడు.

‘థాంక్‌ గాడ్‌’ అనుకున్నాడు పతంజలి. గుంతకల్‌ వరకు స్టాప్‌ లేదు గంటంబావు నిలబడింతర్వాత ఆ బల్ల ఎక్కి బ్యాగ్‌ తలక్రింద పెట్టుకొని నిద్రపోయాడు.

ఉదయం మెలకువ వచ్చేసరికి ఏడుదాటింది. లేచి ముఖం కడుక్కొని రైల్లోనే టీ తాగాడు. తిరుపతికి ఎనిమిదిన్నరకు చేరుకుంది రైలు. స్టేషన్‌ బయట హోటల్లో టిఫిన్‌ చేశాడు. బస్టాండ్‌కు వెళ్లి చిత్తూరు నాన్‌స్టాప్‌ ఎక్కి పదిన్నరకు చిత్తూరులో దిగాడు. వదినె వాళ్ల యింటికి చేరుకున్నాడు. వదినె యింట్లోనే ఉంది. పతంజలిని సాదరంగా ఆహ్వానించింది.

“కొత్తగా తండ్రి పదవి పొందినందుకు అభినందనలయ్యా!” అన్నది. అన్నయ్య ఆఫీసుకు వెళ్లిపోయాడు. భరత్‌ హాస్పిటల్లో ఉన్నాడట. “ఇదిగో నీ భార్యకు పథ్యం వంట చేసి తీసుకుపోదామని గంట క్రిందటే వచ్చాను. మధ్యాహ్నం అన్నం తిని కాసేపు పడుకుంది. నాలుగు గంటలకు నొప్పులొచ్చాయి. వెంటనే ఆటోలో వరలక్ష్మి గారి క్లినిక్‌కు తీసుకుపోయినాను. ఆమె పరీక్షించి మరో గంటలో ప్రసవమవుతుందని చెప్పింది. ఐదు గంటల ముఫై ఏడు నిమిషములకు బుజ్జిగాడు బయటకు వచ్చాడు. పిల్ల చాలా సుఖంగానే ప్రసవించింది. పిల్లవాడు బాగున్నాడు. మూడు కేజీలున్నాడు. ఎంత జుట్టుందో వెధవకు”

పతంజలి స్నానం చేస్తానంటే వద్దంది వదినె. “హాస్పిటల్‌ నుంచి వచ్చింతర్వాత చేద్దువు గానిలే” అంది. పాత బియ్యంతో అన్నం, చింతపండు లేని టమోట చారు. నేతితో తిరగమోత పెట్టిన బెండకాయ కూర క్యారియర్‌లో సర్దింది.

ఇద్దరూ ఆటోలో హాస్పిటల్‌ చేరుకున్నారు. పతంజలిని చూసిన వసుధ మోము చేమంతిలా వికసించింది.

“ఎలా వచ్చారు బావా ఇంత తొందరగా! నేనింకా రేపు వస్తారనుకుంటున్నా” అంది.

“వెంకటాద్ర్రి అని తిరుపతికి డైరెక్ట్‌ ట్రెయిన్‌ ఉంది. అది దొరకటం వల్ల రాగలిగాను” అనన్నాడు.

పక్కన ఉయ్యాల్లో పిల్లవాడు నిద్రబోతున్నాడు. ఎర్రగా కందిపోయినట్లున్నాడు. తలనిండా ఒత్తుగా జుత్తు. వాడి నుదుట ముద్దు పెట్టుకున్నాడు. చెయ్యి పట్టుకున్నాడు. దిరిసెన పువ్వులా సుతిమెత్తగా ఉంది వాడి శరీరం. మంచం తలకట్టున ఉన్న స్టూలు మీద కూర్చున్నాడు. భార్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

“బాగా నొప్పిగా అనిపించిందా!” అన్నాడు. అతని గొంతులో ఆమె పట్ల ఉన్న ప్రేమంతా పలికింది.

“ఊ” అంది వసుధ. ఆమె ముఖం పాలిపోయింది. తలకు గుడ్డ కట్టుకుంది. నడుముకు ఒక కట్టు. అయినా తల్లి అయిన ఆనందం, గర్వం ఆమె ముఖంలో ప్రకాశిస్తున్నాయి. భర్త వచ్చినాడన్న నిశ్చింతతో ఆమె కళ్లు మూసుకుంది భర్త చేయి వదలలేదు.

ఇంతలో డాక్టరు వచ్చింది. సన్నగా తెల్లగా వుందామె. గోల్డు ఫ్రేమ్‌ కళ్లజోడు ఆమెకు ఒక రకమయినా హుందాతనాన్నిచ్చింది. పతంజలి లేవబోతే వారించింది.

“కూచోండి పరవాలేదు. మీరు కాలేజి లెక్చరరటగదా! మీ భార్య గట్టిదే. జనరల్‌గా అందరూ పెడబొబ్బలు బెట్టి ఆసుపత్రంతా గందరగోళం చేసేస్తారు. ఈయమ్మి బాధను అదిమి పెట్టుకుని నాకు కో-ఆపరేట్‌  చేసింది. ఇటీజ్‌ ఎ వేరీ నార్మల్‌ అండ్‌ ఈజీ డెలివెరీ క్లినికల్లీ స్పీకింగ్‌. కంగ్రాట్సు” అన్నదామె.

“థ్యాంక్యూ డాక్టర్‌! ది క్రెడిట్‌ గోస్‌ టు యు ఓన్లీ” అన్నాడు పతంజలి.

“నో.నో. ది ఎన్‌టైర్‌ క్రెడిట్‌ గోస్‌ టు..’ అంటూ గోడమీదనున్న వెంకటేశ్వర స్వామిని చూపించిందామె.

తల్లినీ పిల్లవాడినీ పరీక్షించి “మీరు సాయంత్రం ఇంటికి వెళ్లిపోవచ్చు. బోత్‌ ఆర్‌ ఓ.కె” అని వెళ్లిపోయింది.

వసుధ కొంచెం చారన్నం, కూరన్నం తిన్నది మళ్లీ పడుకుంది. “ఖమ్మం నుండి డైరెక్ట్‌గా వస్తారేమో అనుకున్నా బావా” అంది కళ్లు మూసుకొని.

“రిలీవ్‌ అయ్యేసరికి ఎనిమిదయింది. జర్నీ ఎక్కువ. హైదరాబాదుకు వచ్చి అక్కడ నుండి మన ఊరికి వచ్చాను.” అన్నాడు ఆమె తల నిమురుతూ.

“నేనుంటాను. నీవూ భరత్‌ వెళ్లి స్నానాలు చేసి భోంచేసి రాండి. మీ అన్నయ్య కూడ వస్తారు. అన్నది వదినె. ఆమెకు ఇద్దరు పిల్లలు, భరత్‌ ఈడుది ఆడపిల్ల ఇంటరు చదువుతూంది. పేరు ఉమా శార్వరి. తర్వాత వాడు టెంత్‌కు వచ్చాడు. వాడి పేరు నాగేంద్ర.

ఇద్దరూ యింటికి వెళ్లి స్నానాలు చేశారు. రెండు గంటలకు బ్యాంకు నుండి తోడల్లుడు వచ్చాడు. వస్తూనే.

“ఏమయ్యా, శర్మా, ఎప్పుడొస్తివి?” అనడిగాడు. “ఖమ్మంలో ఉంటివట గదా! నీ కొడుకును చూస్తివా? నీ మాదిరున్నాడా, నీ భార్య మాదిరున్నాడా?”

“ఇంకా తెలియదన్నయ్యా!”

“మూడో నెల దాటితే గాని పోలికలు తెలియవులే. భోంచేద్దామా!” అని డైనింగ్‌ టేబుల్‌ వద్ద కూర్చున్నాడు. ముగ్గురూ భోంచేశారు. వదినె మామిడికాయ పప్పు చేసింది. బెండకాయ కూరే అందరికీ చేసింది. అది చప్పగా ఉంది. దాన్ని చూచి చూసి ఆయన

“మనకూ బాలింతకూ ఒకే కూర చేసిందే మీ వదినె? సరే ఏం చేస్తాం” అంటూ తిన్నాడు.

తర్వాత ఆయన బ్యాంకుకు వెళ్ళిపోయాడు. నాలుగు గంటలకు పతంజలి భరత్‌ పాలు కాచుకొని ఫ్లాస్కులో పోసుకొని బయలుదేరారు హాస్పిటల్‌కు. ఆరుగంటలకు వసుధను డిశ్చార్జి చేశారు. “ఎండ ఎక్కువగా ఉంది. కాపడాలు అవీ అవసరంలేదు. నాలుగు రోజులు కాచి నీటిని తాగించండి” అని చెప్పింది డాక్టరమ్మ. వసుధకు పాలు పడినాయి. “నెమ్మదిగా పాలివ్వమ్మా” అని చెప్పింది. అందరూ ఆటోలో ఇల్లు చేరుకున్నారు. వసుధకు బుజ్జిగానికీ ఎర్రనీళ్లు దిష్టితీసి లోపలికి రమ్మంది వదినె. హాల్లోనే గోడవారకు ఒక నవారు మంచం మీద బొంత పరచి బాలింతను పడుకోబెట్టారు. తల్లి పక్కన పిల్లవాడికి మెత్తని పాతచీరలతో పొత్తిళ్లు తయారు చేశారు. తల్లిపాలు సరిపోతున్నాయి. నాలుగు రోజుల్లోనే వసుధ లేచి తిరగసాగింది.

(సశేషం)

Exit mobile version