సాఫల్యం-46

6
1

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[పిల్లవాడి జనన సమయం ఖచ్చితంగా తెలియజేస్తూ తండ్రికి ఉత్తరం రాసి నామకరణానికి ముహూర్తం పెట్టమంటాడు. రిజర్వేషన్ చేయించుకుని కుటుంబం అంతా తిరుపతికి వెళ్తారు. నామకరణం వేడుక బాగా జరుగుతుంది. ప్రద్యుమ్న శర్మ అని పేరు పెడతారు. కొన్ని రోజుల తర్వాత భార్యా కుమారుడితో పాటుగా వెల్దుర్తి చేరుతారు. కాలేజీ తెరిచే రోజు దగ్గర పడుతుండంతో పలాస వెళ్ళిపోతాడు పతంజలి. తండ్రికి కొంత డబ్బు పంపుతాడు. మరో ఇంటికి మారతాడు పతంజలి. అందుకు సి.ఐ.గారు ఏమీ అభ్యంతరం చెప్పకపోగా, పతంజలి ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు. ఒక వడ్రంగి వద్ద మంచాలు, డైనింగ్ టేబుల్ చేయిస్తాడు. కొద్ది రోజుల తర్వాత వసుధని తీసుకుని పతంజలి తల్లిదండ్రులు. తండ్రి స్నానం చేసి పూజ చేస్తాడు. వర్ధనమ్మ రంగంలోకి దిగి వంట పూర్తి చేస్తుంది. వసుధ, వర్ధనమ్మ కలిపి పిల్లవాడికి స్నానం చేయిస్తారు. పతంజలి కాలేజి నుంచి వస్తూ కూరలు తెస్తాడు. సాయంత్రం ఇరుగుపొరుగు వారు, సి.ఐ. దంపతులు పిల్లవాడిని చూడడానికి వస్తారు. – ఇక చదవండి.]

[dropcap]సి.[/dropcap]ఐ. గారి భార్య బుజ్జిగాడిని ఎత్తుకొని వదలలేదు.

“ఏటి నాన్న, ఏటి కన్న, ఎలిపొచ్చేసినావేటి పలాసకు. ఆ నవ్వు సూడు.. నోరు తిరగని పేరెట్టేసినాడు మీ బాబు” అంటూ ఆడించసాగింది.

పతంజలికి పొరుగున వినయభూషణ్‌ అని ఒకాయన ఉన్నాడు. ఆయన సబ్‌ ట్రెజరీలో పని చేస్తాడు. ఆయనకు ఇద్దరూ ఆడపిల్లలే. ఆ దంపతులిద్దరూ వచ్చి బాబును చూసి వెళ్లారు.

“గుంటడిని మాకిచ్చేయండి మాస్టారూ!” అన్నాడాయన.

వచ్చివాళ్లందరూ మార్కండేయశర్మకూ, వర్ధనమ్మకూ పాద నమస్కారం చేసి వెళ్లారు.

తుంబనాధంగారి భార్య సుభద్రగారన్నారు.

“మేష్టారండీ, మీ అమ్మా నాన్నగారు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల్లాగ ఉన్నారండి”

‘నిజమే మరి’ అనుకున్నాడు పతంజలి.

రాత్రికి బుజ్జిగానికి లైట్‌గా జ్వరం తగిలింది. డల్‌గా పడుకున్నాడు. వర్ధనమ్మ దిష్టి తీసింది మనవడికి. శర్మ అర్చన కుంకుమ వాడి నుదుట పెట్టాడు. హోమియో మందు ఫెర్రంఫాస్.. వేశాడు. ఆయన తనతో పాటు హోమియో కిట్‌ తెచ్చాడు. పతంజలికి కూడా కొంచెం తెలుసు. యనమండ్ర గణపతిగారి ‘హోమియో సర్వస్వం’ కూడ తెచ్చాడాయన. ‘న్యాష్‌’ వ్రాసిన ‘ద్వాదశ లవణ చికిత్స’ అనే చిన్న పాకెట్‌ బుక్‌ తెచ్చాడు. పదిగంటలకు బుజ్జికన్న పాలు తాగి పడుకున్నాడు.

తల్లిదండ్రులకు వరండా గదిలోనే చాప, రెండు బొంతలు పరిచి, పక్క ఏర్పాటు చేశాడు పతంజలి. స్టీలు చెంబుతో నీళ్లు పెట్టాడు. రాత్రి మధ్యలో బాత్‌ రూంకు వెళ్లాల్సివస్తే లేపమన్నాడు చీకట్లో ఆ స్విచ్‌లు అవీ మీకు తెలియవన్నాడు.

తలుపులు వేయడానికి జంకి దంపతులిద్దరూ మథనపడుతూంటే వర్ధనమ్మ చెప్పింది. “తలుపులు వేసుకోండి నాయనా, అవసరమైతే మేం పిలుస్తాములే”

దంపతులిద్దరూ ఏకశయ్యాగతులైనారు. దాదాపు రెండు నెలలు విరహం. అనంగుడు వారి అంగాలలో వేడి రగిలించి శృంగారోద్దీపనం చేశాడు. ప్రేమానురాగపూర్ణులైన ఆలుమగలు మైథునంలో ఏకమయితే విరులకు పరిమళం  తోడయినట్లే. తర్వాత మనసు విప్పి మాట్లాడుకున్నారు చాలాసేపు. తెల్లవారు జామున నాలుగు గంటలకు తలుపులు తెరిచి పడుకున్నారు.

ఆరో నెలలో పిల్లవానికి అన్నప్రాశన చేయడానికి సంకల్పించాడు తాతగారు. సింహాచలం నరసింహస్వామి సన్నిధిలో చేస్తే బాగుంటుందనుకున్నారు. సింహాచలం నుండి తాను ఊరికి వెళ్లి పోతానన్నాడాయన. మీ అమ్మను కావాలంటే రెండు నెలలపాటు పెట్టుకోండి. నేనుండను. నాకిక్కడ తోచడం లేదంటాడు.

పలాసలో పతంజలి వాళ్ల కాలేజికి కి.మీ దూరంలో ‘నెమలికొండ’ అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక యోగి ఆశ్రమం, దత్తమందిరం ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం రెండు రిక్షాల్లో అక్కడికి తీసుకొని వెళ్లాడు పతంజలి.  దారిలో కాలీఫ్లవర్‌, క్యాబేజి పొలాలు కనువిందు చేస్తున్నాయి. చిన్న గుట్టమీద ఉంది ఆశ్రమం. యోగిపేరు త్రినాథస్వామి. ఆయన కో-ఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రారుగా చేస్తూ, దత్త భక్తుడై సన్యాసం స్వీకరించాడు.

ఆశ్రమంలో ఉసిరిక, మారేడు, మామిడి, పనస వృక్షాలున్నాయి. దత్త మందిరం చాలా బాగుంది. దత్తస్వామి పాలరాతి విగ్రహం కాంతులీనుతూంది. దర్శనం చేసుకొన్నారు. ప్రద్యుమ్నకు మోకాళ్లమీద దోగాడటం ఇప్పుడిపుడే వస్తూ ఉంది. విశాలమైన ఆవరణలో వాడిని దింపితే ఆనందంగా దోగాడసాగాడు.

ప్రక్కన ధ్యానమందిరం ఉంది. గోడల మీద చక్కని సూక్తులు పెయింట్‌తో రాసి ఉన్నారు.

“అతి భాష మతి హాని. మిత భాష అతిహాయి”

“నిశ్శబ్దాన్ని మించిన బాషలేదు”

“అంతర్ముఖుడవై చూసుకో. పరమాత్మ నీలోనే ఉన్నాడు”

త్రినాధస్వామివారు అనుగ్రహభాషణం చేస్తున్నారు వీళ్లందరూ లోపలికి వెళ్లి ఒకచోట కూర్చున్నారు. మార్కండేయశర్మ శ్రద్ధగా స్వామి చెప్పింది వింటున్నాడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి,

“పంతులు గారు, స్వామి వారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పాడు.

తండ్రీ కొడుకులు ఆశ్చర్యపోయారు. ఇద్దరూ స్వామివారు కూర్చున్న వితర్దిక వద్దకు వెళ్లారు. మార్కండేయ శర్మను చూసి ఆయన ఇలా అన్నారు. “మీరెవరోగాని, గొప్ప పండితులల్లే ఉన్నారు. ప్రవచనకర్తలు కూడ అని నా దృష్టికి తోస్తున్నది. ఏవయినా నాలుగు మంచిమాటలు మా వాళ్లకు చెప్పండి”

మార్కండేయ శర్మ స్వామివారికి నమస్కరించి తన గంభీర మధుర స్వరంతో,

“అనసూయాత్రి సంభూతో

దత్తాత్రేయో దిగంబరః

………………….

ఉద్ధర్తా భవ సంకటాత్”

అని మోహనరాగంలోపాడాడు. దాదాపు అరగంటపాటు దత్తాత్రేయ తత్త్వాన్ని విశదీకరించాడు. మధ్యలో పద్యాలు, శ్లోకాలు పాడి ఉపన్యాసాన్ని జనరంజకం చేశాడు. దాదాపు యాభై మందికి పైగా ఉన్నారు ధ్యానమందిరంలో. వారంతా శర్మగారి ప్రవచనం విని ముగ్ధులైనారు.

వారిలో కొందరికి పతంజలి తెలుసు. “వీరు మన పలాస కాలేజిలోనే ఇంగ్లీషు చెబుతారండీ” అన్నారు స్వామికి చెప్పారు.

అందరూ ఇల్లు చేరుకున్నారు. పతంజలికి అంతా కలలా ఉంది. ఎక్కడి కర్నూలు? ఎక్కడి పలాస? నాన్నను చూసిన వెంటనే స్వామివారు ఆయనను పండితుడని ప్రవచనకర్త అని గుర్తించడం అద్భుతం.

“విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం”

“విద్వాన్‌ సర్వత్రపూజ్యతే” అన్న సూక్తులు నిజమైనాయి అనుకున్నాడు.

పతంజలి ఉండబట్టలేక

“నిజంగా నీవు గ్రేట్‌ నాన్నా” అంటే

“నాదేముందిరా పిచ్చివాడా! ఆ దత్తస్వామిదే నీవనే ‘గ్రేట్‌’ అంతా”  అన్నాడాయన నిర్వికారంగా. “ఉప్పులూరి విశ్వేశ్వర శాస్త్రిగారన్నట్లు ఆయన పుంభావ సరస్వతి ఐనా, అహంకార రహితుడు” అనుకున్నాడు పతంజలి.

***

అన్నప్రాశనకు నాలుగురోజుల్లో ముహూర్తం నిర్ణయించాడు శర్మ. పతంజలి రెండు రోజులు సెలవు పెట్టాడు ఉదయం 9 గంటలకు మద్రాసు మెయిల్‌లో బయలుదేరి పన్నెండున్నరకు వైజాగ్‌ చేరుకున్నారందరూ స్టేషన్‌ ఎదుటే 6ఎ నంబరు సిటీ బస్సెక్కి దిగువ సింహాచలంలో దిగారు. అక్కడి నుండి దేవస్థానం బస్సులో కొండపైకి వెళ్లి, సత్రంలో గది తీసుకున్నారు. గది అద్దె పదిరూపాయలు. చాలా బాగుంది. రెండు సింగిల్‌ మంచాలు, వాటిపైన పరుపులు, పైన సీలింగ్ ఫ్యాన్‌ అటాచ్‌డ్‌ బాత్‌రూం.

రూంలో స్థిమిత పడేసరికి రెండున్నరైంది. ఉదయం వసుధ యిడ్లీకి పెట్టింది. వర్ధనమ్మ చింతపండు పులిహోర చేసింది. దాన్ని ఒక క్యాన్‌లో పెట్టుకొని తెచ్చుకున్నారు. అదే మధ్యాహ్నం తిన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అక్కడ అప్పలాచార్యులు గారని పూజారి పరిచయమయ్యాడు. ఆయన సొంతవూరు సోంపేట దగ్గర ‘అమ్మవారి పుట్టుగ’ గ్రామం. వీళ్లు పలాస నుంచి వచ్చారనగానే ఆయన చాలా సంతోషించాడు. రేపు అన్నప్రాశన కార్యక్రమం తానే చేయిస్తానన్నాడాయన. పతంజలి ఆయన్నడిగాడు “ఆచార్యులు గారూ, మా అమ్మానాన్నా బయట ఏమీ తినరు. మీరు దయ చేసి ఈ రోజు రాత్రి, రేపు మధ్యాహ్నం వాళ్లిద్దరికీ భోజన సదుపాయం చేశారంటే మీకు ఋణపడి ఉంటాము”

“అయ్యో దానికేమిటండీ, రాత్రికి టిఫిన్‌ చేయిస్తాను. మా యిల్లు ‘గంగధార’కు వెళ్లే దారిలోనే. రేపు అన్నప్రాశన కోసం బియ్యం పరవాన్నం కూడ చేయిస్తాను. మధ్యాహ్నం స్వామి వారి ప్రసాదం తీసుకుందురుగాని” అన్నాడాయన.

రాత్రి వాళ్లింట్లోనే అందరూ ‘ఉప్పుడు పిండి’ (తిరగమోత వేయని బియ్యం రవ్వ ఉప్మా) తిన్నారు. మజ్జిగ ఇచ్చారు వారు అందరికీ. ఉదయాన్నే ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు అందరూ స్నానాలు చేసి, ప్రద్యుమ్నకు కొత్త డ్రస్‌ వేసి, సిద్ధమయ్యారు. దేవాలయంలోనే అమ్మవారి గుడి వెనుక ఒక మంటపంలో అన్నప్రాశన జరిగింది. ఒక పెన్ను పుస్తకం, పది రూపాయలనోటు, పిల్లవాడి ఎదురుగా పెట్టి, వదిలితే వాడు పాకుతూ వెళ్లి పదిరూపాయల నోటు పట్టుకున్నాడు.

“గుంటడికి డబ్బుకు లోటుండదు” అన్నాడు పూజారిగారు.

“పుస్తకమో పెన్నో పట్టుకుంటాడనుకున్నాను బావా! చదువు సరిగా రాదేమో వీడికి” అన్నది వసుధ.

“పిల్లలు ఆ వయసులో కంటికేది ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని పట్టుకుంటారు. కేవలం దీన్ని బేస్‌ చేసుకొని వాడి భవిష్యత్తును ఊహించకూడదదు. డెస్టినీ లీడ్స్‌, హ్యూమన్‌ ఎఫర్ట్‌ హ్యాజ్‌ టుబి అకంపనీడ్‌” అన్నాడు పతంజలి.

అప్పలాచార్యులుగారు అందర్నీ నరసింహుని దర్శనానికి తీసుకొని వెళ్లారు. స్వామి పెద్ద లింగాకారంలో ఉన్నాడు. లోపల వరాహనరసింహుడుంటాడు. సంవత్సరానికి ఒకసారి స్వామివారి చందనోత్సవం జరుగుతుంది. స్వామి నిజరూపం చుట్టూ లింకారంలో ఉన్న చందనాన్ని తొలగించి స్వామిని అందరికీ దర్శనం చేయిస్తారు. ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్‌ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. తర్వాత మళ్లీ మణుగుల కొద్దీ గంధం తీసి స్వామివారికి దట్టంగా పూసి, లింగాకృతిలో మలుస్తారు. ఆ రూపానికి చెంగావి రంగు పట్టుపంచ చుట్టి వజ్రాలు పొదిగిన తిరునామంతో అలంకరిస్తారు.

స్వామివారిని తనివి తీరా దర్శించుకున్నారు. గర్భగుడిలోనికి తీసుకువెళ్లారు ఆచార్యులవారు. ఆలయం లోపల అద్భుతమైన శిల్ప సంపద ‘కప్ప స్తంభం’ అని ఉంటుంది. దానిని కౌగిలించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. చుట్టూ ఉన్న మంటపాలల్లో వేదపండితులు వేదపఠనం చేస్తున్నారు. గుడి అంతా తిరిగి చూశారు. అమ్మవారికి కుంకుమార్చన చేయించారు.

పూజారిగారు పులిహోర, మినపవడ, లడ్డూ ప్రసాదాలు సమృద్ధిగా యిప్పించారు. అందరూ వారి యింటికి వెళ్లారు. అక్కడ పులిహోర తిన్నారు. అద్భుతంగా ఉంది.

“అదేమిటో మా ఇంట్లో చేస్తే ఈ రుచిరాదండి. పెరుమాళ్లుకు నివేదన చేసిన తర్వాతే ఈ రుచి వస్తుంది” అన్నాడాయన.

ఆయనకు నూట పదహార్లు తాంబూలంలో పెట్టి పతంజలి వసుధ దంపతులు నమస్కారం చేశారు. బాబుతో కూడ చేయించారు. పూజారి దంపతులు మార్కండేయశర్మ, వర్ధనమ్మలకు నమస్కారం చేశారు.

వారి దగ్గర సెలవు తీసుకుంటూ, “వస్తాం అక్కా” అన్నాడు  అప్రయత్నంగా. పూజారి గారి భార్యకు వాగ్దేవక్క వయసే ఉంటుంది ఇంచుమించు. ఆమె సంబరపడిపోయి, “మంచిది తమ్ముడూ” అన్నది.

“బావగారూ! స్వామివారి దర్శనానికి తరచుగా వస్తూండండి” అన్నాడాయన వరస కలిపి. పతంజలి కూడ తడుము కోలేదు.

“తప్పకుండా బావగారూ!” అన్నాడు.

మెట్లదారి గుండా కొండదిగు దామన్నాడు పతంజలి. వాతావరణం కూడ అంత ఎండగా లేదు. మెట్లు దిగుతూంటే ఎత్తయిన సింహగిరి కొండలు, పచ్చని దట్టంగా పెరిగిన చెట్లు, వేగంగా దుముకుతూన్న సెలయేళ్లను చూశారు. ఆంజనేయస్వామివారు వందల రూపాలలో తిరుగుతూ యాత్రీకుల చేతుల్లోనివి లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరగంటలోపే కొండ దిగువకు చేరుకొని సిటీ బస్సెక్కి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌ సిద్ధంగా ఉంది. అది లేటయిందట. సాయంత్రానికి పలాస చేరుకున్నారు.

తర్వాత వచ్చే ఆదివారం శ్రీకాకుళం తీసుకువెళ్లాడు పతంజలి. అందరినీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలయిన అరసవిల్లి సూర్య దేవాలయం శ్రీ కూర్మం దర్శించుకొని వచ్చారు. తండ్రి అడిగాడు.

“శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు దేవాలయం కూడ చూద్దామురా”

రిక్షావాళ్లెవరికీ ఆ గుడి ఉన్నట్లు కూడ తెలియదు. చివరికి ఒకాయన అసలు విషయం చెప్పాడు.

“వీరనుకుంటున్న శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో ఉందండి. ఇది కాదు”

సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో నాన్నకు ‘కోణార్క్‌’లో రిజర్వేషన్‌ చేసి విజయవాడకు పంపాడు. అక్కడ నుండి రామ్మూర్తి బావ చూసుకుంటాడు. ఐదారు రోజుల తర్వాత తండ్రి క్షేమంగా తాను వెల్దుర్తి చేరుకున్నట్లు జాబు వ్రాశాడు.

ప్రద్యుమ్నకు తిండి ధ్యాస ఎక్కువైంది. కొంచెం ఏమారితే డైనింగ్‌ టేబుల్ మీద గిన్నెలు లాగేస్తాడు. ఆ ఇంట్లో కొన్ని స్విచ్‌లు నేలకు రెండడుగల ఎత్తులో ఉన్నాయి. వాటిని ఎప్పుడూ ఆన్‌. ఆఫ్‌ చేస్తూ, ఆన్‌ చేసినప్పుడు లైటు, ఫ్యానూ, తిరుగుతున్నాయా లేదా చూస్తాడు. నెయ్యి వేసి చప్పగా పప్పు అన్నం పెడితే ఇష్టం ఉండదు. దాంట్లో కొంచెం పచ్చడి కలపాలి. పెరుగన్నంలో కూడ లైట్‌గా ఊరగాయ కలిపితే ఇష్టంగా తింటాడు.

పతంజలి ముందు గదిలో ట్యూషన్‌ చెబుతూంటే దోగాడుతూ వచ్చి ఛెయిర్‌ పట్టుకొని నిలబడతాడు. తండ్రి ఒళ్లో కూర్చుని బుద్ధిమంతుడిలా వింటూంటాడు.

ట్యూషన్‌ పిల్లలు ప్రద్యుమ్నను ఎత్తుకోవాలని తహతహలాడతారు. ఆడపిల్లలయితే వంతులు వేసుకుంటారు. రోజూ చూస్తాడేమో అందరి దగ్గరకూ వెళతాడు. సాయంత్రం చల్లబడ్డాక నాయనమ్మ మనవడు ఇంటి బయట మెట్ల మీద కూర్చుని వచ్చేపోయే మనుషులను, వాహనాలను చూస్తుంటారు.

వర్ధనమ్మ వాడిని ‘కన్నా’ అని పిలుస్తుంది. ఆమె కనపడకపోతే ఇల్లంతా వెతుక్కుంటాడు.

పతంజలి కాలేజికి వెళ్లిపోయిం తర్వాత రెండుసార్లు అత్తను సినిమాకు తీసుకువెళ్లింది వసుధ. ఒకటి ‘భక్త శిరియాళ’ కన్నడ డబ్బింగ్‌ సినిమా. పలాస ‘హరిశంకర్‌’ టాకీసులో నెల రోజుల్నుండి ఆడుతూ ఉంది. అద్భుతమయిన సినిమా అది. రెండోది సౌందర్య నటించిన ‘అమ్మోరు’. రెండూ వర్ధనమ్మకు బాగా నచ్చాయి. పిల్లవాడిని పడుకోబెట్టి అమ్మకు అప్పచెప్పి భార్యాభర్తలిద్దరూ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమాకు సెకండ్‌షోకి వెళ్లారు గానీ, పిల్లవాడు లేచి అమ్మను ఇబ్బంది పెడుతున్నాడేమో అనే భయంతో మధ్యలో వచ్చేశారు. ఆమె అన్ని సినిమాలూ చూడదు.

వీళ్లు ప్రద్యుమ్నను తీసుకొని ఫస్ట్‌ షోకి వెళితే ఇంటర్వల్‌ వరకు చూస్తాడు. పాటలు వచ్చినపుడు చేతుల్లోనే నిలబడి ఉషారుగా ఎగురుతాడు. పలాస ధియేటర్లలో ఇంటర్వల్‌లో వేడి ఇడ్లీ దొరుకుతుంది. రెండిడ్లీలు తిని ఇంటర్వల్‌ తర్వాత నిద్రబోతాడు.

నెల రోజుల తర్వాత వర్ధనమ్మను వెల్దుర్తిలో దిగబెట్టి వచ్చాడు పతంజలి. ఆమె లేని లోటు స్పష్టంగా కనిపించసాగిందిద్దరికీ.

మార్చిలో జరిగిన పరీక్షల్లో పిల్లలు బాగానే పాసయ్యారు. ఫేలయిన వాళ్లు అక్టోబరులో సప్లిమెంటరీకి వెళతారు. పతంజలి ఇంగ్లీషులో ఫెయిలయిన వాళ్ల లిస్టు తయారు చేశాడు. ఫస్టియర్‌ 87 మంది సెకండియర్‌ 96 మంది అన్ని గ్రూపులకు కలిసి తేలారు.

ఒకరోజు ప్రిన్సిపాల్‌గారి రూంలోకి వెళ్లి అడిగాడు. “సార్‌, ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర తర్వాత ఫేలయిన వాళ్లకు అరగంట అరగంట చొప్పున కోచింగ్‌ యిద్దామనుకుంటున్నాను ఉచితంగా. అదివారాలు మాత్రం వారికోగంట, వీరికోగంట తీసుకుంటాను. వీళ్లందరూ పాసయితే, మార్చిలో సెకండియర్‌ పరీక్షలకు వారికి రిలీఫ్‌గా ఉంటుంది. సెకండియర్‌ వారికి కూడ ఉపయోగమే. మీరు పర్మిషన్‌ యిస్తే…”

“అంతకంటేనా మాస్టారూ! గో అహెడ్‌. మీరు మంచి పని చేస్తానంటే ఎందుకు కాదంటాను?” అన్నాడాయన.

కేవలం ఎక్జామినేషన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే వాళ్లకు చెప్పసాగాడు పతంజలి. గ్రామర్‌ మీద ఎక్కువ ఫోకస్‌ చేశాడు. యాన్నొటేషన్స్‌, షార్టు కొశ్చన్స్‌కు ఒక లెసన్‌లోని అన్ని ప్రశ్నలకూ ఇంచుమించు పనికొచ్చే విధంగా సింపుల్‌ లాంగ్వేజ్‌లో కామన్‌ ఆన్సర్స్‌ తయారు చేసి బోర్డుమీద రాశాడు. అదే అతడు ఇంటి దగ్గర పెట్టుకుంటే బోలెడు డబ్బొచ్చేది.

ఊర్లో పతంజలి పేరు మార్మోగిపోయింది.

సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫిజిక్స్‌/ఎకనామిక్స్‌ పరీక్ష జరుగుతోంది. తుంబనాధంగారే సీనియర్‌ మోస్ట్‌ కాబట్టి, చీప్‌ సూపరింటెండెంట్‌ ప్రిన్సిపాల్‌గారయినా, పరీక్షల పర్యవేక్షణ అంతా ఆయనే చూసుకుంటారు. ఆరోజు దాదాపు పదమూడు రూములు. మూడు వందలకుపైనే పిల్లలు రాస్తున్నారు. ఆరోజు పతంజలికి ‘రిజర్వు’ డ్యూటీ వేశారు. మెయిన్‌ గేటు దగ్గరే పిల్లలందర్నీ భౌతికంగా తనిఖీ చేసి స్లిప్పులన్నీ తీసేయించారు.

పోలీసు బందోబస్తు కూడ ఉంది. మధ్యలో ఎస్‌ఐగారు కూడ ఒకసారి వచ్చి చూసి వెళుతూన్నారు. ‘ముఖ లింగేశ్వరరావు’ చాలా స్ట్రిక్ట్‌ అని, నిజాయితీ పరుడని పేరుంది, యువకుడు.

పరీక్ష ఇంకా గంట సేపుంది. సెకండియర్‌ ఫేలై, ఎకనామిక్స్‌ పరీక్ష రాస్తున్నాడొక విద్యార్థి. అంబుసోలి గ్రామం వాడు. వాడు యూరినల్స్‌కని వెళితే వెంట అంటెండరు వెళ్లాడు. అప్పుడు యస్‌.ఐగారు చెట్టు క్రింద కూర్చీ వేసుకొని కూర్చొని ఉన్నారు. వాడు ఆయన వైపు ఒకరకంగా చూస్తూ వెళ్లాడు.

తిరిగి వస్తూన్నపుడు ఆయన వాడిని రమ్మని పిలిచాడు కానిస్టేబుల్‌ను వాడి జేబులు వెతకమన్నాడు. దానికి వాడు ఒప్పుకోలేదు పైగా అన్నాడు. “ఏటండీ! ఎతికితే గితికితే మా మాస్టారు ఎతకాలగాని మీకేటదికారం?”

“ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మర్యాదగా చెక్‌ చేయించుకో, లేదా..”

“ఏటి సేస్తారేటి? బయట కిటికీలకాడ మీ పోలీసోల్లు డబ్బులు తీసుకొని స్లిప్పులే సేటోల్లనొగ్గేత్తన్నారు. ముందాళ్లను చెక్‌ చేయండి.”

గొడవను పసిగట్టి పతంజలి పరుగు పరుగునవచ్చాడు.

“ఏమయిందిసార్‌. ఎస్సయిగారూ” అనడిగాడు.

“ఏంలేదు మాస్టారూ, వీడు నా దగ్గరే ఏదేదో పేల్తాండు. ఈడిని జీపెక్కిచడ్రా” అని కానిస్టేబుల్స్‌కు చెప్పి, లేచి నిలబడ్డాడాయన.

“ఓరేయ్‌, దుర్యోధన, యస్సయ్‌ గారితో మాట్లాడేది ఇలాగేనా? సార్‌కు సారీ చెప్పు” అన్నాడు పతంజలి.

“మీకు తెలీదు మాస్టారూ! ఈ పోలీసోల్ల సంగతెరుకలేనిదెవరికి” అన్నాడు వాడు పొగరుగా.

పతంజలికి కోపం వచ్చింది. భయమేసింది కూడ. వీడు పోలీసు స్టేషన్‌ కెళితే, కేసు బుక్‌ చేస్తే, వాడి భవిష్యత్తు సర్వనాశనమవుతుంది. బలవంతంగా వెతికితే వాడి దగ్గర స్లిప్పులు దొరుకుతాయని అతనికి తెలుసు.

“రాస్కెల్‌, పోలీసులకే ఎదురు తిరిగేంత మొనగాడివా నువ్వు” అంటూ మునివేళ్లమీద లేచి వాడి చెంప మీద ఫెడీమని కొట్టాడు పతంజలి. అతనికంటే చాలా ఎత్తుగా, బలంగా ఉన్నాడు వాడు. చాలా రఫ్‌గా కూడ ఉన్నాడు.

“వెళ్లు, గో టు యువర్‌ రూం. యూజ్‌లెస్‌ఫెలో” అని అరిచాడు.

పతంజలికి క్షణకాలం భయమేసింది. ‘తొందర పడ్డానేమో’ అని వాడు తలవంచుకొని, ఏదో గొణుగుతూ తన పరీక్ష హాలుకు వెళ్లాడు.

“ఏమిటి మాస్టారూ! మీ పిల్లలను బాగా సపోర్టు చేస్తున్నారే! మీరు గనుక అడ్డురాక పోయి ఉంటే వాడిని స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదే వాళ్లం” అన్నాడాయన కోపంగా.

“దయచేసి పోనీండి సార్‌. అడొలసెంట్‌ ఏజ్‌ సార్‌, తెలిసీ తెలియని వయస్సు. వాడి ప్యూచర్‌ కోసమయినా వాడిని స్పేర్‌ చేయండి. వాడి తరపున మీకు నేను క్షమాపణ చెబుతున్నాను.” అన్నాడు పతంజలి.

యస్‌.ఐ. తగ్గిపోయాడు. “అయ్యో మాస్టారు! మీరెందుకు క్షమాపణ చెప్పడం? ఈ అంబుసోలి బ్యాచ్‌ సంగతి మీకు తెలియదు. మీరు అంతగా రిక్వెస్ట్‌ చేస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నారు. ఓకె. క్యారీ ఆన్‌” అని జీపెక్కి వెళ్లి పోయాడాయన.

వారికి చీమ కుట్టినట్లయినా ఉందో లేదో గాని, పతంజలికి అరచేయి యింకా మండుతూంది. రూముల్లో తిరుగుతూ ఎవరయినా ఇన్విజిలేటర్లకు అవసరమయితే రూములో తానుండి వాళ్లను పంపుతున్నాడు. అలా ‘వాడి’ రూంలో కూడ ఐదు నిమిషాలు ఉండాల్సొచ్చింది. వాడు బుద్ధిగా ఏదో రాస్తున్నాడు. పతంజలి వైపు ఒకసారి ఓరగా చూసి తలవంచుకొని రాసుకోసాగాడు.

‘రిజర్వు’ ఇన్విజలేటర్‌ పరీక్ష అవగానే పేపర్లు హ్యాండోవర్‌ చేసి వెళ్లిపోవడానికి వీలుండదు అన్ని రూముల నుండి పేపర్లు రిసీవ్‌ చేసుకొని, రిజిస్టర్‌ నంబర్స్‌, సబ్జెక్ట్‌ ప్రకారం వరుసగా పేర్చి, ‘డి’ ఫారం (బోర్డు నుండి వచ్చే నంబర్ల ప్రింటెడ్‌ లిస్ట్‌) చెక్‌ చేసి, అబ్సెంటీస్‌ నంబర్లను రౌండాఫ్‌ చేసి, రూముల నుండి వచ్చిన అబ్సెంటీస్‌ స్టేట్‌మెంట్స్‌తో ట్యాలీ చేసి, బండిల్స్‌ తయారు చేసి, లక్క సీళ్లు వేయించి, స్పాట్‌ వాల్యుయేషన్‌ అడ్రసు రాయించి పోస్టాఫీసుకు పంపేవరకు అన్ని పనుల్లో సాయం చేయాలి.

ఇవన్నీ పూర్తయి, పతంజలి ఇంటికి వెళ్లేసరికి, ఒంటిగంట దాటింది.

“ఏమిటి బావా? ఇంత లేటు! రోజూ పన్నెండులోపు వచ్చేవారు!” అన్నది వసుధ.

“ఈ రోజు రిజర్వు డ్యూటీ వేశారులే. వడ్డించు రెండు నిమిషాల్లో వస్తా” అంటూ బాత్‌ రూంకి వెళ్లాడు. వసుధ ప్లేట్లు మంచినీళ్లు పెట్టి వంటింట్లో చారు వేడి చేస్తూంది.

“మాస్టారూ, ఇంగ్లీష్‌ మాస్టారూ!” అంటూ ఎవరో గట్టిగా పిలుస్తున్నారు.

“ఒక్క నిమిషం వసుధా వడ్డించకు” అంటూ వరండాలోకి వెళ్లాడు గ్రిల్‌ తలుపు వద్ద ఐదారుగురు స్టూడెంట్స్‌ నిల్చొని ఉన్నారు. అగ్ర భాగాన అంబుసోలి దుర్యోధనుడు.

పతంజలికి భయమేసింది. తాను వాడి మీద చేయి చేసుకున్నందుకు తన మీద దాడి చేయడానికి రాలేదు కదా అనుకున్నాడు అయినా బింకంగా.

“ఏమిట్రా దుర్యోధనా, ఇంతమందిని తీసుకొచ్చావు? రండిరా” అంటూ తలుపు గడియ తీశాడు. అందరూ ఒక్కుమ్మడిగా లోపలికి వచ్చారు.

“కూర్చోండ్రా” అంటూ ఫ్యాన్‌ వేసి, తానూ కూర్చున్నాడు తన కుర్చీలో వాళ్లంతా కింద కూర్చున్నారు.

“మాస్టారూ! మీరు ఈడ్ని కొట్టి మంచిపని చేశారండి. లేపోతే ఆయస్సయీవోడు  ఈడిని తీసుకుపోయేవోడు” అన్నాడొకడు. వాడు పతంజలికి తెలుసు. సెకండ్‌ హెచ్‌.యి.సి. వాడిపేరు కనకరాజు.

దుర్యోధన అన్నాడు. “మాస్టారూ, ఆడు నా మీద అదికారం సెలాయించే తలికి గొప్ప కోపమెలిపొచ్చీసినాదండి. అందుకే  తిరగబడ్డానండి కాని మీరు నన్ను కొట్టిం తర్వాత అర్తమయినాదండి  నన్ను పెమాదం నుండి రచ్చించినారని. నన్ను చెమించండి” అంటూ పతంజలి పాదాల మీద వాలాడు. తలుపు కర్టెన్‌ చాటున నిలబడి వసుధ అంతా చూస్తూంది.

“ఓరేయ్‌ మీకు తెలియదు. ఒక్కసారి పోలీస్‌ రికార్డులకెక్కితే అది జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఉద్యోగాలు రావు. మీకందరికీ భగవంతుని దయ వల్ల రిజర్వేషన్‌లున్నాయి. చక్కగా చదువుకోండి. బ్రయిట్‌ ప్యూచర్‌ విల్‌ బి యువర్స్‌. మన దుర్యోధన ఆవేశంతో పోలీసుల కోపానికి గురి కాకూడదనే నేను వాడిని కొట్టాను గాని వాడి మీద నాకు కోపం లేదు” అన్నాడు పతంజలి.

దుర్యోధన మరోసారి మొక్క బోయాడు పతంజలికి. వారించి, “ఇక వెళ్లండి. ఆల్‌ ది బెస్ట్‌. మీ వయసలాంటిది. జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచం దయలేనిది” అని “ఉండండి. ఎండన పడివచ్చారు. చల్లని మంచినీళ్లు తాగుదురు గాని” అంటూ లోపలికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి జగ్గుతో కుండలో నీరు, గ్లాసులు తెచ్చారు. పిల్లలందరూ నీళ్లు తాగారు. దాదాపు సగం కుండ ఖాళీ చేశారు.

అందరూ పతంజలికి, వసుధకు నమస్కరించి, “వెళ్లొస్తామండీ మాస్టారు, వెళ్లొస్తామండీ అమ్మగారు” అంటూ వెళ్లిపోయారు.

వాన వెలిసినట్లయింది. భోజనం చేస్తూ వసుధతో అన్నాడు. “నామీద దాడి చేయడానికి వచ్చారనుకొని భయపడ్డాననుకో” వసుధ నవ్వింది. “ఈ రోజు మీలో ఇంకో కోణాన్ని చూశాను బావా. అయినా మీమీద దాడెందుకు చేస్తాడు? ఆ దుర్యోధన అనే స్టూడెంట్‌లో పశ్చాత్తాపం, మీ పట్ల గౌరవం స్పష్టంగా కనిపించాయి. ఒకడే రావడానికి మొహం చెల్లక నలుగరు ఫ్రెండ్స్‌ను తెచ్చుకున్నాడంతే” అన్నది.

పరీక్షలయ్యాయి. స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ ఈ సారి రాజమండ్రికి వేశారు. రాత్రి వసుధకు తోడుగా సి.ఐ. గారి కూతురు వసంత పడుకుంటానన్నది. మళ్లీ ఉదయ్‌తో కలిసి ఒకే డార్మిటరీలో ఉండి సరదాగ ఎంజాయ్‌ చేశాడు. పదిరోజుల్లో పూర్తయింది. ఆరువందలు వచ్చింది. ప్రద్యుమ్నకు ఒక వాకర్‌, కీ ఇస్తే ఎగిరే ఎలుగుబంటి బొమ్మ కొనుక్కొచ్చాడు.

కాలం తన పని, తాను చేసుకుపోతోంది. ప్రద్యుమ్న మూడేళ్ల వాడయాడు. ఆడపిల్లను ఒకర్నికని ఆపేద్దామని అనుకున్నారు. కనీసం ఇద్దరికీ ఐదు సంవత్సరాల గ్యాప్‌ ఉండాలని నిర్ణయించుకున్నారు. వేసవి సెలవుల తర్వాత వాడిని స్కూలుకు పంపాలని ప్లాను. బాగా అల్లరి ఎక్కువైంది. వాడు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయేవారు. వాడే దన్నా అడిగితే పతంజలి.

“నో మై ఆన్సర్‌ విల్‌ బి ఎ క్లియర్‌ నో!” అనేవాడు.

వాడికి అది పలకడం రాదు. నాన్నగారి అమ్మగాని ఏదయినా చెబితే వెంటనే.

“నో మై అంచ కియ్య. నో” అనేవాడు. ఇద్దరూ నవ్వుకొనేవారు.

ఎవరింటికైనా కొల్లీగ్స్‌ ఇళ్లకు వెళితే కూర్చున్న ఐదు నిమిషాలకు, “అంటీ, స్వీటు హాటు ఇవ్వండి. మేం తింటాం” అనేవాడు నిర్మొహమాటంగా. ఏది చేతిలో ఉన్నా, జాగ్రత్తగా ఏమరుపాటుగా ఉన్నప్పుడు తీసుకోవాలి. లేకపోతే విసిరేస్తాడు. పొరుగున ఉన్న వినయ భూషణ్‌కు ప్రద్యుమ్న అంటే చాలా ముద్దు. వాళ్లింటికి పదే పదే తీసుకొని వెళ్లేవాడాయన. వాళ్లింట్లో కొన్ని వస్తువులు విరగ్గొట్టివచ్చాడు. అప్పుడు ‘సిరివెన్నెల’ సినిమా వచ్చింది. వినయ భూషణ్‌ వాడికి “సర్వదమన్‌ బెనర్జీ” అని పేరు పెట్టాడు.

“వినయ భూషణ్‌ మామయ్య నిన్ను ఏమని పిలుస్తాడు?” అని అడిగితే ‘చవ్వదన్‌ బెజ్జి” అని చెప్పి అందర్నీ నవ్విస్తాడు. వరండా గ్రిల్స్‌ చకచక ఎక్కి రూఫ్‌ వరకు వెళ్లి, క్రిందకు దిగలేక ఏడుస్తాడు. సినిమాలన్నీ చక్కగా చూస్తాడు. ఇంటర్వెల్‌లో లైట్లు వెలగ్గానే వాళ్ల నాన్న వైపు అర్థవంతంగా చూస్తాడు. దానర్థం ‘బయటకెళ్లి కొనుక్కుందాం పద’ అని.

ఐస్‌ క్రీం అంటే ఇష్టం. అది చాలా సేపు తినాలని, నిదానంగా తింటూ, కారిపోయిందని ఏడ్పు. కర్ర పెండలంతో చిప్స్‌ చేసి అమ్ముతారు. పలాసలో. అవి చాలా బాగుంటాయి. అవి ఒక పాకెట్‌ తినాల్సిందే.

మార్చి పరీక్షలు వచ్చాయి. యథాప్రకారం డ్యూటీలు పడ్డాయి. ఈసారి పక్కనున్న ‘మందస’ కాలేజికి డిపార్టుమెంటల్‌ ఆఫీసరుగా వేశారు బోర్డువారు. బోర్డు ప్రతినిధి అన్నమాట. రోజూ తెల్లవారుజామున లేచి ఆరుగంటలకల్లా బస్సెక్కి హరిపురం ‘జనసన’ చేరుకొని, అక్కడి నుండి మరో బస్సులో మందస చేరేవాడు. ఏడుంపావు కల్లా పోలీస్‌ స్టేషన్‌లో ఉండాలి. ఏడున్నరకు కొశ్చన్‌ పేపర్‌ పాకెట్స్‌ చీఫ్‌తో సహా బయటకు తీసి, సెంటరు కొచ్చేవాడు. రూం వైజ్‌ పేపర్లు విడదీసి, ఏడు యాభైకల్లా రూముల్లోకి పంపాలి. సరిగ్గా ఎనిమిదికి పరిక్ష ప్రారంభమవుతుంది.

పదకొండుకు పరీక్ష అయిం తర్వాత దాదాపు రెండు గంటలు పని ఉంటుంది. ఆన్సర్‌ పేపర్‌ బండిల్స్‌ పోస్టాఫీసుకు పంపేసరికి ఒంటిగంట దాటుతుంది. ఇల్లు చేరే సరికి రెండు. టిఫిన్‌ సెంటరుకే తెప్పిస్తారు. వసుధ తనకొక్కదానికి టిఫిన్‌ చేసుకోదు. అలాగని తొందరగా భోంచేయదు. పతంజలి వచ్చేవరకు అలాగే ఉంటుంది. మేరీ బిస్కెట్లు తిన్నాను. రెండోసారి కాఫీ తాగానులెండి అని ఏవేవో చెబుతుంది.

మందస పాలకోవా ఉత్పత్తికి ప్రసిద్ధి. నువ్వులు దట్టంగా అద్దిన మినప అప్పడాలకు ప్రసిద్ధి. అన్నీ తెచ్చేవాడు ప్రద్యుమ్నకు అవంటే చాలా యిష్టం.

ఇల్లు గలాయన కంసాలిపని చేస్తాడు. దగ్గరే  “పూండి’ అన్న ఊర్లో ఉంటారు. పిల్లల చదువుల కోసం కాశీబుగ్గలో కాపురం పెట్టాలని పతంజలిని ఇల్లు ఖాళీ చేయమని కోరారు వాళ్లు. ఇరవై నాలుగు గంటల్లో శిష్య బృంధం ఇల్లు చేసేశారు. జాతీయ రహదారికి అది దగ్గర దుర్గా ధియేటర్‌ వెనుకే. అక్కడ పెద్ద కర్రల మండీ (టింబర్‌ డిపో) ఉంది. ఇల్లు చాలా పెద్దది. వరుసగా నాలుగు రూములు. అన్ని వసతులు ఉన్నాయి.

ఇల్లు మారి వారం రోజులవుతూంది. తుంబనాధంగారికి పార్వతీపురం కాలేజికి ట్రాన్స్‌ఫర్‌ అయింది. ఆయన స్థానంలో నెల్లిమర్ల నుండి ప్రభాకర్‌ అనే ఆయన వచ్చాడు. వీళ్లింటి ఎదురుగానే ఉండేవారు. వాళ్లకో పాప స్వాతి. ప్రద్యుమ్న ఈడుదే. దాన్ని అందరూ ‘స్వాతి గాడు’ అని ముద్దుగా పిలుస్తారు. పిల్లలిద్దరూ మంచి దోస్తులయ్యారు.

సాయంత్రం చల్లబడ్డాక అందరూ డాబా మీదకు చేరతారు. హైవే మీద వెళ్లే లారీలన్నీ కనబడుతుంటాయి. ఒకసారి రోడ్డుమీద గ్యాస్‌ ట్యాంకర్‌ చాలా పెద్దది వెళుతూంది. ప్రద్యు పరుగున నాన్న దగ్గరికొచ్చి, “నాన్నా, అదేమిటి?” అనడిగాడు.

“అది గ్యాస్‌ ట్యాంకర్‌ నాన్నా, మనం వంటింట్లో వంట చేసుకుంటామే. క్రింద సిలిండర్ పెట్టుకుంటాము కదా, అది పే…ద్ద సిలెండరన్నమాట. దానిలో నుండి మన చిన్న సిలిండర్లకు గ్యాస్‌ నింపుతారు”

ప్రద్యు కాసేపు ఆలోచించాడు. “అయితే ఆ ట్యాంకరు కొందాం. దాన్ని మన యింటివెనుక నిలబెట్టి, మన వంటింట్లో గ్యాస్‌ స్టవ్‌కు ట్యూబు తగిలిస్తే, ఎన్ని రోజులైనా మనకు గ్యాస్‌ ఐపోదు”

పతంజలి వసుధను పిలిచి ప్రద్యుగాని ఆలోచన చెప్పాడు. తల్లి తనయుని తెలివికి మురిసిపోయింది. “నా బంగారు కన్న. అన్నీ వాళ్ల నాన్న బుద్ధులే” అంది.

“అవి మనకు అమ్మరు నాన్నా” అని చెప్పాడు కొడుక్కు.

స్పాట్‌ ఆర్డర్సు వచ్చాయి. తిరుపతి కిచ్చారు. ఇంగ్లీషు సబ్జెక్ట్‌. పరీక్షలు పూర్తవడానికి రెండు రోజులు ముందే మందసలో రిలీవయ్యాడు పతంజలి.

వసుధకొక ఆలోచన వచ్చింది.”బావా, మేము కూడ వస్తాము మీతో. మీరు అన్ని  రోజులు ఉండరు. మళ్లీ వెనక్కు వచ్చి మళ్లీ వెల్దుర్తికి వెళ్లాలంటే ఈ ఎండలో మీరు స్ట్రెయినవుతారు. నేనేమంటానంటే చిత్తూరులో మేం అక్కయ్య వాళ్ల దగ్గర ఉంటాము. మీ స్పాట్‌ అవగానే అందరం అత్త వాళ్లింటికి వెళ్లిపోవచ్చు. ఏమంటారు?”

“బాగానే ఉందిగానీ, అన్ని రోజులు మీరు వాళ్లింట్లో ఉంటే ఏం బాగుంటుంది?”

“అయ్యో మా అక్కబావలకు మేమంటే చాలా యిష్టం. అలా ఏం అనుకోరు.”

వెంటనే స్టేషన్‌కు వెళ్లి పూరీ – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్‌ చేయించుకొని వచ్చాడు పతంజలి. ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరి మర్నాడుదయం తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుండి చిత్తూరుకు బస్‌లో వెళ్లారు.

వసుంధర వదినె, అన్నయ్య చాలా సంతోషించారు. ఆ రోజే పతంజలి రిపోర్టు చేయాలి. స్నానం చేసి, వెంటనే తిరుపతికి బయలు దేరాడు. కపిల తీర్థం రోడ్‌లోని యస్‌.వి జూనియర్‌ కాలేజ్‌ స్పాట్‌ సెంటరు. వెళ్లి పన్నెండులోపు రిపోర్టు చేశాడు. ఉదయ్‌ కూడ వచ్చాడు. అతనికి వాళ్ల కజిన్‌ ఒకామె తిరుపతిలో ఉందట. ‘బైరాగి పట్టెడ’ వీధిలో ఉంటారట. వాళ్లింట్లో ఉంటానన్నాడు.

సాయంత్రం చిత్తూరుకి వెళ్లాడు. అన్నయ్య కూడ రాత్రి ఎనిమిదిగంటలకు బ్యాంకు నుండి వచ్చేశాడు. అందరూ భోజనం చేస్తున్నారు. సొరకాయ సాంబారు, వెలక్కాయపచ్చడి చేసింది వదినె. ప్రద్యుగాడు వాళ్ల చిన్నాన్నలాగే సాంబారులోకి వడియాలో అప్పడాలో లేకపోతే ఒప్పుకోడు. వసుధ మందసకోవా రెండు బాటిళ్లు, అప్పడాల పాకెట్లు, చుప్పులు అని దొరుకుతాయి శ్రీకాకుళం జిల్లాలో చాలా బాగుంటాయి. బియ్యంపిండితో చేస్తారు. జంతికలు లాంటివే. అవి కూడ తెచ్చింది. అవి భరత్‌కు తెగ నచ్చాయి. భరత్‌కు ఈ సంవత్సరం బి.కాం అయిపోతుంది. కాంపిటీటివ్‌ ఎక్జామ్స్‌ రాస్తాడట.

“మొన్నటి పే రివిజన్‌లో నీకెంత బెనిఫిట్‌ వచ్చిందయ్యా?” అని అడిగాడన్నయ్య. వదినె పతంజలిని ‘ఏరా’ అని సంబోధిస్తుంది ఎప్పుడయినా. ఆయన మాత్రం అయ్యా, పతంజలీ అనే పిలుస్తాడు. చాలా మితభాషి.

“డి.ఎ. మెర్జ్‌ చేసి ఫిట్‌మెంట్‌ కలుపగా రెండువేల రెండువందలు బేసిక్‌ అయ్యిందండి. డి.ఎ.హెచ్‌ఆర్‌ఎ కలుపుకుంటే మూడు వేల దాకా వస్తూంది” అన్నాడు వినయంగా.

“గుడ్‌. మా వెధవలు పదేండ్లకొకసారి బిచ్చమేసినట్లు పే రివిజన్‌ చేస్తారు. మాకంత బెనిపిట్‌ ఉండదు. సరేగాని, ఇన్‌కం టాక్స్‌ పడుతూందా?”

“లేదండి జి.పి.ఎఫ్‌కు ఆరువందలు కాంట్రిబ్యూట్‌ చేస్తున్నాను.”

“వీలుంటే ఇంకా పెంచు. దానిమీద ప్రస్తుతం పధ్నాలుగు శాతం వరకు ఇంటరెస్ట్‌ వస్తూంది. నా మాటిని వెయ్యికి పెంచు. నీవెలాగూ ట్యూషన్లలో అంతో ఇంతో సంపాదిస్తావు కదా!”

వదినె అన్నది. “అందరి జమా ఖర్చులూ ఈయనకు కావాలి. వాడికి తెలియదా ఏం”

“లేదు వదినా ఆయన అనుభవం వేరు.” అన్నాడు మరిది. తన దగ్గర పదివేలు ఉందనీ, ఎలా ఇన్‌వెస్ట్‌ చేయాలో చెప్పమని అడిగాడాయనను.

“ఆ పిల్లకు మేం పెట్టిన నాలుగు తులాలేగా ఉంది. ఏదైనా నగ చేయిస్తే సరి. ప్రస్తుతం తులం నాలుగువేల వరకుంది”

“లాంగ్‌ చెయిన్‌ చేయించుకోవే లక్ష్మీకాసులచెయిన్‌ అంటారు. మూడు తులాలు పెడితే దిట్టంగా వస్తుంది” వదినె.

“పదివేలు సరిపోవేమో” పతంజలి.

“నేనిస్తాలేవయ్యా. నాకు తర్వాత ఇద్దువుగాని” అన్నాడు అన్నయ్య.

భోజనాలు పూర్తయ్యాయి. హాల్లో ఒక కూలర్‌ పెట్టారు. ప్రద్యుగాడు దాని ముందు నిలబడి చల్లదనాన్ని అనుభవిస్తున్నాడు. దాని దగ్గరనుండి రావడం లేదసలు.

“రేపు ఉదయం బయలుదేరి తిరుపతికి వెళ్లి అక్కడ ఉంటానన్నయ్య. దాదాపు ఇరవై రోజులు పట్టేటట్టుంది డ్యూటీ” అన్నాడు పతంజలి.

“నీకేమయినా పిచ్చా!” అన్నాడాయన. “చక్కగా రోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చెయ్యి. ఉదయం ఏడున్నరకు ఏదో ప్యాసింజరుంది. దాంట్లో వెళితే తొమ్మిదికల్లా దిగనే దిగుతావు. సాయంత్రంకూడా ఏదో రైలుంటుంది. మంత్లీ సీజను టికెట్‌ తీసుకుంటే సరి. మీ వదినె మధ్యాహ్నం తినడానికేదైనా చేసిస్తుంది.”

“ఎందుకన్నయ్యా మీకు శ్రమ.”

“మాకేం శ్రమలేదు స్వామీ! నీవు తిరగడానికి ఓపికలేదంటే మేమేం చెయ్యలేము. మేం దగ్గరగా ఉన్నాము కాబట్టి చెబుతున్నా. లేకపోయి ఉంటే నీ తిప్పలు నీవు పడేవాడివనుకో. ఉండు కనుక్కుంటాను” అని ల్యాండ్‌ లైన్‌ ఫోను నుండి ఎవరితో మాట్లాడాడు.

“ఆహా, ఏడు నలభైకా. సరే. మరి సాయంత్రం తిరుపతి నుండి?”

“……………..”

“ఆరు పదికా వెరీగుడ్‌. థాంక్యూ”

పతంజలితో చెప్పాడు. “ఏడు నలభైకట ప్యాసింజరు. నీ స్పాట్‌ ఎన్నిగంటలకు?”

“పదికన్నయ్య”

“బ్రహ్మాండం. తొమ్మిదింబావు కల్లా తిరుపతి. సాయంత్రం ఆరు పదికి అదే ప్యాసింజర్‌. ఎనిమిది కల్లా యింట్లో ఉంటావు. రేపు ఉదయం అరగంటముందు పోయి ఎమ్‌.యస్‌.టి తీసుకో (మంత్లీ సీజన్‌ టికెట్‌) ఫోటో ఉంది కదా. సెల్ఫ్‌ అటెస్టేషన్‌ పనికిరాదు. నేను చేస్తాలే”

అలా అన్నీ తానే నిర్ణయించేశాడా మహానుభావుడు.

ఉదయం 7 గంటలకే ఏదో టిఫిన్‌ పెట్టేది వదినె. స్టీలు బాక్సులో అన్నం, ఇంకో చిన్న బాక్స్‌లో పప్పు, కూర పెట్టిచ్చేది. మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌లో తినేవాడు. రైల్లో చదువుకోడానికి ఏదో పుస్తకం పెట్టుకునేవాడు. 22 రోజులు పట్టింది డ్యూటీ. పేపరు రెమ్యూనరేషన్‌ రూపాయి పావలాకు పెంచారు. పి.ఆర్‌.సి కనుగుణంగా డి.ఎ. కూడ అరవై రూపాయలయింది. రానుపోను ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలు ఇస్తారు. ఇదే ఐదువందలకు పైగా వచ్చింది. దానికి  ఏ ప్రూఫ్‌ అవసరం లేదు. అవుట్‌ స్టేషన్‌ అలవెన్స్‌ కూడ పెరిగింది. అంతా కలిపి రెండువేల ఎనిమిది వందలవరకు వచ్చింది. ‘సరే లక్ష్మీకాసుల లాంగ్‌ చెయిన్‌కు సరిపోతుందిలే’ అనుకున్నాడు. చివరిరోజు రిలీవై, పేమెంట్‌ తీసుకొని, అరకిలో భీమాస్‌లో స్వీట్లు, మిక్చరు, అరడజను యాపిళ్లు కొన్నాడు. ‘కంచి సిల్క్స్‌’లో వదినెకు రెండు వందలు పెట్టి చీర తీసుకున్నాడు. ఇంటికి వెళ్లే సరికి పదైంది.

చీర చూసి వదినె ముఖం వెలిగింది. “చాలా బాగుందిరా” అన్నది.

“మా అమ్మ పోయింతర్వాత నాకు చీర పెట్టినవాడివి నీవే”

“నీకేం పని పాటా లేదా! ఎందుకు అంత ఖర్చు పెట్టావు?” అన్నాడన్నయ్య.

మరుసటి రోజు తెలిసిన కంసాలిని పిలిపించి చెయిన్‌ ఆర్డరిచ్చారు. రెండు తులాల ఏడు గ్రాములు పడుతుందని పన్నెండు వేలకు కొంచెం అటూ ఇటూ కావచ్చనీ అన్నాడు ఆచారి. పది రోజుల్లో చేసిస్తానన్నాడు. పూర్తయిన తర్వాత భరత్‌తో వెల్దుర్తికి పంపిస్తానంది వదినె. ఆమెకు ప్రద్యు బాగా మాలిమి అయ్యాడు. ‘పెద్దమ్మా’ అంటూ ఆమె వెంటే ఉంటాడు. భరత్‌ మామ అంటే కూడ ఇష్టం. అన్నయ్యకు పిల్లలను దగ్గరకు తీయడం రాదు. ఆయన దగ్గరకు వెళ్లడు.

మరుసటి రోజు వెంకటాద్రికి బయలుదేరి డోన్‌లో దిగి, రెండు మూడు గంటలు వెయిటింగ్‌ రూంలో ఉండి. కర్నూలు లోకల్‌లో వెల్దుర్తి చేరుకున్నారు.

తండ్రి కొంచెం శారీరికంగా బలహీనుడయినట్లు గమనించాడు పతంజలి. తల్లికి మాత్రం చాకిరీ తప్పడం లేదు. మహిత పై పనులు చేస్తుంది. ఆమె డిగ్రీ పూర్తయింది. సంబంధాలు చూస్తున్నారు. మల్లినాధ తన రంగంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. ‘మల్లి స్వామి’ అని అంటారంతా. తాను పెళ్లి చేసుకోడట. తన ఆచార వ్యవహారాలకు, మడీ, శుచీ తెలిసిన పిల్లలు ఎక్కడున్నారంటాడు. వీళ్లు వెళ్లిన వారం రోజులకు పాణిని వచ్చాడు వస్తూనే అన్నయ్యను కౌగిలించుకున్నాడు. వదినె మద్దుల మరిదిని అక్కన చేర్చుకుంది.

“క్యూట్‌ లిటిల్‌ ఫెలో ఎంత పెద్దోడయిపోయాడు!” అని ఆశ్చర్యపోయాడు. ఒక రోజంతా చిన్నోడి దగ్గరికి పోలేదు ప్రద్యుగాడు. నానమ్మ వాడిని ‘కన్నా’ అంటే తాత వాడిని ‘సింహం’ అని పిలుస్తాడు.

“డిగ్రీ పూర్తయింది కదా” అన్నాడు పతంజలి చిన్నోడితో.

“అవునన్నయ్యా, జె.యన్‌.యు (జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ) ఢిల్లీ ఎంట్రన్స్‌ వ్రాశాను (ఎమ్‌.ఎ. ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌) కోసం. జె.ఆర్‌.ఎఫ్‌ (జూనియర్‌ రీసెర్చిఫెలోషిప్‌) కోసం కూడ ఒక ఎంట్రన్స్‌ వ్రాశాను. దాంట్లో సెలెక్టయితే ఎమ్‌.ఎ. పిహెచ్‌డి వరకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు స్కాలర్‌షిప్‌ వస్తుంది. రావ్స్‌ ఐ.ఎ.ఎస్‌ స్టడీ సర్కిల్‌, ఢిల్లీ వారిని సంప్రదించాను. స్టడీ మెటీరియల్‌తో సహా ప్రిలిమ్స్‌కు పదివేలు తీసుకుంటారట. ప్రిలిమ్స్‌లో సెలెక్టయితే ఫైనల్‌ కోచింగ్‌కు నలభై వేలట. నీవు పంపిన డబ్బు ఐపోయింది. ఐ.ఎ.ఎస్‌.కు ప్రిపేరవుతూ పి.జి చేయాలనుకుంటున్నా. ఐ.ఆర్‌ కూడ ఆప్షనల్స్‌లో ఉంది. జూన్‌ నుండి ‘దేనా’ బ్యాంక్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తాను. కొంత ఖర్చులకు పనికొస్తుంది. ప్రిలిమ్స్‌లో నెగ్గి మెయిన్స్‌ కు కోచింగ్‌ తీసుకోవాలంటే మాత్రం డబ్బు కావలసి వస్తుంది.”

“దాని గురించి ఆలోచించకు, తోట అమ్మిన డబ్బులో ముఫై వేలు నీ పేరిన కూడ వేశాము కదా! అది విత్‌డ్రా చేద్దాం. కెరీర్‌ కంటే ఏదీ ముఖ్యం కాదు. నీవు ఐ.ఎ.ఎస్‌ ఎలాగైనా సాధించి నా కల నెరవేర్చాలిరా”

“తప్పకుండా అన్నయ్యా!”

ఆ రోజు సండెగల పులుసు, మెంతిపప్పు చేసింది వర్ధనమ్మ. శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు నేతిలో దోరగా వేయించి, పొడిచేసి, ఉండలుగా కట్టి పులుసులో వేస్తుంది. అవి పులుసులో బాగా ఉడికి ఉబ్బుతాయి. ప్రద్యుకు బాగా నచ్చాయి.

“నాన్నమ్మ సాంబారులో బాల్స్‌ వేసింది” అన్నాడు.

చిన్నోడు ఢిల్లీ నుండి రసగుల్లా టిన్స్‌ రెండు తెచ్చాడు.

ఒకరోజు అందర్నీ చూసి వద్దామని కర్నూలుకు వెళ్లాడు. మునికి కూడ పెళ్లయింది. పతంజలి స్పాట్‌ డ్యూటీ వల్ల రాలేకపోయాడు. ముని భార్య పుట్టిల్లు ఎమ్మిగనూరు. వీవర్స్‌ కుటుంబం ‘భాస్కర్‌ నగర్‌’లో రెండు గదుల యిల్లు అద్దెకు తీసుకున్నారు. పతంజలి వాళ్లింట్లోనే భోంచేశాడు ఆమె పేరు పావని.

“ఎప్పుడూ మిమ్మల్నే తల్చుకుంటుంటాడన్నా” అన్నదామె. “నా జీవితానికి ఒక మార్గం చూపినాడు శర్మ అంటాడీన” అందామె.

తమ్ముడు ట్రబులిస్తున్నాడనీ, చెప్పిన మాట వినడనీ, డబ్బు దుబారా చేస్తాడనీ, క్యాష్‌ బాక్స్‌లో నుండి చెప్పకుండా వందలు వందలు తీసుకుపోతాడని చెప్పాడు ముని. వాడికి కర్నూల్లోనే వేరే షాపు పెట్టించి పంపేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

“అదే మంచిది. బాధ్యత తెలుస్తుంది” అన్నాడు పతంజలి.

దేవసాయంసారు రిటైరయ్యారు. మేడంగారికి ఇంకా రెండేళ్లు సర్వీసుందట. పతంజలిని చూసి ఇద్దరూ సంతోషపడ్డారు. మంచి ‘యిలాచీ టీ’ ఇచ్చిందామె.

తాండ్రపాడుకు పోయి బాజిరెడ్డిని చూసొచ్చాడు. “శాతగావటంల్యా సామీ! నిమ్మతోట గుత్తకిస్తి. పిల్లలు కాలేజీకొచ్చిండారు. ఈ మజ్జ కొంచెం దగ్గు బుస వచ్చాండాది. కులదీపక్‌ రెడ్డికాడ సూపిచ్చుకుంటాండా. ఈ ఎండకాలం బాగానే ఉంటాది గాని, సలికాలం మాత్రం పానం దీచ్చాది” అన్నాడు.

“అమ్మయ్యను కొడుకును గూడ్క తీస్కరావల్సుండెసామీ” అన్నది బాజిరెడ్డి భార్య. ఉల్లిపాయ పకోడీలు చేసిపెట్టింది. వదన్నా వినకుండా రోడ్‌ వరకు వచ్చి బస్సెక్కించాడు రెడ్డి.

సాయంత్రం బస్‌లో వెల్దుర్తికి వస్తూంటే పక్కన ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. ఎర్రగా స్మార్ట్‌గా ఉన్నాడు. పతంజలిని చూసి “బాగాన్నారా బావా! నన్ను గుర్తు పట్టలేదు కదూ!” అన్నాడు.

“అయాం సారీ! ఐ కెనాట్‌ రికలెక్ట్‌ హు యు ఆర్‌”

“మీరు పతంజలిశర్మగారు కదా!”

“అవును. మీరు?

“నేను సుబ్బయ్యసారు కొడుకును. కృష్ణశర్మగారు నాకు పెదనాన్న అవుతారు. నా పేరు సుధీంద్ర శర్మ.” పతంజలికి గుర్తొచ్చింది. సుబ్బయ్యసారింటికి రెండు మూడుసార్లు సుబ్రహ్మణ్య షష్టికి వటువుగా వెళ్లాడు తను. ఈ పిల్లవాడు అప్పుడు చిన్నవాడు. తనకంటె పదేళ్లు చిన్నవాడు. వాళ్ల నాన్న లైబ్రరీ అరుగుమీద కూర్చుని పేపరు చదువుకుంటుంటే ఇంటికి పోదాం రమ్మని గొడవ చేసేవాడు.

“ఓరి నీ! నీవా! పెద్దవాడివయ్యావురోయ్‌! ఏం చేస్తున్నావు? సారెలా ఉన్నారు? అమ్మ బాగుందా!” అనడిగాడు.

“నాన్న చనిపోయి మూడేళ్లవుతూంది బావా!” అన్నాడా అబ్బాయి. పతంజలి సారు భార్యను అత్తా అని పిలిచేవాడు.

“అమ్మ వెల్దుర్తిలోనే ఉంది. మాకొక పాత యిల్లుందికదా అక్కడ. నేను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ యిండియాలో క్లర్క్‌ కం క్యాషియర్‌గా పని చేస్తున్నా. రెండేళ్లయింది. ‘గంగావతి’ అనే ఊర్లో కర్నాటక బళ్లారి నుండి రెండు గంటల ప్రయాణం మీరు?”

తన గురించి చెప్పాడు పతంజలి. పాణిని గురించి కూడ చెప్పాడు.

“వాడు స్కూల్లో నాకు మూడేళ్ల జూనియర్‌” అన్నాడు సుధీంద్ర.

ఇద్దరూ వెల్దుర్తిలో దిగి విడిపోయారు. ఇంటికి నడుస్తూ ఉంటే తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. మహితకు చక్కని ఈడూ జోడవుతాడు సుధీంద్ర. ఏ బాదర బందిలేదు. బ్యాంక్‌ జాబ్‌ ఉంది. చెల్లెలు సుఖపడుతుందని అనిపించింది.

ఇంటికి వెళ్లాక అమ్మతో నాన్నతో ఈ సంబంధం గూర్చి ప్రస్తావించాడు పతంజలి.

“వాళ్లకు ముందూ వెనకా ఏ బలగమూ లేదురా! మన స్థాయికి తూగరు” అన్నాడు తండ్రి.

పతంజలికి నవ్వొచ్చింది. “మన స్థాయి మొన్నటి వరకు ఏమిటి నాన్నా? అప్పులు కట్టుకోలేక పొలాలమ్ముకుంటిమి. ఈ రోజుల్లో బ్యాంక్‌ ఉద్యోగం ఉన్న వరుడు దొరకడం కష్టం. చిన్న వయసు. ముందు ముందు ఆఫీసరు, మేనేజరు కూడా అవుతాడు.”

“ఆ అఖిలాండమ్మ ఎవరింటికీ రాదు. ఏం చూసుకునో మరి!” అన్నది వర్ధనమ్మ.

ఆర్థికంగా మెరుగుపడినందు వల్ల అమ్మానాన్నలకు వాళ్ల సంబంధం తీసికట్టుగా కనిపిస్తోందని అర్థమయింది పతంజలికి.

“అమ్మా! ఆమెతో మనకెందుకు. ఆ అబ్బాయి దూరంగా కర్నాటకలో ఉన్నాడు. అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసామ్మా ! మన బంగారమ్మకు సరిగ్గా సరిపోతాడు. ఎంత అణకువ! బావా బావా అంటూ వరస కలిపేశాడు. నేను గుర్తుపట్టలేదసలు. తానే ముందు పలకరించాడు. మీరింకేం ఆలోచించొద్దు. వాళ్లు ఒప్పుకుంటే మన మహిత అదృష్టవంతురాలు” అన్నాడు.

“నాన్నా రేపే వెళ్లి మనిద్దరం అఖిలాండమ్మగారితో మాట్లాడి వద్దాము” అన్నాడు తండ్రితో. ఇంటి బాధ్యతలన్నీ మోసి, సంసారాన్ని ఒక దారికి తెచ్చిన పెద్ద కొడుకు మాట కాదనలేకపోయారు ఇద్దరూ.

తండ్రితో కలిసి ఆమె దగ్గరికి వెళ్లాడు పతంజలి. మార్కండేయశర్మను చూసి ఒక క్షణం కళవళ పడిందామె. చాపవేసి కూర్చోబెట్టింది. మంచినీళ్ళిచ్చి, బ్రూ కాఫీ కలిపిచ్చింది.

“బాగున్నారా అత్తా” అన్నాడు పతంజలి.

“నీవు పతంజలివి కదురా! నిన్న మా సుధి చెప్పాడులే. బస్సులో కలిసినారంట కద! ఏం చేస్తున్నావు నాయనా? నీ పెండ్లికి కార్డు పంపించారు. మీ సారు ఆ సంవత్సరమే కాలం చేసిండె. అందుకే రాల్యా. పిల్లలెంతమందిరా నీకు?”

“ఒక కొడుకత్తా. నాలుగో ఏడొచ్చింది”

తండ్రి వైపు చూశాడు సాభిప్రాయంగా శర్మ ఆమెతో అన్నాడు. “అఖిలమ్మా, మా పాపను నీ కొడుక్కు అడగడానికొచ్చినాము. పిల్ల డిగ్రీ పాసయింది. బాగుంటుంది. మరి మీకు కూడ సమ్మతమయితే ముందుకు పోదాం”

అఖిలమ్మత్త ఉబ్బి తబ్బిబ్బయిందా మాటలకు.

“అంతదృష్టమా అన్నా మాకు. మీ అంతటి వారు మాయింటికొచ్చి పిల్లనిస్తామంటే అంతకంటే కావలసిందేముంది మాకు?” అన్నది చేతులు జోడించి. అబ్బాయి జన్మ నక్షత్రం, జనన సమయం, స్థలం, అన్నీ తీసుకున్నారు. ఇద్దరికీ రెండేళ్లే వార.

“జాతకాలు చూస్తానమ్మా నక్షత్రాలు సరిపోయాయి. ఎన్ని గుణాలు వస్తాయి, గ్రహమైత్రి ఇవన్నీ చూసి, నీకు చెప్తాను. మీరుభయులూ వచ్చి పాపను చూసుకుందురు” అన్నాడాయన. ఆమెకు చెప్పి వచ్చేశారు.

జాతకాలు బాగా సరిపోయాయి. పతంజలి వెళ్లి అత్తకు చెప్పి పెళ్లిచూపులకు ఆహ్వానించాడు. వచ్చే ఆదివారం సుధీంద్ర వస్తాడట. ఆరోజు సాయంత్రం కొడుకును తీసుకొని వస్తానన్నదామె.

ఆదివారం సాయంత్రం ఐదు  గంటలకు ఇద్దరూ వచ్చారు. సుధీంద్ర కుర్చీలో కూర్చున్నాడు. ఆమె క్రింద కూర్చుంది. కుర్చీ వద్దంది. వసుధ మహితను ముస్తాబు చేసింది. లేత నీలం రంగు జార్జెట్‌ చీర తలలో కనకాంబరం మాల. చేతికి అన్నయ్య కొనిచ్చిన వాచీ, మరో చేతికి రెండు బంగారు గాజులు. మెడలో గొలుసు. బంగారు బొమ్మలా నడచివచ్చి ఎదురుగా జంపఖానా మీద కూర్చుంది.

వర్ధనమ్మ, అతిరసాలు, చక్కిలాలు చేసింది. తల్లి తీసుకోలేదు. కొడుకు మాత్రం శుభ్రంగా తిన్నాడు. కాఫీలు తాగారు. సుధీంద్రకు మహిత నచ్చినట్లు అతని ముఖమే చెబుతుంది.

“మా పిల్ల అని చెప్పుకోవడం కాదుగాని, వంట బాగా చేస్తుంది. పనులన్నీ వచ్చు. ఇంకా ఏమయినా అడగదల్చుకుంటే అడగండి” అన్నది వసుధ. అబ్బాయి అమ్మాయి నుండి చూపులు మర్చలడం లేదు. మహిత కళ్లెత్తి సుధీంద్రను చూసింది. సరిగ్గా అప్పుడే అబ్బాయి అమ్మాయి కళ్లలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. మహిత గుండె జల్లుమంది.

‘అలా నవ్వుతాడేమిటి అందరి ముందూ’ అనుకుంది.

“మీ నిర్ణయం నిదానంగా చెప్పండి పరవాలేదు” అన్నాడు పతంజలి

సుధీంద్ర తల్లివైపు చూసి,

“నాకిష్టమేనమ్మా! ఆ అమ్మాయి కిష్టమో లేదో మరి” అన్నాడు.

మహిత చటుక్కున లేచి, సిగ్గుపడుతూ, ముఖం వెలిగిపోతూండగా లోపలికి వెళ్లిపోయింది.

“మా మరదలికి కూడ ఇష్టమే” అంది వసుధ నవ్వుతూ.

తల్లీ కొడుకులు బయలుదేరారు. సుధీంద్రకు తాంబూలం పండు ఇచ్చారు. వెళుతూ ఆగి పతంజలితో అన్నాడు.

“ధ్యాంక్యూ బావా! ఫర్‌ దిస్‌ ప్రెషస్‌ గిఫ్ట్‌”

“బస్సులోనే వరస కలిపేశావు కదా మరి! దాంతో నాకు ఐడియా వచ్చింది” అన్నాడు పతంజలి నవ్వుతూ.

నాలుగురోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకున్నారు. ఆమె తరపున కృష్ణ శర్మసారు ఆయన భార్య వచ్చారు.

“పిల్లకు ఆరు తులాల బంగారం ఉంది. పిల్లవానికి ఇరవై ఐదు వేల కట్నం యిస్తాము. వాచి, ఉంగరం పెడతాము. ఇంకేమయినా ఆశిస్తుంటే చెప్పండి” అన్నాడు పతంజలి.

కృష్ణశర్మ సారు అన్నాడు. “ఒరేయ్‌ పతంజలీ! బంగారమ్మ మా యింటి కోడలవుతుంది అంతే చాలు. మీ అల్లుడికి మీరేం పెట్టుకుంటారో మీ యిష్టం”

“మామా! నైన్త్‌లో ‘అదియట్లుండె వినుము గృహస్థరత్నంబ!’ అనే పెద్దనగారి సుధీర్ఘ వచనం నేర్చుకొని అప్పగిస్తే పెన్‌ బహుమతి ఇస్తానన్నావు. ఇంతవరకు అతీ గతీ లేదు” అన్నాడు పతంజలి.

“ఓరి భడవా! ఇస్తాలేరా” అన్నాడాయన.

“సాహిత్యం వ్యాకరణం వియ్యమందుతున్నాయి” అన్నాడు. శర్మలిద్దరూ మంచి మిత్రులు. కృష్ణశర్మ వైయాకరణుడు. ఇద్దరూ బావా బావా అనుకుంటారు.

ఈ వేసవిలో నిశ్చితార్థం చేసుకొని శ్రావణంలో ముహూర్తాలు పెట్టుకుందామనుకున్నారు.

మహిత పేరిట వేసిన డబ్బు పెళ్లి ఖర్చులకు వరకట్నానికి సరిపోతుంది. పైన మరో పదివేలు అవసరం కావచ్చని అంచనా వేశారు. పతంజలి తాను ఐదు వేలు ఇస్తానన్నాడు. మల్లినాధ తాను కూడ ఐదువేలిస్తానన్నాడు.

మేలో నిశ్చితార్థం జరిగింది. సుధీంద్ర మహితకు పట్టుచీర తెచ్చాడు. వాళ్లు పట్టుచీరలకు ఐదువేలిచ్చి, రెండు తులాల బంగారం పెడతామన్నారు.

చిన్నోడు మే చివరి వారంలో ఢిల్లీకి వెళ్లిపోయాడు. వాడికి వెయ్యి రూపాయలిచ్చాడు పతంజలి. జాన్‌ రెండవ వారంలో పతంజలి కుటుంబం పలాస చేరుకుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here