[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[వసుధ, ప్రద్యుమ్నలని తీసుకుని పతంజలి తల్లిదండ్రులు కాశీబుగ్గ వస్తారు. పిల్లవాడిని చూడడానికి చుట్టుపక్కలా వాళ్ళంతా వస్తారు. ముద్దు చేస్తారు. పతంజలి తల్లిదండ్రులని అందరూ గౌరవిస్తారు. పలాసకి దగ్గరలోని ‘నెమలికొండ’ క్షేత్రంలోని దత్తమందిరాన్ని దర్శించుకుంటారందరూ. అక్కడి పూజారి మార్కండేయశర్మ చేత అప్పటికికప్పుడు ప్రవచనం చెప్పిస్తారు. పిల్లవాడి అన్నప్రాశనకు సింహాచలం వెడతారు. పిల్లవాడు పదిరూపాయల నోటు పట్టుకుంటాడు. స్వామివారిని దర్శించుకుంటారు. ఆ వేడుక ముగించుకుని ఇంటికి వచ్చాకా, తండ్రి తానిక బయల్దేరుతానని, అమ్మ కొన్ని రోజులు ఉండి వస్తుందని అంటాడు. ప్రద్యుమ్న ఆటపాటలతో తల్లిదండ్రులకు అస్సలు కాలమే తెలియదు. దినదినప్రవర్ధమానమవుతుంటాడు పిల్లవాడు. మార్చి నెలలో జరిగిన పరీక్షలలో ఇంగ్లీషులో ఫెయిలయిన విద్యార్థులకు – ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని – ట్యూషన్ చెప్తాడు పతంజలి. సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా పోలీసు బందోబస్తుకు వచ్చిన ఎస్.ఐ.తో ఓ కుర్రాడు దురుసుగా ప్రవర్తిస్తే, అటువచ్చిన పతంజలి ఆ కుర్రాడిని చెంపదెబ్బ కొట్టి వాడి తరఫున ఎస్.ఐ.గారిని క్షమాపణలు అడుగుతాడు. తర్వాత తను తప్పు తెలుసుకున్న ఆ కుర్రాడు మరికొందరితో కలిసి పతంజలి ఇంటికి వచ్చి మన్నించమని అడుగుతాడు. ప్రద్యుమ్నకి మూడేళ్ళు నిండుతాయి. మరో ఆడపిల్లను కని ఇక ఆపేయాలనుకుంటారు పతంజలి, వసుధ. మళ్లీ మార్చి పరీక్షలు వచ్చాయి. పతంజలికి మందసలో డ్యూటీ పడుతుంది. కొంతమంది స్టాప్‌కి వేరే ఊర్లకి బదిలీలు అవుతాయి. మందసలో రిలీవయ్యాకా తిరుపతిలో స్పాట్ ఆర్డర్స్ వస్తాయి పతంజలికి. వసుధని, పిల్లవాడిని వాళ్ళ అక్క వాళ్ళింట్లో చిత్తూరులో దింపి తాను తిరుపతిలో ఉందామనుకుంటాడు పతంజలి. రైల్లో తిరుపతికి చేరుతారు. అక్కడ్నించి బస్‍లో చిత్తూరికి వెళ్తారు. వసుధ అక్కబావగార్లు వీరిని ఎంతో ఆదరంతో చూస్తారు. డి.ఎ. తదితర అలవెన్సులు దాచుకోమని వసుధ బావగారు పతంజిలి చెప్తారు. తన దగ్గరున్న డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో సలాహా అడిగుతాడు పతంజలి. బంగారం గొలుసు చేయిద్దామని అంటాడు. ఇంకా కొంచెం డబ్బు ఎక్కువ అయితే తాను ఇస్తానంటాడు. 20 రోజులు తిరుపతిలో ఉండన్నక్కరలేదనీ, రోజూ అప్ అండ్ డౌన్ చేయవచ్చని చెబుతాడాయన. చేసేదేం లేక అంగీకరిస్తాడు పతంజలి. స్పాట్ వాల్యూయేషన్ పూర్తయ్యాకా, పతంజలి కుటుంబం వెల్దుర్తి చేరుతుంది. తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు అంతా ఆనందిస్తారు. పాణిని కూడా వస్తాడు. తన భవిష్యత్తు ప్రణాళికలు అన్నతో చెబుతాడు. కర్నూలు వెళ్ళి మునిని కలుస్తాడు పతంజలి. దేవసహాయం సారుని, మేడమ్‍ని కలుస్తాడు. తాండ్రపాడుకు పోయి బాజిరెడ్డిని చూసొస్తాడు. ఆ సాయంత్రం బస్‍లో వస్తుంతే ఒక కుర్రాడు ‘బాగున్నారా బావా’ అంటూ పలకరిస్తాడు. అతన్ని గుర్తు పట్టలేడు పతంజలి. తన పేరు సుధీంద్ర శర్మ అంటూ తన వివరాలు చెప్తాడతను. తాను బళ్లారికి సమీపంలోని ‘గంగావతి’ అనే ఊర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ యిండియాలో క్లర్క్ కం క్యాషియర్‌గా పని చేస్తున్నానని, అమ్మ అఖిలాండమ్మ వెల్దుర్తిలోనే ఉంటోదని చెప్తాడు. ఇంటికి వెళ్తుంటే తళుక్కున ఒక ఆలోచన మెరిసింది పతంజలి బుర్రలో – సుధీంద్ర తన చెల్లెలు మహితకు చక్కని ఈడూ జోడవుతాడని. పెద్దలందరినీ ఈ సంబంధానికి ఒప్పిస్తాడు. సుధీంద్ర తల్లి కూడా అంగీకరించడంతో సంబంధం కుదుర్చుకుంటారు. పెళ్ళి ఖర్చులను పతంజలి, మల్లినాథ సర్దుతామంటారు. పాణిని ఢిల్లీ వెళ్ళిపోతాడు. పతంజలి కుటుంబం పలాస చేరుకుంటుంది. – ఇక చదవండి.]
[dropcap]జూ[/dropcap]న్ 18న కాలేజీ పునః ప్రారంభమయింది. ప్రద్యుమ్నకు మంచిరోజు చూసి నెమలికొండ దత్తసన్నిధిలో అక్షరాభ్యాసం చేసి, ‘లిటిల్ ఏంజల్స్’ కాన్వెంటులో యల్.కె.జి.లో జాయిన్ చేశారు. యూనిఫాం, బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ కొన్నారు. ఉదయం 8 గంటలకు రిక్షాలో వెళ్లి పన్నెండున్నరకు వచ్చేస్తాడు. వచ్చి అన్నం తిని, పడుకుంటాడు.
చిన్నోడు ‘రావ్స్’లో ఐ.ఎ.ఎస్. కోచింగ్‌లో చేరాడు. డిసెంబరులో ప్రిలిమ్స్ వ్రాస్తాడట. జె.ఎన్.యు.లో సీటు వచ్చిందట. జూలై నుండి క్లాసులు జరుగుతాయని వ్రాశాడు. జె.ఆర్.ఎఫ్ పరీక్ష ఫలితాలు, జూలైలో వస్తాయట. సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల వరకు ‘దేనా’ బ్యాంకులో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడట. రోజూ ముఫై రూపాయలు ఇస్తారట. నో వర్క్ నో పే. అంటే సెలవు దినాల్లో పని ఉండదు. జీతం ఉండదు. ఉదయం ఆరునుండి ఎనిమిది వరకు. రెండు ట్యూషన్లు చెబుతాడు. సి.బియస్. ఇ.సిలబస్, స్కూలు పిల్లలకు, సైకిలు కొనుక్కున్నాడట. పిల్లల ఇండ్ల దగ్గరకు వెళ్లి చెప్పాలట. ఒక్కొక్క ట్యూషన్‌కు నెలకు మూడు వందలు వస్తుందట. హ్యాపీగా ఉన్నానని వ్రాశాడు.
యథాప్రకారం, సప్లిమెంటరీ వారికి ఫ్రీ కోచింగ్ యిచ్చాడీసారి కూడా. ట్యూషన్లు యథావిధిగా జరుగుతున్నాయి. శ్రావణమాసంలో మహిత సుధీంద్రల పెళ్లి జరిగింది. పది రోజులు సెలవు పెట్టి వెళ్లారు. టి.టి.డి కల్యాణమంటపం, బి క్యాంపులో వివాహం వైభవంగా జరిగింది. దాదాపు యాభై వేలు ఖర్చయింది. అంతా కలిసి మహిత కోసం తీసిపెట్టింది కాక పదిహేడు వేలు ఎక్కువయింది. మరో ఏడు వేలు పతంజలి పెట్టుకున్నాడు.
అన్ని వేడుకలూ ఐన తర్వాత, నూతన దంపతులు ‘గంగావతి’లో కొత్త కాపురం పెట్టారు. తల్లిదండ్రులను తనతోపాటు తీసుకు వచ్చాడు పతంజలి. మల్లినాధ ఒక్కడే ఉన్నాడు వెల్దుర్తిలో. వాడూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. కానీ వినడు.
సెకండ్ సాటర్‌డే. సండేతో బాటు రెండు పబ్లిక్ హాలిడేస్ కూడ కలిసి వచ్చాయి. బ్రీఫ్ వెకేషన్. అందరూ కలిసి ఒరిస్సా యాత్రకు బయలుదేరదామనుకున్నారు. వసుధకు పీరియడ్స్ ఆటంకం అయ్యాయి. పతంజలి ఒక్కడే బయలు దేరాడు. తల్లిదండ్రులను తీసుకొని, ఉదయం ఐదు గంటలకు ‘కోణార్క్’లో ఖుర్దా రోడ్ జంక్షన్ చేరుకొని అక్కడ నుండి పూరీ చేరుకున్నారు. ధర్మశాలలో రూం తీసుకొని సాయంత్రం జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. అద్భుతమైన గుడి. ఒరియావారికి స్వామి పట్ల నున్న భక్తి విశ్వాసాలు చూసి ఆశ్చర్యపోయారు. సైట్‌సీయింగ్ వారి ప్రయివేటు ట్రావెల్స్‌లో మూడు సీట్లు రిజర్వు చేసుకున్నాడు.
మర్నాడుదయం ధర్మశాల వద్దే బస్సు ఎక్కించుకున్నాడు. మొదట గోల్డెన్ బీచ్, తర్వాత ప్రసిద్ధ కోణార్క్ సూర్య రథాన్ని చూశారు. ఏకశిలా నిర్మితము మహత్తర శిల్ప సంపదకు నెలవైనది. కోణార్క్ సూర్యదేవాలయం.
అమ్మానాన్న బయట ఏమీ తినరు. ఇంటి నుండి తెచ్చుకున్నవి ఐపోయాయి. అరటిపండ్లు టెంకాయనీళ్లు మజ్జిగ తాగుతున్నారు. భువనేశ్వర్‌లోని ‘నందన్ కానన్’ అనే అసియాలోనే అతి పెద్ద జంతు ప్రదర్శనశాల సందర్శించారు. అక్కడ పనస తొనలు దొరికాయి. పతంజలి మాత్రం శుభ్రంగా భోంచేశాడు. మధ్యాహ్నం మూడు గంటలకు భువనేశ్వర్‌లోని లింగరాజ్ టెంపుల్ చూపించాడు. తర్వాత భువనేశ్వర్ స్టేషన్ వద్ద దిగారు. నాలుగు గంటలకు ‘హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్’లో బయలుదేరి తొమ్మిదిన్నరకు పలాస చేరుకున్నారు.
వసుధ వేడిగా అన్నం, క్యాబేజి పెసరపప్పు, వండి ఉంచింది. భోజనం చేసి పడుకున్నారు.
నెల రోజులుండి వెల్దుర్తికి బయలుదేరారిద్దరూ. అమ్మ ఎన్ని రోజులైనా ఉంటుంది గాని నాన్న ఉండనంటాడు. విజయవాడకు వెళ్లి అక్కయ్య వాళ్లను చూసి వెళ్లారు.
సంవత్సరం గిర్రున తిరిగింది. స్పాట్ వ్యాల్యుయేషన్ విధానం మారింది. ప్రతి జోన్‌లో రెండు సెంటర్లు పెట్టి అన్ని సబ్జెక్ట్స్ అక్కడే దిద్దిస్తున్నారు. వైజాగ్‌లో స్పాట్. బి.వి.కె. కాలేజి. బుల్లయ్య కాలేజీల్లో ఉదయ్, పతంజలి ‘ఇంద్రభవన్’ అనే లాడ్జిలో రూం తీసుకున్నారు. పేరు గొప్పే గాని అతిసాధారణ లాడ్జి అది. డాల్ఫిన్ జంక్షన్‌లో ఉంటుంది. అక్కడే టిఫిన్స్, భోజనాలు అన్నీ దొరుకుతాయి.
స్పాట్ తర్వాత వెల్దుర్తికి వెళ్లారు. సంక్రాంతికి మహితను సుధీంద్రనూ మల్లినాధ తీసుకొని వచ్చి బట్టలు పెట్టి పంపాడట. మహిత గర్భవతి. పతంజలి భార్యను పిల్లవాడిని తీసుకొని ‘గంగావతి’ కి వెళ్లి వాళ్లను చూసి నాలుగు రోజలుండివచ్చారు.
చిన్నోడు సెలవులకు వచ్చాడు. వాడికి జె.ఆర్.ఎఫ్‌లో సెలక్షన్ వచ్చింది. స్కాలర్‌షిప్ సంవత్సరానికి ఇరవై వేలు. కాని రెగులర్‌గా ఇవ్వరట. ఎప్పుడో అరియర్స్‌తో వస్తుందట. ప్రిలిమ్స్ పాసయ్యాడు. మెయిన్స్ కోచింగ్‌కు ముప్ఫై వేలు కట్టాలి. వాడి పేరునున్న డబ్బు విత్ డ్రా చేసి వాడి అకౌంట్‌కు మెయిల్ ట్రాన్సఫర్ చేశాడు పతంజలి.
మల్లినాధ గడ్డం పెంచుకున్నాడు. జుట్టంతా ఎగదువ్వి వెనక ముడివేస్తాడు. శరీరంపై శ్రద్ధ లేదు. సమయానికి తిండి తినడు. పెళ్లి మాట ఎత్తితే కయ్యిమని లేస్తాడు. దాదాపు లక్ష రూపాయలు బ్యాంకులో వేసుకున్నాడు. బెంగుళూరు, హైదరాబాదు, రాయచూరు ఇలా చాలా ప్రాంతాల్లో తన బృందంతో కార్యక్రమాలకు వెళుతూంటాడు. సన్నగా చిక్కిపోయినాడు.
తాండూరు నుండి తోడల్లుడు జాబు వ్రాశాడు. ఒకసారి వచ్చి పొమ్మనీ, రిటర్న్ జర్నీలో తాండూరు నుండే కోణార్క్ క్యాచ్ చేసి పలాసకు వెళ్లిపోవచ్చుననీ. రీ-ఓపనింగ్‌కు పది రోజుల ముందు బయలుదేరి తాండూరు చేరుకున్నారు. వాళ్ల పాప కూడ ప్రద్యుమ్న ఈడుదే, నెలలే తేడా. భువన కాన్పు కూడా పెద్ద వదినే చేసింది.
రైల్వేస్టేషన్ ఎదుటే క్వార్టర్సు. ఇంటిముందు కాంపౌండు. పెద్ద వేపచెట్టు. కూర్చోడానికి సిమెంటు సోఫాలు. పాప పేరు హరిణి, అది కూడ ఎల్.కె.జి చదువుతూంది. ఒకరోజు గాణగాపురం అక్కల్‌కోట్ తీసుకువెళ్లాడు తోడల్లుడు. దత్తస్వామి దర్శనం చేసుకొని వచ్చారు. తాండూరుకు గుల్బర్గా దగ్గర. గంటన్నర ప్రయాణం. అక్కడి నుండి గాణగాపురం వెళ్లారు. భీమా నదిలో స్నానం చేశారు. ప్రశాంతంగా ఉంది దత్తక్షేత్రం.
భువనను వదినా అని ఒకసారి, భువనా అని ఒకసారి పిలుస్తున్నాడు పతంజలి. అతని కన్న ఆరు నెలలు చిన్నది. ఆమె మాత్రం పతంజలీ అంటుంది. తోడల్లుడు కూడ ఇంచుమించు పతంజలి ఈడువాడే. వాళ్లను పలాసాకు ఆహ్వానించారు.
రీ-ఓపనింగ్‌కు రెండు రోజులు ముందు కోణార్క్‌లో బయలుదేరి పలాస చేరుకున్నారు.
జూలైలో ట్రాన్స్‌ఫర్లు వచ్చాయి. ఐదేళ్లు అయింది కాబట్టి పతంజలిని ‘బారువ’ కాలేజికి వేశారు. పలాస నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం. హైవేలో నుండి రెండు కి.మీ. లోపలికుంటుంది ఊరు. మేజర్ పంచాయితీ సముద్రం ఒడ్డునే ఉంటుంది.
ఆర్డర్స్ వచ్చేసరికి ట్యూషన్లన్నీ ప్రారంభించి అడ్వాన్సులు తీసుకొని ఉన్నాడు. పతంజలి. ప్రద్యుమ్న కూడా స్కూల్లో యల్.కె.జి. కొచ్చాడు. వాడి ఫీజు కూడ కట్టేశారు. దగ్గరే కదా ఈ సంవత్సరానికి అప్ అండ్ డౌన్ చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. ట్యూషన్స్ కొన్ని సాయంత్రానికి మార్చుకున్నాడు.
‘బారువ’ చిన్న కాలేజి. ఫస్టియర్ సెంకడియర్ కలిసి నూటయాభై మంది పిల్లలు. ఒకే భవనంలో జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. జూనియర్ కాలేజి ఉదయం ఏడున్నర నుండి పన్నెండున్నరవరకు. అన్ని గ్రూపులు కంబైన్ చేసి ఫస్టియర్ ఒక క్లాసు, సెకండియర్ ఒక క్లాసు తీసుకునేవాడు. ఉదయం ఆరు గంటలకు “టెక్కలి డబ్బా’ అనే ప్రయివేటు బస్సులో బయలుదేరి ఏడున్నరలోపే కాలేజీ చేరుకొనేవాడు. రెండు క్లాసులూ పదిగంటలకల్లా అయిపోయేవి. అంతా బెస్తవారి పిల్లలు ఎక్కువ. ఊరు ఎత్తుగా ఉండి సముద్రం దిగువకుండేది. క్లాసురూంలో నుండి చూస్తే సముద్రం కనబడేది. బస్సు దిగి రెండు కిలోమీటర్లు నడిచేవాడు.
బారువా ప్రిన్సిపాల్‌గారి పేరు గున్నయ్య. ఫిజిక్స్ జె.ఎల్‌గా నర్సీపట్నంలో పని చేస్తూ ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాడు. చాలామంచి వ్యక్తి పదిగంటల తర్వాత పతంజలిని వెళ్లిపొమ్మనేవాడు.
బారువాకు ఆరు కిలోమీటర్ల దూరంలో సోంపేట అనే టౌన్ ఉంది. దానికి రైల్వేస్టేషన్ కూడ ఉంది. దాని పేరు సోంపేట అయినా అక్కడ ఉన్న ఊరు ‘కంచిలి’ కాబట్టి కంచిలిస్టేషన్ అనే అంటారు. సోంపేటలకు పదహారు కిమీ దూరంలో కవిటి, హైవే మీదే 22 కి.మీ దూరంలో ఇచ్ఛాపురం ఉంటాయి. స్టాఫ్ ఎక్కువమంది సోంపేటలో కాపురముండి రోజూ బారువాకు వచ్చి పోతారు.
అక్కడ ప్రయివేట్ బస్సులు ఇంకా రద్దు కాలేదు. పర్లాఖిమొండి. బరంపురం బస్సులవి. ఆంధ్రలోని మందస, సోంపేట, ఇచ్ఛాపురం మీదుగా ప్రయాణిస్తాయి. రెండు రాష్ట్రాల పర్మిట్ ఉంటుంది వాటికి. విపరీతమైన రద్దీగా ఉంటాయి. లోపల జనాలను సర్దడానికి ఒకడుంటాడు కండక్టర్ కాక. వాయు వేగమనోవేగాలతో ప్రయాణిస్తాయి. దిగేవాళ్లని తోసేసి, ఎక్కేవాళ్లను లాగేస్తుంటారు. పతంజలికి మాత్రం పలాస-సోంపేట ఆర్‌టీసి ఆర్డినరీ దొరికితే బారువా ఊర్లో దింపుతాడు. వెళ్లేటప్పుడు పదిన్నరకు ఆర్‌టిసి బస్సు ఊర్లోకి వస్తుంది. ఉదయం ఐదుకే లేచి వసుధ ఏదైనా టిఫిన్ చేసిస్తుంది. కాలేజిలో ఫస్టవర్ తర్వాత తింటాడు.
పిల్లవాడికి నాలుగేళ్లు నిండుతూనే, లూప్ తీసేయించుకుంది వసుధ. కొంత కాలానికే నెల తప్పింది. ఈసారి పరీక్షలకు డిపార్ట్‌మెంట్ ఆఫీసరుగా టెక్కలి కాలేజికి వేశారు. పలాసా నుండే తిరిగాడు. స్పాట్ విధానాన్ని మరింత కేంద్రీకరించి, ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. పలాస నుండి శ్రీకాకుళం తిరిగేవాడు. ఉదయం మెయిల్లో వెళ్లి ఆముదాల వలస (శ్రీకాకుళం రోడ్ స్టేషన్) లో దిగి అక్కడ నుండి బస్సులో వెళ్లేవాడు. ఉదయ్‌కి కొత్తవలస ట్రాన్స్‌ఫరయింది. అతడు విజయనగరం నుండి తిరిగేవాడు. సాయంత్రం మళ్లీ మెయిలుండేది.
రీ-ఓపనింగ్ తర్వాత సోంపేటకు ఫ్యామిలీ మార్చాడు పతంజలి. బస్టాండుకు దగ్గర్లోనే ఇల్లు తీసుకున్నాడు. మూడు గదుల. ఐదు వందలు అద్దె. నుయ్యి ఉన్నా ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి కొళాయిలు వేశారు. ప్రద్యును రెండు కి.మీ దూరంలో ఉన్న జె.యమ్. జె. కాన్వెంట్‌లో చేర్చారు. స్కూలు బస్ వస్తుంది.
ఆ ప్రాంతాన్ని ‘ఉద్దానం’ అని పిలుస్తారు. కోనసీమలాగ కొబ్బరి తోటలు ఎక్కువ. ఎక్కువ జీడిమామిడి తోటలు కూడ. పతంజలి చేరిన తర్వాత రెండో పి.ఆర్.పి ఇచ్చింది. యన్.టి.ఆర్ ప్రభుత్వం. పతంజలికి జీతం బాగా పెరిగింది. దాదాపు ఐదువేల వరకు వస్తూంది. జి.పి.ఎఫ్ కాంట్రిబ్యూషన్ పన్నెండు వందలు చేశాడు. బారువా స్టేట్‌బ్యాంక్‌లో నెలకు వెయ్యి రూపాయలు రికరింగ్ డిపాజిట్ కడుతున్నాడు.
సోంపేటలో కూడ ట్యూషన్లు చెప్పసాగాడు. పలాస అంతగాలేవు. స్పోకెన్ ఇంగ్లీష్‌కు మాత్రం ఒక పెద్ద బ్యాచ్ అయ్యారు. సాయంత్రం 7గంటలకు కొందరు టీచర్లు ఆంధ్రయూనివర్సిటీ ఎమ్.ఎ (ఇంగ్లీషు) ప్రయివేటుగా కట్టారు. వారు కోచింగ్ కని పతంజలిని అప్రోచ్ అయ్యారు. వారొక ఐదారుగురు కలిసి ఒక బ్యాచ్ చేశాడు. ఉదయం 6 నుండి 7 వరకు ఇంటర్ పిల్లలు సోంపేట కాలేజివాళ్లు వచ్చేవారు. ఏడు పదికి బస్సెక్కినా పది నిమిషాల్లో బారువా చేరుకునేవాడు.
ఆగస్టులో మందస ప్రిన్సిపాల్, ఇచ్ఛాపురం ప్రిన్సిపాల్ పతంజలికి కబురు చేశారు. తమ కాలేజీలో ఇంగ్లీషు పోస్టు ఖాళీగా ఉందని వచ్చి చెప్పమని. రెండూ మధ్యాహ్నం షిప్ట్ లే. బారువా నుండి పదకొండుకు వచ్చి, భోజనం చేసి, మూడు రోజులు మందసకు, మూడు రోజులు ఇచ్ఛాపురానికి వెళ్లి రెండు క్లాసులు చెప్పి ఐదుగంటలకల్లా వచ్చేవాడు. పర్లాఖిమొండి బరంపురం బస్సుల్లో మాస్టర్లకు 50% తగ్గించేవారు. నాలుగు రూపాయలు టికెట్ అయితే రెండు రూపాయలు తీసుకొనేవారు. రెండు కాలేజీలకు కిలిపి పదిహేను వందలు పార్ట్ టైం రెమ్యూనరేషన్ వచ్చేది. క్లాసుకు ఇరవై రూపాయలు.
***
దీపావళి పండుగకు మహిత, సుధీంద్రలను ఆహ్వానించారు. మహితకు ఎనిమిదో నెల అనీ, అంత దూరం ప్రయాణం చేయలేమనీ వ్రాశారు. వారు. వసుధకు కూడ ఐదో నెల వచ్చింది. ఆరోగ్యంగా ఉంది. ఈసారి ఆడపిల్ల పుడితే బాగుండునని అనుకుంటున్నారు ఆలుమగలిద్దరూ.
దీపావళికి భువనవాళ్లు వచ్చారు. వారం రోజులున్నారు. హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు. ఆ ఊర్లో కూడ మూడు ధియేటర్లున్నాయి. ‘జెంటిల్మన్’ అనే తమిళ డబ్బింగ్ సినిమా చూశారు. తోడల్లుడి కుటుంబానికి బట్టలు పెట్టారు. వాళ్ల కూడ పూరీ, భువనేశ్వర్ చూసి వద్దామన్నారు. “నేను మా అమ్మానాన్నలతో వెళ్లాను. వసుధను తీసుకొని వెళ్లండన్నాడు” పతంజలి. అతనికి తీరికలేదు కూడ. వాళ్లతో వసుధ వెళ్లి వచ్చింది. వారం రోజులుండి వాళ్లు వెళ్లిపోయారు.
సోంపేట వాళ్లే శ్రీకాకుళం టౌన్‌ను ఆనుకొని లే అవుట్ వేసి ప్లాట్లు అమ్ముతున్నారు. బాగా అభివృద్ది చెందే అవకాశమున్న ప్రాంతమట. హైవేకి ఆనుకొనే ఉందట. కొందరు జే.యల్స్ కూడ తీసుకున్నారట. దాని ప్రమోటర్స్‌లో ఒక పతంజలి శిష్యుడు. అతని పేరు పుష్పరాజు. స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్. పతంజలిని ఒక ప్లాటు తీసుకొమ్మని వేధించసాగాడు. నెలకు ఐదు వందల చొప్పున మూడేండ్లు కట్టాలి. అంటే పద్దెనిమిదివేలు. ప్రతి నెలా లాటరీ తీస్తారట. ‘పేలితే’, ఇన్‌స్టాల్‌మెంట్ కట్టక్కరలేదు. సైటు ఐదున్నర సెంట్లు. అంటే రెండువందల డెభై గజాలు. మూడు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసి యిస్తారు.
వసుధ ప్రోత్సహించింది. “తీసుకుందాం బావా! పిల్లలకు ఉంటుంది” అన్నది. పుష్పరాజ్‌తో కారులో వెళ్లి చూసివచ్చారు సైట్. జాతీయ రహదారి నానుకునే ఉంది లే అవుట్. మరీ లోపలికి కాకుండా రోడ్డుకు దగ్గరగా సైట్ కేటాయించారు. నెల నెలా పుష్పరాజే డబ్బు కలెక్ట్ చేసుకుని రశీదు ఇస్తాడు.
జి.పి.ఎఫ్ మీద లోన్ తీసుకుని కలర్ టి.వి. ఫ్రిజ్ కొనుక్కున్నారు. ఒనిడా 21 అంగుళాల టి.వి. ఫ్రిజ్ కెల్వినేటర్. రెండూ కలిసి పదిహేను వేలయ్యాయి. 36 నెలలు, జీతం నుండి ఐదు వందలదాకా కట్ చేస్తారు.
***
1990.
వసుధకు నెలలు నిండుతున్నాయి. వసుంధర వదినె రమ్మని జాబు వ్రాసినా, ఆమెకు ఇబ్బంది కల్గించదల్చుకోలేదు. అమ్మకు కూడ వయసు రీత్యా ఓపిక సన్నగిల్లింది. వదినె వాళ్లకు గుంటూరు ట్రాన్స్‌ఫరయింది. అక్కా వాళ్లకు అనంతపురం వేశారు. ఈసారి తామే సోంపేటలోనే కాన్పు చేసుకుందామనుకున్నారు. అక్కడే అబ్బాయిగారని డాక్టరున్నారు. ఆయన భార్య గైనకాలజిస్ట్. ఆమె పేరు దమయంతి. ‘సిద్ధ భైరవి నర్సింగ్ హోం’ వాళ్లది. వాళ్లకు చూపించుకున్నారు. పదో నెలలో జాయిన్ చేద్దురు గాని, ప్రస్తుతం తొమ్మిదో నెలే కదా! పదిహేను రోజుల తర్వాత పరీక్షించి డెలీవరీ డేట్ చెబుతానన్నది డాక్టరమ్మ. డెలివరీ అయింతర్వాత కావలస్తే ఒక నర్సును పది రోజుల పాటు పంపుతానన్నదామె.
డెలీవరీ డేట్ అప్రాక్సిమేట్‌గా చెప్పిందామె. దానికి ముందురోజు వచ్చి జాయిన్ కమ్మంది. స్పెషల్ రూం కూడ యిచ్చింది. వారం రోజులు సెలవు పెట్టాడు పతంజలి. డాక్టరమ్మ చెప్పిదానికి రెండు రోజుల తర్వాత వసుధ ఆడపిల్లను ప్రసవించింది. పాప లోపలే బాగా పెరిగిందట. కాన్పు కొంచెం కష్టమయింది. యోని ద్వారం క్రింద భాగంలో కొద్దిగా కట్ చేసి, పాపను ప్రసవించడానికి వీలు కల్పించవలసి వచ్చింది. కుట్లు పడ్డాయి. ఏం పరవాలేదు. నాల్గు రోజుల్లో మానిపోతుందని చెప్పింది డాక్టరు. కుట్లు వేసిన మెటీరియల్ చర్మంలో కలిసిపోతుందట. వారిద్దరి పర్మిషన్‌తో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడ జరిగింది.
మూడో రోజు డిశ్చార్జి చేశారు వసుధను. పాప లేత గులాబిరంగులో ఉంది. పుడుతూనే క్లీన్ చేశారు. చిన్నగ్లాసుడు గ్లూకోజ్ వాటర్ తాగింది. పనిమనిషితో మాట్లాడాడు. ఆమె పేరు సత్యవతి. “నెల రోజులు ఫుల్ టైం ఉండి అమ్మగారిని పాపనూ చూసుకుంటావా!” అని “పాపకు స్నానం చేయించడం, అమ్మగారిని చూసుకోవడం చేయాలి. నీకు చీరపెట్టి వంద రూపాయలిస్తా”నన్నాడు. ఆమె సంతోషంగా అంగీకరించింది. నర్సుతో పనిలేదని తీర్మానించుకున్నాడు.
వారం రోజులు తర్వాత కాలేజికి వెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ సర్టిఫికెట్, హాస్పిటల్ బిల్లులు, డిశ్చార్జి సమ్మరీ సబ్మిట్ చేశాడు గన్నయ్య గారికి మెడికల్ రీ-ఇంబర్స్‌మెంట్ కోసం. ఆయన ఇలా చెప్పారు. “ఇంగ్లీషు మాస్టారూ, మీకు పాప పుట్టిన రోజు నుండి పది రోజులు ప్రభుత్వమే సెలవు గ్రాంట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మీ మిసెస్‌కు చేయించారు కనుక. భార్యభర్తల్లో ఎవరు చేయించుకున్నా ఇది వర్తిస్తుంది. మీకు ఒక అదనపు ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. మీరు ఒక పని చేయండి. ఎల్లుండికి మీరు వచ్చి జాయినయి సైన్ ఏయండి. గవర్నమెంటు వారిచ్చే సెలవు వాడుకున్నట్లవుతుంది. మళ్లీ కావాలంటే పది రోజులు సెలవు పెట్టుకోండి. పెద్దవాళ్లెవరూ లేరన్నారు కదా!” అన్నాడాయన. ఆయనకు థాంక్స్ చెప్పి వచ్చేశాడు. ప్రద్యును తయారు చేసి బడికి పంపడం, బాలింతకు, పాపకు వేడి నీళ్లు కాచటం, పధ్యం వంట అన్నీ తానే చేసుకున్నాడు. వంటలో ఎక్స్‌పర్ట్ కాబట్టి సమస్యేలేదు. ట్యూషన్స్ కూడ ఆ పది పదిహేను రోజులూ మానేశాడు.
పనిమనిషి సత్యవతి చాలా శ్రద్ధగా చేసింది. చలికాలం అది. అమ్మగారికి అరికాళ్లకు నూనె రాసి కాపడం పెట్టడం, పాపకు స్నానం చేయించడం, పక్కబట్టలు మార్చడం అన్నీ జాగ్రత్తగా చేసింది. పాపకు సాంబ్రాణి దూపం వేసేది. చక్కగా పౌడర్ అద్ది, పల్చని గౌను వేసేది. సత్యవతికి కూడ టీ, టిఫిన్, భోజనం పెట్టేవాడు పతంజలి.
వసుధ త్వరగా కోలుకుంది. బావ కష్టపడుతున్నాడని బాధపడేది.
“ఇదో కష్టమా వసుధా! నేను పడ్డ కష్టాలముంది ఇది ఏపాటిది?” అనేవాడు నవ్వుతూ.
స్కూలు నుండి వస్తూనే చెల్లి దగ్గరకు వెళ్లేవాడు ప్రద్యు. “అమ్మా చెల్లి ఎప్పుడూ నిద్రపోతుందేమిటి” అని అడిగేవాడు. గుడ్డ ఉయ్యాల్లో పడుకోపెడితే జాగ్రత్తగా ఊపేవాడు గోడలకు తగలకుండా. ఇరవై ఒకటోరోజు నామకరణం చేశారు. పంతులు గారిది ‘గరుడ భద్ర’. పేరు కూర్మాచార్యులు, నామ నక్షత్రాన్ని బట్టి ‘ప’ తో రావాలని చెప్పారాయన. ‘ప్రజ్ఞ’ అని పేరు పెట్టారు. కొలీగ్స్‌ను పిలిచారు. భోజనాలు పెట్టారు. ‘వంటపుట్టి’ ఒకాయన ఒరియా బ్రాహ్మడు ఇంటిముందు షామియానాలో గ్యాస్ పొయ్యిలమీదే పులిహోర, పూర్ణం బూరెలు, వంకాయ బంగాళదుంప బటాణీ ముద్దకూర, కొబ్బరి పచ్చడి, ముక్కల పులుసు, అరటికాయ బజ్జీలు వేశాడు. మొత్తం పదిహేను మంది భోజనం చేశారు. ముందు రూంలో రెండు విడతలుగా వడ్డించారు.
వెల్దుర్తికి ఎప్పటికప్పుడు జాబులు వ్రాస్తూనే ఉన్నాడు. అమ్మా, నాన్నా బాగా మెత్తబడ్డారు. మల్లినాధ బిజీ. దూరాభారం కాబట్టి ఎవరూ రాలేదు. “పెద్దవదినె జాబు వ్రాసింది. నెలలోపు వసుధను పిల్లలను తెచ్చి గుంటూరులో దింపితే మూడో నెల చివర్లో పంపిస్తాను. తప్పకరండి” అని సారాంశం.
భార్యాభర్తలిద్దరూ చర్చించుకున్నారు. వదినె చెప్పిందే సమంజసంగా తోచింది. కోణార్క్‌కు రిజర్వేషన్ చేయించాడు. విజయవాడలో దిగి అక్కడినుండి ఇంకో ట్రెయిన్‌లో గుంటూరు చేరుకున్నారు. పండరీపురం ధర్డ్ క్రాస్‌లో ఉన్న వదినె వాళ్లింటికి చేరేసరికి పదైంది. వదినె వేడి వేడి ఇడ్లీ, చట్ని చేసి ఉంచింది. స్నానం చేసి టిఫిన్ తిన్నారు. పాపకు స్నానం పోసి, పాలు ఇచ్చి పడుకోపెట్టింది వసుధ. ప్రద్యుమ్న ఇడ్లీ తిని ఆడుకుంటున్నాడు. వాడి పుస్తకాలు కూడ తెచ్చింది వసుధ.
రాత్రి ఎనిమిది తర్వాత అన్నయ్య వచ్చాడు. ప్రజ్ఞను చూసి బుగ్గ నిమిరి, “డాల్ లా ఉందయ్యా నీ కూతురు” అని కితాబిచ్చాడు. “ఏంరా, మీ చెల్లెల్ని మాకిచ్చేస్తావా?” అనడిగాడు ప్రద్యుగాడిని వాడు ఇవ్వనన్నాడు. పతంజలికి నిశ్చింతగా అనిపించింది. మర్నాడు ఆదివారం. అందరూ హాయిగా గడిపారు. భరత్‌కు ఏ ఉద్యోగమూ రాలేదు. ప్రొద్దుటూరులోనే బ్యాంక్ లోన్ అన్నయ్య ఇప్పిస్తే, ఒక ప్యాన్సీ షాపు పెట్టుకున్నాడు. బాగానే జరుగుతూందట. వదినె కూతురు కూడ డిగ్రీ పూర్తయింది. బి.యస్‌సి సంబంధాలు చూస్తున్నారు. కొడుకు నాగేంద్ర ఇంటర్ పూర్తి చేసి, తుంకూరులో ఇంజనీరింగ్‌లో చేరాడట. గుంటూరులో రీజినల్ ఆఫీసులోనట అన్నయ్య పనిచేసేది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట.
ఆదివారం రాత్రి బయలుదేరి ఉదయం సోంపేట చేరుకున్నాడు పతంజలి. పనిమనిషికి చీర పెట్టిందివరకే వసుధ. వందరూపాయలిచ్చేశాడు ఆమె అన్నది.
“అయ్యగారూ! మా వోడికి జబ్బు చేసినపుడు అగర్వాల్ సేటు దగ్గర వెయ్యి రూపాయలు అప్పు చేసినాను. నోటు రాయించుకున్నాడు. నెల నెలా వడ్డీలు కడుతూనే ఉన్నాబాబు. మూడు రూపాయల వడ్డీ. ఎంతకీ తీర్చనేకపోతున్నా. మీరు ఒక వెయ్యి రూపాలిప్పిస్తే, ఆడి రునం తీరుస్తా. నెలకు ఇంతని నా జీతంలో తెగ్గోసుకుందురుగాని”
పతంజలి ఆలోచించాడు. పాప పుట్టినప్పుడు చాలా సాయం చేసింది సత్యవతి. ఇస్తే ఏం పోయిందనిపించింది. సత్యవతి కూతురు ఈ సంవత్సరం టెంత్ పరీక్షలు వ్రాస్తుందట. దానికి పెళ్లి చేస్తుందట తల్లి.
ఆమెకు వెయ్యిరూపాలిచ్చాడు. “ప్రోనోటు జాగ్రత్తగా వెనక్కి తీసుకో. ఎక్కడా వేలిముద్ర వేయకు” అని జాగ్రత్తలు చెప్పాడు. వాళ్లు ఎస్టీలని తెలుసుకున్నాడు.
“మీ పాపకు తొందరపడి పెండ్లి చేయకు. ఇంటర్‌లో చేరుద్దాం సోంపేటలోనే బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది” అని చెప్పాడు. “మీ ఆయన తాగుతాడా?” అనడిగితే
“అబ్బె, నేదు బావు, జబ్బుపడిన కాడ్నించి ఇంటికాడ ఉంటున్నాడు. తొలుత రిచ్చా ఏసేవోడు” అన్నదామె.
“పెద్దగా శ్రమ లేని పని ఏదయినా చెయ్యొచ్చుకదా!” అన్నాడు పతంజలి.
“ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోమను నేను లోనిప్పిస్తా” అని చెప్పాడు.
రెండ్రోజుల్లో మగన్ని తీసుకొని వచ్చింది సత్యవతి. నిండా నిలభై ఏండ్లు కూడ ఉండవతినికి. జబ్బు కంటె జబ్బు పడ్డానన్న ఫీలింగ్ ఎక్కువగా ఉన్నట్లుంది. అతని పేరు ‘దేవుళ్లు’. పతంజలికి నమస్కారం పెట్టాడు.
“మాట్టారుగారు, బస్టాండు కివతల మావోళ్లదే బడ్డీ కొట్టున్నాదండి. ఆడు అండమాన్ ఎలిపోతాండు. సరుకుతో సహా ఐదువేలకిస్తానన్నాడండి. కూత్త దూరంలో మండలాపీసులండి. తవురు లోనిప్పిత్తానన్నారంట గదండి. మా సత్తెవతి సెపితే పారెలిపొచ్చీసినమండి” అన్నాడు.
“రేపు మధ్యాహ్నం మీరు విశాఖ గ్రామీణ బ్యాంకు దగ్గరుండండి పదకొండు తర్వాత నేనొస్తా. బ్యాంకువాళ్లతో మాట్లాడదాం” అన్నాడు.
మర్నాడు విశాఖ గ్రామీణ బ్యాంకు దగ్గర భార్యా భర్తలిరిరువురూ ఎదురు చూస్తున్నారు. మేనేజరు గారిని కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు.
“మీరేనా మాస్టారూ! మీ గురించి విన్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెబుతారటకదా! మా నైబర్ ఒకతను మీ స్టూడెంటే. చెప్పండి ఏమిటిలా వచ్చారు?”
“ఈమె మా యింట్లో పని చేస్తుందిసార్. ఈమె భర్త చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఐదువేలు లోన్ కావాలి. మీరు సాయం చేస్తే బాగుంటుంది”
“చేయొచ్చు మాస్టారూ! వీళ్లకు నిలకడ ఉండదు. రీ-పేమెంట్ సరిగా ఉండదు. మీరు గ్యారంటార్‌గా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు”
పతంజలి సరే అన్నాడు.
“నెల నెలా రెండు వందల చొప్పున ముఫై నెలలు కట్టాలి. నీవు కట్టకపోతే మాస్టారు కట్టుకోవలసి వస్తుంది. జాగ్రత్తగా చేసుకుంటావు కదూ!” అని హెచ్చరించాడాయన.
వారం తర్వాత సత్యవతి వెంటవెళ్లి బడ్డీ కొట్టు చూశాడు. మండలాఫీసులన్నీ ఒకే కాంప్లెక్స్ లో ఉన్నాయి. దానికి దగ్గరగానే ఉంది కొట్టు ఇటువైపు కొంచెం దూరంలో ‘తిరుమలాలు’ (తిరుమల హాలు) కొట్టుమీదున్న దేవుళ్లు దిగివచ్చాడు. పతంజలికి నమస్కరించాడు. కొట్టుకు అరటిపల్ల గెల వేలాడుతూంది. ముందు గోలెంలోని నీళ్లలో కూల్‌డ్రింక్స్ వరుసగా సీసాల్లో చాక్‌లెట్లు, నువ్వుండలు, చేగోడీలు, మైసూరుపాకు ముక్కలు. వెనుక బడ్డీ గోడలకున్న చిన్న చిన్న షెల్ఫ్‌ల్లో సిగరెట్లు, చౌక పెన్నులు, కిళ్లీలు కట్టే సామగ్రి, తడిగుడ్డలో చుట్టిపెట్టిన తమలపాకులు, ఇనుప కొక్కానికి తగిలించిన గోల్డు ఫింగర్, ఫియారమ్స్ పాకెట్లు, ప్రక్కన చిన్న బల్లమీద కొబ్బరి బోండాలు, షెల్ఫ్ ల్లో బిస్కెట్ పాకెట్లు అంతా పరిశీలించాడు పతంజలి.
“రోజుకెంత అమ్ముతున్నావు?” అనడిగాడు.
“వందకు తక్కువగాకుండా పోతుందండి బావు”
“ఇకనేం రోజూ పదిరూపాయలు తీసి సత్యవతి కివ్వు. ఒక డబ్బాలో వేయండి. బ్యాంకు కిస్తీకి సరిపోతుంది. సరుకు పెంచండి. నెలనెలా ఒక రెండు వందలు ఆర్.డి కట్టండి అదే బ్యాంకులో”
“సాయంత్రం ఈ పక్కనే మూకుడెట్టుకొని మెత్తటి సేగోడీలు, పకోడి, అంటికాయ బజ్జీ ఏత్తానండి అయ్యగారు” అన్నది సత్యవతి.
“గుడ్ మీ వరస చూస్తూంటే త్వరలోనే మా యింట్లో పని మానేసేటట్లున్నావే” అన్నాడు.
లబలబలాడింది సత్యవతి.
“ఎంత మాటనీసినారు బావు. అలాగసేస్తే దూము తగిలిపోనూ” అంటూ చెంపలేసుకుంది.
***
ఫిబ్రవరి నెలాఖరుకు క్లాసులు పూర్తయ్యాయి. మార్చిలో డిపార్ట్‌మెంటల్ ఆఫీసరుగా ఇచ్ఛాపురం కాలేజీలో డ్యూటీ చేశాడు. స్పాట్ సెంటరు శ్రీకాకుళమే. స్పాట్ అయిం తర్వాత వసుధను పిల్లలను తీసుకొద్దామనుకున్నాడు. మార్చి చివరి వారంలో మూడో నెల వెళ్లి నాలుగో నెల వస్తుంది ప్రజ్ఞకు. ఎలాగూ ఫ్యామిలీ లేదు. తిరగడం ఎందుకని శ్రీకాకాళంలో ఉండిపోయాడు. నాగావళి ఒడ్డున టి.టిడి వారి సమాచార కేంద్రం, కల్యాణమంటపం ఉన్నాయి. పతంజలి, కెమిస్ట్రీ దివాకర్, తెలుగు యల్లమంద, మ్యాత్స్ నరసింహమూర్తి కలిసి టి.టి.డి సెంటరులో ఒక రూం తీసుకున్నారు. పెద్దరూం. అద్దె పదిరూపాయలు.
స్పాట్ పన్నెండుకు. ఉదయం నాగావళిలో స్నానానికి వెళ్లేవారు. ఎండాకాలమయినా నీళ్లు పారుతున్నాయి. పోలీస్ స్టేషన్ పక్కన ఖాళీ స్థలంలో టిఫిన్ సెంటరు పెడతారు. లైట్‌గా టిఫిన్ చేస్తారంతా తర్వాత పదకొండున్నరకే ఏడు రోడ్ల జంక్షన్‌లోని ‘వసంత విహార్’లో భోంచేసి, రిక్షాలో సెంటరుకు వెళతారు. మళ్లీ ఐదుగంటలకు తిరిగి వస్తారు.
శ్రీకాకుళం చల్లగా ఉంటుంది. ‘పూర్‌మ్యాన్స్ ఊటీ’ అని పిలుస్తారు. రెండు నదుల పరీవాహక ప్రాంతమది. శ్రీకాకుళం టౌన్ నాగావళి ఒడ్డునే రెండు వైపులా విస్తరించి ఉంటుది. వంశధార కూడ ఎక్కువ దూరం ఉండదు. దాని ఉపనది ‘మహేంద్రతనయ’. అది వెళ్లి బారువ వద్ద సముద్రంలో కలుస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘సంగమం’ అంటారు.
శ్రీకాకుళంలో సంగీత సాహిత్య సౌరభాలు గుబాళిస్తూంటాయి. స్పాట్ సమయంలోనే ‘ఎల్లా వెంకటేశ్వరరావు’ గారి నవ మృదంగ తరంగిణి కార్యక్రమం చూశాడు. వయోలిన్ మీద కీర్తన వాయిస్తుంటే దాన్ననుసరించి తొమ్మిది మృదంగాలమీద దాన్ని పలికిస్తాడాయన. ప్రభుత్వ మహిళా కళాశాల టెర్రేస్ మీద జరిగిందా కార్యక్రమం.
మరోరోజు జె. ఏసుదాస్‌గారి శాస్త్రీయ సంగీత కచేరీ వినే భాగ్యం కలిగింది పతంజలికి. ఆయన విద్వత్తుకు ముగ్ధుడయ్యాడు. ఆయన సినిమాల్లో పాడిన కొన్ని పాటలు పాడమని శ్రోతలు కోరితే సున్నితంగా నిరాకరించాడు. ఆ సంగీత దిగ్గజం. “ఇది శుద్ధ శాస్త్రీయ సంగీత కచేరీ. క్షమించండి” అన్నాడు.
శ్రీకాకుళంలో ధియేటర్స్ కూడ బాగుంటాయి. “భైరవద్వీపం” ఖయామత్ సే ఖయామత్” “టర్మినేటర్” మొత్తం మూడు సినిమాలు చూశాడు. పదిహేను రోజులు పట్టింది స్పాట్ వాల్యుయేషన్. రిలీవై, పేమెంట్ తీసుకొని, నాన్‌స్టాప్‌లో విశాఖపట్నం వెళ్లాడు. అప్పటికే తొమ్మిదయింది. రైళ్లేమీ ఉండవు. పదిగంటలకు వైజాగ్ – గుంటూరు సెమి లగ్జరి దొరికింది. బస్సులో హాయిగా నిద్రపోయాడు. ఏడు గంటలకు గుంటూరు చేరుకున్నాడు.
ప్రద్యుమ్న నాన్నను అల్లుకుపోయాడు. ప్రజ్ఞ ఒళ్లు చేసి ముద్దులు మూటగట్టేలా ఉంది. దానికి కొత్తలేదు. ఎవరి దగ్గరకైనా వెళుతుంది. వసుధ కొత్త అందాలు సంతరించుకొని ముగ్ధమోహనంగా ఉంది. దాదాపు మూడు నెలల విరహాన్ని తీర్చున్నారా రాత్రి.
మరునాడు అందరూ కారు మాట్లాడుకొని ‘కోటప్ప కొండ’ క్షేత్రం దర్శించుకొని వచ్చారు. ఒకరోజు ‘నాజ్. అప్సర’ ధియేటర్‌లో వెంకటేష్ సినిమా ‘బొబ్బిలిరాజా’ చూశారంతా.
వదినెకు కృతజ్ఞతలు చెబుతూంటే కోప్పడిందామె. “అది నా చెల్లెలు కాదు. కూతురు.” అన్నది. చెల్లెలికి చీర, పిల్లలకు బట్టలు పెట్టింది.
వసుధను పాపను గుంటూరులోనే ఉంచి ప్రద్యును తీసుకొని వెల్దుర్తికి వెళ్లాడు. తల్లిదండ్రులను చూసి, నాలుగు రోజులున్నాడు. అమ్మ కావాలని ప్రద్యుమ్న ఏడవలేదు. మహిత ఆడ పిల్లలను కన్నది. మూడో నెలలో అత్త దగ్గరికిపోయి, ఐదో నెలలో భర్త వద్దకు పోయింది.
పతంజలి వెల్దుర్తి నుండి గంగావతి వెళ్లాడు కొడుకును తీసుకొని. చెల్లెల్నీ బావను చూసి, మేనకోడలికి ఐదువందలు చేతిలో పెట్టాడు. త్వరలో తనకు ఆంధ్రప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్ రావొచ్చునని చెప్పాడు సుధీంద్ర. అక్కడి నుండి బళ్లారి మీదుగా అనంతపురం వెళ్లాడు. వాగ్దేవి అక్కయ్య వాళ్లు థర్డ్ రోడ్‌లో ఉన్నారు. బావకు ఈ మధ్యే డయాబెటిస్ వచ్చిందట. రాగిసంకటి తింటున్నాడు. శశిధర్ డిగ్రీ చేస్తున్నాడు. నాగేశ్వర్ పాలిటెక్నిక్‌లో చేరాడు.
“ఇంకా పదేండ్లు సర్వీసుందిరా! వి.ఆర్.ఎస్ తీసుకుందామనుకుంటున్నాను” అన్నాడు బావ. “వచ్చే బెనిఫిట్స్ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య చేతకావడం లేదురా” అన్నాడాయన. భోజన ప్రియుడైన బావ రాగిజావ, పుల్కాలు, ఉడికించిన కూరలు తింటూంటే జాలేసింది.
రెండ్రోజులు అక్క బావల దగ్గరున్నాడు. వాగ్దేవి మేనల్లుడికి మంచి డ్రస్ కొనిపెట్టింది. అక్కడినుండి గుంటకల్ వచ్చి ‘అమరావతి’ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు చేరుకున్నారు తండ్రీకొడుకులు.
గుంటూరులో రెండ్రోజులుండి, టాక్సీలో విజయవాడకు వెళ్లి అక్కడ తిరుపతి – హౌరా ఎక్స్ ప్రెస్ పట్టుకొని సోంపేట చేరుకున్నారు. ఆ బండికి ‘కంచిలి’ (సోంపేట) హాల్ట్ ఉంది. ఇంకా నెలన్నర పైనే సెలవులున్నాయి.
ప్రజ్ఞ పతంజలికి బాగా చేరికైంది. అందునా కాలేజీకి సెలవులు, ట్యూషన్లు లేవు. పిల్లలతోనే కాలమంతా గడపసాగాడు. ప్రతి వేసవిలో వెల్దుర్తి చిత్తూరు, విజయవాడ యిలా తిరిగేవారు. సెలవుల్లో పనిచేసే ఊళ్లో గడపటం ఇదే మొదటిసారి.
ప్రద్యుమ్నకు చెల్లి పుట్టటడం వల్ల యు.కె.జి. చదువు మధ్యలో ఆగిపోయింది. కానీ వసుధ గుంటూరులో వాడి సిలబస్ అంతా చదివించింది. నాన్న కూడ శ్రద్ధ తీసుకొని రోజూ ఒక గంటసేపు వాడితో చదివించటం చేయసాగాడు. వాడు ఏకసంథాగ్రాహి. ఏ పదానికైనా స్పెల్లింగ్ ఒకసారి నేర్చుకుంటే చాలు. గుర్తుంచుకుంటాడు. కానీ ఎక్కువ సేపు చదవడు. చదివిన కాసేపూ వయసుకుమించిన ఏకాగ్రత చూపిస్తాడు. తెలుగు పద్యాలు, శ్లోకాలూ చక్కగా ఉచ్చరిస్తాడు.
“శ్రీమత్పయోనిధినికేతన” అనే శ్లోకం రోజూ పలికించాడు పతంజలి. అది వాడికి పూర్తిగా వచ్చేసింది.
ఒకరోజు ఢిల్లీ నుండి టెలిగ్రాం. చిన్నోడు ‘స్వర్ణజయంతిలో బయలుదేరి వస్తున్నట్లు. అది వైజాగ్ వరకే. అక్కడ నుండి పలాసకు వేరే రైల్లో వచ్చాడు. అది సోంపేటలో ఆగదు. పలాస నుండి బస్‌లో వచ్చాడు.
వస్తూనే అన్నయ్యను కౌగిలించుకున్నాడు. నార్త్ ఇండియన్ విధానంలో ఇద్దరివీ పాదాలు ఒక చేతితో తాకాడు వంగి. ప్రజ్ఞా చిన్నాయనను చూసి చిరునవ్వులు నవ్వింది.
ఢిల్లీ నుండి డిన్నర్ సెట్ తెచ్చాడు వదినెకు. అన్నయ్యకు టీషర్ట్, పిల్లలకు డ్రస్‌లు తెచ్చాడు. సిమ్లా యాపిల్స్ డ్రైప్రూట్స్ కూడ.
“ఎందుకురా ఇంత డబ్బు ఖర్చు చేశావు, అనవసరంగా” అన్నాడు పతంజలి.
“నాన్న సేం యిలాగే అంటాడు” అన్నాడు చిన్నోడు.
“జె.ఆర్.ఎఫ్ స్కాలర్‌షిప్ మూడు నెలలది ఒకేసారి వచ్చిందన్నయ్యా. బ్యాంకులో వేసుకున్నా. ఎమ్.ఎ. ఐ.ఎ.యస్ కోచింగ్ సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో మెయిన్స్, శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామరి. ఏమవుతుందో!” అన్నాడు.
“చిన్నోడా, ప్రయత్నలోపం ఉండకూడదు. నీ కృషి నీవు చేయి, తర్వాత నరసింహస్వామి ఉండనే ఉన్నాడు. ఇంగ్లీషు వాడు, వేర్ దేరీజ్ ఎ విల్, దేరీజ్ ఎవే” అని సంకల్పం మాత్రం చాలు దారి దొరుకటానికి అన్నాడు. మన వాళ్లు చూశావా ఏమన్నారో,
‘ఉద్యమేన హి సిద్ధంతి కార్యాణి, న మనోరథైః
నహిసుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖేమృగాః”
అంటే తెలుసు కదా!”
“తెలుసు. మార్కండేయ శర్మ కొడుకునై ఉండి ఆ మాత్రం సంస్కృతం అర్థం కాదా”
“ఏం తెలుసో చెప్పు చూద్దాం!
“కేవలం మనసులో కోరిక చేతనే కార్యాలు సిద్ధించవు. గట్టి ప్రయత్నం తోనే తప్ప సానుకూలంకావు. నిద్రపోతున్న సింహం నోట్లోకి జంతువులు అవంతట అవే వెళ్లవుకదా!” అని వివరించాడు పాణిని.
“అద్భుతం!” అన్నాడు అన్నయ్య. “భాష్యకారుడి పేరు పేట్టినందుకు ఆ పేరును సార్థకం చేసుకున్నావురా” అన్నాడు. తమ్ముడికి షేక్‌హాండ్ ఇచ్చాడు. వెంటనే ప్రద్యుగాడు కూడ చిన్నాయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు.
“ఎందుకురా” అని అడిగితే
“చిన్నాయన బాగా చదువుకుంటున్నాడని” అన్నాడు.
ముందు నవ్వినా, వాడి ఆలోచనకు అందరూ ఆశ్చర్యపోయారు.
వదినె, ముద్దుల మరిది కోసం రకరకాల వంటలు చేసిపెట్టసాగింది.
“వదినా ఈ రోజు టిఫిన్ తపేలాంటు చేయవా”
“వదినా పొట్లకాయ బజ్జీలు చేసుకుందామా”
“వాంగీబాత్ చెయ్యి వదినా”
“నీకు భక్ష్యాలు చేయడం వచ్చా వదినా”
ఇదీ వరస.
“బైకలు (వేవిళ్లు)న్న గర్భవతిలాగా ఏమిట్రా నీ కోరికలు?” అన్నయ్య.
“మీరు వెల్దుర్తికిపోతే అత్తనడిగి చేయించుకోరూ, వాడూ అంతే” వదినె.
“మా వదినె బంగారం” మరిది.
ఒకరోజు అందరూ సిద్ధభైరవి క్షేత్రానికి బయలుదేరారు. ఇచ్ఛాపురానికి బరంపురానికి మధ్యలో ఉంటుందా అమ్మవారు. ఉదయాన్నే స్నానాలు చేసి, కాఫీతాగి ప్రయాణమయ్యారు. ఒక గంటలోపే అక్కడ దిగారు. హైవే నుండి రెండు కిలోమీటర్లుంటుంది. ఆటోలున్నాయి.
దేవాలయంలో ప్రవేశించకముందే పతంజలికి వైబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఒరియావాళ్లు ఎక్కువగా ఉన్నారు క్యూలో. అమ్మవారిని చూడగానే భక్తితో ఉద్వేగ భరితుడయ్యాడు. దుఃఖించసాగాడు. అమ్మవారి రూపం నిలబడిన భంగిమలో ముఖం ఒక వైపు తిప్పుకొని ఉంది. అచ్చం సింహాద్రి అప్పన్న నిజవరాహరూప భంగిమలా ఉంది. అర్చన చేయించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కొంత సేపటికి తేరుకున్నాడు పతంజలి. నరసింహుని సన్నిధిలో తప్ప తనకీ పరవశం కలగదు అసలీ అమ్మవారు ఎవరు? ఒక ఒరియా పెద్దమనిషి వచ్చి వీళ్ల దగ్గర కూర్చున్నాడు.
“ఆజ్ఞా, దేవీ భక్త..” అంటూ ఒరియాలో ఏదో అడిగాడు, ఇంకొక భక్తుడు “మీరు దేవీ ఉపాసకులా!” అని అడుగుతున్నాడాయన” అన్నాడు.
“నేను నరసింహోపాసకుడిని. కాని సిద్ధ భైరవిని దర్శించుతూ ఉంటే నేను భక్తి పారవశ్యానికి లోనైనాను.”
“అర్థమయింది” అన్నాడా భక్తుడు. “సిద్ధబైరవిమాత నరసింహస్వామి అంశ. అందుకే మీకిలాగైంది.”
ఒళ్లు జలదరించింది పతంజలికి. “తండ్రీ! లక్ష్మీనరసింహా!” అని మనసులోనే స్వామిని స్మరించుకున్నాడు.
అక్కడ చిన్న చిన్న పాక హోటళ్లున్నాయి. పూరీ ఉప్మా, చనిగెలు కాంబినేషన్ తినిపించాడు అందరికీ. పూరీతో పాటు ఉప్మా నంచుకొని తినడం రాయలసీమ వారికి తెలియదు.
“బాగుందన్నయ్యా వెరైటీగా” అన్నాడు పాణిని. అందరూ లంచ్ టైం కల్లా సోంపేట చేరుకున్నారు. వసుధ వంట చేసింది.
మర్నాడు పాణిని వదినెతో చెప్పాడు. “వదినా బుజ్జమ్మకు చిన్న గొలుసు తీసుకుందామనుకుంటున్నా. ఒక తులం బంగారమైతే సరిపోతుందా?”
“ఎందుకురా ఇప్పుడు అంత చిన్న పిల్లకు” అన్నది వసుధ.
“చెప్పు వదినా. ఎంతలో వస్తుంది?”
“తులం బంగారం అయితే మంచి గొలుసు వస్తుంది. అయినా మీ అన్నయ్య కోప్పడతారు”
“లేదులే నేను చెబుతానుగా” అని పతంజలితో చెప్పాడు.
“అన్నయ్యా! జె.ఆర్‌ఎఫ్ డబ్బు నా తొలి సంపాదన. దేనా బ్యాంకులో పార్ట్ టైం జాబ్ కూడ చేస్తున్నా. ఈ నా చిన్న ముచ్చట కాదనకు.”
పతంజలి సరే అన్నాడు. తన శిష్యుడి నాన్నే ‘ఆచారి’ ఉన్నాడు. అతనిని పిలిపించి గొలుసు చేయమన్నారు.
“మేష్టారూ, ఇంకొకరు తాళభద్రనాయుడుగారు సరిగ్గా తులం పెట్టి గొలుసు చేయించారు. నాకు డబ్బు ఇవ్వలేక అలాగే ఉంచేసినారు. అది మీరు తీసుకోండి. తగ్గించి ఇస్తాను ధర. అతగాడు డబ్బుతో వస్తే ఇంకోటి సేసిస్తా” అన్నాడు ఆచారి.
గొలుసు తెచ్చి చూపించాడు. తళతళ మెరుస్తూంది. క్రింద చిన్న లాకెట్ కూడ ఉంది. దానిమీద వినాయకుడున్నాడు. తెలిసినవాడే పైగా ఆవూరివాడే కాబట్టి మోసం చేస్తాడనే భయంలేదు. మూడువేల ఎనిమిదివందలకు ఆ గొలుసు తీసుకున్నారు.
“తవురి దగ్గ మజూరీ తీసుకోలేదు బాబు” అన్నాడతను
ప్రద్యుమ్నకు బుజ్జి సైకిలు కూడ కొనిచ్చాడు పాణిని. పడిపోకుండా రెండు వైపులా సపోర్టు ఉంది. అది రెండు వందల యాభై.
దాదాపు పదిరోజులున్నాడు తమ్ముడు. “ఇక బయలుదేరతానన్నయ్యా” అన్నాడు. పూరీ నుండి ఢిల్లీకి ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఉంది. ‘ఖుర్దారోడ్ జంక్షన్’లో ఎక్కవచ్చు. స్టూడెంట్ ఒకడిని బరంపురం పంపి దానికి రిజర్వేషన్ చేయించాడు తమ్ముడికి. రెడీమేడ్ షాపుకు తీసుకువెళ్లి జీన్స్ ప్యాంటు. టీషర్ట్ కొనిచ్చాడు.
కంచిలి స్టేషన్‌లో ట్రెయిన్ ఎక్కించి వచ్చాడు. ఎక్కబోయే ముందు ప్లాట్‌ఫాం మీదే అన్నయ్య పాదాలకు నమస్కరించాడు. చిన్నాన్నకు వీడ్కోలు ఇవ్వడానికి ప్రద్యుమ్న కూడ వచ్చాడు. రైలు కదులుతూంటే అన్నదమ్ములిద్దరికీ కళ్లు చెమ్మగిల్లాయి.
సెలవులు ఎంతకీ అయిపోవడం లేదు. పతంజలికి చేతి నిండా పనిలేక పిచ్చెక్కినట్లుంది. ఒక మంగళవారం సాయంత్రం చల్లబడిన తర్వాత బారువకు వెళ్లారంతా బారువా సముద్రపు ఒడ్డున ఫర్లాంగు దూరంలో కాళీమాత గుడి ఉంది. ఒరిస్సాలో దేవీ ఆరాధన ఎక్కువ. బార్డర్ కాబట్టి ఉద్దానప్రాంతంలో అమ్మవార్లు ఎక్కువగా వెలిశారు.
అమ్మవారిగుడి చిన్నదయినా చాలా బాగుంది. అంతా మార్బుల్ నిర్మాణం. ఈ మధ్యనే నిర్మించారట. ఒక జీడిమామిడి తోటలో ఉంది ఆ కాళీ ఆలయం. వెళ్లి దర్శనం చేసుకున్నారు. నాలుగుమూరల కదంబమాల తీసుకువెళ్లారు. పూజారి పతంజలిని చూసి నమస్కరించాడు.
“సెలవుల్లో సొంతూరికి ఎల్లలేదేటి, మాస్టారూ, మామూలుగా ఎల్తారుగామాల” అని అడిగాడు. అర్చన చేశాడు. మాల అమ్మవారి మెడలో అలంకరించాడు. తల్లిని నల్లరాయితో చెక్కారు. నాలుక ఎర్రగా బయటికి చాపి, కోరలతో భయం కలిగించే విధంగా ఉంది మహాకాళి. పుర్రెల దండ ధరించింది. కన్నులు మంకెనపువుల్లా ఎర్రగా మెరుస్తున్నాయి.
“అమ్మవారికి ఎందుకు కోపం వచ్చింది నాన్నా” అనడిగాడు ప్రద్యు. “రాక్షసులను చంపడానికని కోపం తెచ్చుకుంది కన్నా” అని చెప్పాడు. గుడిముందు చిన్న మంటపం ఉంది. అక్కడ కూర్చున్నారు. “మహాకవి కాళిదాసు” సినిమాలోని “మాణిక్యవీణామ్ ఉపలాలయంతీం” అన్న ఘంటసాల వారు గానం చేసిన శ్యామలాదండకాన్ని అద్భుతంగా ఆలపించాడు పతంజలి. వినడానికి కొందరు వచ్చారు. వాళ్లలో పతంజలి శిష్యులు కూడ ఉన్నారు.
దండకం పూర్తి చేస్తూనే చప్పట్లు కొట్టారంతా.
ఒక పెద్దాయన పతంజలిని అడిగాడు.
“మేష్టారండీ, ‘రహస్యం’ సినిమాలో ‘శ్రీలలితా శివజ్యోతీ సర్వకామదా’ అనే పాట పాడరా అండీ”
పతంజలికి ఆ పాట వచ్చు శ్రావ్యంగా పాడాడు. అందరూ మెచ్చుకున్నారు.
“మన ఇంగ్లీష్ మాస్టారింత బాగా పాడతారని నాకు తెలియదురా” అన్నాడొకతను.
“మంచిపనే. కాలేజిడే రోజు ‘శివరంజనీ’ పాటపాడలేదేటి?” అన్నాడింకొకతను.
“నీవేదైనా పాడకూడదూ వసుధా” అన్నాడు పతంజలి.
‘సీతారామ కల్యాణం’ లోని ‘జగదేకమాతా గౌరీ, కరుణించవే భవానీ కరుణించవే’ అనే పాట మధుర స్వరంతో పాడింది వసుధ. అందరూ ప్రశంసించారు.
“నాన్నా, మంచినీళ్లు” అన్నాడు పుత్రరత్నం.
“అయ్యో మంచినీళ్లు తెచ్చుకోవడం మరచిపోయామే” అన్నది వసుధ.
పాటలు వినడానికొచ్చిన పూజారి అన్నాడు. “బోరింగ్ ఉందండి గుడెనకాతల. పతంజలి అతనినడిగి ఒక స్టీలు చెంబు తీసుకొని బోరింగ్ కొట్టి నీళ్లు పట్టాడు. కొడుక్కు తాగించి, తానూ తాగి, భార్యకిచ్చాడు. తియ్యగా ఉన్నాయి నీళ్లు. సముద్రానికి అంత దగ్గరగా అంత తియ్యని నీరు పడటం ఆశ్చర్యమనిపించింది. అదే పూజారితో అంటే
“తల్లి మగిమండి. పక్కనే తోటల్లో ఉప్పునీరేనండి. గుడికాడ బోరింగ్‌లోనే ఈ మంచినీరొత్తాది” అన్నాడు. “ఇంకో ఇసయమండి. గుడికి పునాదేసినకాడ్నించి అమ్మతల్లే తనకు నచ్చిన బక్తులకలలో కనబడి తనకిది కావాలని అడుగుతాదండి. గుడికి కాంపౌండు, ప్లోరింగ్, లైట్లు, ఫ్యాను, అన్నీ అలా సెప్పి సేయించుకున్నవేనండి”
గుడి ముంద కొంత దూరంలో నుయ్యి కూడ ఉంది. పతంజలి తొంగిచూశాడు. దానిలో నీళ్లు లేవు. పూజారి వివరణ ఇచ్చాడు.
“ఎండాకాలం గదండి. ఈ మజ్జినే ఎండిపోనాది. ఐనా పూడిక తీస్తే నీరెలిపోస్తాదండి. ఆ తల్లే ఎవరికో అగుపడి సేయించుకుంతాది”
పతంజలి అద్భుతమనిపించింది. అక్కడ నుండి బీచ్‌కు వెళ్లారు.
ప్రద్యు ఇసుకలో ఆడుకున్నాడు. వసుధ గూడు కట్టింది. ఇసుకతో వాడు క్షణంలో కాళ్లతో తొక్కేసి, ఆనందంగా కేరింతలు కొట్టాడు.
“వీడికి వినయభూషణ్‌గారు ‘సర్వదమన్ బెనర్జీ’ అని సరిగానే పేరు పెట్టాడు” అన్నాడు పతంజలి నవ్వుతూ.
బుజ్జమ్మ తల్లి చంకలో కూర్చుని విప్పారిన కళ్లతో సముద్రంలో ఎగసిపడుతున్న అలలను చూస్తూంది.
చీకటి పడకముందే యిల్లు చేరుకున్నారు. కాసేపు జి.టి.వీలో కార్యక్రమాలు చూసి, భోజనం చేసి పడుకున్నారు.
అర్ధరాత్రి దాటింది. గాఢనిద్రలో ఉన్న పతంజలికి కొద్దిగా మెలకువ వచ్చింది. అది నిద్ర మెలకువగాని స్థితి. కాళీమాత మంచం అంచున కూర్చుని ఉంది. ప్రసన్నంగా ఉంది. అలాగే పతంజలి వైపు చూస్తూ ఉంది.
పతంజలి మళ్లీ నిద్రలోకి వెళ్లాడు. పది నిమిషాల తర్వాత మళ్లీ తల్లి దర్శనమిచ్చింది. ఆమె పెదవులు కదులుతున్నాయి.
“నూతిలో పూడిక తీయించు” స్పష్టంగా ఆదేశించింది తల్లి.
“అమ్మా, తప్పక రేపే తీయిస్తా. నన్ననుగ్రహించు” అని వేడుకున్నాడు. అంతే! శివసఖి కనబడలేదు. పతంజలికి ఒళ్లంతా చెమటలు. పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. లేచి కూర్చొని వసుధను లేపాడు. జరిగింది వివరించాడు.
వసుధ చేతులెత్తి అమ్మవారికి నమస్కరించింది.
“మీరెంత ధన్యులు బావా! అమ్మవారు దర్శనమిచ్చింది మీకు. తప్పక ఆమె చెప్పిన పని చేయిద్దాం”
మర్నాడుదయమే బారువకు వెళ్లాడు. గుడికి వెళ్లి పూజారిని కలిశాడు.
“నూతిలో పూడిక తీయడానికి ఎంతవుతుంది” అని అడిగాడు.
“అమ్మతల్లి కనబడినాదా బాబూ రేత్తిరేల?” అన్నాడు పూజారి. “తవురు పున్నెం సేసుకున్నారు. ఎంతో కాదు బాబూ వందరూపాయలిత్తే ముగ్గురు కూలీలు మద్దినేలకి పూడిక నాగేత్తారు. ఉండండి కేకేత్తాను” అని ఒకతన్ని పిలిచి ఏదో చెప్పాడు. అరగంటలో ముగ్గురు వచ్చారు. గునపం, పార, ఇనుప తట్టలతో. “ఒరే, దాలయ్య! అమ్మతల్లి మాస్టారికి కలలో కనబడి సెప్పేసినాది. నూతిలో పూడిక తీయించుమీ అని. మీ కూలిడబ్బులాయన ఇత్తారు బేగి పనిమొదలెట్టండి” అని చెప్పాడు పూజారి.
“మన కాలేజి మాట్టారే కద ఈన. నాకెరికనేదేటి” అన్నాడింకొకతను.
పతంజలి ఉండిపోయాడు. ఒంటిగంటలోపే పూడిక తీసేశారు. పూడిక మన్ను బక్కెట్లో పోసి తాడుతో పైకి లాగారు. పూర్తయింతర్వాత బురదనీరు తోడిపోశారు. నూతిలో జల ఊరసాగింది.
“సాయంత్రానికి తేరి, తేటగా ఎలిపొస్తాదండి బాబు” అన్నాడు దాలయ్య. “మా పాప తవరి కాలేజిలోనే సదూతున్నాదండి. పేరు రవణమ్మండి. పదకొండు కొచ్చిందండి”
“ఫస్టియరన్నమాట” అనుకున్నాడు.
“బాగా చదివించు అమ్మాయిని. ఏగ్రూపు?”
“తెలవదండి”
రెండు గంటలకు యిల్లు చేరి భోంచేశాడు. టిఫినయినా చేయకుండా వచ్చేశాడు. కనీసం ఆకలిగా అనిపించలేదు.
***
ఒకరోజు భరత్ నుండి ఉత్తరం వచ్చింది. తనకు ‘సమ్‌క్రగ్ పిస్టన్స్’ అనే కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, దాని ఫ్యాక్టరీ శ్రీకాకుళం జిల్లాలోని ‘పైడి భీమవరం’ అనే ఊరి వద్ద జాతీయ రహదారిపైనే ఉంటుందని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు హైదరాబాదులోని మేడ్చల్‌లో ఉందని, జూనియర్ అకౌంట్స్ ఆఫీసరుగా పోస్టింగ్ ఇచ్చారని వ్రాశాడు. ఒకసారి ఫ్యాక్టరీ అంతా చూసి రమ్మన్నారని, అందుకే బయలుదేరి వస్తున్నానని తెలిపాడు. జీతం వెయ్యి రూపాయలట.
అక్కా బావ సంతోషించారు. మొదట్లో జీతం తక్కువైనా ముందు ముందు పెరుగుతుందని అనుభవం ఉంటే ఇంకో ఉద్యోగానికైనా కన్సిడర్ చేస్తారని భావించారు.
వాడు ప్రొద్దుటూరునుండి బద్వేలు మీదుగా నెల్లూరుకు వచ్చి నెల్లూరులో తిరుమల ఎక్స్‌ప్రెస్ పట్టుకొని విశాఖపట్నం వచ్చాడట. అక్కడ నుండి ఇచ్ఛాపురం ఎక్స్‌ప్రెస్ బస్సులో సోంపేట చేరుకున్నాడు. మంచి ఎండాకాలం. రిజర్వేషన్ లేదు. ప్రయాణంలో ఒళ్లు హూనమై ముఖమంతా పీక్కుపోయింది.
“ఏమే అక్కయ్యా! ఎంత దూరముందే తల్లీ మీ ఊరు?” అన్నాడు సీసాడు ఫ్రిజ్ నీళ్లు తాగేశాడు అప్పటికి సాయంత్రమయింది.
“తొందరగా వంటచెయ్యక్కా” అని అడుగుతూంటే వసుధ మనసు ద్రవించుకుపోయింది. ఉదయం చేసిన మామిడికాయ పప్పు, చారు ఉన్నాయి. అరటికాయ పొడి కూర చేసి పేలాల వడియాలు వేయించింది. స్నానం చేసి ఎనిమిది గంటలకే భోంచేశాక స్థిమిత పడ్డాడు భరత్.
ముందు రూములో మడతమంచం మీద బొంత పరచి ఫ్యాన్ వేశాడు పతంజలి. అంతే మర్నాడుదయం ఏడుగంటల వరకు లేవలేదు.
ఉదయం కాఫీలు తాగుతూండగా అడిగాడు పతంజలి.
“మరి ఫ్యాన్సీ షాపు ఏం చేశావురా?”
“మా ఫ్రెండొకడు తీసుకున్నాడు బావా. అంతంత మాత్రమే జరిగేది. దేవుని దయతో ఏదో ఉద్యోగం వచ్చింది”
మర్నాడు బావ, బావమరిది ‘పైడి భీమవరం’ వెళ్లారు. ఆ వూరు శ్రీకాకుళం- విశాఖ జాతీయ రహదారి పై ‘రణస్థలం’ అనే ఊరికి ముందుగా వస్తుంది. ఫ్యాక్టరీ చాలా పెద్దది. యంత్రాలలో ఉపయోగించే పిస్టన్స్ తయారు చేసే ప్లాంటది.
భరత్‌ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫ్యాక్టరీ అంతా తిరిగాడు. స్టాఫ్ పర్టికులర్స్ అన్నీ వ్రాసుకున్నాడు భరత్. ఫ్యాక్టరీ విజిట్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకున్నాడు. టి.ఎ.డి.ఎ. వస్తాయట. నాలుగు రోజులుండి వెళ్లిపోయాడు వాడు. వాడికి కూడ జీన్స్ ప్యాంటు టీషర్టు కొనిచ్చాడు.
మేడ్చల్‌లోనే ఆఫీసుకు దగ్గరగా ఏదన్నా మెన్స్ హాస్టల్‌లో ఉంటానని చెప్పాడు.
సెలవులింకా ఇరవై రోజులున్నాయి. ఇంతలో బి.ఎస్.ఆర్‌బి. నోటిఫికేషన్ వచ్చింది. అన్ని జాతీయ బ్యాంకుల్లో కలిసి వేల సంఖ్యలో క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులు నింపుతన్నారు. భరత్‌కు జాబు వ్రాశాడు పతంజలి, అప్లయ్ చేయమని.
సోంపేటలో హరిజన సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయం ఉంది. వారు యస్.సి. వర్గానికి చెందిన నిరుద్యోగులకు బియస్.ఆర్‌బి వారి వ్రాత పరీక్షకు కోచింగ్ యివ్వాలని సంకల్పించారు. ఏ పోటీ పరీక్షకయినా ఇంగ్లీషు భాషా ప్రావీణ్యమే విన్నింగ్ ఫ్యాక్టరు కాబట్టి, ఇంగ్లీషు బాగా చెప్పేవారెవరిని విచారిస్తే, బారువ కాలేజి ఇంగ్లీషు మాస్టారు పతంజలి గారి పేరు చెప్పారు. సోంపేట కాలేజి ఇంగ్లీషు జె.యల్ యజ్ఞ నారాయణను అడిగారట. ఆయన తనకు కుదరదన్నాడట. అందుకే ఎ.డిగారు మీ వద్దకు పంపారు” అని ఆ ఆఫీసునుండి వచ్చిన యు.డి.సి. గారు చెప్పారు.
అతని వెంట ఆపీసుకు వెళ్లాడు పతంజలి. ఎ.డి.గారి పేరు గిరిధర్ పట్నాయక్. పతంజలిని సాదరంగా ఆహ్వానించి, టీ తెప్పించాడు. “పాపం పేదవాళ్లు మేస్టారూ. కోచింగ్ ఇస్తే, కొందరికైనా ఉద్యోగాలు వస్తాయి. మీకు నామినల్‌గా ప్రభుత్వం నుండి “ఆనరోరియం” వస్తుంది కాని అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము” అన్నాడాయన.
“రోజూ సాయంత్రం ఒక గంట చెప్పండి చాలు”
“నాకు ఆనరోరియం ఏదీ వద్దుసార్” అన్నాడు పతంజలి. “మీరు నన్ను పిలిచి అవకాశం ఇవ్వడమే పెద్ద ‘ఆనర్’ నాకు. నా వద్ద కొంత స్టడీ మెటీరియల్ ఉంది. ఈ పరీక్షను దృష్టిలో పెట్టుకొని మరి కొంత తయారు చేస్తాను. వారానికి ఒక టెస్ట్ పెడదాం. ఎంతమంది చేరారు?”
“ఇరవై రెండు మంది మగపిల్లలు. ఇద్దరాడపిల్లలు”
“స్టడీ మెటీరియల్, వీక్లీ టెస్ట్‌ల తాలూకు క్వశ్చన్ పేపర్లు తయారు చేయడానికి, జిరాక్స్ ఖర్చులకు ప్రభుత్వం నుండి ఏమయినా ఫండ్ వస్తుందా? ఎ.డిగారు నీళ్లు నమిలారు. “చెప్పలేమండి. మీరు బిల్స్ సబ్మిట్ చేయండి చూద్దాం”
పతంజలి ఆలోచించి చెప్పాడు. “పరవాలేదులెండి. ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను. ఒక మంచి పని చేస్తున్నానన్న తృప్తి మిగులుతుంది.” పతంజలి మాటలకు ఎ.డిగారు కదిలిపోయారు.
“మీలాంటి వారివల్లే ఇంకా ధర్మం నిలచి ఉంది మాస్టారూ” అన్నాడాయన. “కలెక్టరుగారిని కలిసి, మీమీద భారం పడకుండా చూస్తానులెండి”
ఆగస్టులో పరీక్ష మూడు నెలల టైముంది. యస్.సి. వెల్ఫేర్ హైస్కూలు లోనే ఒక రూం కేటాయించారు. ముందుగా నెల రోజులు బేసిక్స్ చెప్పాడు వారికి. తర్వాత అబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు తయారుచేసి వారితో సాల్వ్ చేయించసాగాడు.
జూన్ రెండవ వారంలో కాలేజీలు తెరిచారు. ఇటు బారువా వెళ్లొచ్చి, మూడు రోజుల మందసకు, మూడు రోజులు ఇచ్ఛాపురానికి పార్ట్ టైం జె.ఎల్‌గా వెళ్లి వస్తున్నాడు. ప్రయాణాలు ఇబ్బందికరంగా మారాయి. ఒక బండి కొనుక్కుంటే బాగుంటుందనిపించింది. ‘బజాజ్ ప్రియ’ స్కూటర్ బుక్ చేసుకున్నాడు. మూడు నెలలకు అలాట్ అయింది. నీలం రంగులో ముచ్చటగా ఉంది. వారం రోజులు పట్టింది నేర్చుకోడానికి.
కాలం పరుగులు తీస్తూ ఉంది. పతంజలి కోచింగ్ ఇచ్చిన యస్.సి విద్యార్థుల్లో ‘గంగరాజు’ అనే అతనికి సెలెక్షన్ వచ్చింది. ఆంధ్రాబ్యాంకు టెక్కలి బ్రాంచ్‌కు వేశారు. ‘ఒక జీవితం నిలబడింది అంతే చాలు’ అనుకున్నాడు తృప్తిగా.
“ఇలాగే పేదవారికి, నిస్సహాయులకు సహాయం చేసే అవకాశమివ్వమని నరసింహస్వామిని కోరుకున్నాడు. పూజ పూర్తయిన తర్వాత ఫలశృతిలో ‘సహ కుటుంబానాం సమస్త సన్మంగళాని సంతు’ అని ముగించేవాడు. ఈమధ్య ‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అని కూడా ప్రార్థిస్తున్నాడు.
(సశేషం)