Site icon Sanchika

సాఫల్యం-49

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[పతంజలి పిల్లలు పెద్దవుతారు. వాళ్ళని మంచి స్కూల్లో చేరుస్తాడు. పతంజలి బారువాకు వచ్చి దాదాపు ఏడేళ్లయింది. ట్రాన్స్‌ఫర్‌ అవలేదు. ఓ మిత్రుడి సహాయంతో బదిలీ అయ్యే మార్గం తెలుసుకుంటాడు. హైదరాబాద్ వచ్చి తనకి పరిచయస్థులైన మాజీ సి.ఎం. భాస్కరరెడ్డిగారితో సిఫార్సు చేయించుకుంటాడు. ఆయన సిఫార్సు మేరకు విశాఖ జిల్లా మాకవరపాలెం కాలేజీకి బదిలీ అవుతుంది పతంజలికి. అక్కడ చేరి క్లాసులు తీసుకుంటాడు. తరువాత కొన్ని రోజులకి సోంపేటలో అన్ని కార్యకలాపాలు ముగించుకుని మాకవరపాలెం వెళ్ళేముందు వెల్దుర్తి వెళతాడు కుటుంబంతో. తమ్ముడిని పెళ్ళి చేసుకోమని చెప్తాడు. అమ్మానాన్నలు పతంజలి వద్దకు రామంటారు. నర్సీపట్నంలో ఇల్లు తీసుకుని కుటుంబాన్ని తీసుకువస్తాడు పతంజలి. పిల్లలు పెద్దవుతున్నారు. హైదరాబాద్ లోని సీఫెల్‌ వారు ఫాకల్టీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రొగ్రామ్‌(FIP) క్రింద నిర్వహించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ది టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ (PGDTE) కోర్సు పూర్తి చేసి ‘A’ గ్రేడు పొందాడు. మాకవరపాలెంలో ఐదేళ్లు పూర్తయ్యాకా, ‘కోటబొమ్మాళి’ కాలేజీకి ప్రిన్సిపాల్‍గా ప్రమోషన్ వస్తుంది. పిల్లల చదువులు పాడవకుండా ఉండాలని, తానొక్కడే కోటబొమ్మాళి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. ప్రిన్సిపాల్‍గా బాధ్యతలు చేపట్టి అధ్యాపకుల విద్యార్థుల ఆదరాన్ని పొందుతాడు. ఒక ఏడాది పూర్తవుతుంది. టెంత్ మంచి మార్కులతో పాసయిన ప్రద్యుమ్న తాను కామర్స్ చదువుతానని అంటాడు. ఆ నిర్ణయాన్ని పతంజలి సమర్థిస్తాడు. ప్రజ్ఞ సెవెంత్‌లో చేరుతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. వసుధ అక్కబావగారు వస్తారు. తాము హైదరాబాదులో ఇల్లు కట్టుకుంటున్నామనీ, పతంజలిని కూడా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోమంటారు. అవసరమైన సాయం తాను చేస్తానంటాడాయన. మరో మూడేళ్ళకి పాణిని పిహెచ్‌డి పూర్తవుతుంది. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, లక్నోలో ‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇన్‌ హ్యూమన్‌ రైట్స్‌’గా సెలెక్టవుతాడు పాణిని. రాగిణి అనే దూరపు బంధువుల అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు పాణిని. ప్రద్యుమ్నకు లక్నోలో కోచింగ్ ఇప్పిస్తానని పట్టుపట్టి పిలిపించుకుంటాడు. ప్రజ్ఞ టెంత్ పూర్తవుతుంది. సి.ఎ టార్గెట్‌గా. యమ్‌.ఇ.సి గ్రూపులో చేర్పిస్తారు. వర్ధనమ్మకి జబ్బు చేసి మరణిస్తుంది. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు, అపర కర్మలు జరిగాయి. అస్తిసంచయనం తర్వాత అస్తికలను కాశీలో గంగలో కలుపుతానని పాణిని తీసుకొని వెళ్తాడు. తండ్రిని తమతో రమ్మంటే ఆయన రానంటాడు. ఇకనైనా పెళ్ళి చేసుకోమని అందరూ మల్లినాధని ఒత్తిడి చేస్తారు. ఎవరి ఊళ్ళకి వారు చేరుకుంటారు. – ఇక చదవండి.]

[dropcap]హై[/dropcap]దరాబాదు నుండి అన్నయ్య ఉత్తరం వ్రాశాడు, సైట్‌ చూశామనీ. తమ సైట్‌ ఉన్న వీధిలోనేననీ. చాలా దగ్గరనీ వెంటనే వచ్చి చూసి నచ్చితే ఫైనలైజ్‌ చేసుకోవచ్చుననీ తెలిపాడు.

శనివారం రాత్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాదు చేరుకున్నాడు పతంజలి. అన్నయ్య సూచన ప్రకారం సికింద్రాబాద్‌ స్టేషనులో దిగి, తార్నాక బస్టాప్‌లో 290 నం. సిటీ బస్‌ ఎక్కాడు. వనస్థలిపురంలో సంపూర్ణ ధియేటర్‌ దగ్గర దిగాడు. అన్నయ్య అప్పటికే వెయిట్‌ చేస్తున్నాడు. ఇద్దరూ కమలానగర్‌ రోడ్‌ నెం. 8 లోని ప్లాట్‌ దగ్గరికి చేరుకున్నారు. 138 గజాలుంది. చతురస్రాకారంగా ఉంది. కమలానగర్‌ బస్టాప్‌ ఐదు నిమిషాల నడక. ఇంకో వైపు యన్‌.జి.వోస్‌ కాలనీ మెయిన్‌ బస్‌స్టాండ్‌. రెండు ఫర్లాంగుల దూరంలో బస్టాప్‌. కోఠీ, నాంపల్లి, లకడీకాపూల్‌, అమీర్‌పేట్‌, కుక్కట్‌పల్లి పోయే బస్సులన్నీ అక్కడ వస్తాయి. కమలానగర్‌ బస్టాప్‌ నుండి ప్రతి పదినిమిషాలకు సికింద్రాబాద్‌కు 290 నం. బస్సులు వెళతాయి. విజయవాడ జాతీయ రహదారి ఒక కి.మీ మాత్రమే ఉంది.

‘అంత రిమోట్‌ ఏరియా ఏం కాదు’ అనుకున్నాడు పతంజలి. కమలానగర్‌ పూర్తిగా రూపుదిద్దుకున్న కాలనీయే. అలాంటివి వసస్థలిపురంలో చాలా ఉన్నాయట.

ప్లాట్‌ నచ్చింది. ఫాస్ట్‌ డెవలపింగ్‌ ఏరియా. “చక్కగా రెండు బెడ్‌రూములు, హాలు, కిచెన్‌, చిన్న డైనింగ్‌ రూము వస్తాయి. ముందు వెనుక పదడుగుల స్థలం, సైడ్స్‌కు అటునాలుగడుగులు ఇటు నాలుగడుగులు వదిలేసి కట్టుకుంటే సరి. నీళ్లు కూడా తక్కువ లోతులోనే పడుతున్నాయి” అన్నాడాయన.

కాసేపట్లో ప్లాట్‌ ఓనర్‌ వచ్చాడు. అతని పేరు ‘మహంకాళి’. చ. గజం నాలుగు వందలయాభైకి డీల్‌ సెటిల్‌ అయింది. అరవై రెండు వేలు. ఆ రెండు వేలు తగ్గించమన్నారు. రేపే రిజిస్ట్రేషన్‌ చేపిస్తానన్నాడు.

టైటిల్‌ డీడ్‌, ఎనకంబరెన్స్‌ అన్నీ పరిశీలించాడు అన్నయ్య పక్కాగా ఉన్నాయి. పతంజలి తెచ్చిన డబ్బు సరిపోయింది. అన్నయ్య సోమవారం సెలవు పెట్టి హయత్‌నగర్‌లోని రిజిస్ట్రారు వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించాడు.

ఎ.సి. గార్డ్స్‌ లోని వాళ్లింటికి చేరుకొనేసరికి మూడయింది. భోజనం చేశారు.

వసుంధర వదినె అన్నది.

“మీ అన్నయ్య ఈ సంవత్సరం చివర్లో రిటైరవుతారురా. మేం వచ్చేనెల నుండి ఇంటి నిర్మాణం ప్రారంభిస్తున్నాం. రిటైరయ్యే సరికి సొంత ఇల్లు సిద్ధం కావాలని మా ప్లాను. మీరు కూడ కట్టుకుంటే బాగుంటుంది. దగ్గరే కాబట్టి మీ ఇల్లు కూడ కట్టిస్తాము. మావి మొత్తం మూడు పోర్షన్స్‌. మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పినారు కదా ఆయన. మాకొకటి పిల్లలకు ఇద్దరికి చెరి ఒకటి. మేస్త్రీ మనకు బాగా తెలిసిన వాడే. కమలానగర్‌లో ఇంచుమించు ఇరవైయిండ్లు కట్టించి ఉంటాడు. నీవు రేపు కూడ ఉండి అది కూడ సెటిల్‌ చేసుకో.”

“వసుధతో మాట్లాడాలి వదినా”

“వసుధ వద్దంటుందా ఏమన్నా. అదేమన్నా అంటే నాకు చెప్పు. కన్విన్స్‌ చేస్తాను”

వదినె వాళ్లింట్లో నుండే ఇంటికి ఫోన్‌ చేశాడు.

“ఏమిటి బావా! అసలు ఫోనే చెయ్యలేదు? వెళ్లిన పనయిందా? అక్కావాళ్లు బాగున్నారా! పాణిని ఫోన్‌ చేశాడు. మన ప్రద్యు కోచింగ్‌ వారం రోజుల్లో ఐపోతుందట. దక్షిణ్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్‌ అయిందట. ఈ నెల 27న వైజాగ్‌లో దిగుతాడు.”

“వెరీగుడ్‌. బుజ్జమ్మ ఎలావుంది?”

“బాగుంది. మీరు లేరు కదా! కొంచెం డల్‌గా ఉంది.”

ప్రజ్ఞకు ఊహ తెలిసినప్పటి నుండి నాన్న ఒక రోజు కన్నా ఎక్కువ వేరే ఊర్లో ఉంటే బెంగపెట్టుకునేది.

“స్థలం రిజిస్ట్రేషన్‌ ఈరోజే అయింది. మన డబ్బు సరిపోతుంది. వదినా వాళ్లు కనస్ట్రక్షన్‌ త్వరలో ప్రారంభిస్తారట. మనమూ కట్టుకుంటామంటే వీళ్లు పర్యవేక్షించడం సులువుగా ఉంటుందని అంటూంది వదినె”

“అయితే ఇంకేం.. మనమూ దిగుదాం. మీరేమన్నారు?”

“నీతో ఒక మాట చెప్పి..”

“వెంటనే ఓ.కె. చెప్పండి బావా! ఒకసారి మా అక్కకివ్వండి”

కాసేపు అక్కాచెల్లెళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. వదినె మాటల్లో “నీ మొహం! నీ తలకాయ! నీకేం తెలియదు!” లాంటి మాటలు వినబడి నవ్వుకున్నాడు. వసుధ చిన్నపిల్ల దానికేం తెలియదనే ఆమె ఉద్దేశం.

ఫోన్‌ చేసి మేస్త్రీని పిలిపించాడు. అతని పేరు శ్రీను. యువకుడే. పతంజలి కంటే పదేళ్లు చిన్నవాడుగా ఉన్నాడు. అతనిది ప్రకాశం జిల్లా అట. ఇరవై ఏండ్ల కిందటే సిటీకి వచ్చి ఒక పెద్ద మేస్త్రీ దగ్గర పని నేర్చుకున్నాడట. ఐదేండ్లుగా సొంతంగా ఇళ్లు కట్టిస్తున్నాడు. ‘యమహా’ బైక్‌లో వచ్చాడు. జీన్స్‌ టీషర్టు వేశాడు మేళ్లో బంగారు గొలుసు, వేళ్లకు రెండు ఉంగరాలు.

“ఆ సైటు నేను చూసినానులే సారూ. నూట నలభైకి రెండు గజాలు తక్కువ వొచ్చుద్ది. మాంకాళి దగ్గరే కద కొనింది” అన్నాడు.

జేబులోంచి చిన్న పాకెట్‌ బుక్‌, పెన్‌ తీసి లెక్కలు వేశాడు శ్రీను. ఒక కాగితం ఇమ్మని, ఇంటిప్లాన్‌ వేశాడు. బెడ్‌ రూములు ఎక్కడ వస్తాయి. హాలు ఎంత వస్తుంది, బాత్‌ రూంలు ఒకటి అటాచ్‌డ్‌, ఒకటి కామన్‌, పెరట్లో కావాలంటే ఇంకోటి కూడ వస్తుంది.

“ప్లోరింగ్‌ మార్బుల్‌ బండలేద్దాం సారూ! లుక్కొచ్చుద్ది. కిచెన్‌ గట్టు అంతా గ్రానైట్‌ వాడదాం. ముందు తలుపు టేకుది కార్వింగ్‌ చేయిద్దాం. వుడ్‌ వర్క్‌ కూడ చేయించుకుంటారా?”

“ఇప్పుడొద్దు వాళ్లు అప్పుడే రారు. అద్దెకిచ్చుకోడానికి వుడ్‌ వర్కెందుకు?” అన్నది వదినె.

“మొత్తం నాకు కంట్రాక్టుకిస్తారా సారూ లేదా మెటీరియలంతా ఇప్పించి స్క్వేర్‌ఫీట్‌ కింతని ఇస్తారా?”

అన్నయ్య అన్నాడు. “మెటీరియల్‌ మేమే ఇప్పిస్తాము అంతా ఎంతవుతుందో చెప్పు శ్రీనూ”

“ఐదున్నర ఆరు మధ్య తేలుద్ది సారూ!”

“సరేలే. నాలుగు రోజుల తర్వాత కనబడు. రేపు మేం లోన్‌ వివరాలు కనుక్కుంటాం.”

“మరెవ్వరికీ చెప్పకండి సారూ! మన మూడిళ్లతో పాటు ఈసారుది కూడ నేనే చేస్తా” అని సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

మర్నాడు హిమాయత్‌నగర్‌లోని తమ బ్యాంకుకు తీసుకెళ్లాడాయన పతంజలిని. అతని టేక్‌ హోం శాలరీ వివరాలడిగాడు. ఫీల్డాఫిసరును పిలిచి “ఈయన మా తోడల్లుడు. గవర్నమెంట్‌ కాలేజి ప్రిన్సిపాల్‌. మనం ఈయనకు హౌసింగ్‌ లోన్‌ ఇస్తున్నాం. ఇంకా పదమూడేళ్లకు పైగా సర్వీసుంది. ఇ.యమ్‌.ఐ ఎంతవస్తుందో చూడండి. ఆరు లక్షలు ఇద్దాము” అని చెప్పాడు.

ఆయన లెక్కలు వేసి నెలకు ఆరు వేల వరకు రావొచ్చన్నాడు.

“అద్దెకిస్తే మూడు వేల వరకు రావొచ్చు. మిగతాది నీవు కట్టుకోవాలి. నీవు బ్యాంకుకు కట్టే వడ్డీ అంతా ఇన్‌కంటాక్స్‌ నుండి మినహాయింపు ఉంటుంది. అసలు మొత్తాన్ని 80సిలో చూపించుకోవచ్చు” అన్నాడన్నయ్య.

“ఇదేదో బాగుందే” అనుకున్నాడు పతంజలి. తానిప్పటికే నెలకు వెయ్యి రూపాయలదాకా టిడియస్‌ కడుతున్నాడు. మూడు వేలు రెంట్‌ వచ్చినా వెయ్యి రూ. టాక్స్‌ మిగులుతుంది. మరో రెండు వేలు కట్టుకుంటే సరిపోతుంది.

అప్లికేషన్‌ ఫారం నింపించి, సంతకాలు పెట్టించాడాయన. ఫోటోలు తర్వాత పంపమన్నాడు. పే సర్టిఫికెట్‌ కూడ పంపమన్నాడు. ఆ బ్యాంకులోనే పతంజలికి అకౌంట్‌ తెరిపించాడు.

“లోన్‌ అమౌంట్‌ నీ అకౌంట్‌లోనే క్రెడిట్‌ చేస్తాం. నీకు ఇప్పుడే చెక్‌బుక్‌ ఇస్తాను. పది పన్నెండిటి మీద సైన్‌ చేసియిచ్చిపో. కన్‌స్ట్రక్షన్‌ అవసరాలను బట్టి వాడతాను” అన్నాడు.

“మధ్యలో నెలకొకసారి వచ్చి చూసుకొనిపోతూంటావు కద!” అన్నాడు.

అహోబిలం నరసింహస్వామే తోడల్లుడి రూపంలో తన యింటి కోసం అవతరించినట్లు అనిపించింది పతంజలికి.

“అన్నయ్యా! మా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు. చాలా ఋణపడి ఉంటాము.”

“అదేం లేదులే అయ్యా. మా ఉమకు కట్టిస్తున్నట్టే వసుధకు కూడ కట్టిస్తాము. చిన్నప్పుడు దాన్ని ఎత్తుకొని తిప్పేవాడిని తెలుసా! అలంపూరులో నీ వడుగుకు కూడ వచ్చింటిమి. నీకు గుర్తుండదులే”

ఆ రోజు రాత్రే బయలుదేరి శ్రీకాకుళం చేరుకున్నాడు. వారంరోజుల్లో ప్రద్యు వచ్చాడు. రెండు ఎంట్రన్స్‌లూ బాగా వ్రాశాడట. చిన్నాన పిన్నమ్మ వాడిని బాగా చూసుకున్నారట. అందరికీ స్వెటర్స్‌ పంపాడు పాణిని.

నెలలోపే రిజల్టు వచ్చింది. ‘క్యాట్‌’ లో చాలా పెద్ద ర్యాంక్‌ వేలల్లో వచ్చింది. కాబట్టి ఐ.ఐ.ఎమ్స్‌లల్లో సీటు రాదు. మ్యాట్‌ (మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌)లో మాత్రం చిన్న ర్యాంక్‌ వెయ్యి లోపే వచ్చింది. కొడుకును దగ్గరకు తీసుకొని నుదుట ముద్దు పెట్టుకుంది తల్లి. పతంజలి ప్రద్యును హత్తుకున్నాడు.

‘పుత్రగాత్ర పరిష్వంగ సుఖము’ అనుభవించాడు.

ఆరోజు వాడికిష్టమయిన ఆలూబాత్‌, కాల్చిన వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, మసాలావడలు చేసింది వసుధ. సాయంత్రం అందరూ అరసవిల్లి వెళ్లి దర్శనం చేసుకొని, ‘సూర్యమహల్‌’లో బాలకృష్ణ సినిమా ‘ఆదిత్య 369’ సినిమాకు వెళ్లి వచ్చారు. శింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్‌ చేసిన సినిమాలంటే పతంజలికి వసుధకు చాలా యిష్టం. ఆ సినిమాలో చాలా సంవత్సరాల తర్వాత జిక్కి పాడిన ‘జాణవులే, నెర జాణవులే’ అన్న పాట బాగా నచ్చింది. పిల్లలిద్దరికీ ఆనాటి మేటి పౌరాణిక జానపద చిత్రాలను చూసి ఎంజాయ్‌ చేయడం నేర్పించారు.

ఇంటికి వచ్చి వేడిగా అన్నం చేసుకొని, మధ్యాహ్నం మిగిలినవన్నీ వేసుకుని తిన్నారు.

మ్యాట్‌ ర్యాంకు కనుగుణంగా రెప్యూటెడ్‌ కాలేజీలకు దరఖాస్తు చేశారు. ‘పూణె’ లోని ‘సింబియాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ లో సీటు వచ్చింది. మన దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలలో అదీ ఒకటి. పాణినికి లెటరు వ్రాశాడు. వాడు ఎంబిఎలో మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌ తీసుకోమని సలహా యిచ్చాడు. హాస్టల్‌, ఇతర ఖర్చులతో సహా నాలుగు లక్షలు దాటేలా ఉంది.

కర్నూలుకు వెళ్లి ‘సుందరం ఫైనాన్స్‌’లో తన పేర వేసిన డిపాజిట్‌ విత్‌డ్రా చేశాడు నాన్నకు చెప్పి. దాదాపు పదిహేనేళ్లు దాటింది. అప్పుడు ముఫై మూడు వేలు వేశారు. చిన్నాడిది వాడి చదువుకు, మహితది పెళ్లికి వాడుకున్నారు. తల్లిదండ్రులది, మల్లినాధది అలాగే ఉన్నాయి. పతంజలికి మెచ్యూరిటీ అమౌంట్‌ దాదాపు రెండున్నర లక్ష వచ్చింది. దాన్ని శ్రీకాకుళంలో తన అకౌంటుకు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ప్రద్యును తీసుకువెళ్లి పూణెలో జాయిన్‌ చేసివచ్చారు.

మల్లినాధకు ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి వాళ్లది వెలుగోడు. తండ్రి పౌరోహితుడు. అన్నయ్య శ్రీశైల దేవస్థానంలో స్టోర్‌ కీపరు. అతనికి పెళ్లయింది. అమ్మాయి డిగ్రీ వరకు చదివి ఏదో కాన్వెంటులో పని చేస్తూందట. చామన చాయ ఐనా ముఖం కళగా ఉంది. పురోహితుల ఇంట్లో పుట్టి పెరిగింది కాబట్టి మడి, ఆచారాలు తెలిసిన పిల్ల, మల్లినాధ కూడ ఒప్పుకున్నాడు. వాళ్లు కలిగినవారు కాదు. అహోబిలంలో పెళ్లి జరగాలని షరతుపెట్టాడు మల్లి.

తండ్రి బాగానే తిరుగుతున్నాడు. కానీ వృద్ధాప్యం ఆయనకు కొంత కుంగదీసింది. మూడు నెలల్లో మల్లినాధ వివాహం. పట్టు బట్టి తండ్రిని తనతో శ్రీకాకుళానికి తీసుకుని వచ్చాడు పతంజలి. వసుధ మేనమామను ఆదరంగా ఆహ్వానించింది. ఆయన రాత్రిపూట ఏమీ తినడు. పేలాలు లేదా అటుకులు మజ్జిగతో నానబెట్టి ఇమ్మంటాడు. వసుధ ఒప్పుకోలేదు.

“మన ఊర్లో చేసేవారు లేక అలా తిన్నావు మామా? నీకెందుకు? నేను నీకు చేసి పెడతాను చూడు”

“నాకు అరగవే తల్లీ.”

“అటుకులు పేలాలకంటే బాగుంటుంది. నాల్గురోజులు చూడండి”

ఒకరోజు ఇడ్లీ పెట్టింది. ఒకరోజు రవ్వదోసె. ఒకరోజు మెత్తని పుల్కా ఇలా పెట్టేది మామకు. ఏదయినా రెండు కంటె ఎక్కువ తినేవాడు కాదాయన. అప్పుడపుడు సాయంత్రం బండిమీద నాగావళి లేదా వంశధార ఒడ్డుకు తీసుకొని వెళ్లేవాడు పతంజలి. పది పదిహేను రోజులకొకసారి సినిమాలకు వెళ్లేవారు.

చిరంజీవి ‘స్నేహం కోసం’ చూశాడాయన కోడలు కొడుకుతో. ఆయనకు చాలా నచ్చింది. ‘కథాసంవిధానం” ‘పంచిక’, ‘ఔచిత్యం’ లాంటి పద్యాలు వాడతాడాయన సినిమాను విశ్లేషించడానికి. మోహన్‌బాబు సినిమా ‘శ్రీరాములయ్య’ కూడా నచ్చిందాయనకు. ఆంజనేయ టాకీస్‌లో పాతది నాగేశ్వర్రావు సినిమా ‘కీలుగుర్రం’ కూడా చూశారు.

హైదరాబాదులో ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతూంది. ఒక వీకెండ్‌ వెళ్లి చూసివచ్చాడు. బేస్‌ మట్టం వరకు లేపి పిల్లర్స్‌ లేపారు.

“సింహాద్రి అప్పన్నను దర్శించుకోవాలనుందిరా!” అన్నాడాయన ఒకరోజు. కారు మాట్లాడుకొని ఉదయాన్నే వెళ్లి స్వామిని చూసివచ్చారు. అప్పలాచార్యులుగారు దర్శనం చేయించారు. “బావగారూ!” అంటూ పతంజలిని అభిమానంగా పిలిచారు. ‘అక్క’ వాళ్లింట్లోనే భోజనం చేయాలని పట్టుపట్టింది. వారికి ఒక కిలో జీడిపప్పు పాకెట్‌ తీసుకొని వెళ్లారు. వాళ్ల ఆప్యాయత స్వచ్ఛమయినది నిస్వార్థమయినది.

కాళిదాసు ‘జననాంతర సౌహృదాని’ కి ప్రతిరూపం వారు.

కాళీపట్నం రామారావుగారు నెలకొల్పిన ‘కథానిలయం’ చూపించాడు తండ్రికి. ఆయనకు పతంజలి తెలుసు. మార్కండేయశర్మను కారా మాష్టారు సగౌరవంగా చూచారు.

గురజాడ కళామందిరంలో సంగీత కచేరీ ఉందని పతంజలికి తెలిసింది. సాయంత్రం వసుధ, పతంజలి, ప్రజ్ఞ మార్కండేయ శర్మ అందరూ ఆరు గంటలకే వెన్యూ చేరుకున్నారు. ‘కలైమామణి శంకరన్‌ నంబూద్రి’ గారికి స్వాగతం అని బ్యానర్‌ కట్టి ఉంది. కచేరీ ఇంకా ప్రారంభం కాలేదు. మృదంగ, వయోలిన్‌ విద్వాంసులు శృతి చూసుకుంటున్నారు. వేదిక క్రింద ఏడు సంవత్సరాల పిల్లవాడు, ఇద్దరు చిన్న పిల్లలతో దాగుడు మూతలు ఆడుతున్నాడు.

శాస్త్రీయ సంగీత ప్రపంచంలో శంకరన్‌ నంబూద్రి పేరు సుపరిచితమే. ఆయన గాత్రం క్యాసెట్స్‌లో విన్నాడు పతంజలి. ఆయనను ప్రత్యక్షంగా చూడాలని కుతూహలంగా ఉంది వసుధకు పతంజలికి.

“మరికొద్దిక్షణాల్లో కచేరీ ప్రారంభం” అని ప్రకటించాడొకాయన.

వేదిక ముందు వరుసలో కూర్చున్న భార్యాభర్తలు లేచి, పరుగులు పెడుతున్న ఆ ఏడు సంవత్సరాల కుర్రవాడిని పట్టుకున్నారు. మళయాళంలో ఏదో చెబుతున్నారు. ఆ అబ్బాయి చివరకు వేదిక మీదకు వచ్చి మైకు ముందు కూర్చున్నాడు. సభకు నమస్కరించాడు. పతంజలి దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు, ‘శంకరన్‌ నంబూద్రి’ అంటే ఈ పిల్లవాడా!

అంతవరకు అల్లరి చేస్తూ ఆడుకున్నవాడు సడన్‌గా కళాకారుడిగా మారాడు. మొదట హంస ధ్వని రాగంలో ‘వాతాపి గణపతిం భజే’ అందుకున్నాడు. స్వరగంగా ఝరీ ప్రవాహం మొదలయింది.

‘బాలకనక మయ చేల’ త్యాగరాజు.

‘నారాయణతే నమో నమో’ అన్నామాచార్యులు

‘కమలనయనవవాసుదేవ’ రామదాసు

ఇలా దిగ్దంతుల కీర్తనలు ఆ బాలుడి గొంతులో జీవం పోసుకున్నాయి. ‘తిల్లాన’ రక్తి కట్టించాడు. శ్రోతలు సంగీతానందరసాంబుధిలో ఓలలాడాడు.

కచేరీ ముగిసింది. బుజ్జి త్యాగయ్య మళ్లీ అల్లరి కన్నయ్యగా మారిపోయాడు. పతంజలి అతని బుగ్గలు నిమిరి

“ఇంత చిన్న వయసులో ఎంత సంగీత సంపద సమకూర్చుకున్నావు కన్నా” అన్నాడు అతనికి తెలుగురాదు.

సన్మానం చేద్దామంటే ఎంతకూ రాడు. అదే శంకరన్‌ నంబూద్రిని ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో చూశాడు పతంజలి.

మార్కండేయ శర్మ ఒకనాడు కొడుకుతో చెప్పాడు “నాయనా పతంజలీ! నా జీవితంలో నా గురువు శివసచ్చిదానందుల కృపతో నేను పొందిన జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాలని ఉందిరా! నేను వ్రాయలేను. నేను చెబుతూంటాను నీవు వ్రాస్తావా?”

“తప్పకుండా నాన్నా” అన్నాడు పతంజలి.

హైదరాబాదు పాత మలక్‌ పేటలో రేస్‌కోర్సు రోడ్డు ప్రారంభంలోనే ఒక సందు చివర ఒక చిన్న గుట్ట లాంటి దానిమీద “శివసచ్చిదానందాశ్రమం” ఉంది. మార్కండేయశర్మ ఆధ్యాత్మిక గురువులు శ్రీనివాసశాస్త్రి గారు సన్యాసం స్వీకరించి శివసచ్చిదానంద స్వామిగా మారారు.. రాణీబాగ్‌ అని పిలుస్తారా ప్రాంతాన్ని మార్కండేయశర్మ ఎప్పుడయినా ఆశ్రమాన్ని దర్శించి, గురవుల వద్ద ఉపదేశం పొందేవాడు.

అక్కడ ఒక దత్త మందిరం శివాలయం, ధ్యానభూమి, అనే హాలు నిర్మించారు ఆయన శిష్యులు. ధ్యానభూమిలోనే వారు సమాధి అయినారు.

‘ఆధ్యాత్మ దర్శన అభ్యాస యోగమ్‌’ అని నామకరణం చేశాడు శర్మ తన గ్రంథానికి. గురువుగారి బోధనలు పొందుపరిచాడు. స్థూల శరీరం, సూక్ష్మశరీరం, శక్తి నిత్యత్వ సూత్రం, ఏకాగ్రత, త్రాటకము, కల్యాణ కృత్‌, జీవశక్తి, కర్మయోగం, రాజయోగం ఇలా విభజించాడు తన గ్రంథాన్ని. రోజు రాత్రి ఎనిమిది నుండి పదకొండు వరకు తండ్రి చెబుతూంటే కొడుకు వ్రాశాడు. రెండు నెలలు పట్టింది. పతంజలి రైటింగ్‌ మూడు వందల పేజీలు వచ్చింది. దాన్ని ఇంగ్లీషులోకి అనువదించడానికి తండ్రి అనుమతి తీసుకున్నాడు.

మల్లినాధ పెండ్లికి నాలుగు రోజులు ముందే వెల్దుర్తి చేరుకున్నాడు. అందరూ వచ్చారు. ప్రద్యుమ్న రాలేకపోయాడు. వాడికి ట్రైమిస్టర్‌ పరీక్షలు.

పెళ్లికి ముందురోజు సాయంత్రానికి ఒక చిన్న మినీ బస్‌లో దిగువ అహోబిలం చేరుకున్నారు. ‘కరివెన’ వారి సత్రంలో నాలుగు గదులు ఏర్పాటు చేశారు అమ్మాయి తరపువారు. ఎదురకోళ్లు సత్రంలోనే జరిగాయి. మర్నాడు నరసింహస్వామి గుడి ప్రాంగణంలోని ఒక మంటపంలో వివాహం జరిగింది. పెండ్లి కుమార్తె పేరు గాయత్రి.

“మల్లినాధ రోజూ సహస్ర గాయత్రీ జపం చేస్తాడు కదా! రేపట్నుంచి ఈ గాయత్రి ఆ గాయత్రిని డామినేట్‌ చేస్తుందేమో” అన్నాడు చిన్నోడు. వాడి మాటలకందరూ నవ్వారు. వాడి భార్య కడుపుతో ఉంది.

పెండ్లి భోజనాలు కరివెన సత్రంవారికే అప్పచెప్పారు. ఇరుపక్షాలవారూ కలిసి ముఫై మంది కూడలేరు.

అలా బ్రహ్మచారిగానే ఉండిపోతాడేమో అని అనుకున్న మల్లినాధ ఆలస్యంగానైనా ఒక యింటివాడయ్యాడు.

వెల్దుర్తిలో దత్త వ్రతం చేసుకున్నారు. తండ్రి శ్రీకాకుళానికి రానన్నాడు. పతంజలి కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇల్లు శ్లాబ్‌ వేశారు. భరత్‌ ఉద్యోగంలో మరో మెట్టెక్కి మేనేజరయ్యాడు. వాడికి సంబంధాలు వస్తున్నాయి.

తండ్రి రాసిన గ్రంథాన్ని ఆశ్రమంలో సమర్పించాడు పతంజలి. గురువుగారి కుమారుడు రిటైరైన తర్వాత ఆశ్రమంలో వ్యవహారాలు చూస్తున్నాడు. ఇంగ్లీషు అనువాదం కూడ పూర్తి చేస్తే రెండింటినీ టి.టి.డి. వారి ఆర్థిక సహాయంతో ముద్రించుకోవచ్చునని చెప్పాడాయన. ఆయన పేరు సాధుమూర్తి.

వసుంధర వదినె వాళ్లింట్లో రెండ్రోజులుండి శ్రీకాకుళం చేరుకున్నారు.

***

2001

రెండేళ్లు గడిచాయి. ఇల్లు పూర్తయింది. లాంఛనంగా గృహప్రవేశం చేసి అద్దెకిచ్చారు. రామోజీ ఫీల్మ్‌ సిటీలో పనిచేసే ఒక తమిళియన్‌ కుటుంబం దిగింది. అద్దె రెండువేల ఎనిమిది వందలు ప్రద్యుమ్న ఎం.బి.ఎ పూర్తి చేశాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జి.యి. కంపెనీలో సెలెక్టయ్యాడు. హైదరాబాద్‌ ఉప్పల్‌ క్యాంపస్‌కు వేశారు. వసుంధర వదినె వాడిని తమ ఇంట్లోనే ఉండమంది. వాడి జీతం ఇరవై వేలు!

బుజ్జమ్మ ఇంటర్మీడియట్‌ పరీక్షలు వ్రాసింది. రిజల్ట్సు కోసం ఎదురుచూస్తుంది. ఈలోగా పతంజలికి ట్రాన్స్‌ఫర్‌ అయింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు వేశారు. యస్‌.కోట అంటారా వూరిని క్లుప్తంగా. ప్రజ్ఞకు సి.ఎ. ఎంట్రన్స్‌ కోచింగ్‌ యిప్పించాలి. అది హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. సి.పి.టి (కామన్‌ ప్రొఫిసియన్సీ టెస్ట్‌) అంటారు దానిని.

ఎంట్రన్స్‌ పాసయిన తర్వాత సి.ఎ. కోర్సులో చేరాలి. దానికి కాలేజీలంటూ ఉండవు. కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ మాత్రమే ఉంటాయి. కోర్సులో భాగంగా ఎవరయినా ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ దగ్గర ‘ఆర్టికల్‌షిప్‌’ మూడేళ్లు చేయాలి. ప్రాక్టికల్‌ ట్రయినింగ్‌ అన్నమాట.

ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్‌ చేయాలని అనుకున్నాడు. యస్‌కోటలో తానొక్కడే ఉండి, వస్తూ పోతూ ఉంటే, ప్రజ్ఞను హాస్టల్లో పెట్టాల్సిన పని ఉండదు. ప్రద్యు కూడ అక్కడే ఉన్నాడు కాబట్టి తల్లీ పిల్లలూ కలిసి ఉండొచ్చు. గాంధీనగర్‌లో అగర్వాల్‌ అకాడమీ అని ఉందట. ప్రద్యు ఫోన్‌ చేశాడు. చాలా ఫేమస్‌ అట. ఆర్టికల్‌షిప్‌ కూడ వాళ్లే ఏర్పాటు చేస్తారట. అదీ గాంధీనగర్‌లోనే ఉందట. క్లాసులు ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారట. వనస్థలిపురంలో మన యింట్లో ఉండి చదువుకోవడం కుదరదు. గాంధీనగర్‌లోనే ఏదో ఒక అపార్ట్‌మెంట్‌ తీసుకుంటే సరిపోతుందని వ్రాశాడు వాడు.

వారంరోజుల్లో అపార్ట్‌మెంట్‌ దొరికింది. గాంధీనగర్‌ పోస్టాఫీసుకు ప్రక్కనే ఫస్ట్‌ ఫ్లోర్‌. లిఫ్టు వాడాల్సిన అవసరం లేదు. త్రిబెడ్‌ రూం అపార్ట్‌మెంట్‌. అద్దె ఎనిమిది వేలు. “ఆ పోష్‌ ఏరియాలో ఆ మాత్రం అద్దె పెట్టకపోతే ఎలా?” అంటాడు కొడుకు.

‘అగర్వాల్‌ అకాడమీ’ దీనికి కూతవేటు దూరమే. బుజ్జమ్మకు రెండు నిమిషాల నడక. ‘మూవర్స్‌ అండ్‌ ప్యాకర్స్‌’కు అప్పచెప్పారు షిప్టింగ్‌. ముగ్గురూ ‘విశాఖ’ లో సికింద్రాబాద్‌ చేరుకున్నారు. ప్రద్యు స్టేషన్‌కు వచ్చాడు. యం.యన్‌.సిలో పనిచేస్తున్న ప్రభావం వాడి ఆహార్యంలో, మాటతీరులో మార్పు తెచ్చింది.

ఆటోలో అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ‘లేక్‌వ్యూ టవర్స్’ దాని పేరు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ ప్రాంతం వెనకే ఉంటుంది. కవాడిగూడ అని కూడ అంటారు. కోఠీ, అబిడ్స్‌, ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌, ఏదయినా ఇరవై నిమిషాల దూరంలో ఉన్నాయి. మోండా మార్కెట్‌ కూడ దగ్గరే. ‘మోర్‌’ సూపర్‌మార్కెట్‌ కూడ ప్రక్క సందులోనే.

మధ్యాహ్నానికి లారీ వచ్చింది సామానుతో. అన్నీ సర్దిపెట్టి వెళ్లిపోయారు. పనిమనిషి కుదిరింది. ఆరువందలు. ఆ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వీళ్లకు అలవాటు లేదు. కానీ తప్పదు.

కొడుకు బైక్‌ కొనుక్కుంటానంటే పదివేలిచ్చాడు పతంజలి. ‘హీరో హోండా’ కొన్నాడు వాడు. నాల్గురోజులుండి యస్‌. కోటకు వెళ్లిపోయాడు. అక్కడా ఒక రూం తీసుకొని వంట ప్రారంభించాడు. యస్‌.కోట కాలేజీ చాలా పెద్దది.

ఆ మధ్య సర్వీస్‌ కమీషన్‌ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ జరిగింది. జె.ఎల్‌ పోస్టులకు యస్‌.కోట కాలేజీకి ఒక తెలుగు లెక్చరర్‌ను వేశారు. ‘నూనూగు మీసాల నూత్న యవ్వనము వాడ’తను. అతని పేరు పెంటయ్య. పిల్లలు పుట్టిన వెంటనే చనిపోతూంటే, పరిహారంగా, నవజాత శిశువును పెంట కుప్పమీద పొరలించి తీస్తారు. పెంటయ్య లేదా పెంటమ్మ అని పేరు పెడతారు. లేదా పుల్లి విస్తారకులపై పొర్లించి, పుల్లమ్మ, పుల్లయ్య అని పేరు పెట్టకుంటారు. అలాంటి పేరేమో అనుకున్నాడు పతంజలి. మనిషి కారు నలుపు. మల్లెపూవు లాంటి తెల్లని లాల్చీ, పైజమా ధరించాడు. కళ్లకు గోల్డ్‌ ఫ్రేమ్‌ ఆప్టికల్స్‌ పెట్టుకున్నాడు. అతడు నవ్వితే తెల్లని పళ్లు మెరుస్తున్నాయి.

కొన్ని రోజుల్లోనే ప్రిన్సిపాల్‌ గారికి అభిమానపాత్రుడయ్యాడు పెంటయ్య. అతడు దళిత కులానికి చెందినవాడు. కానీ అతని సంస్కారం, నడవడిక, ఉచ్ఛారణ స్వచ్ఛంగా ఉంటాయి. ఎమ్‌.ఎ తెలుగు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాడు. బాగా చదువుకున్నాడు. పతంజలి రౌండ్స్‌ కు వెళ్లినపుడు ఒకసారి విన్నారు. అతడు శ్రావ్యంగా, రాగయుక్తంగా పద్యాలను పాడుతున్నాడు. చక్కగా వివరిస్తూన్నాడు.

పతంజలి తీరుబాటుగా ఉన్నప్పుడు వచ్చి కూర్చుని సాహిత్యం సంగీతం గురించి చర్చిస్తాడు. విశ్వనాధవారంటే ప్రాణం పెడతాడు. నుదుట బొట్టు పెట్టుకుంటాడు. పరమ ఆస్తికుడు.

“జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః” అన్న సూక్తికి చక్కగా సరిపోతాడు” అనుకున్నాడు పతంజలి. తన రూంకు కూడ ఆహ్వానిస్తాడతన్ని.

“నా పేరు అధికారికంగా మార్చుకుందామనుకుంటున్నాను సార్‌” అన్నాడొకరోజు. “దాని విధివిధానాలు ఏమయినా ఉంటే చెప్పండి”

“దానికి పెద్ద తతంగముంటుందని విన్నాను. గెజిట్‌లో నోటిఫై చేయించుకోవాలట. అంత చేసినా ప్రపంచం పాత పేరును త్వరగా మరువదు. మద్రాసు చెన్నైగా మార్చారు. బొంబాయిని ముంబాయి అన్నారు. కాని ఆ తరంవాళ్లు పాతపేర్లే వాడతారు. అయినా పేరెందుకు మార్చుకోవడం?”

“బాలేదు కదండీ”

“తప్పుగా ఆలోచిస్తున్నావు తెలుగు మాస్టారు!” అన్నాడు పతంజలి. ‘వాటీజ్‌ ఇన్‌ ఎ నేమ్‌?’ అన్నాడు షేక్‌స్పియర్‌. దాన్నే గురజాడ తన కన్యాశుల్కంలో ‘పేరులోననేమి పెన్నిధి ఉన్నది?’ అని అనువదించారు. పేరనేది కేవలం ఐడెంటిటీ మాత్రమే. మా పొలంలో ‘తోకోడు’ అని పని చేసేవాడు. అద్భుతమయిన పనిమంతుడు. మా దూరపు బంధువొకాయనుండేవాడు. ‘గుండు బావ’ ఇలా పిలిచేవారాయన. ‘కుప్పమ్మ, కుప్పయ్య, తవుడు, ఇలాంటి పేర్లెన్ని లేవు? ఇంగ్లీషువాళ్లు చూడు టైలర్‌, బార్బర్‌ లాంటి పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు నీకు ‘శ్రీనాథ్‌’ అని పేరుందనుకుందాం. నీకు పాఠం చెప్పడం రాదు. పద్యం చదవడం రాదు. క్లాసును సస్టెయిన్‌ చేయలేవు. కేవలం నీ పేరును బట్టి విద్యార్థులు, ఇతరులు నిన్ను గౌరవిస్తారా! ఇంగ్లీషులో పెంటా అంటే మన ‘పంచమం’ అని అర్థం. పెంటామీటర్‌ అని ఛందస్సు కూడ ఉంది. కాబట్టి నీవు నీవు గానే ఉండు. ఏ విషయంలోనైనా ఇన్‌ఫీరీయారిటీ కాంప్లెక్స్‌ పనికిరాదు.”

తెలుగు మాస్టారికి తత్త్వం బోధపడిరది.

‘గురుపూజోత్సవం’ జరిగింది సెప్టెంబర్‌ ఐదున. పెంటయ్య మాస్టారు అద్భుతంగా మాట్లాడాడు గురువు గొప్పతనాన్ని గురించి. అందరూ ప్రశంసలు కురిపించారు.  పతంజలి మాట్లాడుతూ,

“నేను చెప్పాలనుకున్నదంతా మన తెలుగు మాస్టారు చెప్పేశారు. నాకేం మిగల్చలేదు. కానీ రెండు మాటలు చెబుతాను. చాలా సందర్భాలలో శిష్యులు గురువు కంటె తెలివైనవారుగా ఉంటారు. కానీ గురువు గురువే. నీవు పి.జి. చేసి పెద్ద ఆఫీసరువైనావు. ఎలిమెంటరీ స్కూల్లో నీకు చదువు నేర్పిన టీచర్‌ కనబడితే గౌరవంగా నమస్కరిస్తావు. నీ కన్న విద్యార్హతలో, హోదాలో ఆయన తక్కువే కాని ప్రాథమిక స్థాయిలో నిన్ను తీర్చి దిద్దిందాయనే కదా!

హైస్కూల్లో మాకు కాంతారెడ్డి సార్‌ అని సైన్సు చెప్పేవారు. లేబరేటరీలో ‘ప్యారలాక్స్‌ దోషము’ అంటే ఏమిటో ప్రాక్టికల్‌గా చూపించేవారు. ఆయనంటే మాకు అందరికీ హడల్‌. ఇప్పటికీ నేను మా ఊరికి వెళ్లినపుడు ఆయన దగ్గరికి వెళితే కొంచెం భయంగానే ఉంటుంది.

‘ఏమిరా బాపనయ్యా! బాగున్నావా! ప్రిన్సిపాల్‌వైనావట!’ అంటాడు అభిమానంగా. నాకు స్కూల్లో ఇంగ్లీషు నేర్పిన మా శంకరయ్య సారును, నన్ను అన్ని విధాలా గైడ్‌ చేసిన మహమ్మదాజం సారును నేను సదా స్మరించుకుంటాను”

“స్టూడెంట్‌ – టీచర్‌ సంబంధాలు మునుపటిలా లేవంటారు. నిజమే కావొచ్చు కాని నిజమైన అంకితభావంతో విద్యార్థులను తీర్చి దిద్దే గురువులెపుడూ సమాజంలో గౌరవం పొందుతూ ఉన్నారు.”

“ఈ మధ్యనే ఒక ఉదంతం చదివాను ఎక్కడో విమానం నడుపుతున్న పైలట్‌ ఒకాయన తన విమానంలో తన గురువుగారు ప్రయాణిస్తున్నట్లు తెలుసుకొని, టేకాఫ్‌కు ముందే కాక్‌పిట్ నుండి వచ్చి గురువుకు పాదాభివందనం చేసి, ఆయనను తన గురువుగా ప్రయాణీకులందరికీ పరిచయం చేసి సముచితంగా గౌరవించాడట”.

“మన వృత్తిలో మనకు సంపద అధికారం ఉండకపోవచ్చు. కాని విద్యార్థులు. సమాజం మనపట్ల చూపే గౌరవమే మనకు తరగని సంపద. అది ఇతర  ఏవృత్తిలోనూ లభించదు”

“చివరగా సర్వేపల్లివారు ఉపాధ్యాయుని గురించి ఉటంకించిన ఒక చమత్కార నిర్వచనం చెప్పి ముగిస్తాను. ఒకసారి రాధాకృష్ణ పండితుడు హౌరా స్టేషన్‌లో వెయిటింగ్‌ రూములో ఉన్నాడట. అప్పుడాయన బెనారస్‌ హిందూ విశ్వ విద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌. కొంతమంది విద్యార్థులు ఆయనను చూసి నమస్కరించి నిలుచున్నారు. అందులో ఒక తెలివైన కొంటె కోణంగి ఆయనను ఒక ప్రశ్న అడిగాడట.

“సర్‌! వాటీజ్‌ ది డిఫరెన్స్‌ బిట్వీన్‌ స్కూల్‌ మాస్టర్‌ అండ్‌ ది స్టేషన్‌ మాస్టర్‌?”

ఆ మహాపండితుడు ఇలా జవాబు చెప్పాడట. “ది స్టేషన్‌ మాస్టర్‌ మైండ్స్‌ ది ట్రెయిన్స్‌ బట్‌ ది స్కూల్‌ మాస్టర్‌ ట్రెయిన్స్‌ ది మైండ్స్‌. దటీజ్‌ ది డిఫరెన్స్‌”

ఇంగ్లీషు భాష చాలా విచిత్రమైంది. ట్రెయిన్‌ అంటే రైలనీ, శిక్షణ ఇవ్వడమనీ రెండర్థాలున్నాయి. అట్లే మైండ్‌ అంటే గుర్తుంచుకోవడమనీ, మేధస్సు, బుద్ధి అనీ అర్థాలున్నాయి. ఆ శ్లేషనుపయోగించి ఎంత గడుసుగా చెప్పాడు చూడండి!

“స్టేషన్‌ మాస్టరు రైళ్లను గుర్తుంచుకుంటాడు. స్కూలు మాస్టరు బుద్ధులకు శిక్షణ ఇస్తాడు” ఇదీ ఈయన చెప్పింది. పదాలు అవే భావం ఎంత వైవిధ్యంగా ఉందో చూశారా!

సభలో చప్పట్లు.

“వి.ఎస్‌. శ్రీనివాసశాస్త్రిగారు గాంధీజీకి మిత్రులు. ఉపాధ్యాయుని గొప్పతనాన్ని ఆయన ఇలా విశ్లేషించారు.

“ది కాలింగ్‌ ఆఫ్‌ ఎ పెడగాగ్‌ ఈజ్‌ నాట్‌ ది లాస్ట్‌ రిసార్ట్‌ ఆఫ్‌ ఎ జాబ్‌ సీకర్‌. ఇటీజ్‌ ది అల్టిమేట్‌ ఛాయిస్‌ ఆఫ్‌ ఎ జీనియస్‌”

అంటే,

“ఉపాధ్యాయవృత్తి అనేది సరైన ఉద్యోగం రాక చివరకు ఎన్నుకొనే దికాదు. ఒక మేధావి ఆ వృత్తిని తప్ప వేరేది చేపట్టనని చేసుకొనే ఒకే ఒక ఎన్నిక”

మళ్లీ చప్పట్లు.

“కాలింగ్‌ ‘అంటే వృత్తి ‘పెడగాగ్‌’ అంటే విద్యను బోధించేవాడు. కొన్ని దేశాల్లో యూనివర్సిటీ ప్రొపెసర్లకు, ఎలిమెంటరీ టీచర్లకు సమాన వేతనాలుంటాయని విన్నాను. అదీ వారు టీచరు కిచ్చే గౌరవం మన ప్రభుత్వాలు మనకు రావల్సిన డి.ఎ. మంజూరు చేయడం కూడ మనల్ను ఉద్ధరించినట్లు భావిస్తాయి. మన యూనియన్స్‌ నాయకులు దానికే హర్షం ప్రకటించడం, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడం లాంటివి చేస్తారు.”

“లెట్‌ నేచర్‌ బి యువర్‌ టీచర్‌” అన్నాడు విలయం వర్డ్స్‌వర్త్‌ నిస్వార్థంగా, మానవ జాతికి ప్రకృతి లాగానే సేవ చేసేవాడే నిజమైన ఉపాధ్యాయుడు. జైహింద్‌!” అని ముగించాడు పతంజలి.

“ప్రిన్సిపాల్‌గారిని ఈ సందర్భంగా ఒక మంచి పాట పాడాలని సభాముఖంగా కోరుతున్నాము” అన్నాడు సివిక్స్‌ మాస్టారు దేవుడు. పతంజలి బాగా పాడతాడని అందరికీ తెలుసు.

‘రుద్రవీణ’ సినిమాలో యస్‌పి. బాలసుబ్రమణ్యం గారు పాడిన

“చుట్టూ పక్కల చూడరా, చిన్నవాడా!

చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా! అనే పాట పాడి వినిపించాడు.

మళ్లీ చప్పట్లు!

పదిహేను రోజులకొక సారి హైదరాబాద్‌ వెళ్లి వస్తున్నారు. బుజ్జమ్మ సి.పి.టి ఎంట్రన్స్‌ పాసయింది. రెండువందలకు నూట నలభై ఎనిమిది మార్కులు సాధించింది. కోర్సులో మొదటి భాగం కోచింగ్‌ ప్రారంభించారు.

భరత్‌కు పెళ్లయింది. ప్రొద్దుటూరు అమ్మాయే పేరు నీరజ. డిగ్రీ వరకు చదువుకుంది. వాళ్లు ‘సఫిల్‌గూడ’లో కాపురం పెట్టారు.

పెంటయ్య మాస్టారు పతంజలికి మరీ దగ్గరయ్యాడు. బ్యాచిలర్‌ కాబట్టి రాత్రిళ్లు పతంజలికి తోడుగా పడుకుంటాడు. ప్రిన్సిపాల్‌ గారితో ఎంత సేపు  మాట్లాడినా తనివి తీరదంటాడు. ఒకరోజు పతంజలిని అడిగాడు.

“సార్‌ ప్రతి భాషలో ప్రాంతాన్ని బట్టి ‘యాస’ మారిపోతూంటాది కదా! మన తెలుగులో ఏ ‘యాస’ గొప్పదంటారు?”

“అన్నీ సమానమే. భాష మన భావాన్ని వ్యక్తం చేయడానికి మనం వాడే సాధనం ప్రాంతాన్ని బట్టి ఆయా ప్రజల అర్టికులేషన్‌ ఏర్పడుతుంది. చిన్నప్పట్నుంచి వినడం వల్ల ‘ఎక్స్‌పోజర్‌’ ఏర్పడుతుంది. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా ఆ ప్రభావం పోదు. మీరు ‘ఏటి?’ అంటారు. కొన్ని జిల్లాల్లో ‘ఏంటి’? ‘ఏమిటి’? అంటారు మేము ‘ఏంది?’ అంటాము ఏది గొప్పది? అంటే ఏం చెబుతాం?”

“జార్ట్‌ బెర్నార్డ్‌షా మహా నాటక రచయిత ‘పిగ్మేలియన్‌’ అని ఒక నాటకం వ్రాశాడు. కేవలం ఆంగ్లభాషలోని అన్ని డయలెక్ట్స్‌  అంటే యాసలు అన్నీ సమానమే. అన్న విషయం నిరూపించటానికే ఆ నాటకం వ్రాశాడాయన”

“వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే నన్నా” అన్నాడు జ్ఞాన పీఠ పురస్కారం అందుకున్న మన సి.నా.రె.”

“సార్‌! ఇంగ్లీషును మనం బ్రిటిషర్స్‌ లాగా మాట్లడేమని, ఆమెరికన్స్‌ లాగా పలకలేమని వాళ్లు మనల్ను ఎగతాళి చేస్తారట కదా!”

“ఐ పిటీ దెం. మన తెలుగును వాళ్లు మనలా పలుకగలరా? నీవు పానుగంటివారి సాక్షి ఉపన్యాసాలు చదివే ఉంటావు. ఇదే విషయాన్ని ఆయన తనదైన శైలిలో వ్యంగ్యంగా చెప్పాడు. మధ్యాహ్నిక సంధ్యావందనంలో, అర్ఘ్య ప్రదానమంత్రం ఒకటుంది. దాన్ని నేర్చుకొని యధాతథంగా పలకడానికి సంవత్సరం టైం ఇస్తానని, అయినా మీరు పలకలేరని సవాలు విసుర్తాడు జంఝాలశాస్త్రి. చాలా క్లిషమైన ఉచ్ఛారణతో కూడి ఉంటుందా మంత్రం. అలాంటి వాటిని “టంగ్‌ ట్విస్టర్స్‌” అంటారు ఇంగ్లీషులో.

“ఏదీ ఒక్కసారి ఆ మంత్రాన్ని అనండి!”

“హగ్‌ం సస్యుచిషత్‌, వసురంతరిక్షసత్‌

హోతావేదిషతు, అతిధిర్దురోణసత్‌

ఋషద్వర సద్వృత సద్వ్యోమ సదబ్జా

గోజా ఋతజా అద్రిజార్‌తం బృహత్‌।”

సుస్వరంగా, ఉదాత్తానుదాత్తాలతో పతంజలి మంత్రం చెప్పడం విని పెంటయ్య ఉత్తేజితుడైనాడు.

“బాబోయ్‌!” అన్నాడు. “మాస్టారూ! ఈ మంత్రం నాకు నేర్పించరా!” అని అడిగాడు.

“తప్పకుండా” అన్నాడు పతంజలి. ఒక కాగితం మీర రాయించుకున్నాడు పెంటయ్య. వారం రోజుల పాటూ, రోజూ మూడు నాలుగు సార్లు పలికించుకొని చక్కగా నేర్చుకున్నాడు.

***

రెండేళ్లు గడిచాయి. ప్రద్యుమ్న కంపెనీ మారాడు. ‘డెల్‌’లో చేరాడు సంవత్సరానికి లక్షరూపాయల హైక్‌తో. ప్రజ్ఞ సి.ఎ. పార్ట్‌ వన్‌ పూర్తి చేసుకొని, ఫైనల్‌ ప్రిపేరవుతూంది. ‘శాస్త్రి అసోసియేట్స్‌’ వద్ద ఆర్టికల్స్‌ పూర్తి చేసింది. ఫైనల్‌కు కావలసిన మెటీరియలంతా ఇచ్చారు.

పతంజలి హైదరాబాదుకు వచ్చినపుడు నాన్నకు కాళ్లు పడుతూ చెప్పింది బుజ్జమ్మ.

“డాడమ్మ డాడీ!” ప్రేమగా అప్పుడప్పుడలాపిలుస్తుంది.

“చెప్పురా” అన్నాడు నాన్న.

“మనం వనస్థలిపురంలో మన సొంతింటికి వెళ్లిపోదాం! ఇన్‌స్టిట్యూట్‌తో పెద్దగా అవసరంలేదు. బి.కాం కూడe అయిపోయింది. ఇక్కడ అనవసరంగా పదివేలు అద్దె కట్టుకోవడం ఎందుకు?”

వసుధ కూడ కూతుర్ని బలపరచింది. వెంటనే ఇల్లు ఖాళీ చేయించారు. మంచిరోజు చూసుకొని వనస్థలిపురానికి మారిపోయారు. పతంజలి రెండురోజులుండి ‘ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌’లో విజయనగరం వెళ్లి యస్‌ కోటకు చేరుకున్నాడు.

ప్రిన్సిపాల్స్‌ అసోసియేషన్‌ మీటింగ్‌ హైదరాబాదులో ఏర్పాటు చేశారు. పతంజలి కూడా వచ్చాడు. ‘స్వామి కార్యం స్వకార్యం’ రెండూ కలిసి వస్తాయి. కదామరి.

నాంపల్లిలోని ‘గోపి’ హోటల్లో ఏర్పాటు చేశారు. మీటింగ్‌ తర్వాత లంచ్‌ చేస్తున్నారందరూ. జనరల్‌ సెక్రెటరీ గోవిందరావును కలిసి విష్‌ చేశాడు.

“అన్నా, బాగున్నావా!” అని పలుకరించాడు.

“శర్మగారూ! ఇప్పుడు ఎక్కడ? “

“యస్‌. కోట అన్నా”

“పిల్లలేం చేస్తున్నారు?”

చెప్పాడు. ఫ్యామిలీ హైదరాబాదులో ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యపోయాడాయన.

“ఒక్కరే ఇబ్బంది పడుతున్నారా పాపం! బోర్డుకు డిప్యూటేషన్‌ మీద రావచ్చు కదా! ఐదేండ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చు. మీరు సరే నంటే ట్రై చేద్దాం.”

“అంతకంటేనా అన్నా మీ పుణ్యామా అని ఫ్యామిలితో ఉంటాను”

“మీకెంత సర్వీసుందింకా”

“ఆరేళ్లు”

“గుడ్‌. నాకు బోర్డు సెక్రటరీ గారిని అడ్రస్‌ చేస్తూ ఒక రిప్రజెంటేషన్‌ రాసి యివ్వండి. కొంచెం ఫార్మాలిటీస్‌ మీటవ్వాల్సింటుంది మరి”

“తప్పకుండా అన్నా” అని అప్పటికప్పుడు రిప్రజెంటేషన్‌ రాసిచ్చాడు.

“టచ్‌లో ఉండండి” అని చెప్పాడాయన.

మధ్యలో రెండుసార్లు కలిసినప్పుడు అంతా సానుకూలంగా ఉందనీ, సెక్రటరీ గారు అంగీకరించారనీ, బోర్డు ఛైర్మన్‌ ఎడ్యుకేషన్‌ మినిస్టరుగారిని కూడ కలిశానానీ చెప్పాడాయన ప్రిన్సిపల్‌ సెక్రటరీ దగ్గరికి ఫైలు వెళ్లిందట.

పదివేలు అడిగి తీసుకున్నాడు పతంజలి దగ్గర. “ఆర్డర్స్‌ వచ్చిన తర్వాత మరో పది ఇవ్వండి” అని చెప్పాడు.

గోవింద రెడ్డి మంచి అకడమీషియన్‌ వక్త, వరల్డ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సభ్యుడు. పతంజలి ఈసారి వచ్చినపుడు కలుద్దామని వెళితే సభలకు జర్మనీ వెళ్లాడని రావడానికి వారం రోజులు పడుతుందని చెప్పారు.

నాలుగు రోజుల తర్వాత పతంజలి క్లాసులో ఉండగా, డి.వి.ఇ.వో (డిస్ట్రిక్ట్‌ వొకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌) గారు లైన్లో ఉన్నారు వెంటనే రమ్మన్నారని అటెండర్‌ చెప్పాడు.

పరుగున వెళ్లి రిసీవర్‌ తీసుకున్నాడు.

“నమస్కారం సార్‌! చెప్పండి” అన్నాడు వినయంగా. ఆయన పేరు జోగినాయుడు.

“శర్మగారూ! కంగ్రాచ్యులేషన్స్‌! ఒక శుభవార్త చెబుదామని ఫోన్‌ చేశాను”

“ఏమిటిసార్‌!”

“మీకు డెపుటేషన్‌ మీద డిప్యూటీ సెక్రటరీగా ఇంటర్మీడియట్‌ బోర్డుకు వేశారు. ఇప్పుడే ఫ్యాక్స్‌లో ఆర్డర్సు వచ్చాయి”

పతంజలి తన చెవులను తానే నమ్మలేకపోయాడు.

“ధ్యాంక్యూ సార్‌!” అన్నాడు ఉద్వేగంగా.

“వెంటనే వెలిపొచ్చేయండి. ఆర్డర్స్‌ తీసుకుందురుగాని ఆలస్యం చేయకుండా జాయినైపోండి. బోర్డు వ్యవహారం ఎలా ఉందంటే రాత్రికి రాత్రే ప్రయారిటీస్‌ మారుతుంటాయి. ఎవరు మన గోవింద రెడ్డేనేంటి?”

“అవును సార్‌!”

“అతను పూనుకున్నాడంటే తిరుగుండదు లేండి”

వెంటనే వసుధకు ఫోన్‌ చేశాడు. అప్పటికి సెల్‌ ఫోన్లు రాజ్యమేలుతున్నాయి.

“వసుధా! మనకు హైదరాబాదు బోర్డుకు డెపుటేషన్‌ ఇచ్చారు” అన్నాడు సంతోషంగా.

“నిజమా బావా! ఎంత మంచివార్త చెప్పారు! రియల్లీ గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌” అన్నదామె.

“గాడ్‌ ఈజ్‌ అల్వేస్‌ గ్రేట్‌ వసుధా” అన్నాడు. “ఆర్డర్స్‌ తీసుకోడానికి విజయనగం వెళుతున్నాను రేపే రిలీవ్‌ అవుతాను. రేపు రాత్రికి బయలు దేరతాను మళ్లీ ఫోన్‌ చేస్తాలే”

స్టాఫ్‌ అందరూ అభినందనలు తెలిపారు. వెంటనే బస్‌లో విజయనగరం చేరుకున్నాడు. జోగినాయుడుగారు పతంజలి కోసం ఎదురు చూస్తున్నారు.

“రండి మాస్టారు!” అంటూ ఆహ్వానించాడు.

సూపరింటెండెంట్‌ వరదయ్య వచ్చి, అపాయింట్‌మెంట్‌ ఆర్డరు ఇచ్చాడు. ఆఫీస్‌ కాపీ మీద పతంజలి సంతకం తీసుకున్నాడు. ఆర్డర్‌లో ‘ఒక సంవత్సరానికి గాను పారిన్‌ సర్వీసు క్రింద డెప్యూటీ సెక్రటరీగా బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌కు డిప్యూట్‌ చేస్తున్నట్లు’ ఉంది.

***

డి.వి. ఇ.వో గారి నడిగితే, “అవును అలాగే యిస్తారు. అక్కడ మీ పని తీరును బట్టి ప్రతి సంవత్సరం ఎక్సటెన్షన్‌ యిస్తారు. ఐదేళ్ల తర్వాత ఒక్కరోజు కూడ ఉంచరు. రిపాట్రియేట్‌ చేస్తారు” అన్నాడాయన.

ఆయన వద్ద సెలవు తీసుకొని యస్‌.కోటకు వచ్చేశాడు. తాను డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ ఆఫీసరు కాబట్టి (డిడిఓ) తనను తానే రిలీవ్‌ చేసుకునే అధికారం ఉంది.

మర్నాడు సీనియర్‌ మోస్ట్‌ జె.యల్‌. బాటనీ మాస్టారు ‘పైడితల్లినాయుడు” గారికి ఛార్జ్‌ హాండోవర్‌ చేశాడు సామాను పెద్దగా లేదు. మంచం, పరుపు, స్టవ్‌, పోర్టబుల్‌ టివి లాంటివి. అటెండరు కిచ్చేశాడు. మూడు గంటలకు వీడ్కోలు సభ జరిగింది. పతంజలిని ఘనంగా సన్మానించారు. బట్టలు పెట్టారు. పిల్లలు గ్రూప్‌, సెక్షన్‌ వైపు రకరకాల బహుమతిలిచ్చారు ప్రిన్సిపాల్‌ గారికి.

పెంటయ్య మాట్లాడుతూ “నాకు గురువు, స్నేహితుడు, వేదాంతి, మార్గదర్శకుడు మన ప్రిన్సిపాల్‌గారు. నన్ను తమ్ముడిలా ఆదరించారు. విశాల దృక్పథం మాటల్లో కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి..” అని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. పతంజలికి పాదాభివందనం చేశాడు. లక్ష్మీనరసింహుని వెండి ప్రతిమను బహూకరించాడు. స్టాఫంతా కలిసి అప్పటికప్పుడు ఎలా చేయించారో ఏమో ప్రిన్సిపాల్‌ గారికి బంగారు ఉంగరం వేలికి తొడిగారు.

గిఫ్ట్‌ లన్నీ ఒక అట్టపెట్టెలో ప్యాక్‌ చేశారు. రాత్రి ఎనిమిదిన్నరకు ‘ఫలక్‌నుమా’ విజయనగరానికి వస్తుంది. సామానుతో ఏడు ముప్పావుకు స్టేషన్‌ చేరుకున్నాడు. పెంటయ్యతో బాటు కొందరు లెక్చరర్స్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ సాంబమూర్తి కొందరు విద్యార్థులు స్టేషన్‌కు వచ్చారు.

హౌరా – సికింద్రాబాద్‌ రైలది. సూపర్‌ ఫాస్ట్‌ హాల్ట్స్‌ చాలా పరిమితం. సికింద్రాబాద్‌ నుండి గుంటూరు వరకు ఎక్కడా ఆగదు. అట్లే విశాఖ విజయవాడల మధ్య రెండే హాల్ట్స్‌ సామర్లకోట, రాజమండ్రి.

ట్రెయిన్‌ ఇరవై నిమిషాలు లేటుగా వచ్చింది. రెండు నిమిషాలే ఆగుతుంది విజయనగరంలో. ఒక స్లీపర్‌ కోచ్‌ నుండి టి.టియి. దిగితే ఆయను రిక్వెస్ట్‌ చేశారు. “యస్‌ ట్వల్వులో ఎక్కడయినా సర్దుకోండి. వైజాగ్‌లో చూద్దాం” అన్నాడాయన.

పతంజలి రైలెక్కి డోర్‌ వద్ద నిలుచున్నాడు.

“మాస్టారూ! ఉంటామండి”

“జాగ్రత్త మాస్టారు”

“చేరగానే ఫోన్‌ చేయండి”

“మమ్మల్ని మరచిపోకండి సార్‌!”

చెబుతూనే ఉన్నారు. పతంజలి కళ్లనీళ్లు తిరిగాయి. రైలు కదిలింది. పెంటయ్య పతంజలి చేయిని ముద్దు పెట్టుకున్నాడు. వదలకుండా రైలుతో పాటు నడుస్తున్నాడు. వేగం అందుకుంటూండగా వదిలేశాడు.

తొమ్మిదిన్నరకు వైజాగ్‌ వచ్చింది టిటియి మిడిల్‌ బెర్త్‌ అలాట్‌ చేశాడు. ప్రద్యుకు ఫోన్‌ చేసి బయలుదేరాననీ, యస్‌ 12 కోచ్‌ నంబరు అనీ చెప్పాడు. ప్లాటుఫాం మీద ఇడ్లీ వడ తిన్నాడు. చాలా రుచిగా అనిపించాయి. ‘బహుశా సంతోషం వల్లనేమో’ అనుకొని నవ్వుకున్నాడు.

‘తన సంతోషమె స్వర్గము

తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ!’ అన్న పద్యం గుర్తొచ్చింది.

మర్నాడు సికింద్రాబాద్‌కు ఉదయం తొమ్మిదిన్నరకు చేరుకుంది ‘ఫలక్‌నుమా’. ప్రద్యు కోచ్‌లోకి ఎక్కి తండ్రి దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు.

“ఎందుకు నాన్నా! ఆటోలో వచ్చేసేవాడిని గదా!” అంటే

“అటుచూడు. ఎవరొచ్చారో” అన్నాడు వాడు.

కిటికీలోంచి వసుధ, బుజ్జమ్మ నవ్వుతూ చేతులూపుతున్నారు. వారి కళ్లు వెలుగుతున్నాయి.

“ఏమిటి అందరూ వచ్చేశారు!” అన్నాడు ఆనందంగా.

“డాడమ్మడాడీ! వెల్‌కం టు హైద్రాబాద్‌” అన్నది బుజ్జమ్మ.

“నెలకు రెండుసార్లు వచ్చి పోతూనే ఉన్నాను కదరా తల్లీ” అన్నాడు.

“అది వేరు. ఇక మళ్లీ వెళ్లనవసరం లేకుండా వచ్చేశారు కదా బావా!” అన్నది వసుధ.

వనస్థలిపురానికి ట్యాక్సీ మాట్లాడాడు ప్రద్యు. అందరూ యిల్లు చేరుకున్నారు టాక్సీలోనే గోవిందరెడ్డికి ఫోన్‌ చేశాడు పతంజలి. ఆయన నిన్న రాత్రే జర్మనీ నుండి వచ్చాడట.

“శర్మగారూ! అభినందనలు. ఈరోజే జాయినవండి. మధ్యాహ్నం ఒంటిగంటలోపు. నేనూ బోర్డుకు వస్తాను. మిమ్మల్ని మనవాళ్లందరికీ పరిచయం చేస్తాను” అన్నాడాయన.

స్నానం, భోజనం ముగించుకొన్నాడు. ప్రద్యు బండిమీద యన్‌.జివోస్‌ కాలనీ బస్టాండులో దింపాడు. 156వి మెహదీపట్నం వెళ్లే బస్సు రడీగా ఉంది. నాంపల్లి చేరడానికి సరిగ్గా ముప్పావుగంట పట్టింది. గోపి హోటల్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడింది. పతంజలి నాంపల్లి స్టేషన్‌ వద్గ దిగుదామని కూర్చుని ఉన్నాడు.

కండక్టర్‌ అరిచాడు. “పబ్లిక్‌ గార్డెన్స్‌ వరకు స్టాప్‌ లేదు. నాంపల్లి వాళ్లు దిగాల”.

పతంజలి దిగి చేనేత భవన్‌ దగ్గర కుడివైపుకు తిరిగాడు. ప్రక్క భవనమే ఇంటర్మీడియట్‌ బోర్డు. దాని ప్రక్కనే కమీషనరేట్‌. మధ్యలో చిన్న సందు. దానిగుండా వెళితే నాంపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వస్తాయి.

గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్లున్నారు. పతంజలిని ఆపి, “తీన్‌ బజేకీ బాద్‌ అందర్‌ జాసక్‌తే. అబ్‌ నహీ” అన్నారు. తాను కొత్తగా వచ్చిన డి.ఎస్‌నని చెప్పగానే సెల్యూట్‌ చేసి

“మాఫ్‌ కజియేసాబ్‌” అని చెప్పారు.

నాలుగంతస్తుల భవనం ‘ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఆంప్ర.’ అని తెలుగులో ఇంగ్లీషులో, ఉర్దూలో వ్రాసి వుంది. లోపలికి వెళుతూనే కుడివైపు ‘జె.కిషన్‌ ప్రసాద్‌ సంయుక్త కార్యదర్శి (పరిపాలన)’ అన్న నేమ్‌ ప్లేట్‌ ఉన్న రూము కనిపించింది. వెళ్లి తలుపు వద్ద నిలుచుని, “మే ఐ కమిన్‌ సర్‌!” అని అడిగి లోపల ప్రవేశించాడు. తనను తాను పరిచయం చేసుకొని, ఆర్డర్స్‌ ఆయనకిచ్చాడు. “మీరేనా, పతంజలి శర్మ! వెల్‌కం! వెల్‌కం! మీరియ్యాల వస్తరని ఇంతజార్‌ జెయవట్తిమి. రాండ్రి కూసోండ్రి” అన్నాడాయన. ఆర్డర్‌మీద ఇనీషియల్స్‌ వేసి “సెక్రెటరీగారి కలిసి రాండ్రి” అన్నాడు. ఒకతన్ని పంపాడు సెక్రెటరీ గారి పేషీ చూపడానికి.

“సార్‌ గిప్పుడే అచ్చిండు. మీరు యాడికెల్లి  వస్తున్రు సార్‌” అన్నాడతడు. అతని పేరు జాఫర్‌ అట. జె.యస్‌ (అడ్మిన్‌) సారు కాడ అటెండరట.

పేషీలో సెక్రటరీ గారి పి.ఎ. కూర్చుని రెండు మూడు ఫోన్లు ఒకేసారి మాట్లాడుతున్నాడు. పేషీ ప్రక్కనే తలుపు మూసి ఉంది. గోడకు కాఫీ కలర్‌ వుడెన్‌ ప్లాంక్‌ మీద “జయశీల్‌ సిసోడియా, ఐ.ఎ.ఎస్‌. కార్యదర్శి” అని బంగారు రంగులో అక్షరాలు మెరుస్తున్నాయి.

పి.ఎను కలిశాడు. అతడు యువకుడే. మైసయ్య. పతంజలికి షేక్‌ హ్యాండిచ్చి, కూర్చోబెట్టాడు.

“లోపట తెలుగు అకాడమీ డైరెక్టరు గారున్నారు. ఆయన రాంగనే మిమ్ముల్ను పంపిస్త” అన్నాడు.

పదినిమిషాల తర్వాత ఆయన వెళ్లిపోయాడు. ‘పోండ్రి సార్‌. కాలర్‌ కింద బటన్‌ పెట్టుకోండ్రి. ఒక్కోసారి సారు గుస్సా అయితడు” అన్నాడు మైసయ్య.

పతంజలి తలుపు తోసుకొని లోపలికి అడుగు పెట్టాడు. చల్లగా ఉంది లోపల. క్రింద మెత్తని కార్పెట్‌ ఉంది చాలా పెద్ద ఛాంబరు. పెద్ద రోజ్‌ వుడ్‌ టేబుల్‌ వెనుక ఎగ్జిక్యూటివ్‌ ఛెయిర్‌లో కూర్చుని ఉన్నాడు సెక్రటరీ.

వినయంగా నమస్కరించాడు. ఆర్డరు ఇచ్చాడు.

ఆయన దాని మీద గ్రీన్‌ యింక్‌తో JS (Admin) Put up అని వ్రాసి ఇనీషియల్‌ వేశాడు.

“వర్క్‌ హార్డ్‌ అండ్‌ అప్‌ హోల్డ్‌ ది ప్రిస్టేజ్‌ ఆఫ్‌ ది బోర్డ్‌!” అన్నాడాయన గంభీరంగా. నలభై ఐదేళ్లుంటాయేయో తెల్లగా బొద్దుగా ఉన్నాడు.

“అలాగే సార్‌” అన్నాడు పతంజలి. ఇంకా ఏమయినా చెబుతాడేమో అని ఎదురుచూస్తూ నిలబడ్డాడు.

“యు కెన్‌ గో” అన్నాడాయన.

మళ్లీ కిషన్‌ ప్రసాద్‌ దగ్గరకి వెళ్లేసరికి, గోవిందరెడ్డి ఆయన దగ్గర కూర్చొని ఉన్నాడు. పతంజలిని చూసి స్నేహపూర్వకంగా నవ్వాడు.

పతంజలిని తీసుకొని లిఫ్ట్‌లో అంతస్తులన్నీ తిరిగి, డియస్‌.లను జె.ఎస్‌లను పరిచయం చేశాడు. తెలంగాణా వాళ్లే కాక ఆంధ్ర రాయలసీమ వాళ్లు కూడ ఉన్నారు. ఆఫీసర్లందరూ డెప్యుటేషన్‌ మీద వచ్చిన వారే. COE (కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్జామినేషన్స్‌) వారి ఛాంబర్‌కు తీసుకువెళ్లాడు. గోవిందరెడ్డి. ఆమె పేరు ‘సౌభాగ్యలత’. ఆమె చాలా పెద్దావిడ. నెక్ట్స్‌ యియర్‌ రిటైరవుతారట. ఆమె మొదట జె.యల్‌గా అనంతగిరిలో చేశారట. డి.వి.ఇ.వోగా అనంతపురం జిల్లాలో చేశారట. ఆర్‌.జె.డి క్యాడర్‌లో డిప్యూషన్‌మీద COE గా వచ్చాడు.

“మీకేం ఇబ్బంది ఉండదమ్మా! అంతా ఒక కుటుంబంలాగా ఉంటామిక్కడ!’ అన్నదామె అందర్నీ అమ్మా అంటుందని అర్థమయింది.

క్రిందకు వెళ్లి అడ్మిన్‌ను కలిస్తే, సెక్రటరీగారు పతంజలికి డి.యస్‌ (పబ్లిక్‌ అండ్‌ ప్రెస్‌ రిలేషన్స్‌), పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసరు  (రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌ (ఇన్‌ఛార్జి)గా చేయమని చెప్పారని చెప్పారు. ఆ మేరకు వేరే ఆర్డర్స్‌ ఇచ్చారు.

పతంజలి ఛాంబర్‌ చూపించారు. జాయినింగ్‌ రిపోర్టు తీసుకున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉంది. అతని గదిలోంచి చూస్తే వరుసగా ఆరు కౌంటర్లున్నాయి ప్రతి కౌంటరు వద్ద స్టాఫ్‌ పనిచేస్తున్నారు. పతంజలి తన ఛైర్లో కూర్చోగానే ఒకాయన వచ్చి నమస్కరించాడు. ఆయన వెంట అందరూ వచ్చి విష్‌ చేశారు.

“సార్‌! నా పేరు రాములు. సూపరింటెండెట్‌ని. ఇతను లక్ష్మణ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌. వీళ్లంతా కంప్యూటర్‌ ఆపరేటర్లు. కౌంటర్స్‌ దగ్గర ఉంటారు. ఈయన హబీబ్‌ అహ్మద్‌. ఆఫీస్‌ సబార్డినేట్‌. మనకు ఇంకో రూముంది సార్‌ అక్కడ ఫ్యాక్స్‌ మిషన్‌ ఉంది. ఆర్‌.టి.ఐ ఫైల్సన్నీ అక్కడే ఉంటాయి. మనం మైగ్రేషన్‌ సర్టిఫికెట్స్‌ యిష్యూ చేస్తాము. సైనింగ్‌ ఆధారిటీ మీరే. నేమ్‌ కరెక్షన్‌, డూప్లికేట్‌ మార్క్‌ మెమో, డూప్లికేట్‌ సర్టిఫికెట్స్‌, తత్కాల్‌ ఫీజు కలెక్షన్‌ అన్నీ పబ్లిక్‌ నుండి అప్లికేషన్లు తీసుకుంటాం సార్‌. అవి సెక్షన్‌లకు పంపి, తయారయిన తర్వాత పబ్లిక్‌కు ఇస్తాం.

ఇవిగాక ప్రెస్‌ రిలీజెస్‌ ఉంటాయి. న్యూస్‌ పేపర్లకు. టీ.వి ఛానళ్లకు ఫాక్స్‌లో పంపుతాం. సెక్రటరీ సార్‌ ప్రెస్‌మీట్‌ పెడితే అందరినీ పిలవాలి విలేఖరులను. వారికి టీ, స్నాక్స్‌ ‘జె’ సెక్షన్‌ వాళ్లకు చెప్పి ఏర్పాటు చేయించాలి. ఇరవై మూడు జిల్లాల ఆర్‌.ఐ.ఓ. లు (రీజనల్‌ ఇన్‌స్పెక్టింగ్‌ ఆఫీసర్లు) ప్రతినెలా మీటింగ్‌కు వస్తారు. మీరే మినిట్స్‌ వ్రాయాలి. జిల్లాల ఆర్‌టిఐ డేటా కూడ మనమే కన్సాలిడేట్‌ చేసి సమాచార కమీషన్‌కు సబ్మిట్‌ చేయాలి.

బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మనముంటాం. యస్‌.యఫ్‌.ఐ., ఎ.బి.వి.పి. లాంటి సంఘాలు ధర్నాలు చేస్తాయి. అప్పుడు పోలీసులకు ఇన్‌ఫర్‌మేషన్‌ యిచ్చి బందోబస్తుకు పిలవాలి. రిజల్టు అనౌన్స్‌ చేసేటప్పుడు ఏర్పాట్లు మనమే చేయాలి. రిజల్టు తర్వాత రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం వేల సంఖ్యలో అప్లికేషన్స్‌ వస్తాయి. కౌంటర్లలో ఇచ్చే వారు పోస్టులో పంపేవారు అందరివీ స్ట్రీమ్‌లైన్‌ చేయాలి. మీరు కొత్త కాబట్టి చెబుతున్నాను. మరేం అనుకోకండి సార్‌!” అన్నాడు రాములు.

(సశేషం)

Exit mobile version