[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[హైదరాబాద్‌లో తోడల్లుడి ఇంటి దగ్గరగానే స్థలం కొంటాడు పతంజలి. వసుధతో మాట్లాడి ఆ స్థలంలో ఇళ్ళు కట్టడానికి అంగీకరిస్తాడు. మంచి మేస్త్రీ దొరికి నిర్మాణం మొదలవుతుంది. అక్కడి పనులన్నీ పూర్తి చేసుకుని ఊరికి చేరుతాడు. ప్రద్యు ఇంటికి వస్తాడు. మ్యాట్ రాంకుకి అనుగణంగా పూణేలోని ఒక కాలేజీలో ఎంబిఎస్ సీటు వస్తుంది ప్రద్యుకి. మల్లినాధకి సంబంధం దొరుకుతుంది. మార్కండేయశర్మని వృద్ధాప్యం కృంగదీస్తుంది. పతంజలి బలవంతపెట్టిన కారణంగా శ్రీకాకుళం వస్తాడాయన. మధ్యలో పతంజలి హైదరాబాద్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి వస్తాడు. తండ్రి సింహాచలం చూపించమంటే, వెళ్ళి దర్శనం చేసుకుంటారు. గురజాడ కళామందిర్ లో శంకరన్‌నంబూద్రి కచేరి విని ఆనందిస్తారు. తండ్రి రాయాలనుకున్న పుస్తకాన్ని తండ్రి చెబుతుంటే రాసి పెడతాడు పతంజలి. దాన్ని ఇంగ్లీషులోకి అనువదించడానికి తండ్రి అనుమతి తీసుకుంటాడు. మల్లినాధ పెళ్ళి జరుగుతుంది. రెండేళ్ళు గడిచాయి. హైదరాబాదులో పతంజలి ఇల్లు పూర్తవుతుంది. గృహప్రవేశం చేసి అద్దెకి ఇస్తారు. ప్రద్యుమ్నకి హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది. ప్రజ్ఞ ఇంటర్ పాసవుతుంది. తనకి సి.ఎ. కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ పంపాలి, అందుకు ఫ్యామిలీని హైదరాబాద్‌కు మార్చి తాను ఒక్కడూ యస్.కోటలో ఉంటాడు. ఎస్.కోట కాలేజీలో తెలుగు లెక్చరర్ పెంటయ్యతో పతంజలికి సాన్నిహిత్యం పెరుగుతుంది. భరత్‍కి పెళ్ళవుతుంది. కాలం గడుస్తుంది. ప్రద్యుమ్న ‘డెల్’ లో చెరుతాడు. ప్రజ్ఞ సి.ఎ. పార్ట్ వన్ పూర్తి చేస్తుంది. ఆమె కోరికపై వనస్థలిపురంలో తమ సొంత ఇంటికి మారిపోతారు. ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ మీటింగ్ హైదరాబాదులో జరిగితే పతంజలి హాజరవుతాడు. అక్కడ జనరల్ సెక్రటరీ గోవిందరావు సూచనపై ఇంటర్మీడియట్ బోర్డుకి డిప్యుటేషన్ మీద రావడానికి అర్జీ పెట్టుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆర్డర్స్ వస్తాయి. ఎస్.కోటలో రిలీవ్ అయి హైదరాబాద్ చేరుతాడు. ఇంటర్మీడియట్ బోర్డులో కొత్త ఉద్యోగంలో చేరుతాడు పతంజలి. తన కార్యాలయంలోని సూపరింటెండెంట్ రాములు – పతంజలి ఉద్యోగ బాధ్యతలను వివరిస్తాడు. – ఇక చదవండి.]
[dropcap]“త[/dropcap]ర్వాత స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లన్నీ ఉదయం మీ దగ్గరే ఉంటాయి. పదిన్నరకు మన ఆఫీసు. పదకొండు లోపు సంతకాలు అవ్వాలి. తర్వాత జి.యస్ అడ్మిన్‌గారి దగ్గరకు వెళతాయి. నాలుగు రోజులు పోతే మీకే అలవాటవుతుంది లెండి”
ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు పతంజలి.
సాయంత్రం నాలుగు గంటలకు మైగ్రేషన్ సర్టిఫికెట్స్ తెచ్చి పెట్టారు. అవన్నీ ఎంటర్ చేసిన రిజిష్టరుతో సహా. అన్నీ చెక్ చేసి డిప్యూటీ సెక్రటరీ అని ఉన్నచోట గ్రీన్ ఇంక్‌తో సైన్ చేశాడు. అతని సంతకం చివరిది మొదటి రెండూ జూనియర్ అసిస్టెంట్, సూపర్నెంట్ పెట్టి ఉన్నారు.
ఐదున్నరకు సెక్రటరీగారు వెళ్లిపోయారు. చాలామంది స్టాఫ్ వచ్చి పలుకరించి వెళ్లారు. ఆరుగంటలకు గాంధీభవన్ వద్ద సెక్రటేరియట్ నుండి వస్తున్న బస్ ఎక్కి, వనస్థలిపురం చేరుకున్నాడు. తొలిరోజు బోర్డులో పతంజలికి ఈ విధి నిర్వహణ కొత్తగా ఛాలెంజింగ్‌గా కనిపించింది.
రెండో రోజు సకాలానికి ఆఫీసుకు చేరుకున్నాడు. అతనికి ఒక సెల్‌ఫోన్ ఇచ్చారు. ప్రెస్, పోలీస్, డి.ఎస్. జె.ఎస్.ల నంబర్లన్నీ ఫీడ్ అయి ఉన్నాయి. అదిగాక టేబుల్ మీద ఇంటర్‌కం ఉంది. ప్రతి సెక్షన్ నంబరు టైప్ చేసిన కాగితం ఫోన్ దగ్గరే గోడకు అతికించి ఉంది.
ఇఆర్‌టిడబ్లూ (ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ వింగ్) అని థర్డ్ ఫ్లోర్‌లో ఉంది. సిలబస్, టెక్ట్స్ బుక్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, ఆడియో విజువల్ సెల్, ఈక్వలెన్సీ అండ్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ ఇష్యూ లాంటి పనులు నిర్వహిస్తుందా విభాగం. ఒక ప్రొఫెసర్, ఇద్దరు రీడర్స్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పనిచేస్తున్నారు. అందరూ జెఎల్స్ లేదా ప్రిన్సిపాల్సే, డెపుటీషన్ మీద వచ్చిన వారే. అందరూ పరిచయమయ్యారు. క్రిందికి వెళ్లి కూర్చున్నాడు. ‘నరిసిమ్మ’ అనే కుర్రవాడు టీ తెచ్చియిచ్చాడు. రోజు ఉదయం 11 గంటలకు సాయంత్రం 3 గంటలకు తెస్తాడట. నెల చివరల్లో డబ్బులు తీసుకుంటాడట. టీ చాలా బాగుంది. రెండు రూపాయలు.
ఇంటర్‌కం మోగింది. అడ్మిన్‌గారు “ఒక్కసారి నా రూంకు వస్తారా?” అని అడుగుతున్నాడు. “వస్తున్నాను సార్!” అని చెప్పి ఆయన వద్దకు వెళ్లాడు.
అప్పటికే ఇద్దరు ఆయన ముందు కూర్చొని ఉన్నారు.
“రండి శర్మగారు. ఈన జె.యస్ ఎక్జామ్స్ -2 వెంకటపతిగారు. మీ వనస్థలిపురంలో ఉంటారు. ఈయన డి.యస్. వొకేషనల్. బషీర్‌గారు స్పెషల్ ఆఫీసర్ (ఉర్దూ) కూడ ఈయనే. ఈయన దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటారు. నిన్ననే మీకు చెబుదామనుకుని మర్చిపోయాను. మీరు ముగ్గురికీ ఒక వెహికల్ వస్తుంది. ఒకే రూట్లో ఉన్న ముగ్గురు ఆఫీసర్లుకు బోర్డు వెహికల్స్ అరేంజ్ చేస్తుంది. మీరు వీళ్లిద్దరితో కలిసి ఆఫీసుకు రావొచ్చు పోవచ్చు”
ఇద్దరూ పతంజలికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.
“వనస్థలిపురంలో మీరెక్కడసార్ ఉండేది?” అనడిగాడు వెంకటపతి.
“కమలానగర్ రోడ్ నంబర్ 8 లో సార్”
“ఒకే. అయితే కారు ముందు మీ యింటికే వస్తుంది. డ్రైవర్ నంబరు ఫీడ్ చేసుకోండి. మేం ఎప్.సి.ఐ. కాలనీలో ఉంటాం లెండి. మీయింటి నుండి మాయింటికి కి.మీ ఉంటుంది. మీరు తొమ్మిదిన్నరకల్లా రడీగా ఉండండి. తొమ్మిది నలభైకి మా ఇంటి దగ్గరకొస్తారు. దారిలో బషీర్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో ఎక్కించుకొని వచ్చేస్తాము.”
“ఒకే సార్ ధ్యాంక్యూ”
ట్రాన్స్‌పోర్ట్ సమస్య తీరినట్లే.
మర్నాడు కార్లో అన్నాడు వెంకటపతి
“కరెక్ట్‌గా సమయానికి జాయిన్ అయ్యారు మీరు”
“ఎందుకు సార్”
“వచ్చే నెల నుండి ఫుడ్ అలవెన్స్ పీరియడ్ స్టార్టవుతుంది”
“అంటే”
“ఎక్జామినేషన్ వర్క్ అన్నమాట జనవరి 20వ తేదీ నుండి జూలై ముఫై ఒకటి వరకు మార్చి, ఇన్‌స్టంట్ పరీక్షలు, వాటి రిజల్ట్సు, రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్, సర్టిఫికెట్స్ డిస్పాచ్‌తో ముగుస్తుంది. మనకు ఈ పీరియడ్‌లో సెలవులుండవు. ఆదివారాలు, పండుగల్లో కూడా రావాల్సిందే. దీనికిగాను మనకు స్పెషల్ అలవెన్స్ వస్తుంది. మన క్యాడర్‌లో ప్రతి సంవత్సరం మనకు లక్ష రూపాయల వరకు వస్తుంది”
‘బషీరన్న’ (ఆయన్నందరూ అలాగే పిలుస్తారు) అన్నాడు.
“నువ్వుండు నేను సమజాయిస్త” అని
“శర్మాజీ! బోర్డులో పని చేసినందుకు శాలా లాభం ఉన్నాయి. సిటీలో హెచ్.ఆర్.ఎ. 30 శాతం వస్తుంది. మనకు ఊర్లెల్ల యాడికెళ్లివస్తది? కానీ అది పన్నెండు వేలకు మించొద్దు (మించకూడదు). మన్కి కాలేజిల్ల వెకేషన్ డిపార్టుమెంటు గాబట్టి సంవత్సరానికి ఆరు ఇయల్‌లొస్తెశాన. సమ్మర్ ప్రివెన్షనని ఇంకో ఏడో ఎనిమిదిదో ఇస్తడు. బోర్డుల గట్లగాదు. సంవత్సరానికి 30 ఇ.ఎల్స్ పూరాగ వస్తయి. మనం ఎన్కకు బోయే తలికి బరాబర్ నూటయాభై క్రెడిటతయి మంచిగ”
వెంకటపతి అందుకున్నాడు.
“అంతేగాదు మనం చేసే ప్రతి అదనపు పనికి రెమ్యూనరేషన్ ఇస్తూనే ఉంటారు. పుడ్ అలవెన్స్ అని ఎదుకంటారో తెలుసాండీ? ఆ అమౌంట్ మనం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌లో చూపించాల్సిన పనిలేదు. లేకపోతే 20% వాడు నూక్కపోతాడు.”
పతంజలికి మొత్తం సమజైంది.
ఆఫీసు చేరుకున్నారు. కౌంటర్లవద్ద వర్క్ స్ట్రీమ్‌లైన్ చేశాడు. అఫిలియేషన్స్ గురించిన ప్రెస్ రిలీజ్ హబీబ్‌కు ఇచ్చి, ఫ్యాక్స్ చేయమన్నాడు. మైగ్రేషన్స్ జారీలో అటెండరు, కౌంటర్లోని వాళ్లు డబ్బు తీసుకుని లేటుగా సబ్మిట్ చేసినవారికి ఫేవర్ చేస్తున్నట్లు గమనించాడు. సున్నితంగా మందలించాడు.
జె.ఎస్ అకౌంట్స్ ఫోన్ చేస్తే వెళ్లాడు. అతని పేరు రామ సుబ్బన్న. కడప జిల్లావాడు.
“రాండి సార్! ఎట్లుంది ఈడ మీకు!” అని అడిగి “అతి పెద్ద టెండరు నోటీసు ప్రెస్ కివ్వాలి. ఆన్సర్ బుక్స్ ప్రింటింగ్. కేవలం నేషనల్ న్యూస్ పేపర్ల కేయివ్వాల. సెక్రెటరీగారి అప్రూవల్ అయింది. యాడ్ ఏజన్సీకి ఫోన్ చేయండి. మీరు రాకముందు ‘కంప్యూటర్ పెరిఫెరల్స్’ సప్లై కోసరం పోయిన నెలలో ఒక టెండర్ పిలిచాము. ఆ ఫైలు చూడండి. పది నిమిషాల్లో పంపిస్తాను. రేపు రావాలది” అని చెప్పాడు.
వచ్చి సీట్లో కూర్చున్నాడో లేదో ఒకతను వచ్చాడు. నుదుట బొట్టు గిరజాల జుట్టు.
“అన్నా, నమస్తేనే” అన్నాడు వస్తూనే. “నేను మిలేనియం యాడ్ ఏజెన్సీ కెల్లి వస్తున్ననే. నాపేరు భీమ శంకర్. నీవు జేరినవని దెల్సు. రానీకె గాలే టెండరున్నదట గద!”
అంత త్వరగా అతనికెలా తెలిసిందో అర్థం కాలేదు. రామసుబ్బన్న అటెండరుతో యు.ఓ. నోట్, టెండరు నోటీసు పంపిచాడు. సైన్ చేసి తీసుకున్నాడు.
“భీమశంకర్‌గారు, మీరు కాసేపు బయట విజటర్స్ గ్యాలరీలో కూర్చోండి” అని చెప్పాడు.
రాములుగారిని పిలిచి టెండర్ నోటీసుల ఫైల్ తెమ్మన్నాడు. అడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఎబిసి) వారి నివేదిక అందులో ఉంది. దాని ప్రకారం సర్కులేషన్ వివరాలున్నాయి. ప్రీవియస్ నోట్ చదివాడు. అర్థమయింది. 16’ I 18’ ఇంచెస్ యాడ్ వస్తుంది. దక్కన్ క్రానికల్ రీస్ట్ లో ఉంది. ‘ది హిందూ’ సౌత్‌లోనే ప్రాబల్యం. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా పోటీ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా టైమ్స్‌కు ఎడిషన్స్ ఎక్కువ.
వెంటనే పుటప్ చేయమని యు.ఓ నోట్ మీద రాసి రాములుకిచ్చాడు. ఎబిసి రిపోర్ట్, జత చేసి ‘ఫ్లాగ్’ పెట్టమన్నాడు. అన్నింటి సర్కులేషన్స్ చూపించి, ‘సబ్మిటెడ్ ఫర్ ఆర్డర్స్ ప్లీజ్’ అని వ్రాయమన్నాడు. అరగంటలో తెచ్చేశాడాయన. నోట్ టైపు చేయించి, ‘అర్జెంట్’ అని వ్రాసి ఉన్న నోట్ ఫైల్ హబీబ్‌కు ఇచ్చి పేషీలో ఇచ్చిరమ్మన్నాడు. ‘టైమ్స్’కు ఎడిషన్స్ ఎక్కువ అనే అంశాన్ని హైలైట్ చేయించాడు నోట్‌లో. వాక్య నిర్మాణంలో కొన్ని మార్పులు సూచించాడు టైప్ చేయించే ముందు.
“మస్తు డ్రాప్టింగ్ సార్ మీది. ఇయ్యల్రేపు గిట్వంటి నోట్ సూడలేదంటే నమ్ముండ్రి. అన్నాడు రాములుగారు.
భీమశంకరాన్ని పిలిపించాడు. “సెక్రటరీ గారికి ఫైల్ వెళ్లింది. ఆయన ఎవరికిమ్మంటాడో చూద్దాం. ఎబిసి రిపోర్టు ప్రకారం వెళ్లాలి కదా!” అన్నాడు.
“అన్నా, నీ కెరికలే. దక్కన్ క్రానికలోడు సార్ను గలుస్తాడు జూడు. మరొక్క ముచ్చట. నీ కమీషన్ ఫైవ్ పర్నెంట్ ఉంటది. 14’ I 7” వేయిస్తాము. 16’ I 8” కు బిల్లు పెట్రుండ్రి. బోర్డు జమానలో గిట్లనే నడుస్తది” అన్నాడు. నేషనల్ టారిఫ్ ప్రకారం ఆ టెండరు పబ్లిష్ చేయడానికి పన్నెండు లక్షలు తీసుకుంటారు. దాంట్లో తనకు 60 వేలు లంచం ఇస్తారన్నమాట. ఎందుకో భయంతో వెన్ను జలదరించింది. టెండరు సైజు కుదించినందుకు వాళ్లకు లక్షల్లో తేడా వస్తుంది.
“ఏందన్నా సోచాయిస్తున్నవు? టెండరేసిం తర్వాత సెక్రటరీ స్కేలు బెట్టి కొల్సుకుంటాడ ఏంది?”
“అయామ్ సారీ! నేను అలాంటి పనులు చేయను” అన్నాడు నిష్కర్షగా
అరగంట తర్వాత సెక్రెటరీగారు పిలుస్తున్నారని పేషీ అటెండరు యాదయ్య వచ్చి చెప్పాడు. వెళ్లాడు. సార్ టెండరు ఫైలు చూస్తున్నాడు.
“సో యు సజెస్ట్ ది టైమ్స్ ఆఫ్ యిండియా?” అన్నాడు.
“ఎస్ సర్. ది డిఫరెన్స్ ఇన్ సర్కులేషన్ బిట్వీన్ ది ఎక్స్‌ప్రెస్ అండ్ ది టైమ్స్ ఈజ్ నెగ్లిజబుల్. బట్ ది నంబర్ ఆఫ్ ఎడిషన్స్ ఫర్ ది ల్యాటర్ ఆర్ మోర్ ద్యాన్ ద టాఫ్ ది ఎక్స్‌ప్రెస్. దటీజ్ వై ఐ వాంట్ యువర్ కైండ్ సెల్ఫ్ టు కన్సిడర్ ది టైమ్స్”
“గుడ్, యువర్ నోట్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ప్రిసైస్ కీపిటప్. సో, లెటజ్ గో ఫర్ ది టైమ్స్” అని ఫైల్లో టైమ్స్ దగ్గర రెడ్ ఇంక్‌తో టిక్ పెట్టి, ఎడమ వైపు మార్జిన్‌లో “గివ్ టు ది టైమ్స్ ఆఫ్ యిండియా” అని రాసి సంతకం చేసి పతంజలికిచ్చేశాడు.
ఆయనకు నమస్కరించి వచ్చేశాడు. భీమ శంకరానికి టెండర్ నోటీసిచ్చి అక్‌నాలెడ్జ్‌మెంట్ తీసుకున్నాడు. ఫైల్లో ‘యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆప్ ది సెక్రెటరీ’ అని రాసుకున్నాడు.
“రేపు టైమ్స్‌లో ఏపిస్తాను సార్! గిదిగో మా సార్ మాట్లాడతాడంట” అని తన ఫోన్ యివ్వబోతే వద్దులెండి “మీకు చెప్పాను గదా!” అన్నాడు.
ప్రక్క ఆఫీసులో కమీషనర్‌గారిని మర్యాద పూర్వకంగా కలిశాడు. ప్రభుత్వ కాలేజీల అజమాయిషీ అంతా ఆయనదే. డి.వి.ఇ.ఓలంతా ఆయన క్రింద పని చేస్తారు. ప్రయివేటు కాలేజీలు, పరీక్షలు, రిజల్ట్సు, ఫీజుల కలెక్షన్, లాంటి వన్నీ బోర్డు బాధ్యతలు. ఆర్.ఐ.ఓలంతా బోర్డు ఆధీనంలో ఉంటారు. వారూ డిప్యూటెడ్ ఉద్యోగులే. కమీషన్‌గారి పేరు సుదర్శన్. ఆయన కన్‌ఫర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి. సిసోడియాగారు డైరెక్ట్ ఐ.ఎ.ఎస్.
ప్రయివేటు కాలేజీల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. బేగంబజార్ సి.ఐ. సైదబాబుగారు బందో బస్తు చేశారు. ఆందోళన శృతిమించింది. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తున్నారు.
“కార్పొరేట్ కాలేజీల దోపిడీ నశించాలి!”
యస్.ఎఫ్. ఐ జిందాబాద్!
సెక్రెటరీ డౌన్ డౌన్!
రిక్షావాలా అచ్ఛాహై
బోర్డువాలే లుచ్ఛేహై”
లాఠీ ఛార్జి చేసి పిల్లలున్న వ్యాన్లలో కుక్కారు. పతంజలి బయటికి వచ్చి నిలబడ్డాడు. వెంటనే కొందరు –
“పి.ఆర్.వో! డౌన్ డౌన్” అని అరిచారు. పతంజలికి నవ్వొచ్చింది. తానేం చేశాడు మధ్యలో.
సెక్రటరీగారు పతంజలిని పిలిపించాడు. “సెండ్ టు ఆర్ త్రి ఆఫ్ దెయిర్ రెప్రెసెంటేటివ్స్ ఇన్. ఆస్క్ ది పోలీస్ టు అకంపెనీ దెమ్” అని ఆదేశించారు.
మెయిన్ తలుపులో ఉన్న చిన్న తలుపు తెరిచి, ముగ్గురు విద్యార్థి నాయకులను లోపలికి వదలమని చెప్పాడు పతంజలి. వారివెంట ఇద్దరు పోలీసులు. నినాదాలు చేసుకుంటూ సెక్రెటరీ ఛాంబర్‌లోకి ప్రవేశించారు.
సెక్రటరీతో కూడా దురుసుగానే మాట్లాడారు వాళ్లు. ఆయన మాత్రం కూల్‌గా ఉన్నారు. వాళ్లు సమర్పించిన మెమొరాండం తీసుకున్నారు.
“ఇది ప్రభుత్వానికి పంపిస్తాను. తగిన చర్యలు తీసుకుంటాం!”
అందరూ వెళ్లిపోయారు వాన వెలిసినట్లయింది. సి.ఐ. సైదబాబు గారి దగ్గరకు వెళ్లి “రండిసార్! కాఫీ తాగి వెళుదురుగాని” అని ఆహ్వానించాడు.
ఆయన వచ్చి కూర్చున్నాడు.
“కాఫీ వద్దుర భై చాయ్ మంగావ్” అన్నాడు.
హబీబ్‌ను పిలిచి రెండు స్పెషల్ టీలు తెమ్మని చెప్పాడు. బందోబస్తు నిర్వహించినట్లు సర్టిఫికెట్ రాసి ఇచ్చాడాయనకు.
“పోరగాండ్లు శాన పరేశాన్ జేస్తుండ్రు. ఈడికొచ్చినోల్లుల్ల కార్పోరేట్ కాలేజీల్ల జదివెటోడొక్కడుండడు”
“మరి ఎవరి కోసం సార్ ఈ ఆందోళన!”
“డబ్బుల కోసం. కార్పోరేటోల్లను బ్లాక్‌మెయిల్ జేసి డబ్బులు గుంజుతరు. ప్రతి స్టూడెంట్ యూనియన్ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అనుసరించుడే కద! పేరెంట్స్ ఎగబడిపోతుండ్రు. గవుర్నమెంటేం జేస్తది. ఆళ్లకు పార్టీ ఫండ్ మస్తుగ ముట్టజెబుతరు. మీ సారు చూసినవుగద ఎంత నిమ్మలంగ గుసుంటడో! మధ్యన మమ్మల్నాగం జేస్తుండ్రు. సర్లే. నీవేం ఫికరు గావొద్దు. ఒక్కోసారి నోటీసియ్యకుండ పడిపోతరు. జాగ్రత్త గుండాలె ప్రాపర్టిగిన డామేజ్ జేసిన రంటె నిన్నంటరు. అసుమంటప్పుడు ఒక్క ఫోన్ గొట్టు నాకు. వస్త మల్ల”
టీ తాగి ఆయన వె ళ్లి పోయాడు. వాళ్ల ఉద్యోగాలతో పోలిస్తే మనది వెయ్యి రెట్లు సేఫ్ అనిపించింది.
‘మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ’ లో మూడు రోజులపాటు సమాచారహక్కు చట్టం మీద ట్రెయినింగ్ యిచ్చారు. సెక్రటరీగారు పతంజలిని వెళ్లమన్నారు. బి.ఆర్‌కె. భవన్ నుండి యంసిఆర్‌హెచ్‌ఆర్‌డి వారి బస్సు తీసుకువెళ్లి మళ్లీ సెక్రటేరియట్ వద్ద దింపేది. చక్కగా టిఫిన్లు, టీలు, స్నాక్స్ పెట్టి బోలెడు విషయాలు చెప్పారు.
సెక్రటరీ గారికి వివరించాడు. ఆయనన్నాడు. “ఆస్క్ ది అడ్మిన్ టు కాల్ ఫర్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ ది ఆర్.ఐ.వోస్ ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్ వాట్ యు హావ్ లెర్న్ డ్ ఇన్ ది ఆర్‌టిఐ ట్రెయినింగ్ మీన్ వైల్ ప్రిపేర్ ఎ స్మాల్ హాండ్ బుక్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఇట్ ఇన్ ది మీటింగ్”
వారంరోజుల్లో ఆర్‌ఐఓస్ మీటింగ్ ఏర్పాటయింది. ఇరవై పేజీల హాండ్ బుక్ తయారు చేసి సెక్రటరీగారికి చూపించాడు. O.K. అనిపించుకున్నాడు. డి.టి.పి. చేయించి యాభై కాపీలు జిరాక్స్ తీయించి నీట్‌గా పిన్ చేయించాడు. టైటిల్ పేజీమీద
‘RTI Act 2005; A Hand Book For Awareness’ అని వ్రాయించి క్రింద BIE, AP హైదరాబాద్. అని వ్రాయించాడు.
మీటింగ్ హాలులో 23 జిల్లాల ఆర్.ఐ.ఓ.లు బోర్డు అధికారులు అంతా సమావేశమయ్యారు. ఎయిర్ కండిషన్డ్ హాలది. చాలా పోష్‌గా ఉంటుంది. సెక్రటరీ గారు వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు.
జిల్లాల పేర్లు అతికించిన ప్లాస్టిక్ ముక్కలు వరుసగా ఉన్నాయి. బోర్డు అధికారుల హోదాలు అతికించి ఉన్నాయి. అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. ప్రతివారి ముందు ఒక మైక్ ఉంది.
సెక్రెటరీ గారు పతంజలి వైపు చూసి ప్రారంభించమన్నట్లు సైగ చేశారు.
పతంజలి లేచి నిలబడి,
“ఆనరబుల్ సెక్రెటరీ, డియర్ కొలీగ్స్ అండ్ రెస్పెక్టెడ్ ఆర్.ఐ.ఓస్” అని సంబోధించి వివరంగా చెప్పాడు.
“ఫ్రెండ్స్, సమాచార హక్కు చట్టం పదునైన ఆయుధం. ఆర్.ఐ.వో ఆఫీసుల్లో ఇన్‌ఫర్మేషన్ ఆఫీసరు ఎ.ఓ. ఫస్ట్ అప్పిలేట్ అధికారి మీరు చాలామంది ప్రజలకిచ్చే సమాచారంపై ఆర్‌ఐఓలే సైన్ చేస్తున్నారు. అది తప్పు. ఏఓ సైన్ చేయాలి. ఆ సమాచారం మీద ఏవయినా అభ్యంతరాలుంటే మీకు అప్పీలు చేసుకుంటారు. ఇంచుమించు ప్రజలు ఏదడిగినా మనం ఇవ్వకుండా ఉండకూడదు. మనకు దరఖాస్తు అందిన నెలరోజులలోపు రిప్లయి పంపాలి. ఒక రిజిస్టర్ మెయిన్‌టెయిన్ చేయండి. మీలో కొందరు ఆర్‌టిఐ దరఖాస్తులను మాకు పంపేస్తున్నారు. అలా చేయకూడదు. జిల్లా పరిధిలోవి మీరే సమాచారం ఇవ్వాలి. స్టేట్ పరిధిలోవి మాకెలాగూ వస్తాయి. ప్రతి మూడు నెలలకు కన్సాలిడేటెడ్ రిపోర్టు పంపాలి. అది కూడా ఎ.ఓ సైన్ చేస్తే చాలు. చాలామంది సమయానికి పంపడం లేదు. మీవన్నీ వచ్చిన తర్వాత మేము అవి కన్సాలిడేట్ చేసి సమాచార కమీషన్‌కు పంపుతాం. కొంతమంది బల్క్ ఇన్‌ఫర్‌మేషన్ అడుగుతారు. దానికి పేజీకి రెండు రూపాయల చొప్పున ఛార్జెస్ వసూలు చేసిం తర్వాతే పంపండి. కొందరు వందల కొద్దీ పేజీలు పట్టే సమాచారం అడుగుతారు. వాళ్లదేం పోయింది? పది రూపాయలు పోస్టల్ ఆర్డర్. ఒక తెల్లకాగితం చాలు వాళ్లకు అలాంటి వాటికి, “ఇంత సమాచారం ఇవ్వడానికి తగిన మానవ ఆర్థిక, కాల వనరులు మా వద్ద లేవని” వ్రాసెయ్యండి. ఆర్‌టిఓ స్థాయిలో కూడ సమాచారం అందకుంటే, ప్రజలు సెకండ్ అప్పీల్ అంటే సమాచార కమీషన్‌నే నేరుగా ఆశ్రయిస్తారు. అప్పుడు వారు ఇరు పక్షాలనూ పిలిపించి, ఎంక్వయిరీ చేస్తారు. మనదే తప్పని తేలితే వేలల్లో జరిమానా కూడ వేస్తారు. క్లుప్తంగా ఆర్‌టిఐ నియమాలను మన గౌరవ కార్యదర్శి గారి ఆదేశం మీద సంకలనం చేశాను. నాకీ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు” అని కూర్చున్నాడు.
“ఎనీ క్వశ్చన్స్?” అన్నారు సెక్రటరీ గారు.
కొందరు తమ డౌట్స్ అడిగారు. పతంజలి క్లారిఫై చేశాడు.
“ఆర్.ఐ.ఓ.ల సంగతేమోగాని, నాకుమాత్రం ఆర్‌టిఐ మీద మంచి అవగాహన వచ్చింది!” అన్నారు CoE మేడంగారు ఆమె స్టేట్ లెవెల్లో ఫస్ట్ అప్పిలేట్ అధారిటీ. పతంజలి చెప్పిన చోట సంతకాలు పెడుతుంది.
“మీ సంగతలా ఉంచండి. మన శర్మగారు చాలా బాగా వివరించారు. హి డిడ్ ఎ గుడ్ జాబ్!” అన్నారు సెక్రటరీ గారు!
ప్రక్కన కమీషనర్ గారికి విషయం తెలిసి పతంజలిని పిలిపించారు.
“ఏమయ్యా! ఆర్‌టిఐ మీద బాగా కృషి చేసినట్లున్నావు? దాని మీద మన వాళ్లకింకా పూర్తి అవగాహన లేదు. మా డి.వి.ఇ.ఓలను కూడ పిలిపిస్తాను. వాళ్లకూ చెప్పు”అన్నాడాయన.
“విత్ ప్లెజర్ సర్. ఇట్స్ మై ప్రివిలేజ్” అన్నాడు.
ఒకరోజు డి.వి.ఇ.వోల సమావేశం ఏర్పాటయింది. కాలేజీ లెవల్ సమాచారం కూడ సీనియర్ అసిస్టెంట్ పి.ఐ.ఓ.అనీ, ప్రిన్సిపాల్ ఫస్ట్ అపిలేట్ అధికారి అనీ వివరించాడు. మనవద్ద ఉన్న సమాచారమే ఇవ్వాలనీ, గ్రీవెన్సెస్, కంప్లెయింట్ సమాచార హక్కు చట్టం క్రిందికి రావనీ, వాటిని నిర్ద్వందంగా తిరస్కరించమనీ చెప్పాడు.
పతంజలి పేరు డిపార్ట్‌మెంట్లో అందరికీ తెలిసింది. చాలామంది అతన్ని ఆర్‌టిఐ సారు అని పిలువసాగారు.
ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. బోర్డు అధికారులు కొందరిని స్టేట్ అబ్సర్వర్స్‌గా జిల్లాలకు పంపారు. పతంజలి నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు వెళ్లాడు.
థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు కొశ్చన్ పేపర్ సెట్ నంబర్ కార్యదర్శిగారు విడుదల చేస్తారు. తొలిరోజు మాత్రం మినిస్టరుగారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వస్తారు. ఐదున్నరకల్లా ఆఫీసులో ఉండాలి. సెట్ నెం. రిలీజయిన వెంటనే యస్‌పి (పోలీసు కమ్యూనికేషన్స్) వారు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ క్షణాల్లో వర్తమానం పంపిస్తారు. పతంజలి పత్రికా, టి.వి విలేఖరులందరికీ గ్రూప్ మెసేజ్ పెడతాడు ఫోన్‌లో. క్షణాల్లో టి.విలో స్క్రోలింగ్‌లు వస్తాయి. అధికారికంగా ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లలో వచ్చేదే ప్రమాణం. విలేఖరులు నిద్రమత్తులో ఒకోసారి సరిగ్గా వినక సెట్ నంబరు తప్పుగా ప్రసారం చేస్తారు. ఆర్‌ఐఓలకు డివిఇఓలకు కూడ గ్రూప్ మెసేజ్ వెళుతూంది.
ఆరున్నరకు క్యాటరింగ్ వారి వ్యాన్ వస్తుంది. అందరికీ వేడివేడి టిఫిన్స్ పెడతారు. అడ్మిన్‌గారు రూట్స్ ఏర్పాటు చేసి, ఇద్దరు అధికారులను ఒక జట్టుగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తారు. కార్లు రడీగా ఉంటాయి. వంద కిలోమీటర్ల రేడియస్‌లో ఐదారు కాలేజీలు విజిట్ చేయాలి. మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలి. ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసే అధికారాలు కూడ ఉంటాయి, వారు విధులు సరిగా నిర్వర్తించడం లేదనిపిస్తే.
మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ తిరిగి వస్తారు. భోజనం సిద్ధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడ. సాయంత్రం నాలుగుకు జిల్లాలవారీగా మాల్ ప్రాక్టీస్, ఆబ్సెంటీస్ కేసులు ఎన్నో ఆర్‌ఐఓల నుండి సమాచారం వస్తుంది. అన్నీ కన్సాలిడేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది డిబార్ అయ్యారు, ఎంతమంది గైర్హజరయ్యారు పరీక్షలు ఎలా జరిగాయి లాంటి వివరాలతో ప్రెస్ రిలీజ్ తయారు చేసి సెక్రటరీ గారి సంతకం తీసుకుని, ప్రెస్‌కు పంపుతాడు పతంజలి.
ఐదున్నరకు సెక్రెటరీ గారి ఛాంబర్‌లో “టెలికాన్ఫరెన్స్” ప్రారంభమవుతుంది. 23 జిల్లాల ఆర్.ఐ.వోలు రిపోర్ట్ చేస్తారు. సిఓఇ. జె.యస్.లు డియస్‌లు అంతా ఉంటారు.
దాదాపు రెండు గంటలు సాగుతుందది. అప్పటికప్పుడు జిల్లాలలో తలెత్తిన సమస్యలు పరిష్కారమవుతాయి. సెక్రెటరీ కొందర్ని మెచ్చుకుంటారు. కొందర్ని తీవ్రంగా కోప్పడతారు. కొందర్ని ఇలాగైతే రిపాట్రియేట్ చేస్తానని బెదిరిస్తారు.
టెలికాన్ఫరెన్స్ తర్వాత ఇల్లు చేరేసరికి తొమ్మిదవుతుంది.
రిసల్ట్స్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు రాత్రి పన్నెండు వరకు ఉండాల్సి వస్తుంది. పతంజలికి ఈ పనులన్నీ ఛాలెంజింగ్‌గా ఉన్నాయి. ఎంజాయ్ చేస్తున్నాడు. పైగా ప్రతిదీ రెమ్యూనరేటివ్ వర్కే.
జూలై మాసాంతానికి ఎమర్జెన్సీ పీరియడ్ పూర్తయింది. పతంజలికి ఫుడ్ అలవెన్స్ తొంభై నాలుగు వేలు వచ్చింది. ఇతరత్రా రెమ్యూనరేషన్ పదిహేను వేలు వచ్చింది.
***
ప్రద్యుమ్న కంపెనీ వారు ఏదో ట్రయినింగ్ కోసం వాడిని మూడు నెలలపాటు యు.ఎస్ కు పంపారు. ప్రజ్ఞ సి.ఎ. ఫైనల్ పరీక్షలు వ్రాసింది. ఒక పేపర్‌లో ఫెయిలయింది. మళ్లీ అన్ని గ్రూపులూ వ్రాయల్సిందే.
పతంజలి కూతుర్ని నిరాశ పడవద్దని చెప్పాడు. మళ్లీ ప్రయత్నించమన్నాడు.
“బుజ్జమ్మలూ, ఎవ్వెరీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్”
ఆర్.డబ్బ్యు. ఎమర్సన్ అంటాడు “ఇటీజ్ నాట్ గ్రేట్ నాట్ టు ఫాల్ అటాల్, బట్ టు రైజ్, ఎవ్వెరీ టైం యుఫాల్. “అస్సలు పడిపోకుండా ఉండడం గొప్పేం కాదు. పడినపుడల్లా లేస్తూ ఉండడమే గొప్ప”
“ఈసారి తప్పకుండా పాసవుతాను నాన్నా” అన్నది బుజ్జమ్మ.
రామ్మూర్తి బావ కూడ రిటైరై రెండేళ్లయింది. చెయ్యలేను అంటూనే లాక్కొచ్చాడు. శశిధర్‌కు యల్.ఐ.సిలో ఉద్యోగం వచ్చింది. మదనపల్లెలో ఉన్నాడు. చిన్నల్లుడు అనంతపూర్‌లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి. ఎపి ట్రాన్స్‌కోలో జెయిగా ఉన్నాడు. వాడికి ఖరగ్‌పూర్ ఐ.ఐ.టిలో సీటు వచ్చింది. మామను సలహా అడిగితే వెంటనే ఉద్యోగం వదిలేసి ఐ.ఐ.టి లో చేరమన్నాడు వాడిని. వాడు ఎమ్‌టెక్ ఫైనలియర్లో ఉన్నాడు. అక్క బావ కడపలో వాళ్ల సొంత యింట్లో ఉంటున్నారు.
సిసోడియా గారికి ట్రాన్స్‌ఫర్ ఐంది. హార్టికల్చర్ డిపార్టుమెంట్‌కు వేశారు. బోర్డు సెక్రటరీగా ‘నరసింహారావు’ గారొచ్చారు. ఆయన చండశాసనుడు. ఆయన నిజంగా నరసింహుడే. ఉగ్ర నరసింహుడు. కార్పోరేట్ కాలేజీ వాళ్లను గడగడలాడిరచాడు. అఫిలియేషన్స్ రద్దు చేశాడు. లక్షల్లక్షలు పెనాల్టీ కట్టించాడు. నిప్పులాంటి మనిషి. రాజకీయనాయకులను అస్సలు లెక్కచేయడు. అందరూ ఆయనను చూసి భయపడేవారు.
పతంజలికి మాత్రం రెండు కారణాల వల్ల ఆయన ఎంత తిట్టినా కోపం వచ్చేది కాదు. మొదటిది ఆయన కోపం తాటాకు మంట. ఎక్కువ సేపు ఉండేది కాదు. ఇద్దరు ఆర్.ఐ.ఓలను రిపాట్రియేట్ చేశాడు. సెక్యూరిటీవాడు తాను దిగడానికి కారు డోరు తెరువలేదని అతన్ని కొట్టినంత పనిచేశాడు. ఉట్టి కేకలు హడావుడే. మనసులో ఏమీ ఉంచుకునేవాడు కాదు. లాస్ట్ డేట్ తర్వాత పరీక్ష ఫీజు కడతామని వచ్చేవారికి ఉదారంగా పర్మిషన్ ఇచ్చేవాడు. ఆయన్ను చూస్తే.
“పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము,
మనమ్ము నవ్యవ నవనీతసమానము” అన్న పద్యపాదం గుర్తుకు వచ్చేది.
మరొక కారణం ఎదుటి వాడి కోపానికి రెస్పాండవకుండా ఉండగలిగే గుణం. పైగా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడం అది చాలా కష్టం. అది పతంజలి స్వభావంలోనే ఉంది.
ఆర్‌కె. నారాయణ్ ఒక చోట అంటాడు. “ఐ ఎంజాయ్ వాచింగ్ ఇరిటబుల్ మెన్ ఇన్ యాక్షన్!” ఎంత గడుసు తనం! ఎంత చిలిపితనం! సులభంగా కోపం తెచ్చుకుని చిందులు తొక్కుతున్న వారిని చూస్తూ ఎంజాయ్ చేస్తాడట! ఆర్.కె. వారి సెన్సాఫ్ హ్యూమర్‌కు ఇది పరాకాష్ట!
కేవలం తొమ్మిది నెలలే పని చేశాడు నరసింహారావుగారు. ‘కార్పొరేట్ మాఫియా’ ఆయన్ను ట్రాన్స్‌ఫర్ చేయించింది. ఆయనుంటే వారి ఆటలు సాగవు మరి! ఎండోమెంట్స్ కమీషనరుగా వెళ్లిపోయాడా అగ్నిహోత్రావధాన్లు. ప్రక్క ఆఫీసు కమీషనర్‌గా ‘ధనుష్ త్రివేది’ గారు వచ్చారు ఆయన చాలా సౌమ్యుడు.
తర్వాత సెక్రటరీగా దశరథరామ్ గారు వచ్చారు. కన్‌ఫర్డ్ ఐ.ఎ.ఎస్. మొదట టి.టి.డిలో జెయివో గా చేశారట. తర్వాత కర్నూలు జిల్లా కలెక్టర్. తర్వాత బోర్డు సెక్రటరీ.
ఆయన మంచి కళాకారుడు నాటకాలు వేసేవాడు. చక్కని వక్త. క్రింది స్థాయినుండి పైకి వచ్చినవాడు. ఆయనకు కోపమే రాదసలు. చల్లగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు.
పతంజలిని “స్వామీ!” అని పిలుస్తాడాయన. అతని డ్రాఫ్టింగంటే చాలా ఇష్టం. ఒకసారి అడ్మిన్ గారు ఏదో నివేదిక తయారు చేసి ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి పంపడానికి అప్రూవల్‌కు తెస్తే, “ఏందిది? బాలేదు. మన స్వామితో రాయించండి.” అని చెబితే అడ్మిన్ గారు పతంజలితో తిరగరాయించుకొని తీసుకువెళ్లారు. “చూడాల్సిన పనిలేదు. పంపించేయండి” అని అప్రూవ్ చేశారట. ఆయనకు సంగీత సాహిత్యాల్లో పరిచయం ఉంది. ఒక రిపబ్లిక్ డే నాడు పతంజలి స్వాతంత్య్రోద్యమం మీద ఒక సీస పద్యం రాసి, కల్యాణి రాగంలో పాడాడు. సెక్రటరీ గారు ప్రశంసించారు.
అప్పట్నించి, ఫైలు తీసుకొని ఆయన దగ్గరకు వెళితే, దాన్ని పక్కన బెట్టి,
“స్వామీ! కృష్ణతులాభారంలో నారదుడి పద్యముందే…
“సర్వేశ్వరుండగు శౌరి కింకరు జేయ
ధనమున్నదే భక్తి ధనముగాక”
అనే పద్యం మీకు వచ్చా? ఏదీ ఒకసారి ఎత్తుకోండి అని పాడించుకొనేవాడు. లేదా లవకుశలో వాల్మీకిపాడే
“రంగారు బంగారు చెంగావులు ధరించు
శృంగార వతి నార చీర లూనె” పాడమనేవాడు.
పతంజలి సార్ దగ్గరున్నప్పుడు పేషీలోకి ఎవరయినా వస్తే పి.ఎ. “ఇప్పుడే ఆర్‌టిఐ సారు లోపలికి వెళ్లారు. అప్పుడే రారు. పద్యాలు పాడుతూంటాడు” అంటే వచ్చిన వారు ఆశ్చర్యపోయేవారు.
“ఒకసారి రవీంధ్రభారతిలో ‘పడమటి గాలి’ అనే నాటకం వేశారు. దాదాపు నాలుగు గంటల నాటకం అది. అందులో విదూషకుడి లాంటి పాత్ర పోషించారు సెక్రెటరీ గారు. వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతూంటాడు. కానీ అతని ప్రతిమాట వెనుక సమాజం పట్ల అవగాహన, సంస్కరణాభిలాష ఉంటాయి. గొప్పమేధావి.
మర్నాడు పతంజలిని పిలిచాడు ఆయన.
“స్వామీ! నాటకం చూశారా! నచ్చిందా! నా పాత్రను మీరైతే బాగా విశ్లేషిస్తారని పిలిచాను”
“అద్భుతం సార్! మీ పాత్రలో రెండు పార్శ్వాలు గమనించాను. మొదటిది ‘వసంతసేన’ నాటకంలో రాజశ్యాలకుడు శకారుడు. వాడు అవివేకి, మూర్ఖుడు. కొంత దుర్మార్గుడు..” అని ఆగి
“క్షమించండి సార్” అన్నాడు.
“క్షమించడమెందుకు స్వామీ! మీరంటున్నది శకారుడిని కదా”
“ఆ మూడు షేడ్స్ మీ నటనలో పండాయి. అఫ్‌కోర్స్, వికెడ్‌నెస్ లేదనుకోండి. తర్వాత ‘ఫాల్స్ స్టాఫ్’ అనే షేక్‌స్పియరెన్ పూల్. ‘హెన్రీ`4’ నాటకంలోని అద్భుతమైన సృష్టి. ఫాల్స్‌స్టఫ్ అనే పదాలను కలిపి ఆ పేరు పెట్టాడనుకుంటాను. మీరు నాటకంలో ఏమాత్రం తడుముకోకుండా ఎదుటి వాడి మాటలకు ‘రిటార్ట్’ ఇస్తూంటారు చూడండి. దాన్ని ‘స్పాంటేనిటీ’ అంటారు. అది చాలా బాగా పండించారు సార్ మీరు. స్టేజి మీద మీ సహనటుడు డైలాగ్ చెప్పిన వెంటనే మీరు టక్కున ఏమని జవాబిస్తారో అని ప్రేక్షకులం ఎదురుచూచాము”
“ఆ క్రెడిట్ మాటలు వ్రాసిన రచయితది కద స్వామీ”
“కొంతవరకు దాన్ని హేలగా, డెలిబరేషన్ లేకుండా డెలివర్ చేయడం మీకే చెల్లింది.”
“ధ్యాంక్యూ స్వామీ! ఫాల్స్ స్టాఫ్ గురించి ఇంకా చెప్పండి.”
“ఆంగ్ల నాటక సాహిత్యంలో షేక్‌స్పియర్ సృష్టించిన ఫూల్ పాత్రలు బాగా ప్రసిద్ధిగాంచాయి. కథానాయకుని వెంటే ఉంటూ, అతి చనువు ప్రదర్శిస్తూ ఉంటాడు. యన్.టి.ఆర్ శ్రీకృష్ణుని పాత్రకు పద్మనాభం విదూషకుడిగా సరైన జోడీగా పేరు తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణ తులాభారంలో పద్మనాభం విశ్వరూపం చూస్తాం మనం”
“అవును స్వామీ!”
“ఫాల్‌స్టాఫ్ ప్రిన్స్ కు అనుయాయి. పిరికివాడు. కానీ చాలా ధైర్యస్తుడిలా నటిస్తాడు. ప్రిన్స్ అంటే హెన్రీ 5 అనుకుంటాను. బాధ్యత లేకుండా అలగా జనంతో తిరుగుతూంటాడు. మహారాజు బాధపడుతూంటాడు. రాజకుమారుని పరోక్షంలో ఫాల్‌స్టాఫ్ అతన్ని విమర్శిస్తుంటాడు. ఎదుట మాత్రం అతివినయం ఒలకబోసి, పొగడుతూంటాడు.”
“ఒకసారి కల్లు దుకాణంలో అనుకుంటాను. చిరు దొంగతనాలు చేసేవారు, దారి దోపిడీలు చేసేవాళ్ల ముందు ప్రిన్స్‌ను తిడుతుంటాడు ఫూల్. సడన్‌గా రాకుమారుడు ఎంటరవుతాడు. అంతా వింటాడు.”
“ఫాల్‌స్టాఫ్ ఏమాత్రం కంగారుపడడు. ముఖంలో భావాలు కూడ మార్చడు. వెంటనే ఇలా అంటాడు.
“ఐడిస్‌ప్రెయిజ్‌డ్ దీ బిఫోర్ ది వికెడ్, సో దట్ దివికెడ్ మే నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దీ”
“అబ్బ!” అన్నాడు సెక్రెటరీ గారు. “ఏం సమయస్ఫూర్తి!”
“దాన్ని ఏమనాలో మరి! షేక్స్‌స్పియరెన్ పూల్ మీద పిహెచ్.డిలు చేసిన వాళ్లున్నారు.”
“రావయ్యారా! నిన్నే తిడుతున్నాను. ఇంతలో నీవొచ్చావు. ఈ దుర్మార్గులు నీమీద మమకారం పెంచుకుంటారని నిన్ను అలా తిట్టాను” చూడండి ఎంత తెలివో! ప్రిన్స్‌కు అతని మీద కోపం రాదు.
ఫూల్ అప్పుడపుడు అంటూనే ఉంటాడు.
“ఆఫ్టర్ దౌ కంటుత్రోన్, విల్ యు హాంగ్ మి టు డెత్!?”
“నీవు సింహాసనం ఎక్కితే కొంపదీసి నన్ను ఉరితీయించవు కద!”
“స్వామీ! ప్రిన్స్ ఎందుకలా చేస్తుంటాడు?”
“రాజ్యంలో దొంగతనాలు, దారిదోపిడీలు ఎక్కువగా జరుగుతుంటాయి. వారితో కలిసిపోయి వారి గుట్టుమట్టులన్నీ తెలుసుకుంటుంటాడు. తాను అధికారం చేపట్టాక వాళ్లను తుదముట్టించాలని ఆయన అనుసరించిన స్ట్రాటజీ సార్ అది!”
“వండర్‌ఫుల్”
“ఫాల్స్‌స్టాఫ్ వృద్ధుడు. స్థూలకాయం. కాని ఎవరయినా అతన్ని వృద్ధుడంటే అతనికి చాలా కోపం. చివర్లో హెన్రీ – 5 సింహాసనం అధిష్టించిన తర్వాత అతని ముందు నిలబడి వెకిలిగా నవ్వుతాడు. తనకు ఏదైనా ఉన్నత పదవి లభిస్తుందని ఆశిస్తూంటాడు. కానీ ఒకే ఒక్క మాటతో ప్రిన్స్ అతన్ని దెబ్బ తీస్తాడు.
“హు ఆర్ దౌ అగ్లీ ఓల్డ్ మ్యాన్?”
వాడి నిజ స్వరూపం బట్టబయలైతుంది. తట్టుకోలేక గుండె పగిలి చనిపోతాడు.
“దీనిమీద విమర్శకులు ధ్వజమెత్తారు. ప్రిన్స్ చేసింది తప్పు. వాడిని అంత నిర్ధయగా “డిస్ ఓన్” చేసి ఉండకూడదంటారు. కానీ రాజనీతి చాలా లోతైనది. ప్రఖ్యాత విమర్శకుడు రుఘుకుల తిలక్ ఒక చోట ఫాల్ట్సాఫ్ గురించి ఇలా అంటాడు.
“హి ఈజ్ లైక్ ది ప్రాంక్ స్టర్ హూ ఎక్స్ పెక్ట్స్ ది హాండ్ ఆఫ్ ది కింగ్స్ దాటర్, యాజె రివార్డ్ ఫర్ హిస్ సిల్లీ ప్రాంక్స్”
“రాజుగారి ముందు కొన్ని గమ్మత్తులు చేసి, దానికి ప్రతిఫలంగా రాజుగారు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకొనే రకం”
దశరథరాం గారు లేచి వచ్చి పతంజలిని కౌగిలించుకున్నాడు.
“సాహిత్యాన్ని, పాత్ర చిత్రణను ఎంత బాగా ఔపోసన పట్టినారు స్వామీ” అన్నాడు.
“అంతా మా లక్ష్మీ నరసింహస్వామి, మా తండ్రిగారు, మా గురువుల దయ సార్” అన్నాడు పతంజలి. “నా గొప్ప తనమేముంది? సాహిత్య విమర్శకులదే క్రెడిటంతా!”
ఆయన వద్ద సెలవు తీసుకొని వస్తూంటే బయట కిషన్ ప్రసాద్, రామ సుబ్బన్న వెయిట్ చేస్తున్నారు. రామసుబ్బన్నతో చాలా ఇంటిమసీ ఏర్పడిందిటీవల. అతనన్నాడు –
“ఇంతసేపు మాట్లాడుతున్నావంటే అనుకున్నాను బావా! నీవు లోపలుండి ఉంటావని. ఎన్ని పద్యాలు పాడించుకున్నారేమిటి సారు?” అన్నాడు నవ్వుతూ.
పతంజలి నవ్వి వెళ్లిపోయాడు.
ఒకరోజు రాత్రి మల్లినాధ ఫోన్ “అన్నయ్యా! నాన్నకు మైల్డ్‌గా పక్షవాతం వచ్చింది. మిమ్మల్ని కలవరిస్తున్నాడు. వెంటనే రావాలి మీరు.”
తెల్లవారు ఝామున వసుధను తీసుకొని టాక్సీలో బయలుదేరాడు. తండ్రి మంచం మీద ఉన్నాడు. మాట కూడ స్పష్టత లేదు. కుడిచెయ్యి, కుడికాలు స్వాధీనం తప్పాయి. డా. త్యాగరాజయ్య కొన్ని యింజక్షన్స్ చేశాడట.
అన్నీ మంచంలోనే మల్లినాధ భార్యకేం తెలుసు పాపం. చిన్నపిల్ల. పెద్దాయనకు సపర్యలు చేయడం రాదు. “హైదరాబాద్‌కు వెళదాం నాన్నా” అంటే ఒప్పుకోలేదు. ఇక్కడే తన ప్రాణం పోవాలన్నట్లు సైగ చేశాడు. మహా పండితుడు, శతావధాని, పౌరాణిక రత్న వందలమందిని తన వాగ్ధాటితో ముగ్ధులను చేయగల ఆయన గంభీర స్వరం మూగపోయింది! అన్నీ సైగలే!
వసుధ అన్నది “మామ దగ్గర నేనుంటాను. ఈ సమయంలో ఆయనకు సేవలు చేసి ఆయన ఋణం తీర్చుకుంటాను”
కోడుమూరులో పక్షవాతానికి ఒకాయన ఆయుర్వేద వైద్యం చేస్తాడని, చాలామందికి నయం చేశాడనీ విని అన్నదమ్ములిద్దరూ మల్లినాధ బండిమీద కోడుమూరు వెళ్లారు. ఆయనను తీసుకొచ్చారు. ఆయన పెద్దాయనను చూసి, ఒక సీసా తైలం ఇచ్చి, చచ్చుపడిన భాగాలకు మర్దన చేయమన్నాడు. ఏదో పొడి అరవై పొట్లాలు కట్టిచ్చాడు. దానిని తేనెలో రంగరించి నాకించమన్నాడు రెండుపూటలా.
“నెల రోజుల్లో స్వామి కోలుకుంటాడు. రెండోసారి స్ట్రోక్ వస్తే మటుకు బ్రతకడం కష్టం!” అన్నాడా వైద్యుడు.
నాలుగురోజులుండి వెళ్లిపోయాడు పతంజలి. వసుధ కన్నతల్లి కంటే ఎక్కువగా సేవ చేసింది మేనమామకు. ఆమెకు ఊహ తెలిసేసరికి తండ్రి లేడు. మామే తమ కుటుంబాన్ని చూసుకున్నాడు. చెల్లెలంటే ప్రాణం. మేనకోడల్ని కొడుక్కు చేసుకున్నాడు. వసుధను పల్లెత్తుమాట అనలేదెప్పుడూ.
ఆయన మలమూత్రాలు ఎత్తిపోయడం. అన్నం మెత్తగా కలిపి నోట్లో పెట్టడం, తైలం మర్దనా చేయడం. శ్రద్ధగా చేసింది వసుధ. తల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చోమనేవాడు. ఆమె చేయి తన చేతిలో వేయమనేవాడు. వాగ్దేవి, మహిత కూడ వచ్చి కొన్ని రోజులుండి వెళ్లారు. పాణిని వచ్చి చూసి వెళ్లాడు.
దాదాపు మండలం రోజులు మంచమీద ఉన్నాడాయన. ఒక రోజు రెండోసారి స్ట్రోక్ వచ్చింది. అంతే!
“దివిజ కవివరుగుండియల్ డిగ్గురనగ
అరుగుచున్నాడు శర్మగారమరపురికి”
పిల్లల దుఃఖం చెప్పనలవికాదు. పతంజలికి ఆయనతో అనుబంధం ఎక్కువ. కేవలం తండ్రే కాదు గురువు కూడ. తండ్రి నిర్జీవ శరీరాన్ని తడుముతూ పతంజలి భోరున విలపించాడు. వసుధను కరుచుకొని ఏడ్చాడు.
వీధి వీధంతా జనసంద్రమైంది. స్వామి చనిపోయారట! చుట్టుపక్కల ఊళ్లనించి ఆయన పార్థివ దేహాన్ని చూడాలని వచ్చారు. పాద నమస్కారం చేయడానికి బారులు తీరారు.
అంతిమ యాత్ర ప్రారంభమయింది. పురప్రముఖులు అంతా స్మశానానికి వచ్చారు. పతంజలి నిప్పుకుండ పట్టుకొని ముందు నడుస్తూండగా పాణిని, మళ్లినాధ, ఇద్దరు అల్లుళ్లు పాడెను మోశారు. వర్ధనమ్మను దహనం చేసిన ప్రక్క స్థలంలోనే మార్కండేయశర్మ శివైక్యం చెందాడు.
మర్నాడు పేపర్లో శర్మగారి మరణవార్త వచ్చింది. కొడుకులంతా శాస్త్రోక్తంగా అపరకర్మలు నిర్వహించారు. వైకుంఠ సమారాధన రోజు సాయంత్రం జె.పి హైస్కూల్లో సంతాప సభ జరిగింది. దశరథుడు సభకు అధ్యక్షత వహించాడు. సంత జరిగే కూడలిలో శర్మగారి కాంస్య విగ్రహం ప్రతిష్ఠించాలని తీర్మానించారు.
గద్గదస్వరంతో పతంజలి ప్రకటించాడు
“ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రుల స్మారకార్థం టెంత్‌లో టాపర్‌గా నిలిచే విద్యార్థికి మూడు వేల రూపాయలు బహూకరిస్తాము”
తండ్రి తనను ఎక్కడికీ వెళ్లనివ్వకుండా తన దగ్గరే ఉంచుకోవాలనే తపన పడటం గుర్తు తెచ్చుకుని కుమిలిపోయాడు పతంజలి.
అందరూ ఎవరి వూళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
***
బోర్డులోని డిప్యూటెడ్ అధికారులను రెండేళ్లకొకసారి మారుస్తుంటారు. తదనుగుణంగా పతంజలిని ఇ.ఆర్.టి. డబ్ల్యు లో రీడర్‌గా వేశారు. నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఒక్కసారిగా మారిపోయాయి. ఈక్వలెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీస్ విభాగానికి అధిపతి. ఓరియంటేషన్ ప్రోగ్రాంస్ కూడ, జెయల్స్‌కు, ప్రిన్సిపాల్స్‌కు కండక్టు చేయాలి. అతని క్రింద ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నాడు. అతను జె.యల్. పేరు వెంకట్. ఒక సూపరింటెండెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ ఉంటారు. సూపరింటిండెంట్ షరీఫ్.
జాయిన అయిన రోజు అందర్నీ కూర్చోబెట్టి రెవ్యూ చేశాడు. ఇంతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఇంటర్మీడియట్ చదివి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత చదువులు చదవాలనుకున్నవారికి, వారు చదివిన ప్లస్ 2 (+2) కోర్సు, ఏ.పి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కోర్సుతో సమానమని ధృవీకరించాలి. అట్లే ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో టెంత్ స్టాండర్డు పాసయిన వారికి, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌లో చేరడానికి వారు అర్హులే అని ధృవకరించాలి. అన్నింటికీ సైనింగ్ అధారిటీ పతంజలే.
బంగారు బాతులాంటి సెక్షన్ అది అని విన్నాడు. ఆయా సర్టిఫికెట్ల వివరాలను అసిస్టెంట్ ప్రొఫెసర్ వెబ్‌సైట్లలో చూసి వాటి జెన్యూనిటీని నిర్ధారించి, దాని ప్రింట్ అవుట్‌తో సహా నోట్ పెడతాడు. ఆ నోట్ షరిఫ్ రాస్తాడు. కొన్ని పోస్టులో కూడ వస్తాయి. కొన్ని ప్రభుత్వ శాఖలు ప్రమోషన్లు, కంపాషనేట్ గ్రౌండ్స్ మీద చేసే నియామకాలు విషయంలో అభ్యర్థుల ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు జెన్యూనా కాదా అని బోర్డుకు రిఫర్ చేస్తుంటాయి.
షరీఫ్ ప్రతిదానికీ రేటు నిర్ణయించి, లంచాలు వసూలు చేస్తూంటాడని తెలిసింది. అడ్మిన్ కిషన్ ప్రసాద్ పతంజలిని జాగ్రత్తగా ఉండమన్నాడు. పబ్లిక్ మీకు కంప్లెయింట్ చేస్తే ఇంటర్‌ఫియర్ అవమన్నాడు. గుర్తింపబడని బోర్డుల లిస్ట్ జాగ్రత్తగా తనిఖీ చేసి సర్టిఫికెట్లు సైన్ చేయమన్నాడు.
షరీఫ్‌కు చెప్పాడు. “భయ్యా! నీ రిస్క్ నీదే. నా వరకు రానివ్వకు. పబ్లిక్ కంప్లెయింట్ చేస్తే మటుకు సెక్రటరీగారి దృష్టికి తీసుకొని వెళతాను”
“ఏదో వాళ్లు సంతోషం కొద్దీ ఇచ్చిపోతారు సాబ్! మేం అస్సలు డిమాండ్ చేయము” అని చెప్పాడు. కాని వాడు గురజాడవారు చెప్పినట్లు “బిగ్‌యాస్. కన్నింగ్ జాకాల్” అని అర్థమయింది.
ఒకరోజు మేస్త్రీ శ్రీను వచ్చాడు. “సారూ! పైన ఫస్ట్ ప్లోర్ వేద్దాము. ఇప్పుడు ఐరన్, సిమెంట్ ఇసుక ధరలు బాగా తగ్గాయి. మూడున్నర నాలుగు మధ్య ఐపోతుంది. క్రింది దానికంటే పెద్దగా వస్తుంది” అన్నాడు.
వసుంధర వదినె, అన్నయ్యలను సంప్రదిస్తే మంచిదే అన్నారు. అతని దగ్గర రెండు లక్షలదాకా ఉంది. అన్నయ్య మిగతాదిస్తానన్నాడు. ఫుడ్ అలవెన్స్ డబ్బు వచ్చినపుడు రెండుసార్లు తీర్చేస్తే సరిపోతుంది.
వెంటనే పని ప్రారంభించాడు శ్రీను. మూడు నెలల్లో కట్టేశాడు. డాబామీదికి మెట్లు వేశాడు. సాయంత్రం సేద తీరడానికి అక్కడ రాతి బెంచీ ఒకటి అమర్చాడు. ఓవర్ హెడ్ ట్యాంక్ పెద్దది పెట్టుకున్నారు. క్రింద బోరింగ్ దగ్గర ఇంకుడు గుంత తవ్వించుకున్నారు. డాబా మీద పడిన వర్షపు నీరంతా క్రింద ఇంకుడు గుంతలోకి వస్తుంది. హాలు, రెండు బెడ్‌రూములు వచ్చాయి.
కొత్తగా ప్రిన్సిపాల్‌గా ప్రమోట్ అయినవారికి నల్గొండలో ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది. పతంజలి ఒక రిసోర్స్ పర్సన్‌గా పంపబడ్డాడు. ‘లీడర్‌షిప్ క్వాలిటీస్ రిక్వయిర్డ్ ఫర్ ప్రిన్సిపాల్స్’ అనే అంశం మీద మాట్లాడుమని కోరారు.
భగవద్గీత, భీష్ముని ఉపదేశం, విదుర నీతి మొదలైన వాటి నుండి కోట్ చేస్తూ, వాటిని ప్రిన్సిపాల్ పోస్టుకనుగుణంగా మలచి, వివరించాడు పతంజలి.
“నేను ప్రిన్సిపాల్‌ను. నామాటే శాసనం అనే పవర్ కాన్షస్‌నెస్‌ను విడనాడండి. ది ప్రిన్సిపాల్ ఈజ్ ఓన్లీ ది ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. స్టాప్ అందరి నీ సమానంగా చూడాలి. ఎవ్వరికీ అన్ డ్యూ అడ్వాంటేజ్ ఇవ్వకండి. ప్రతిరోజూ ఖచ్చితంగా ఒక క్లాసు చెప్పండి. విద్యార్థులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
ఏ విషయంలోనూ డౌట్ పెట్టుకోకండి. తెలిసినవారినడిగి దాన్ని తీర్చుకోండి.
‘సంశయాత్మా వినశ్యతి’ అన్నాడు గీతాచార్యుడు. మీరు సమయపాలన ఖచ్చితంగా పాటిస్తే మీ స్టాఫ్ కూడా పంక్చువల్‌గా ఉంటారు. మనకు ప్రభుత్వం అధికారమిచ్చింది. ఇతరులను వేధించడానికి కాదు. సహాయం చేయడానికని. స్టాఫ్‌కు రావల్సిన ఇంక్రిమెంట్స్, ఇ.యల్. ఎన్ క్యాష్‌మెంట్స్ జిపిఎఫ్‌లోన్స్, లాంటివి డిలే చేయకండి. ‘వెంటనే ఇచ్చేస్తే విలువ తెలియదు’ అని మనవాళ్లనుకుంటుంటారు. అది తప్పు, వెంటనే ఇచ్చేస్తే మన గౌరవం పెరుగుతుంది. గాని తరగదు”.
మన జె.యల్స్‌లో ఒక్కొక్కరిలో ఒక్కే ప్రతిభ దాగి ఉంటుంది. అది గుర్తించి వారికి విధులు కేటాయించండి. అవి సక్రమంగా నెరవేర్చినపుడు మెచ్చుకోండి. అవసరమైనపుడు కాఠిన్యం చూపాలి తప్పదు.
‘ప్లీజింగ్ మ్యానర్స్’ అలవర్చుకోండి. ‘సర్వీస్ విత్ ఎ స్మయిల్’ మనల్ను అందరికీ దగ్గర చేస్తుంది. విష్‌యు ఆల్ ది బెస్ట్.”
చప్పట్లు మారుమోగాయి.
తర్వాత కొశ్చన్ పేపర్ సెట్టింగ్, సిలబస్ కమిటీలు, సబ్జెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రాములు, వాల్యుయేషన్ ప్రాసెస్ మీద శిక్షణ యిలా చాలా కార్యక్రమాలు జరిపాడు అందరి సహకారంతో. యూనివర్సిటీ ప్రొఫెసర్లను, చుక్కా రామయ్యగారి లాంటి విద్యావేత్తలను ఆహ్వానించేవారు.
వాటన్నిటికీ కావలసిన ఫండ్స్ కోసం వివరంగా ఫైలు పెడితే దశరథరాం గారు కనీసం చదవనయినా చదవకుండా అప్రూవ్ చేసేవారు. పతంజలి మీద అంత నమ్మకం ఆయనకు.
ఆయన కూడ ట్రాన్స్‌ఫరై సంక్షేమశాఖకు డైరెక్టరుగా వెళ్లిపోయారు. అయినా పతంజలితో టచ్‌లో ఉన్నారు. వారి అమ్మాయి వివాహానికి వసుధను తీసుకొని వెళ్లాడు.
“ఫి జెమ్స్ ఫర్ ది న్యూలీ వెడ్” అని ఇంగ్లీషులో పంచరత్నాలు వ్రాసి, డిటిపి చేయించి అందమయిన ప్రేమ్ కట్టించి వధూవరులకు బహూకరించాడు.
డెపుటేషన్ ఒక సంవత్సరమే ఉంది. ఈలోగా పతంజలికి డి.వి.ఇ.వో.గా ప్రమోషన్ వచ్చింది. కమీషనర్‌గారు వెళ్లి తీరాలని అంటే సెక్రెటరీ సోమయాజిగారు ఆయనను రిక్వెస్ట్ చేసి, పతంజలి సేవలు అవసరమని చెప్పి, బోర్డులోనే కొనసాగించుటకున్నారు. డి.వి.ఇ.ఓ క్యాడర్ కాబట్టి జాయింట్ సెక్రెటరీ (వొకేషనల్)గా అప్‌గ్రేడ్ చేశారతన్ని.
ఒకసారి రవీంద్రభారతిలో గుమ్మడి గోపాలకృష్ణగారి ‘సత్యహరిశ్చంద్ర’ నాటకానికి వెళ్లాడు పతంజలి. నాటకం ప్రారంభం కాలేదు. బయట ఘంటసాల కళావేదికలో సంగీత విభావరి జరుగుతూంటే వెళ్లి విందామని వెళూతూన్నాడు. సి. నారాయణరెడ్డిగారు ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నారు. ఆ సాహితీ శిఖరానికి నమస్కరించాడు.
ఆయన పతంజలిని కూర్చోమని, “మీరెవరో తెలుసుకొనవచ్చా” అనడిగారు. “నేను ఇంటర్‌మీడియట్ విద్యామండలిలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నానండి. నా పేరు పతంజలి శర్మ”
ఆయనన్నాడు “మీరు బోర్డు అనకుండా విద్యామండలి అనడం, జాయింట్ సెక్రటరీ అనకుండా సంయుక్త కార్యదర్శి అనడం నాకు నచ్చింది. మీ పేరు కూడా నాకు నచ్చింది”
“కృతజ్ఞతలు సార్” అన్నాడు పతంజలి. “నేను మీ అభిమానిని సార్” అన్నాడు.
“మంచిది.” అన్నాడాయన.
“గురువుగారూ, చాలా సంవత్సరాల నుండి నా మనస్సులో ఒక సందేహం ఉండిపోయిందండి. మీరు అనుమతిస్తే తీర్చుకుంటాను”
“మీ సందేహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తాను. అడగండి”
“మీరు రాసిన శివరంజనీ.. నవరాగిణీ’ అనే పాటలో, ‘జనకుని కొల్వున అల్లన సాగే జగన్మోహినీ జానకీ’ అన్నారు స్వయంవరానికి బయలుదేరిన సీతాదేవి నిజంగా జగన్మోహినే. బాగుంది. కాని మీరు తర్వాత చరణంలో, ‘వేణుధరుని రధమారోహించిన, విదుషీమణి రుక్మిణీ’ అన్నారు.
ఆ సందర్భంలో, ఆమె తెగువ, సాహసం సూచించే పదమైతే బాగుండేదని నా ఉద్దేశం. ‘విదుషీమణి’ అంటే పండితురాలని కదా అర్థం. అందులో ఆమె వైదుష్యం ఏముంది. నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి”
సినారె గారి ముఖం ఒక్క క్షణం గంభీరమై మరుక్షణం ప్రసన్నమయింది.
“పతంజలి శర్మగారూ! మీరన్నది నిజమే. ఆ పదంలో ఔచిత్యం తప్పింది. మీరు చాలా లోతుగా చూస్తారే. భేష్!” అని పతంజలి భుజం తట్టాడా సాహితీ దిగ్గజం. అనేసిన తర్వాత పతంజలికి భయమేసింది. “నీకెందుకు రా! నీ వెంత నీ బ్రతుకెంత? నన్నే విమర్శించేంత వాడివా” అని చడామడా దులిపేస్తాడనుకున్నాడు. కాని శిఖరాయమానమైన ఆయన వ్యక్తిత్వం తేటతెల్లమయింది. ‘ప్రమాదో ధీమతామపి!’
మహా వ్యాఖ్యాత మల్లినాధ సూరి అన్నట్లు, “మహా కవి ప్రయోగానాం సాధు” మహకవి ప్రయోగించినాడు కాబట్టి అది మంచిదే. సినారె గారి సంస్కారం మరింత పరిమళించింది. అటుగా వెళుతున్న సాంస్కృతిక శాఖ సంచాలకులు అమరేంద్ర గారిని పిలిచాడాయన.
“అమర్! ఈయనెవరో తెలుసా! పతంజలిశర్మగారని సంయుక్త కార్యదర్శిగారట. చాలా ఘటికుడు సుమా! నా శివరంజని పాటలో దొర్లిన ఒక అనౌచిత్యాన్ని నా దృష్టికి తెచ్చారు” అని విషయమంతా వివరించారు. అమరేంద్రగారు పతంజలిని అభినందిస్తే పతంజలి అన్నాడు వినమ్రుడై “అది సందేహం మాత్రమే. మన తెలుగు జాతి గర్వించతగిన సృజనశీలి ఆయన. వారితో అలా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను”
సినారె గారన్నారు నవ్వుతూ
“మీకు నత్కీరుని కథ తెలిసే వుంటుంది. సాక్షాత్తు పరమేశ్వరుని కవిత్వాన్నే తప్పు పట్టాడాయన. శపిస్తానన్నా భయపడలేదు.”
తన తప్పును ఒప్పుకోవడమే కాదు దాన్ని ఇతరులకు కూడ చెప్పి, ఎత్తి చూపిన వాడిని ప్రశంసించగల ఔదార్యం ఎంతమందికుంటుంది? ఆ మహానుభావునికి పాదాభివందనం చేసి వచ్చేశాడు. నాన్న చెప్పిన పద్య భాగం గుర్తొచ్చింది.
“ధీ లక్ష్మీ కృపాపాత్రులీ వసుధన్ గర్వము పొందనేరరుగదా ప్రఖ్యాతులై యొప్పిన్”
“వినయ సౌశీల్యానికి ప్రతిరూపమే సినారె” అనుకున్నాడు. తాను చేసిన అధిక ప్రసంగానికి గిల్టీగా ఫీలవుతూ ఇల్లు చేరుకున్నాడు. “ఎంత తప్పు! ఛీ, నా బతుకు చెడ!” అని తనను తానే తిట్టుకున్నాడు.
***
వాగ్దేవక్కయ్య పోన్ వచ్చిందొక రోజు. రామ్మూర్తి బావకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో చేర్చారట. బైపాస్ చేయాలి చెన్నై తీసుకొని వెళ్లండి అని చెప్పారట. వెంటనే చెన్నైలోని అపాలో హాస్పిటల్‌లో చేర్చారట. నీవు వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది. వెంటనే సెలవు పెట్టి చెన్నై చేరుకున్నాడు. రామ్మూర్తి బావ బలహీనంగా ఉన్నాడు. పతంజలిని చూసి నవ్వాడు.
“జీవితం నుండే వి.ఆర్. తీసుకుంటానేమోరా! మీ అక్కను నీవే చూసుకోవాలి.”
“అదేమిటి బావ! అలా అంటారు! ఆపరేషన్ జరిగి నీవు త్వరగా కోలుకుంటావు. అధైర్యపడవద్దు” అని చెప్పాడు.
కానీ దురదృష్టం. బావ దక్కలేదు. అక్కయ్య దుఃఖం చెప్పడానికి వీల్లేదు. మేనల్లుళ్లిద్దరూ తండ్రి శవం వద్ద నిలబడి బిక్క మొగాలేసుకొని చూస్తున్నారు. కారులో ‘బాడీ’ తీసుకొని కడపకు వచ్చేసి, బావకు అంత్యక్రియలు జరిపించారు. ఒక్కసారిగా కళావిహీనమయిన అక్కయ్య ముఖాన్ని చూడలేకపోయినాడు తమ్ముడు. వాళ్లిద్దరి అనుబంధం అతనికి బాగా తెలుసు. ‘ప్రాణసఖీ’, ‘హృదయేశ్వరీ’ అంటూ అక్కయ్యను ఎంత ప్రేమగా చూసుకొనేవాడో ఆయన. పతంజలి అంటే కూడ చాలా ఇష్టం బావకు. సికింద్రాబాదులో ఆయనతో పాటు సరదాగా తిరిగినవన్నీ గుర్తొచ్చాయి అక్కయ్కకు ధైర్యం చెప్పి హైదరాబాదుకు వచ్చేశాడు.
రెండో అటెంప్ట్‌లో సి.ఎ. పూర్తి చేసింది. బుజ్జమ్మ. పతంజలి కూతుర్ని అక్కున చేర్చుకుని, గర్వపడ్డాడు. వసుధ ప్రజ్ఞకు దిష్టితీసింది. అందరూ కలిసి యాదగిరి గుట్టకు వెళ్లి నరసింహస్వామిని దర్శించుకొని వచ్చారు.
‘కార్వీ’ అనే స్టాక్ బ్రోకింగ్ కన్సల్టెంట్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. బంజారాహిల్స్‌లో ఉంటుంది దాని ఆఫీసు. జీతం ముఫై వేలు. ఆరు నెలలు అందులో చేసిన తర్వాత ‘ఆమెజాన్’లో చేరింది. గచ్చిబౌలి. క్యాబ్ ఫెసిలిటీ కల్పించారు కంపెనీవారు. సంవత్సరానికి ఎనిమిది లక్షల ప్యాకేజీ.
ప్రద్యుగాడికి పెళ్లి చేద్దామంది వసుధ. సంబంధాలు చూస్తున్నారు.
(సశేషం)