[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[ఆఫీసులో కొత్త బాధ్యతలలో కుదురుకుంటాడు పతంజలి. ఆఫీసువారు మరో ఇద్దరు అధికారులతో కలిసి కారులో వచ్చే ఏర్పాటు చేస్తారు. ట్రాన్స్‌పోర్టు సమస్య తీరుతుంది. ఆఫీసు పనినంతా స్ట్రీమ్‌లైన్ చేస్తాడు. ఒక పెద్ద టెండరు నోటీసును – పలు నివేదికలను అధ్యయనం చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకి ఇవ్వవలసిందిగా సూచిస్తాడు. ఇక్కడ జరిగే అవినీతిని నిరోధిస్తాడు. బోర్డుకి వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా జరిపితే, అది ప్రశాంతంగా సాగిపోయేలా చూస్తాడు పతంజలి. తన ఆఫీసులోను, మరో విభాగంలో సమాచార హక్కు చట్టం మీద వివరంగా ప్రసంగించి, అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. ప్రద్యుమ్న ట్రైనింగ్ కోసం అమెరికా వెడతాడు. ప్రజ్ఞ సిఎ ఫైనల్‍లో ఒక పరీక్ష తప్పుతుంది. ఈసారి పాసవుతానని తండ్రికి చెప్తుంది. రామ్మూర్తి బావ రిటైరవుతాడు. అక్క, పిల్లలు బానే ఉంటారు. బోర్డు సెక్రటరీకి బదిలీ అవుతుంది. కొత్త సెక్రటరీ చండశాసనుడు. అవినీతిని అస్సలు భరించడు. ఆరు నెలలకే ఆయన్నీ బదిలీపై పంపేస్తారు. తరువాత సెక్రటరీగా వచ్చిన దశరథరామ్ గారితో పతంజలికి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాహిత్యపు చర్యలు జరుగుతాయి. ఆయన పతంజతిలో పద్యాలు పాడించుకుని ఆనందించేవారు. పతంజలి డ్రాఫ్టింగ్ అంటే అభిమానించేవారు. మార్కండేయశర్మకు పక్షవాతం వస్తుంది. అందరూ వెళ్ళి చూస్తారు. కోడమూరు నుంచి ఒక ఆయుర్వేద వైద్యులు వచ్చి చికిత్స చేస్తారు. మరోసారి వస్తే మనిషి దక్కరని చెప్తారు. వసుధ అక్కడే ఉండి మామకు సేవలు చేస్తుంది. దురదృష్టం, కొద్ది రోజులకే మళ్ళీ స్ట్రోక్ వచ్చి ఆయన శివైక్యం చెందుతారు. కొడుకులంతా శాస్త్రోక్తంగా అపరకర్మలు నిర్వహిస్తారు. వైకుంఠ సమారాధన రోజు సాయంత్రం జె.పి హైస్కూల్లో సంతాప సభ జరుగుతుంది. బోర్డులో రెండేళ్ళు పూర్తయ్యాక, పతంజలిని మరో విభాగంలో వేశారు. బాధ్యతలు మారిపోతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తాడు. లంచాలు తీసుకుంటాడని చెప్పుకునే ఉద్యోగిని హెచ్చరిస్తాడు. ఇంటి పైన మరో అంతస్తు నిర్మిస్తాడు. కొత్తగా కాలేజీ ప్రిన్సిపాల్ అయినవారికి నల్గొండలో జరిగిన ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌కి హాజరై చక్కని సూచనలు చేస్తాడు పతంజలి. రామ్మూర్తి బావకి హార్ట్ ఎటాక్ వచ్చి మరణిస్తాడు. కార్యక్రమాలు పూర్తి చేసి అక్కకి, పిల్లలకి ధైర్యం చెప్పి వస్తాడు పతంజలి. రెండోసారి సిఎ పూర్తి చేస్తుంది ప్రజ్ఞ. ఉద్యోగం వస్తుంది. ప్రద్యుమ్నకి పెళ్ళి చేద్దామని సంబంధాలు చూస్తారు. – ఇక చదవండి.]
[dropcap]ఆర్[/dropcap].ఐవోల కున్నంత పని డి.వి.ఇ వోలకుండదు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లన్నీ అతని అజమాయిషీలోనే ఉంటాయి. నెలకొకసారి ప్రిన్సిపాల్స్ మీటింగ్ ఏర్పాటు చేసి రివ్యూ చేస్తుండాలి. వొకేషనల్ కోర్సులన్నీ పర్యవేక్షించాలి.
వొకేషనల్ పాస్ ఔట్స్ అందరినీ స్ట్రీమ్‌లైన్ చేసి, కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించి పిల్లలకు ఇంటర్న్‌షిప్ ఇప్పించి తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం కూడ డి.వి.ఇ.వో ముఖ్య బాధ్యత. పతంజలి చొరవతో చాలామంది పిల్లలకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. పరీక్షల సమయంలో సెంటర్లు తిరిగి తనిఖీ చేసేవాడు. ప్రభుత్వ వాహనం సమకూరింది.
జూన్ 30న పదవీ విరమణ తేదీ. ఆ రోజు ఘనంగా సభ సన్మానం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. రెండు రోజులు సెలవు వస్తే హైదరాబాదుకు వచ్చి ఉన్నాడు పతంజలి. కేంద్రం ఎ.పి., తెలంగాణా రాష్ట్రాలను విభజించింది. విడివిడిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఎ.పి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం ఈ టీవీ న్యూస్‌లో చూపిస్తున్నారు. ఆరోజు సండే. పిల్లలూ ఇంట్లోనే ఉన్నారు. భోజనాలయ్యాయి. విశ్రాంతిగా టి.వి ముందు సోఫాలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
“రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగల పదవీ విరమణ వయస్సును 58 నుండి అరవై సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినాము. ఈ పెంపు జూన్ 30 నుండి అమలులోకి వస్తుంది”
పిల్లలిద్దరూ చప్పట్లు కొడుతూ తండ్రిని వాటేసుకున్నారు. పతంజలికి కలా నిజమా అనిపించింది. వేరే న్యూస్ ఛానల్స్‌లో కూడ ఇదే స్క్రోలింగ్ వస్తూంది.
“ఇదేమిటి వసుధా! ఇలా జరిగింది? మరో వారం రోజుల్లో తట్టా బుట్టా సర్దుకొని వచ్చేద్దామనుకుంటే..” పతంజలి కాసేపు డల్ అయిపోయాడు. వసుధ పతంజలి ప్రక్కన కూర్చుని అతని చేయి తన చేతిలోకి తీసుకుంది.
“ఏమిటి బావా! అలా అయిపోయినారు! ఇంకా రెండేళ్లు సర్వీసు కలిసింది. మంచిదే కదా! మీరేమన్నా ముసలివాళ్లయిపోయారా! ఇంకొక రెండేళ్లు సమాజానికి సేవ చేసే అవకాశము లభించింది. ఇంట్లో కూచుంటే ఏమొస్తుంది? బిజీగా ఉండడం మీకిష్టమే కదా! మరో రెండేళ్లపాటు నెలనెలా లక్షన్నర రూపాయలు వస్తుంది. ప్రజ్ఞ పెళ్లి ఘనంగా చేద్దాం”
“ముందే చెబుతున్నాను. ఈ రెండేళ్లు మిమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వను. శ్రీకాకుళంలో ఇల్లు చూడండి. నేనూ వచ్చేస్తాను మీ దగ్గరికి. ఎంతో గడిచిపోతాయి? పిల్లలు ఎలాగో మ్యానేజ్ చేసుకుంటారు. వీడికి తొందరగా పెండ్లి చేసేస్తేసరి! డోంట్ వర్రీ, బీ హ్యాపీ, మైడియర్ బావా” అంటూ రాగయుక్తంగా పాడింది వసుధ.
పతంజలి నవ్వేశాడు. “నీవొచ్చి నా దగ్గర ఉంటానంటే మరో రెండేళ్లయినా చేసేస్తా” అన్నాడు.
“మరి నా గతేమిటి? దీనికి వంట వచ్చినా చేయదు. నన్ను చేయమంటుంది. అదేం కుదరదు. అమ్మను నీతో పంపము” అన్నాడు కొడుకు.
“పాపం నాన్నకు కష్టంరా. అమ్మను వెళ్లనీ” అన్నది కూతురు.
ప్రతి ఇంట్లో ఇంతేనేమో! నాన్నా కూతురు ఒక జట్టు, తల్లి కొడుకు ఇంకో జట్టు.
శ్రీకాకుళానికి వెళ్లిపోయాడు మర్నాడే. స్టాఫ్‌కు చెప్పాడు ఆఫీసుకు దగ్గరలో ఏదైనా యిల్లు చూడమని. వారం రోజుల్లో బరాటం వీధిలో ఇండివిడ్యుయల్ పోర్షన్ చూశారు. చాలాబాగుంది. అద్దె పదివేలు. పతంజలి కెందుకో అపార్ట్‌మెంట్ కల్చర్ నచ్చదు. వసుంధర వదినె వాళ్ల దయవల్ల హైదరాబాద్ నగరంలో ఇండివిడ్యువల్ హౌస్ కట్టకోగలిగాడు. కాదు. వాళ్లే కట్టించి ఇచ్చారు.
కొన్ని ముఖ్యమైన వంట సామాను, తమ రూములోని డబుల్‌కాట్ మంచం, బెడ్‌రూంలోని చిన్న టీవీ, నాలుగు కుర్చీలు, కొంత పూజా సామాగ్రి, పటాలు, విగ్రహాలు తీసుకున్నారు. ‘నవత’లో బుక్ చేశారు.
శ్రీకాకుళంలో కాపురం ప్రారంభించారు. గ్యాస్ స్టవ్ అక్కడే సమకూర్చుకున్నారు. టిఫిన్ చేసి ఆఫీసుకు వెళ్లిపోయేవాడు పతంజలి. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్లేవాడు. హైదరాబాద్ కమీషనరేట్‌లో డి.వి.ఇ.వో ల మీటింగ్ జరిగితే ఇద్దరూ వెళ్లేవారు. వసుధ వారం రోజులు పిల్ల దగ్గరుండి వచ్చేది.
జిల్లాలోని కాలేజీలను రాండమ్‌గా సర్‌ప్రైజ్ విజిట్ చేసేవాడు. ఎవర్నీ ఏమనేవాడు కాదు. యాక్షన్ తీసుకొనేవాడు కాదు. కానీ కాలేజీల పనితీరులో గణనీయమయిన మార్పు వచ్చింది. ప్రిన్సిపాల్స్ సెల్‌ఫోన్‌కు చేయకుండా కాలేజి ల్యాండ్‌లైన్‌కు చేసేవాడు. కొందరు దొరికిపోయేవారు.
ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టి, వొకేషనల్ కోర్సులకు కావలసిన ఇన్‌ఫ్రాస్టక్చర్, ల్యాబ్ ఎక్విప్‌మెంట్, సమకూర్చాడు. కాంట్రాక్ట్ లెక్చరర్లను తక్కువ చేసి చూడవద్దని మీటింగ్‌లో చెప్పేవాడు. వారందరూ నెలకు ఐదువందల చొప్పున కాంట్రిబ్యూట్ చేసేలా ఒప్పించి వారికోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాడు. దానికి కో-ఆర్డినేటర్‌గా ఉండి, వారికి అనారోగ్యమో లేక ఇతర ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చినపుడు వారికి నాన్ -` రిఫండబుల్ లోన్ సౌకర్యం కల్పించేవాడు.
స్టడీ అవర్స్ విషయంలో ఏమాత్రం రాజీపడేవాడు కాదు పతంజలి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఫలితాలను కూడ మీటింగుల్లో రెవ్యూ చేసేవాడు. ఫలితంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతాశాతం బాగా పెరిగింది. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ఎనిమిదవ స్థానం నుండి మూడవ స్థానానికి ఎగబ్రాకింది.
కాలేజీల్లో ఆడప్లిలలకు టాయిలెట్ల విషయంలో ఎంతో కృషి చేశాడు పతంజలి. వాటికి ప్రభుత్వం నుండి త్వరగా విడుదల అయ్యేలా చూసేవాడు. విజిట్స్‌కి వెళితే వాటి మెయింటెనెన్స్ ఎలా వుందో తనిఖీ చేసేవాడు. చాలామంది ఆడపిల్లలు ఆ ఇబ్బంది వల్ల కాలేజికి రారని తెలుసతనికి.
కమీషనర్‌గారు డి.వి.ఇ.వోస్ మీటింగ్‌లో ‘దాతల సహకారంతో’ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించమని ఆదేశించారు. దాని ప్రకారం పతంజలి ప్రిన్సిపాల్స్‌ను మోటివేట్ చేసి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాసవి క్లబ్ లాంటి సంస్థలను అప్రోచై, కొన్ని నిధులు కొన్ని కాలేజీలకు సమకూర్చాడు. స్థానికంగా ఉన్న ధనవంతులు కూడా ఆ పథకానికి ఆర్థిక సహాయం చేయసాగారు.
దీనివల్ల హాజరు శాతం పెరిగింది. అడ్మిషన్స్ మెరుగుపడినాయి. ప్రభుత్వం జూనియర్ కళాశాల పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వసాగింది. ఒక రాష్ట్ర స్థాయి స్వచ్ఛంద సంస్థ పిల్లలకు ఉచితంగా క్వశ్చన్‌బ్యాంక్స్ సరఫరా చేయసాగింది. ‘పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టం’ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోసాగింది.
ప్రద్యుమ్నకు ఒక సంబంధం వచ్చింది. వాళ్లది కడప. పిల్ల తండ్రి ఇ.పి.ఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్. ఆయన పేరు విశ్వపతి. తల్లి బి.ఎస్.ఎన్.ఎల్ ఉద్యోగిని. పెద్దమ్మాయే వధువు. పేరు ‘ఉదయజ్యోతి’, ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రెండో అమ్మాయి చందనశీతల. కర్నూల్లో మెడిసిన్ చేస్తూంది. ముందు వసుధ ప్రద్యు పిల్లను చూసి వచ్చారు. పద్యు తన పెళ్లి విషయం పూర్తిగా తల్లిదండ్రులకు వదిలేశాడు. వాడికీ అమ్మాయి నచ్చింది. హైదరాబాదులో అమ్మాయి పెదనాన్న వాళ్లున్నారు. ‘రాంనగర్ గుండు’ దగ్గర ఆయన ‘బస్ భవన్’లో పనిచేస్తారట. పతంజలి హైదరాబాదుకు వచ్చినపుడు ‘ఉదయజ్యోతి’ని వాళ్లింటికి తీసుకువచ్చి చూపించారు. అమ్మాయి చాలా బాగుంది. కలుపుగోలుగా ఉంది. కొడుకును ఏడిపిద్దామని, “నాకేమంత నచ్చలేదురా. వేరే సంబంధం చూద్దాంలే. అయినా ఇంకా మనం వాళ్లకు ‘ఎస్’ చెప్పలేదుగా!” అన్నాడు.
తల్లీకొడుకులు వంటింట్లో మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత పతంజలి వద్దకు వచ్చారు.
“వాడు ఆ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడండీ” అన్నది వసుధ. ప్రద్యు తండ్రి పక్కన కూర్చుని గారాలు పోయాడు.
పతంజలి బిగ్గరగా నవ్వాడు. “ఊరికే అన్నాను రా నాన్నా! నీ సంతోషం కంటే నాకు కావలసిందేముంది” అన్నాడు. విశ్వపతిగారికి ఫోన్ చేసి తమ సమ్మతిని తెలియజేశాడు.
నెల రోజుల తర్వాత కడపలో నిశ్చితార్థం జరిగింది. తర్వాత నెలలో వైభవంగా వివాహం జరిగింది. కొడుకు పెండ్లి కోసం పదిరోజులు లీవ్ పెట్టాడు పతంజలి. లీవ్ పీరియడ్‌లోనే అతనికి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ఆర్‌జెడిఐఇ) గా ప్రమోషన్ వచ్చింది. రాజమండ్రిలో మాత్రమే ఆ పోస్టు ఉంటుంది. వెంటనే వెళ్లి ఛార్జి తీసుకున్నాడు. రెగ్యులర్ ప్రమోషన్ కాదు. ఎఫ్.ఎ.సి (ఫుల్ అడిషనల్ ఛార్జ్) ఇచ్చారు.
పెళ్లయిన పదిరోజులకే ప్రద్యుకు బెంగుళూరులో మంచి ఆఫర్ వచ్చింది. ‘ఆరకిల్’ కంపెనీలో డిప్యూటీ మార్కెటింగ్ మేనేజర్. వెళ్లి జాయినయ్యాడు. బన్నేరుఘట్ట రోడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. రెంట్ ఇరవై వేలు. కారు కూడ కొన్నాడు ప్రద్యు. మారుతి సుజుకి. ‘బ్రెజ్జా’ టమోటోరెడ్ చాలా బాగుంది.
పతంజలికి ఇంకా ఐదు నెలలు మాత్రమే సర్వీసు ఉంది. రాజమండ్రిలో ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో బస. ఒకసారి తన ప్రస్థానాన్ని సమీక్షించుకుంటే ఆశ్చర్యమనిపిస్తుందతనికి. ఎక్కడి వెల్దుర్తి. నిమ్మతోట, పట్టు పురుగులు, ట్యుటోరియల్స్, పబ్లికేషన్స్, లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం తప్ప తనను ఇంతవరకు తీసుకొచ్చింది మరొకటి కాదు!
‘నిమిత్త మాత్రం భవ కౌంతేయ!’ అని భగవానుడన్నట్లుగా, పతంజలి జె.యల్ క్యాడర్‌లో ఎలా ఉన్నాడో. ఆర్‌జెడిగా అలాగే ఉన్నాడు. వసుధ పదిరోజుల పాటు బెంగుళూరులో కొడుకు కోడలి సంసారం చక్కదిద్ది వచ్చింది. ఈ నాలుగు నెలల కోసం ఎందుకని రాజమండ్రిలో ఫ్యామిలీ పెట్టలేదు.
‘పవర్ ఫర్ సర్వీస్’ అన్నది పతంజలి మోటో. తన పరిధిలో నిర్ణయాలను వెంటనే తీసుకొని, అమలు చేసేవాడు. ముఖ్యంగా జె.యల్స్ ప్రిన్సిపాల్స్ సర్వీసులో ఉండగా చనిపోతే అర్హతగల వారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇచ్చే అధికారం అతనికే ఉండేది. రెండు మూడు నెలల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ప్రిన్సిపాల్స్ యొక్క పెన్షన్ ప్రపోజల్స్ సత్వరం అకౌంటెంట్ జనరల్ వారికి పంపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేవాడు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాలు సకాలానికి విడుదలయ్యేలా కృషి చేసేవాడు.
శ్రీకాకుళం నుండి కృష్టా వరకు ఆరు జిల్లాలు అతని ఆధిపత్యంలో ఉండేవి. మొదట్లో బడేమియా గారన్నట్లు ‘ఆరు జిల్లాలకు అందగాడు’.
ఒకసారి అమలాపురం రోటరీ క్లబ్ వార్షికోత్సవాలకు పతంజలిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తన జీవితానుభవాన్నంతా రంగరించి కీలకోపన్యాసం చేశాడు.
“ఎవరి మీదయినా కోపం వస్తే అయిష్టత స్థాయిని దాటకూడదు. ద్వేషం ఎవరిపైనా పెంచుకోకూడదు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి. ఎంత చేసినా వారి ఋణం తీర్చుకోలేము. భార్యకు సముచిత గౌరవం ఇవ్వండి. ఆమెను ఎప్పుడూ చిన్నబుచ్చవద్దు. మన జీవితాన్ని ఆనందమయం చేసుకొనే అవకాశం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. మీ వృత్తిని ప్రేమించండి. సంతోషంగా పని చేయండి. మీ పనిలో మీరు చూపే నిబద్ధతే కర్మయోగం. ‘నాకన్నీ తెలుసు’ అన్న భావన అస్సలు ఉండకూడదు. బర్ట్రండ్ రస్సెల్ అనే మేధావి అంటాడు.
“ది రియల్ నాలెడ్జ్ లైస్ ఇన్‌నోయింగ్ దట్ వుయ్ డోన్ట్ నో ఎనీథింగ్”
“మనకేమీ తెలియదని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం”
“జనకరాజర్షి వద్దకు ఒక జ్ఞాని వచ్చాడట. ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తానన్నాడట. మహారాజు ఆయన్నడిగాడట.
“సంపూర్ణంగా జ్ఞానం సముపార్జించారా?”
అవునన్నాడట జ్ఞాని. దయచేసి ఒక నెల రోజులాగి రమ్మని ప్రార్థించాడు జనకుడు. ఆయన అఫెండ్ అయ్యాడట. కాని అవతల మహారాజుతో వ్యవహారం. సరే అన్నాడు. ఆయనకు ఒక చక్కని ఆశ్రమం ఏర్పాటు చేశాడు జనకుడు.
నెల తర్వాత వస్తే “ఇంకో నెల తర్వాత రమ్మ”ని ప్రార్థించాడట. అలా నాలుగు సార్లు తిప్పిన తర్వాత జ్ఞానికి జ్ఞానోదయమైంది. “నిజమయిన జ్ఞాని జనకుడే. తాను సర్వజ్ఞుడిననే భ్రమలో ఉన్నాడు. దాన్ని గ్రహించిన జనకుడు తనను తిప్పుతున్నాడు. తానాయనకు ఉపదేశించేముందని. వచ్చే నెలలో రాజుగారి దగ్గరకు వెళ్లకుండా ఉండిపోయాడు”
రెండు రోజుల తర్వాత రాజర్షి రథగజతురగములతో బయలుదేరి కానుకలు తీసుకొని, ఆశ్రమానికి వెళ్లాడు.
“మహాత్మా! నాకు జ్ఞాన భిక్ష పెట్టిండి! అని ప్రార్థించాడు.
“ఇంకా పరీక్షిస్తున్నావా మహారాజా!” అన్నాడట జ్ఞాని నవ్వుతూ.
“లేదు స్వామి! మీరు నిస్సందేహంగా జ్ఞానులే. కాని ‘నేను సర్వజ్ఞుడిని’ అన్న అహంకారం మొన్నటి వరకు మీలో ఉండేది. “నా అంతటి వాడిని ఈ రాజు నిరాకరిస్తున్నాడే” అనే అసహనం కూడ ఉండేది. మీరు ఎప్పుడయితే నా వద్దకు రావడం మానేశారో, అప్పుడే మీరు అహంకారాన్ని త్యజించి సంపూర్ణజ్ఞానులైనారు. ప్రసాదించండి జ్ఞానసంపద”
“నీకు నేను చెప్పేదేమీ లేదు పొమ్మన్నాడట” ఆయన.
కాబట్టి, “క్లెయిమింగ్ అమ్నిసైన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇగ్నోరెన్స్ శాచురేటెడ్” అంటాడు ప్రఖాత అమెరికన్ వేదాంతి హెన్రీ జాకబ్ త్యారో. “సర్వజ్ఞత్వాన్ని ఆపాదించుకోవడమే అజ్ఞానానికి పరాకాష్ట”
ఇలా మన పురాణాలనుండి, భగవద్గీత నుండి, ఇతి హాసాలనుండి ఆసక్తికరంగా ఉటంకిస్తూ సాగింది పతంజలి ఉపన్యాసం. సభికులు ముగ్ధులయ్యారు.
తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్లు పిలిచారు. అలా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఇంచుమించు ప్రతివారం ఏదో ఒక సభ వుండేది. విద్యార్థులకు చెప్పేటపుడు కొంత ఆధునికతను, సినిమాలను ఉటంకించేవాడు. ఉదాహరణకు జనకమహారాజు కథ చివర్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తీసుకొచ్చేవాడు. “బాబా’ సినిమాకు క్యాప్షన్‌గా ఉన్న ‘తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత’ అని రెఫర్ చేసేవాడు. కొత్త సినిమాల్లో పాటలను మెచ్చుకునేవాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చిన ఒక పాటలో ‘పక్షుల కెపుడూ పాస్‌పోర్ట్ లేదూ’ అనే చరణం ఎంత గొప్పదో చెప్పేవాడు. స్వేచ్ఛను అంత అందంగా వర్ణించిన ఆ కవిని మెచ్చుకొనేవాడు.
“రవితేజ సినిమా ‘నేనింతే’లో ఒక పాట ఉంది. అది ఐటమ్ సాంగ్. ‘పుడుతూనే ఉయ్యాల చనిపోతే మొయ్యాల’ అనే పల్లవితో ప్రారంభమవుతుంది. జననమరణాల సారాన్ని, లోతైన వేదంతాన్ని, ఎంత సింపుల్‌గా చెప్పాడో చూడండి” అని చెప్పేవాడు.
అలా యూత్‌ను ఆకట్టుకొనేవాడు.
ఒకసారి సెకెండ్ జోన్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ ‘ఏలూరు డిక్లరేషన్’ అని ఒక సభ నిర్వహించింది. ఆర్.జె.డి. గారిని అధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌లో తాను సంపాదించుకున్న పరిజ్ఞానాన్నంతా రంగరించి, భవిష్యన్నిర్దేశనం చేశాడు పతంజలి. ‘ఏలూరు డిక్లరేషన్’లో అతని సూచనలు చేర్చబడ్డాయి.
పదవీ విరమణ తేదీ దగ్గరపడుతోంది. రాజమండ్రి ‘ఇస్కాన్’ సంస్థ వారు ‘ఆధ్యాత్మిక – లోక కల్యాణం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పతంజలిని ‘ఆత్మీయ అతిథి’గా ఆహ్వానించారు. ‘సుందర చైతన్యానందస్వామి’ అనుగ్రహభాషణం చేశారు. ఆయన ప్రసంగాలంటే పతంజలికిష్టం. చాలా ఇన్‌ఫార్మల్‌గా, జోవియల్‌గా, లోతైన ఆధ్యాత్మిక విషయాలను చెప్పగలడాయన.
తనవంతు వచ్చినపుడు క్లుప్తంగా, మనసుకు హత్తుకునేలా ప్రసంగించాడు పతంజలి. తండ్రి మార్కండేయశర్మ వ్రాసిన ‘ఆధ్యాత్మ దర్శన అభ్యాసయోగము’ లోని విషయాలను విశదీకరించాడు. ‘నాన్ అటాచ్‌మెంట్’ ను సాధించాలంటే ముందు ‘అటాచ్‌మెంట్’ను పెంచుకోవాలన్నాడు. ‘గాడ్ హాజ్ నధింగ్ టు డువిత్ యువర్ కర్మ’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని చెప్పాడు. పెద్ద పెద్ద మతాధిపతులు. పీఠాధిపతులు సైతం, విద్యాలయాలు, వైద్యశాలలు నెలకొల్పి లోక కల్యాణం కోసం ఎలా కృషి చేస్తారో ఉదాహరణలిచ్చాడు.
“పేదలకు కడుపు కింత తిండిపెట్టలేని మతాలెందుకు? “దేరీజ్ నో రిలిజియన్ ఫర్ ఎమ్‌ప్టీ బెల్లీస్” అన్నాడు వివేకానందుడు. భక్తి పేరుతో ‘రిచ్యుయల్స్ ఫర్ రిచుయల్స్ సేక్’ (తంతు) అని గుడ్డిగా పూజలు దీక్షలు చేయడం అభిలషణీయం కాదు. వివేకాందుడే గర్జించాడిలా.
“యువర్ ‘భక్తి’ ఈజ్ నధింగ్ బట్ సెంటిమెంటల్ నాన్సెన్స్!”
సాటి మానవుని కన్నీరు తుడవలేని మతం మతమే కాదు. బయట అన్నార్తుడు దీనంగా అరుస్తూంటే.
“నైవేద్యం ఇంకా అవలేదు వాడిని అవతలికివెళ్లమను” అనడాన్ని ఏ దేవుడూ సహించడు.
“లాఫ్ అండ్ బి మెర్రీ, ఫర్ ది లైఫ్ ఈజ్ బ్రీఫ్” అన్న జాన్ మేస్ ఫీల్డ్ పద్యం మన జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవచ్చో సూచిస్తుంది.
రవీంద్రుని గీతాంజలిలోని పద్యాన్ని చదివి వినిపించాడు పతంజలి.
“హూమ్ డస్ట్ దౌ వర్షిప్ ఇన్ ది డార్క్ కార్నర్ ఆఫ్ ది టెంపుల్?
హి ఈజ్ ఫవుండ్ ఇన్ ది టిల్లర్ ఆఫ్ ది ల్యాండ్
ఇన్ ది పాత్ మే కర్ బ్రేకింగ్ ది స్టోన్స్” అంటాడు విశ్వకవి.
“ఎవర్ని పూజిస్తున్నావు గుడిలో, ఆ చీకటి మూలలో?
ఆయన అక్కడ లేడు!
భూమిని దున్నే కర్షకుడిలో ఆయన్ను చూడు!
రోడ్డు వేయడానికి రాళ్లు కొట్టే కూలివాడిలో ఆయన్ను దర్శించు!
ఇలా సాగింది పతంజలి ప్రసంగం. ‘సుందర చైతన్య’ పతంజలిని ఆశీర్వదించారు. ఇస్కాన్ వారు పతంజలికి శాలువా కప్పి సన్మానించారు.
జూన్ 30న, తన అరవయ్యవ సంవత్సరం పూర్తయిన రోజున పదవీ విరమణ చేశాడు పతంజలి.
***
అదే రోజు రాజమండ్రి ఆర్.జె.డి. ఆఫీసు ఆవరణలో పతంజలి దంపతులకు ఘన సన్మానం చేశారు. కొడుకు, కోడలు, కూతురు, వియ్యంకుని కుటుంబం, మహిత కుటుంబం అందరూ వచ్చారు. రాష్ట్రంలోని ఇతర ఆర్.జె.డిలు కొందరు, పతంజలికి సన్నిహితులైన కొంతమంది డి.వి.ఇ.వోలు, ఆర్.ఐ.ఓ.లు వచ్చారు. పలాస, బారువ, కోట బొమ్మాళి, నర్సీపట్నం, యస్ కోటల నుండి లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ తరలి వచ్చారు. హైదరాబాద్ నుండి బోర్డు అధికారులు కూడా హాజరయ్యారు.
ఆహూతులందరికీ షడ్రసోపేతమయిన విందు భోజనం ఏర్పాటు చేశాడు పతంజలి. వేదిక వెనుక గోడకు ఆర్.జె.డి దంపతుల ఫోటోలతో కూడిన స్వాగత ఫ్లెక్సీని వేలాడదీశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమైంది. కడప ఆర్.జె.డి. రామసుబ్బన్న అధ్యక్షత వహించారు. ముందుగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
ముందు ఘన సన్మానం జరిగింది. డజన్ల కొద్దీ శాలువాలు, పూలదండలు, పుష్పగుచ్ఛాలు. వసుధ, పతంజలిలతో దండలు మార్పించారు. పట్టు వస్త్రాలు వారికి బహూకరించారు.
ఒక్కొక్కరూ పతంజలి వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ క్లుప్తంగా ప్రసంగించసాగారు. పతంజలికి అనిపించింది. “ఇంతమంది అభిమానాన్ని చూరగొనేలా చేసిన ఆ అహోబిలనారసింహునికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలా?” అని.
ఇంతలో ‘ఇండియన్ నేవీ’ వారి నీలిరంగు యూనిఫారం ధరించిన ఒక అధికారి వేదికను సమీపించి, అధ్యక్షుడిని తనకు మాట్లాడటానికి రెండు నిమిషాలు అవకాశమివ్వాలని కోరాడు. వేదికపైకి వచ్చి, పతంజలికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛమందించి, తాను తెచ్చిన ఉంగరాన్ని పతంజలి వేలికి తొడిగాడు. వంగి అతని పాదాలకు నమస్కరించాడు వినమ్రంగా.
పతంజలి అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరా? అని చూస్తున్నాడు. అతనన్నాడు. “మాస్టారూ! నేను దుర్యోధనను. పలాస కాలేజిలో మీ శిష్యుణ్ణి. గుర్తొచ్చానా?” పతంజలికి గుర్తొచ్చింది.
అతను మైక్ అందుకొని చెప్పాడు.
“అందరికీ నమస్కారం. నా పేరు దుర్యోధన. మాది పలాస. శ్రీకాకుళం జిల్లా. నేను మాస్టారు శిష్యుడిని ఈరోజు నేను నేవీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసరుగా వైజాగ్‌లో పని చేస్తున్నానంటే అది మా ఇంగ్లీషు మాస్టారి చలవే. ఒక రోజు పరీక్షల్లో నేను సి.ఐ. గారితో గొడవ పడ్డాను. అతను నన్ను స్టేషనుకు తీసుకుపోయి చితక్కొట్టాలని చూశాడు. నేనూ తగ్గలేదు. అప్పుడు మా ఇంగ్లీషు మాస్టారు నన్ను చాచి చెంపమీద ఫెడీమని కొట్టారు. అక్కడి నుండి పంపించేశారు. సి.ఐ. గారికి నచ్చచెప్పారు. ఆ రోజున మాస్టారు నన్ను కొట్టి పంపించేసి ఉండకపోతే నేను పోలీసు రికార్డుల్లోకి ఎక్కి ఉండేవాడిని. నాకు “బాగా చదువుకోరా! మంచి ఉద్యోగం వస్తుందని బోధపరిచారు. నేవీలో చేరాను. ప్రయివేటుగా డిగ్రీ పూర్తి చేశాను. జె.సి.ఓ నయ్యాను. ఈ రోజు మాస్టారు రిటైర్మెంట్ అని వైజాగ్‌లో నా ఫ్రెండ్ చెబితే వచ్చేశాను. మాస్టారే లేకపోయి ఉంటే..” అతని గొంతు గద్గదమయింది. కళ్లు తుడుచుకొని,
“నాకీ అవకాశమిచ్చినందుకు కృతజ్ఞుతలు” అని చెప్పి ముగించాడు. సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. పతంజలి లేచి శిష్యుడిని అక్కున చేర్చుకున్నాడు.
ఉపాన్యాసాలన్నింటిలో హైలైట్ యస్.కోట నుండి వచ్చిన తెలుగు లెక్చరర్ పెంటయ్యది. పతంజలితో అతనికున్న అనుబంధాన్ని సభికులతో పంచుకున్నాడు. రాసుకొచ్చిన కవిత రాగయుక్తంగా చదివాడు.
“బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పినవాడు ఆ పతంజలి!
జీవన గమ్యాన్ని మాకు తేట తెల్లం చేసి
నాలాంటి వారి నెందరినో మలచిన
వ్యక్తిత్వ శిల్పి ఈ పతంజలి!
ఆయనకు నా నమస్సుమాంజలి!”
అలా సాగింది పెంటయ్య కవిత!
“ప్రిన్సిపాల్‌గారు నన్నొక కొడుకుగా చూసుకున్నారు. సంగీత సాహిత్యాల పరిమళాలు గుబాళించే సుమమాలిక ఆయన! దళితుడనయిన నాకు క్లిష్టమైన వేదమంత్రాలను నేర్పిన మహానుభావుడు!” అంటూ
పతంజలి వద్ద నేర్చుకున్న “హగ్‌ంసస్యుచిషత్” అన్న మంత్రాన్ని సుస్వరంగా ఉచ్చరించాడు. మళ్లీ కరతాళ ధ్వనులు.
పతంజలి దంపతులకు పాదాభివందనం చేశాడు పెంటయ్య. అతన్ని ఆప్యాయంగా కౌగిలంచుకున్నాడు పతంజలి.
చివర్లో వసుధను మాట్లాడమని కోరారు.
“మావారు చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చారు. చిన్నతనం నుండి నానా రకాలుగా శ్రమించారు. కుటుంబాన్ని, తోడబుట్టినవారిని అభివృద్ధిలోకి తెచ్చారు. ఆయన మా మేనమామ కొడుకే (సిగ్గుపడింది) మేమిద్దరం భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటాం. చాలాకాలం మేం దూరంగా ఉన్నా, మీరందరూ ఆయనను జాగ్రత్తగా చూసుకున్నారు. మీకు కృతజ్ఞతలు”
తర్వాత ప్రద్యుమ్న మాట్లాడాడు.
“మా నాన్నగారు నన్ను గాని, మా చెల్లిని గాని ఫలానాదే చదవమని ఏనాడూ బలవంతపెట్టలేదు. మాకు స్వేచ్ఛనిచ్చారు. ఆయనకు జన్మించడం మా అదృష్టం” అంటూ ఇంగ్లీషులో తాను వ్రాసి, ఫ్రేమ్ చేయించిన ఇంగ్లీషు పొయిట్రీ చదివాడు. దానిపేరు,
“డాడ్! గ్లాడ్ ఐ యామ్ యువర్ ల్యాడ్! “
“అందరూ చదువు నేర్చుకోడానికి కాలేజీకి వెళతారు.
మా నాన్న చదువు చెప్పడానికి మొదటగా వెళ్లారు” అలాసాగింది ప్రద్యు కవిత్వం. చదువంతా ప్రయివేటుగా చేశాడని వాడి ఉద్దేశం.
బుజ్జమ్మ ఇంగ్లీషులో ప్రసంగించింది. ఆ అమ్మాయి యాక్సెంట్ చాలా మందికి అర్థం కాలేదు. చివరికి “లవ్ యు డాడ్!” అంటూ నాన్న బుగ్గ మీద వేదిక మీదే ముద్దు పెట్టి, నాన్న కూతురునిపించుకుంది.
ప్రోగ్రాం ముగిసేసరికి సాయంత్రం ఏడయింది. ప్రద్యు ఉదయ వైజాగ్ వెళ్లి ప్లైట్‌లో బెంగుళూరుకు వెళ్లారు. వసుధ ప్రజ్ఞ ‘గరీబ్‌రధ్’ లో హైదరాబాదుకు వెళ్లారు. మిగతావాళ్లు మర్నాడుదయం వెళ్లిపోయారు.
పతంజలి ప్రసంగం అతి క్లుప్తంగా సాగింది. తన ప్రస్థానంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. కొంత భావోద్వేగానికి లోనై అంతగా మాట్లాడలేకపోయాడు.
రెండు రోజులుండి, ఛార్జ్ అప్పజెప్పి, ఆఫీసు వ్యవహారాలు చూసుకొని, హైదరాబాదు చేరుకున్నాడు.
నాలుగు రోజులు సరదాగా గడిచిపోయాయి. తర్వాత కాలం గడవటం దుర్భరమైంది. రచనా వ్యాసంగం ప్రారంభించాడు. కథలు, కవితలు వ్రాసి పత్రికలకు పంపసాగాడు.
వాగ్దేవక్కయ్య హైదరాబాదులోనే ఉంది. రెండో కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. శశిధర్ వాడి భార్య ఇద్దరూ ఉద్యోగాలకు వెళతారు. చివరకు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది! మలక్‌పేటలోని శివసచ్చిదానందాశ్రమంలో ఒక రూం తీసుకుంది. ఆశ్రమానికి కొంత కాంట్రిబ్యూషన్ ఇప్పించింది కొడుకులతో. ఇంత వండుకొని తింటూంది. ఏక భుక్తం. దత్తమందిరం చుట్టూ రోజూ ప్రదక్షిణాలు చేస్తూంది. సాయంత్రం సత్సంగంలో కూర్చుంటుంది. ఆరు నెలలకోసారి తమ్ముడింటికి వచ్చి నాలుగు రోజులుండి పోతూంటూంది. సినిమాలు చూస్తారిద్దరూ. కాచిగూడ చౌరస్తాకు వెళ్లి నవసాహితి, నవోదయ షాపుల్లో నవలలు కథా సంకలనాలు కొనుక్కొచ్చుకుంటారు అక్కాతమ్ముళ్లు. ఆమె ఎంచుకున్న జీవన విధానాన్ని వసుధ కూడ సపోర్టు చేస్తుంది.
అక్కయ్య శేష జీవితం తనకనుకూలంగా మలచుకోవడాన్ని యితివృత్తంగా తీసుకొని ‘వానప్రస్థం’ అనే కథ రాశాడు పతంజలి. అది ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురింపబడింది. అక్కయ్య సంతోషానికి అంతులేదు.
‘పూర్ డాడ్’ అన్న శీర్షికతో సమాజంలో తల్లికున్న గౌరవం ప్రాధాన్యత తండ్రికెందుకు లేవని ప్రశ్నిస్తూ ఒక కవిత పంపాడు ‘నవ్య’ వారపత్రికకు. దాన్ని వారు ప్రచురించారు.
ఏ వర్గంవారయినా, ఏ స్థాయి వారయినా, అవకాశం వస్తే ఇతరులను దోచుకుంటారని నిరూపిస్తూ ‘కాదేదీ దోపిడీ కనర్హం’ అనే కథ రాశాడు. అది ‘విపుల’ మాస పత్రికలో అచ్చయింది.
తన తండ్రి మార్కండేయ శర్మ సాహిత్య వ్యవసాయాన్ని అవధానాలను, ఆయన వ్యక్తిత్వాన్ని ఒక సమగ్ర పరిశీలన చేస్తూ, ‘బ్రాహ్మీమయమూర్తి’ అనే వ్యాసాన్ని రాసి, ‘తెలుగు వెలుగు’కు పంపాడు పతంజలి. దాన్ని ప్రచురణకు స్వీకరించామనీ, వీలు వెంట ప్రచురిస్తామని తెలుగు వెలుగువారు మెసేజ్ పంపారు. ఆ విధంగా ‘పితౄణము’ తీర్చురున్నాడు పతంజలి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకటొకటే రాసాగాయి. రిటరయిన నెలలోపే జి.పి.ఎఫ్ వచ్చింది ఇరవై ఐదు లక్షలు. దాన్ని ప్రజ్ఞ పెళ్లి కోసమని యస్‌బిఐ లో ఎఫ్.డి చేశాడు. పెన్షన్ ప్రపోజల్స్ కమీషనరేట్ నుండి ఎ.జి.కి వెళ్లే ముందు ఇన్‌డెప్త్ ఇన్స్‌పెక్షన్‌లు జరిగాయి. డెప్యూటేషన్ పీరియడ్‌లో ఇన్స్‌పెక్షన్ ఉండదు. బోర్డువారిచ్చే ‘నో డ్యూస్ సర్టిఫికెట్’ సరిపోతుంది. డి.వి.ఇ.ఓ., ఆర్.జె.డి గా పని చేసిన పీరియడ్స్‌కు నిశిత పరిశోధన జరిపి, పతంజలికి క్లీన్ చిట్ ఇచ్చారు. పెన్షన్ ప్రపోజల్స్ వెళ్లిపోయాయి.
ఈలోగా ఎపిజిఎల్‌ఐ రెండులక్షలు, జిఐఎస్ రెండులక్షలు, 300 రోజులు ఇ.ఎల్ ఎన్ క్యాష్‌మెంట్ పదిహేను లక్షలు వచ్చాయి. మరో నెల తర్వాత. పెన్షన్ ఫిక్సయింది. అరవై మూడు వేలు పెన్షన్ వస్తుంది. గ్రాట్యూటీ పన్నెండు లక్షలు, పెన్షన్‌లో నలభై శాతం కమ్యూట్ చేస్తారు. అదొక ఇరవై మూడు లక్షలు వచ్చింది. రిటరయిన ఏడు నెలలకు బెనిఫిట్స్ అన్నీ వచ్చేశాయి. మొత్తం ఎనభై లక్షల దాకా వచ్చినట్లే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద ఇన్‌కంటాక్సు లేని విధానం రూపొందించిన మహనీయులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
వనస్థలిపురం యస్‌బిఐ మేనేజరు ఆంజనీ కుమార్ గతంలో కోట బోమ్మాళిలో ఆఫీసరుగా పనిచేశారు. ప్రస్తుతం ఛీఫ్ మేనేజరు. పతంజలిని “గురువుగారూ” అని పిలుస్తాడు. పతంజలి అతన్ని ‘తమ్ముడూ” అంటాడు. తన కష్టార్జితమంతా అతనికప్పగించాడు. యస్‌బిఐ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టించాడతను. ఎమర్జెన్సీలో తీసుకోవడానికి వీలుగా లిక్విడ్ ఫండ్‌లో కొంతవేశారు. వాటి మీద వచ్చే డివిడెండ్ వాడుకోకుండా అన్నీ గ్రోత్ ఆప్షన్స్‌లో పెట్టారు.
ఒక కాగితం మీద తనకు వచ్చిన బెనిఫిట్లన్నీ వివరంగా రాశాడు పతంజలి. తమ తదనంతరం అదంతా చెరిసగం తీసుకోవాలని అన్నాచెల్లెళ్లకు చెప్పాడు. ఇల్లు క్రింది ఫ్లోర్ అన్నయ్యకు, పై ఫ్లోర్ చెల్లెలికి చెందుతాయని స్పష్టం చేశాడు. పెళ్లి కోసం ప్రజ్ఞ పేర దాచిన డబ్బు కేవంల ప్రజ్ఞకేననీ, శ్రీకాకుళంలోని సైట్ మాత్రం ప్రద్యుకు పుట్టబోయే వారి కోసం వాడాలన్నాడు. ఆ స్థలం విలువ ప్రస్తుతం ఇరవై లక్షలుంది.
బుజ్జమ్మకు దాదాపు పద్ధెనిమిది తులాల బంగారం చేయించారు. అది ప్రజ్ఞదే. వసుధకున్న బంగారం పన్నెండు తులాలుంటుంది. ఆమె తదనంతరం అది కోడలికి కూతురికి సమానంగా చెందుతుంది.
“ఎందుకు బావా ఇప్పటినుండి ఈ అప్పగింతలు? పిల్లలు బాధపడరూ?” అన్నది వసుధ.
“ఏం బాధపడరు. వారికీ క్లారిటీ ఉంటుంది. ఎన్ని రోజులుంటామో తెలియదు కద!
“డెత్ లర్క్స్ అట్ ఎవ్విరి కార్నర్ టు పవున్స్ అపాన్ యు” అంటాడు స్మిత్.
“మరణం మూల మూలల్లో పొంచి ఉంది. నీ మీదకు దూకుదామని నిరంతరం ఎదురు చూస్తూ ఉంటుందని దానర్థం” అన్నాడు.
భగవంతుని దయవల్ల పిల్లలిద్దరూ మంచి స్థితిలో ఉన్నారు. ఉదయ కూడ బంగారుతల్లి. బాగా కలిసిపోయింది. ఆ అమ్మాయి గర్భవతి.
ఎంతసేపని రచనా వ్యాసంగం చేయగలడు? హయత్‌నగర్ నుండి కుంట్లూర్ వెళ్లే దారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. వెళ్లి ప్రిన్సిపాల్‌ను కలిశాడు. ఆయన పతంజలికి తెలుసు.
“మీరు బోర్డులో జె.యస్.గా చేసేవారు కదా సార్!” అన్నాడు. కూర్చోబెట్టి కాఫీ తెప్పించాడు.
“ఏం చేస్తున్నారు సర్!”
“రాజమండ్రిలో జె.డి.గా రిటైరైనానండి. ఇక్కడే సెటిలైనాను. పక్కనే వనస్థలిపురంలో ఉంటాము. ఖాళీగా ఉన్నాను కదా రోజూ ఒక పూట వచ్చి పిల్లలకు రెండు క్లాసులు తీసుకుందామని. మమ్నల్నగడానికి వచ్చాను. లంచ్ టైంకి వెళ్లిపోయి రెస్ట్ తీసుకుంటాను.”
“మీ సబ్జెక్ట్ ఏది సార్!”
“ఇంగ్లీషండి”
“మీ అంతటి వారు వచ్చి పిల్లలకు పాఠాలు చెబుతానంటుంటే అంతకంటే కావలసినదేమి సార్. మాకు ఒక కాంట్రాక్ట్ జెయల్ ఉన్నాడు. టైంటేబుల్ అడ్జస్టు చేయమని చెబుతాను” అని ఒక సీనియర్ జె.ఎల్ పలిచి విషయం చెప్పాడు.
“రేపు మంచిరోజు రేపట్నుంచి వస్తాను” అని చెప్పి గుమ్మందాటుతుంటే “జెడి. క్యాడర్‌లో రిటైరైనోనికి ఇదేం కర్మనే” అని ఆ సీనియర్ అనడం వినిపించి నవ్వుకున్నాడు.
నాలుగు రోజులు చెప్పాడు. పిల్లలకు బాగా నచ్చింది. అతడు చెప్పే విధానం కాంట్రాక్ట్ లెక్చరర్ ఎందుకో పతంజలి మీద అయిష్టం పెంచుకున్నాడు. పతంజలి వచ్చినప్పటి నుండి పిల్లలు అతని మాట వినడం లేదు. అతని ప్రాభవం తగ్గసాగింది. నెల రోజులు గడిచాయి. రోజూ ఏదో ఒక సాకు చెప్పి క్లాసు ఇవ్వడం లేదు. చాలా సేపు వెయిట్ చెయ్యించి, “సారీ సార్! ఈ రోజు అడ్జస్ట్ కావడం లేదు” అనేవారు.
ప్రిన్సిపాల్ లేకపోతే ఎవరూ పట్టించుకొనేవారు కాదు. ఆ కాంట్రాక్ట్ లెక్చరర్ కనీసం పతంజలికి విష్ కూడా చేసేవాడు కాదు. పతంజలికొక పద్యపాదం గుర్తొచ్చింది.
“అధికారాంతమునందు చూడవలె గదా
ఆ అయ్యసౌభాగ్యముల్”
వసుధతో చెప్పి బాధపడ్డాడు.
“ఊరికే చెపుతానంటే విలువ ఉండదు బావా!” అన్నది. విసుగొచ్చి వెళ్లడం మానేశాడు.
వనస్థలిపురంలోనే వైదేహినగర్‌లో ఒక అనాథాశ్రమం ఉంది. టెంత్ వరకు చదివిస్తారట పిల్లలను. వెళ్లి మేనేజరును కలిశాడు. “8, 9, 10 తరగతి పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతాను ఉచితంగా” అని ప్రతిపాదిస్తే అతనదో రకంగా జూసి,
“ఇయ్యాల్రేపు మస్తుమందొస్తున్రు మీ లెక్క. పోరగాండ్లకు పురసత్తుండాలె గద! ఏదయిన డొనేషన్‌గిట్ల ఇస్తరా? పొద్దుగాల అవది. రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు సెప్పున్రి” అంటూ రశీదుబుక్ తీశాడు.
పతంజలికి అర్థమయింది. తన సర్వీసెస్ తీసుకోవాలంటే తనే డబ్బివ్వాలి. పైగా తననేదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నాడు. “సరే పిల్లలేంచేశారు పాపం” అనుకొని వెయ్యిరూపాయలు డొనేషన్ యిచ్చాడు. మేనేజరు పెద్దగా స్పందించలేదు.
“గణేష్ నవరాత్రుల్ల, మా పిల్లలను పూర్‌ఫీడింగ్‌కు పంపనీకెనే రెండు వేలు దీసుకుంటాం ఎరికెనాసార్” అన్నాడు. నిర్లక్ష్యంగా డబ్బు తీసుకొని “రశీదు గిట్ట అవసరమా మల్ల” అన్నాడు.
కావాలని చెప్పి రశీదు తీసుకున్నాడు.
మర్నాడు రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లాడు. మూడు హైయ్యర్ క్లాసులు కలిసి నలభై ఏడు మంది పిల్లలున్నారు అని చెప్పారు. అక్కడ ఉన్న ఒకతన్ని పిలిచి అందర్నీ ఒక రూములో కూర్చోబెట్టిమని చెప్పాడు. కాసేపటికి అతను తిరిగి వచ్చి ఒక రూములోనికి తీసుకెళ్లాడు. అదేదో స్టోరు రూములాగ ఉంది. పిల్లలను ఎన్.జి.ఓస్ కాలనీ లోని జెడ్.పి హైస్కూలుకు పంపుతారట. ఇక్కడ చదివించేదేవి ఉండదట.
కాసేపటికి ఏడెనిమిది మంది పిల్లలు వచ్చారు. అప్పుడే నిద్రకళ్లతో ఉన్నారు. కూర్చోబెట్టి బేసిక్ గ్రామరు చెప్పాడు కాని వాళ్లు శ్రద్ధ చూపలేదు. రెండో రోజు కూడ పిల్లలు పెద్దగా రాలేదు. నాలుగు రోజులు చూసి మానేశాడు.
అనాథాశ్రమాలు నడపడం సిటీలో పెద్ద బిజినెస్ అని తెలుసుకున్నాడు. ప్రజల్లో సోషల్ సర్వీస్ చేయాలని, దాని ద్వారా పబ్లిసిటీ పొందాలనీ ఉన్న మోజును వాళ్లు క్యాష్ చేసుకుంటారు. నిధులు సేకరిస్తారు. పిల్లలకని దుప్పట్లు పంచితే వాటిని అమ్ముకుంటారు.
సోషల్ సర్వీస్ ప్రహసనం ఎలా ఉంటుందో గణేశ్ నిమజ్జనం రోజు కాలనీలో చూశాడు పతంజలి. సాయంత్రం ఏడు గంటల తర్వాత స్వామిని సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనం చేస్తారు. ఉదయం స్వామికి విశేష పూజలుంటాయి. తర్వాత అనాథలకు అన్న సంతర్పణ. ఒక బస్సులో తీసుకొస్తారు. అనాథ పిల్లలను. వనస్థలిపురంలో రెండే అనాథాశ్రమాలున్నాయి. గణేశ్ నవరాత్రి తొమ్మిది రోజులూ వారికి చాలా డిమాండ్ ఉంటుంది. ముందే ‘డొనేషన్’ ఇచ్చి బుక్ చేసుకోవాలి. వారికి టైం అడ్జస్టు కాకపోతే ఒకరోజే రెండు ‘పూర్‌ఫీడింగ్’లకు కూడ ఒప్పుకుంటారు.
పదకొండు గంటలకే పిల్లలను తీసుకొచ్చారా రోజు. పందిరిలో రెండు వరసలుగా కూర్చోపెట్టారు. వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు హడావుడిగా బ్యాడ్జిలు తగిలించుకొని తిరుగుతున్నారు. చిన్న సభ జరిగింది. వార్డు కౌన్సిలర్ గారు తమ సందేశమిచ్చారు. అనాథలను ఆదరించడం చాలా ఉత్తమమైనదని చెప్పారు.
కాలనీ ఆడవాళ్లు పట్టుచీరలు నగలు ధరించారు. కాలనీ యూత్ షార్ట్స్, టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. ముందుగా పిల్లలకు బిస్కెట్ పాకెట్స్, కేక్స్, కూల్‌డ్రింక్స్ ఇచ్చారు. అరగంట గడవకముందే ఆశ్రమ నిర్వాహకులు పిల్లలకు వడ్డన చేయడం ప్రారంభించమన్నారు. మళ్లీ ఒంటి గంటకు ‘వీరాంజనేయ కాలనీ’లో ఇంకో కార్యక్రమం ఉందట.
ప్లాస్టిక్ విస్తళ్లలో పిల్లలకు వడ్డించారు. స్వీటు, వెజిటబుల్ బిర్యాని, మిర్చిబజ్జి, పప్పు, ఒక వేపుడు, ఒక ముద్దకూర, సాంబారు, అప్పడాలు, పెరుగు.. కొందరు మహిళామణులు పిల్లల నోట్లో స్వీట్ లేదా ఏదో ఒకటి పెడుతూ ఫోటోలు తీయించుకున్నారు. పిల్లలు పెద్దగా ఏమీ తినలేదు! విలువైన ఆహార పదార్థాలన్నీ వృథా!
కాలనీ ఆఫీసు బేరర్లు, భోజనాల తర్వాత పిల్లలకు టవళ్లు పంచారు. ఆ విషయంలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కాలనీ ఎన్నికలు జరిగినపుడయితే చెప్పనక్కరలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు.
గోవిందరెడ్డి ఫోన్ చేశాడు. ఆయన కూడ పతంజలితో పాటే రిటైరైనాడు. నల్లగొండలో సెటిల్ అయినాడు.
“అన్నా, నమస్తేనే”
“గోవిందన్నా, అంతా బాగేనా!”
“దేవుని దయవల్ల అందరం మంచిగున్నమే. నీకెరికెనేగదా, నల్గొండ శాండ్ బాక్స్, ప్రతీక్ ఫౌండేషన్లకు నేను కో ఆర్డినేటరునని. అన్ ఎంప్లాయిడ్ పోరగాండ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పాల నీ పేరు జెప్పిన, ఒక నెల రోజులు నీవు నల్లగొండకొచ్చి వాళ్లకు మంచిగ కోచింగ్ యియ్యాలె. ఏమంటవు?”
“తప్పనిసరిగా వస్తా గోవిందన్న. టైమింగ్స్?”
“ఉదయం 9 నుండి ఒంటిగంట వరకు నీవు హయత్ నగర్లో నల్లగొండ నాన్‌స్టాప్ ఎక్కినవంటె గంటన్నరలో ఈడుంటావ్. లంచ్ నీకు ఈడనే అరేంజ్ జేపిస్త. లంచ్ తర్వాత ఇంటికి పోవుడే”.
“లంచ్ దేముందిలే గాని, పిల్లలకు పాఠాలు చెప్పడానికి అవకాశం కల్పిస్తున్నావు. అదే పదివేలు”
“నీకు రెమ్యూనీరేషన్ ఏముండది. బస్ ఛార్జీలు ఇస్తరు. పోరగాండ్లందరు గరీబోళ్లు”
“బస్ ఛార్జీలు కూడ నాకొద్దు. మనవల్ల వాళ్లలో కొందరికైనా జాబ్స్ వస్తే చాలు”.
ఉదయాన్నే స్నానం పూజ ముగించుకొనేవాడు. రోజూ నరసింహస్వామికి పురుషసూక్తంతో అభిషేకం. అష్టోత్తర శతనామావళి చదువుతూ అర్చన చేస్తాడు పతంజలి. రిటైరైంతర్వాత ప్రశాంతంగా స్వామిని పూజించుకోగలుగుతున్నాడు. ప్రతి శనివారం సహస్రనామార్చన. ప్రతి సోమవారం శివునికి ఏకవార రుద్రాభిషేకం.
ఏడు గంటలకల్లా నల్లగొండ నాన్‌స్టాప్ ఎక్కేవాడు. ఇంటికి దగ్గరగా ఉన్న బస్టాప్‌లో 290 నం ఎక్కి హయత్‌నగర్ వెళ్లేవాడు. ఎనిమిదిన్నరకు దిగేసరికి గోవిందరెడ్డి పంపిన వ్యక్తి బైక్‌తో సిద్ధంగా ఉండేవాడు. ఉడిపి హోటల్లో టిఫిన్ చేసి నిట్స్ (నల్లగొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్) చేరుకొనేవాడు. ఒంటిగంటవరకు దాదాపు యాభైమంది యువకులకు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ బోధించేవాడు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసు కూడా తీసుకునేవాడు. మధ్యలో పదకొండు గంటలకు ఉస్మానియా బిస్కెట్స్ తో పాటు అద్భుతమయిన ఇరానీ టీ ఇచ్చేవారు. పావుగంట బ్రేక్.
తన సొంత ఖర్చుతో ‘అబ్జెక్టివ్ టైప్’లో టెస్ట్స్ తయారు చేసి, జిరాక్స్ తీయించి, పిల్లలతో చేయించేవాడు. అవి చూసి ‘నిట్స్’ వారు వాటిని ఆన్‌లైన్ టెస్ట్ లుగా తమ ఇంజనీరింగ్ విద్యార్థులకు పెట్టేవారు.
రోజూ అరగంట ‘వ్యక్తిత్వ వికాసం’ తరగతి నడిచేది. “మన ఆత్మ విశ్వాసమే మన బలం” అని వారికి నూరిపోశాడు. న్యూనతా భావం మనిషిని కుంగదీస్తుందని చెప్పాడు. “హమ్‌కిసీసే కం నహీ” అనేది బాగా గుర్తుంచుకోవాలని కోరేవాడు.
ఒకసారి ఒక అమ్మాయి లేచి, “మేమందరం తెలుగు మీడియంలో జదివినం సార్. పేరెంట్స్ లేబరు పని జేసి చదివిచ్చిండ్రు. గవర్నమెంటు పుణ్యమా అని ఫీజు రీఇంబర్స్‌మెంట్ వల్ల ఇంజనీరింగ్ వరకు చేయగల్గినాం. మాతోన ఏమైతదనిపిస్తుంది” అన్నది. పతంజలి అన్నాడు. “అమ్మాయ్, నేను కూడ టెంత్ వరకు తెలుగు మీడియమే. అప్పట్నుంచి పి.జి వరకు ప్రయివేటుగా చదివాను. ప్రపంచంలో గొప్పవాళ్లందరూ నోట్లో వెండి స్పూన్ పెట్టుకొని పుట్టలేదు. తల్లిదండ్రులు లేబరు పని చేసినారని బాధపడకూడదు. గర్వపడండి! భగవంతుని దృష్టిలో అన్నివృత్తులూ గొప్పవే”
“మీకు టాల్‌స్టాయ్ మహాకవి తెలుసా?”
“తెలుసు సర్. రష్యాదేశం వాడు”
“ఇంకా?”
“‘వార్ అండ్ పీస్’ అనే గొప్ప పుస్తకం వ్రాసిండు.”
“వెరిగుడ్. ఇంకా?’
“..”
“మన జాతి పిత మహాత్మాగాంధీ గారికి అభిమాన రచయిత. ఆయన రాసిన షార్ట్ స్టోరీస్‌లో ఒక్కటయినా మీరు మీ ఇంగ్లీష్ నాన్ డిటెయిల్డ్‌లో చదివి ఉంటారు.”
ఒక అమ్మాయి చెప్పింది. “అవునుసార్. టెంత్‌లో ఉండె. ‘హౌ మచ్ ల్యాండ్, డజ్ ఏ మ్యాన్ నీడ్?’ అని కథ.”
“గుర్తుందా ఆ కథ. ఏదీ బ్రీఫ్‌గా చెప్పు చూద్దాం”
“ఒకాయనకు పొద్దుగాలనుంచి పొద్దుగూకే వరకు నీవు ఎంతమేర నడుస్తవో, ఆ భూమంత నీదయితదని వరమస్తది. ఆయన నీల్లు దాగకుండ, అన్నం దినకుండ నడుస్తూంటడు. ఆఖరికి ఎక్కువ భూమి సంపాదిచ్చనీకె ఉర్కబట్టిండు. ఉర్కీ ఉర్కి, గసబోసి, ఊపిరందక సచ్చిండు. గాయనకు గుంతదీసి బొందల వెట్టిండ్రు. గది ఆరడుగుల పొడవు రెండడుగుల వెడల్పు ఉంటది. మన్సికి గంత భూమైతే శాన అని తేలుస్తడు టాల్‌స్టాయ్. మంచిగ రాసిండు.”
“ఎంత బాగా చెప్పావమ్మా!” అని ప్రశంసించాడు పతంజలి. “అలాంటిదే ఇంకో కథ రాశాడాయన. ఒక చెప్పులు కుట్టేవాడు తన కొడుకు చనిపోతే. తీవ్రమయిన దుఃఖంలో ఉంటాడు. తన వృత్తిని కూడ మానేసి బాధపడుతుంటాడు.
ఒక క్రైస్తవ సన్యాసి అతని వద్దకు వస్తాడు. అతని దుఃఖానికి కారణం తెలుసుకొని, చాలా తప్పు చేస్తున్నావంటాడు. “కాలం తీరి వెళ్లిపోయిన కొడుకును తల్చుకుంటూ సమాజం పట్ల నీ బాధ్యతను విస్మరిస్తావా?” అని ప్రశ్నిస్తాడు.
“చెప్పులు కుట్టేవాడిని నేనేం చేయగలను”
“భగవంతుడు జార్ చక్రవర్తిని రష్యా దేశాన్ని పరిపాలించమని ఆదేశించాడు. నిన్నేమో చెప్పులు కుట్టమని నిర్దేశించాడు. ఆయన దృష్టిలో మీ ఇద్దరూ ఒకటే. ఇద్దరి పనులూ సమానమే. కాబట్టి దుఃఖాన్ని త్యజించి నీపని నువ్వు ప్రారంభించు” అంటాడా సన్యాసి.
“కాబట్టి ఇన్‌ఫీరియాటీ కాంప్లెక్స్‌ను వదిలెయ్యండి’
క్లాసు ముగిసే సమయానికి గోవిందరెడ్డి వచ్చి భోజనానికి తీసుకొని వెళ్లేవాడు. తర్వాత బస్ ఎక్కించేవాడు.
ఒకరోజు ‘సర్వీస్’ చేద్దామనే తన తపన ఎలా పరిణమించిందో గోవిందరెడ్డికి చెప్పాడు అతడు నవ్వి అన్నాడు.
“ఇయ్యాల్రేపు జమాన గట్లనే ఉంది. నేను నీకు ఏదైనా కాలేజీల మంచి క్యాడరిపిస్తా. రెమ్యూనరేషన్ భీ ఇస్తారు. నీవు అంతగా కావాలంటె ఆ పైసలు సొంతానికి వాడుకోకుండా, గరీబోల్లకు మదద్ జెయ్యి. అది కూడ సర్వీసుగాదానె”
ఇదేదో బాగుందనిపించింది పతంజలికి.
నల్గొండలో, స్వచ్ఛంద సంస్థ వారు తనతో చెప్పించిన పిల్లల్లో ఐదారు మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చాయని గోవిందరెడ్డి ఫోన్ చేశాడు. పతంజలి చాలా సంతోషించాడు.
కోడలు పురిటికి కడపకు వెళ్లింది. వియ్యంకుడు ఒక రోజు ఫోన్ చేశాడు. ఉదయ సాయంత్రం 6 గం॥ మూడు నిమిషాలకు మగపిల్లవాడిని ప్రసవించిందనీ, నార్మల్ డెలివరీ జరిగిందనీ, తల్లీ పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారనీ తెలిపాడు ఆయన. అందరూ వెళ్లి బాబును చూసి వచ్చారు. పతంజలి, వసుధ తాత, నాన్నమ్మలయినారు! 21వ రోజు నామకరణానికి అందరూ తరలివెళ్లారు. వసుధ మనుమడికి వెండి మొలతాడు, బంగారు కాపులు, ఉంగరాలు చేయించింది. పిల్లవాడికి ‘ప్రజ్వల్” అని పేరు పెట్టారు. జ్వాలా నరసింహుడు పతంజలి యింట అవతరించాడు.
మూడో నెలలో హైదరాబాదుకు వచ్చింది ఉదయ. ఐదో నెలలో బెంగుళూరుకు వెళ్లారు వసుధ, పతంజలి, కోడలని మనుమడిని తీసుకొని. ఒక నెల రోజులు ఉండి వచ్చారు. సాయంత్రం వాడిని ఎత్తుకుని బయటకు తీసుకు వెళ్లేవాడు తాత. నాన్నమ్మకు వాడితోనే సరిపోయేది. హైదరాబాద్‌కు తిరిగి వచ్చినా వాడే కళ్లముందు కదలాడేవాడు ఇద్దరికీ. చిన్నప్పుడు ప్రద్యు ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండేవాడు ప్రజ్వల్. పతంజలి వాడికి “ప్రజ్వలయ్యస్వామీ” అని పిలుస్తే చిరునవ్వులు చిందించేవాడు. ఉదయ, వసుధ వాడని ప్రజ్జు కన్నా అని పిలుస్తారు.
ఒకనాడు ఒకాయన ఫోన్ చేశాడు పతంజలికి ఆయన “సి.వి. రామన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్” అనే సంస్థకు ఛైర్మన్ అట. గోవిందరెడ్డికి స్నేహితుడట.
“అన్న మీ గురించి చెప్పిండు సార్. మీ సర్వీసెస్ మాకు గావాల. మీరొస్తే మాట్లాడుకుందాం” అన్నాడాయన. ఆయన పేరు శ్రీశైలవాస్.
“మీ కాలేజి ఎక్కడుంది సార్?” అనడిగాడు పతంజలి.
“రామోజి ఫిల్మ్ సిటీ దాటంగనె రెండు కిలోమీటర్లు బోయినంక లెఫ్ట్‌కు మళ్లాలెసార్. హైవేకు హాఫ్ కిలోమీటరుంటది లోపటికి. రోడ్డుమీదికి మన బిల్డింగ్స్ కనపడ్తయి. మీరు రానీకె కారు పంపిస్త”
“అలాగే రేపు వస్తాను”
“మీ లొకేషన్ నాకు షేర్ జేయుండ్రి”
మర్నాడు కారు తీసుకొని డ్రైవరు వచ్చాడు. ‘సుష్మ’ ధియేటర్ నుండి అరగంట పట్టింది. ఛైర్మన్‌గారు సాదరంగా ఆహ్వానించారు. గోవిందరెడ్డి తన గురించి మరీ ఎక్కువగా చెప్పినట్లున్నాడు. పతంజలి తమ కాలేజీలో పని చేయడమే భాగ్యమన్నట్లు మాట్లాడాడు.
“బి.టెక్ ఫస్టియర్స్‌కు ఇంగ్లీషు సబ్జెక్ట్ ఉంటది సార్. ఫస్ట్ సెమిస్టర్ల కొన్ని గ్రూపులకు, సెకెండ్ సెమిస్టర్ల కొన్ని గ్రూపులకు ఉంటది. అదిగాక ‘ల్యాబ్ మ్యాన్యుయల్” ఉంటుంది. ప్రాక్టికల్స్, జేయించాల కమ్యూనికేషన్ స్కిల్స్‌ల అదంతా రోజు ఒక క్లాసు. ఎంబిఎ కూడ ఉంది మాతాన. వాండ్లకు ‘బిజినెస్ కమ్యూనికేషన్’ అనే సబ్జెక్టుంటది. అది గూడ మీరే డీల్ జేయాల. ఆ రెండు క్లాసులు చెప్పుకొని వెళ్లిపోవుడే.”
“వచ్చేటపుడు మన కాలేజీ బస్‌ల రావొచ్చు” అని బెల్ కొట్టి అటెండర్‌ను పిల్చాడు.
“గా ఎయిట్ నంబరు బస్సు డ్రైవర్ను పిల్చు”
డ్రైవరు వచ్చి నమస్కరించాడు.
“గీ సారు శానా పెద్దాయన. గవర్పమెంటుల జాయంట్ డైరెక్టరుగ జేసి రిటైరయిండు. రేపటిసంది బస్సుల తీస్కురావాలె సారును మంచిగ. వనస్థలిపురం కెళ్లి వచ్చేది నీవే కద!”
“ఔసార్” అని “మీరు యాడంటుండ్రు సార్ వనస్థలిపురంల?” అనడిగాడు డ్రయివరు.
“కమలానగర్”
“నేను బి.యన్. రెడ్డి నుంచి వైదేహి నగర్ మీదొస్తసర్. రవీంద్ర భారతి స్కూల్ కాడ ఉండుండ్రి మీరు. ఎనిమిదింబావువరకు ఆడికొస్త నా ఫోన్ నంబరు తీసుకోండి”
ఛైర్మన్ గారన్నారు. “మీ క్లాసులు రెండూ పదకొండు వరకు ఐపోతాయి సార్. రిటర్న్‌లో మాత్రం ఏదైన వెహికల్ మీద హైవేలో దింపుతాము. ఆడ ఎక్స్‌ప్రెస్ లాగవి. కాని ఆర్డినరీ బస్సులు, టెంపోలు మస్తు దొరుకుతాయి. చెయ్యెత్తితే ఆపుతరు. అరగంటలో సుష్మ కాడ దిగుతరు.”
బాగుందనుకున్నాడు పతంజలి. పన్నెండు కల్లా ఇంటికి చేరుకొని భోజనం చేసి విశ్రాంతి తీసుకోవచ్చు.
“ధ్యాంక్యూ ఛైర్మన్‌గారు! ఈ అవకాశం ఇచ్చినందుకు” అంటే
“మీలాంటివారు రావడం మా అదృష్టం సార్!” అన్నాడాయన. ఫార్మసీ, పాలిటెక్నిక్ కోర్సులు కూడ ఉన్నాయట. ఇంకో ఇంగ్లీష్ లెక్చరర్ కూడ ఉన్నాడట. అతని పేరు “యాదాద్రి” “మనస్వామే” అనుకున్నాడు.
“ఆనరోరియం ఒక మాట అనుకుందాంసార్!”
“నాకంత పట్టింపులేదండి. నాకు వ్యాపకం కావాలి. పిల్లలకు చదువు చెప్పడమంటే నాకిష్టం. నాకు డ్యూ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడం ఇస్తే చాలు”
“అది మీ సంస్కారం సార్. మీ యోగ్యతకు తగినంత ఇవ్వలేం గాని, ట్వంటీ ఫైవ్ తీసుకోండి సార్ నెలకు. వారంలో ఐదు రోజులు చెప్పండి చాలు. హాలిడేస్. వెకేషన్‌తో సంబంధం లేకుండా, ప్రతినెలా మీకు ఇస్తాను. ఐ.టి ప్రాబ్లం లేకుండా క్యాష్ ఇచ్చేస్తాను లెండి”
“థాంక్యూ”
మర్నాటి నుండి కాలేజి బస్సులో వెళ్లసాగాడు. రెండు క్లాసులు చెప్పిం తర్వాత కాలేజి వెహికల్స్ ఏవయినా సిటీకి వస్తుంటే దింపేవారు. లేదా ఎవర్నయినా బైక్ యిచ్చి పంపితే వారు హైవే మీద దింపేవారు. అక్కడ బస్టాప్ లేదు. కానీ చెయ్యి ఎత్తుతే ఆపేవారు అక్కడనుండి ‘సుష్మ’ సెంటర్‌కు ఇరవై రూపాయలు. అక్కడ దిగి ఇంటికి నడిచిపోయేవాడు.
బి.టెక్ ఫస్టియర్ అన్ని గ్రూపులు (ట్రేడ్స్) వందమంది దాకా ఉంటారు. వారికి ‘ఇంగ్లీష్ ఫర్ ఇంజనీయర్స్’ అని ఒక టెక్ట్స్ ఉంటుంది. టెక్నికల్ ఎస్సేస్ ప్రిస్క్రయిబ్ చేశారు. కొన్ని లిటరరీ వ్యాసాలు కూడ. అబ్దుల్ కలాం గారి తొలి అధ్యక్ష ప్రసంగం మొదటి లెసన్.
అందులో ఆయన త్యాగరాజస్వామివారి ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అన్న కీర్తన నుటంకిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ‘తిరుక్కురళ్’ లోని పాశురాల్ని ఉదహరిస్తారు. భాష సరళంగా ఉంటుంది.
‘ది మిస్సైల్ మాన్ ఆఫ్ యిండియా’గా పేరు ప్రఖ్యాతులున్న ఆ శాస్త్రవేత్తకు సాహిత్యంలో ఎంత చక్కని ప్రవేశముందో చూడండని పిల్లలకు చెప్పాడు పతంజలి. అక్కడ శంకరయ్య సారు విధానాన్నే అవలంబించాడు నోట్స్ చెప్పాడు.
మరొక పాఠం, ‘ఔరంగజేబ్స్ లెటర్ టు హిస్ టీచర్’. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు చిన్న తవంలో తనకు చదువు చెప్పిన ‘ముల్లాసాహెబ్’కు ఆయన ఆర్థిక సహాయం కోసం పెట్టుకున్న అర్జీని తిరస్కరిస్తూ ఒక లెటరు వ్రాస్తాడు. అందులో తనకు జీవితానికి, పరిపాలనకూ పనికొచ్చేదేదీ ముల్లాగారు చెప్పలేదనీ, రాస్తూ విద్యావిధానం ఎలా ఉండాలి? అని వివరిస్తాడు. ఛాందసుడు, నిరంకుశుడైన ఆ మహమ్మదీయ ప్రభువుకు విద్యా విధానం మీదున్న అవగాహన మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
మైక్రోసాఫ్ట్ సి.ఇ.ఓ సత్యనాదెళ్ల తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే స్టాఫ్ అందరికీ ఒక ఇ-మెయిల్ పెడతాడు. దాన్ని యథాతధంగా బి.టెక్ పిల్లలకు పాఠ్యాంశం చేశారు. అందులో ఆయన తాను ఉద్యోగులనుండి ఏం కోరుకుంటున్నదీ విశదపరుస్తాడు. స్నేహపూర్వకంగానే ఉంటూనే, పని రాబట్టే విషయంలో తానెంత కచ్చితంగా వ్యవహరిస్తాడో తెలుపుతుందా యి-మెయిల్.
అచిరకాలంలోనే పిల్లలకు అభిమానపాత్రుడై నాడు పతంజలి. ఒక విద్యార్థి ఒక రోజు అడిగాడు.
“సార్ మాకు ఈ సాహిత్యం ఎందుకు?”
“చాలా మంచి ప్రశ్న వేశావురా అబ్బాయ్!” అంటూ ప్రారంభించాడు పతంజలి. తన విద్యార్థులనెవరినయినా సరే, “ఒరేయ్, ఏరా, నాన్నా, పిచ్చి వెధవా” ఇలా పిలుస్తాడు. ఆ పిలుపులోని ఆత్మీయతను గ్రహించిన పిల్లలు సంతోషంగా స్వీకరిస్తారు. ఆడపిల్లలను “తల్లీ, చెప్పరా, బంగారూ” అంటాడు. వాళ్లంతా తన బుజ్జమ్మలే అని భావిస్తాడు.
(సశేషం)