సాఫల్యం-52

4
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[డి.వి.ఇ.వో. గా బాధ్యతలలో కుదురుకుంటాడు పతంజలి. అతని చొరవతో చాలామంది పిల్లలకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. పరీక్షల సమయంలో సెంటర్లు తిరిగి తనిఖీ చేస్తాడు. ప్రభుత్వ వాహనం సమకూరింది. పదవీవిరమణ తేదీ దగ్గర పడుతుంది. కేంద్రం ఎ.పి., తెలంగాణా రాష్ట్రాలను విభజించింది. విడివిడిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం నాడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతుంది. వసుధ, పతంజలి శ్రీకాకుళంలో ఇల్లు తీసుకుని ఉంటారు. తన ఉద్యోగ బాధ్యతలలో విశేషంగా కృషి చేసి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ఎనిమిదవ స్థానం నుండి మూడవ స్థానానికి ఎగబ్రాకేలా చేస్తాడు. ప్రద్యుమ్నకి మంచి సంబంధం వస్తే పెళ్ళి చేస్తారు. బెంగుళూరులో కొత్త ఉద్యోగంలో చేరుతాడు. వివిధ సంస్థలలో మోటివేటర్‍గా ఉపన్యాసాలు ఇస్తాడు పతంజలి. హుందాగా పదవీవిరమణ చేస్తాడు. ఆ రోజున ఆత్మీయుల మధ్యన పతంజలికి ఘన సన్మానం జరుగుతుంది. పాత విద్యార్థి దుర్యోధన, మాజీ కొలీగ్ పెంటయ్య పతంజలి తమకు చేసిన మేలుని ప్రస్తావిస్తూ ప్రసంగిస్తారు. రిటైరయిన తర్వాత వ్యాపకం కోసం కథా రచయితగా మారుతాడు పతంజలి. సాహితీక్షేత్రంలో కృషి చేస్తాడు. తనకొచ్చిన బెనిఫిట్స్‌ని, ఇంటిని పిల్లలిద్దరికీ సమానంగా రాసి ఇస్తాడు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఇంగ్లీషు పాఠాలు, వ్యక్తిత్వ వికాసం పాఠాలు బోధిస్తాడు. ప్రద్యుమ్నకి కొడుకు పుడతాడు. 21వ రోజున ‘ప్రజ్వల్’ అని పేరు పెడతారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పిస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]“ఇం[/dropcap]జనీరింగ్‌ వాళ్లకు సాహిత్యమెందుకని కదా నీ ప్రశ్న! ఎందుకంటే రేపు మీకు ఉద్యోగాలు రావాలంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కావాలి. అవి ఆకాశం నుండి ఊడిపడవు కదా! వాటిని చెప్పడానికి లెసన్స్‌ బేస్‌ ఉండాలి. ‘గ్రామర్‌ షుడ్‌ నాట్‌ బిటాట్‌ ఇన్‌ ఐసొలేషన్‌’ అంటారు. ‘లాంగ్వేజ్‌ త్రో లిటరేచర్‌’ అన్నదే అసలు కాన్స్‌ప్ట్‌. లెసన్‌ను బేస్‌ చేసుకునే కదా మీరు నేను ఇంటరాక్ట్‌ అవుతున్నాము. కాంప్రెహెన్షన్‌ కొశ్చన్స్‌ వేస్తాను. వొకాబులరీ మరి ఎక్కడ నుండి వస్తూంది? ఎస్సే తయారు చేసుకుంటే రైటింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. లెసన్‌ నేను ఎక్స్‌‌ప్లెయిన్‌ చేస్తూంటే మీరు వింటూంటారు. స్ట్రెస్‌, ఇంటొనేషన్‌, నేర్చుకుంటారు. ఎక్స్‌‌పోజ్‌ అవుతారు.”

“సారీ సార్‌! నిజమే!”

“సారీ ఎందుకురా పిచ్చికన్నా” అన్నాడు పతంజలి. అందరూ నవ్వారు. “నీవడిగినందువల్ల కదా అందరికీ తెలిసింది! ఇంకో విషయం సాహిత్యం చదవడం వల్ల మంచి సంస్కారం అలవడుతుంది. నైతిక విలువలు పెరుగుతాయి. కల్చర్‌ అలవడుతుంది. టెక్నికల్‌గా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా మానవతా దృక్పథం లేకపోతే అది సమాజానికి ప్రమాదకరంగా కూడా మారొచ్చు. అందుకే ప్రఖ్యాత బ్రిటిష్‌ వేదాంతి బెర్ట్సండ్‌ రస్సెల్‌ అంటారు. మీ టెక్నొక్రాట్స్ అంతా గుర్తుంచుకోవలసిన మాట.

“లిటరేచర్‌ టీచెస్‌ సైన్స్‌ ఇట్స్‌ డ్యూటీ – అంటే అర్థమయింది కదా! సాహిత్యం విజ్ఞానశాస్త్రానికి తన విధిని ఎలా నిర్వర్తించాలో నేర్పుతుందట. ఎలా నేర్పుతుందో ఎవరయినా చెప్పగలరా?”

క్లాసులో కాసేపు నిశ్శబ్దం.

ఒక పిల్ల చేయి ఎత్తింది.

“చెప్పరా బంగారూ” అన్నాడు గురువు.

“అంటే ఇప్పుడు డాక్టర్లున్నారు గదసార్‌! వాండ్లు మంచిగ మెడిసిన్‌ చదివినా గరీబోల్లకు వైద్యం చేయకుండా, అనవసరంగా టెస్టులు రాసుడు, డబ్బుల కోసం, ఆపరేషన్లు జేసుడు, గిసుమంటివి చెయ్యొద్దని సాహిత్యం సంజాయిస్తున్నదమాట. గట్లనే ఇంజనీర్లు కంట్రాక్టర్ల కాడ లంచాలు దిని, నాసిరకం సిమెంటు, ఇసుక, గిట్ల వాడినా గూడ పట్టించుకోకపోయినందుకే గద బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు కూలిపోబట్టె, సాహిత్యం జదివితే మంచిగ, గివన్ని జెయ్యరాదని దెలుస్తది!”

పతంజలి అబ్బురపడ్డాడు ఆ అమ్మాయి విశ్లేషణకు. చప్పట్లు కొట్టాడు. “గివ్‌ హర్‌ ఎబిగ్‌ హ్యాండ్‌ ఇన్‌స్టాండింగ్‌ ఒవేషన్‌” అని బిగ్గరగా చెప్పాడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

“ఇలా రారా తల్లీ!” అని పిలిచాడా పిల్లను వేదిక మీదికి. దగ్గరకు తీసుకొని తలమీద చెయ్యి వేసి దీవించాడు.

“గాడ్‌ బ్లెస్‌యు మై ఛైల్డ్‌!” అన్నాడు పిల్లలతో చెప్పాడు.

“అయామ్‌ ప్రవుడాఫ్‌ దిస్‌ గర్ల్‌. షి హాజ్‌ యునిక్‌ ఇన్‌సైట్‌ ఇన్‌టు ది సొసైటల్‌ వెల్‌బీయింగ్‌. అయామ్‌ ప్రెజెంటింగ్‌ దిస్‌ స్మాల్‌ గిఫ్ట్‌ ఫర్‌ హర్‌” అంటూ ఐదు వందల రూపాయల నోటు జేబులోంచి తీసి ఆ పిల్లకిచ్చి, “మంచి పుస్తకాలు కొనుక్కోమ్మా” అని చెప్పాడు మళ్లీ చప్పట్లు.

“ల్యాబ్‌ అంటే ఏంలేదు. లాంగ్వేజ్‌కు ఎక్విప్‌మెంటు ఏముంటుంది. మానవ శరీరమే ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌. నోరు, నాలుక, పెదవులు, అంగుడు, తాలువు, గొంతు ఒకదానితో ఒకటి తాకినపుడు ధ్వనులు ఏర్పడతాయి. తెలుగులో వాటిని దంత్యములు తాలవ్యములు, ఓష్ఠ్యములు అలా పిలుస్తారు. ఇంగ్లీషులో బైలేబియల్స్‌, డెంటల్స్‌, డెంటల్‌ ప్లోసివ్స్‌, నాసల్స్‌, లేబియోడెంటల్స్‌ ఇలా రకరకాలుగా పిలుస్తారు. ఆదిమ మానవుడు భాష తెలియకుండా వేల సంవత్సరాలు బ్రతికాడు. ధ్వనులు సైగలే కమ్యూనికేషన్‌కు ఉపయోగపడేవి. క్రమంగా ఆ ధ్వనులు అక్షరాలుగా మారుతున్న వైనం గ్రహించాడు. అలా భాష ఏర్పడింది. ఆటోమేటిక్‌గా తర్వాత ఎవరో మేధావి ఈ క్రమాన్ని విశ్లేషించి ఒక శాస్త్రంగా రూపొందించాడు అదే ‘ఫోనెటిక్స్‌’.

తర్వాత ఎప్పుడో మరో మేధావి భాష ఏ సూత్రాల ఆధారంగా వాడబడుతుందో గ్రహించి, ఆ నియమాలను రూపొందించాడు. అదే గ్రామర్‌. గ్రామర్‌ లేని భాషకు గ్లామర్‌ ఉండదు. ‘చెట్టు ముందా విత్తు ముందా’ అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం గాని, ‘భాష ముందా వ్యాకరణం ముందా’ అన్న ప్రశ్నకు మాత్రం భాషేముందని తడుముకోకుండా చెప్పచ్చు”

ఇలా ల్యాబ్‌ మ్యాన్యుయల్‌ ప్రారంభించే ముందు పిల్లలకు ఇంట్రడక్షన్‌ యిచ్చాడు పతంజలి.

తనను తాను పరిచయం చేసుకోవడం, సెంకడ్‌ పర్సన్‌ను థర్డ్‌ పర్సన్‌కు పరిచయం చేయడం, ఒక సంఘటనను డ్రమటైజ్‌ చేసి పిల్లలకు పాత్రలు (క్యారెక్టర్స్‌) నిర్దేశించి మాట్లాడిరచడం, సర్వీసెస్‌ని కోరడం, సర్వీసెస్‌ పొందినందుకు కృతజ్ఞతలు చెప్పడం. జస్ట్‌ ఎ మినిట్‌ (జెఎయం) సెషన్‌లో ప్రతి విద్యార్థికీ ఒక అంశం మీద నిమిషం పాటు మాట్లాడించడం, టెలిఫోన్‌/ సెల్‌ఫోన్‌ మ్యానర్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ధిమాటిక్‌ అఫ్రీసియేషన్‌ టెస్ట్‌ (టిఎటి) అంటే ఒక బొమ్మను చూపించి అందులోని దృశ్యాలను వర్ణించమనడం. లిజనింగ్‌ కాంప్రెహెన్షన్‌ అంటే రికార్డెడ్‌ వాయిస్‌ను స్టాండర్డ్‌ స్ట్రెస్‌ అండ్‌ ఇంటొనేషన్‌లో ‘వినిపించి’ తర్వాత ప్రశ్నలు అడగడం, మాక్‌ (కుహనా) ఇంటర్వ్యూలు ఇవన్నీ ల్యాబ్‌ మ్యాన్యుయల్‌లో పాఠ్యాంశాలు. వారానికి ఒక రోజు ఈ క్లాసుండేది. సిలబస్‌లోవే కాకుండా, సొంతంగా తానే కొన్ని లైఫ్‌ లైక్‌ సిట్యుయేషన్స్‌ను తరగతి గదిలోనే సృష్టించి, పిల్లలతో ఆయా సందర్భాలలో మాట్లాడించేవాడు. ఇదంతా పిల్లలకు చాలా ఆసక్తికరంగా అనిపించేదది.

ఛైర్మన్‌ శ్రీశైలవాసుగారిని ఒకసారి పిలిపించి, పిల్లల పర్‌ఫార్మెన్స్‌ చూపించాడు. ఆయన చాలా సంతోషపడి ఇలా అన్నాడు. “ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ ‘సహస్ర బుద్ధే’ గారని ఉండేవారు. ఆయన ‘మనదేశంలో 85 శాతం ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉద్యోగాలు చేయడానికి పనికిరారు. ఎందుకంటే వారికి ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌, ముఖ్యంగా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అసలు ఉండవు’ అని చెప్పాడు. ఆ మాట నిజమేగాని మన పతంజలి సారు పిల్లలకు నేర్పిస్తున్న విధానం చూస్తే, ఆయన మాట మనం నిజం కాదని నిరూపించచవ్చు.”

రిటైరైన తర్వాత తొలి సంపాదన అందుకున్నాడు. ఇరవై ఐదువేలు. పిల్లలిద్దరికీ చెప్పేశాడు. తాను ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు పేదవాళ్ల కోసం ఉపయోగిస్తానని. వాళ్లు సంతోషంగా ఒప్పుకున్నారు. వసుధ అటువంటి విషయాల్లో ముందుంటుంది.

కమలానగర్లో ఖాళీగా ఉన్న సైట్లలో బీదా బిక్కి గుడిసెలు వేసుకొని కాపురం చేస్తుంటారు. ఆడవాళ్లు నాలుగిళ్లలో పని మనుషులుగా కుదురుకుంటారు. మగవాళ్లు కూలీ పనులకు వెళతారు. వాళ్ల గుడిసె పైకప్పులు చాలా బలహీనంగా ఉంటాయి. వాటిమీద ప్లాస్టిక్‌ షీట్లు కప్పుకుంటారు కాని అవి చిరిగిపోతాయి. గాలికి ఎగిరిపోతుంటాయి. ఒకరోజు ఉస్మాన్‌గంజ్‌కు పోయి చౌకరకం టార్పాలిన్‌ సెకండ్‌ హ్యాండ్‌వి దొరుకుతాయేమోనని విచారించాడు. పురానాపూల్‌ బ్రిడ్జి దాటింతర్వాత ‘జూ’ కు వెళ్లే దారిలో వందలకొద్తీ ట్రాన్స్‌ పోర్ట్‌ కంపెనీలున్నాయి. దేశంలోని అన్ని మూలలకూ లారీలు సప్లయి చేస్తారక్కడ.

వాళ్లను కొందరిని కలసి, పాతబడి, వాడకుండా వదిలేసిన టార్పాలిన్‌లు కావాలని అడిగాడు. నాలుగు రోజులు తిరిగితే పది పన్నెండు దాకా దొరికాయి. కొందరు డబ్బు డిమాండ్‌ చేస్తే ఇచ్చాడు. కొందరు మంచి పని చేస్తున్నారని ఊరికే ఇచ్చారు. వాటిని ట్రాలీ ఆటోలో వేసుకొచ్చి, మగవాళ్ల సహాయంతో తీసుకొని ఆ టార్పాలిన్‌లను రెండు మూడు భాగాలుగా కట్‌ చేయించి, గుడిసెల మీద కప్పించాడు. గాలికి ఎగిరిపోకుండా అంచులు తీగతో చుట్టించాడు. ఒక్కో టార్పాలిన్‌ రెండు, చిన్నవయితే మూడు గుడిసెలకు సరిపోయింది. కప్పేముదు చౌకరకం డిటర్జెంట్‌తో వాటిమీద ఉన్న మడ్డిని శుభ్రం చేయించాడు. మిగిలిన చిన్న ముక్కలను కొందరు గుడిసెల్లో నేలపైన పరుచుకునేందుకు తీసుకున్నారు.

రెండు మూడు నెలల జీతం ఖర్చు చేసేసరికి కమలానగర్‌ మాత్రమే కాకుండా చుట్టుపక్కల రెండు మూలు కాలనీల్లోని సుమారు వంద గుడిసెలు చక్కని పైకప్పును సంతరించుకున్నాయి. వర్షానికి, చలికి ఆగుతున్నాయి.

కాలనీలోని ఆటోస్టాండ్‌లలో నుండి ఎన్ని ఆటోలు కాలనీలో తిరుగుతుంటాయో విచారిస్తే దాదాపు నూటయాభై వరకు ఉండవచ్చు అని చెప్పారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ చుట్టుప్రక్కల అక్టోబరు నుండే స్వెటర్లు మంకీ క్యాప్‌లు అమ్మేవారు. ఫుట్‌పాత్‌ల మీద దుకాణాలు తెరుస్తారు. నేపాల్‌, మన ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం వస్తారు వాళ్లు. వాళ్లను వెళ్లి అడిగాడు. రెండు వందల స్వెటర్లు మంకీ క్యాప్‌లు కావాలని, ఛారిటీ కోసమని, ఒకరి దగ్గర అన్ని లేవు. ఇద్దరు ముగ్గురు ముందుకొచ్చారు. ఒక్కో సెట్‌ రెండు వందలచొప్పున నలభై వేలయింది.

ఒక పుస్తకంలో ఆటోడ్రయివర్‌ పేరు, ఆటో నంబర్‌, ఆటో స్టాండు పేరు నోట్‌ చేసుకుంటూ అదరికీ స్వెటర్స్‌, మంకీ క్యాప్‌లు పంపిణీ చేశాడు. నూట అరవై మూడు ఖర్చయ్యాయి. తన ఇంటి అడ్రస్‌ చెప్పి, ఇంకా ఎవరయినా ఉంటే రమ్మన్నాడు. కొందరు ఇంటికి వచ్చి తీసుకుని వెళ్లారు.

పతంజలి చేస్తున్న పనులు తెలుసుకొని సీనియర్‌ సిటిజన్స్‌ మరియు పెన్షనర్స్‌ కొందరు ముందుకు వచ్చి మేమూ చేయి కలుపుతామన్నారు. వనస్థలిపురంలో వంద పడకల వైద్య విధాన పరిషత్‌ ఉంది. చాలా పెద్దది. ఆ సూపరింటెండెంట్‌ను కలిసి స్వచ్ఛందంగా రోగులకు సేవ చేయడానికి అవకాశమివ్వమని అడిగారు. ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడి నర్సులకు సహాయం చేయడం, చూసుకోవడానికి ఎవరూలేని వారిదగ్గర తోడుగా ఉండటం, రోగులకు బ్రెడ్‌, పళ్లు తీసుకుని వెళ్లి ఇవ్వడం చేస్తూ ఉన్నారు.

రైతు బజార్లో కూరగాయలమ్మేవాళ్లకు, పుట్‌పాత్‌మీద చెప్పులు కుట్టుకునేవారికి, టీకొట్ల మీద పనిచేసే కుర్రవాళ్ళకి, స్వెటర్‌ సదుపాయం విస్తరించారు.

హయత్‌ నగర్‌ నుండి కొత్తపేట వరకు షేర్‌ ఆటోలు సెవెన్‌ సీటర్స్‌ నడుస్తుంటాయి. వాళ్లకు పీక్‌ అవర్స్‌లో తప్ప పెద్దగా ఆదాయం ఉండదు. బేరాలు పోతాయేమోననే భయంతో సరిగా భోజనం కూడా చేయరు. వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు పతంజలి. లోక్లాస్‌ హోటళ్ల వాళ్లను సంప్రదించారు. వారు పదిహేను రూపాయలకు వెజిటబుల్‌ బిర్యానీ ప్యాక్‌ చేసి ఇవ్వగలమన్నారు. పేదవాడి ఆకలి తీర్చడానికి తెలిసి పది రూపాయలకు దిగారు. ఒకరిమీదే భారం కాకుండా అలాంటి హోటళ్లు ఐదారు సెలెక్ట్‌ చేసి, రోజూ వంద పాకెట్లు తయారు చేయమని కోరారు అటే రోజూ వెయ్యి రూపాయలు కావాలి. పతంజలి బ్యాచ్‌లో దాదాపు ఇరవైమందున్నారు. తలా ఐదువందలు వేసుకున్నా పదివేలవుతుంది. పతంజలి తానొక్కడే ఐదువేలిస్తానన్నాడు. వ్యాపారస్తులు, కొందరు దాతలు ఉదారంగా డొనేషన్‌ యిచ్చారు.

సుష్మ ధియేటర్‌ వద్ద బిర్యానీ పాకెట్లు పెట్టుకొని, ప్రతి షేర్‌ ఆటో డ్రయివర్‌కూ ఒక పాకెట్‌ ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమై రెండులోపల వంద పాకెట్లు పూర్తయ్యేవి. సంవత్సరం పొడుగునా నడపటం కష్టం కాబట్టి ఎండాకాలం మూడు నెలలకీ పరిమితం చేశారు. ఫండ్స్‌ సమకూరడం కష్టమైంది.

ఎండాకాలంలో ఖాళీ సైట్లలోని ప్రతి గుడిసెకూ ఒక మంచినీటి మట్టికుండ మూతతో సహా సరఫరా చేశారు.

స్కూల్స్‌ రీఓపెనింగ్‌ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉచితంగా నోటు బుక్కులు పంచిపెట్టారు.

ఇలా ‘ఉడతాభక్తి’గా పతంజలి ‘లైక్‌ మైండెడ్‌’ వారిని కలుపుకొని బీదవారికి సాయం చేస్తున్నాడు. మరి ఇది సమాజ సేవ క్రిందికి వస్తుందా? అని అతని సందేహం.

బుజ్జమ్మకు సంబంధాలు చూస్తున్నారు. ‘తెలుగు మ్యాట్రిమోనీ’ రిజిస్టర్‌ చేసుకున్నారు. సి.ఎ. చదివిన అబ్బాయి ఐతే బాగుంటుందిని ఐదారు నెలలు చూశారు. ఎవరూ దొరకలేదు. ఒకరిద్దరు తటస్థించినా ప్రజ్ఞకంటె ఏడెనిమిదేళ్లు పెద్దవాళ్లు.

సరేలే అని రాజీపడి ‘వెల్‌ సెటిల్డ్‌’ అని ప్రిఫరెన్సెస్‌లో మార్చారు. ఒక సంబంధం వచ్చింది. పిల్లవాడు బి.టెక్‌, ఎంబి.ఎ చేసి ఆదిభట్ల టి.సి.ఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రజ్ఞ కంటే రెండేళ్లు పెద్ద. ప్యాకేజ్‌ సంవత్సరానికి ఇరవై లక్షలు. ఒక అక్కకు పెళ్లయి యు.ఎస్‌లో ఉంది. పిల్లవాని తండ్రి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో డిపో సూపరింటెండెంట్‌గా పని చేసి రిటైరయినాడు. తల్లి గృహిణి. వారికి ‘మాసాబ్‌ ట్యాంక్‌’ వద్ద త్రిబెడ్‌ రూం అపార్ట్‌మెంట్‌ ఉంది. సొంత ఊరు గుంటూరు జిల్లా రేపల్లె అట.

ఫోటోలు ఇద్దరికీ ఓ.కె. జాతకాలు చూపించారు. అవీ ఓకె. పిల్లవాడి పేరు యజ్ఞ నారాయణ. తండ్రి ముకుందరావు. తల్లి కనకదుర్గ.

ఒక ఆదివారం పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయే డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చాడు. రెనోడస్టర్‌ కారు. ఈ మధ్యనే తీసుకున్నారట.

ఫస్ట్‌ ఫ్లోర్‌కు వెళ్లి అమ్మాయీ, అబ్బాయీ ఏకాంతంగా మాట్లాడుకున్నారు అరగంట పాటు. నవ్వుకుంటూ దిగివచ్చారు. కారు వరకూ వీడ్కోలిచ్చారు వసుధ పతంజలి. ఏ విషయం తెలియజేయమని కోరారు.

మూడో రోజు ముకుందరావుగారు ఫోన్‌ చేశారు. అబ్బాయికీ తమకూ మీ అమ్మాయి నచ్చిందని, అమ్మాయికి కూడా ఇష్టమయితే “ప్రోసీడ్‌” అవుదామనీ.

బుజ్జమ్మను అడిగారు “మంచివాడే నాన్న! ఫ్రెండ్లీగా ఉన్నాడు”. ‘ఫుడీ’ అట. సినిమాలు బాగా చూస్తాడట. ‘ఐ ధింక్‌ ఐ విల్‌ బిహ్యాపీ విత్‌ హిమ్‌’అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.

మాసాబ్‌ట్యాంక్‌ వద్ద ఉన్న వాళ్లింటికి వెళ్లారు. వసుంధర వదినెను అన్నయ్యను తీసుకువెళ్లారు. వెల్దుర్తినుండి మల్లినాధ కూడ వచ్చాడు. జాతకాలు చూసి బాగున్నాయని చెప్పింది వాడే.

విధివిధానాలు మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం సింపుల్‌గా జరపమని, వివాహం గ్రాండ్‌గా జరపమని కోరారు వాళ్లు. మల్లినాధ రెండింటికీ ముహూర్తం పెట్టాడు. పదిహేను రోజుల్లో నిశ్చితార్థం. తర్వాత నెల రోజులకు వివాహం.

పతంజలి వాళ్లింట్లో పెండ్లి పనులు ఊపందుకున్నాయి, బెంగుళూరు నుండి అన్నయ్య వదినె ప్రజ్వల్‌ వచ్చేశారు. ‘స్వాగత్‌ గ్రాండ్‌’ హోటల్లో నిశ్చితార్థం జరిగింది. అతి సన్నిహితులను మాత్రమే పిలిచారు.

పెండ్లి మంటపం కుదరటం చాలా కష్టమయింది. చివరికి నాగోలు వద్ద ఒక వెన్యూ మాట్లాడుకున్నారు. ప్రద్యు, ఉదయ పెళ్లి పనులన్నీ తమ భుజాలపైన వేసుకొని మోశారు. వాగ్దేవక్కయ్య, శశిధర్‌ దంపతులు, మహిత కుటుంబం, మల్లినాధ వాళ్లు, ముని కుటుంబం, ఉస్మాన్‌ కుటుంబం, వచ్చారు. పాణిని వాళ్లు ఫ్లైట్‌లో వచ్చారు.

దశరదరామ్‌గారు, కిషన్‌ ప్రసాద్‌, రామసుబ్బన్న మరికొంతమంది బోర్డు కొలీగ్స్‌ హాజరయ్యారు. పెంటయ్య, భార్యతో సహా వచ్చాడు. పలాస, కోట బొమ్మాళి నుండి కూడ కొందరు వచ్చారు. రాజమండ్రి నుండి కొందరు పతంజలి సీనియర్‌ సిటిజన్‌ ఫ్రెండ్స్‌, గోవిందరెడ్డి, శ్రీశైలవాసు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. వివాహం శుభప్రదంగా జరిగింది. భోజనాల క్యాటరింగ్‌ కర్నూలు వాళ్లకే ఇచ్చారు. భక్ష్యాలు, వాంగీబాత్‌, జాంగ్రీ, మిరపకాయ బజ్జీ, మామిడికాయ తోటకూర పప్పు, వంకాయ నించుడుకాయ, కొబ్బరి పచ్చడి లాంటి వంటలు కాక వెజ్‌ బిర్యానీ, రైతా, రుమాలీ రోటీ, పనీర్‌ మసాలా లాంటివి కూడ చేయించారు.

అప్పగింతలప్పుడు బుజ్జమ్మ అత్తగారింటికి వెళ్లిపోతుందని వసుధ, పతంజలి దంపతులు ఒకటే ఏడ్చారు. బుజ్జమ్మ తల్లిదండ్రులను కౌగిలించుకొని ఏడ్చింది.

పతంజలి శాకుంతలంలో కణ్యమహామునితో మహాకవి పలికించిన మాటలు గుర్తొచ్చాయి.

“సర్వసంగ పరిత్యాగినైన నాకే, శకుంతల అత్తవారింటికి వెళుతూ ఉంటే, పెంచిన మమకారంతో, ఇంత దుఃఖం కలుగుతూందే, ఇక సామాన్య గృహస్థులైన తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారో కదా!” అంటాడాయన.

మూణ్ణిద్రలయిన తర్వాత బుజ్జమ్మను అత్తవారింట్లో వదిలి పెట్టి వచ్చారు. ప్రద్యు వాళ్లు కూడ వెళ్లిపోయారు బెంగుళూరుకు. ఇంట్లో వసుధ పతంజలి మాత్రమే మిగిలారు.

సేవాకార్యక్రమాలు యథా శక్తి సాగుతున్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరి సంవత్సరం దాటింది. ఇంజనీరింగ్‌ విద్య తన ప్రాభవం కోల్పోతున్న కాలమది. చాలా కాలేజీలు అడ్మిషన్లు లేక మూతపడుతున్నాయి. సివిరామన్‌ వాళ్లు కూడ నైబరింగ్‌ కాలేజీలతో కలిసి, ‘నోవా’ అనే కాలేజీకి తమ పిల్లను ‘టేక్‌ ఓవర్‌’ కిచ్చారు. శ్రీశైలవాసుగారు ఆ భవనాలను సోషల్‌ వెల్‌ఫేర్‌ రెసిడెన్సియల్‌ స్కూలుకు అద్దెకిచ్చుకున్నారు. నాలుగు నెలల నుండి ఫ్యాకల్టీకి జీతాలివ్వడం లేదు. గోవిందరెడ్డి స్నేహితుడని కాబోలు పతంజలికి నాలుగు నెలల జీతం. లక్ష రూపాయలు ఇంటికే పంపిచేశారు ఛైర్మన్‌. అంతటితో ఆ అధ్యాయం ముగిసి పోయింది. సేవాకార్యక్రమాలు కొనసాగించడానికైనా ఏదో ఒక ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాడు.

రచనా వ్యాసంగం కొనసాగుతూ ఉంది. ఎ.జి. ఆఫీసులో రంజని సాహితీ సంస్థ వారు ఛందోబద్ధ కవిత్వ పోటీలు నిర్వహించారు. ఒకే ఛందస్సులో, ఏదో ఒక టాపిక్‌ మీద పన్నెండు పద్యాలు రాసి పంపాలి ‘అందాల కందం’ అనే శీర్షికతో కంద పద్యం విశిష్టతను వర్ణిస్తూ పన్నెండు పద్యాలు వ్రాసి పంపాడు.

రెండు నెలల తర్వాత మెసేజ్‌ వచ్చింది. మీ కవిత్వానికి తృతీయ బహుమతి వచ్చింది. కవి సామ్రాట్‌ విశ్వనాథ పురస్కారం లభిస్తుంది. త్యాగరాయగాన సభలో జరిగే కార్యక్రమానికి రమ్మని సారాంశం. కసిరెడ్డి వెంకటరెడ్డిగారనే సాహితీవేత్త సభకు అధ్యక్షత వహించారు. చివర్లో పురస్కార గ్రహీతలను మాట్లాడమన్నారు. పతంజలి ప్రసంగం ఇలా సాగింది.

“విశ్వనాధ వారి పురస్కారం అందుకోవడం అత్యంత భాగ్యంగా భావిస్తున్నాను. కవితలూ, కథానికలు సైతం అంతరించిపోతున్న ఈ తరుణంలో, పద్యానికి పట్టం కట్టిన ‘రంజని’ వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. పద్య ఎప్పుడూ హృద్యమే. మెమొరైజేషన్‌’కు దోహదం చేస్తుంది. ఒకసారి విఖ్యాత కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డిగారు ఒకమాటన్నారు – ‘పద్యం బూర్జువా సిద్ధాంతాలకు కొమ్ము కాస్తుంది’ అని.”

“అంతటి గొప్పకవి ఆ మాట అనకుండా ఉండవలసింది. రాజులు కవులను పోషించిన మాట నిజమే. కాని ఎందరో రాజరిక వ్యవస్థను ఎదిరించారు. పోతన లాంటివారు ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి’ అని రాజుల ప్రాపకాన్ని తిరస్కరించారు. మన శతక సాహిత్యమంతా పద్యమయమే కదా! అందులో లేని ఎధిక్స్‌, పర్సనాలిటీ డెవలప్‌ మెంట్‌ ఉన్నాయా!”

“ ‘వాక్యం రసాత్మకం కావ్యమ్‌’. భావస్ఫోరకమయిన ఒక వాక్యమైనా సరే దానికి కావ్య గౌరవమిచ్చారు మన ప్రాచీనలు. సమకాలీన వచన కవిత్వం చదువుతూంటే బాధనిపిస్తుంది. అస్పష్టతను.. ఒక గొప్ప గుణంగా భావించి రాస్తున్నారు. రూపకం.. ను ఔచిత్యం లేకుండా ప్రయోగిస్తున్నారు. కవితంతా చదివిన తర్వాత తలగోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది.

‘ఛందో బందో బస్తులన్నీ బంద్‌’ అన్న శ్రీశ్రీ గారిని, ‘ఛందస్సు వద్దని ఛందస్సులోనే చెప్పాడు పాపం’ అని చమత్కరించారు విశ్వనాథ. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నమస్సులు”

‘ఉగాది కవితలపోటీ’ అని నిర్వహించారు బెంగుళూరు తెలుగు సాహితీవేదిక వారు.

‘మాకూ ఉగాదులున్నయ్‌! మాకూ ఉషస్సులున్నయ్‌” అన్న కవితను ఆప్టిమిస్టిక్‌ అప్రోచ్‌తో వ్రాసి పంపాడు. సెలెక్టయింది. ఉగాది రోజున సభ ఏర్పాటు చేసి కవులను (సెలెక్టయిన) ఆహ్వానించారు. కవితా పఠనం చేయించారు. ద్రవిడ విశ్వవిద్యాలయం కులపతి అధ్యక్షులు కవులకు సన్మానం చేశారు.

తిరుపతిలోని ఒక సాహితీ సంస్థ ఒక పోటీ పెట్టింది. భాగవతంలోని ద్వితీయ చతుర్ధ స్కంధాల నుండి ఒక వృత్తాంతాన్ని ఎన్నుకొని, ఒక క్రొత్త ఛందస్సును తామే సృష్టించి, ముఫై పద్యాలు వ్రాయాలి. పతంజలి, శ్రీహరి హిరణ్యాక్షుని సంహరించి, వాడపహరించిన భూదేవిని సంరక్షించి తెచ్చిన ఉదంతం తీసుకున్నాడు. ఒక కొత్త ఛందస్సును సృష్టించాడు. స్వామికీ అసురునికీ జరిగిన సంగ్రామం, మహావరాహం సముద్రాన్ని అతలాకుతలం చేయడం ఇవన్నీ వర్ణించాడు. వర్ణన ఇలా సాగింది.

తల్లడిల్లగ జలధి, కల్లో
లంబు నందుచు తనకు తానే
దారినివ్వగ వినయభక్తిన్‌
స్వామి జొచ్చెన్‌ వార్ధిజలమున్‌.

రాక్షసాధముడతని జూచెన్‌
అట్టహాసము సలుపసాగెన్‌
దివ్యరూపుని గదను వేయన్‌
దంష్ట్రలన్‌ గద శకలమాయెన్‌

సింహరాజము కరినివోలెన్‌
యజ్ఞ సూకర మరిని దృంచెన్‌
ధాత్రి కోరలనమర, వార్థిన్‌
జీల్చుకొంచును వెడలు చుండెన్‌

అలా పద్యాలు వ్రాశాడు. ఆ ఛంద్రస్సుకు ‘రభస’ అని పేరుపెట్టాడు. పోటీ ఫలితాలకోసం ఎదురు చూడసాగాడు.

మహాత్ముని నూటయాభయ్యవ జయంతి సందర్భంగా నల్లగొండలో ఉత్సవాలు జరిగాయి. నూట యాభైమంది పిల్లలకు గాంధీ వేషధారణ చేసి నిలబెట్టారు. గోవిందరెడ్డి పతంజలిని ఆహ్వానించాడు. కేవలం మూడు నిమిషాలు మాత్రమే అవకాశమిచ్చారు. ‘గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌’ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పతంజలి గాంధీజీ గురించి ఒకే ఒక సీస పద్యం రాసుకొని వెళ్లాడు. దాన్ని సభికులకు చదివి వినిపించాడు చక్కటి స్పందన లభించింది.

“ఆడంబరమ్మున కామడ దూరంబు
మానవతాస్ఫూర్తి మనసునిండ
పరమ ధర్మంబుగా బరుగు నహింసను
త్రికరణశుద్ధి వర్తింపజేసి
సత్యాగ్రహమ్మును నిత్యాయుధమ్ముగ
పరదేశపాలన ప్రతిఘటించి
ధరణి యంతయు తనదైన తత్త్వ కాంతి
సమసమాజపు వెలుగుల సారమిడగ

గాంధీయను మహనీయ బంధమొకటి
భిన్న కులమతముల నన్ని కలిపి
దళిత హరిజన గిరిజనోద్ధారమగుచు
భారతావని నడిపించు ధీరశక్తి”

దత్త జయంతి సందర్భంగా ‘శ్రీ గురుదత్త పంచరత్నమాలా’ అనే మకుటంతో ఐదు సంస్కృత శ్లోకాలు వ్రాశాడు పతంజలి.

జయంతి శిష్యానుగ్రహ కారకాః
ఆధ్యాత్మ విద్యా సందేహ ధ్వంసినః
పండితా పండిత జ్ఞాన దాయినో
దత్తదేవ సద్గుర పాదపాంసవః

(శిష్యులకు అనుగ్రహమను ప్రసాదించే, ఆధ్యాత్మ విద్యలో వారి అనుమానాలను పటాపంచలు చేసే, పండితులను పామరులకు సైతం జ్ఞానాన్ని ప్రసాదించే, దత్తస్వామి పాద ధూళి కణములకు జయమగుగాక!”)

ఆ శ్లోకాలను చూసి సంస్కృత పండితుల కూడా తలలూచారు. ‘నరసింహుని దయ, తండ్రిగారి శిష్యరికం తప్ప తన గొప్పతనమేముంది’ అనుకున్నాడు.

ఆది శంకారచార్యులకృతమయిన కరావలంబస్తోత్రాన్ని తెలుగు పద్యాల్లోకి అనువదించాడు పతంజలి.

‘ఓయి నరసింహ నాకు చేయూతనీవె’ అనే మకుటంతో సాగాయవి.

వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌లో ఆడవారిమీద వేసే ఇల్లాజికల్‌ జోకులతో విసిగిపోయి, “ఏమనుకుంటున్నార్రా మీరు?’ అనే కవిత వ్రాసి ‘నవ్య’కు పంపాడు.

రచయిత్రులకు సమాజం సరైన గుర్తింపు ఇవ్వడంలేదనే కాన్‌సెప్ట్‌ తో ‘తనకంటూ ఒక గది’ అన్న కథ రాసి ‘తెలుగు వెలుగు’కు పంపాడు. వర్జీనియా వూల్ఫ్‌ వ్రాసిన ‘ఎ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’ అన్న రచన దానికి ప్రేరణ.

తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవడానికి, వి.ఐ.పిల తాకిడి వల్ల సామాన్య జనం ఎలా అగచాట్లు పడతారో వర్ణిస్తూ ‘సర్వత్ర సమదర్శినః’ అన్న కథ వ్రాసి ‘స్వాతి మాసపత్రిక’కు పంపాడు.

కాంట్రాక్ట్‌ తద్దినాలను విమర్శిస్తూ ‘భోక్తలు’ అనే కథ రాసి ‘జాగృతి’ వార పత్రికకు పంపాడు. అన్నీ ప్రచురించరు. కొన్ని మాత్రం ప్రచురణకు స్వీకరిస్తారు.

‘ఇండియన్‌ పొయటిక్‌ కాన్‌ఫ్లుయెన్స్‌’ అనే జాతీయ సంస్థ ఉంది. భారత దేశ వ్యాప్తంగా ఇంగ్లీసు కవిత్వం వ్రాసే వారంతా అందులో సభ్యులు దానికి అనుబంధంగా ‘తెలంగాణ పొయటిక్‌ ఫోరం’ పని చేస్తుంది. పతంజలి కూడ అందులో సభ్యుడు. ‘హయగ్రీవాచారి’ గారు దానికి జనరల్‌ సెక్రటరీ. పతంజలి బోర్డులో పని చేసే సమయంలో ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా ఆర్‌.ఐ.ఓ. గా పని చేసేవారు. ఇంగ్లీషులో అద్భుతమైన కవిత్వం వ్రాస్తాడాయన. జాతీయ స్థాయిలో ‘శాంతి’, ‘ప్రేమ’ అనే టాపిక్స్‌ మీద కవితలనాహ్వానించారు. పతంజలి కవితలు కూడ సెలెక్టయ్యాయి. ‘పెటల్స్‌ ఆఫ్‌ పొయిట్రీ’ అనే పేరిట ఒక ‘ఆంథాలజీ’ (సమకాలీన కవుల కవితా సంకలనం) ప్రచురించారు. దేశవ్యాప్తంగా ఎనిమిది వందల కవితలు వస్తే, వంద కవితలు స్వీకరించారు. అందులో రెండు పతంజలివి.

పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలోని సమావేశ మందిరంలో సభ నిర్వహించి, కవులను సన్మానించారు.

అలా సాహితీ వ్యవసాయం చేసుకుంటున్నాడు పతంజలి.

వారానికొకసారి సీనియర్‌ సిటిజన్స్‌ అందరూ కలుస్తూంటారు. ఒకసారి పతంజలి ఒక విషయం ప్రతిపాదించాడు.

“ఇంటింటికీ తిరుగుతూ ‘పాత పేపర్లు కొంటాం’ అవి వచ్చేవాళ్ల దగ్గర డబ్బు తీసుకోకుండా ఊరికే ఇచ్చేసేలా కాలనీవాసులను చైతన్య పరచాలి. ముందు మనం ఆచరణలో పెట్టాలి. పాపం ఎండల్లో వానల్లో చలిలో తిరుగుతూంటారు. నెల రోజుల న్యూస్‌ పేపర్లు అమ్మినా మనకు నలభై రూపాయల కంటే రావు. అవి లేక పోయినా మనకు ఇబ్బందిలేదు. మనవాళ్లు కొందరు వాళ్ల దగ్గర కూడ బేరాలు చేస్తూంటారు. తీరా తూకం వేయించిన తర్వాత కేజీ మీద రూపాయి తక్కువని ఇవ్వం పొమ్మనే వాళ్లూ ఉన్నారు. మనం ఇంటింటికీ తిరిగి కౌన్సిలింగ్‌ చేసి కొందరినైనా ఒప్పిస్తే, పాపం బీదవాళ్లకు ప్రయోజనం”

అందరూ సమ్మతించారు.

తాను ఎమ్‌.ఎ. ఇంగ్లీష్‌ చదివనప్పుడు కొన్న పుస్తకాలు కొన్ని పతంజలి దగ్గరే ఉంచుకున్నాడు. ఒకరోజు అటక సర్దుతూంటే ఒక పుస్తకం కనబడింది. ‘హెన్రీ జాకబ్‌ త్యారో’ వ్రాసిన వాల్డెన్‌ అనే రచన అది దాని కాగితాలు గోధుమరంగుకు తిరిగాయి. మెల్లిగా పేజీలు తిప్పుతూ ఒకరోజంతా దాన్ని చదివాడు. ఫైనల్‌ ఇయర్‌లో అమెరికన్‌ లిటరేచర్‌ అనే పేపరులోని పాఠ్యాంశాల్లో అదొకటి.

‘వాల్డెన్‌’ అనేది ఒక పాండ్‌ (చెరువు) హెన్రీ జాకబ్‌ (ఆ చివరి పదాన్ని ఎలా పలకాలో పతంజలికి ఇప్పుడూ తెలియదు. ‘Thoreau’ అని ఉంటుంది స్పెల్లింగ్‌) గారి సిద్ధాంతం ఏమిటంటే జీవితంలో దుఃఖానికి మూలం అవసరానికి మించిన సౌకర్యాలు సంపాదన ఆశించడమే. ‘సింపుల్‌ లివింగ్‌ అండ్‌ హై ధింకింగ్‌’ అన్న గాంధీగారి కాన్సెప్టుకు దగ్గరగా ఉంటుంది. జీవితాన్ని సింప్లిఫై చేసుకొనే బదులు కాంప్లికేట్‌ చేసుకున్నామంటాడు. కనీసావసరాలు మాత్రం తీర్చుకుంటా, వాటికి తగిన ఆదాయం మాత్రమే సంపాదించుకుంటే చాలని, అవి కాక మిగిలిన ఆదాయాన్ని ‘ఫెలోమెన్‌’ (సాటి మానవుల) కోసం వెచ్చించాలనీ చెబుతాడు.

“అదంతా చెప్పడం చాలా సులభం. కాని అలా ప్రాక్టికల్‌గా బ్రతకడం అసాధ్యం” అంటారు కొందరు విమర్శకులు అయితే చేసి చూపిస్తానని చెప్పి, తన ఊరి బయట నున్న ‘వాల్డెన్‌ పాండ్‌’ గట్టు పక్కన ఒక కుటీరాన్ని నిర్మించుకుంటాడు. అత్యవసర వస్తువులు, మాత్రమే ఉంటాయి అందులో. తిండి విషయంలో కూడ ‘సింప్లిఫై’ సిద్ధాంతమే.

రచయితగా ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు. రచనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే వాడుకుంటాడు. ఏదైనా అదనంగా మిగిలితే పేదవారికోసం వినియోగిస్తాడు.

రాయడం కాదు చేసి చూపించిన ఘనత ఆయనది. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. కొందరు గుర్తొచ్చారు పతంజలికి ప్రధానులుగా, రాష్ట్రపతులుగా పనిచేస్తూ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించేవారు. అబ్దుల్‌ కలాంగారు తన బంధువులు ఢిల్లీ చూడటానికి వస్తే వారి వసతి, భోజన ఖర్చులన్నీ తన జేబులోంచి పెట్టుకున్నాడని చెబుతారు. త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన మానిక్‌ సర్కార్‌ గారికి సొంత యిల్లు లేదు. లాల్‌బహదూర్‌ శాస్త్రి గారికి చిరుగులున్న కోటు ఉండేదట. నెహ్రూగారు “నీకు మంచి కోటు కొనిస్తా”నంటే “మీరు కొనిస్తే నాదెలా అవుతుంద”న్నారట. గోవా సి.ఎమ్‌. మనోహర్‌ పారికర్‌గారు సొంత మోటార్‌ సైకిల్‌ మీద అసెంబ్లీకి వెళ్లేవారని చెబుతారు.

ఔరంగజేబు టోపీలు కుట్టి, వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకున్నాడట. వావిలాల గోపాల కృష్ణయ్యగారు ఒక గుడ్డ సంచీ భుజానికి తగిలించుకొని కాలినడకన తిరిగేవాడట. గాంధీజీగారి నిరాడంబరత్వం జగద్విదితం.

పతంజలికి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. ఏనాడూ వాళ్లు సబ్బుతో స్నానం చేయలేదు. టూత్‌ బ్రష్‌, పేస్ట్‌ వాడలేదు. అమ్మ పళ్ల పొడి స్వయంగా తయారు చేసేది. నీళ్లు కాగు క్రింది బూడిదను జల్లెడపట్టి, మెత్తని భాగం పక్కకు తీసి, దానిలో ఉప్పు, పచ్చకర్పూరం కలిపి పెద్ద డబ్బాలో పోసి ఉంచేది. వారి పళ్లు చివరి వరకు గట్టిగానే ఉన్నాయి.

పుస్తకం చదివిన తర్వాత పతంజలికి ఒక ఆలోచనవచ్చింది. తను కూడ సాధ్యమయినంత సింప్లిపై అవుదామనుకున్నాడు. మేస్త్రీ శ్రీనును పిలిపించాడు (ఫోన్‌ చేసి). ఫస్ట్‌ ఫ్లోర్‌ మీద డాబాపై ఒక పెంట్‌ హౌస్‌ కట్టాలని చెప్పాడు. కాంక్రీట్‌ బిల్డింగ్‌ కాదు. పిట్టగోడ మీద మూడడుగులు ఎత్తున ఇటుకతో నాలుగు వైపుల గోడలు లేపాలి. వాటిమీద డోమ్‌లాగా రూఫ్‌ రావాలి. రూఫ్‌ను వెదురు బొంగులు, వెదురు తడికెలతో చెయ్యాలి. కిటికీలుండవు. రూప్‌కూ పిట్టగోడకూ మధ్యన చుట్టూ మూడడుగుల గ్యాప్‌ నుండే గాలి వెలుతురు వస్తాయి. బాత్‌రూం అవసరంలేదు. క్రిందనే వాడుకుంటాడు. డాబాలో మూడో వంతులో ఈ నిర్మాణం వస్తుంది. ఫ్లోరింగ్‌ ప్రత్యేకంగా ఏమీ చేయరు. రూఫ్‌లో ఒక ఫ్యాన్‌, ఒక ట్యూబ్‌ వైట్‌ మాత్రం ఉంటాయి. ఒక మడతమంచం, దుప్పటి, దిండు. ఒక మూల పతంజలి రాసుకోడానికి కుర్చీ టేబుల్‌.

ఓవర్‌హెడ్‌ టాంక్‌ వద్ద ఒక ట్యాప్‌ ఉంది. అక్కడే తూము ఉంది. ఆరుబయటే స్నానం చేయవచ్చు. వసుధ పెంచుతూన్న రకరకాల పూల మొక్కలు కుండీల్లో ఉండనే ఉన్నాయి. నైరుతిలో ఒక చిన్న వేదిక నిర్మించి పాలరాతితో లక్ష్మీనరసింహుని విగ్రహం రెండడుగుల ఎత్తున చేయించాలని నిర్ణయించుకున్నాడు. వేదికకు నాలుగువైపులా నాలుగు స్తంభాలు సిమెంటుతో చేసి, వాటిమీద స్వామివారికి ఎండావానా తగలకుండా చిన్న షెల్టర్‌, దానిమీద ఒక చిన్న గోపురం లాంటిది వస్తుంది.

నెల రోజుల్లో అనుకున్న విధంగా అన్నీ పూర్తయ్యాయి. రోజూ స్వామికి పూలమాల తెచ్చి వేస్తాడు. మాలకు కావలసిని పూలు ఇంట్లోనే పూస్తాయి. ఇంటిబయట గ్రిల్స్‌ లో నందివర్ధనం, గన్నేరు, మందార చెట్లున్నాయి. కాని తెల్లవారకముందే కోసుకోవాలి. లేకపోతే దక్కవు.

భోజనం టిఫిన్‌ అన్నీ క్రిందే. పూజ కూడ. కాని ఎందుకో ఆ కుటీరంలో ప్రశాంతంగా ఉండేది మనసుకు. సాయంత్రం భార్యభర్తలిద్దరూ ఆరుబయట ప్లాస్టిక్‌ కుర్చీలు వేసుకొని కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు.

మధ్యలో కొన్ని రోజులు బెంగుళూరులో ఉండి మనుమడితో ఆడుకొని వచ్చేవారు. వాడికి ఏడాదిన్నర వయసు. ప్రజ్ఞ, అల్లుడు నెలకోసారి వచ్చి వీకెండ్‌ గడిపి వెళ్లేవారు.

‘ఇంగ్లీషు టీచర్స్‌’ అనే వాట్సప్ గ్రూపులో ఉండేవాడు పతంజలి. ఒకసారి ‘యాంధోని’ అనే అతను ఒక మెసేజ్‌ పెట్టాడు. పంజాగుట్టలోని ‘గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌’ లో డీన్‌ పోస్టు బాగా ఖాళీగా ఉందని కంటెంట్‌ రైటింగ్‌, ఎడిటోరియల్‌ స్కిల్స్‌ గలవారికి, రిటైరైన వారికి ప్రాధాన్యత ఇస్తారని వ్రాశాడు. కరికులమ్‌ వైటే (సివి) పంపడానికి ఇ.మెయిల్‌ ఐడి ఇచ్చాడు.

మర్నాడే పతంజలి తన ‘రెజ్యూమె’ మెయిల్‌ చేశాడు. వారం రోజుల తర్వాత వచ్చి కలవమని బి.స్కూల్‌ డైరెక్టర్‌గారి నుండి మెయిల్‌ వచ్చింది. బస్సులో యల్‌.బి. నగర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద దిగి మెట్రో రైలెక్కాడు. కేవలం ఇరవై రెండు నిమిషాల్లో ఇర్రం మంజిల్‌ స్టేషన్లో దిగి, నిమ్స్‌ హాస్పిటల్‌ దాటి. బి స్కూల్‌ చేరుకున్నాడు. స్టేషను నుండి అర కిలోమీటరు దూరం కూడలేదు.

గ్లోబల్‌ బిజినెస్‌ స్కూలు నాలుగంతస్తుల బిల్డింగ్‌. రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లి తాను వచ్చిన పని చెప్పాడు. ఒక అమ్మాయి వెళ్లి డైరెక్టర్‌ గారినడిగి వచ్చింది. బయట ‘శశాంక్‌ దినకర్‌’ డైరెక్టర్‌ అని నేమ్‌ప్లేట్‌ మీద తాపడం చేసిన ఇత్తడి అక్షరాలు మెరుస్తున్నాయి. క్రింద చాలా డిగ్రీలున్నాయి. వాటిని చదివాడు. ఆయన ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌లో కూడ రెండు పి.హెచ్‌డిలు చేసినట్లు గ్రహించాడు. ‘గట్టివాడే’ అనుకున్నాడు.

తలుపు తీసుకొని లోపలికి వెళ్లాడు. డైరెక్టర్‌ చిన్నవాడే, నలభై లోపే ఉంటుంది వయస్సు. ప్రద్యుగాడి కంటే మహా అయితే నాల్గయిదేళ్లు పెద్దవాడై ఉంటాడు.

చాలా గౌరవంగా రిసీవ్‌ చేసుకున్నాడతడు. జాబ్‌ ప్రొఫైల్‌ వివరించాడు. రోజూ ఒకే క్లాసు పిజిడియం కోర్సు ఉంది. ఐఐఎమ్స్‌లో కూడ యంబిఏ ఉండదు. ‘బిజినెస్‌ కమ్యూనికేషన్‌’ వారానికి మూడు రోజులు ఉంటుంది. కేంబ్రిడ్జి వారి ‘బిజినెస్‌ ఇంగ్లీష్‌ సర్టిఫికేషన్‌’ అని ఒక యాడ్‌ ఆన్‌ కోర్సు ఉంది. అది మిగిలిన మూడు రోజులు.

క్లాస్‌ వర్క్‌ పెద్దగా లేదు. కాని మూడు నెలలకోసారి జర్నల్‌ వెలువరించాలి. దానికి కావలసిన ఆర్టికల్స్‌ వ్రాయాలి. ఇతరులెవరయినా ఆర్టికల్స్‌ పంపితే వాటిని ఎడిట్‌ చేయాలి. ప్రతినెలా ఒక ‘న్యూస్‌ లెటర్‌’ ప్రచురిస్తారు. దాని సంపాదకత్వం కూడ చేయాలి. స్టూడెంట్స్‌ ఇండస్ట్రియల్‌ విజిట్స్‌ కు వెళుతూంటారు. వాటి గురించి ఎగ్జిక్యూటివ్‌ రిపోర్ట్‌ వ్రాయాలి.

“ఐకెన్‌ డు ఆల్‌ దీస్‌ ధింగ్స్‌ విత్‌ ప్లెజర్‌. దిసీజ్‌ క్రియేటివ్‌ వర్క్‌” అన్నాడు పతంజలి.

“ఎగ్జాక్ట్లీ సర్‌. మీ ప్రొఫైల్‌ చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను. యు ఆర్‌ ది రైట్‌ పర్సన్‌ ఫర్‌ అజ్‌” అన్నాడతను.

“కాలేజ్‌ టైమింగ్స్‌?”

“ఫ్రం మార్నింగ్‌ నైన్‌ టు ఈవెనింగ్‌ ఫోర్‌, సర్‌!”

“ఇఫ్‌ యు డోన్ట్‌ మైండ్‌, కెన్‌ ఐ కంప్లీట్‌ మై వర్క్‌ బై నూన్‌ అండ్‌ లీవ్‌?”

“వైనాట్‌ సార్‌. మీకు క్లాసు ఫస్టవర్‌ ఇస్తాము. తర్వాత రైటింగ్‌ వర్కేకదా! మీరు ఒంటిగంట లోపే వెళ్లిపోవచ్చు. బై ది బై, రెమ్యూనరేషన్‌ ఎంత ఎక్స్‌ఫెక్ట్‌ చేస్తున్నారు?”

పతంజలి నవ్వాడు.

“దటీజ్‌ నో బార్‌. ఐ ఎక్స్‌పెక్ట్‌ రెస్పెక్ట్‌ అండ్‌ ఫ్రీడమ్‌ ఓన్లీ” డైరెక్టర్‌ ఆశ్చర్యపోయాడు.

“ఫిప్టీ థౌజండ్‌ పే చేస్తాము సార్‌ నెలకి” అన్నాడు.

పతంజలికి సంతోషమయింది, సోషల్‌ సర్వీసెస్‌కు తడుముకోనక్కరలేదని!

మంచి రోజు చూసి జాయినయ్యాడు. మెట్రో వల్ల హాయిగా ఉంది. రద్దీగా ఉంటుందిగాని సీనియర్‌ సిటిజన్స్‌కు రెండు వరుసలు కేటాయించారు. పతంజలికి గ్రౌండ్‌ ఫ్లోర్లో ఒక ఎ.సి ఛాంబర్‌ ఇచ్చారు. ఒక కంప్యూటర్‌ ఆపరేటర్నిచ్చారు. ఆ అమ్మాయి బయట కూర్చుంటుంది. పతంజలి వ్రాసిన ఆర్టికల్స్‌ను రిపోర్ట్స్‌ను టైప్‌ చేస్తుంది. చిన్నపిల్లే. బుజ్జమ్మ వయసుంటుది.

పతంజలి క్లాసు ఒకటి సెకండ్‌ ఫ్లోర్‌లో, ఒకటి థర్డ్‌ ఫ్లోర్‌లో ఉంటాయి. లిఫ్ట్‌ ఉంది. నెలరోజుల్లోనే పిల్లలందరూ పతంజలికి చేరువయ్యారు. నార్త్ ఇండియన్స్‌ ఎక్కువగా ఉన్నారు. “డీన్‌ సార్‌” అని పిలుస్తారు.

తొలి జర్నల్‌ లోనై తనదైన ముద్రను చూపించాడు పతంజలి. కౌటిల్యుని అర్థశాస్త్ర బిజినెస్‌ లీడర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఒక వ్యాసం రాశాడు. ‘ఆర్గనైజేషనల్‌ కల్చర్‌’, ‘బిజినెస్‌ ఇంగ్లీష్‌’, ‘ఎక్స్‌పీరియన్షియల్‌ టీచింగ్‌ లర్నింగ్‌ ప్రాక్టిసెస్‌, ‘ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ ఫర్‌ బిజినెస్‌ లీడర్స్‌, ‘స్టార్ట్‌ అప్స్‌ ఎ పరస్పెక్టివ్‌’ ఇలా మేనేజ్‌మెంట్‌ విద్యకు రెలెవెంట్‌ టాపిక్స్‌ తీసుకొని తనదైన శైలిలో చక్కగా వ్రాసేవాడు. పతంజలి చేస్తున్న కృషి ఛైర్మన్‌ రామిరెడ్డి గారి వరకు వెళ్లింది.

“హి ఈజ్‌ యాన్‌ అస్సెట్‌ టు అజ్‌” అన్నాడట ఆయన.

మధ్యాహ్నం ఒంటిగంటన్నర కల్లా యిల్లు చేరుకుని, భోంచేసి విశ్రమించేవాడు.

ఒకరోజు రాత్రి ప్రద్యుమ్న ఫోన్‌ చేశాడు. ఎక్సయిటింగ్‌గా ఉంది వాడి గొంతు.

“నాన్నా, ఒక గుడ్‌ న్యూస్‌! మేం హైదరాబాదుకు వచ్చేస్తున్నాము. ఇక మీదట మీతో కలిసి ఉంటాం నాన్నా” అన్నాడు.

“వెరీగుడ్‌ జాబ్‌ మారుతున్నావా కన్నా?”

“అవును నాన్నా. ‘డెల్‌’ లో నేను చేస్తున్నప్పుడు ‘అలోక్‌ మిత్రా’ అని మాకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఉండేవాడు. నేనంటే చాలా ఇష్టం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘కోర్‌ డౌట్‌ ఎ.ఐ’ అనే సంస్థకు సి.యి.ఓ. ఆయన. నన్ను వచ్చేయమని పిలిచాడు ఈరోజే యుఎస్‌ నుండి ఫోన్‌ ఇంటర్వ్యూ పూర్తయింది. టెన్‌ లాక్స్‌ హైక్‌ యిస్తున్నారు నాన్నా. అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఆఫర్‌ లెటర్‌ కూడ మెయిల్లో వచ్చేసింది.

“ఎ.ఐ. అంటే ఏమిట్రా?”

“ఆర్టిఫిషియల్‌ ఇంటిలెజెన్స్‌. ఈ మధ్య ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాబోయే కాలాన్ని ఏలబోతూందదే. కోర్‌ డాట్‌ వాళ్లు ఎ.ఐ. సాఫ్ట్‌ వేర్‌ తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్ముతారు. నేను అసోసియేట్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌).”

“అయాం ప్రౌడ్‌ ఆఫ్‌ యు రా. ఎప్పుడు బయలుదేరుతున్నారు?”

“రేపే. ఉదయం పదిగంటలు ఎయిర్‌ ఆసియా ఫ్లైట్‌. లంచ్‌కు అక్కడికి వస్తాము. అమ్మకివ్వొక్కసారి”

తల్లీ కొడుకులు పావుగంట సేపు మాట్లాడుకున్నారు. వసుధ కళ్లల్లో ఆనందం. ఫోన్‌ కట్‌ చేసి పతంజలి ప్రక్కన కూర్చుంది.

“పిల్లలు మన దగ్గరికొచ్చేస్తున్నారు బావా. ప్రద్యు ఎంత సంతోషంగా ఉన్నాడో!” అన్నది.

“వీడొక పిచ్చోడు అందరూ తల్లిదండ్రుల్ని వదిలి అమెరికా ఎగిరిపోతూంటే వీడేమో మన దగ్గరికొచ్చేస్తున్నానని తెగ సంబరపడిపోతున్నాడు” అన్నాడు అతని గొంతులో కొడుకు పట్ల వాత్సల్యం.

మర్నాడు ఉదయం ఒంటిగంటకల్లా ప్రద్యు, ఉదయ, ప్రజ్వల్‌ వచ్చేశారు. వసుధ, పనిమనిషితో మేడమీద బెడ్‌రూం వారి కోసం శుభ్రం చేయించి, బెడ్‌ షీట్స్‌, పిల్లో కవర్స్‌ కర్టెన్స్‌ మార్పించింది. ఒకటిన్నర కల్లా పతంజలి కూడ వచ్చేశాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here