సాఫల్యం-6

0
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“నా[/dropcap]యనా, ఈ నెల రోజులూ పూర్తిగా చదువుకో. చదివినదంతా పునశ్చరణ చేసుకో. పొలానికి వెళ్లకు” పతంజలికి నెత్తిన పాలు పోసినట్లయింది.

పదిరోజుల తర్వాత పరీక్షల టైం టేబుల్‌, హాల్‌టికెట్‌ వచ్చినాయి. మద్రాసులో ‘ప్యారిస్‌ కార్నర్‌’ ప్రాంతంలో “సెయింట్‌ యాన్స్‌ గ్రామర్‌ స్కూలు” లోని పరీక్షా కేంద్రానికి అలాట్‌ చేశారు పతంజలిని.

ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి నిమ్మకాయలు మద్రాసుకు తీసుకుని వెళితే? ఒకవేళ మండీలోనే ఉండటానికి వసతి ఉంటే ఛార్జీలు, ఖర్చులు కలిసివస్తాయి. అదేమాట తండ్రితో అన్నాడు.

“ఎందుకురా కష్టపడతావు. పరీక్షలు రాసే ఏకాగ్రత ఉంటుందా?” అన్నాడాయన.

“ఫరవాలేదు నాన్నా. అదేపనిగా పోయి మద్రాసులో పది పన్నెండు రోజులుండాలంటే మాటలా!” అన్నాడు కొడుకు.

కొడుకు ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నాడో, కుటుంబ పరిస్థితుల పట్ల ఎంత అవగాహన ఉందో అర్థమయ్యిందాయనకు.

పరీక్షలకు రెండు రోజులు ముందే నిమ్మకాయలు బస్తాలలో ప్యాక్‌ చేసుకొని బయలుదేరాడు. మొత్తం 35 బస్తాలయ్యాయి. ‘మద్దిలేటి’ అని ఒక కుర్రవాడు ఉల్లిపాయలు హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తాడు. ఉల్లిపాయలు లారీలో తీసుకొని పోతుంటాడు మద్రాసుకు. అతని వద్దకు వెళ్లి విచారించాడు.

“ఉల్లిపాయల మార్కెట్‌ పక్కవీథిలోనే సామీ నిమ్మకాయల మార్కెట్టు నేను జూసినాలే. మాదేమో ‘మలయపెరుమాళ్‌’ వీధి. మీదేమో ‘భద్రయన్‌ వీధి’ అన్నాడు మద్దిలేటి.

“మీరు ఈ మధ్య వెళ్లి వచ్చారా?” అనడిగాడు.

“పోయిన వారం వెళ్లాం. మళ్లీ రేపు రాత్రి బయలుదేరుతున్నాం”

“మావి ఒక 35 బస్తాలు నిమ్మకాయలున్నాయి. అవి లోడ్‌ చేయడానికి చోటుంటుందా? నేను కూడ వస్తా. నాకు మద్రాసులో ఇంటర్మీడియట్‌ పరీక్షలున్నాయి.”

“అయ్యో దానికేముంది సామీ, ఉల్లిలోడు మీద నిమ్మ బస్తాలేచ్చే సరిపాయె. మాతో పాటు లారీ క్యాబిన్‌లో నిన్ను కూర్చోపెట్టుకొని పోలేమా ఏమన్నానా!” అన్నాడు అబ్బాయి. పతంజలికంటే నాలుగైదేండ్లు పెద్దయి ఉంటాడంతే.

“ఊరికేవద్దు. బస్తాలకు, నాకు ఛార్జీ తీసుకోవాలి” అన్నాడు పతంజలి. ఆ మాటకు ఎంతో నొచ్చుకున్నాడు మద్దిలేటి.

“ఏందిసామీ! అంతమాటనేస్తివి? మంచికైనా చెడ్డకయినా నాయిన దగ్గరకే కద మేం బొయ్యేది. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే, బో చెప్పినావులేయ్యా” అన్నాడు.

మరుసటి రోజురాత్రి 9 గంటలకు ఉల్లి లోడింగ్‌ అయింది. దాని మీద తడవకుండా టార్పాలిన్‌ కట్టారు. దానిమీద నిమ్మకాయ బస్తాలెక్కించి, పడిపోకుండా తాళ్లు బిగించారు. తడిసినా ఏం కావు కాబట్టి ఏమీ కప్పనక్కరలేదు.

ఒక పెద్ద సంచిలో నాలుగు జతల బట్టలు, మరొక సంచిలో పుస్తకాలు సర్దుకున్నాడు. అమ్మ కారాలు, పప్పు బిళ్లలు, రెండు రోజుల్లో తినడానికి తపిలెంట్లు కట్టి యిచ్చింది. తొమ్మిదిన్నరకు లారీ బయలుదేరింది. డ్రైవర్‌ ఎవరో కాదు ఎలిమెంటరీ స్కూల్లో పతంజలి క్లాస్‌మేట్‌. మస్తాన్‌వలి. పతంజలిని చూసి నవ్వి పలకరించాడు.

“ఏం సామీ, ఎట్లుండావు?”

“బాగున్నాగానీ డ్రయివింగ్‌ ఎప్పుడు నేర్చుకున్నావురా?”

“సంవచ్చరం దాటిపాయెలే. నాకంటే సదువబ్బల్యా. నీకేమైంది? సదువు మానుకొని ఈ నిమ్మకాయల్యాపారం?”

“లేదు ప్రయివేటుగా చదువుతున్నా. ఎల్లుండినుండి మద్రాసులో ఇంటరు పరీక్షలు”

“ఓరి నీ పాసుగూల! సామి కార్నెం సొకార్నెం రెండూ సక్కబెట్టుకోవచ్చు. మీ బామ్మర్ల తెలివే తెలివిలే”

పతంజలి నవ్వాడు వాడి మాటలకు. సామితో అంత చనువుగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా చూస్తున్నాడు మద్దిలేటి.

“ఎంతయినా ఒక బళ్లో సదువుకున్నాం కాబట్టి సామి నా నేస్తుడే” అన్నాడు మస్తాన్‌.

వెల్దుర్తి నుండి నంద్యాల, ఆళ్లగడ్డ, కడప, తిరుపతి, మీదుగా మద్రాసు వెళ్లాలి. అర్ధరాత్రి దాటింతర్వాత ‘చాగలమర్రి’ అనే ఊరి దగ్గర లారీ ఆపాడు మస్తాన్‌.

“నిద్దరొచ్చాంది. టీ తాగకపోతే పరేశాన్‌” అనుకుంటూ దిగాడు. అప్పటికే చాలా లారీలాగి వున్నాయక్కడ. రెండుమూడు కొట్టం (పాక) హోటళ్లున్నాయి. డ్రైవర్లు క్లీనర్లు, అగ్గువ (చౌక) గా తీసుకుపోతారు కాబట్టి లారీల్లో ప్రయాణించేవారు చాలామంది ఉన్నారు హోటళ్ల దగ్గర. దాదాపు ఒంటిగంట దాటుతూంది. పెనంమీద దోసెలు పోస్తున్నారు. దోసెమీద పల్చగా కొరివికారం పట్టించి, పుట్నాల పొడి చల్లి వేడి వేడిగా యిస్తున్నారు.

“సామీ! దోసె తిందాంరా, బలేవుంటాయిక్కడ” అన్నాడు మస్తాన్‌.

“బాపనోల్లు యాడబడితే ఆడ మన మాదిరి తినరులే బాషా” అన్నాడు మద్దిలేటి. పతంజలికి ‘అపవిత్రః పవిత్రోవా’ అనే శ్లోకం గుర్తొచ్చింది. ‘నైట్‌ డ్యూటీలు చేసే వీళ్లకు సమయానికి తిండి తినే అవకాశముండదు’ అనుకున్నాడు. “అదేంలేదు. నేనూ తింటా మీతో బాటు” అన్నాడు.

వాళ్లిద్దరూ మహదానందపడిపోయారు.

మస్తాన్‌ దోసెలు పోసే ఆమె దగ్గరకు పోయి “మూడు దోసెలు బోయక్కా నూనె ఎక్కువేసి, కారం దండిగ పుయ్యాల సూడు, పప్పులపొడి కూడ ఎక్కువ సల్లమ్మే. పూర్తి రోట్టు (roast) జేచేవు. మాసామి నీ దోసె దిని మెచ్చుకోవాల ఆ” అన్నాడు గుక్క తిప్పుకోకుండా.

“తినే ఒక్క దోసెకు ఎన్ని సదివినావురా తురకనాబట్టా” అన్నదామె నవ్వుతూ.

“బాగపోసిచ్చాలే కూసోండి బండలమీద” అన్నది.

కొట్టం ముందు బేతంచెర్ల నాప బండలు టేబుళ్ల మాదిరి ఏర్పాటు చేసినారు.

వాటికి సపోర్టుగా రాతి స్తంభాలు కూర్చోడానికి కూడ అవే.

ఒకేసారి మూడు నాలుగు దోసెలు పోసేంత పెద్ద పెనమది. క్రింది కట్టెలు మండుతున్నాయి.

కొందరు డ్రైవర్లు మస్తానును పలకరించారు.

“ఈనెవరు?” అనడిగారు.

“మా ఊరి బాపనయ్య. నాలుగో తరగతిలో నా కలాస్మేట్‌. ఇంటర్మీడేటు సదూతున్నాడు. పరీచ్చలు మద్రాసులో రాయనీకె వచ్చుండాడు” అని చెప్పాడు మస్తాన్‌.

పతంజలికి నమస్కారం పెట్టాడు అడిగినాయన. ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చి నిలబడ్డారు. మద్దిలేటి పతంజలి గురించి వాళ్లకేదో చెబుతున్నాడు. వాళ్లు మెచ్చుకుంటూ తలలాడిస్తున్నారు. ఒకతను పతంజలి దగ్గరికొచ్చి “సామీ, మాది బుక్కాపురం. మా ఊర్లో మీ నాయన పురానం సెప్పినాడు. ఏడెనిమిదేళ్లకిందటలే. అప్పుడు నీవు సిన్నపిల్లానివి. సేద్యం జేపిచ్చావంటనే. అన్ని పనులూ వచ్చంటగదా! గట్టోనివిలే! అట్లనే వుండాలమల్ల” అని ఒకటే పొగడటం. పతంజలి సిగ్గుపడినాడు.

దోసెలు వచ్చినాయి. సత్తుపళ్లేలలో, విస్తరాకు ముక్కవేసి, దానిమీద దోసెలు పెట్టి యిచ్చిందామె. వాసన ఘుమఘుమలాడుతుంది. తింటూంటే ‘అమోఘం’ అనిపించింది పతంజలికి. కర్నూల్లో ‘ఉడిపి బృందావన్‌’లో తిన్న దోసె దీనిముందు దిష్టి తీయడానికి కూడ పనికి రాదనిపించింది. ఘాటుగా కారంగా కరకరలాడుతుంది.

“ఎట్లుంది సామి!” అని అడిగిందామె.

“చాలా బాగుందమ్మా” అన్నాడు మనస్ఫూర్తిగా.

మద్దిలేటి వివరించాడు. “ఇది కడపజిల్లా బార్డరు. కారందోసెలు కడప జిల్లాలో పేరు కదా బార్డరూరు కాబట్టి చాగలమర్రిలో కూడ అదే నాన్నెం”. గాజు గ్లాసుల్లో టీలు వచ్చాయి. వాళ్లు ఎంతవారిస్తూన్నా వినకుండా అందరికీ డబ్బు చెల్లించాడు పతంజలి.

లారీ ఎక్కిన తర్వాత అరగంటవరకు “ఏంది సామీ ఇట్టజేచ్చివి” అంటూనే ఉన్నారు. తర్వాత నిద్ర పట్టింది పతంజలికి. ఉదయం 7 గంటల కల్లా మద్రాసు చేరుకున్నారు.

***

ఉల్లిపాయల మార్కెట్‌ (హోల్‌సేల్‌) ఉన్న మలయ పెరుమాళ్‌ వీధికి ఎదురుగ్గా రోడ్డు ప్రక్కన లారీ ఆపుకున్నారు. నిమ్మకాయల మార్కెట్‌ పక్క వీధే. మండీలన్నీ వరుసగా ఉన్నాయి. ఆ వీధులు చాలా యిరుగ్గా ఉన్నాయి. తోపుడు బండ్లు, ఆటో ట్రాలీలు మాత్రమే పోగలుగుతాయి. మద్దిలేటిని తీసుకొని భద్రయ్యన్‌ వీధిలోకి వెళ్లాడు పతంజలి. వరుసగా మండీలు చూచుకొంటూ వెళుతుంటే ‘పెంచలయ్య & బ్రదర్స్‌, నిమ్మకాయల కమీషన్‌ ఏజంట్స్‌’ అని బోర్డు కనబడిరది. ఆ బోర్డు మీద లక్ష్మినరసింహస్వామి బొమ్మ ముద్రించి ఉంది. ముందు చిన్న వరండా లాంటి దాంట్లో ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు బెంచీమీద. లుంగీ, బనియన్‌ వేసుకొని, ఒక గళ్లటవలు భుజాలమీదుగా కప్పుకొని ‘ఈనాడు’ చదువుకుంటున్నాడు. ‘నరసింహస్వామి’ని చూడగానే అనుకున్నాడు పతంజలి “ఈ మండీకే వేద్దాం బస్తాలను” అని.

వీళ్లను చూసి, లేచి నిలబడి ఆహ్వానించాడా యువకుడు. “రాండి, రాండి, ఆంధ్రనుండి వస్తిరా?” అని అడిగాడు.

“అవును నిమ్మకాయలు 35 బస్తాలు తెచ్చినాము. మీ కూలీలను పంపిస్తారా! రోడ్డుమీద లారీలో ఉన్నాయి” అన్నాడు మద్దిలేటి.

“అట్లనా! మంచిది ఇప్పుడే పంపిస్తాను” అని, “ఒరే చెంగయ్యా! తిరుపాలూ!” అని లోపలికి కేకవేశాడు.

ఇద్దరు బలిష్టంగా కండలు తిరిగిన యువకులు బయటకువచ్చారు. “ఏందినా! మూటలు దిగినాయా ఏంది ఆంధ్రానుంచి?” అన్నాడొకడు.

“లారీ యాడుండాదో యీల్లకు సూపిచ్చుపోండి” అన్నాడాయువకుడు.

“పెంచలయ్యగారు ఎప్పుడొస్తారు?” అనడిగాడు పతంజలి.

ఒక్కక్షణం అర్థంకానట్టు చూశాడా అబ్బాయి. తర్వాత బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు.

“ఓరి నాయనోయ్‌! సంపేస్తివికదసామీ! నేను ఇంకా ఎవరో అనుకుంటిగదూ! పెంచలయ్యగారట! గారు!’ అని మళ్లీ నవుతునన్నాడు.

అంతగా నవ్వడానికి తనన్నదాంట్లో ఏముందో పతంజలికి అర్థం కాలేదు. కాసేపటికి తేరుకొని అన్నాడతడు.

“నేనే సామీ పెంచలయ్యను. ఈ మండీ నాదే. వీడు చెంగయ్య నా తమ్ముడు. వీడు తిరుపాలు మా ఊరబ్బి. నాకాడనే పని చేస్తుండ్లా. మేమందరం ఈ మండీలోనే ఉంటాం. పుట్టి బుద్ధెరిగినాంక ఇంత మర్యాదగ నాగురించి అడిగితే నా కర్థంకాల్యామరి” అన్నాడు.

కమీషన్‌ ఏజంట్లను హుబ్లీలో చూసి, ఇక్కడ కూడ అట్లే ఉంటారనుకున్నాడు పతంజలి. మండీ కూడ సాదాసీదాగ ఉంది. దాని యజమానే అతనని ఊహించలేదు.

“మనం లోపలికి పోదాం పా సామి. మా వాళ్లు మీ వానితో బోయి మూటలు మండీకి తెస్తారులే” అన్నాడు పెంచలయ్య.

“అయితే నేను వీళ్లతో మూటలు దింపిచ్చి పంపిచ్చా. సాయంతరం నా పని అయిం తర్వాత కలుచ్చాలే” అని వాళ్ళను తీసుకొని వెళ్లిపోయాడు మద్దిలేటి.

పతంజలిని లోపలికి తీసుకునిపోయాడు పెంచలయ్య. వరండా తర్వాత కొంచెం పెద్ద హాలు. దాంట్లో వరిగడ్డి పరచి దానిమీద గోనెపట్టాలు ఏకాండంగాకుట్టి, పైన పరచి ఉన్నారు. దాని వెనుక చిన్న రూముంది. అందులో ఒక బెంచీ, రెండు కుర్చీలు, ఒక టేబులు, బీరువా ఉన్నాయి. ఫ్యానుంది. “ఇది సామీ మా ఆఫీసు” అన్నాడు పెంచలయ్య. ఆఫీసు దాటివెళితే ఒక చిన్నగది ఒక మూల రెండు కిరసనాయిలు స్టవ్వులు, గూట్లో కొన్ని వంటగిన్నెలు. బియ్యం, కందిపప్పు, లాంటివి ఒక గూట్లో గోడ వెంబడి జంపఖాన పరచి ఉంది.

“మేం ముగ్గురం ఈడే వండుకునేది. పండుకొనేది. ఎనక కక్కసు దొడ్డుండాది. కొలాయుండాది. పోయి మొకం కడుక్కో పో” అన్నాడు పెంచలయ్య.

బట్టల బ్యాగు, పుస్తకాల బ్యాగు జంపఖానా మీద పెట్టి, కాలకృత్యాలు తీర్చుకొని వచ్చాడు. బాత్‌రూం అని ఏమీ లేదు. కొళాయి దగ్గరే ఒక మట్టి కాగు, బక్కెటు, సిల్వరు చెంబు ఉన్నాయి. తాడు మీద లుంగీలు, టవల్లు, డ్రాయర్లు, ఆరేసి ఉన్నాయి. లెట్రిన్‌ ఎంత చిన్నదంటే కొంచె లావుగా ఉన్నవాళ్లు పట్టరసలు.

పతంజలి వచ్చేటప్పటికి పాలుకాచి, బ్రూ, చక్కెర కలిపి స్టీలు గ్లాసులో పోసి యిచ్చాడు పెంచలయ్య. తానూ ఒక గ్లాసులో పోసుకున్నాడు. కాఫీ తాగుతూ తన వివరాలు చెప్పాడు.

“మాది నాయుడుపేటలే సామి. నెల్లూరు జిల్లా. సేద్యమే చేసేటోల్లము. నాయన చిన్నపుడే సచ్చిపోతే అమ్మ మా ఇద్దర్నీ సాకి సంతరం జేసుకొచ్చె. అక్కకు పెండ్లి జేసినాంలే. బావ తిర్పతి దేవస్థానంలో అటెండరు. వాళ్లకు ఒక కొడుకు. సేజ్జాలు గిట్టుబాటుగాక, మద్రాసు కొచ్చిన్యాం. మొదలు ఒక సేటు కాడ మండీలో పనిజేసినా. పెద్దమండీలే సామి తర్వాత ఈ మండీ దొరికింది. బాడిగకు మన ఆంధ్రానుంచి మూటలొస్తాయి. రోజూ నూటయాభై రెండొందలకు దాటి వస్తాయి. ఈడ మద్రాసులో ఎట్టంటే మనమే సైజులవారీ గ్రేడింగ్‌ చేసిపెట్టాల. 10 గంటల తర్వాత గంపలోల్లు, మారు బేరగాల్లు వస్తారు. ధర బాగానే ఉండాదిలే ఇప్పుడు” అన్నాడు.

పతంజలి తన వివరాలు చెప్పాడు. రేపటి నుండి పరీక్షలు రాయాలి అన్నాడు. హుబ్లీలోలాగ ఉండుంటే ఖర్చులేకుండా వసతి దొరికేదని అనుకొన్నాడు కాని, ఈ చిన్న రూములో వీళ్లకే యిరుకు. తాను ఉండటం కుదరదు అనుకున్నాడు.

“మరి యాడ ఉండాలని?” అని అడిగాడు పెంచలయ్య.

పరీక్షలు జరిగే స్కూలు పేరు చెప్పి అదెక్కడుందో తెలుసేమోనని కనుకున్నాడు. “నాకు అట్టాంటివి ఏం తెలుచ్చాయి? మా చెంగయ్యకైతే తెలచ్చాయి. వాన్ని మా ఊర్లో పదివరకు జదివిచ్చిండ్లా. మండీలో లెక్క డొక్క, రాత, కోత అన్నీ వాడే జూసుకొనేది” అంటూండగానే తమ్ముడు వచ్చాడు.

“ఏందినా, నామీదేం చెపుతాండావు సామికి?” అన్నాడు.

పతంజలి స్కూలు గురించి అడిగితే, ‘ఏరియా తెలుసా’ అని అడిగాడు చెంగయ్య బ్యాగులోంచి హాల్‌ టికెట్‌ తీసి చూసి “ప్యారిస్‌ కార్నర్‌ అంట” అన్నాడు.

“అదా బో దగ్గర మనకు నడ్సిపోయ్యేదూరమే. సాయంత్రం నేజూపిచ్చా” అన్నాడు.

అన్నదమ్ములిద్దరూ ఏదో చర్చించుకున్నారు ఆఫీసురూంలోకి పోయి తిరిగివచ్చి పెంచలయ్య అన్నాడు.

“సామీ! మీరు బ్రామ్మనోల్లు. పరీచ్చలు రాయాలంటే పెశాంతంగా ఉండాల. ఈడనే మా ఊరోల్లది లాడ్జింగుంది. అందులో మడతమంచాలు అద్దెకిస్తారు రోజుకు మూడ్రుపాయలు. పది పన్నెండ్రోజులుంటావు గాబట్టి తగ్గిచ్చమని అడుగుదాం. పైన మిద్దెమీద కూడ ఆయిగా ఉంటాది. నీవు సదువుకోనీకి. కిందనే ఓటల్లు కూడ ఉంటాయి. నీకెందుకు సామి మేముండాం అన్నీ చూసుకుంటాంలే” అన్నాడు. పతంజలికి కూడ నిజమే అనిపించింది.

తిరుపాలు నల్లుగరికీ ఉప్మా చేశాడు. “సామికి ఇడ్లీ త్యాపో బయటికి బోయి” అన్నాడు చెంగయ్యతో.

“ఎందుకు? నేనూ ఉప్మా తింటా మీతో” అన్నాడు పతంజలి.

“మీరు తినరేమోనని….” అన్నాడు తిరుపాలు.

“నాకటువంటివేమీ లేవు. మీరు నన్ను వేరుగా చూడకండి!” అన్నాడు పతంజలి. అతడు చదివిన సాహిత్యం అతనిలో విశాల దృక్పథం పెంచింది. ముఖ్యంగా గీతలో చెప్పిన ‘సర్వత్ర సమదర్శినః’, ‘యోగః కర్మసు కౌశలం’ లాంటి విషయాలు అతని మనసులో నాటుకొన్నాయి. కష్టపడి పనిచేసే వాళ్లంటే గౌరవం ఏర్పడింది. ఇంట్లో వాతావరణం భిన్నంగా ఉన్నా, అతని దృక్పథం మారింది.

పతంజలి మాటలకు వాళ్లు ఎంతో సంతోషించారు. అందరూ ఉప్మా తిన్నారు. “ఉప్మా చాలా బాగా చేశావన్నా” అని కితాబిచ్చాడు తిరుపాలుకు.

10 గంటలకు గ్రేడింగ్‌ ప్రారంభించారు. పతంజలి వేసుకొచ్చినవిగాక ఇంకా వంద బస్తాలు పైగా వచ్చాయి. వీళ్లకు సాయంగా మరో ఇద్దరు కూలీలు వచ్చారు. రైతు వారీగా మూడు సైజులు విడదీసి పెద్ద కుప్పలుగా పోసి, ఒక దానితో ఒకటి కలవకుండా వరిగడ్డి ఉంచారు. పదకొండున్నర కల్లా గ్రేడింగ్‌ పూర్తయింది. గంపలవాళ్లు, తోపుడు బండ్ల వాళ్లు వచ్చి నిలబడ్డారు.

హుబ్లీలోలాగ వేలం పద్ధతి లేదిక్కడ. ఒకే రైతుకు చెందిన ఒక గ్రేడు కాయలను ఇద్దరు, ముగ్గురు తీసుకుంటున్నారు. కాయలు వంద చొప్పున ధర ప్రతి వందకు పదికాయలు అదనం. పెంచలయ్య చెంగయ్య కుప్పల దగ్గర నిలబడి తమిళంలో వందకు రేటు చెబుతున్నారు. బేరం కుదిరిన వెంటనే తిరుపాలు, ఇద్దరు కూలీలు మెరుపు వేగంతో కాయలు లెక్కపెట్టి గంపల్లో వేస్తున్నారు. ఆఖరుకు వెయ్యికాయలు కొనేవాళ్లు కూడ ఉన్నారు. వెయ్యికి తక్కువ అమ్మరు.

చెంగయ్య ఒక పెద్ద రిజిస్టరు పట్టుకొని కూర్చున్నాడు. రైతు పేరు, గ్రేడు, కొన్నవారి పేరు, వందకాయలకు ధర, మొత్తం ఎన్ని వందలు, చెల్లించవలసిన డబ్బు – ఇలా కాలమ్స్‌ ముందే విభజించుకొని, చకచక నమోదు చేస్తున్నాడు. తిరుపాలు ఇద్దరితో కలిసి, ఒక వ్యాపారికి లెక్కపెట్టడం పూర్తయిన వెంటనే గట్టిగా అరచి చెంగయ్యకు చెబుతున్నాడు అలా ఒంటిగంటకల్లా అన్నీ అమ్మడం ఐపోయింది. తర్వాత ఆఫీసులో కూర్చున్నారు. అన్నదమ్ములిద్దరు చెంగయ్య కొన్నవారి పేరు పిలిచి, అతను కొన్న కాయలెన్ని, ఏ గ్రేడు, ఎంత ధర పలికింది, అతను చెల్లించవలసిన డబ్బు ఎంతో చెబితే, వాళ్లు పెంచలయ్యకు డబ్బు చెల్లిస్తున్నారు. తర్వాత వీరు కొన్న కాయలు గంపల్లో, బస్తాల్లో వేసుకొని తీసుకుపోతున్నారు. మొత్తం వ్యవహారం పూర్తయ్యేసరికి ఒకటిన్నర.

పతంజలి సరుకుకు మొత్తం రెండువేల రెండు వందలు వచ్చినట్లు చెంగయ్య చెప్పాడు. వివరాలతో సహా. హుబ్లీ కంటే ధర మెరుగ్గా ఉన్నట్లు గ్రహించాడు పతంజలి. డబ్బు పెంచలయ్య వద్దే ఉంచమని చెప్పాడు. మిగతా రైతులకు పూర్తిగా యిచ్చేశాడు పెంచలయ్య. మండీ మొత్తం ఖాళీ కూలీలు కూడ తమకు రావలసిన కూలీ తీసుకొని వెళ్లిపోయారు.

“అన్నం, పప్పు జేచ్చా” అంటూ లోపలికి వెళ్లబోయాడు తిరుపాలు.

“ఈరోజుకు వద్దుగానీ, సామిని దీసుకొని మురుగన్‌ భవన్‌’కు పోదాం పాండి. నీవు ఎప్పుడన్నం జెయ్యాల, ఎప్పుడు పప్పు జెయ్యాల, మనం ఎప్పుడు దినాల? అన్నాడు పెంచలయ్య.

అందరూ భోజనానికి పోయినారు. ‘మురుగన్‌ భవన్‌’ కిటకిటలాడుతుంది. నలుగురికి మీల్స్‌ టికెట్లు తీసుకున్నాడు చెంగయ్య. టికెట్‌ ధర రెండు రూపాయలు. దాని మీద నంబర్లు వేసి యిస్తున్నారు. ఒకాయన లుంగీ కట్టుకుని, నుదుట విభూతి రేఖలు, గంధం, కుంకుమ దరించి, అపర సుబ్రహ్మణ్యస్వామిలా ఉన్నాడు. లుంగీ తప్ప పైన ఏ ఆచ్ఛాదన లేదు. టిక్కెట్లు ఆయనకివ్వాలి. నంబర్లు చూసి ఆయన తమిళంలో చెప్పాడు. “అరగంట పడుతుంది!”

భోజనం చేసేవారు ముగించగానే ఆ వరుస వడ్డించేవారు. ఈయన దగ్గరకొచ్చి కొన్ని టికెట్లు ‘ముందు వచ్చినవారికి ముందు’ అనే ప్రాతిపదికన (first come first served) తీసుకొని బిగ్గరగా నంబర్లు పిలుస్తున్నారు. తమిళంలో. ఆ నంబరు గల టికెట్ల వాళ్లు వెళ్లి కూర్చుంటున్నారు.

“ఈడ ఉంటే జేసేదేమిల్యాగాని, ఈ లోపల సామికి లాడ్జి జూపిద్దాము పాండి” అన్నాడు పెంచలయ్య.

“మనవంతు వచ్చేటప్పటికి రాగలమా?” అనడిగాడు పతంజలి.

“బెమ్మాండంగా ఈ పక్కనే లే. శానా దగ్గర” అన్నాడు చెంగయ్య.

లాడ్జి చిన్నది క్రింద టిఫిన్‌, భోజన హోటలు ఉంది. దాని పేరు ‘గణేశ్‌ విలాస్‌’. పెద్దగా జనం లేరు.

“ఈడ కూడ సాపాటు బాగుంటాదిగాని సామీ, అదేందో అందరూ ‘మురుగన్‌’కే బోతారు. దర కూడ ఈడ రూపాయి ముప్పావలానే” అన్నాడు పెంచలయ్య హోటలు ప్రక్కన ఉన్న మెట్లెక్కి పైకి వెళ్లారు. ‘నేషనల్‌ లాడ్జ్‌’ అని ఇంగ్లీషులో తమిళంలో రాసిన బోర్డు కనపడిరది. కౌంటరు వద్ద ఒక ముసలాయన ఉన్నాడు. పెంచలయ్యను తమిళంలో పలకరించాడు. పతంజలిని చూపిస్తూ అన్నాడు పెంచలయ్య.

“మా సామికి మంచం కావాల. పది పన్నెండు రోజులుంటాడు. ఈడనే ‘ప్యారిస్‌ కార్నర్‌’ దగ్గర పరీక్షలు రాస్తాడు” అన్నాడు.

“రోజుకు మూడు రూపాయలు అవుతుంది.”

“కొంచెం తగ్గించొచ్చుగదా. మీ బ్రామ్మలే” అన్నాడు పెంచలయ్య.

బ్రాహ్మడయినందుకు తగ్గించమనడం ఎందుకో అర్థంకాలేదు పతంజలికి. ప్రతిచోట ఈ ప్రివిలేజ్‌ పొందటం వల్లా, స్వతహాగా బ్రాహ్మలు తమకు తాము సృష్టించుకున్న ఆధిక్యభావన వల్ల, బ్రాహ్మలు ఒక పరిధిదాటి బయటకు రాలేరనిపించింది. శాస్త్రాలు, పురాణాలు అన్నిటిలో ‘జన్మనాజాయతే శూద్రః కర్మణాజాయతే ద్విజః’ అనే ఉంది. తాను చేసిన మంచి పనులలోనే ఎవరయినా బ్రాహ్మణుడవుతాడు. పుట్టుకతో అందరూ ఒకటే అని ఎంత క్లియర్‌గా చెప్పినా బ్రాహ్మల్లో మార్పు రావడం లేదు. వాళ్లు, నిజంగా తమకంటే గొప్పవారేమోనన్న భ్రమ ఇతరుల్లో పోవడం లేదు.

“సరే రోజుకు ఒక పావలా తగ్గిస్తా” అన్నాడు ముసలాయన

లాడ్జి అంతా ఒక పెద్ద హాలు. రెండడుగుల ఎడంతో రెండు వరుసల్లో మడత మంచాలు వేసి ఉన్నాయి. ప్రతి మంచానికి ఒక దిండు (తలగడ) ఉంది. దుప్పటి ఉంది. హాలు చివర అటువైపు ఎదురెదురుగా ఐదారు బాత్‌రూములు అయిదారు లెట్రిన్‌లు ఉన్నాయి. ముఖం కడుక్కోవడానికి, ఒక వైపు నాలుగైదు వాష్‌ బేసిన్లున్నాయి. హాలుకు గోడకు ‘పిజియన్‌ హోల్స్‌’ చెక్క అల్మయిరా ఉంది. ప్రతి గూటికి తాళం. నంబర్లు వేసి ఉన్నాయి. ప్రతి మంచానికీ ఒక లాకరు చొప్పున కేటాయించారన్నమాట.

పెంచలయ్య వైపు చూసి బాగుందన్నట్టు తల ఊపాడు పతంజలి. “ఐదు రూపాయలు అడ్వాన్సు ఇవ్వండి” అన్నాడు ముసలాయన.

“ఫ్యాను గాలి తగిలేట్టు ఉండే మంచం సూడు” అన్నాడు పెంచలయ్య.

రిజిస్టరులో పతంజలి పేరు, అడ్రసు రాసి, సంతకం తీసుకున్నాడు. ఐదు రూపాయలు ఇచ్చేశాడు పతంజలి.

‘సాయంత్రం వస్తామ’ని చెప్పి హోటలుకు వచ్చేశారు.

వీళ్లు పోయిన రెండు నిమిషాలకే వీళ్ల టికెట్‌ నంబర్లు పిలిచారు. నలుగురూ ప్రక్క ప్రక్కన కూర్చున్నారు. భోజనం అద్భుతంగా ఉంది. అన్నం పొగలు కక్కుతూంది. కొబ్బరి పచ్చడి, నువ్వుల పొడి, పప్పు, రెండు రకాల కూరలు, సాంబారు, కారంపులుసు వడ్డించారు.

కారంపులుసు చాలా నచ్చింది పతంజలికి. అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు సమృద్ధిగా వేశారు. పతంజలి వాళ్లింట్లో ఆ రెండూ నిషిద్ధం. భోజనం తర్వాత ‘పాన్‌’ కూడా ఇచ్చారు. తనది తిరుపాలుకు యిచ్చేశాడు. పెంచలయ్యతో చెప్పాడు.” పెంచలయ్యా మాటిమాటికి నేను బ్రాహ్మడినని అందరితో అనకు. మనందరం ఒకటే. నన్ను మీలో ఒకడిగా చూడండి” పెంచలయ్యకు పతంజలి వ్యక్తిత్వం అర్థమయింది.

“బాపనోల్లల్లో నీలాంటోల్లు ఎవరుంటారు సామీ!” అన్నాడు.

“అదిగో మళ్లీ మొదలుపెట్టావు” అన్నాడు పతంజలి.

అందరూ నవ్వుకున్నారు.

“చెంగయ్యా! ఒకసారి పరీక్ష జరిగే సెంటరు చూపించవా?” అనడిగాడు.

“పోదాంపాండి” అని అందరూ ‘ప్లారిన్‌ కార్నర్‌’కు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ హోటల్‌ ‘దాసప్రకాష్‌’ ఉంది. దాని ప్రక్కన సందు దగ్గర ఎవర్నో అడిగితే ఆ సందులోనే కొంతదూరం వెళ్లి కూడివైపుకు తిరగమన్నారు.

‘సెయింట్‌ యాన్స్‌ గ్రామర్‌ స్కూలు’ అని అర్ధ చంద్రాకారంగా ఉన్న నల్లని ఆర్చ్‌ మీద పసుపురంగు అక్షరాలు మెరుస్తున్నాయి. లోపలికి వెళితే నోటీసు బోర్డు మీద ‘మధ్యప్రదేశ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌, ఇంటర్మీడియట్‌ ఎక్జామినేషన్స్‌ మే 1974’ అని, క్రింద టైంటైబుల్‌, రేపటి పరీక్షకు ‘రూంప్లాన్‌’ అతికించి ఉన్నాయి. మొత్తం 8 రూముల్లో పరీక్ష. పతంజలికి హాల్‌ టికెట్‌ నంబరు గుర్తుంది. చూసుకున్నాడు. ఐదో నంబరు రూం బి. బ్లాక్‌ అని ఉంది.

నిశ్చింతగా నిట్టూర్చాడు పతంజలి. తిరిగి వస్తూంటే ఒకచోట ఒక గుడి కనిపించింది. లోపలికి వెళ్లారు. గర్భగుడి మూసి ఉంది. గుడి లోపల గోడలమీద దశావతారాలు పెయింటింగ్‌లు వేసి ఉన్నాయి. లక్ష్మీనరసింహ స్వామి పెయింటింగ్‌ ఆకర్షించింది పతంజలిని. తొడమీద అమ్మవారు ఒక వైపు అంజలి ఘటించిన ప్రహ్లాదుడు. ప్రసన్న వదనంతో సింహవదనుడైన స్వామి. దగ్గరకు వెళ్లి చూశాడు. భక్తితో నమస్కరించుకున్నాడు. పాదాలు అందేలానే ఉన్నాయి. పాదాలు తాకి కళ్లకద్దుకున్నాడు.

“తండ్రీ నా పరీక్షలన్నీ బాగా వ్రాసేలా చూడు స్వామి” అని మనసులో మొక్కుకున్నాడు. ఎందుకో దుఃఖం వచ్చింది స్వల్పంగా.

“ఈ దేవుడు మా నెల్లూరు జిల్లాలో ఉండాడు. ‘పెంచలకోన’ అని చానా పెద్ద ఛేత్రం ఆయన పేరే నాకు పెట్టినారు” అని వివరించాడు పెంచలయ్య.

“అదృష్టవంతుడివి” అన్నాడు పతంజలి.

టైంటేబుల్‌ ప్రకారం రోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష. రేపు ఇంగ్లీషు ఎల్లుండి సంస్కృతం తర్వాత ఆదివారం వచ్చింది. తర్వాత వరసగా గ్రూపు సబ్జెక్టులు ఒక్కోదానికి రెండు పేపర్లు చొప్పున సోమవారం నుండి శనివారం వరకు. శనివారం పరీక్షలన్నీ అయిపోతాయి. ‘శనివారం సాయంత్రం ఇంటికి బయలు దేరవచ్చు’ అనుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here