Site icon Sanchika

సాఫల్యం-7

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]మ[/dropcap]రుసటిరోజు ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ఒక గంట చదువుకున్నాడు. పంచె టవలు ఆరేసుకోడానికి డాబామీద తాళ్లు కట్టి ఉన్నాయి. క్రిందికి వెళ్లి ‘గణేశ్‌ విలాస్‌’లో యిడ్లీ సాంబారు తిని కాఫీ తాగి, నడుచుకుంటూ పరీక్షకు బయలుదేరాడు. దారిలో గుళ్లోకి వెళ్లి వినాయకుని దర్శించుకొని, నరసింహస్వామి పాదాలు తాకి కళ్లకద్దుకున్నాడు. ఎనిమిదిన్నరకల్లా సెంటర్లో ఉన్నాడు. 8:45 ని॥ రూముల్లోకి అనుమతించారు. రూములు విశాలంగా పెద్ద పెద్ద కిటికీలతో చాలా బాగున్నాయి. బల్లలు కూడ రాసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. ఎదురుగ్గా నల్ల బల్లమీద శిలువ వేసిన జీసస్‌ బొమ్మ అప్రయత్నంగా ఏసుక్రీస్తుకు నమస్కారం చేసుకున్నాడు.

ముందు ఆన్సర్‌ బుక్‌ ఇచ్చాడు ఇన్విజిలేటర్‌. హాల్‌ టికెట్‌ నంబరు జాగ్రత్తగా వేయమని చెప్పాడు. ఇంగ్లీషులో సరిగ్గా తొమ్మిదికి కొశ్చన్‌ పేపరు ఇచ్చారు. మళ్లీ నరసింహస్వామిని తలుచుకున్నాడు. అదేమిటో కళ్లు మూసుకుంటే ఆయనే కనబడుతున్నాడు.

అన్నీ బాగా ప్రిపేరయిన ప్రశ్నలే. ఎస్సే ప్రశ్నలు ముందు రాసేశాడు. యాన్నొటేషన్లు, కాంప్రెహెన్షన్‌ ప్యాసేజి అయిపోయాయి. గ్రామర్‌ కూడ బాగా తెలిసినవే. అరగంట ఉండగానే వ్రాయడం పూర్తయింది. అడిషనల్స్‌ అన్నీ ఇన్విజిలేటర్‌ యిచ్చిన దారపు పోగుతో జాగ్రత్తగా కట్టి, ఇన్విజిలేటర్‌కు అందజేశాడు.

పరీక్ష కేంద్ర నుండి వచ్చిన పతంజలికి బయట ప్రపంచమంతా మనోహరంగా కనపడింది. ‘మురుగన్‌ భవన్‌’కు వెళ్లి భోజనం చేశాడు. లాడ్జికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుని, సంస్కృతం సబ్జెక్ట్‌ అంతా రివిజన్‌ చేసుకున్నాడు. సాయంత్రం మండీకి వెళ్లి పెంచలయ్య వాళ్లతో పరీక్ష బాగా రాసినట్లు చెప్పాడు.

“చదువంటే మీ….” అనబోయి పతంజలి కోపంగా చూడగానే ఆపేశాడు పెంచలయ్య. “మర్సిపోయినాలే సామీ!” అన్నాడు.

“ఈరోజు ఎన్ని మూటలొచ్చాయి?” అనడిగాడు.

“ఈరోజు ఎక్కువుండ్లా. నూటెనభై వచ్చినాయి. నిన్ననే ధర బాగా పలికింది” అన్నాడు చెంగయ్య.

కాసేపుండి లాడ్జికి తిరిగి వచ్చాడు.

9 గంటలకు క్రిందికి వెళ్లాడు ఏదయినా తిందామని ‘మురుగన్‌ భవన్‌’ వాడు పెట్టిన భోజనం మహాత్యమేమోగానీ పెద్దగా ఆకలిగా లేదు. రోడ్డు ప్రక్కన బండి పెట్టుకొని ఒకాయిన టిఫిన్లు అమ్ముతున్నాడు. బండి చుట్టూ జనం బాగానే ఉన్నారు. వెళ్లి చూస్తే పొగలు కక్కుతున్న ఉప్మా చాలామంది తింటూండడం గమనించాడు. తనకూ ఒక ప్లేట్‌ ఉప్మా తీసుకున్నాడు. ఉప్మా మీదే పల్చటి చట్నీ పోసి, సత్తుస్పూన్‌ వేసి ఇచ్చాడాయన. ప్లాస్టిక్‌ ప్లేటులో చిన్న అరిటాకు ముక్క వేసి, దాని మీద ఉప్మా వేసి ఇచ్చాడు. చాలా రుచిగా ఉంది. ఎంత వేడిగా ఉందంటే ఊదుకొని తినకపోతే దవడలు, నాలుక కాలేలా ఉంది.

రోజూ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుంటూ పరీక్షలన్నీ దిగ్విజయంగా ముగించాడు పతంజలి. శనివారం ఆఖరు పరీక్ష అయింతర్వాత డైరెక్ట్‌గా మండీకి వెళ్లాడు. అందరూ కలసి భోంచేశారు. వాళ్లు ఎంత వారించిన వినలేదు పతంజలి. అందరికీ తానే టికెట్లు తీశాడు. అందరూ లాడ్జికి వెళ్లి, ఖాళీ చేసి మండీ చేరుకున్నారు.

“మరి నేను బయలుదేరతా పెంచలయ్యా! నీవు చేసిన సహాయం గొప్పది. క్రొత్త చోటు అని కూడా నాకు అనిపించకుండా అన్ని సౌకర్యాలు చేశావు. చాలా థాంక్స్‌” అన్నాడు పెంచలయ్య చేతులు పట్టుకొని.

“అంతమాటనగాకు సామీ! నేంజేసిందేముంది?” అన్నాడు పెంచలయ్య.

“రాత్రి 8 గంటలకు మీ కర్నూలుకు బస్సుంది గానీ ఛార్జీ ఎక్కువ. 9:30కి బొంబాయి పోయే మెయిలుంది. బస్సు ఛార్జీలో మూడో వంతుకే పోవచ్చు” అన్నాడతను. “మరీ మంచిది గుత్తిలో దిగి బస్సులో మా ఊరు పోవచ్చు” అన్నాడు పతంజలి.

రాత్రి ఎనిమిదికల్లా అందరూ టిఫిన్‌ చేశారు. ‘దాస ప్రకాష్‌’కు తీసుకొని వెళ్లాడు పెంచలయ్య. రవ్వదోసె తిన్నారు. పతంజలి జీవితంలో రవ్వదోసె తినడం అదే ప్రథమం. చాలా బాగుంది. అందరూ రెండు రిక్షాల్లో మద్రాసు సెంట్రల్‌ స్టేషన్‌ చేరుకున్నారు. పెంచలయ్య దగ్గర డబ్బు తీసుకొని, ‘నడుము సంచి’లో పెట్టి కట్టుకొన్నాడు. బుకింగ్‌ కౌంటరు వద్ద క్యూలో నిలుచున్నపుడు మనస్సులో తలుక్కున ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపు పేరే వసుధ.

“ఎర్రగుంట్లకు ఒక టికెట్టివ్వండి” అని అడిగి తీసుకున్నాడు.

“గుత్తికి పోతానంటివి గదూ!” అన్నాడు పెంచలయ్య

“ప్రొద్దుటూరులో మా మేనత్త వాళ్లున్నారు. ఎర్రగుంట్లలో దిగి వాళ్లను జూసి పోదామని” అన్నాడు పతంజలి.

“మేనత్తకు నీకు ఈడైన బిడ్డ ఎవరయినా ఉండాదా ఏమి? టికెట్‌ తీసుకున్నప్పటి నుండి బో కుశాలగా ఉన్నావు” అన్నాడు పెంచలయ్య.

“ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టేలా ఉన్నావే” అన్నాడు పతంజలి నవ్వుతూ.

“మాకర్తమైండాదిలేయ్యా అన్నాడు చెంగయ్య.

అందరూ నవ్వుకున్నాడు.

రైలు కదులుతూంటే పెంచలయ్య “ఊరికి బోయి జాబు రాయిసామీ. మమ్ముల్ని మర్సిపోగాకు” అన్నాడు.

‘సరే’ అన్నాడు పతంజలి. వాళ్లు కనుమరుగవుతూంటే గుండె బరువెక్కింది.

***

మెయిల్లో సీటు దొరికింది. దగ్గర డబ్బు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా నెల్లూరు దాటింతర్వాత కునుకుపట్టింది. మధ్యలో ఒకసారి బాత్‌ రూంకి వెళ్లొచ్చాడు. అప్పటికి బండి రేణిగుంటలో ఆగి ఉంది. మళ్లీ కాసేపు తూగాడు. ఉదయం మెలకువ వచ్చేసరికి కడప దాటుతూంది. లేచి ముఖం కడుక్కుని కాలకృత్యాలు తీర్చుకుని కూర్చున్నాడు. వసుధను చూడబోతున్నందుకు మనసంతా ఉల్లాసంగా ఉంది.

ఎర్రగుంట్లలో దిగాడు. బయట ప్రొద్దుటూరుకు వెళ్లే బస్సు ఆగి ఉంది. స్టేషను నుండి ప్రొద్దుటూరు పదిహేను కిలోమీటర్లుంటుంది. ఆ బస్సులోకి ఎక్కడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ప్రొద్దుటూరు చేరే సరికి ఆరున్నర.

అగస్తీశ్వరస్వామి గుడి దగ్గర దిగి రాజబాట వీధికి ఎలా వెళ్లాలని అడిగాడు. ఒక తను దారి చూపించాడు. దారిలో డజను అరటిపళ్లు, నాలుగు మూరలు పూలు కొన్నాడు. ఊహ తెలిసింతర్వాత ప్రొద్దుటూరుకు రావడం యిదే మొదటిసారి. ఎప్పుడో చిన్నప్పుడు వసుధ వాళ్లక్కయ్య పెళ్లికి అమ్మనాన్నతో వచ్చాడు.

రాజబాట వీధి పేరుకే. చాలా ఇరుగ్గా ఉంది. ఇరువైపులా బట్టల దుకాణాలు, బంగారం కొట్లు. ఇంకా తెరవలేదు. గర్ల్స్‌ హైస్కూలు దగ్గరకెళ్ళి “బొజ్జమ్మగారి వీధి ఎక్కడని” అడిగాడు. వసుధ వాళ్ల నాన్నమ్మ పేరే బొజ్జమ్మ. ఆమె పేరిటే ఆ వీధి ఏర్పడిరదని ఒకసారి మేనత్త చెప్పింది. అన్నీ రాతి నిర్మాణాలు. రాతి పలకలు ఒక దాని మీద ఒకటి పేర్చి కట్టారు. ప్రతి యింటముందు గుమ్మానికి రెండు వైపులా అరుగులు. పైకప్పులకు సపోర్టుగా టేకు స్తంభాలు.

“నాగరాజశర్మగారి యిల్లు ఎక్కడమ్మా” అని ఇంటిముందు కూర్చున్న ఒకామెను అడిగాడు.

“నాగరాజుశర్మ ఎప్పుడో సచ్చిపాయగద నాయనా! అదిగో అ యిల్లే. నీవు ఏమైతావు నాయనా అమ్మయ్యకు?” అని అడిగింది ఆమె.

“మేనల్లుడిని” అంటూ గుమ్మం దగ్గరకువెళ్లి “అత్తా! అనిపించాడు.

పిలుపు విని బయటకు వచ్చింది మేనత్త.

పతంజలిని చూసి ఆశ్చర్యంతో అలాగే నిలబడి పోయింది.

“రారా నాయనా! కనీసం ఉత్తరమయినా లేదు నీవోస్తున్నావని ఇంతపొద్దునే ఎట్లా వచ్చినావురా!” అంటూ చేతిలోని బ్యాగ్‌ అందుకొని లోపలి గదిలో పెట్టింది.

“బచ్చలింట్లో (బాత్‌రూం) కి పోయి కాళ్లు కడుక్కోపో” అంది.

కాళ్లు కడుక్కుని వచ్చాడు. పంచె, టవలు యిచ్చింది. తుడుచుకోమని. అత్త వెంట వంటింట్లోకి నడిచాడు.

“కూర్చోరా పతంజలీ” అంటూ పీట వాల్చింది. రాకరాక వచ్చిన మేనల్లుడిని చూసి సంబరపడిపోతూందామె.

‘ఒసే భువనా, వసుధా, చిన్నోడా! బావవచ్చాడే వెల్దుర్తి నుంచి” అని మిద్దెమీదికి కేకపెట్టింది.

కంచు గ్లాసు నిండా చిక్కని కాఫీ యిచ్చింది.

ముందు భువన దిగొచ్చింది. మిద్దెమీద ఒక చిన్న హాలు, ఒక రూము ఉన్నాయట. “ఏం బావా! బాగున్నావా! ఎంతసేపయింది వచ్చి? ఊర్లో మామావాళ్లు బాగున్నారా” అంటూ పలకరించింది భువన. ఆ అమ్మాయి పతంజలి కంటే కేవలం ఆరు నెలలు చిన్నది. భువనకు వసుధకు మూడేళ్లు తేడా. టెంత్ రెండేళ్ల క్రిందట పాసై చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

“నేను ఊరు వదిలిపెట్టి దాదాపు పదిహేను రోజులయింది భువనా. మద్రాసులో ఇంటర్మీడియట్‌ పరీక్షలు వ్రాసి వస్తున్నా. పనిలో పని మద్రాసు మార్కెట్‌కు నిమ్మకాయ బస్తాలు కూడ వేసుకొని వెళ్లా. తిరుగు ప్రయాణంలో మిమ్మల్నందర్నీ చూడాలనిపించి ఎర్రగుంట్లకు టికెట్‌ తీసుకున్నా” అని వివరించాడు.

ఈలోపు వసుధ దిగివచ్చింది. అప్పుడే నిద్రలేచిందేమో జుట్టంతా రేగి ఉంది సరాసరి వంటింట్లోకి వచ్చి “బావగారికి సుస్వాగతం!” అన్నది నాటకీయంగా పతంజలివైపు అభిమానంగా చూస్తూ. క్షణం సేపు ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి. చప్పున కళ్లు తిప్పుకుంది వసుధ.

“అయితే మొత్తానికి సాధించావన్నమాట. మామ చదువుమానిపించినా కష్టపడి ఇంటర్మీడియట్‌ పూర్తి చేశావు” అన్నది ప్రశంసంగా.

పతంజలి మనస్సు ఆ పొగడ్తకు పొంగిపోయింది.

“పరీక్షలు బాగా రాశావా? నీవు రాయకపోవడమేమిటిలే” అంది మళ్లీ.

“చాలా బాగా రాశాను వసుధా మరి నీవు?”

ఈసారి టెంత్‌ మొన్ననే నైన్త్‌ రాశాను.”

“గుడ్‌” అన్నాడు పతంజలి.

వేసవి శెలవులు కాబట్టి ఎవ్వరికీ స్కూలు లేదు. స్నానం చేసి సంధ్యవార్చుకున్నాడు పతంజలి. పదకొండు గంటలకల్లా భోజనాలకు కూర్చున్నారు. పతంజలికి వెండి ప్లేటు పెట్టారు. వేడి వేడి ‘బిసిబెళిబాత్‌’ వడ్డించింది అత్త. అందులోకి వడియాలు, అప్పడాలు, రోటి పచ్చడి పొదీనాతో చేసింది.

“పొదీనా అంటే నాకు చాలా ఇష్టమత్తా” అన్నాడు.

“తెలుసురా! అందుకే గదా చేసింది!” అన్నదామె.

భోంచేసిం తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. చిన్న బావమరిది పతంజలిని ఒక్క క్షణం వదలటం లేదు.

రాత్రి సరిగా నిద్రలేదు. కాసేపు పడుకుంటానన్నాడు పతంజలి.

“వసుధా! బావకు గదిలో దుప్పటి విదిలించి వేయి పోమ్మా” అన్నది అత్త.

వసుధ గదిలో దుప్పటి దిండు సరిగా సర్దివచ్చింది.

“వెళ్లు బావా! కాసేపు పడుకో” అన్నది.

నిద్ర లేచింతర్వాత మూడు గంటలకు ‘గుంట పొంగణాలు’ పోసింది అత్త. చాలా రుచిగా ఉన్నాయి. సాయంత్రం ఏదైనా సినిమాకు వెళదామని ప్రతిపాదించింది భువన. వీళ్లిద్దరూ దొంగచూపులు చూసుకోవడం, వసుధ పతంజలి పట్ల చూపిస్తున్న ‘కన్‌సర్న్‌’ అన్నీ గమనిస్తూనే ఉందా అమ్మాయి.

సాయంత్రం 6 గంటలకు అందరూ సినిమాకు వెళ్లారు. మేనత్త రాలేదు. ఆమె సినిమాలు చూడదు. ‘రౌనఖ్‌ టాకీసు’ కు వెళ్లారు. అందరికి బాల్కనీ టికెట్లు తీయబోయాడు పతంజలి.

“ఎందుకు బావా వేస్టు? మేము ఎప్పుడు పోయినా బెంచీ టికెట్టుకే వెళతాం” అన్నది వసుధ.

సినిమా పేరు “జ్వాలాద్వీప రహస్యం” కాంతారావు సినిమా.

ఇంటర్వెల్‌లో కర్బూజ విత్తనాలు, శనక్కాయలు, కొనుకున్నారు. జానపద సినిమా కాబట్టి బాగా ఎంజాయ్‌ చేశారు.

“పెద్ద వదినెవాళ్లు ఉండేదెక్కడ” అని అడిగాడు భువనను.

“కడప దగ్గరే దేవుని గడప అనే ఊర్లో ఉంటారు. మా బావ కూడ సిండికేట్‌ బ్యాంక్‌ ఖాజీపేటలో పనిచేస్తాడు. రోజూ బస్సులో వెళ్లి వస్తాడు” అంది భువన.

హాల్లో పతంజలి ప్రక్కనే కూర్చుంది వసుధ. అంత సన్నిహితంగా ఉంటే గిలిగింతలు పెట్టినట్టుంది ఆ నవయువకునికి. కొంచెం ఒళ్లు చేసి, కనకాంబరం రంగు పావడా, ఆకుపచ్చని జాకెట్‌, తెల్లని ఓణీ వేసుకొని చాలా అందంగా ఉంది.

సినిమా పూర్తయింతర్వాత ఇంటికి వెళ్లి భోంచేశారు. చేమదుంపల పొడికూర, చారు, కరివేపాకు పొడి, మజ్జిగ అత్త చేతివంట అంతా తన తల్లి చేసిన వంట రుచిని పోలి ఉండటం గమనించాడు పతంజలి.

భోజనాలయింతర్వాత అందరూ మిద్దెమీదికి చేరుకున్నారు. హాలు బయట చిన్న వసారా, దానినానుకుని ఆరుబయట ప్రక్కలు పరచుకొని పడుకున్నారు.

“ఏదయినా పాట పాడు బావా!” అన్నది వసుధ.

“రమతే, యమునా పులినవనే” అన్న జయదేవుని అష్టపది పాడాడు ఘంటసాల వారిది. అందరూ చప్పట్లు కొట్టారు.

“నీ గొంతు బాగుంటుంది” అన్నది వసుధ. “సరేగాని వాగ్దేవి వదినె పెళ్లిలో పాడినావు చూడు “తలనిండ పూదండ” ఆ పాట పాడవా?’ అని అడిగింది గోముగా. వీళ్లిద్దర్నీ ఆసక్తిగా గమనిస్తూంది భువన.

ఆ పాట కూడ పాడాడు పతంజలి. వసుధను అడిగాడు.

“నా కోటా పూర్తయింది. మరి నీవు పాడాలి. ఈ మధ్య కొత్తపాట ఏదయినా నేర్చుకున్నావా!”

“ఆ… కానీ నీ అంత బాగా పాడలేనేమో”

“ఏం కాదు. నీ గొంతు కూడ చాలా బాగుంటుంది. పాడు”

“సరే” అని “మరుగేలరా ఓ రాఘవా!” అన్న త్యాగరాజ కృతి పాడింది.

“నిన్నెగానిమది నెన్న జాలనొరుల” అన్నపుడు పతంజలివైపు చూసింది.

పాట పూర్తయితూనే చప్పట్లు కొట్టారు. “ఇంతకళ దగ్గరుంచుకొని అలా అన్నావేమిటి? అద్భుతం!” అన్నాడు. అందంగా సిగ్గుపడింది వసుధ. కాసేపు కబుర్లు చెప్పుకొని పడుకున్నారు.

ఉదయం లేచి, కాఫీ, స్నానం ముగించుకొని బయలుదేరాడు పతంజలి. ప్రొద్దుటూరు నుండి కర్నూలుకు షార్ట్‌ కట్‌ ఉంది. 7 గంటలకు బస్సు అందరికీ వెళ్లొస్తానని చెప్పి బస్టాండుకు వచ్చాడు. చేయి ఊపుతున్న వసుధ ముఖమే కనపడుతూంది. బస్సెక్కి టికెట్‌ తీసుకుని కూర్చున్నాడు. మేనత్త ఇంట్లో గడిపిన ఆ ఒక్కరోజు ఒక మధురానుభూతిగా మిగిలింది.

కర్నూలు బస్సు నొస్సం, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, బనగానిపల్లె, బేతంచర్ల మీదుగా వెళుతుంది. 9 గంటలకు కోవెలకుంటలో టిఫిన్‌కు ఆపాడు. ప్రయివేటు బస్సు. తానూ టిఫిన్‌ తిన్నాడు. “ఉగ్గాని ` బజ్జీ” దాదాపు ఒంటిగంటవుతూండగా కర్నూలు చేరుకుంది బస్సు. దిగి వెంటనే అనంతపురం బస్సెక్కాడు. రెండు గంటలకు వెల్దుర్తి చేరాడు.

దాదాపు పదిహేను రోజుల తర్వాత కుటుంబ సభ్యులను చూడబోతున్నందుకు ఉద్వేగంగా ఉంది.

‘పడసాల’లో ఆడుకుంటున్న పాణిని “అన్నయ్య వచ్చాడు! అన్నయ్య వచ్చాడు” అరుస్తూ ప్రకటించేశాడు. వర్ధనమ్మ బయటకు వచ్చి కొడుకును దగ్గరగా తీసుకొని ఒళ్లంతా తడిమింది!

“ఇంత చిక్కిపోయావేమి నాయనా!” అంది దిగులుగా. పతంజలి నవ్వాడు. తండ్రి కూడ వచ్చి పలకరించాడు.

“మొన్న మధ్యాహ్నానికి పరీక్షలయిపోయాయి నాన్నా. ఆ రోజు సాయంత్రం మెయిలుకు బయలుదేరాను. ఎర్రగుంట్లలో దిగి ప్రొద్దుటూరుకు పోయి అత్తావాళ్ళందర్నీ చూసివచ్చాను. నిన్నంతా అక్కడే ఉండి, ఈ రోజు ఉదయం బయలుదేరి కర్నూలుకు వచ్చాను. మన సరుక్కు కూడ రేటు బాగా పలికింది. రెండువేలకు పైగా వచ్చింది.” అన్నాడు తండ్రితో. “మంచి పని చేశావు! డబ్బు బీరువాలో పెట్టి కాళ్లు చేతులు కడుక్కొని భోంచెయ్యి పో.” అన్నాడు ఆయన.

చాలా రోజుల తర్వాత అమ్మ చేతి భోజనం అమృతతుల్యంగా అనిపించింది. తర్వాత విశ్రాంతి తీసుకొని, సాయంత్రం కొశ్చన్‌ పేపర్లు తీసుకుని శంకరయ్యసారు దగ్గరికి, ఆజంసారు దగ్గరకు వెళ్లాడు. వాళ్లిద్దరు ఎలా రాశాడో విచారించి 80 శాతం పైగా వస్తాయని అంచనా వేశారు.

***

కాలం గడిచిపోతూంది. సాహిత్య పఠనం సాగుతూంది. తోటలో రెండకరాల్లో మిరప పంట వేశారు. నిమ్మతోటకు ఎరువులు తోలించారు. కూలీల రేట్లు పెరిగాయి. తోట దిగుబడి తగ్గుతూ ఉంది. మళ్లీ కొంత అప్పు చేశారు. మొత్తంమీద ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగానే ఉంది.

డోన్‌లో పట్టు పరిశ్రమ ఆఫీసు తెరిచారు. సెరికల్చర్‌ డిపార్టుమెంటువారు అందులో పనిచేసే అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ చలపతిగారు వెల్దుర్తికి వచ్చి పరిశ్రమపై రైతులకు ‘అవగాహన సదస్సు’ నిర్వహించారు. వ్యవసాయ విస్తరణాధికారి వారి కార్యాలయం ఆవరణలో సదస్సు ఏర్పాటు చేశారు. పతంజలి కూడా హాజరయ్యాడు.

ముందుగా వెల్దుర్తి అగ్రికల్చర్‌ డిమాన్‌స్ట్రేటర్‌ ‘రాధాసారు’ చలపతిగారిని పరిచయం చేశారు. ఆయన పేరు రాధాకృష్ణమూర్తి నాయుడు. చిత్తూరు జిల్లావాడు. ఆయన చెప్పాడు.

“రైతులందరికీ నమస్కారం. మన ప్రాంతంలో పట్టు పరిశ్రమను అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం సంకల్పించింది. నీటి వసతిగల పొలాలలో ‘మల్బరీ’ సాగు చేపట్టవచ్చు. ఎండాకాలం మార్చి నుండి మే వరకు తప్ప, మిగతా కాలమంతా మనకు అనుకూలమే. ఒకటి రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలి. నలభై రోజుల్లో ఆకు చేతికి వస్తుంది. విత్తనం అంటే పట్టు పురుగుల గుడ్లు మనకు హిందూపురంలోని ప్రాంతీయ పరిశోధన కేంద్రంలో దొరుకుతాయి. మిగతా వివరాలు సారు చెబుతారు” అని కూర్చున్నాడు.

చలపతిగారు లేచి అందరికీ నమస్కరించాడు. “ఇది చాలా లాభసాటి పంట. శ్రమ ఎక్కువయినా ఫలితం బాగుంటుంది. అయినా శ్రమ పడలేనివాడు రైతెలా అవుతాడు చెప్పండి” అన్నాడు. రైతులందరూ నిజమేనని తలలూపారు. ఆయన కొనసాగించాడు.

ఇప్పటికే అనంతపురం జిల్లాలో బాగా సాగు చేస్తున్నారు. ఆ జిల్లాలో వాతావరణం మన కంటే చల్లగా ఉంటుంది. వాళ్లు ఎండాకాలంలో కూడా పురుగులను మేపుతారు. మనం ఆ మూడు నెలలు మానేస్తాం. శుభవార్త ఏమిటంటే మల్బరీ సాగుచేసే పట్టు రైతులకు ప్రభుత్వం ఋణాలిస్తుంది. మీరు తీసుకునే క్రాప్‌ లోన్‌ కంటే తక్కువ వడ్డీ. పైగా 50 శాతం సబ్సిడీ యిస్తుంది. పట్టు పరిశ్రమకు కావలసిన సామగ్రి అంతా డోన్‌లోనే సప్లయి చేస్తాము. 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న షెడ్‌ వేసుకోవాలి. షెడ్‌ వేసుకోలేనివారు ఇళ్లలోనే పెరట్లోనో, పశువుల కొట్టాల్లోనో పెట్టుకోవచ్చు. మల్బరీ పంట మొండిది. దానికి యించుమించు ఏ తెగుళ్లు సోకవు. రెండెకరాలలో పెరిగే ఆకు ఒక పంటకు సరిపోతుంది. విత్తనం గుడ్ల రూపంలో ఉంటుంది. ఇట్లా అన్నమాట.” అంటూ టేబుల్‌ మీద ఉన్న ఒక కాగితం చూపించాడు. ఆ కాగితం మీద వరుసకు నాలుగు చొప్పున ఆరు వరుసల్లో వృత్తాకారంగా సన్న ఆవాలు కాగితం మీద అంటించినట్లు పట్టు పురుగుల విత్తనం ఉంది. ఇలాంటి రెండు షీట్లు విత్తనం, రెండెకరాల మల్బరీ పంటకు సరిపోతుంది.

“పట్టుపురుగు గుడ్డు పగిలినప్పటినుండి నెల రోజులకల్లా గూళ్లుగా మారుతుంది. ప్రస్తుతం మన ప్రాంతంలో మార్కెట్‌ లేదు. కర్నాటకలోనే ప్రభుత్వం మార్కెట్లుంటాయి. పంటను అక్కడికి తీసుకొని వెళ్లి అమ్ముకోవలసి ఉంటుంది” అని ఆగాడు.

‘మీరిచ్చే సబ్సిడీగాక రెండెకరాలకు ఎంత పెట్టుబడి వచ్చాది సార్‌?” అని అడిగాడు ‘ఎల్లనాగిరెడ్డి’ అనే రైతు.

“దాదాపు రెండు వేల ఐదు వందలు”

పతంజలి శ్రద్ధగా వింటున్నాడు.

“ఖర్చులు పోను ఐదువేల వరకు మిగుల్తుంది” అన్నాడాయన.

అన్నదాతల ముఖాలు వికసించాయి.

పతంజలి లేచి అడిగాడు. “నీరు ఆరుతడేనా సార్‌, ఎన్ని రోజులకొకసారి తడపాలి?”

“ఆరుతడే వారానికి ఒకసారి తడిపితే చాలు”

ఆసక్తిగలవారిని పేర్లిమ్మన్నారు. పతంజలి కూడ మార్కండేయశర్మ పేరు రాయించాడు. రాధాసారు పతంజలిని చూసి వేదిక వద్దకు పిలిచాడు. చలపతిగారికి పరిచయం చేశాడు.

“ఈ పిల్లవాడి పేరు పతంజలి. వ్యవసాయం చేస్తాడు. నిమ్మతోట ఉంది. వేరుశనగ పండిస్తారు. ఏదో బాపన వ్యవసాయమని కాకుండా స్వంతంగా పొలంలో దిగి పనిచేస్తాడు.”

“వెరీగుడ్‌” అన్నాడు చలపతి. అప్పుడు రామ్మూర్తి బావ గుర్తుకు వచ్చాడు పతంజలికి. ఒకసారి చిత్తూరు వెళ్లి అక్కా బావలను చూచి రావాలనుకున్నాడు.

“నీవొకసారి డోన్‌లో మన ఆఫీసుకు రాసామి! అన్నీ వివరంగా చెబుతాన”న్నాడాయన.

“సామి చదువు మానేసి కష్టపడుతున్నాడు” అన్నాడు రాధాసారు.

“లేదుసార్‌, మొన్ననే మద్రాసులో M.P. ఇంటర్‌ పరీక్షలు రాసినా” అన్నాడు పతంజలి. రాధాసారు, చలపతిసారు అభినందించారు.

రైతులనుద్దేశించి చెప్పాడు చలపతి.

“నాలుగు ఐదురోజుల్లో మల్బరీ విత్తనం వస్తుంది. విత్తనం అంటే మరేమీ కాదు. ముదిరిన మల్బరీ మొక్కలను నాల్గయిదు అంగుళాలు కట్‌ చేసి భూమిని చదునుచేసి ఒక అంగుళంన్నర లోతుకు నాటడమే. నలభై, యాభై రోజులకు పంట చేతికి వస్తుంది. పంట పశువులు మేస్తాయనే బాధ కూడ లేదు. ఈ నాలుగు రోజుల్లో భూమి దుక్కిదున్ని పశువుల ఎరువుతోటి ‘గుంటక’ తోలి పెట్టుకోండి. దాని తరువాత బోదెలు తోలుకోండి. మా దగ్గరకు వస్తే కట్‌ చేసిన ‘తుంటలు’ (ముక్కలు) ఇస్తాము. నాటిన 24 గంటలకు నీరు పెట్టాలి. 48 గంటల్లో చిగురిస్తాయి” అన్నాడు.

సదస్సు ముగిసిందని రాధాసారు ప్రకటించారు.

పతంజలి యింటికి వెళ్లి తండ్రికి విషయమంతా వివరించాడు. “మనం చేద్దాం నాన్నా” అన్నాడు.

“నాదేముంది నాయనా! నాకు శక్తి తగ్గే వయసు. నీవు చెయ్యగలవనుకుంటే దిగుదాం” అన్నాడాయన. ఆయనకప్పటికి యాభై దాటింది. మల్లినాధ, పాణిని అక్కడే ఆడుకుంటున్నారు. పాణిని అన్నయ్య భుజంమీద వాలి ఊగుతూ “పట్టు పురుగులు ఎప్పుడు తెస్తావు? నేను ఆడుకుంటా” అన్నాడు. పతంజలి తమ్ముని ముద్దు పెట్టుకొని “ఇంకా టైముందిలే” అన్నాడు.

రెండు రోజుల్లో మంచి రోజు చూసి ఎరువు తోలించాడు. తమ పశువుల ఎరువే రెండు దిబ్బలున్నాయి. చెరువు మట్టి ఒక ఇరవై బళ్లు తోలించాడు. ఎద్దుల బండి నడపడం కూడ పతంజలికి బాగావచ్చు. మిరపచేనుకు అవతల రెండెకరాలు దుక్కిదున్ని ‘గుంటక’ తోలారు బోదెలు తోలుకొని డోన్‌కు వెళ్లాడు పతంజలి.

చలపతిసారు ఆఫీసులోనే ఉన్నాడు. తహసీల్దారు ఆఫీసువెనకే ఉంది సెరికల్చర్‌ ఆఫీసు. గోనె సంచులలో మల్బరీ మొక్కలు అంతకుముందే సరైన సైజులో కట్‌ చేసి, పది పదిహేను పుల్లలు ఒక మోపుగా పురికొసతో కట్టి ఉన్నారు.

 “రా సామీ!” అని ఆహ్వానించాడు చలపతిసారు “పొలం తయారు చేసుకున్నారా!” అని అడిగాడు. తన అటెండర్ను పిలిచి 3 బస్తాలు పుల్లలు ఇమ్మని చెప్పాడు. ఆ బస్తాలు రిక్షాలో వేసుకొని బస్టాండుకు వచ్చి, కర్నూలు బస్సు టాప్‌ మీద వేయించుకొని, వెల్దుర్తిలో దింపుకున్నాడు. వెల్దుర్తి బస్టాండ్‌లో “పిట్టపిడుగు” కూల్‌డ్రింక్‌ షాపుదగ్గర పెట్టించాడు. షాపులో పిల్లవాడు ‘నజీర్‌’ హైస్కూల్లో పతంజలికి జూనియర్‌.

“ఏంటివి సామీ?” అని అడిగాడు నజీర్‌.

“పట్టు పరుగులమేత. ఇవి నాటితే మల్బరీ పంట వస్తుంది. నేను ఇంటికి వెళ్లి మా ఎద్దులబండి పంపిస్తా. ఇవి ఇచ్చి పంపిచ్చు” అన్నాడు.

“నీవు కాపోల్ల యింట్లో పుట్టకుండా బాపనోల్ల యింట్లో ఎట్ల పుట్టినావా అని నేనాలోచిచ్చాండా” అన్నాడు నజీర్‌. నవ్వుకుంటూ ఇంటికి వెళ్లాడు.

మరుసటి రోజు పొద్దున్నే బస్తాలు తోటకు తోలించి, బోదెలకటూ, ఇటూ రెండు కర్రలకు నాలుగంగుళాలు ఎడం ఉండే విధంగా నాటించాడు. జీతగాళ్లు సుంకన్న, తోకోడు, మరి యిద్దరు కూలీలు, పతంజలి పనికి వంగారు. మధ్యాహ్నానికల్లా నాటడం పూర్తయింది. రెండు రోజుల క్రిందట నీరు పెట్టడం వల్ల భూమి మెత్తగా ఉంది. ఇంకా ఒక రెండు తట్టలు మిగిలినాయి.

“ఒక వారం తర్వాత మొలకెత్తనివి తీసేసి ఇవి నాటొచ్చులేసామీ” అన్నాడు తోకోడు.

“కరెక్ట్‌. బలే చెప్పావురా హనుమంతూ” అన్నాడు పతంజలి.

“సామీ, నిన్న నాకు కొడుకు పుట్టినాడు” అని చెప్పాడు సుంకన్న. “మంచి పేరు పెట్టాల నీవే” అన్నాడు.

“రేపు పంచాంగం చూసి చెబ్తా” అన్నాడు పతంజలి.

రెండు రోజులాగి నీరుపెట్టారు. కర్రముక్కలు ఆకుపచ్చగా పసరుకక్కుతున్నాయి. నాలుగు రోజుల్లో కాండం వెంట మోసులు వచ్చాయి. చూస్తుండగానే పదిరోజుల్లో గుబురుగా పెరగసాగాయి నిలువుగా. నాటిన నెల తర్వాత విత్తనానికి హిందూపురం వెళ్లాలి.

(సశేషం)

Exit mobile version