Site icon Sanchika

సార్వజనీన విద్యా హక్కును రూపొందించిన డా. టి. యస్.సౌందరం

[box type=’note’ fontsize=’16’] ది 21-1-2020 తేదీన శ్రీమతి టి. యస్. సౌందరం వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]భా[/dropcap]రతీయ మహిళలు స్వాతంత్ర్య సమరయోధులుగా పేరు పొందడమే కాదు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్వతంత్ర్య భారత పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్రను నిర్వహించారు. భారతీయ మహిళలను బాధిస్తున్న సాంఘిక దురాచారాలని, మూఢాచారాలని తొలగించి/నిరక్షరాస్యతని నిర్మూలించే కృషి సలిపారు. గ్రామీణ మహిళలలో విద్య, వైద్య, ఆర్థికాభివృధ్ధిని సాధించే సాంఘిక సంక్షేమ కార్యకలాపాలలో పాల్గొన్నవారు, గ్రామీణాభివృద్ధి కోసం చేసినవారు ఉన్నారు.

ఇటువంటి గొప్ప మహిళామూర్తులలో ఒకరు తమిళనాడుకి చెందిన శ్రీమతి టి.యస్. సౌందరం. ఈమె 1904వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీన తిరునల్వేలిలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు లక్ష్మీ అమ్మయ్యార్, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరం అయ్యంగార్లు. బాల్యం, విద్యాభ్యాసం తమిళనాడులో జరిగాయి. ఆనాటికి మనదేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. ఈమెకి కూడా డా॥ సౌందరరాజన్‌తో బాల్యవివాహం జరిగింది. ఆయన మానవతామూర్తి. అప్పుడు పట్టి పీడిస్తున్న ‘ప్లేగు’ వ్యాధి బాధితులకు శిబిరాల్లో వైద్య సేవలను అందించారాయన. చివరికి ప్లేగు వ్యాధితో మరణించారు.

కుమార్తెను అలా వదిలేయడం ఆ దంపతులకు ఇష్టంగా అనిపించలేదు. న్యూ ఢిల్లీలోని లేడీ హార్డింగ్ వైద్య కళాశాలలో చదివించారు. సౌందరంకు అక్కడ సుశీలా నయ్యర్‌తో పరిచయమయింది. ఆమె గాంధేయురాలు. ఆమె సాహచర్యంలో సౌందరం కూడా గాంధీమార్గం పట్ల ఆకర్షితులయ్యారు. వైద్య విద్యను అభ్యసిస్తూనే సమాంతరంగా స్వాతంత్ర్యోద్యమంలో పాలు పంచుకున్నారు. 1936 నాటికి వైద్యశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

ఇలా జరుగుతున్న సమయంలోనే మరో ప్రముఖ గాంధేయవాది, దక్షిణ భారతదేశంలో ప్రముఖ హరిజన నాయకుడు శ్రీ జి. రామచంద్రన్ పట్ల ఆకర్షితురాలయ్యారు. వీరిరువురి ఆశలు, ఆశయాలు ఒకటయ్యాయి. గాంధీజీ ఆశీస్సులతో వివాహం చేసుకున్నారు. గాంధీ నిర్వహించిన ఉద్యమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో వీరు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. గాంధీజీకి వీరి పట్ల అపారమైన నమ్మకం. దక్షిణ భారతదేశంలో స్థాపించిన ‘కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్’ బాధ్యతలను సౌందరంకు అప్పగించారాయన.

శ్రీమతి సౌందరం బాపూజీ ‘గ్రామీణ భారత సిద్ధాంతాన్ని’ ఆకళింపు చేసుకున్నారు. అందుచేత దిండిగల్ దగ్గరలోని గ్రామ ప్రాంతంలో ‘గాంధీగ్రామ్’ని స్థాపించారు. దీని కేంద్రంగా గ్రామీణులకు విద్య, వైద్య సౌకర్యాలను కల్పించడం కోసం కృషి చేశారా దంపతులు. ఈ సంస్థ తరువాత ‘డీమ్డ్ విశ్వవిద్యాలయం’గా మారింది.

ఈమె 1952, 1957 సంవత్సరాలలో మద్రాసు రాష్ట్ర శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1962లో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమెకు కేంద్రంలో విద్యాశాఖ సహాయమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. సహాయమంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ‘నిర్బంధ ఉచిత విద్య’ను దేశమంతటా ప్రవేశపెట్టేందుకు దోహదపడింది. ఆ సమయంలోనే N.S.S. (జాతీయ సేవా పథకం)ను విద్యాసంస్థలలో ప్రవేశపెట్టించింది. ఈనాటికీ ‘నిర్బంధ ఉచిత విద్య’ పథకమే ప్రజలలో అక్షరాస్యత పెంచేందుకు ఉపయోగపడుతోంది. N.S.S. విద్యార్థి దశలోనే విద్యార్థులలో సేవా భావాన్ని, దేశభక్తిని సుసంపన్నం చేయడానికి దోహదం చేస్తోంది. ఈమె బీజాలు నాటి, పాదులు చేసి వృక్షోపశాఖలను విస్తరింపజేసిన వివిధ సంస్థను ఈనాటికీ ఆమెను అమరజీవిని చేశాయి.

1962లో చైనాతో యుద్ధ సమయంలో ‘భారత జాతీయ రక్షణ నిధి’ని ఏర్పాటు చేసి సైన్యానికి సహాయాన్ని అందించి దేశభక్తిని నిరూపించుకున్నారు.

1962లో భారత ప్రభుత్వం వీరికి ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందించి గౌరవించింది.

వితంతువయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసి, వైద్యురాలై, స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్రను నిర్వహించి, కేంద్ర సహాయమంత్రిగా నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టి, దక్షిణ భారతంలో గాందేయపథంలో సేవలనందించి, యుద్ధ సమయంలో సహాయనిధిని అందించిన అకళంక దేశభక్తురాలు శ్రీమతి టి. ఎస్. సౌందరం 1984వ సంవత్సరం అక్టోబరు 21వ తేదీన ‘దిండిగల్’లో మరణించారు.

ఆమె వర్ధంతి సందర్భంగా నివాళిని అర్పించడం మనందరి కర్తవ్యం.

Exit mobile version