కాజాల్లాంటి బాజాలు-72: సాయం చేయండి ప్లీజ్..

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]శె[/dropcap]లవురోజు కదా టీవీ చూస్తూ హాయిగా ఎంజాయ్ చేద్దామని దాని ముందు సెటిలయి రిమోట్ చేతిలోకి తీసుకున్నాను. ఊరికే అటూ ఇటూ చానల్స్ తిప్పుతూ కూర్చునేకన్న ఆన్ చేసేముందే ఏమి చూద్దామా అని ఆలోచించుకుంటే మంచిదనిపించింది. అందుకే కళ్ళుమూసుకుని ఏవేవి చూడకూడదో ఆలోచించేను. న్యూస్ పెట్టకూడదు, సినిమాలు అసలు పెట్టకూడదు, సీరియల్స్ ఒంటికి పడవు, రియాలిటీ షోల పేరు చెపితేనే దడుపు.. మరింక ఏమి చూడాలిరా దేవుడా అనుకుంటూ ఈమధ్య చాలామంది షార్ట్ ఫిల్మ్స్ తీసామని చెపుతున్నారుకదా వాటిని ఓ లుక్కేద్దాం అనిపించింది. అవి చాలారకాలు కనిపించేయి. అంటే ఒకనిమిషం నడిచేవాటినుంచి ఎంతసేపైనా నడుస్తూ అన్నిరకాల భావజాలాలతోనూ కనిపించేయి. ఇంట్లో వంట, పెరట్లో తోట, వరండాలో హాంగింగ్ గార్డెన్, ఆకుకూరలతో అట్లు, దుంపకూరలతో ఆమ్లెట్లుతో బాటు పిల్లల పెంపకం, పెద్దల పోషణ లాంటివన్నీ చాలా కనిపించేయి. అసలు ఈ ప్రపంచంలో షార్ట్ ఫిల్మ్ తియ్యడానికి కాదేదీ అనర్హం అనిపించింది. అంతే.. ఆక్షణంలోనే నిర్ణయించేసుకున్నాను.. నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసెయ్యాలని.

అదేమాట మా వదినతో చెపితే, “నీకేమొచ్చని తీస్తావ్! ఒక ఫిల్మ్ తియ్యాలంటే కళాత్మకహృదయం కావాలి.. అది నీకెక్కడుందీ..” అంటూ నవ్వేసింది. హూ.. హెంత అవమానం…నాకు కళాత్మకహృదయం లేదంటుందా…చిన్నబోయిన నామొహం చూసి అడిగింది..

“అసలు నువ్వెప్పుడైనా సూర్యోదయాన్ని ఆస్వాదించేవా!”

“అసలు నువ్వు నా వదినవేనా!… నీకు తెలీదూ…ప్రతిరోజూ సూర్యోదయాన్ని ఆస్వాదిద్దామనుకుంటాను.. కానీ యేం చెయ్యను. రాత్రి పన్నెండువరకూ ఫేస్ బుక్, వాట్సపూ లాంటివాటిల్లో చాటింగ్ చేసేక యింక మర్నాడు నేను లేచేటప్పటికి సూర్యుడు నాకోసం ఆగుతాడా.. ఎవరో తరుముతున్నట్టే అప్పటికే అంతదూరం వెళ్ళిపోతాడు.”

“సూర్యోదయం సరే.. పోనీ నువ్వు లేచేక అప్పుడే విచ్చుకుంటున్న పూలరేకుల మీద నిలిచిన మంచుబిందువులని చూసి పరవశించేవా..”

“ఎలా కుదుర్తుందీ.. పొద్దున్న నా పనులయ్యేటప్పటికే పది దాటిపోతుంది. అప్పటిదాకా ఆ రేకులమీద మంచుబిందువులు కరిగిపోకుండా వుంటాయా..”

“సరే పోనీ..దేవుడి పూజకయినా ఎప్పుడైనా అందంగా పూలమాలలు కట్టేవా..”

“పొద్దున్న నేను దేవుడికి దండం పెట్టుకుందుకు వెళ్ళేటప్పటికే అలంకారాలు చేసిన దేవుళ్ళకి అమ్మ పూజ అయిపోతుంది..”

“సరే, అదీ వదిలెయ్యి. ఎప్పుడైనా ఫ్లవర్ వాజ్ లో పూలని అందంగా అమర్చి హాల్లో పెట్టేవా..”

“ఇది మరీబాగుంది.. పొద్దున్న నేను లేచేటప్పటికే యిల్లంతా సద్దేవాళ్ళు ఆపని కూడా చేసేస్తారు. నేనొచ్చేదాకా ఆగొచ్చుకదా..”

“ఓహో..అసలు నీ తప్పే లేదంటావ్.. పోనీ.. అది కూడా వదిలెయ్యి.. నిన్న మీ ఫ్రెండ్ పుట్టిన్రోజుపార్టీకి వెళ్ళేవు కదా.. అప్పుడైనా గిఫ్ట్ స్వయంగా యేదైనా చేసి తీసికెళ్ళకుండా కొని తీసికెళ్ళేవు. అసలు నీలో సృజనాత్మకతే లేనప్పుడు యింక యిలాంటి ఆలోచనలు మటుకు యెందుకూ.”

నిజం చెప్పొద్దూ.. వదిన మాటలకి నాకు పౌరుషంలాంటిది వచ్చేసింది. ఏమైనా సరే ఇరవైనాలుగ్గంటల లోపల ఓ షార్ట్ ఫిల్మ్ తీసి పడేద్దామని నిర్ణయించేసుకున్నాను.

నిర్ణయమైతే తీసుకున్నాను కానీ దేనిమీద తియ్యాలో తెలీలేదు. కాదేదీ కవిత కనర్హం అన్నారు కదా పెద్దలూ. అందుకని మొబైల్ చేత్తో పుచ్చుకుని చుట్టూ పరికిస్తే సరీ, అదే కనపడుతుంది అనుకుని మొబైల్‌ని పూర్తిగా ఛార్జి చేసుకుని చేత్తో పట్టుకుని బయటకొచ్చేను.

ఎదుటి ఫ్లాట్ ఆవిడ పదేళ్ళ పనిపిల్లని “చెప్పు.. ఎక్కడ పెట్టేవ్..” అంటూ కొడుతోంది. ఆ పిల్ల పాపం భోరుమని యేడుస్తూ, “నేను తియ్యలేదమ్మా..” అంటోంది. భలే.. దీన్ని ఫిల్మ్ తీసేసి, పసిపిల్లని పనిలో పెట్టుకుని, బాలకార్మికులను తయారుచేస్తున్న పెద్దింటి మహిళ అని రాసేసి జనాలమీదకి వదిలెయ్యొచ్చనిపించింది. వెంటనే మా ఇంట్లోకి వచ్చేసి, కిటికీలోంచి రెండునిమిషాలపాటు ఆవిడ ఆ పిల్లని కొడుతుండడం, ఆ పిల్ల యేడుస్తుండడం వీడియో తీసేసేను.

దాన్ని పట్టికెళ్ళి వదిన చేతిలో పెట్టి “ఇదిగో చూడు.. ఇవాళ దీనిని అప్లోడ్ చేస్తాను.” అన్నాను.

వదిన అది చూసి “చెయ్యి.. చెయ్యి.. అది చూసి ఎదురింటావిడ వాళ్ళ ఆయనతో మనమీదకి యుధ్ధానికి వస్తుంది. అసలే ఆ మొగుడూపెళ్ళాలు పదవీ, అధికారం వున్నవాళ్ళు. మనల్ని ఈ ఫ్లాట్ అమ్ముకుని పోయేలా చెయ్యగలరు..” అంది. ప్రాణం ఉసూరుమనిపించింది.

“మరి ఈ అన్యాయం యిలా జరగవలసిందేనా!” ఆవేశంగా అడిగిన నా ప్రశ్నకి

“గొప్పగొప్పోళ్ళే ఇలాంటివాటికి నోళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఇలాంటివి తీసి కొంప మీదకి తేకు..” అని ఖచ్చితంగా చెప్పేసింది.

మరేం తియ్యాలీ అనడిగిన నా ప్రశ్నకి “పువ్వులూ, పాపలూ బోల్డుంటాయి కదా.. అందాలనేవి నువ్వు చూసే దృష్టిలో వుంటుంది అందమైన దృశ్యాలు తియ్యి..” అంది.

సలహా బాగానే వుంది.. కానీ ఇప్పుడు పువ్వులూ, పాపలూ అంటే నేనెక్కడిపోనూ..

తప్పదు కాక తప్పదు. ఎలాగైనా పువ్వుల్నీ, పాపల్నీ పట్టుకోవాల్సిందే..

బాబ్బాబూ.. మీ దగ్గర పువ్వులూ, పాపలూ వుంటే చెపుదురూ..క్షణాల్లో వాలిపోతాను.

మీ ఋణం వుంచుకోను. మా వదిన దగ్గర పరువు నిలుపుకోవాలిగా మరీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here