Site icon Sanchika

సాయం సంధ్య

[శ్రీ ఏరువ శ్రీనాథ రెడ్డి రాసిన ‘సాయం సంధ్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పొ[/dropcap]ద్దంతా తిరిగినా ఏ సాయమూ అందక సాయంసంధ్య వేళకి గూటికి వచ్చి సతికిలబడింది సంధ్య.

ఎవరినడిగినా రూపాయి సాయం చేయలేదు. కనీసం అప్పు కూడా పుట్టలేదు. అందరూ తనకి బాగా తెలిసినవాళ్లే. ఇంతకు ముందు అందరూ తన దగ్గర చేయి చాచినవాళ్లే. ఆపదలో ఉన్నప్పుడే ఆప్తులెవరూ అవసరానికి రారు. ఇంట్లో ఉన్నడబ్బులు సరిపోవు. కానీ ఒంట్లో మాత్రం సత్తువ అలాగే ఉంది.

ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగానే ఊరిని చీకటి చుట్టేసింది. సంధ్యకి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తిన్నగా లేచి స్నానాలగది లోకి వెళ్లి పగలంతా వేడెక్కిన పొంతకుండ లోని ఉడుకునీళ్ళని తలపై పోసుకుంది. మనసు చల్లబడింది. వయస్సు వెనక్కి వచ్చేసింది. ఆ వేళ సువాసనలు వెదజల్లె సబ్బుముక్కను పక్కకు తోసేసి సున్నిపిండితో స్నానం చేసింది. తడి కురులను తుడుచుకుంటూ గదిలోకి వచ్చి కొత్త కోక కోసం తడిమి తడిమి చూసింది. నల్లంచు ఎర్రచీర దొరికితే దానిని తన ఒంటికి కట్టుకొని కాటుకరంగు రవికతో తన హృదయాన్ని కప్పుకుంది. నుదుటిన బొట్టు పెట్టుకొని జుట్టునలా పిల్లగాలికి అరువిచ్చి ఒకసారి అద్దం చూసుకుంది. అంత అందాన్ని అద్దం చూడలేక సిగ్గుపడింది. తోటి ఆడవాళ్లే అసూయపడే అందం సంధ్య సొంతం. సంధ్య మల్లొకసారి పవిట సర్దుకొని, పన్నీటిని చిలకరించుకొని బయటపడింది పని కోసం.

బయలుదేరింది గానీ సంధ్య మనసులో ఒకటే అలజడి, ఆందోళన. తనకు తెలిసిన పనే. అలవాటు లేని పనేం కాదు. కానీ చాలా కాలంగా ఈ వృత్తి మానేసి రొయ్యల కంపెనీలో రోజు కూలిగా పోతుంది. ఎలా ఉంటుందో ఏమోనని భయపడుతూనే ఉంది. డబ్బు అవసరమైంది. తన దగ్గర కొంత ఉంది. అవసరానికి అది సరిపోదు. తప్పక, తప్పించుకోలేక తనకు తెలిసినదారినే ఎంచుకుంది చివరికి.

అలా నడుస్తూ వెంకాయమ్మ బొంకు కాడ ఆగి మూర మల్లెపూలు కొనుక్కొని తలలో తురుముకుంది. మల్లెపూల వాసన ఆ మండలమంతా వ్యాపించింది. సుబాబుల్ తోటల్లో గుండా నడిచి మెల్లగా హైవే చేరింది. రోడ్డు పక్కన నిలబడింది. వేసవికాలపు చల్లని గాలులు వీస్తున్నాయి. వాహనాల నుండి వచ్చే కాంతిలో సంధ్య దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.

గంటలు గడుస్తున్నాయి కానీ ఒక్క గుంటడూ రాలేదు. వెలుతురు ఆరిపోతుంది గానీ ఒక్కవిటుడూ విచ్చేయలేదు. అందరూ దగ్గరగా వచ్చి చూస్తున్నారే కానీ దరి చేరడం లేదు. ధర అడగడం లేదు. చెయ్యెత్తినా, చేతులెత్తి మొక్కినా ఒక్క లారీ ఆపలేదు. ఇన్నేళ్ల తన వృత్తిలో ఎప్పుడూ ఇలాంటి సందర్భం సంధ్యకి ఎదురవలేదు.

‘నాలో అందం తగ్గిందా? వయసు మీద పడిందా? రంగు వెలిసిపోయినాదా? శరీరం పూర్వపు సౌష్టవం కోల్పోయిందా? వలపు చూపులతో వల వెయ్యలేకపోతున్నానా? ఏం తక్కువైంది నాకు’ అని సంధ్య మనసులో గింజుకుంటూ ఉండగానే పోలీసులు వచ్చారు.

సంధ్య వెనుతిరిగింది. ఇంటికి చేరుకుంది. అప్పటికే రాత్రి 11:30 అయ్యింది. ఫోన్ తీసి నెంబర్లు వెతుక్కుని రత్తమ్మకి ఫోన్ చేసింది.

“ఏందక్కా ఎలా ఉన్నావు”

“నేను బానే ఉన్నాను”

“ఏదైన పనుంటే చెప్పక్కా వస్తాను, ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది” అని రత్తమ్మను బతిమిలాడింది.

“నాకాడికి ఇందాకనే సామర్లకోట నుండి కొత్తసరుకు దిగింది. కుర్రపిల్లలు. వీళ్లు ఓ నాలుగు రోజులుంటారు. వీళ్ళు పోయాక పిలుస్తాలే” అని రత్తమ్మ ఫోన్ పెట్టేసింది.

సంధ్యకి ఏం చేయాలో తోచడంలేదు. ఆకలి దహించి వేస్తుంది. మధ్యాహ్నం వండుకున్నఅన్నం మిగిలితే చింతకాయ పచ్చడి ఏసుకొని తిని అలా మంచం మీద నడుం వాల్చింది. ఆటోశీనుగాడికి ఫోన్ చేసి “ఏమన్నా బేరాలుంటే చెప్పురా” అని అడిగింది. అలా అడిగి ఆవలించేలోపే శీనుగాడు తన ఆటోతో సహా సంధ్య ఇంటి ముందు వాలిపోయాడు. సంధ్యను ఆటో ఎక్కించుకున్నాడు.

“అక్కా నీ నెంబర్లేక అల్లాడిపోయాను. ఇల్లేమో మారిపోయావు. మొన్న బజార్లో కనబడి అడిగితే అన్ని మానేసి కూలిపనికి పోతున్నానని చెప్పినావు. సరైన సమయానికి ఫోన్ చేసావ్ అక్కా, మంచి బేరం ఉంది. నీలాంటి ఆడదే వాడికి కావాలంట మరి. ఒక్క రాత్రికి 20,000/- ఇస్తాడు.”

“ఎవరయ్యా ఆ మహానుభావుడు?”

“మహానుభావుడే కానీ ముసలోడు, వయసు 60 పైనే ఉంటది. మన మాజీ ఎమ్మెల్యే ఆదికేశవులు. కాకపోతే ఒకటే కండిషనూ..” అని శీనుగాడు చెప్పేలోగా ఆటో ఆ ఇంటికి వచ్చేసింది.

“అవన్నీ నేను చూసుకుంటాలేరా శీనుగా” అని వాడి చేతిలో వంద పెట్టి సంధ్య లోపలికి వెళ్ళింది.

సూర్యుడు ఉదయించే లోపే సంధ్య బయటపడింది.

ఆ మిసిమిలోనే నేరుగా బస్టాండ్కి వెళ్లి కొత్తపట్నం బస్సు ఎక్కింది. అలసిన మనసు కదా హాయిగా నిద్ర పట్టేసింది. లేచేసరికి కొత్తపట్నం బస్టాండ్ వచ్చింది. బస్సు దిగి ఆటో పట్టుకొని ఆ మారుమూల ఉన్న పల్లె చేరుకుంది. అందరిని అడుగుతా చివరికి తనకి కావాల్సిన గోవిందమ్మ ఇంటికి చేరింది.

గుమ్మంలోనే నిలిచి పిలిచింది. గోవిందమ్మ బయటికి వచ్చింది.

తన పర్సులో ఉన్న20,000/- ముసలోడు ఇచ్చిన 20,000/- తన గుండెల్లో దాచుకున్న10,000/- మొత్తం 50,000/- తీసి గోవిందమ్మ ఐదువేళ్ళ మధ్యలో పెట్టి

“నిన్న నీ గురించి మా ఫ్యాక్టరీలో అనుకుంటుంటే విన్నాను. జాగ్రత్తగా వెళ్లిరా” అని సంధ్య వెళ్లిపోతుంటే

“అక్కా నువ్వు ఎవరక్కా” అని గోవిందమ్మ అడిగింది.

“మీరు కొన్నాళ్లుగా ఎవరి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నారో, వాళ్ళ మనిషిని, వాళ్లు పంపిన మనిషిని” అని చెప్పి సంధ్య బయలుదేరి వచ్చేసింది.

ఇదంతా వాకిట్లో నిలబడి చూస్తున్నారు గోవిందమ్మ తల్లిదండ్రులు. కనీసం కూర్చోమన్న కూర్చోకుండా, మంచినీళ్లు కూడా తాగకుండా, గుమ్మంలోకి అడుగుపెట్టకుండా సాయం చేసి అటు నుంచి అటే వెళ్లిపోయిన సంధ్య గురించి ఆలోచిస్తున్నారు.

తమకు డబ్బు పంపిన ఆ ప్రజాప్రతినిధి అయిన మాజీ ఎమ్మెల్యే ఆదికేశవులకి మనసులోనే దండం పెట్టుకున్నారు.

పదిరోజుల తర్వాత కొత్తపట్నం రైల్వేస్టేషన్ కళకళలాడుతుంది.

అందరూ గోవిందమ్మ కోసం ఎదురు చూస్తున్నారు.

క్రీడాశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు దండలు పట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్లలో మరో ప్రజాప్రతినిధి మాజీ ఎమ్మెల్యే అయిన ఆదికేశవులు కూడా ఉన్నాడు. గోవిందమ్మను గర్వంగా మోసుకుంటూ రైలు రానే వచ్చింది.

గోవిందమ్మ దిగంగానే అందరూ చప్పట్లు, ఈలలు, అరుపులు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పూలమాలలతో గోవిందమ్మను సత్కరించారు. పూణేలో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‍షిప్‍లో స్వర్ణపతకం గెలిచినందుకు గోవిందమ్మకి అందరూ అభినందనలు తెలిపారు.

గోవిందమ్మ సంధ్య కోసం గుంపులో వెతికింది. కనబడలేదు. వెతుకుతూనే ఉంది. సాయంసంధ్య వేళ అయ్యింది కానీ సాయం చేసిన సంధ్య మాత్రం కనపడలేదు. గోవిందమ్మ బయటికి వచ్చి చూసింది. సంధ్య ఆటోలో కూర్చొని ఉంది. అది శీనుగాడి ఆటో. గోవిందమ్మ నేరుగా వెళ్లి సంధ్య మెడలో దండలు వేసి దండం పెట్టింది.

ఎవరి సాయం కోసమయితే గోవిందమ్మ ఎదురు చూసిందో ఆ ఆదికేశవులు మీడియాతో మాట్లాడుతున్నాడు.

ఎవరైతే నిజంగా సాయం చేశారో ఆ మనిషి మౌనంగా నిలుచుని ఉంది.

సంధ్య దండలు ఆటోలో పెట్టేసి వెళుతుంటే “అక్కా, నువ్వు ఎవరక్కా” అని అడిగిన గోవిందమ్మకి ఎదురుగా షాపు ముందు నిలబడి సంధ్య కొడుతున్న చప్పట్ల శబ్దం వినపడింది. స్టేషన్ ముందు తన కోసం కొడుతున్న తప్పెట్ల శబ్దం మూగబోయింది.

‘అవునూ నేనెవరిని? నేనెవరని నేనెలా చెప్పేది?’ అని తనలో తానే ప్రశ్నించుకుంటూ తలదించుకొని వెళుతూ ఉన్న సంధ్య వైపు గోవిందమ్మ తలెత్తి చూసింది.

Exit mobile version