సభాయనమః

2
2

[box type=’note’ fontsize=’16’] ఓ కథా రచయిత తొలిసారిగా కథాసంపుటి ప్రచురించి, ఆవిష్కరణ సభ పెట్టుకుందామనుకుంటే, ఏమయిందో వివరిస్తున్నారు సలీం కల్పిక ‘సభాయనమః’లో . [/box]

[dropcap]కా[/dropcap]మేశం పదేళ్ళనుంచి కథలు రాస్తున్నాడు. ఏడాదికి కనీసం మూణ్ణలుగు కథలైనా ప్రముఖ పత్రికల్లో వెలుగు చూస్తుంటాయి. ఓ ఆదివారం తీరిగ్గా కూచుని పత్రికలన్నీ తిరగేస్తే మొత్తం ముప్పయ్ నాలుగు కథలు లెక్క తేలాయి.

“ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఐదేళ్ళ క్రితమే మొదటి కథా సంపుటి తీసుకురావాల్సింది. అవార్డులూ రివార్డులూ రావాలంటే కథల్ని సంపుటి కింద ప్రచురించడం అవసరం” అన్నాడు ఆత్మీయ మిత్రుడు అశోక్. అతను కవితలు రాస్తూ ఉంటాడు. ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా అక్కడికెళ్ళి కవిత చదవాల్సిందే. లేకపోతే జీవితమే వృధా అనుకునేంత వ్యామోహం అతనికి.

“నేనేమీ అవార్డులు ఆశించి రాయడం లేదు” అన్నాడు కామేశం.

“పోనీ పేరు రావాలన్నా పుస్తకం వేయక తప్పదు”

“నేను కేవలం నా ఆత్మ తృప్తి కోసం రాస్తున్నాను” అరమోడ్పు కళ్ళతో అన్నాడు.

“చాల్లే ఆత్మవంచన.. నా దగ్గర కూడా దాపరికం దేనికి? పైకి ఎన్ని సూక్తులు చెప్పినా కీర్తిని కాంక్షించని కళాకారుడు ఈ భూప్రపంచంలో ఉండడు. తొందరగా ఆ పనేదో చూడు” అన్నాడు కించిత్ విసుగ్గా.

ముప్పయ్ నాలుగు కథల్లోంచి పాతిక కథల్ని ఏరి “వీటితో మొదటి కథా సంపుటి వేయిస్తాను. ఇందులో ఓ కథ పేరు సుప్రభాతం. పుస్తకానికి కూడా అదే పేరు పెడ్తాం. ఏమంటావు?” అన్నాడు కామేశం.

“పాతిక కథలా?”

“ఏం సరిపోవా? మరో ఐదు కలపమంటావా?”

“ఏం కాలంలో ఉన్నావు కామేశం? కథలు రాయడంతోటే సరిపోదు. సాహిత్య సమూహాల్లో ఏం జరుగుతుందో తెల్సుకుంటూ ఉండాలి. నవీన పోకడల్ని మనమూ అనుసరించాలి. పది కథలు చాలు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. నీ దగ్గరున్న ముప్పయ్ నాలుగు కథల్లో మూడు కథా సంపుటాలు రావడంతో పాటు మరో నాలుగు కథలు నాలుగో కథా సంపుటానికి మిగుల్తాయి”

“మరీ పది కథల్లో పుస్తకమా? ఒక్కో దాన్లో పదేసి కథలు వేసినా ఒకే దాన్లో ముప్పయ్ కథలు వేసి నా అన్నీ నావేగా. మూడు పుస్తకాలంటే ఖర్చు చాలా పెరిగిపోదా?”

“మార్కెట్ ట్రెండ్ ని బట్టి నడుచుకోక తప్పదు. ఒకే సంపుటిలో పాతిక కథలుంటే అవన్నీ చదివే ఓపిక ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు. నువ్వు ఫ్రీగా పంచినా ఎవ్వరూ చదవరు. కథల పుస్తకాలు అమ్ముడుపోవటం లేదు కాబట్టి ఎలాగూ నువ్వు ఫ్రీగా పంచక తప్పదనుకో. అది వేరే విషయం. అదే పది కథల్లో పుస్తకం వేశామనుకో. కనీసం ఏడెనిమిది కథలైనా చదువుతారు. ఆ విధంగా నీ కథల్ని ఎక్కువమంది చదివే అవకాశం ఉంది.”

“పోనీ ఇరవై కథల్లో వేద్దాం”

“వద్దు. నా మాటిను. ఎన్ని కథా సంపుటాలు ప్రచురించావనేది కూడా చాలా ముఖ్యం. అందులో ఎన్ని కథలున్నాయనేది ఎవ్వరూ పట్టించుకోరు. ఇప్పుడంతా అంకెలే రాజ్యమేలుతున్నాయి.”

“సరే. మధ్యే మార్గంగా పదిహేను కథల్లో మొదటి సంపుటి ప్రచురిద్దాం” అన్నాడు కామేశం.

ఓ పబ్లిషర్‌ని పట్టుకుని ముప్పయ్ వేలు సమర్పించుకుని మొదటి కథా సంపుటి “సుప్రభాతం’ చేతిలోకి రాగానే అంతులేని పెన్నిధి చేతిలోకొచ్చినట్టు మురిసిపోయాడు కామేశం.

“దీనికే మురిసిపోతే ఎలా? అట్టహాసంగా పుస్తకావిష్కరణ సభ పెడ్తాం. పెద్దపెద్ద వాళ్ళని పిలుద్దాం. నీ పేరు మార్మోగిపోవాలి. పేపర్లనిండా నీ గురించి, నీ పుస్తకం గురించి రాయాలి” అన్నాడు అశోక్.

కామేశం కలల్లో తేలిపోయాడు.

శనివారం సాయంత్రం సభ పెడితే సౌకర్యంగా ఉంటుందని తీర్మానించుకుని, ఓ మూడు వారాల వ్యవధి ఉండేలా తేదీ ఖరారు చేసుకుని ఆ రోజు సాయంత్రానికి త్యాగరాయగాన సభ హాల్‌ని బుక్ చేసుకున్నారు.

“ఇక వేదిక నలంకరించే పెద్దలు ఎవరనేదే మిలియన్ డాలర్ వ్యవహారం. అధ్యక్షత వహించడానికి కవి కుమారస్వామిని పిలిస్తే బావుంటుంది” అన్నాడు అశోక్.

“ఆయన కవి కదా. కథల పుస్తకానికి ఆయన్ని పిలిస్తే ఏం బావుంటుంది? ప్రముఖ కథా రచయిత రవికుమార్‌ని పిలుద్దాం” అన్నాడు కామేశం.

“ఇబ్బే. ఆయనకు చాలా పొగరని విన్నాను. కుమారస్వామి నాకు బాగా తెలుసు. మంచి వక్త. నేను పిలిస్తే కాదనడు”

కుమారస్వామి అంటే అశోక్ కి గురుభక్తి అని కామేశానికి తెలుసు. అందుకే ఆయన్ని పిలుద్దామని బలవంతపెడ్తున్నాడనిపించింది. కాదంటే మిత్రుడు ఎక్కడ నొచ్చుకుంటాడో అని భావించి “వీళ్ళిద్దరూ కాకుండా పోయినేడాది సాహిత్య అకాడమీ అవార్డ్ పొందిన నీలకంఠం గారున్నారుగా. వారిని పిలుద్దాం” అన్నా డు కామేశం. అశోక్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు.

కామేశం అతనికి ఫోన్ కలిపాడు. “సార్. నా పేరు కామేశం. కథా రచయితని. నా కథా సంపుటి ఆవిష్కరణ సభ మీవంటి పెద్దల అధ్యక్షతన జరిగితే బావుంటుందని నా కోరిక”

“అధ్యక్షుడిగానా? ముఖ్య అతిథి, ఆవిష్కర్త ఎవరు?”

“ఇంకా ఏమీ అనుకోలేదండి”

“అకాడమీ అవార్డు గ్రహీతని. నాకంటూ ఓ స్థాయి ఉంది కదా. ఆవిష్కర్తగా తప్ప సాహిత్య సభలకు వెళ్ళటం లేదండి. మీరు గమనించే ఉంటారు.”

“ఒక్క క్షణం లైన్లో ఉండండి సర్” అని సెల్‍ఫోన్‌ని దూరంగా పెట్టి అశోక్‌తో “ఏం చేద్దాం” అని అడిగాడు. “తప్పదు. ఒప్పేసుకుందాం” అన్నాడతను.

కామేశం ఆ విషయం చెప్పగానే నీలకంఠం “సంతోషం. తేదీ ఏదన్నారు? ఓహో.. మంచిది. నా డైరీలో రాసుకుంటున్నా. వేదిక మీద మిగతా వాళ్ళెవరో ఆలోచించుకున్నారా?”

“లేదండి”

“అధ్యక్షునిగా శ్రీరాం గార్ని పిలవండి. నేను చెప్పానని చెప్పండి. నా మిత్రుడే. పుస్తక పరిచయానికి సుజాత గార్ని పిలవండి. నా శిష్యురాలు. చాలా బాగా పరిచయం చేస్తుంది”

కామేశం గుటకలు మింగుతూ “అలాగే సార్’ అన్నాడు.

“మిగతా పెద్దలు మీ ఇష్టం. కానీ వాళ్ళ పేర్లు ఖరారైనాక నాకు తెలియబర్చడం మర్చిపోవద్దు. మీకు తెలియంది ఏముంది? సాహిత్యంలో ఎన్ని రాజకీయాలు నడుస్తున్నాయో… ఎన్ని ముఠాలున్నాయో… పొరపాటున వైరివర్గం వాడ్ని తెచ్చి మా పక్కన కూచోబెట్టారంటే లేనిపోని తలనొప్పి. అర్థమైందిగా”

కామేశం బిక్క మొగమేస్కుని జరిగింది అశోక్ చెవిన వేశాడు.

అశోక్ నవ్వేసి “ఇదంతా మామూలే. నువ్వు మొదటి సారి పుస్తకావిష్కరణ సభ పెట్టబోతున్నావు కదా. అందుకే నీకు వింతగా ఉండొచ్చు. గౌరవ అతిథిగా సౌశీల్యరావుని పిలుద్దాం. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ముందు ముందు దేనికైనా పనికొస్తాడు” అంటూ సలహా ఇచ్చాడు.

కామేశం సౌశీల్యరావుకి ఫోన్ కలిపాడు. “ముఖ్య అతిథిగా నీలకంఠాన్ని పిలిచారా? అయ్యో తొందరపడ్డారే. ముందే నాతో మాట్లాడి ఉంటే నాకు తోచిన సలహా ఇచ్చి ఉండేవాణ్ణికదా. మీరు శ్రీకర్ పేరు వినే ఉంటారుగా. నాకు చాలా ఆత్మీయుడు. ఎప్పుడో జ్ఞానపీఠ రావాల్సిన గొప్ప సాహితీవేత్త. అతనికి రాకుండా అడ్డుపడున్న దుష్టగ్రహాలు కొన్ని ఉన్నాయిలెండి. మనం కలిసినపుడు వివరంగా చెప్తాను. అతన్ని ఆవిష్కర్త గా పిలిచి ఉంటే మీ పుస్తకానికి అదనపు గౌరవం దక్కిఉండేది” అన్నాడు.

“సర్. ఇప్పుడు మార్చడానికి ఎలా వీలవుతుంది? పోనీ ఆయన్ని మరో గౌరవ అతిథిగా…”

అతని మాటపూర్తి కాక ముందే సౌశీల్యరావు హూంకరించాడు. “సృహలో ఉండే ఆ మాటన్నారా? మేరు పర్వతం లాంటి శ్రీకర్ ఎక్కడా పిపీలికం లాంటి నీలకంఠం ఎక్కడ? గాడిదని సింహాసనం మీద కూ చోబెట్టి మేలురకం అరేబియన్ జాతి ధవళాశ్వాన్ని సామంతుణ్ణి చేయటంతో సమానం అది.”

“మరో దారి మీరే చెప్పండి”

“ఏదో కారణం చెప్పి నీలకంఠాన్ని తొలగించండి. ఆ స్థానంలో శ్రీకర్ని కూచోబెడ్డాం.”

“వీలు పడదు సార్.”

“ఐతే నేను రావడం కూడా వీలుపడదు. ఇంకెవర్నయినా చూసుకోండి” అంటూ ఫోన్ పెట్టేశాడు.

“ఇదేం తలనొప్పి అశోక్.. శుభమా అంటూ పుస్తకావిష్కరణ జరుపుకుందామనుకుంటుంటే ఈ గ్రూపు తగాదాలేమిటి? వీళ్ళ మధ్య ఈ వైషమ్యాలేమిటి?”

“అదంతేలే. రోట్లో తల పెట్టాక రోకటిపోటుకి వెరిస్తే ఎట్లా? ఎవరైనా లేడీ రైటర్స్ దొరుకుతారేమో చూద్దాం. వేదిక మీద స్త్రీల భాగస్వామ్యం కూడా ఉండాలిగా” అన్నాడు అశోక్.

ప్రముఖ కథా రచయిత్రి కమలమ్మ గారికి ఫోన్ చేసాడు. ముఖ్య అతిథి, అధ్యక్షుల పోస్ట్‌లు  భర్తీ అయిపోయాయని తెల్సుకుని ఆమె చాలా తెలివిగా “తప్పకుండా వస్తానండీ. ఇంతకూ ఏ తేదీ అన్నారు? ఓ అదా… అయ్యో సారీ అండీ. ఆ రోజు మా మనవడి పుట్టిన రోజు ఫంక్షన్ ఉంది. రాలేను. మీరు ఆవిష్కరణ జరుపుకోబోయే రెండో పుస్తకానికి తప్పకుండా వస్తాను. సరేనా” అంది.

సీనియర్ రచయిత్రి సుధేష్ణకు ఫోన్ చేశాడు. ఆమెకు డెబ్బయ్ యేళ్ళ వయసుంటుంది. ‘నా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడున్న రోజుల్లో నీలకంఠం లాగూలేస్కుని రెండో తరగతో మూడో తరగతో చదువుతూ ఉండి ఉంటాడు. సీనియర్ రచయిత్రినయిన నాకు అకాడమీ అవార్డ్ రాకుండా అతనికి రావడం ఏమిటి? ఎన్ని పైరవీలు జరిపి ఉంటాడో… అతను ఆవిష్కర్తగా ఉన్న సభలో నేను గౌరవ అతిథిగా ఉండటమా? దుస్సహం’ అనుకుందామె. “సారీ కామేశం గారూ. మీ కథలు కొన్ని చదివాను. బాగా రాస్తారు. మీ సభకు రావాలని చాలా కోరిగ్గా ఉంది. కానీ ఏం చేద్దాం చెప్పండి. అమెరికా నుంచి మా అమ్మాయీ అల్లుడూ పిల్లాపాపల్లో ఆ రోజే దిగుతున్నారు. ఎయిర్‌పోర్ట్ కెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. యింట్లోకూడా బోలెడంత పని ఉంటుంది. వాళ్ళకోసం పిండివంటలు వండాలిగా. ఏమీ అనుకోకండి” అంది ముక్తాయింపుగా.

మరో రచయిత్రికి ఫోన్ చేద్దాం అన్నాడు అశోక్.

“వద్దు. ఇలా అడిగి లేదనిపించుకోవడాలు నాకిష్టం లేదు. ఎవరో దేనికి? నువ్వే గౌరవ అతిథిగా ఉండు” అన్నాడు కామేశం..

తన గురువుగార్ని పిలవకున్నా తనను తప్పకుండా వేదిక మీద సముచిత గౌరవస్థానంలో కూచోబెడ్డాడని ఎదురుచూసి నిరాశ పడ్తోన్న అశోక్ మొహం ఒక్కసారిగా విప్పారింది. ఐనా పైకిమాత్రం మొహమాటపడ్తున్నట్టు నటిస్తూ “నేనా? నాకంటే గొప్ప సాహితీవేత్తలు చాలామంది ఉన్నారుగా. వాళ్ళలో ఎవరో ఒకర్ని పిలిస్తే బావుంటుంది” అన్నాడు.

‘నువ్వు కూడా గొప్ప సాహితీవేత్తవే. నీకేం తక్కువ’ అని కామేశం అనాలని అతని కోరిక.

“ఈ కథా సంపుటి పుస్తక రూపంలో రావడానికి ముఖ్య కారకుడివి నువ్వు. నువ్వు లేకుండా ఎలా చెప్పు” అన్నాడు కామేశం.

తను ఆశించిన పొగడ్త రానందుకు నిరాశపడినా, నువ్వు లేకుండా ఎలా చెప్పు అన్నందుకు సంతోషపడి ఒప్పుకున్నాడు.

ఆహ్వాన పత్రికలు పోస్ట్ చేయడం అయిపోయింది. సభ ఇంకో మూడు రోజుల్లో ఉందనగా అందరికీ ఫోన్లు చేసి ఆహ్వానించాలని చెప్పాడు అశోక్.

“ఇన్విటేషన్ కార్డులు పంపించాంగా. మళ్ళా ఫోన్లు దేనికి?” అన్నాడు కామేశం.

“ఈ బిజీ జీవితంలో మనం పంపిన ఆహ్వాన పత్రికలో ఏం రాసి ఉందో ఎవరికి గుర్తుంటుంది? ముఖ్యంగా తేదీ, వెన్యూ రెండూ పదేపదే గుర్తు చేయాలి. మీటింగ్ రోజు కూడా ఉదయం మరోసారి అందరికీ ఫోన్లు చేయడం మర్చిపోవద్దు”

“పెళ్ళికి కూడా ఇలా ఇన్నిసార్లు పిలవరేమో అశోక్. నేను చేయను. వస్తే వస్తారు లేకపోతే లేదు”

“ఇంతదాకా వచ్చాక ఈ చిన్న పనికి అభిమానపడే ఎలా? ఇదిగో నంబర్లు. ఫోన్ కలుపు” కామేశంలో ఉత్సాహం నింపుతూ అన్నాడు అశోక్.

మొదట కథా రచయిత వినోద్ కి ఫోన్ చేసాడు. అతని పుస్తకాల ఆవిష్కరణ సభలకు రెండు మూడింటికి వెళ్ళిన పరిచయం ఉంది.

“అభినందనలు కామేశం గారూ” అన్నాక “మీరేమీ అనుకోనంటే ఓ మాట. వేదిక మీద కూచునే విషయమైతే పిలవండి. వస్తాను. సభికుల్లో ఓ సభికుడిగా రాలేను” అన్నాడు.

“ఇతనేమిటి ఇంత నిస్సిగ్గుగా అడుగుతున్నాడు? ఎంతమందిని వేదిక మీద కూచోబెట్టగలం” అంటూ వాపోయాడు కామేశం.

“పోన్లే వదిలేయి. వేరేవాళ్ళకు ఫోన్ కలుపు. రచయితలూ కవులూ చాలామంది ఉన్నారుగా మన భాగ్యనగరంలో. రెండొందలకు పైగా ఫోన్లు చేయాలి. టైం సరిపోదు. కానీయ్” అన్నాడు అశోక్.

సభ జరిగే రోజు రానే వచ్చింది. సభా సమయానికి ఓ అరగంట ముందే వెళ్ళి కూచున్నాడు కామేశం. రెండొందల యాభై ఆహ్వానపత్రాలు పోస్ట్ చేశారు. రెండొందల మందికి ఫోన్లు చేసి పిలిచాడు. కాబట్టి సగం మంది ఏవో కారణాల్లో రాకున్నా వందకు పైగా రావడం ఖాయం అనుకున్నాడు. సభ మొదలయ్యే సమయానికి ఇరవై రెండు మంది సభలో ఉన్నారు. అందులో ఏడుగురు తన కుటుంబ సభ్యులు మరియు అశోక్ కుటుంబ సభ్యులే. ఓ గంట తర్వాత మరో ఆరుగురు వచ్చి కూర్చున్నారు. రచయితలు నలుగురే వచ్చారు. వాళ్ళు కూడా నీలకంఠం అనుయాయులే.

సభ పూర్తయ్యాక దిగులుగా ఉన్న కామేశంతో అశోక్ అన్నాడు. “ఈ రోజుల్లో సాహితీ సభకు ముప్పయ్ మంది వచ్చారంటే అది చాలా విజయవంతమైన సభకింద లెక్క తెలుసా”

మరో ఆర్నెల్ల తర్వాత కామేశం పద్దెనిమిది కథల్లో తన రెండో కథా సంపుటిని పుస్తక రూపంలో తీసుకువచ్చాడు.

“ఈసారి మరింత ఆర్భాటంగా పుస్తకావిష్కరణ సభ పెడదాం” అన్నాడు అశోక్.

“వద్దు బాబోయ్. ఈ పుస్తకావిష్కరణ సభలకో నమస్కారం” రెండు చేతులూ జోడిస్తూ అన్నాడు కామేశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here