[శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ రచించిన ‘సచిత్ర భారత సంవిధానం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]ఏ [/dropcap]దేశంలోనైనా పరిపాలన సజావుగా సాగాలంటే రాజ్యాంగం అత్యంత కీలకం. దేశపు అత్యున్నత చట్టంగా రాజ్యాంగాన్ని భావిస్తారు. మన దేశపు రాజ్యాంగానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుంది.
సమాజంలోని సభ్యుల మధ్య కనీస సమన్వయం కోసం అవసరమయ్యే మౌలిక నియమాలను రాజ్యాంగం అందిస్తుంది. సమాజంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉంటుందో తెలుపుతుంది. ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తుంది. ప్రభుత్వం తన పౌరులపై విధించే కొన్ని పరిమితులను వెల్లడిస్తుంది రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగంపై కనీస అవగాహన కలిగి ఉండడం అత్యవసరం.
448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 105 సవరణల కలిగిన “మన రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి నుంచి డెబ్బైరెండేళ్ల తర్వాత కూడా అది రక్షించ వలసిన అధికారం ఇవ్వవలసిన భారత ప్రజలే దాని గురించి అవగాహన లేకుండా మిగిలి పోయారు. రాజ్యాంగసభ సభ్యులు అది సామాజికంగా పరివర్తన చెందే పత్రమనీ, దేశ మూలస్తంభమనీ కార్యనిర్వాహక, శాసనపరమైన అతిక్రమణలను వివక్షనూ మెజారిటీ పోకడలను వ్యతిరేకించే బలమైన అడ్డుగోడలా నిలుస్తుందనీ ఆశించారు” అన్నారు రచయిత్రి.
“రాజ్యాంగం భారత పౌరులమైన మన కోసం మన గొంతుకగా మాట్లాడుతుంది. అందుచేత ఈ అతి ముఖ్యమైన పత్రాన్ని పౌరులమందరమూ, ప్రత్యేకించి పిల్లలు, యువత సవివరంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది” అని వ్యాఖ్యానించారు రచయిత్రి తమ ముందుమాటలో. ఆ దిశగా సాగింది ఈ పుస్తక రచన. ఈ ‘సచిత్ర భారత సంవిధానం’ పిల్లలు, యువతకు భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం, కూర్పు, విశేషతల గురించిన అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడినది. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు, మూలభూత సిద్ధాంతాల గురించిన జ్ఞానాన్ని పిల్లలలో, యువతలో వికసింపజేయటం ఈ పుస్తకం పరమావధి అని పేర్కొన్నారు.
ఆ లక్ష్యాన్ని చక్కగా సాధించిన పుస్తకం ఇది.
***
పన్నెండు ప్రకరణలుగా ఈ పుస్తకంలో రాజ్యంగం గురించి వివరించారు రచయిత్రి.
మొదటి ప్రకరణం ‘రాజ్యాంగం అంటే ఏమిటి?’ అని వివరిస్తుంది. “విభిన్న మతాలు, వివిధ భాషలు, అనేకానేక ప్రాంతాలో కూడిన భారతదేశం వంటి విశాల, విస్తృత దేశంలో మనల్ని ఏకం చేసింది రాజ్యాంగం ఒక్కటే” అని వ్యాఖ్యానించారు రచయిత్రి. ఎంతో అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఈ ప్రకరణంలో 1950ల నాటి భారతదేశాన్ని ప్రస్తావించారు. దేశ విభజన సమస్యలు, బెంగాల్ కరువు వంటి కఠినమైన సమస్యలను అధిగమించి పురోగతి సాగిన ప్రస్థానాన్ని తెలిపారు.
రెండవ ప్రకరణం ‘రాజ్యాంగ పీఠిక’ను విశ్లేషిస్తుంది. భారతపౌరులుగా రాజ్యాంగంలో మనం ఎందుకు ముఖ్యులమో చెప్పిన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి సందేశం – రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పౌరుల పాత్రను తెలుపుతుంది
మూడవ ప్రకరణం ‘రాజ్యాంగ సభ/పరిషత్’ గురించి, రాజ్యాంగ సభ ఏర్పాటు తీరుతెన్నులు, పరిషత్‌లో వివిధ కమిటీలు, వాటి కృషి గురించి తెలుపుతుంది. జలియాన్‍వాలా బాగ్ దురంతాన్ని వివరిస్తుంది. స్వాతంత్ర్య పోరాటం జరిగిన తీరుని గుర్తు చేస్తుంది.
నాలుగవ ప్రకరణం మన ‘సంవిధాన సభానాయకుల’ గురించి; సరోజినీ నాయుడు, సుచేతా కృపలానీ, ఏనీ మాస్కరీన్, అమ్రిత్ కౌర్, లీలా రాయ్, విజయలక్ష్మి పండిట్, అమ్ము స్వామినాథన్, దాక్షాయణి వేలాయుధన్, బేగం ఐజాక్ రసూల్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, హంసా జీవరాజ్ మెహతా వంటి రాజ్యాంగ సభలోని మహిళాసభ్యుల గురించి తెలుపుతుంది. ఆదివాసుల హక్కుల కోసం శ్రీ జైపాల్ సింగ్ మూండా చేసిన మరువరాని కృషిని వెల్లడిస్తుంది. రాజ్యాంగ నిర్మాణంలోని తెర వెనుక మేధావులను పరిచయం చేస్తుంది. నాటి తాత్కాలిక ప్రభుత్వ సారథి నెహ్రూ, డాక్టర్ బాబూ రాజేందప్రసాద్, సర్దార్ పటేల్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎస్‌ఎన్ ముఖర్జీ, బెనెగల్ నరసింగరావు వంటి వారి గురించి వివరిస్తుంది.
ఐదవ ప్రకరణం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులను స్పష్టంగా తెలియజేస్తుంది. వారి పరిధి ఎంత వరకో వివరిస్తుంది. హక్కులను కోరుకునేవారు బాధ్యతలను కూడా తెలుసుకోవాలి.
ఆరవ ప్రకరణం మన ప్రభుత్వం పనితీరును, కార్య నిర్వాహక వర్గం నిర్మాణాన్ని, శాసనసభ, భారత న్యాయవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ – వంటి వ్యవస్థలు ఎలా పని చేస్తాయో వివరిస్తుంది. కేశవానంద భారతి కేసుని ఉదహరించి భారతదేశానికి రాజ్యంగం ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో సుప్రీం కోర్టు తెలియజెప్పిందని అంటారు రచయిత్రి.
ఏడవ ప్రకరణం గణతంత్ర భారతం గురించి తెలియజేస్తుంది. “భారతదేశంలో ఎవరూ ఎవరికీ లోబడి ఉండనవసరం లేదని, ఎవరూ మరొకరి కంటే తక్కువ కాదని దళితులు, గిరిజనులు అర్థం చేసుకున్నారు” అని రచయిత్రి వ్యాఖ్యానించడం ఆ వర్గాలకు రాజ్యంగం చేసిన మేలుని చెప్పకనే చెబుతుంది. ఈ ప్రకరణంలో 1952నాటి తొలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. స్వతంత్ర భారతంలో తొలి ఓటరు శ్యామ్‍చరణ్ నేగి గారి ఫోటో ఇవ్వడం ముదావహం. భారతదేశపు మొదటి రెండు ఎన్నికలను సజావుగా నిర్వహించిన అప్పటి ప్రధాన ఎన్నికల కమీషనర్ సుకుమార్ సేన్ గారి గురించి ఎన్నో వివరాలు అందించారు. ఈ ప్రకరణం చివర దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వార్తకి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిపింగ్స్ జోడించారు.
రాజ్యాంగం స్వీకరించిన గణతంత్ర చిహ్నాలను ఎనిమిదవ ప్రకరణం ప్రస్తావిస్తుంది. మన గణతంత్రం కోసం భారత రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకాన్ని జాతీయపతాకంగా, జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా, వందేమాతరంను జాతీయ గేయంగా, సారనాథ్ స్థూపంలోని అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించిందని తెలిపారు రచయిత్రి. జాతీయ చిహ్నంలోని గుర్రం, ఎద్దు వేటిని సూచిస్తాయో తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగోర్ మొదటిసారిగా జాతీయగీతాన్ని ఆలపించి, ఆంగ్లంలోకి అనువదించిన మదనపల్లి పాఠశాల ఫోటోని ఈ అధ్యాయంలో అందించారు రచయిత్రి. అధికార భాషల గురించి ఈ ప్రకరణంలో తెలియజేశారు.
భారతీయ సంవిధానం అన్ని విధాలుగా భారతీయ సాంస్కృతిక వారసత్వ పరంపరకు, ప్రస్థానానికి ప్రాతినిధ్యం వహించటం సముచితమని రాజ్యాంగ సభ్యుల అభిప్రాయం. అందుకని భారత రాజ్యాంగాన్ని చిత్రాలతో అలంకరించే బాధ్యతను ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్‌కు అప్పగించారు. బోస్ ఆధ్వర్యంలో కృపాల్ సింగ్ షెకావత్, వ్యోహర్ రామ్ మనోహర్ సిన్హా తదితరులు ఆధ్వర్యంలో రాజ్యాంగానికి తగినట్టు చిత్రాలను గీశారు. ఈ మహాయజ్ఞంలో గౌరీ ఖాంజా, జమునా సేన్, నిబేదితా బోస్, సుమిత్రా నారాయణ్, అమలా సర్కార్, బానీ పటేల్ వంటి మహిళలు ఉండడం విశేషం. ఈ వివరాలన్నీ తొమ్మిదవ ప్రకరణం ‘సచిత్ర భారత చరిత్రగా భారత రాజ్యాంగం’లో పొందుపరిచారు. “మన రాజ్యాంగంలోని చిత్రాలు భారతీయ కళ నుంచి ప్రధానంగా ఎన్నుకోబడిన అంశాలను ఉపయోగిస్తూ స్వదేశీ పద్ధతులతో చిత్రితమై, ఉజ్జ్వల భారతదేశ చరిత్రను నిర్మిస్తాయి” అని వ్యాఖ్యానించారు రచయిత్రి. ఈ ప్రకరణంలో భారత రాజ్యాంగం విశిష్టతల గురించి, మొదటి గణతంత్ర దినోత్సవ సంబరాల గురించి, రాజ్యాంగ నిర్మాణం గురించి, రాజ్యాంగ తత్త్వం గురించి తెలియజేశారు.
పదవ ప్రకరణంలో యువత, బాలల కోసం రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా వివరించారు. హక్కులు అంటే ఏమిటి? హక్కుల భావన, అధికారాలు, పిల్లలు – వారి హక్కులు, భారత రాజ్యాంగ, రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు, సమానత్వ హక్కు, వాక్స్వాతంత్ర వ్యక్తీకరణ హక్కు, నిర్బంధ నివారణ చట్టం, దోపిడి నివారణ చట్టం, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక, విద్యా హక్కు, రాజ్యాంగ పరిహారాల హక్కు గురించి క్లుప్తంగా వివరించారు.
స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి ప్రత్యేక ప్రకరణంలో ప్రస్తావించారు. ప్రాచీన కాలం నుంచి మనదేశంలో ఉన్న గ్రామ పాలన వ్యవస్థల గురించి తెలియజేసి, ప్రస్తుతం మన దేశంలో ఉనికిలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలైన పంచాయత్ రాజ్, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ గురించి – పట్టణ స్థానిక సంస్థలైన నగర పంచాయిత్, పురపాలక సంఘం, నగర పాలక సంస్థ, కంటోన్‍మెంట్ బోర్డ్, పోర్ట్ ట్రస్ట్ బోర్డ్ గురిచి తెలిపారు.
పన్నెండవ ప్రకరణంలో – రాజ్యాంగ శబ్దకోశం పదాలను పేర్కొని, వాటి అర్థాలు వివరించారు.
చిన్నప్పుడు సాంఘిక శాస్త్రం పాఠాలలో భారత రాజ్యాంగ దృఢమైనది మరియు సరళమైనది (both rigid and flexible) అని చదువుకున్నాం. ఈ పుస్తకం చదివితే భారత రాజ్యాంగపు ఈ లక్షణాన్ని మనం సులువుగా అర్థం చేసుకోగలుగుతాం.
ఈ పుస్తకంలో అలనాటి ప్రముఖుల చిత్రాలను అందిస్తూ, వారి కృషిని తెలియజేయడం వల్ల ఆ మహనీయులను మరోసారి స్మరించుకునే అవకాశం దక్కింది. ఈ పుస్తకం భారత రాజ్యంగంపై అవగాహనను కల్పించడమే కాకుండా, పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతీయువకులకు ‘రిఫరెన్స్ బుక్’గా ఉపకరిస్తుంది. శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారి కృషి అభినందనీయం.
***
కూర్పు, రచన: శ్రీదేవీ మురళీధర్
పేజీలు: 188
వెల: ₹ 600
ప్రతులకు:
ఈమెయిల్: projectnishedh@gmail.com
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 90004 13413
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/sachitra-bharata-samvidhanam