Site icon Sanchika

సద్గురువు ప్రాశస్త్యం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సద్గురువు ప్రాశస్త్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్లో:

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా।

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః॥

అజ్ఞానం అనే చీకట్లను తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించే వారు గురువులు. అటువంటి గురువులకు నేను సర్వదా కృతజ్ఞతతో ఉంటాను అన్నది పై శ్లోకం యొక్క భావం.

ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో, గురువు పాత్ర అంతకుమించి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేసేది, వారు ఎంచుకున్న రంగంలో వారి ప్రయాణం సాగేలా చేసేది గురువులే. ఉత్తముడైన గురువు మాత్రమే మార్గదర్శనం చేయగలడు. అజ్ఞానపు అంధకారాన్ని తొలగించే వ్యక్తి మాత్రమే అసలైన గురువు.

విద్యాగర్వం గురువుకు ఉండరాదంటారు సాయి. గురువు శిష్యులకు విద్య, విజ్ఞానం, వినయం నేర్పాలి తప్ప అహంకారానికి చోటు ఇవ్వకూడదు. ఇలాంటి వివేచన వున్న గురువు మాత్రమే తన శిష్యుల్ని కరుణతో దగ్గరకు తీసుకొని జ్ఞానబోధ చేయగలడని, ఆత్మజ్ఞానాన్ని ప్ర సాదించగలడని సమర్ధ సద్గురువు శ్రీ సాయిబాబా తరచుగా చెప్పేవారు.

పరబ్రహ్మ స్వరూపాన్నే ‘గురువు’ అనే పర్యాయపదం పరమేశ్వరుడు ఆపాదించారు. శివుడు జ్ఞానగురువుగా, విశ్వ గురువుగా ‘దక్షిణామూర్తి’ రూపంలో గోచరిస్తుంటే, శ్రీకృష్ణ పరమాత్మ ‘జగద్గురువు’గా కీర్తించబడుతున్నారు.

అట్లే సద్గురు అంటే విద్య లేని గురువు అని. ఎవరైనా తమ పాండిత్యం వల్ల ఏదైనా చెప్పగలిగినప్పుడు, మనం వారిని ఎన్నో విధాలా సంబోధిస్తాం. కానీ, ఎవరైతే తమ అంతర్ముఖ అనుభవంవల్ల చెప్పగలుగుతారో వారిని మనం సద్గురు అని అంటాం. సద్గురు అనేది ఒక సంబోధన కాదు. ఇది ఒక విశ్లేషణ అని సద్గురువు శ్రీ జగ్గీ వాసుదేవ్ సద్గురువు ప్రాభవం గురించి చక్కగా చెప్పారు.

‘ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే’ ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడాలేదు అని వేదశాస్త్రం స్పష్టంగా చ్గెబుతోంది. మానవులు సృష్టిలో భగవంతున్ని స్వయంగా తమంతట తాముగా  చేరుకోలేరు. స్వప్రయత్నంతో భగవంతుడిని చేరుకోవడం కష్టం కాబట్టి గురువు ఆవశ్యకత తప్పనిసరి.

సామాన్య జనులు అనుకునే ‘నేను’ దేహమూ కాదు మనసూ కాదు, బుద్ధీ కాదు, అహంకారమూ కాదు, చిత్తమూ కాదు. ఇది వాటికి అతీతమైనది. అందరిలోనూ ఉన్నది. అన్ని జీవుల్లోనూ ఉన్నది. అంతటా ఉన్నది. దానినే ‘ఆత్మ’ అంటారు. అది అవిచ్ఛిన్నం. దాన్ని అన్వేషించి తెలుసుకున్న వారికి ఏ బంధం ఉండదు. ఏ బాధా ఉండదు. అతడు సచ్చిదానందమూర్తి ఆత్మయే మానవునికి మార్గదర్సకత్వం చేస్తుంది అని ప్రతీ సాధకునికీ ఆత్మయే గురువు అని భగవాన్ రమన మహర్షి చెప్పేవారు.

ప్రతీ సాధకునికీ గురువు నిశ్చయంగా అవసరం అని, గురువుతప్ప మరెవ్వరూ, బుద్ధి ఇంద్రియాలకు సంబంధించిన విషయ కీకారణ్యం నుంచి మానవుణ్ణి బైటికి తీసి రక్షించలేరని ఉపనిషత్ పేర్కొంటుంది. అయితే ఈ కలియుగంలో ధర్మం భ్రష్టు చెందడం వలన అనేక మంది ఆత్మ సాక్షాత్కారం పొందకుండానే ఆత్మజ్ఞానం బోధిస్తారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా వుండాలి శ్రీ సాయి ఆనాడే మానవాళికి బోధించారు. కాబట్టి ముందు ఒక సమర్ధుడైన సద్గురువు కోసం భగవతుడుడిని చిత్తశుద్ధితో ప్రార్థించాలని, భగవంతుని కృప కలిగాకనే మన జీవితాలలోకి సద్గురువు ప్రవేశం జరుగుతుందని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం.

ఆధ్యాత్మికత అంటే లోకం నుంచి పారిపోవడం కాదు, లోకంలో తన పాత్రను నిర్వహిస్తూనే మోక్షాన్ని సాధించడం అని భారతీయులకు తెలుసు. భక్తి మనల్ని బలహీనులుగా చేయలేదు సరికదా, ఎప్పటికప్పుడు జీవితాన్ని ఎదుర్కొనే బలాన్ని అందించింది. ఒక వర్గానికి ఆధ్యాత్మిక గురువుగా ఉంటూనే భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక మలుపు తిప్పిన ‘సద్గురు రామ్ సింగ్జీ’నే ఇందుకు గొప్ప ఉదాహరణ.

Exit mobile version