Site icon Sanchika

సద్గురువు వైశిష్ట్యం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సద్గురువు వైశిష్ట్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఈ[/dropcap] సృష్టి అంతటికీ మూలకారణమైన ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడు సర్వ జీవులను సృష్టించి అందరికీ తండ్రి అయ్యాడు. పంచభూతముల వలె తన నుండి సకల జీవ కోటికి దేహం, పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. మానవులందరికి సన్మార్గం చూపించడం కోసం, వారికి వారికి ధర్మయుతమైన జీవితం జీవింపజేయడం కోసం వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు అనుగ్రహించి ఆప్త వాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. ఈ సకల సృష్టిలో సృష్టి, స్థితి, లయ గావించి ఈశ్వరుడయ్యాడు. అటువంటి ఆ భగవంతుని మరొక స్వరూపమే సద్గురువు. అందుకే ఆ సద్గురువు త్రిమూర్తులతో సమానమని, సద్గురువే తల్లి, తండ్రి, పరబ్రహ్మమని గురుగీత చెబుతోంది.

కలి కాలపు ప్రభావంలో చిక్కుకొని అనుక్షణం ఎన్నో బాధలకు గురవుతున్న మానవాళికి తగు రీతిన సన్మార్గం చూపి, వారిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎన్నో రూపాలలో ఈ భువిపై అవతరిస్తూ వుంటాడు. తన సశరీరుడుగా వున్నప్పుడే కాక శరీరం విసర్జించిన తర్వాత కూడా తనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఈ అవతార కార్యాన్ని నెరవేరుస్తుంటాడు. అటువంటి మహనీయులలో అగ్రగణ్యులు, మహోన్నత శక్తి సంపన్నులు, భక్తుల పాలిటి కల్పవృక్షము, కామధేనువు శ్రీ శిరిడీ సాయినాథులు.

మహారాష్ట్ర లోని గోదావరీ పరీవాహక ప్రాంతమైన అహ్మద్‌నగర్ జిల్లా లోని శిరిడీ గ్రామంలో సుమారు 60 సంవత్సరాలు సంచరించి ఎందరో లక్షలాది భక్తులను అనుగ్రహించి ఆశీర్వదించి వారిని జ్ఞాన మార్గంలో నడిపించారు. జ్ఞానం స్వశక్తితో లభించదు. దానికి గురువు యొక్క ఆవశ్యకత తప్పని సరిగా ఉండాలి. వేద, శాస్త్రాధ్యయనాలు, పురాణ పఠణం, యజ్ఞ యాగాది కర్మకాండలు మనో నైర్మల్య దోహదాలే తప్ప, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇప్పించలేవు. బాబా వారి బోధలు విన్నూత రీతిలో వుండి భక్తులకు అర్థమయ్యే రీతిలో వుండేవి. ఆయన సమయానికి, సందర్భానికి అనుకూలంగా వుండే బోధలను చేసేవారు. తనను నమ్మిన వారిని సన్మార్గంలో నిలపడానికి, వారిలో అజ్ఞానాన్ని రూపు మాపడానికి, భక్తుల సంస్కారానికి తగినట్లుగా బోధ చెయ్యడం ఆ సమర్థ సద్గురువుకే సాధ్యం.

మాయాజగత్తులో ప్రవేశించి అజ్ఞానంతో ప్రేమానుబంధాలు, ఆశామోహాలతో పాటు అరిషడ్వర్గాలలో చిక్కుకొని జనన మరణ చక్రభ్రమణంలో కొట్టుకుపోతున్న మానవుణ్ణి బంధవిమోచనం చేసి హృదయలోతుల్లో నిక్షిప్తమైన జ్ఞాననిధిని వెలికి తీసుకురాగలవారు, భౌతికమైన స్వరూపాలకు అతీతమైన దైవానుభవం కల్గించేవారు, దేవాలయమనే దేహంలో దైవత్వాన్ని దర్శింపజేసేవారు, ఆత్మను పరమాత్మలో చేర్చగలవారే నిజమైన సద్గురువులు. ‘తమసోమా జ్యోతిర్గమయా’ – అజ్ఞానమనే చీకట్లును పోగొట్టి జ్ఞానమనే వెలుగులను నింపే సమర్థుడే సద్గురువు.

‘ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే’ – ఈశ్వరుడు, సద్గురువు, ఆత్మ ఒక్కటే. మూర్తి భేదభావమే తప్ప తేడా లేదు. కాబట్టి సద్గురువును ఈశ్వరుడిగా, పరమేశ్వరుడిగా, మనం నిత్యం ఆరాధించే దైవంగా త్రికరణశుద్ధితో నమ్మి కొలవడం ఎంతో అవసరం.

Exit mobile version