సద్గురువుకు సర్వస్య శరణాగతి

0
2

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సద్గురువుకు సర్వస్య శరణాగతి’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]క్త పంతు అనే ఒక సద్గురువు శిష్యునికి శిరిడీలో కలిగిన గొప్ప అధ్యాత్మిక అనుభూతి గురించి ఇక్కడ స్మరించుకుందాము. ఈ లీలను జాగ్రత్తగా శ్రవణం చేసి, మననం చేస్తే గొప్ప గొప్ప అధ్యాత్మిక రహస్యాలు మనకు అవగతం అవుతాయి.

పంతు అనేవాడు ఒక సందర్భంలో శిరిడీ వచ్చాడు. అది కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అతను విరార్ గ్రామంలో నివసించే ఒక గురువుకు ముఖ్య శిష్యుడు. అతను బి బి రైల్వేలో పని చేస్తుండేవాడు. ఒకసారి రైలులో ప్రయాణం చేస్తుండగా అతని బంధువులు, స్నేహితులు కలిసి తామందరూ శిరిడీకి శ్రీ సాయి దర్శనార్థం పోవుచున్నారు కాబట్టి సరదాగా పంతును కూడా తమతో రమ్మన్నారు. వారి విజ్ఞాపనను కాదనలేక ముందుగా విరార్‌లో తన గురువును దర్శించి, శిరిడీ యాత్రకు అనుమతి పొంది తర్వాత యాత్రకు కావలసిన ధనాన్ని సమకూర్చుకొని తర్వాత అందరితో కలిసి శిరిడీ వెళ్ళాడు. మనము ఏ ఇతర గురువును దర్శించాలన్నా ముందుగా మన గురువు యొక్క అనుమతి తీసుకోవాలన్నది మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి నియమం. అందరూ మశీదు చేరి బాబా దర్శనం చేసుకున్నారు. ఆ రోజు మశీదు చాలా కోలాహలంగా వుంది. ఎందరో భక్తులు తమకు తోచిన విధంగా శ్రీ సాయికి పూజలు చేస్తున్నారు. రకరకాల కోరికలు కోరుతున్నారు. అన్ని రకములైన దుఖముల నుండి నివారణ పొందుతున్నారు. కష్టాలు, అనారోగ్యం సమస్యలు, మానసిక సమస్యలు, చింతనలు తీర్చుకొని ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. వారందరినీ చూసిన భక్త పంతుకు ఎంతో ఆనందం కలిగింది. అంతలో పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడిపోయి నురగలు కక్కసాగాడు. అందరూ భయపడ్దారు. ఇంతలో శ్రీ సాయి తన ఆసనం నుండి లేచి వచ్చి నీళ్ళు జల్లి ఆశీర్వదించగా పంతుకు తెలివి వచ్చి లేచి కూర్చున్నాడు. అప్పుడు అతనికెంతో ఉపశమనం కలిగింది. కృతజ్ఞతతో ఆనందాశృవులు చిందించే కళ్ళతో బాబాకు నమస్కారం చేసాడు.

సర్వజ్ఞుడైన శ్రీ సాయి పంతు మరొక గురువుకు శిష్యుడని తెలుసుకొని అతనితో చిరునవ్వుతో “నీకెన్ని ఆపదలైనా రానివ్వు. ఎన్ని కష్టాలు, సమస్యలు, చుట్టుముట్టినా నీ ఆధారాన్ని విడువరాదు. నీ గురువు నందే నమ్మకం వుంచుకొనుము. మనస్సును నిలకడగా వుంచి ఆయన ధ్యానం నందే దృష్టిని నిలుపుము. అది నీకెంతో మేలు చేస్తుంది” అని ఆశీర్వదించి ఉదీ ప్రసాదాలను ఇచ్చారు.

బాబా మాటలలోని ప్రాముఖ్యాన్ని గ్రహించిన భక్త పంతుకు చెప్పరాని ఆనందం కలిగింది. సద్గురువు స్థానంలో వున్న శ్రీ సాయి ఆ స్థాయికి తగినట్లుగా వుపదేశం ఇచ్చారు. జీవితంలో ఒకసారి గురువు నిశ్చయం చేసుకున్నాక ఇక ఆ నిర్ణయాన్ని ఎట్టీ పరిస్థితులలోనూ మార్చరాదు. రోజు కొక గురువు, గంట కొక సిద్ధాంతాన్ని మార్చే సాధకులకు అధ్యాత్మిక జాగృతి అనేది అందని ద్రాక్ష. మనకేం సమస్యలు వచ్చినా, ఏ కోరికలు తీరాలన్నా వాటిని మన సద్గురువునే అడగాలి గాని తెగిన గాలిపటం వలే దిశా, నిర్దేశం లేక అటూ ఇటూ పరిగెత్త రాదని శ్రీ సాయి అభిప్రాయం. దీనినే అవ్యభిచారిణీ భక్తి అని అంటారు. చరిత్రలో అవ్యభిచారిణీ భక్తి మార్గం ద్వారా మోక్షం సాధించిన భక్తా గ్రేసరులెందరో మనకు కనిపిస్తారు. వారందరూ మనకు ఆదర్శం, స్ఫూర్తి కావాలి. క్షణ క్షణానికి గురువులను, దేవుళ్ళను మార్చేవారు వ్యభిచారిణీ భక్తి మార్గంలో నడిచేవారని, అట్టి వారికి ఎన్ని జన్మలకైనా మోక్షం కలగదని శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి అద్భుతమైన, నిగూఢమైన శాస్త్ర రహస్యాన్ని ఒక చిన్న లీల ద్వారా మనందరకూ అర్థమయ్యేలా తెలియజేసిన శ్రీ సాయికి మననందరం కృతజ్ఞతలను అర్పించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here