సాధించెనే ఓ మనసా!-10

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 10వ భాగం. [/box]

[dropcap]స[/dropcap]మయం ఆరున్నర దాటింది. పద్మ బ్యాంకులో బిజీగా ఉండేది. కంప్యూటర్ స్క్రీన్ నుండి దృష్టి మరల్చకుండానే తన కోసం ఎవరో వచ్చారని ఆమె గ్రహించింది. రోజు ముగింపులో కస్టమర్లను చూడడానికీ, మాట్లాడానికీ ఆమె ఇష్టపడదు.

ఒక నిమిషం తరువాత విజిటర్‌ని పలకరించడానికి తలెత్తింది.

“ఓ మై గాడ్! మాల్య, నువ్వా? ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది.”

లోపల్లోపల పద్మ ఆలోచనల్లో ఉంది. తమ బ్రాంచ్ మైలాపూర్ నడిబొడ్డున ఉన్నప్పటికీ, మాల్యకి ఆ ప్రాంతంలో చాలా మంది క్లయింట్లు ఉన్నప్పటికీ మాల్య గతంలో తన బ్యాంక్‌కి రాలేదు. మాల్య ఇలా చెప్పకుండా హఠాత్తుగా రావడం అంటే విషయం ఏదో ఉంది. అది సమస్యే!

“లజ్ అవెన్యూలోని నా క్లయింట్ సైట్‌కి వచ్చాను. నీతో మాట్లాడాలని అనిపించింది. నాకు ఒక సమస్య ఉంది, పద్మ. అది నా బుర్రని తినేస్తోంది. దాని గురించి నీతో తప్ప ఎవరితోనూ మాట్లాడలేను.”

“ఒక్క ఐదు నిమిషాలు మాల్య. నేను సిస్టమ్‌లో ఈ రోజు ట్రాన్సాక్షన్స్ క్లోజ్ చేస్తున్నాను. అది పూర్తయిన తర్వాత నా పని అయిపోతుంది. మనం కాఫీకి శరవణ భవన్ వెళ్దాం.”

మాల్యా తల ఊపింది.

***

“చెప్పు, మాల్య. సమస్య ఏమిటి? అది శివకి సంబంధించినదా?”

“అవును.”

వాళ్ళు మైలాపూర్ లోని శరవణ భవన్ నాన్-ఎసి సెక్షన్‌లో వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగుతున్నారు.

“ఈ మధ్య శివ చాలా సంతోషంగా ఉండడం గమనిస్తున్నాను.”

“పద్మా, శివ ఈ ఉద్యోగంలో చేరినప్పుడు, అతని జీతం 6000 రూపాయలు మాత్రమే. మొత్తం జీతం నాకు లేదా అమ్మకు ఇచ్చేవాడు. తన రోజువారీ ఖర్చులకు కొద్దిగా డబ్బు తీసుకునేవాడు.

ఇప్పుడు ప్రమోషన్ తరువాత జీతంగా 15000 రూపాయలు వస్తున్నాయి. గత ఐదు నెలలుగా అతను ఇంట్లో డబ్బు ఏమీ ఇవ్వడం లేదు. తన ఖర్చుల కోసం యథావిధిగా డబ్బు తీసుకుంటున్నాడు.

ఇది కాక గత వారంలో కొన్ని ‘ముఖ్యమైన ఖర్చులు’ కోసం 30000 రూపాయలు అడిగాడు. ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. పద్మా, తిరస్కరించే మనసు నాకు లేదు. పాపం, వాడు గతంలో నన్నెప్పుడూ డబ్బు అడగలేదు.”

“ఓ మై గాడ్!” అని పద్మ గట్టిగా అంది. దాంతో ఇతర కస్టమర్ల దృష్టి వీరిపై పడింది.

“ఏమైంది పద్మా?”

“మూడు రోజుల క్రితం శివ వచ్చి నా దగ్గర 20000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, కొన్ని ‘ముఖ్యమైన ఖర్చులు’ అని”

“పద్మా, ఇప్పుడు మరీ భయపడాల్సిన అవసరం లేదు. శివ పార్టీలకో, స్నేహితులలో, తినడానికో, సినిమాలకో డబ్బు ఖర్చు చేస్తే నేను పట్టించుకోను. కానీ నా భయమల్లా – శివ మద్యం లేదా మాదకద్రవ్యాల వంటి దుర్గుణాలు అలవాటు చేసుకుంటాడేమోనని! ఈ విషయం అమ్మకు తెలిస్తే, ఆందోళన పడుతుంది.”

“మాల్య, ఈ సమస్యకు మరో వైపు నుంచి చూద్దాం. గత, రెండు మూడు నెలలుగా శివ ఇంటికి రాత్రి పది, పదిన్నర దాటాకానే వస్తున్నాడు. తన బాస్ సిబ్బందిని సాయంత్రం 6 గంటలు దాటాకా పనిచేయనివ్వదని చెప్పాడు గుర్తుందా? వాడి దగ్గర చాలా డబ్బు ఉంది. పైగా ఆలస్యంగా వస్తున్నాడు. నేను నిజంగా భయపడుతున్నాను, మాల్య.”

మాల్య ముఖం అకస్మాత్తుగా ప్రకాశించింది.

“ఒక ఆలోచన తట్టింది. మనం శివని నేరుగా అడగలేము. వాడి మనసు గాయపడుతుంది. వాడు నిజంగా దారితప్పినట్లయితే ఎలాగూ నిజం చెప్పడు. అందువల్ల మనం శివ బాస్ సంజనతో ఈ సమస్య గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఆమె సలహా మేరకు ఎందుకు నడుచుకోకూడదు?”

“మంచి ఆలోచన. నీ దగ్గర తన ఫోన్ నెంబర్ ఉందా?”

“ఉంది.”

***

“గుడ్ ఈవినింగ్, సంజనా. నేను మాల్య, శివ అక్కని.”

“గుడ్ ఈవినింగ్, మాల్య. వాట్ ఎ ప్లెజంట్ సర్‌ప్రైజ్?”

“సంజనా, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. నేను శివని మొబైల్‌లో చేరుకోలేకపోయాను. వాడేమయినా నీ దగ్గరలో ఉన్నాడా?”

“ఇందాకే వెళ్ళిపోయాడు. సాధారణంగా నేను అతన్ని ఆరు గంటల తర్వాత పని చేయనివ్వను. ఇంట్లో ఏదో ముఖ్యమైన పని ఉందని, అతను ఒక నెల లేదా నెలన్నర ప్రతిరోజూ సాయంత్రం 5.30 కల్లా వెళ్లాలని చెప్పాడు. అతను ఉదయం పూట కూడా కాస్త ఆలస్యంగానే వస్తున్నాడు. కానీ అతని పనిలో ఎలాంటి సమస్యలు లేవు. కాబట్టి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు.”

మాల్య మరింత ఆందోళన చెందింది. ఆమె తన ఆందోళనను సంజనతో పంచుకోగలదా? కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు. ఆమె అనుకున్నదానికంటే సమస్య చాలా తీవ్రంగా ఉంది.

“సంజన, నేను నీతో ఓ సున్నితమైన సమస్యను చర్చించాలనుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడవచ్చా?”

“ఒక్క నిమిషం, మాల్య. నేను క్యాబిన్ తలుపు వేసి వస్తాను.”

“చెప్పు, మాల్యా. ఏమిటి విషయం?”

“సంజన, నేను నిన్ను మా కుటుంబంలో భాగంగా భావిస్తాను. ఈ విషయం గురించి అమ్మకి కూడా తెలియదు. పద్మకీ, నాకు మాత్రమే తెలుసు. ”

“దయచేసి అసలు విషయం చెప్పు మాల్య, ఈ రకమైన సస్పెన్స్ నేను భరించలేను.”

మాల్య శివ గురించి తన ఆందోళనని వివరించింది.

“అయ్యో.. చింతించకు మాల్య. రాత్రింబవళ్ళు శివని కనిపెట్టడానికి నేనో డిటెక్టివ్ ఏజెన్సీని నియమిస్తాను. అతను ఏం చేస్తున్నాడో మనకి త్వరలో తెలిసిపోతుంది.

తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని తెలిస్తే, శివ కాళ్ళు విరగ్గొట్టి మా ఆసుపత్రిలోనే శాశ్వతంగా ఉండేలా చేస్తాను. బెంగ పడద్దు, మాల్య. నాలుగు రోజుల్లో నాకు అంతా తెలుస్తుంది. నాకు తెల్సిన విషయాలు మీకు చెప్తాను.”

“అమ్మయ్య! ఇప్పుడు మనసుకి హాయిగా ఉంది, సంజనా. నీ సహాయానికి కృతజ్ఞతలు.”

“అంత పెద్ద మాటలెందుకు, మాల్య. ఇలాంటి చిన్న సహాయం కోసం దయచేసి అంత పెద్ద పదాలు వాడకు.”

***

పద్మ మరియు మాల్యా వేడి కేసరి, ఇంకో కప్పు కాఫీని ఆర్డర్ చేసి, హోటల్‌లో మరో గంట గడిపారు. వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగింది.

అకస్మాత్తుగా పద్మ గంభీరంగా మారిపోయింది. ఆమె మాల్య చేతిని పట్టుకుని చాలా గంభీరమైన స్వరంలో మాట్లాడింది.

“ఈ దర్యాప్తులో శివ మంచివాడని తెలిస్తే, నా శివ దారి తప్పకపోతే, మాల్య, నేను వరుసగా పది శుక్రవారాలు ఘనాహారం తినను. ఒట్టు.

ఇక పదకొండవ శుక్రవారం నేను మాంగాడు మరియమ్మన్ గుడికి వెళ్లి ‘మన్ సోరూ’ చేస్తాను. నేను మొక్కుకున్నాను. పవిత్రమైన మన అమ్మ మనల్ని ఎప్పుడూ నిరాశపరచదు.”

“పద్మా, ఇంత కఠినమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావు?”

ఘన ఆహారం లేకుండా ఉండడం ఒక ఎత్తు. కానీ ఈ ‘మన్ సోరూ’ మొక్కు పూర్తిగా భిన్నమైనది. ఈ మొక్కు తీర్చుకునే రోజున… ఆలయం ఇసుక గచ్చుపై, ఆహారాన్ని… అంటే వేడి అన్నాన్ని భక్తులకి వడ్డిస్తారు.

నిజానికి ఆ గచ్చు శుభ్రంగానే ఉంటుంది. కానీ అన్నంలో ఇసుక కలుస్తుంది; కొంచెం ఇసుక కూడా తినాలి. ఆ రకమైన మొక్కుని తీవ్ర ఇబ్బందుల విషయంలో మాత్రమే మొక్కుకుంటారు.

“శివకి సంబంధించినప్పుడు ఏదీ కఠినమైనది కాదు.”

మాల్య పద్మ చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. ఆ ఇద్దరు స్త్రీలు చాలా సేపు ఆ స్థితిలోనే ఉన్నారు.

***

ఆ తరువాతి ఐదు రోజులు పద్మ, మాల్య ఉద్విగ్నంగా ఉన్నారు. సంజన నుండి ఫోన్ రాలేదు. మాల్య ఇక ఈ అనిశ్చితిని భరించలేకపోయింది. ఆమె సాయంత్రం పద్మ బ్యాంకుకు వెళ్ళింది. అప్పటికీ కూడా ఫోన్ రాకపోతే, తామే సంజనకు కాల్ చేయాలని వాళ్ళు అనుకున్నారు.

ఇద్దరు అదే హోటల్‌లో కూర్చుని కాఫీ తాగుతూండగా సంజన మొబైల్ నుంచి మాల్యకి ఫోన్ వచ్చింది.

“కంగారు పడాల్సింది ఏమీ లేదు, మాల్య. శివ ఎల్లప్పుడూ నువ్వు గర్వపడే చిన్న తమ్ముడే.

డిటెక్టివ్ ఏజెన్సీ నుండి నాకు లభించిన సమాచారం ఇది. శివ ఆసుపత్రి నుండి 5.30కి బయలుదేరి తన స్నేహితుడి షాపుకి వెళ్తాడు. అది సరే, అతని స్నేహితుడు ‘వినూ’ మీకు తెలుసా, శ్రీనివాస్ సిల్క్స్… పాండీ బజార్లో ఉంది.”

“తెలియదు”

“సరే, ఇంకా చెప్తాను. శివ రాత్రి పది, పదిన్నర వరకు అక్కడే ఉంటాడు. చాలా రోజులలో అతను ఉదయాన్నే షాపుకి వెళ్తున్నాడు, అక్కడి నుండి నేరుగా ఆసుపత్రికి వస్తాడు.

డిటెక్టివ్ ఏజెన్సీ మనుషులు కొన్ని చీరలు కొనే నెపంతో ఆ షాపులోకి వెళ్ళారు. అప్పుడు శివ షాపులో లేడు. తరువాత షాపులో మేడమీద ఒక గది ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. శివ తన సమయాన్ని అక్కడే గడుపుతున్నాడు.”

“ఈ స్నేహితుడెవరు? అతని షాపు గురించి శివ మాకు ఎందుకు చెప్పలేదు?”

“నాకు తెలియదు, మాల్య. కానీ నేను చీర కొనాలనుకున్నప్పుడు శివ నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. తను డిజైన్ చేసిన చీరను కొనేలా చేశాడు. అది అద్భుతంగా ఉంది.”

“సంజనా, నాకింకా భయంగా ఉంది. మేడమీద గదిలో ఏ తప్పు జరగదని హామీ ఏమిటి?”

“చూడు మాల్య, ఆ షాపు యజమాని నాకు తెలుసు. కాబట్టి నేను అక్కడికి వెళితే అది వార్త అవుతుంది. మనం అతనిపై నిఘా పెట్టామని శివకి తెలుస్తుంది.

మీకు అతని స్నేహితుడు తెలియదు కాబట్టి మీరో చీర కొనడానికి అక్కడికి వెళ్ళచ్చు కదా? మీరు నా స్నేహితులని, నేను ఆ షాపుని సిఫారసు చేశానని షాపు యజమానికి చెప్పండి. నా ఎర్ర చీరను డిజైన్ చేసిన వ్యక్తిని మీరు చూడాలనుకుంటున్నారని అతనికి చెప్పండి.

మీరు ఓ వివాహం కోసం ఐదు లక్షల విలువైన బట్టలు కొనబోతున్నారని అతనికి చెప్పండి. ఆ చీరలు శివే డిజైన్ చేయాలని పట్టుబట్టండి. నిజం బయటకు వస్తుంది.”

“థాంక్స్ ఎ మిలియన్, సంజవా.”

కంగారుగా ఉన్న పద్మకి మాల్యా సంభాషణాసారం వివరించింది.

“మాల్య, ఈ అమ్మాయి అందమైనది, తెలివైనది. ఇప్పుడు ఏం చేద్దాం?”

“మనం శ్రీనివాస్ సిల్క్స్‌కు వెళ్తున్నాము. ఇప్పుడే.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here