సాధించెనే ఓ మనసా!-12

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 12వ భాగం. [/box]

[dropcap]శి[/dropcap]వ ఇక ఆశాజనకమైన స్వరంలో పలికాడు.

“మీరంతా ఈ పుట్టినరోజు బాబుకు గొప్ప బహుమతులు ఇచ్చారు. క్షమించండి, నేను వాటికి తగిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేను. నేను ఈయగలిగే ఈ చిన్న కానుకలను దయచేసి అంగీకరించండి.”

అతను పార్శిల్ తెరిచి దాని నుండి చీరలు తీయడం ప్రారంభించాడు.

“ఇది అమ్మ కోసం”

ఆ ప్రశస్తమైన పట్టు చీర ప్రకాశవంతమైన జరీ అంచుతో మెరిసే తెలుపు రంగులో ఉంది. పల్లూకి మృదువైన, ఆహ్లాదకరమైన డిజైన్ ఉంది. చీర అంతా జరీ చుక్కలు ఉన్నాయి.

“ఇదేమో పిన్ని కోసం”

శివ చీరలకి పాత కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు, కాని ప్రస్తుత సంగీత దర్శకులు పాత క్లాసిక్ సాంగ్స్‌కి రీమిక్స్ చేస్తున్నట్టుగా వాటికి కొత్త రూపాన్ని ఇచ్చాడు.

ఆ చీర లేత ప్రకాశించే ఆకుపచ్చ రంగులో ఉంది. అంచుల వద్ద ముదురు గోధుమ రంగులో ఉంది. జరీ వర్క్ గొప్పగా ఉంది. పల్లూపై కళాకృతులు ఆ చీరలో ప్రధానంగా ఆకట్టుకున్నాయి.

“ఇది అక్క కోసం”

అది ప్రకాశవంతమైన నీలం రంగు చీర, అంచులు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉన్నాయి. పల్లూ మీద దేవాలయాలలో కనిపించే విగ్రహాలతో కూడిన క్లిష్టమైన డిజైన్‌ ఉంది.

చీర అంతటా సన్నని తరళితపు జరీ గీతలు ఉన్నాయి.

“ఇక ఇది మా బాస్ సంజన మేడమ్ కోసం.”

పట్టు చీరల రూపకల్పనలో ఇది సాహసోపేతమైన ప్రయోగం. సాంప్రదాయ పట్టు చీరలో ఆ రంగును సృష్టించడానికి శివుడు చాలా శ్రమించాడు.

ప్రొద్దు తిరుగుడు పువ్వు రంగు. చీరకు బోర్డర్ లేదు. జరీ డిజైన్ చీర అంతటా వ్యాపించింది. ఆ చీర రూపకల్పనలో సరళమైన ఘనత ఉంది.

“ఈ చీరలన్నింటినీ నేనే డిజైన్ చేశాను. నేను నూలు, జరీ కొన్నాను. వాటిని నా స్నేహితుడి మగ్గాలతో అల్లాను. మీరు నల్లి లేదా కుమరన్స్ వంటి పెద్ద స్టోర్స్‌కి వెళితే, ఈ చీరలు ఒక్కోటి లక్ష రూపాయలకి తక్కువ ఉండదు.”

“శివా, వీటికి ఎంత ఖర్చు చేశావు?”

ఆప్యాయతతో, ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అడిగింది పద్మ.

అందరూ ఆత్రంగా శివ వైపు చూస్తున్నారు.

మాట్లాడేటప్పుడు శివ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.

“పిన్నీ, మీరు నలుగురు లేని జీవితం నేను ఊహించలేను. అందువల్ల నేను ఎప్పుడూ ఖర్చులను పట్టించుకోలేదు. నా జీతం అంతా పెట్టుబడి పెట్టాను. ఆసుపత్రి నుండి పిఎఫ్ లోన్, ఇంకా ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చింది.

అయినా డబ్బు సరిపోలేదు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నేను నీ దగ్గరా, అక్క దగ్గరా అప్పు తీసుకోవలసి వచ్చింది. ఆరు నెలల్లో మీ డబ్బు తిరిగి ఇస్తాను.”

“అవసరం లేదు, శివా” అంటూ పద్మా, మాల్య ఒకేసారి అరిచారు.

అప్పుడు శివ కేక్ కట్ చేసి మహిళలందరికీ కేక్ ముక్కలు పంచాడు. నలుగురు ఆడవాళ్లు పెద్ద కేకు ముక్కని శివ నోట్లో కూరి అతనికి ఊపిరి ఆడకుండా చేశారు.

పరిమళ, వంటమనుషుల బృందం ఈ సందర్భంగా నిజంగా గొప్ప విందు చేశారు.

వంటవాళ్ళు వడ్డిస్తుంటే వారంతా కలిసి భోజనానికి కూర్చున్నారు.

***

తినేముందు పద్మ మాల్య చెవుల్లో గుసగుసలాడింది.

“నీకు తెలుసా, నేను ఈ రోజు కాస్త ఎక్కువ తింటున్నాను. నేను రేపటి నుండి ఉపవాసం ప్రారంభిస్తాను. మొక్కు గుర్తుందా? ”

“ఏమి మొక్కు?”

“పది శుక్రవారాలు ఉపవాసం. తరువాత మంగాడు ఆలయంలో మాన్‌సోరు మొక్కు.”

“పద్మా..”

“ఏమిటి మాల్య? మరియమ్మన్ నా శివని తిరిగి ఇచ్చింది. నేను ఆమెకు నా కృతజ్ఞతలు తెలియజేయాలి కదా.”

“పద్మా..”

“ష్… చూడు, సంజన మమ్మల్ని చూస్తోంది. ఈ విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు. ”

మాల్య తన ఎడమ అరచేతిని పద్మ చేతిలో ఉంచింది. ఆమె కొన్ని నిమిషాలు చేయి పట్టుకుంది.

***

భోజనాలయి, సంజన బయలుదేరేటప్పటికి సమయం పది నలభై ఐదు.

“శివ కారు దాకా వస్తావా? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాల్సిన అవసరం ఉంది.”

“నువ్వు రేపు ఆఫీసుకి వస్తావా?”

“తప్పకుండా, మేడమ్.”

“ఒక ‘వాంటెడ్’ ప్రకటనను సిద్ధం చేయాలి. ఇది ఎల్లుండి పేపర్లలో రావాలి. ”

“మీరు ఎలాంటి వ్యక్తిని నియమించుకోవాలని ఆలోచిస్తున్నారు?”

“నీ జాబ్ కోసం మరొకరు”

శివ షాక్ అయ్యాడు.

“ఎందుకు మేడమ్, మీరు నా పనితీరుతో సంతోషంగా లేరా?”

“సంతోషంగానే ఉన్నాను శివా. కానీ నాకు బ్యాకప్ ఉండాలి. డిజైన్ వర్క్ పేరుతో నువ్వు సాయంత్రాలు ఇంటికి తొందరగా వెళ్లి, మర్నాడు ఉదయం ఆలస్యంగా వస్తే, నీ పని దెబ్బతింటుంది.

పైగా మనం హాస్పిటల్‌ని విస్తరిస్తున్నామని గుర్తుంచుకో. భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మరో మూడు అంతస్తులు, మరో 100 గదులు ఉంటాయి. నీ పని రెట్టింపు అవుతుంది. నువ్వు అకస్మాత్తుగా వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను నియమించుకోవడం ఉత్తమం.”

“లేదు మేడమ్. ఇకనుండి నేను తొందరగా వచ్చి ఆలస్యంగా వెళతాను. ”

“లేదు శివా. నేను నీ గురించి భయపడుతున్నాను. ఒక పారిశ్రామికవేత్తగా నాకు భవిష్యత్తు కోసం దూరదృష్టి ఉండాలి. మనం ఇప్పుడు వ్యక్తులను నియమించుకుంటే వాళ్లకి నువ్వే శిక్షణ ఇవ్వచ్చు.

హాస్పిటల్ పనికి ఏ కారణం చేతనైనా ఇబ్బంది రాకుండా నీలాంటి వాడినే నువ్వు తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయబోతున్నావు; ఎంపికైన వ్యక్తికి శిక్షణ ఇవ్వబోతున్నావు. రేపు ఉదయం మాట్లాడుకుందాం.”

ఇంత సంతోషకరమైన రోజు ఇంత విచారకరంగా ముగుస్తుందని శివ ఏ మాత్రం ఊహించలేదు.

***

కాలం ఒక పద్ధతిలో నడుస్తోంది; కనీసం అది శివకి అలా అనిపించింది. శివకి మంచి లేదా చెడు ఏదైనా ఇవ్వడానికి అది ఒక్కోసారి నిలిచిపోతూంటుంది, ఆపై ఎక్కువ అభిమానం లేకుండా దాని సాధారణ పద్ధతిలో నడవడం ప్రారంభిస్తుంది.

శివ జీవితంలో ఆ మరపురాని పుట్టినరోజు తరువాత సమయం ఏ ప్రత్యేక సంఘటనలు లేకుండా నిస్సారంగా నడుస్తోంది.

పద్మ పది శుక్రవారాల ఉపవాసం ప్రారంభించింది. తరువాత మాంగాడు ఆలయంలో “మాన్‌సోరు” మొక్కు ఓ పెద్ద పరీక్ష లాంటిది.

సంజన, శంకర్ చాలా తరచుగా కలుసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిద్దరూ తదుపరి అడుగు వేయడానికి భయపడ్డారు.

ఇక చీర డిజైన్ పనుల్లోకి వెళ్ళనని, శివ సంజనను వేడుకున్నాడు. తన స్థానంలో ఎవరినీ నియమించవద్దని బ్రతిమాలాడు.

సంజన స్థిరంగా ఉంది. రిక్రూట్‌మెంట్‌తో ముందుకు సాగింది.

వాంటెడ్ యాడ్ అన్ని ప్రధాన దినపత్రికలలో వచ్చింది. జెకె హాస్పిటల్ దరఖాస్తులతో నిండిపోయింది. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి శివ తనతో కూర్చునేలా చేసింది సంజన.

శివకి ఈ ప్రక్రియ నచ్చకపోయినా, సంజనను ద్వేషిస్తున్నా కూడా, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నాడు.

అభ్యర్థుల గుణగుణాలను అంచనా వేయడంలో శివ ప్రతిభకి సంజన ఆశ్చర్యపోయింది.

చాలా మంది అర్హులైన అభ్యర్థులను చూసి సంజన ఒకరికి బదులుగా ఇద్దరిని నియమించుకుంది.

ఆ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా శివపై పడింది. సంజన మనసులో ఒక రహస్య ఎజెండా ఉందని శివకి ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు.

అయినప్పటికీ అతను దేనికీ సందేహించలేదు, తన సామర్థ్యాలకు తగినట్లుగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చాడు.

ఈ ప్రక్రియ వెనుక సంజన ప్రేమికుడు ఉండవచ్చునని శివ అనుమానపడ్డాడు. శివకి శంకర్‌ నచ్చలేదు. శంకర్‌కి కూడా తన పట్ల ద్వేషం తక్కువ కాదని శివకి తెలుసు.

సంజనను వివాహం చేసుకునే సమయానికి, ఆమె దగ్గర శివ ఉండని విధంగా శంకర్ పావులు కదుపుతున్నాడేమో.

శివ విసిగిపోయాడు. జరుగుతున్న విషయాలన్నీ ఒక రోజు తన స్నేహితుడు వినూకు చెప్పాడు. తాను ఏ రోజునైనా ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చని అన్నాడు. తనని అతని షాపులో డిజైనర్‌గా తీసుకోమని వినూని అడిగాడు. విను కుదరదని స్పష్టంగా చెప్పేసాడు.

స్నేహాన్నీ, వ్యాపారాన్ని కలపడం పద్ధతి కాదని విను స్పష్టం చేశారు. శివ నిరాశకు గురయ్యాడు.

కానీ శివ కోరుకున్నప్పుడల్లా వినూ తన డిజైన్ సెంటర్‌ను ఉపయోగించుకోనిచ్చాడు. శివ తన చింతలను మరచిపోయేలా కోపంగా డిజైన్ పనిలో నిమగ్నమయ్యాడు.

శివని ఉద్యోగంలోకి తీసుకోవటానికి తను నిరాకరించినందుకు గాను, వినూ తన కస్టమర్ల వద్ద శివని ప్రశంసించడం ప్రారంభించాడు. తన విఐపి కస్టమర్లందరినీ శివకి పరిచయం చేశాడు. తన కోసం చేసిన పనికి వినూ నుండి డబ్బు తీసుకోడానికి నిరాకరించాడు శివ.

***

ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాల గురించి, డిజైన్ పనిలో తన ప్రమేయం గురించి శివ తన ఇంట్లో చెప్పాడు.

ఇంట్లోని ఆడవాళ్ళు అతని ఆరోగ్యం గురించి మాత్రమే ఆందోళన చెందారు. తన కోసం ఒక షాపు ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట గురించి శివ మాల్యకు గుర్తు చేయాలనుకున్నాడు.

ఒక చక్కని షాపు… విను షాపంత యొక్క చిన్నది అయినా కనీసం రూ.40 లక్షలు ఖర్చవుతుంది, అది కూడా స్థలం అద్దె కాకుండా! పైగా ఇంకా శివ ఒకదాన్ని గుర్తించాలి.

ఆ రకమైన పెట్టుబడితో మాల్య లేదా పద్మపై భారం వేయడం శివకి ఇష్టం లేదు.

సంజన ఎక్కువ సమయం తన సీట్లో ఉండడం లేదు. చాలా రోజులు చెక్కులు, ఉత్తరాలు ఆమె ఇంటికే తీసుకురమ్మని శివని కోరింది. శివుడు పట్టించుకోలేదు.

తన కొత్త ఐ 10 కారులో ప్రయాణించడం శివకి నచ్చింది.

సంజన తన ప్రేమికుడితో చాలా సమయం గడుపుతోందని శివ అనుమానపడ్డాడు. ఎట్టకేలకు ఆమెకు తనకి నప్పిన, నచ్చిన సహచరుడు లభించాడు. పాపం, ఆమె జీవితంలో చాలా బాధపడింది. ఇప్పుడు ఆమె జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం కలుగుతోందని శివ అనుకున్నాడు.

పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన ఇద్దరు ఉద్యోగుల వల్ల శివకి ఆసుపత్రిలో పెద్దగా పని లేదు.

***

శివ ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచాడు. అతను తన జీవితం పట్ల కొంచెం నిరాశకు గురయ్యాడు. నిరాశను దూరం చేయగల ఏకైక మార్గం డిజైనింగ్ పనిలో లీనమైపోవడమే.

ఇంటి నుంచి తొందరగా బయలుదేరి నేరుగా వినూ షాపుకి వెళ్ళాడు. సాధారణంగా డిజైన్ సెంటర్ తాళంచెవులు సెక్యూరిటీ గార్డు దగ్గర ఉంటాయి. ఏ సమయంలోనైనా శివకి ఇవ్వమని అతనికి ఆదేశాలున్నాయి.

శివ 8 గంటలకు దుకాణానికి చేరుకుని తాళంచెవులు అడిగాడు.

“తాళంచెవులు బాస్ తీసుకున్నారు సర్. క్షమించాలి.”

శివ నిరాశ తీవ్రమైంది. వినూ ఇంత తమాషాగా ఎందుకు ప్రవర్తించాడు? తన మొబైల్‌ నుంచి వినూకి ఫోన్ చేశాడు. కాని వినూ ఫోన్ తీయలేదు.

శివ 8.30 కల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు. అతను తన ఖాళీ డెస్క్ వైపు చూస్తూ తన సీట్లో కూర్చున్నాడు. అతని జీవితం కూడా తన వర్క్ డెస్క్ లాగా ఖాళీగా ఉన్నట్లు అనిపించింది.

సంజన శివ డెస్క్‌లోని వర్క్ స్టేషన్‌ను కొత్తగా చేర్చుకున్న ఒకరికి కేటాయించింది.

9 గంటల సమయంలో, ఒక నర్సు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది.

“చీఫ్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, సర్.”

శివ డాక్టర్ కన్నప్పన్ గదికి వెళ్లాడు.

“లోపలికి రా శివా. కూర్చో. నీ కృషికి, చిత్తశుద్ధికి ధన్యవాదాలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు.

నువ్వు ఆసుపత్రి డబ్బు చాలా కాపాడావు, బ్యాంకు ఋణం అడ్వాన్స్ పొందడంలో నువ్వు కీలక పాత్ర పోషించావు.

అయితే, శివా, ఏర్పాట్లలో మార్పు జరిగింది. రేపటి నుండి నువ్వు మధ్యాహ్నం ఒక గంట వస్తే సరిపోతుంది. నీకు నెలకు రూ.4000 ఫీజుగా చెల్లించబడుతుంది.

నువ్వు ఇకపై శాశ్వత ఉద్యోగివి కాదు. నీ జీతం, ఇతర బకాయిలను సంజన నుండి పొందవచ్చు.”

శివ కోపం పట్టలేకపోయాడు.

“ఈ అమర్యాదకర తొలగింపుకి నేనేం తప్పు చేసాను?”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here