Site icon Sanchika

సాధించెనే ఓ మనసా!-15

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 15వ భాగం. [/box]

[dropcap]సె[/dropcap]క్యూరిటీ గార్డు తెచ్చిన వేడి నీటితో ముఖం కడుక్కొన్నాడు శివ. ఆ రోజుకి ఇక షాప్‌ని మూసివేయడానికి షట్టర్లను క్రిందికి దించడంతో సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకున్నాడు.

సమయం రాత్రి 10:20. అతని ఐ10 దాదాపుగా నిర్జనమైన చెన్నై రోడ్ల వెంట వెళుతుండగా వినూ మళ్ళీ ఫోన్ చేశాడు.

“ప్రోగ్రామ్‌లో ఒక చిన్న మార్పు. సౌత్ ఉస్మాన్ రోడ్ వద్ద ఎంఎస్ సిల్క్స్‌కి వచ్చేయ్. నేను నీ కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉంటాను. ”

***

వినూతో పాటు అతని డ్రైవర్ ఉన్నాడు.

“కారు కీ అతనికి ఇచ్చేయ్. అతను పార్క్ చేస్తాడు. రా, మనం పరిగెత్తాలి. ”

వాళ్ళిద్దరూ లిఫ్ట్‌ వద్దకు పరిగెత్తారు. లిఫ్ట్ వేగం పుంజుకోగానే వినూ వివరించాడు.

“గుర్తుందా, పోథీస్ చీరలలో సముద్రికా బ్రాండ్‌ను సృష్టించింది, అది మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు వీళ్ళు – ఎంఎస్ సిల్క్స్ కూడా అదే చేయాలనుకుంటున్నారు.

మేనేజింగ్ పార్టనర్ మిస్టర్ రామనాథన్ మా నాన్నగారి స్నేహితులు. డిజైన్‌లలో వాళ్ళని నేను సహాయం చేయాలని కోరుకున్నారు. నేను నీ గురించి ఆయనతో చెప్పాను. నీ కోసం కాంట్రాక్టు తీసుకున్నాను.”

శంకర్, అతని స్నేహితులు కొట్టిన షాక్ నుండి శివ పూర్తిగా బయటకు రాలేదు. అతను తన బుగ్గలను తాకాడు. బుగ్గ మండుతున్నట్టుగా బాధించింది.

వినూ చెప్పసాగాడు.

“శివా, నేను నిన్ను అడగకుండా నిబంధనలను ఖరారు చేసాను. నువ్వు నీ షాప్‍ తెరిచావు. ప్రస్తుతం ప్రచారం చాలా ముఖ్యం.

నువ్వు ప్రకటన కోసం డబ్బు ఖర్చు చేయలేవని నాకు తెలుసు. అందువల్ల డిజైన్ పని కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని నేను రామనాథన్ గారితో చెప్పాను.

బదులుగా వారు క్రొత్త బ్రాండ్‌ను ప్రకటించినప్పుడల్లా వారు నీ పేరు, నీ ఫొటో ఆ ప్రకటనలో వేయాలన్నాను. ప్రకటన మీ షాప్ పేరును కలిగి ఉండాలని నేను పట్టుబట్టాను. కాని వారు నిరాకరించారు. వారి చీరలు తమ పోటీదారుచే రూపొందించబడినట్లు తమ వినియోగదారులకు ఎవరు చెప్పాలనుకుంటారు?”

“…”

“ఈ రోజు ఒప్పందంపై నువ్వు సంతకం చేయాలని వారు కోరుకున్నారు. అందుకే ఈ టైమ్‌లో నేను నిన్ను బయటకు తీసుకురావలసి వచ్చింది.. ”

వినూ చెప్పడం ఆపి శివ ముఖం కేసి చూశాడు.

“శివా, ఏంటలా ఉన్నావ్? నీ ముఖం వాచింది, కళ్ళు కూడా సరిగ్గా లేవు.”

“అది మరో పెద్ద కథ. నేను నీకు తర్వాత చెపుతాను. నువ్వు అగ్రిమెంట్ చదివావా?”

“అవసరం లేదు శివా. ఈయన దేవదూత లాంటివారు.. ఆయన్ని నమ్మవచ్చు. నువ్వు ఖాళీ పేజీలో కూడా సంతకం చేయవచ్చు. వారి కొత్త బ్రాండ్ కోసం వారి ప్రకటనల బడ్జెట్ ఎంతో నీకు తెలుసా? రూ.15 కోట్లు.

ప్రతి ప్రకటనలో నీ పేరు, ఫొటో కనిపిస్తాయని ఊహించుకో! నువ్వు అతి తక్కువ కాలంలో రాష్ట్రమంతా ప్రసిద్ధి చెందుతావు.”

***

రామనాథన్ గారి వయసు 70 ఏళ్ళు ఉంటుంది. ఆ రాత్రి సమయంలో కూడా మతపరమైన చిహ్నాలు అతని నుదిటిని అలంకరించాయి.

“లోపలికి రండి, వినూ. నువ్వెలా ఉన్నావు?”

“బాగున్నాను, సర్. ఇతను నా స్నేహితుడు శివ. డిజైనర్. ”

“మీరు ఏం తీసుకుంటారు?”

వినూ సమయం చూశాడు. 10:45.

“ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, సర్.”

“నేను ఈ సమయంలో మీకు కాఫీ లేదా టీ ఇవ్వను. నేను తాటిబెల్లం వేసి ప్రత్యేకంగా కలిపిన పాలు ఇస్తాను. మీ ఆరోగ్యానికి మంచిది, రుచికరమైనది కూడా.”

వినూ తలఊపాడు. రామనాథన్ ఇంటర్‌కమ్‌లో ఆర్డర్ ఇచ్చారు.

“వినూ, మా బిజినెస్ ఎంత పోటీగా మారిందో నేను నీకు చెప్పనవసరం లేదు. మనం ఇప్పుడు ఏది మాట్లాడినా అది పూర్తిగా గోప్యంగా ఉండాలి.

చివరికి ప్రకటన ఏజెన్సీ ఆమోదయోగ్యమైన బ్రాండ్ పేరుతో వచ్చింది. ఇది సౌందర్య. మీకు తెలుసు, సౌందర్య అంటే సంస్కృతంలో అందం.

ఈ డిజైన్ చూసిన వెంటనే ప్రజల మనస్సులలో అందం అనే పదం మెదలాలి. మేము ఈ బ్రాండ్‌ను నాలుగు ధరల పరిధిలో పరిచయం చేస్తున్నాము. 15 వేలు, 25 వేలు, 35 వేలు ఇంకా 45 వేలు.

ఒక కామన్ బ్రాండ్ పేరును సమర్థించడానికి ఈ నాలుగు డిజైన్లలో ఉమ్మడి అంశం ఏదో ఒకటి ఉండాలి. అదే సమయంలో ధర వ్యత్యాసాన్ని సమర్థించడానికి ఖరీదైన శ్రేణి మరింత ఆకర్షణీయంగా ఉండాలి.”

ఇప్పటికే ఉన్న డిజైన్ల ఫోలియోను రామనాథన్ అందజేశారు. జరీ, నూలు ఇంకా ఇతర ముడి పదార్థాల ఖర్చుతో సహా ఆయన చాలా అదనపు సమాచారం అందించారు, తద్వారా రిటైల్ అమ్మకపు ధరలో 50% మించి చీర ధర ఉండకుండా శివ చూడాలి.

ఆయన చెబుతున్న వివరాలన్నీ శివ జాగ్రత్తగా రాసుకున్నాడు.

‘స్పెషల్ మిల్క్’ వచ్చింది. రుచి బావుంది. శివ పరిస్థితిని బట్టి ఆ వేడి, తీపి ద్రవాన్ని రుచి చూడటం అతనికి ఉపశమనం కలిగించింది.

“శివా, మీ కుటుంబం గురించి చెప్పు… మీ నాన్నగారు…”

“నాన్నగారి పేరు రంగనాథన్. ఆయన ప్రస్తుతం లేరు. వారు రంగా సిల్క్స్ స్థాపకులు. ”

రామనాథన్ తన సీటు నుండి లేచి నిలబడ్డారు. దాంతో శివా, వినూ కూడా లేచారు.

“ఓహ్ దేవుడా! నువ్వు ఆ గొప్ప వ్యక్తి రంగనాథన్ కొడుకునా? మీ నాన్న ఒక దేవదూత, శివా. ఒకసారి మా భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చాయి. మేము విడిపోతామేమోననిపించింది.

అప్పుడు మీ నాన్న వివాదానికి మధ్యవర్తిత్వం వహించి, ఈ రోజు వరకు మేము అనుసరిస్తున్న వ్యాపార సూత్రాన్ని మాకు ఇచ్చారు. ఆయనే లేకపోతే, నేను ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చుని ఉండే వాడిని కాను.”

శివ తన తండ్రి తలచుకోగానే కళ్ళలో నీళ్ళు కారాయి.

“మీ బాబాయిలు వ్యాపారంలో నీ వాటాను మోసం చేశారని నేను విన్నాను. శివా, నేను నీకు చెప్తున్నాను, వారు దానికి తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ ప్రపంచంలో మీరు చేసే ప్రతి చర్యా, మంచైనా చెడు అయినా, దానికి ఓ మూల్యం ఉంటుంది. ఆ మూర్ఖులకు ఈ ప్రాథమిక సత్యం తెలియదు.”

రామనాథన్ ఇప్పుడు శివతో గౌరవ స్వరంలో మాట్లాడారు. ఎంఎస్ సిల్క్స్‌తో భారీ డిజైన్ ఒప్పందంపై సంతకం చేశాడు, తరువాత, ఎంఎస్ సిల్క్‌లతో మరింత పెద్దదైన నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్‍ పైన కూడా సంతకం చేసి శివ ఉదయం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు.

***

శివ సౌందర్య సిల్క్ చీరలపై మరుసటి రోజు నుండే అత్యంత శ్రద్ధతో పనిచేయడం ప్రారంభించాడు.

మొదట అతను రాజా రవివర్మ, కొండియా రాజు, ఇంకా మానియన్ సెల్వం వంటి పెద్ద చిత్రకారులు గీసిన హిందూ దేవతల చిత్రాల కోసం గూగుల్ చేశాడు. ఈ చిత్రాలన్నింటినీ తన ల్యాప్‌టాప్‌లోకి డౌన్‌లోడ్ చేశాడు.

అనంతరం మైలాపూర్‌లోని పలు పిక్చర్-ఫ్రేమ్ షాపులకు వెళ్ళి దేవతల చిత్రాలను సేకరించాడు.

సాంప్రదాయపు సారాన్ని, ముఖ్యంగా అంచులు, జరీ పని విషయాలలో, ఈ మాస్టర్స్ చిత్రాలలో చాలా స్పష్టంగా కనబడాలని శివ కోరుకున్నాడు.

అప్పుడు అతను జరీ పరిమాణం, ప్రైస్-ట్యాగ్ ఆధారంగా పల్లూపై డిజైన్ పనిని నిర్ణయించుకున్నాడు.

ఒక వ్యక్తికి కేవలం ఒక చీర రూపకల్పన చేయడం చాలా సులభం. కానీ చీరల వర్గాన్ని సృష్టించడం, అది కూడా నాలుగు ధరల పరిధిలో చాలా క్లిష్టమైన పని.

మొదటగా ప్రతి ధర పరిధికి కనీసం ఏడు లేదా ఎనిమిది రంగు కలయికలను సృష్టించాలి. అన్నింటినీ ఉపయోగించుకుని అతను అన్ని నమూనాలలో ఒక ఉమ్మడి అంశం జోడించాలి.

సౌందర్య అంటే అందం. అందం అనే పదం తలచుకున్నప్పుడు తన మనసులోకి వచ్చిన అన్ని చిత్రాల గురించి శివ ఆలోచించాడు.

మొట్టమొదటిది సంజన. ఆపై జాతీయ పక్షి నెమలి వచ్చింది. ఇంకా దేవాలయాలలో మహిళల శిల్పాలు. అతనికి ఒక ఆలోచన వచ్చింది.

సౌందర్య చీరలన్నిటిపైన నెమలి నాట్య భంగిమలను నేస్తారు. పల్లూలో ఇతర కళాకృతులు కాకుండా డ్యాన్స్ చేసే మహిళల శిల్పాలు ఉంటాయి.

జారీ పరిధి, ఇంకా పల్లూపై కళ-పని నాణ్యత వివిధ ధరల పరిధిలో చీరలను వేరు చేస్తాయి. అందువల్ల చీరలకు ఉమ్మడిగా ఏదో వైవిధ్యం ఉంటుంది, వాటిని ఇతర ధర-తరగతుల నుండి వేరు చేయడానికి కూడా ఏదో తేడా ఉంటుంది.

తరువాతి రెండు రోజులు అతను ఆ డిజైన్లపై పని చేస్తూ గడిపాడు.

అతను తన డిజైన్ వర్క్‌ని పవర్ పాయింట్ లో పెట్టి ప్రెజెంటేషన్ సిద్ధం చేశాడు. అతని డ్రాయింగ్స్ సిద్ధంగా ఉన్నాయి.

ఎల్‌సిడి ప్రొజెక్టర్‌లో ప్రెజెంటేషన్‌ని చూడటానికి వినూ రామనాథన్‌ను శివా సిల్క్స్‌కు ఆహ్వానించాడు.

డిజైన్ పనిని చూసిన రామనాథన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

తర్వాతి రెండు నెలల్లో ఎంఎస్ సిల్క్స్ మగ్గాలకు తీరిక లేకుండా పోయింది, తగినంత సంఖ్యలో సౌందర్య చీరలు సృష్టించబడ్డాయి.

తగినంత స్టాక్‌ ఉందని నిశ్చయించుకున్నాకా, వారు భారీ ప్రకటనల యుద్ధాన్ని ప్రారంభించారు.

ప్రతి కాపీలో శివ పేరు, ఫొటో కనిపించాలని ప్రకటన ఏజెన్సీ క్రియేటివ్ హెడ్‍కి రామనాథన్ స్పష్టంగా సూచించాడు.

డిజైన్ పని కోసం అంగీకరించిన నిబంధనలను గాని, తను ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితులోను తప్పడానికి ఆయన ఇష్టపడలేదు.

ఈ క్రియేటివ్ హెడ్ ఒక యువతి, ఐఐఎంఎలో చదివింది. డిజైనర్ ఫొటో పెట్టడం పెద్దగా బావుండదని ఆమె మొదట అనుకుంది.

తమ ఫోటోగ్రాఫర్‌ను పంపి శివని వివిధ కోణాల్లో, వివిధ దుస్తులలో ఫొటో తీయమని కోరింది.

శివ సహజంగానే అందగాడు. ఆమె తన క్లయింట్ యొక్క ప్రయోజనం కోసం ఈ నిజాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది.

ప్రకటన కోసం వాడిన ట్యాగ్ లైన్ కూడా శివ రూపాన్ని సూచించింది.

సౌందర్య చీరలు, భారతదేశపు అందమైన మహిళలకు అందమైన చీరలు, భారతదేశపు అత్యంత అందమైన డిజైనర్, శివా రంగనాథన్, చెన్నై చే సృష్టించబడినవి.”

గీతకు పైన శివ చిత్రం కనిపించింది. ఈ ప్రకటనను టీవీ, ప్రింట్ మీడియాలో ఒకేసారి విడుదల చేసినప్పుడు, మహిళలు చీర-డిజైన్ పట్ల, డిజైనర్ అందం పట్ల ముగ్ధులయ్యారు.

రాత్రికి రాత్రి శివ ఓ సెలబ్రిటీ అయిపోయాడు.

ఒక బ్రాండ్‌గా సౌందర్య చీరలు గొప్ప విజయాన్ని సాధించాయి. రామనాథన్ మగ్గాలు తీరిక లేకుండా పనిచేస్తున్నాయి.

***

రామనాథన్ ఒక రాత్రి తన స్టోర్స్‌కి రమ్మని శివని అడిగారు.

“శివా, నువ్వు సాధించావు. ఈ చీరలు గొప్ప ఆదరణ పొందాయి. ఒప్పందం ప్రకారం డిజైన్ పని కోసం మేము నీకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. వాగ్దానం చేసినట్లు మేము నీ పేరు, ఫొటో ప్రచురించాము.

అయితే ప్రకటనలో నీ ఫొటో ప్రచారానికి గొప్ప బలం అని అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ నాకు చెప్పింది. శివా, నాలో అపరాధ భావన పెరిగింది. రంగనాథన్ గారి కొడుకును ఇలా దోచుకోడాన్ని నేను ఇష్టపడను. దయచేసి ఈ నగదును తీసుకుని అపరాధ భావన నుండి నాకు ఉపశమనం కలిగించు.”

“సార్, మీ ప్రకటనల వల్ల నాకు ప్రాచుర్యం లభించింది. ఇప్పుడు నాకు చాలా డిజైన్ వర్క్ వచ్చింది. పైగా నా షాపులో అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. అందుకని… “

“లేదు, శివా. రంగనాథన్ గారి కొడుకు నా నుండి ఈ డబ్బు తీసుకుంటే, నేను దానిని నా ధర్మంగా భావిస్తాను. నేను నీ కోసం ఇంకా చాలా ఎక్కువ చేయాలనుకుంటున్నాను.

నీ వెంచర్‌లో నీకు మరింత సహాయపడే మార్గాన్ని చూపించమని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అయితే ప్రస్తుతానికి దయచేసి దీనిని అంగీకరించు శివా. మీ నాన్నగారి కోసమైనా దయచేసి ..”

తిరస్కరించడానికి శివకి మనసొప్పలేదు.

అతను లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్నప్పుడు బ్యాగ్‌ను చెక్ చేశాడు. బ్యాగ్‌లో ఐదు లక్షలు ఉన్నాయి.

అతను వినూ షాప్‌కి వెళ్ళాడు. వినూ రోజు అమ్మకాలను పూర్తయ్యాక క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాడు.

“హాయ్, శివా! ఏంటి ఈ సమయంలో వచ్చావు… ఏమైనా సమస్య ఉందా?”

“అదేం లేదు. ఈ డబ్బును అమ్మకపు నగదుకు జోడించి, ఈ రోజు ఎకౌంట్స్ పూర్తి చెయ్యి”

“ఇది ఏమిటి?”

“ఎంఎస్ సిల్క్స్‌ రామనాథన్ గారు డిజైన్ పని కోసం 5 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బు నీకు రావలిసినదే. ”

“అదేలా? పని చేసింది నువ్వు. ”

“కావచ్చు వినూ, కానీ నువ్వు లేకపోతే నేను నా డిజైన్ పనిని కొనసాగించలేకపోయేవాడిని. నువ్వు లేకపోతే సొంతంగా ఒక షాప్ తెరవాలనే ఆలోచన సంజన మేడమ్‌కు వచ్చేది కాదు. నువ్వు లేకపోతే నాకు ఇంత ప్రజాదరణ వచ్చేది కాదు. నువ్వు లేకపోతే నాకు ఈ ఎంఎస్ సిల్క్స్ పని వచ్చేది కాదు. కాబట్టి ఈ డబ్బు అన్ని రకాలుగా నీదే, వినూ. తీసుకో. ”

వినూ తన పనిని వదలి, తన ఎత్తైన కుర్చీలోంచి దిగి, శివని హత్తుకున్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version