Site icon Sanchika

సాధించెనే ఓ మనసా!-17

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 17వ భాగం. [/box]

[dropcap]మ[/dropcap]రుసటి రోజు కార్యక్రమం గురించి శివ నటుడి పిఎతో వివరంగా చర్చించి, తరువాత సంజనకి ఫోన్ చేశాడు.

“ఏమిటి సంగతులు? ఈ టైమ్‌లో ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇప్పుడు రాత్రి 10.30 అవుతోంది! ఏదైనా సమస్యా?”

“లేదు మేడమ్. చిన్న పని ఉంది. రేపు ఉదయం 11 గంటలకు నాతో రావడానికి మీకు కుదురుతుందా చెప్పండి.”

“రేపు ఆదివారం, శివా. మన సంస్థ విధానం ప్రకారం మనం ఆదివారాలలో పనిచేయం.”

“కానీ మనం కొన్ని డిజైన్లను ఒక వివిఐపికి చూపించాలి. ఈ పదానికి ముందు ఇంకా వంద ‘వి’లయినా చేర్చడానికి నేను ఇష్టపడతాను. ”

“అతను ఎవరైనా కానీ, షాప్‌కి వచ్చి ఎంచుకోమను. అక్కడికి వెళ్లడం ద్వారా నీ హోదాని తగ్గించుకోవద్దు. దీర్ఘకాలంలో ఇది మంచిది కాదు.”

“మేడమ్, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిస్తే మీరు ఎప్పటికీ ఇలా అనరు.”

“ఎవరాయన?”

“సూపర్ స్టార్ రవికాంత్.”

అక్కడ కాసేపు సంపూర్ణ నిశ్శబ్దం రాజ్యమేలింది. షాక్ నుండి తేరుకున్న సంజన ఆందోళనతో అడిగింది.

“హే శివా, నీకు ఏమైంది? ఎందుకు నువ్వు ఇలా భ్రమ పడుతున్నావు?”

అప్పుడు శివ ఆమెకు జరిగినదంతా వివరించి చెప్పాడు.

“నమ్మలేకపొతున్నాను, శివా. నువ్వు ఇంత త్వరగా బిగ్ షాట్ అయ్యావు. సరే, ఇప్పుడు మంచి అబ్బాయిగా ఉండు, నిద్రపోవడానికి ఇంటికి వెళ్ళు.”

“లేదు మేడమ్. వధువు ఒక ప్రముఖుని కుమార్తె కాబట్టి, నేను ఆమె చిత్రాన్ని నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోగలను.

నేను ఏడు, ఎనిమిది డిజైన్ల ఫోలియోని సృష్టించాలనుకుంటున్నాను, తద్వారా నేను సూపర్ స్టార్‌ను మొదటి సమావేశంలో ఆకట్టుకుంటాను.

మేడమ్, ఉదయం నేను ఆయనని కలిసినప్పుడు మీరు నాతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది, మేడమ్.”

“ఉదయం వరకు ఎందుకు వేచి ఉండాలి? మరో అరగంటలో నేను అక్కడే ఉంటాను. ప్రత్యేకమైన అల్లం టీతో నిండిన రెండు ఫ్లాస్క్‌లను తీసుకువస్తాను. ఇంకా స్నాక్స్ – సమోసాలు, కుకీలు, చిప్స్ తెస్తాను. నా భాగస్వామి రాత్రి పూట పని చేస్తున్నప్పుడు నేను అతని కోసం చేయగలిగినది ఇదే.”

“ఎందుకు మేడమ్, మీ నిద్రను పాడు చేసుకుంటారు? మీరు ఇప్పుడు రావలసిన అవసరం లేదు. మనం రేపు ఉదయం కలిసి అక్కడకు వెళ్ళవచ్చు.”

“ఏం లేదు, శివా. నేను సూపర్ స్టార్‌కి గొప్ప అభిమానిని. ఏమైనా నేను ఈ రాత్రి నిద్రపోలేను. రేపటి సమావేశం గురించే అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాను. మంచం మీద పడి దొర్లే బదులుగా నేను నీకు సహాయం చేయడానికి ఎందుకు రాకూడదు?”

***

అరగంటలో సంజన అక్కడే ఉంది.

శివ వధువు – నటుడి కుమార్తె ఫొటోని 17 అంగుళాల కంప్యూటర్ తెరపై అమర్చాడు. ఆమెపై వివిధ రంగులను ప్రయత్నిస్తున్నాడు.

“అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇది సెలబ్రిటీల వివాహం కాబట్టి వేదికపై చాలా కాంతి ఉంటుంది. డజను వీడియోగ్రాఫర్లు తమ వీడియో లైట్లతో వేదిక దగ్గర తచ్చాడుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

కాబట్టి నేను లేత నీలం రంగు చీర కోసం భారీ మోతాదులో జరీ చేరుస్తాను. అది ఆ కాంతిలో చాలా బాగుంది. అది రిసెప్షన్ కోసం ఎంపికచేద్దాం.

ముహూర్తం తెల్లవారుజామున కాబట్టి నేను సాంప్రదాయ ‘కూరై పుడవై’ ఎంచుకున్నాను. అది ఎప్పటిలాగే మెరూన్ కలర్‌లో ఉంటుంది. దాన్నే మరింత భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపించేలా ప్రయత్నిద్దాం. డిజైన్ విభిన్నంగా ఉండాలి.

మెహెందీ, సంగీత్ ఇంకా ఇతర కార్యక్రమాలు ఉంటాయని విన్నాను. వాటికి వధువు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ముడి-పట్టు చుడీదార్ ధరించాలని కోరుకుంటున్నాను. నేను ఇంద్రధనస్సు రంగులలో దుప్పట్టాను డిజైన్ చేస్తాను.

నేను స్వచ్ఛమైన పట్టులో ఆమె కోసం ఒక ఆధునిక దుస్తుల రూపకల్పనను ప్రయోగం చేయబోతున్నాను.”

శివ సూచనల మేరకు సంజన ల్యాప్‌టాప్‌లో శివ చెప్తున్న వివరాలను టైప్ చేస్తోంది. శివ ఆలోచనల ప్రవాహపు వేగానికి ఆమె సరితూగలేకపోతోంది.

“వరుడి దుస్తులు కోసం ఆర్డర్ పొందేందుకు ప్రయత్నిద్దాం. సాంప్రదాయకంగా వరుడు షెర్వానీ ధరిస్తారు.

నేను అతనికి మెరిసే తెలుపు రంగులో స్వచ్ఛమైన పట్టు ధోతీలో; చక్కటి ఎంబ్రాయిడరీ డిజైన్లతో ముడి-పట్టుతో చేసిన కుర్తా ఎంపిక చేస్తాను.

మనం వరుడి ఫోటో తీసుకోవాలి. దగ్గరి బంధువులందరి ఫొటోలను తీసుకోవాలి. నటుడి భార్య, అతని మొదటి కుమార్తె, ఆపై వరుడి తల్లి, సోదరీమణులు ఇంకా అందరూ.

ఆగండి. నాకు మరో ఆలోచన వచ్చింది. రేపు వారంతా అక్కడే ఉంటారని పిఏ నాకు చెప్పాడు. మన కెమెరా, ట్రైపాడ్‌లను తీసుకెళ్ళి ఫొటోలు ఎందుకు తీయకూడదు? ఆ విధంగా మనకు కావలసిన కోణాల్లో చిత్రాలు ఉంటాయి.

ఇంకా వివాహంతో ముడిపడి ఉన్న అన్ని ప్రధాన సంఘటనల జాబితాను పొందాలి. పూజ, సంగీత్, మెహెందీ, ముహూర్తం, రిసెప్షన్ వగైరా అన్నీ ఉంటాయి. చీర డిజైన్ ఈవెంట్ యొక్క మానసిక స్థితితో సజావుగా కలిసిపోవాలి.

ఫ్లాష్‌లా ఒక ఆలోచన తట్టింది మేడమ్. సూపర్ స్టార్ గొప్ప వ్యక్తి, మనపై నమ్మకం ఉంచారు. అతని కోసం ప్రత్యేకమైన దుస్తుల్ని రూపొందించడం ద్వారా మనం ఆయనకి మన కృతజ్ఞతను చూపుదాం.

మనం దాని కోసం ఫీజు వసూలు చేయం. పురుషుల కోసం స్వచ్ఛమైన పట్టు దుస్తులను రూపొందించడం ఒక సవాలు. అయినా ఒక ప్రయత్నం చేద్దాం.”

శివ చెప్తూపోయాడు.

“శివా, నువ్వు ఇప్పటివరకు ఇచ్చిన చిట్కాల ఆధారంగా నేను మొత్తం పుస్తకమే రాయగలను.”

వారిద్దరు అంత సమాచారాన్ని మళ్ళీ నిర్ధారించుకున్నారు, కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. శివ వధువు కోసం కొన్ని మోడల్ డిజైన్లను సృష్టించాడు, అన్ని డిజైన్లను ముద్రించి, వాటిని ఫోలియోలో చక్కగా అమర్చాడు.

వారు తమ పని ముగించేసరికి ఉదయం ఐదు గంటలు అయింది.

“శివా, ఇక్కడి నుండి నటుడి ఇంటికి వెళితే ఉబ్బిన కళ్ళతో చాలా విచిత్రంగా కనిపిస్తాం. మనం ఇంటికి వెళ్లి కొంతసేపు నిద్రపోదాం.

నేను మీ ఇంటికి సరిగ్గా 9 గంటలకల్లా వస్తాను. నాన్న కారు టయోటా ఆల్టిస్ తీసుకుని వస్తాను. అది ఈ సందర్భానికి నప్పుతుంది. నేను బ్రేక్‌ఫాస్ట్ మీ ఇంట్లో చెస్తాను. పవర్ బ్రేక్‌ఫాస్ట్ చేయమని ఇంట్లో చెప్పు. మీ ఇంటి నుండి 10.15కి బయలుదేరుదాం.”

శివ అంగీకరించాడు.

***

శివ ఇంటికి చేరుకునేసరికి వాళ్ళమ్మ అప్పుడే నిద్రలేచి ఉదయపు కాఫీ సిద్ధం చేస్తోంది. శివ కాఫీ వద్దన్నాడు. బ్రేక్‌ఫాస్ట్‌కి సంజన ఇంటికి వస్తుందని తల్లికి చెప్పి మంచం ఎక్కాడు.

శివ 8.30కి మేల్కొని, ఖచ్చితంగా 9 గంటలకల్లా సిద్ధంగా ఉన్నాడు.

ఆడవాళ్ళు వంటగదిలో తీరిక లేకుండా ఉన్నారు.

“శివా, నువ్వు సినిమా హీరోలా కనిపిస్తున్నావు” అంటున్న మాల్య పొగడ్తలతో శివ మెరిసిపోయాడు.

అతను తెలుపు రంగు కుర్తా సెట్ ధరించాడు.

9 గంటలకు సంజన అక్కడ ఉంది. ఆమె ముదురు గోధుమ రంగు జీన్స్ ప్యాంటు, లేత పసుపు చొక్కాలో అందంగా కనిపిస్తోంది. ఆమె జుట్టు వదులుగా ఉంది.

“మాల్యా, మీకు తెలుసా? శివా, నేను ఈ రోజు ఒక వివిఐపిని కలుస్తున్నాం” అంది సంజన.

“తెలుసు. కానీ మాకు నువ్వే వివిఐపి” అంటూ “రండి, బ్రేక్‌ఫాస్ట్ తీసుకుందాం” అని అందరినీ పిలిచింది మాల్య.

‘పవర్ బ్రేక్‌ఫాస్ట్’ అనే పదం వారికిలా అర్థమవుతుందని సంజన అస్సలు అనుకోలేదు. మొదటగా రవ కేసరి, తరువాత వేడి పొంగల్ ఉంది. ఆపై రెండు రకాల పచ్చళ్ళు, ఉల్లిపాయ సాంబార్‌తో మృదువైన ఇడ్లీలు.

ఆపై రెండు రకాల వడలు. తరువాత పూరీ మసాలా, ఇంకా మసాలా దోస.  ఇంక వేడి వేడి ఫిల్టర్ కాఫీ మామూలే.

అల్పాహారం కన్నా ఆ ఇంటి ఆడవాళ్ళు తనపై చూపించిన ఆప్యాయత సంజనని ఎక్కువగా ఆకట్టుకుంది.

***

బ్లాక్ టయోటా ఆల్టిస్ 10.45 కల్లా గమ్యం చేరుకుంది. కారుని సంజన నడుపుతోంది.

గార్డు ఆమెను సూపర్ స్టార్ యొక్క తాజా చిత్రంలో హీరోయిన్‌గా భ్రమించి ఆమెకు గట్టిగా సెల్యూట్ చేశాడు. అతను వారిని అక్కడ ఆపి, ఇంటర్‌కామ్‌లో ఎవరితోనో మాట్లాడాడు.

నటుడి పిఏ వారి వద్దకు పరిగెత్తుకు వచ్చాడు.

“స్వాగతం, శివా. మీరు త్వరగా వచ్చారు.”

“అవును. నేను ఈ పరికరాలను అమర్చుకోవాలి. అందుకు సులభంగా ఇరవై నిమిషాలు పడుతుంది.”

“సరే, దయచేసి కారును ఆ వైపు పార్క్ చేసి అక్కడ వేచి ఉండండి. నేను ఈ వస్తువులను లోపలికి తీసుకురావడానికి ఎవరినైనా పంపిస్తాను.”

శివా సంజన – ఎల్‌సిడి ప్రొజెక్టర్, ట్రైపాడ్, డిజిటల్ కెమెరా, ఇంకా రెండు ల్యాప్‌టాప్‌లను రాజభవనం లాంటి విశాలమైన ఫార్మల్ డ్రాయింగ్ రూమ్‌లో అమర్చారు.

***

సూపర్ స్టార్ తన పిఎ వెంటరాగా ఆ గదిలోకి వచ్చారు.

“మీరు మాకు చీరలు చూపించబోతున్నారా లేదా ఇక్కడ సినిమా షూట్ చేయబోతున్నారా?”

శివ నవ్వుతూ డిజైన్ చేసే విధానాన్ని వివరించాడు. అక్కడ అమర్చిన వివిధ పరికరాల ప్రయోజనాన్ని కూడా ఆయనకి వివరించారు.

“మరి ఈ అందగత్తె ఎవరు, శివా? నా హీరోయిన్ల కంటే చాలా బాగుంది.”

“నా భాగస్వామి, సర్. సంజన మేడమ్. మా షాప్‌ని స్థాపించడంలో ఆమె నాకు సహాయం చేశారు. ఆమె మీ అభిమాని, సర్.”

“సంజనా, నిన్ను కలవడం ఆనందంగా ఉంది.”

అతి ఆనందం వల్ల సంజన మాట్లాడలేకపోయింది.

సూపర్ స్టార్ తన పిఎకు ఆదేశాలు ఇచ్చారు.

“గణేశా, మొదట వీళ్ళకి తాగడానికి ఏదైనా ఇవ్వండి. తర్వాత ప్రతి ఒక్కరినీ ఇక్కడకు పిలవండి. తగినన్ని కుర్చీలు ఉన్నాయా లేదా చూడండి.”

ఇది చాలా పెద్ద కలయిక. నటుడి సోదరులు, సోదరీమణులు, అతని భార్య సోదరులు, సోదరీమణులు… ఇంకా పెళ్ళికొడుకు వైపు నుండి ఇరవై మంది ఉన్నారు.

శివ మాట్లాడటం ప్రారంభించాడు. సూపర్ స్టార్‌తో సహా అక్కడున్న అందరూ అందమైన యువ డిజైనర్‌ చేత మంత్రముగ్ధులవడానికి సిద్ధంగా ఉన్నారు.

***

పాపం శివ, అదే సమయంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని అతనికి తెలియదు.

అతను ఉన్న ప్రదేశానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇద్దరు ధూర్తులు శివని నిర్మూలించడానికి విఫలం కాని ప్రణాళికను రచిస్తున్నారు.

శివా, సంజన నటుడి ఇంటి గేటు దగ్గర వేచి ఉండగానే వారిని డిటెక్టివ్ ఏజెన్సీకి చెందిన వ్యక్తి ఫోటో తీశాడు.

ఆ వ్యక్తి తన కార్యాలయానికి పరుగెత్తాడు, ఫొటో ప్రింట్ అవుట్ తీసుకొని, దానిని రంగా సిల్క్స్ వద్ద వారికి అందజేశాడు.

శివతో పాటు మరో అమ్మాయి సూపర్ స్టార్ ఇంట్లోకి ప్రవేశించడం చూసి శివ బాబాయిలు విస్తుపోయారు.

“మురుగా, వీడు ఇక్కడ కూడా పాగా వేశాడు.”

“మనం ఏదో ఒకటి చేయాలి, సెల్వా.”

“వాడి షాప్‌ని తగలబెట్టాలా?”

“అలాగే చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. ఆ నటుడి కూతురు వివాహం కోసం వాడిని అన్ని చీరలను సేకరించనిద్దాం. చీరలన్నీ షాపులో ఉన్నప్పుడు, వాడూ, ఆ అమ్మాయి లోపల ఉన్నప్పుడు, షాప్‌కి నిప్పంటించాలి. ”

“నేను చూసుకుంటాను.”

“మళ్ళీ ఆలోచిస్తే, ఈ పనిని వెల్డింగ్ కుమార్‌కు అప్పగించడం మంచిదనిపిస్తోంది. అతను నిపుణుడు. కొంచెం డబ్బు ఎక్కువ తీసుకున్నా, పేలుడు వస్తువుల విషయంలో మాత్రం ఉత్తమమైనవాడు.”

“అలాగే”

“రేపు సాయంత్రం ఇక్కడికి రమ్మని వెల్డింగ్ కుమార్‌కి కబురుపెట్టు. మనిద్దరం కలిసే ఆర్డర్ ఇద్దాం. ఈసారి ఆ చిన్న రాక్షసుడు ఎలాంటి ఆనవాళ్ళూ లేకుండా నాశనం కావాలని కోరుకుంటున్నాను. ”

“సరే.”

(ఇంకా ఉంది)

Exit mobile version