సాధించెనే ఓ మనసా!-18

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 18వ భాగం. [/box]

[dropcap]శి[/dropcap]వ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. తనకి పొంచి ఉన్న ప్రమాదం గురించి అతనికి తెలియదు. ఎంతో ఆసక్తిగా డిజైన్ విధానాన్ని వివరించాడు.

శివ మొదటగా వధువును ఉద్దేశించి మాట్లాడాడు. ఆమె ఫొటోని తన ల్యాప్‌టాప్‌లో చూపించాడు. ఆమె ఫొటోలలో అతని డిజైన్లను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దాడు. రవికాంత్ నివ్వెరపోయాడు.

తరువాతి మూడు గంటలు శివ అందరికీ ఆకర్షణా కేంద్రంగా నిలిచాడు. సూపర్ స్టార్ వివిధ కార్యక్రమాలు, చీర-డిజైన్లకు సంబంధించిన చర్చలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

శివ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేశాడు, వారి ఫొటోలు తీశాడు; వారి రంగుల ప్రాధాన్యతలను గ్రహించాడు.

ఒక్కో వ్యక్తికి డిజైన్ ఖరారైన వెంటనే అంచనా వ్యయం గురించి సంజనకు చెప్పాడు శివ. ఖర్చులను జోడించి, అంచనాను ఆఖర్లో సూపర్‍స్టార్‌కి ఇవ్వమని ఆమెను కోరాడు.

వారు తమ పరికరాలను సర్దుకుంటూ ఉండగా, సూపర్ స్టార్ ఖర్చు గురించి అడిగారు. శివ సంజన రూపొందించిన నోట్‌ని సమీక్షించాడు.

“సుమారు రూ.27 లక్షలు, సర్.”

“మీకు ఇప్పుడు ఎంత కావాలి?”

అడ్వాన్స్ తీసుకోడానికి శివ అంతగా ఆసక్తి చూపలేదు. రెండు నెలల క్రెడిట్‌లో నూలు, జరీ ఇంకా మిగతావన్నీ పొందవచ్చు. అతను చీరలను తయారు చేసి అందివ్వగలడు, పూర్తి చెల్లింపు తరువాత పొందవచ్చు; తన సరఫరాదారులకు తరువాత చెల్లించవచ్చు అనుకున్నాడు.

అతను సంజన వైపు చూశాడు. శివ ఒక కళాకారుడిలా ఆలోచించగా, సంజన వ్యాపారవేత్తలా ఆలోచించింది.

సూపర్ స్టార్ దయగలవారు, మంచివారు. వారు ఆర్డర్‌ను రద్దు చేస్తే లేదా గణనీయమైన మార్పులు చేస్తే? ఆమె ప్రముఖుల నుండి దృఢమైన నిబద్ధతను కోరుకుంది.

ఆమె గొంతు సవరించుకుని, సూపర్ స్టార్‌తో మృదువైన స్వరంలో మాట్లాడింది.

“సర్, అవకాశం ఉంటే మేము మొత్తం డబ్బును ముందుగానే తీసుకోవాలనుకుంటున్నాము. తద్వారా మేము నూలు, జరీని నగదుతో కొనగలం, డిస్కౌంట్లు పొందగలం.

మాకు తగ్గిన ధరలనూ, మీకూ తగ్గిస్తాము, అయితే ఇది ఒక సలహా మాత్రమే, సర్. మీరు ఇచ్చేది మేము అంగీకరిస్తాము.”

“తెలివైన అమ్మాయి! ఇతనికి ఖచ్చితంగా మీలాంటి భాగస్వామి కావాలి.”

సూపర్ స్టార్ తన పిఎను పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు.

“మీ బ్యాంక్ ఖాతా వివరాలను నా పిఏకివ్వండి. అతను పూర్తి మొత్తాన్ని మీ ఖాతాలో వేస్తాడు. అంత నగదు తీసుకెళ్లడం సురక్షితం కాదు.”

“మెనీ థాంక్స్ సర్. ఇక మేము బయలుదేరవచ్చా?”

“అప్పుడే కాదు. మీరిద్దరూ మాతో భోజనం చేయాలి. గణేశా, భోజనం సిద్ధంగా ఉందో లేదో కనుక్కోండి. ”

పీఏ లోపలికి వెళ్ళాడు.

***

సూపర్ స్టార్, అతని దగ్గరి బంధువులలో పదిమంది, శివ, సంజన అతిథుల భోజనాల గదిలోని భారీ డైనింగ్ టేబుల్‌ మీద భోజనం చేశారు. సూపర్ స్టార్‌కి ఇరువైపులా శివ, సంజన కూర్చున్నారు.

తామేం తిన్నారో శివ సిల్క్స్ భాగస్వాములకు తెలియలేదు. గొప్ప నటుడి సామీప్యత, ఇంకా అతని స్నేహపూర్వక, నిస్సంకోచమైన స్వభావం వారికి చాలా నచ్చేసింది.

రంగనాథన్ గురించి శివతో మాట్లాడుతున్నారు రవికాంత్. ఆ సమయంలో తాను విదేశాలలో షూటింగ్‌లో ఉన్నందున అంత్యక్రియలకు రాలేకపోయానని చెప్పారు.

తర్వాత గొంతు తగ్గించి శివని అడిగారు,

“మీ బాబాయిలు మిమ్మల్ని మోసం చేశారని విన్నాను. దీనికి సంబంధించి మీకు ఏదైనా సహాయం కావాలంటే, దయచేసి నాకు తెలియజేయండి. నాకు అన్ని స్థాయిలలో తెలిసిన వ్యక్తులు ఉన్నారు.”

“థాంక్యూ సర్. వారు నా తల్లిని మోసం చేశారు; అన్ని పేపర్లలో ఆమె సంతకం తీసుకున్నారు. మేము ఇప్పుడు ఏమీ చేయలేము. ఇప్పుడీ కేసు మనందరికి పైన ఉంటున్న వ్యక్తి కోర్టులో ఉంది. అంతా ఆయన చూసుకుంటాడు.”

“బాధపడద్దు శివా. ఆయన కొంచెం ఆలస్యం చేయచ్చు కానీ న్యాయాన్ని ఎప్పుడూ తిరస్కరించలేదు. ”

అప్పుడు సూపర్ స్టార్ సంజన వైపు తిరిగారు.

“అమ్మాయీ, మీ నాన్నగారు ఏం చేస్తారు?”

“హృద్రోగ నిపుణులు. డాక్టర్ కన్నప్పన్.”

“మై గాడ్! మీరు డాక్టర్ కన్నప్పన్ కూతురా? మీకు తెలుసా? ఆయన నైపుణ్యాల పట్ల మాత్రమే కాకుండా వారి మంచి హృదయం పట్ల నేను ఆయన్ని గౌరవిస్తాను.

నా కుటుంబ సభ్యులకు నేను ఏమి చెప్పానో మీకు తెలుసా, నాకు గుండెపోటు వస్తే, నన్ను డాక్టర్ కన్నప్పన్ ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లాలి. అత్యాశగల డాక్టర్ చేతిలో చికిత్స పొందడం కంటే నేను మంచి మనిషి చేతిలో చనిపోవడానికే ఇష్టపడతాను’ అని.”

సంజన కదిలిపోయింది. తను చేత్తో తింటున్నాననే సంగతి పట్టించుకోకుండా ఆయనకి చేతులు జోడించి ఉక్కిరిబిక్కిరి చేసిన గొంతుతో మాట్లాడింది.

“సర్, దయచేసి ఇలా అనకండి సార్, మీకు గుండెపోటు రావడం అనే ఆలోచన కూడా నేను భరించలేను. మీరు లక్షలాది మందిని సంతోషపరుస్తున్నారు. మీలాంటి మంచి, సహృదయులకి ఎప్పటికీ ఇబ్బందులు రావు.

మీరు వంద సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ జీవించాలి. గుండెపోటు గురించి అస్సలు మాట్లాడకండి సార్.”

“ఏం అమ్మాయి గారూ, ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాలి, ఊరికే..”

సూపర్ స్టార్ హాస్యంగా అన్నప్పటికీ సంజన అతని కళ్ళలో కన్నీళ్ళు చూడగలిగింది.

సంజన, శివ హృదయాలు, కడుపులు నింపుకుని నటుడి ప్యాలెస్ నుండి బయటకు వెళ్ళిపోయారు.

***

పోలీసుల రికార్డులలోనూ, క్రిమినల్ సర్కిల్స్ లోనూ కుమార్, లేదా వెల్డింగ్ కుమార్ ప్రసిద్ది చెందినవాడు. అతనొక విభిన్నమైన రౌడీ. తెలిసిన వారు అతని గురించి ఆలోచించటానికి కూడా వణికిపోతారు.

క్రూరమైన హత్యను అమలు చేయడం అతనికి కంప్యూటర్ కోడ్ రాయడం లాంటిది. సంపూర్ణ వృత్తిపరమైన నిర్లిప్తతతో చంపగల అరుదైన కొద్దిమందిలో అతనొకడు.

అతని గురించి తెలియని వారు అతను రౌడీ అంటే నమ్మలేరు.

సిల్క్ కుర్తా, కాలం చెల్లిన రిస్ట్ వాచ్, వంటి మీద బోలెడు నగలు, టాటా సుమో వాహనంలో అనుచరులతో కలిసి నగరం చుట్టూ తిరగడం – తమిళ సినీ ప్రపంచం చూపించే ఈ రౌడీయిజం-చిహ్నాలన్నింటినీ సూక్ష్మంగా తప్పించిన వ్యక్తి కుమార్.

అతను ఎల్లప్పుడూ స్టైలిష్ పార్క్ అవెన్యూ రెడీమేడ్ ప్యాంటు, ఇంకా వాన్ హ్యూసెన్ ఫుల్‌హ్యాండ్స్ చొక్కా ధరించి ఉంటాడు. కళ్ళకి అత్యాధునిక రేబాన్ గ్లాసెస్ ధరించి, అధునాతన హోండా డాజ్లర్ బైక్‍పై తిరుగుతాడు, ఇవన్నీ చూస్తే అతను ఎవరికీ ఏ హాని చేయని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని ప్రజలు భ్రమపడతారు.

ఎప్పుడైనా రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు బళ్ళని ఆపి, పత్రాలని తనిఖీ చేస్తే – కుమార్ బండిలో ఆర్.సి., డ్రైవింగ్ లైసెన్స్, బీమా సహా ఇతర పత్రాలన్నీ చాలా ఖచ్చితంగా ఉంటాయి. సరైన కాయితాలు బండిలో లేకుండా బండి నడుపుతున్న కాలేజ్ స్టూడెంట్ ఎవరైనా ఎదురైతే, పోలీసు అధికారి ఆ విద్యార్థితో ఇలా అంటాడు,

“ఈ పెద్దమనిషిని చూడండి. మీరు అతనిలా పత్రాలను బండిలో ఉంచుకోవాలి. అతన్ని చూసి నేర్చుకోండి.”

కుమార్ ఒక అర్హత కలిగిన ఇంజనీర్, అతను ప్రముఖ ఇసిఇ బ్రాంచ్‌లో మేజర్. అతను కళాశాల నుండి బయటకొచ్చినప్పుడు, తన స్నేహితుల మాదిరిగానే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాలని; బెంగళూరు వంటి నగరంలో ఆధునికులైన అమ్మాయిలతో కలిసి జీవితాన్ని ఆస్వాదించాలని అనుకున్నాడు.

అతని కలలన్నీ పూర్తిగా మధ్యతరగతి శైలికి చెందినవి.

సరిగ్గా అతను పాసైన సమయంలోనే కంప్యూటర్ పరిశ్రమ మాంద్యంలోకి పడిపోయింది. ఫ్రెషర్లకు ఉద్యోగాలు లేవు.

తన వద్ద ఉన్న ఏకైక ఆస్తిని – తన గ్రామంలో వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టిన అతని తండ్రి నిరాశతో మరణించాడు. అతని తల్లి వైద్య ఖర్చులు, తమ్ముడి విద్య మరియు సోదరి వివాహం – ఇవి కుమార్ బాధ్యతలుగా మారాయి.

కానీ అవి పెద్ద పనులే. కుటుంబానికి రోజువారీ ప్రాతిపదికన ఆహారాన్ని అందించే మామూలు పని కూడా అధిగమించలేని సమస్యగా కనిపించింది.

పొరుగున ఉన్న ఒక ఎటిఎంను దోచుకోవడానికి స్థానిక రౌడీ కుమార్ సహాయం కోరాడు. ఆ రోజున కుమార్ పాతాళంలోకి ప్రవేశించాడు. అప్పట్నించి వెనక్కి తిరిగి చూడలేదు.

తన నిరక్షరాస్యులైన సహచరుల మాదిరిగా కుమార్ చిన్న దొంగతనాలకు పాల్పడలేదు. ఎప్పుడూ జేబులు కొట్టలేదు, గొలుసులు లాక్కోలేదు. ద్విచక్ర వాహనం దొంగిలించలేదు.

దొంగతనపు ఈ సగటు చర్యలు తన స్థాయికి తక్కువని అతను భావించాడు.

పాస్‌వర్డ్‌లను దొంగిలించడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల నుండి డబ్బును దొంగిలించడం అతనికి చాలా ఇష్టం. మోసంతో ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడం కూడా చాలా ఇష్టం.

కానీ అతని ప్రధాన ప్రత్యేకత బాణసంచా! తమ సొంత గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సృష్టించడానికి, బీమా సంస్థల నుండి డబ్బు పొందడానికి అనేక కంపెనీలు కుమార్‌ని నియమించుకున్నాయి.

ప్రత్యర్థి వ్యాపారాన్ని తగలబెట్టడానికి కూడా అతన్ని నియమించుకుంటారు. జనాలు ఎన్నడూ అతని ఫీజుతో బేరమాడరు.

సమయానికి సరుకు బట్వాడా చేయడంలో అతను గతంలో ఎప్పుడూ విఫలం కాలేదు. గతంలో ఎవరూ అతన్ని డబుల్ క్రాస్ చేయడానికి సాహసించలేదు.

***

వెల్డింగ్ కుమార్ ఇప్పుడు రంగ సిల్క్స్‌ స్టోర్‌లో రంగనాథన్ సోదరులతో విధ్వంసం గురించి చర్చిస్తున్నాడు.

ఈ వైట్ కాలర్ నేరస్థుడికి మురుగేశన్ తన వైపు వాస్తవాలను వక్రీకరించి చెప్పాడు.

“సూపర్ స్టార్ రవికాంత్ ప్రతిసారీ మా షాపు నుండి కొనేవాడు. తన మొదటి కుమార్తె వివాహం అయినప్పుడు అతను మా నుండి 50 లక్షల విలువైన చీరలు కొన్నాడు.

ఇప్పుడు ఈ వెధవ, అదే మా అన్నయ్య కొడుకు, మా గురించి చెడుగా చెప్పి, ఆర్డర్ తాను లాక్కుపోయాడు. డబ్బు గురించి కాదు, కుమార్. ఇది మా ప్రతిష్ఠకి సంబంధించినది.”

వెల్డింగ్ కుమార్‌కి ఇలాంటి అన్ని రకాల నాటకీయ అభ్యర్ధనలు పరిచయమే. అతని పెదవులపై చిరునవ్వు, నోటిలో ఒక చూయింగ్ గమ్! మనస్సులో ఒక ప్రణాళిక ఉంది.

డెస్క్ నుండి పెన్ను కోసం వెతుకుతున్నట్లు నటించాడు. పెన్నులు, పెన్సిల్స్ కలిగి ఉన్న ఒక పెట్టెను తీశాడు.

అందులోంచి ఒక పెన్ను తీసి తన జేబు-డైరీలో ఏదో రాశాడు. పెన్నును తిరిగి పెట్టెలో ఉంచినప్పుడు, అతను పెన్నుతో పాటు పెన్సిల్ షార్పనర్‌ను పోలి ఉండే ఒక చిన్న పరికరాన్ని అందులోకి జార్చాడు.

అది శక్తివంతమైన మైక్రోఫోన్. కుమార్ ఒక నేరస్థుడు, ఎటువంటి సందేహం లేదు. కానీ అతను తన ఖాతాదారులకు ద్రోహం చేయలేదు.

అదే సమయంలో తనను నియమించుకున్న వారు తనకన్నా దారుణమైన నేరస్థులు అని అతనికి తెలుసు. ఒక వేళ పోలీసులకి దొరికిపోతే, తనని ఇరికించి వాళ్ళు తప్పించుకోడానికి ఏ మాత్రం సందేహించరని తెలుసు.

అటువంటి అత్యవసర పరిస్థితుల నుండి తనని తాను కాపాడటానికి అతను తన ఖాతాదారుల వద్ద కొన్ని దోషారోపక సాక్ష్యాలను విడిచిపెడతాడు, తరువాత వారితో శత్రుత్వం ఏర్పడితే వారిని బ్లాక్‌మెయిల్ చేయటానికి వాటిని ఉపయోగిస్తాడు.

పెన్సిల్-షార్పనర్‌లా ఉన్న ఆ పరికరం ఒక చిన్న ట్రాన్స్‌మిటర్, దానికి శక్తివంతమైన నికెల్ కాడ్మియం బ్యాటరీ ఉంది, అది రెండు నెలల పాటు ఆగకుండా పనిచేసేలా తగినంత అంతర్నిర్మిత శక్తిని కలిగి ఉంది.

ఆ గదిలో ఏమి జరిగిందో – నాలుగు బ్లాకుల దూరంలో ఉన్న ఆటోమొబైల్ గ్యారేజీలో ఉంచిన ప్రత్యేక రిసీవర్‌కి ట్రాన్స్‌మిటర్ రిలే చేస్తుంది.

ఆ గ్యారేజి కుమార్ మిత్రుడిది. ప్రతీ రోజూ, 24 గంటలలో ఆ గ్యారేజ్ లోకి కుమార్‌ ఎపుడైనా వెళ్ళగలడు. రెండు, మూడు రోజులకు ఒకసారి అతను అక్కడికి వెళ్ళి రికార్డింగ్ వింటాడు.

ఇలాంటి ‘రిసీవింగ్ సెంటర్స్’ కుమార్‌కి నగరంలో రెండు డజన్లకు పైగా ఉన్నాయి.

***

మురుగేశన్ కుమార్‌కు కొన్ని ఫొటోలు ఇచ్చాడు.

“ఇది వాడి ఫొటో. పక్కన ఉన్న అమ్మాయి వాడి భాగస్వామి. వాడి షాపు, ‘శివ సిల్క్స్’ ఉన్న ప్రదేశాన్ని చూపించే మ్యాప్ ఇక్కడ ఉంది. షాపు తగలబడిపోవాలి.

దుకాణానికి నిప్పంటించినప్పుడు వాడు, ఆ అమ్మాయి లోపలే ఉండేలా చూడండి. అతనివి, ఆ అమ్మాయివి జాడలేవీ ఆ దుకాణంలో ఉండకూడదు.”

“ఈ పని వెంటనే చేయాలా?”

“వద్దు. తన కుమార్తె వివాహం కోసం సూపర్ స్టార్ పెద్ద ఆర్డర్ ఇచ్చారు. అతను ఆ చీరలు సిద్ధం చేయడానికి మూడు వారాలు పట్టవచ్చు.

అన్ని ఆర్డర్-చీరలు, అబ్బాయి, ఇంకా అమ్మాయి తప్పించుకునే మార్గం లేకుండా లోపల చిక్కుకున్నప్పుడు దుకాణం కాలిపోవాలి.”

మురుగేశన్ గొంతులోని కోపం కుమార్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అతను ముఖం మీద వినోదభరితమైన రూపంతో చూయింగ్ గమ్ నమలసాగాడు.

“ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. హ్యాండ్ గ్రెనేడ్ తీసుకుని… లేదా కొంత ఆర్డీఎక్స్ ఉంటే… ”

కుమార్ అతని మాటలని మధ్యలోనే ఆపాడు.

“ఏం చేయాలో మీరు చెప్పండి. దాన్ని ఎలా చేయాలో మీ పని కాదు. మనం ఎవరి పనులకు వాళ్ళం కట్టుబడి ఉండటం మంచిది. ఒకరి పనులలో ఒకరు జోక్యం చేసుకుని ప్రమాదం కొనితెచ్చుకోవద్దు.”

ఇప్పటి వరకూ మురుగేశన్‌తో ఎవరూ అలా మాట్లాడలేదు. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి.

తనను తాను నియంత్రించుకోవాలని సెల్వకుమార్ అతనికి సంకేతాలు ఇచ్చాడు. కుమార్ పట్టించుకోలేదు.

“సరే, మీకు ఎంత కావాలో చెప్పండి?”

“ఇరవై లక్షలు.”

“అందులో ఇప్పుడు ఎంత కావాలి?”

“ఇరవై లక్షలు.”

“ఇప్పుడు 50% ఇస్తాను, మిగిలినది పని ముగిసిన తర్వాత.”

“నేను ఎవరని అనుకుంటున్నారు? మీ సరఫరాదారుడిని అనా? మనం చేస్తున్నది చీరల వ్యాపారం కాదు… నేరం. మీ సాధారణ 60 రోజుల క్రెడిట్ నిబంధనలను నా నుండి ఆశించవద్దు.

నేరం జరిగిన తర్వాత ఎవరు ఏ స్థలంలో ఉంటారో తెలియదు. మీరు నన్ను విశ్వసిస్తే, పూర్తి డబ్బు ఇప్పుడే ఇవ్వండి. లేకపోతే ఈ పనిని వేరొకరికి అప్పగించండి. ఇంకా సమయం ఉంది.”

మురుగేసన్ తన అహంకారాన్ని మరోసారి దిగమింగవలసి వచ్చింది. ఉండమని కుమార్‌ని వేడుకున్నాడు. అనంతరం సెల్వాకు సంకేతాలు ఇచ్చాడు.

సెల్వా నగదు తీసుకురావడానికి గది నుండి బయలుదేరాడు.

“ఖర్చుల కోసం మరో లక్ష తీసుకురమ్మని అతనికి చెప్పండి.”

“ఏం ఖర్చులు?”

“వివాహ చీరలు అక్కడికి చేరుకున్న తర్వాతే షాపును తగలబెట్టాలని మీరు కోరుకుంటున్నారు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది?

నేను నా మనుషులను పంపించి ఆ షాపు వారి విశ్వాసాన్ని గెలుచుకోవలసి ఉంటుంది. నేను కొన్ని చీరలు కొని నగదుగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే నేను వారి నమ్మకాన్ని గెలుచుకోగలను.

మీరు నన్ను నమ్మకపోతే నేను ఆ లక్షకు ఎకౌంట్ ఇస్తాను. నేను వారి బిల్లులు ఇచ్చి చీరలను మీకు తిరిగి ఇస్తాను. సరేనా?”

“అవసరం లేదు. సెల్వా, ఇతనికి 21 లక్షలు ఇచ్చేయ్.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here