Site icon Sanchika

సాధించెనే ఓ మనసా!-19

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 19వ భాగం. [/box]

[dropcap]త[/dropcap]మని నెమ్మదిగా చుట్టుముడుతున్న ప్రమాదం గురించి పట్టించుకోకుండా శివ, సంజన సూపర్‍ స్టార్ కుమార్తె వివాహపు ఆర్డరుతో బిజీగా ఉన్నారు.

శివ తదుపరి వారం మొత్తం చీరల డిజైనింగ్‌లో గడిపాడు. తన డిజైన్లకు ఆమోదం పొందడానికి సూపర్‍ స్టార్‌తో మరోసారి అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు.

ఇప్పుటికి ఆ చీరలన్నీ శివ కంప్యూటర్లలో ఎలక్ట్రానిక్ రూపంలో మిగిలిపోయాయి. వాటికి నిజరూపం కల్పించడానికి ఎంతో పట్టు నూలు, జరీలను కొనుగోలు చేయాలి, పనిని నేత కార్మికులకు అప్పగించాలి. శివకి కొన్ని భయాలు ఉన్నాయి.

“మేడమ్, ఇప్పటికే ఎవరో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నేను అనుమానిస్తున్నాను. సూరత్‌లోని జరీ సరఫరాదారు అకస్మాత్తుగా సరఫరా చేయడానికి నిరాకరించారు. ఇది మా బాబాయిల పని కావచ్చు. కానీ నేను ఖచ్చితంగా చెప్పలేను. నూలు, జరీ కోసం ఈ రకమైన ఆర్డర్‌తో మనం మార్కెట్‌కు వెళితే, అందరికీ తెలుస్తుంది. అప్పుడు మా బాబాయిలు అసలు మనకు సరుకు దొరక్కుండా చేయవచ్చు.”

సంజనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది.

“శివా, మనం ముడి పదార్థాలను కొంటున్నామని మార్కెట్‌కు తెలియనిద్దాం. కానీ నేరుగా సరఫరాదారులను సంప్రదించడానికి బదులుగా మనం, విను ద్వారా, ఎంఎస్ సిల్క్స్ ద్వారా వెళ్దాము.

వారి ఓవర్ హెడ్స్ కోసం ఒక చిన్న శాతాన్ని జోడించమని అడుగుదాము. వీళ్ళు ఇప్పటికే మార్కెట్లో బాగా స్థిరపడినందున, వారు తమ సాధారణ కోటా కంటే కొంచెం ఎక్కువ కొనుగోలు చేస్తే ఎవరూ సందేహించరు.

మనం వీళ్ళకు వెంటనే డబ్బు చెల్లిస్తాము. వారు పూర్తి క్రెడిట్ కాలానికి డబ్బును కలిగి ఉంటారు. వారికి రొటేషన్‌కి నగదు ఉంటుంది, ఈ వాణిజ్యంలో అది పెద్ద తలనొప్పి కదా, అది తీరుతుంది.”

శివ తన భాగస్వామితో కరచాలనం చేశాడు.

“సూపర్ ఐడియా, మేడమ్.”

శ్రీనివాస్ సిల్క్స్, ఎంఎస్ సిల్క్స్ ఈ ప్రాజెక్టుకు సహాయం చేసేందుకు సంతోషంగా ఒప్పుకున్నాయి.

***

సంజన షాపులో ఎక్కువ సమయం గడిపింది. శివ ఎక్కువ సమయం బయట తిరుగుతున్నాడు. కొన్నిసార్లు ఉత్పత్తిని పర్యవేక్షించడానికి కాంచీపురంలో మూడు, నాలుగు రోజులు శివ ఉండాల్సి వచ్చింది.

పెళ్ళిళ్ళ సీజన్ జోరుగా ఉంది. శివ సిల్క్స్ చాలా మంచి అమ్మకాలను జరిపింది. క్యాష్ ఫ్లో చాలా బాగుంది, పద్మ ఇచ్చిన ఐదు లక్షలను తిరిగి చెల్లించారు.

బ్యాంకు రుణం వాయిదాలు సకాలంలో చెల్లించారు.

***

అది శనివారం. సాయంత్రం ఆరు గంటలకు ఒక మహిళ శివ సిల్క్స్ లోకి ప్రవేశించింది. ఆమె ముఖం మీద మేకప్ అధిక మోతాదులో ఉంది. ఆమె ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను పూసుకుంది. జుట్టుని వదులుగా వదిలేసింది.

“ఐ వాంట్ టు సీ మిస్టర్ శివ” అంది.

ఆమె ఇంగ్లీష్ సహజమైనది కాదు. ఆమె మాటతీరు ఆ ప్రవర్తన ఆమెకి కొత్తని చెప్పనే చెబుతోంది.

సంజనకు చిరాకు వచ్చింది.

“ఇప్పుడు అతన్ని కలవడం కుదరదు.”

“నాకు పెళ్ళి కుదిరిందండీ. నా కోసం కొన్ని చీరలు శివ డిజైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను.”

“ఒక నెల తరువాత రండి. శివ మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు.”

“మేడమ్, మీరు ఎవరో తెలుసుకోవచ్చా?”

“నేను శివ భాగస్వామిని, నా పేరు సంజన.”

“ఓహ్ మీరేనా ఆ సంజనా? ఐశ్వర్య మీ గురించి గొప్పగా చెప్పింది.”

“అంటే మీ ఉద్దేశం ఐశ్వర్య రాయ్ బచ్చన్ అనా?”

“ఓహ్, మీకు హాస్య చతురత ఎక్కువే. ఐశ్వర్య నా స్నేహితురాలు. సూపర్‍ స్టార్ రవికాంత్ పెద్ద కూతురు.”

సంజన మెత్తబడింది.

“ఓహ్, అయితే, ఆమె తన సోదరి వివాహం గురించి మీకు చెప్పే ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చీరలు మేమే రూపొందిస్తున్నాం. శివ ఆ పనుల్లోనే కొంచెం బిజీగా ఉన్నాడు.”

“ఆమె నాకు చెప్పింది. నన్ను పెళ్లికి ఆహ్వానించింది. ఆమె మిమ్మల్ని, శివని బాగా పొగిడింది. కాబట్టి నేను నా పెళ్లి చీరలను మీ నుండి కొనాలని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా పెళ్ళి తేదీ ముందే వస్తుంది.”

“నన్ను క్షమించండి.”

“పర్లేదు. అయితే, నేను ఒట్టి చేత్తో తిరిగి వెళ్లడానికి ఇష్టపడను. 20000 రూపాయల ధరలో కొన్ని చీరలు నాకు చూపించగలరా? ”

“తప్పకుండా.”

సంజన సేల్స్ గరల్‍కి సంకేతాలు ఇచ్చింది.

“ఇక్కడకు రండి మేడమ్.”

ఆ మహిళ కేవలం పది నిమిషాలు చీరలను చూసి 25000 రూపాయలకి కాస్త ఎక్కువ ధర ఉన్న చీరని తీసుకుంది. ఎటువంటి డిస్కౌంట్ అడగలేదు, పూర్తి మొత్తాన్ని నగదుగా చెల్లించింది. అన్నీ వెయ్యి రూపాయల నోట్లలో.

ఇది సంజనను ఆకట్టుకుంది. త్వరిత అమ్మకం. బేరం లేదు. పైగా వెంటనే నగదు చెల్లింపు. ఏ కస్టమర్‍లో అయినా వ్యాపారికి నచ్చే గుణాలు.

“మేడమ్, కాఫీ లేదా కూల్ డ్రింక్స్ తీసుకుంటారా?”

“థాంక్యూ. కానీ వద్దు. ”

“మీరు మీ పేరు ఇంకా చెప్పలేదు మేడమ్.”

“మీరు ఇంతవరకు నన్ను అడగలేదు, సంజనా. నా పేరు లత.”

మహిళలిద్దరూ కరచాలనం చేసుకున్నారు.

“లతా, మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి. ”

“తప్పకుండా, సంజన. నా పెళ్లికి నా చీర బడ్జెట్ లక్ష. నా తల్లిదండ్రులు లేరు. నన్ను అత్త పెంచింది. నా కాబోయే భర్త TCSలో పనిచేస్తారు.

మాది ప్రేమ వివాహం. ఈ లక్ష రూపాయలు ఆయన నాకిచ్చిన బహుమతి. ఐశ్వర్య మీ షాప్‌ని సిఫారసు చేసింది. నాదో అభ్యర్థన సంజనా.

శివకి కొంత ఖాళీ సమయం ఉంటే, దయచేసి నా కోసం కనీసం ఒక చీరను డిజైన్ చేయమని అడగగలరా?”

“సూపర్‍ స్టార్ కూతురి పెళ్ళి ఆర్డర్ పూర్తి అయిన తర్వాత మాకు కొంత సమయం మిగిలితే, శివ మీ కోసం తప్పకుండా డిజైన్ చేస్తాడు.”

“వాళ్ళకి చీరల డెలివరీ ఎప్పుడు చేయబోతున్నారు?”

“మూడు లేదా నాలుగు వారాలు పట్టచ్చు.”

“అంటే, నాకు చాలా ఆలస్యం అవుతుంది. జాకెట్లు కుట్టించుకోడానికి సమయం ఉండదు. ఏమైనా నా కాబోయే భర్తతో ఒక మాట చెబుతాను. మీకు తెలుసా సంజనా, మీరంటే నాకిష్టం. శివ చీర డిజైన్ చేసినా, చేయకపోయినా నా మొత్తం లక్షను మీ షాపులోనే ఖర్చు చేయాలనుకుంటున్నాను.”

“ధన్యవాదాలు, లతా.”

“ఐశ్వర్య – అంటే -సూపర్‍ స్టార్ కుమార్తె – మీ దుకాణానికి రావాలని అనుకున్నారు. కానీ ఆమెకు జనసమూహామంటే అలెర్జీ. చివరిసారిగా ఆమె స్పెన్సర్ ప్లాజాలోని ఒక షాప్‌ని సందర్శించినప్పుడు ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది, పెద్ద తొక్కిసలాట లాంటిది జరిగింది”

“అవునా”

“ఒక ఆలోచన. ఐశ్వర్య ఇక్కడికి రావడానికి బదులుగా, నేను మీ షాప్ ఫొటోలు తీసి ఆమెకు చూపిస్తే పోలా? మీకు అభ్యంతరం లేకపోతేనే.”

“ఏం పర్వాలేదు, లతా. ఫొటోలు తీసుకోండి.”

“మీరు కౌంటర్ ముందు నిలబడండి, సంజనా. మిమ్మల్ని ఒక ఫొటో తీస్తాను, చాలా అందంగా కనబడుతున్నారు.”

***

లత వెల్డింగ్ కుమార్ ప్రేయసి అని సంజనకు తెలిసే అవకాశం లేదు. షాప్ లే-అవుట్ గురించి కుమార్‍కి సమాచారం అందించడానికి ఆమె షాపుకి వచ్చింది.

సంజన లతకి షాప్ అంతా, డిజైన్ సెంటర్ తిప్పి చూపించింది. లత డజనుకు పైగా ఫొటోలు తీసింది.

షాపు ప్రధాన ఎలక్ట్రికల్ స్విచ్-బోర్డ్ స్థానం, జనరేటర్ స్థానం, వారు సాధారణంగా చీరలను భద్రపరిచే ప్రదేశం, షాపు క్లోజింగ్, ఓపెనింగ్ సమయాలు, షాపులోని ఉద్యోగుల సంఖ్య, రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా ఇలాంటివే మరెన్నో విషయాల గురించి సమాచారం సేకరించమని, ఫొటోలని తీయమని కుమార్ ఆమెను ఆదేశించాడు.

రాత్రి 8 గంటలకు లత బొటిక్ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆమె వద్ద అన్ని ఫొటోలు, ఇంకా తన ప్రియుడు కోరుకున్న సమాచారం ఉన్నాయి.

***

ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు లత కుమార్‌ను తాము ఎప్పుడూ కలుసుకునే స్థలంలో కలిసింది. ఆమె అన్ని ఫొటోలను బ్లూటూత్ ద్వారా కుమార్ మొబైల్‌కు పంపింది, తన దగ్గరున్న సమాచారమంతా అతనికి వెల్లడించింది.

“శభాష్, లతా.”

ఆమె అక్కడ కొన్న చీరను కూడా చూపించింది.

“చాలా బాగుంది. ఇది నీ కోసమే. నువ్వు ఆ దుకాణంలో మొత్తం లక్ష రూపాయలు ఖర్చు చేయవచ్చు.”

“నువ్వు ఏం చేయబోతున్నావు? ఆ అందమైన అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నావా? ”

లత ఇప్పుడు మాతృభాషలో సంభాషిస్తోంది. ఆమె ఎక్కువగా మాట్లాడే భాష అది.

ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు కాని ఆమె స్థానిక భాషలో సహజంగా ఉంటుంది. ఆమె సంజనతో మాట్లాడినప్పుడు డాబుసరిగా ఉండాలనే కోరిక ఉంది; కానీ ఇప్పుడు ఆమె గొంతులో నిజమైన ఆందోళన ఉంది.

“లేదు ప్రియా. నేను ఎప్పుడూ ఆడవాళ్ళ జోలికిపోను. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి లోపల ఉండగా, మొత్తం షాపును తగలబెట్టబోతున్నాను. ఈ పనికి నాకు 20 లక్షలు వచ్చాయి. ”

లత విస్మయానికి లోనయ్యింది.

“వద్దు కుమార్, దయచేసి అలా చేయవద్దు. అమ్మాయి అందమైనది. ఆమె ఎంతో మర్యాదస్తురాలు. నేను కోరుకున్నన్ని ఫొటోలు తీయడానికి అంగీకరించింది.

ఆమె పెద్దింటి కుటుంబం నుండి వచ్చినట్లు అనిపిస్తోంది. పైగా షాపు అద్భుతంగా ఉంది. నేను చాలా సంవత్సరాలుగా అనేక చీరల కొట్లను చూస్తున్నాను; ఇంత అందంగా డిజైన్ చేసిన షాపుని ఎప్పుడూ చూడలేదు. చాలా బావుంది. చాలా హోమ్లీ అనిపిస్తుంది, నీక్కూడా.”

“ఇప్పుడు నా పని అందాన్ని ఆస్వాదించడం కాదు. నేను నేరస్థుడిని. షాపుని, దాని యజమానులతో పాటు దహనం చేయడానికి నన్ను నియమించారు. నేను అలా చేయబోతున్నాను. అంతే.”

తన ప్రియుడితో వాదించడంలో అర్థం లేదని లతకు తెలుసు.

వెల్డింగ్ కుమార్ ఆమె ముఖంలోని భావాలను చూశాడు. అతను కొద్దిగా ఆందోళన చెందాడు. తన ప్రణాళిక గురించి ఆమెకు చెప్పి ఉండకూడదు అనుకున్నాడు.

ఆమెకి అబద్దం చెప్పి ఉండాల్సింది. తను ఆ షాపుని కేవలం దోచుకోబోతున్నాని అతను ఆమెకు చెప్పి ఉండాల్సింది. అప్పుడు లత పట్టించుకోదు.

ఏదో ఒక విధంగా లతను ఈ పథకంలోకి లాగాలి; లేకపోతే కుమార్ ప్రమాదంలో పడతాడు.

“నేను ఇదంతా నీ కోసమే చేస్తున్నాను డార్లింగ్. గత నాలుగు సంవత్సరాలుగా నువ్వు పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నావు. ఈ సంవత్సరం చేసుకోవాలని నేను  నిర్ణయించుకున్నాను.

నాకు బ్యాంకులో కొంత నగదు ఉంది. పైగా ఈ ఇరవై లక్షల నగదు వచ్చింది. మన కోసం ముగప్పైర్‍లో టు బెడ్ రూమ్ ఫ్లాట్ కొంటాను. దాన్ని నీ పేరు మీద రిజిస్టర్ చేస్తాను. తద్వారా నీకు జీవితంలో కొంత భద్రత ఉంటుంది.

ఆ అందమైన ఫ్లాట్‌లో మనం మన కొత్త ఇంటిని ఏర్పర్చుకుంటున్నాం. ఇక నేరాలు లేవు. చాలా మంది పిల్లలతో సంతోషకరమైన జీవితం గడుపుదాం. ఏమంటావు?”

లత శాంతించింది.

(ఇంకా ఉంది)

Exit mobile version