సాధించెనే ఓ మనసా!-22

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 22వ భాగం. [/box]

[dropcap]ల[/dropcap]త ఉద్దేశాలు మంచివే అయినా, ఆమె చర్యలు చాలావరకు స్వీయ-దోషారోపకమైనవే. ఆమె తన ప్రియుడిలా నేర ప్రపంచపు మార్గాలకు అలవాటు పడలేదు.

పాపం లత, తన పోస్ట్ పెయిడ్ మొబైల్ కనెక్షన్ నుండి అన్ని కాల్స్ చేసింది. నిప్పు అంటుకోవడానికి ముందే చాలా కాల్స్ ముగిశాయి.

మరో రెండు రోజుల్లో ఆమెను పట్టుకున్నారు. ఆమె ప్రియుడు వెల్డింగ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు.

***

అపోలో ఆసుపత్రి ఐసియు వెలుపల కారిడార్లో విరామం లేకుండా పచార్లు చేస్తున్నారు డాక్టర్ కన్నప్పన్. తన భార్యతో ఏమీ చెప్పలేదాయన.

తమ ఏకైక కుమార్తె తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతోందన్న వార్తలను ఆ తల్లి బలహీనమైన గుండె తట్టుకోగలదో లేదో ఆయనకి తెలియదు.

ఆయన దుఃఖాన్ని పంచుకోవడానికి పక్కన ఎవరూ లేరు. అది ఆయనకి మరింత చికాకు కలిగించింది. శివ, పద్మ, మాల్యా తన వైపు పరుగెత్తుకు రావడం చూసినప్పుడు ఆయనకి ఎంతో ఉపశమనంగా అనిపించింది.

ఆయన శివ చేతులు పట్టుకొని ఐదేళ్ల పిల్లాడిలా ఏడ్చారు.

శివ ఆయనని మెల్లగా కౌగిలించుకుని కొంతసేపు ఏడవనిచ్చాడు.

కన్నప్పన్ తనను తాను కుదుటపరుచుకుని, గొంతు సవరించుకుని, శివతో దాదాపుగా గుసగుసలాడుతున్నట్టుగా మాట్లాడారు.

“ఆమె సురక్షితంగా ఉంది. ఆమెకి నయమవుతుందని వైద్యులు చెప్పారు. ఆమెను తొందరగానే కాపాడారు, అందువల్ల కాలిన గాయాలు నయం అవుతాయి.

ఎటువంటి మచ్చలు ఉండవు. ఆమె కుడి కాల్లో కాంపౌండ్ ఫ్రాక్చర్ అయింది. అది నయం కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, శివా, తను షాక్‌ని తట్టుకోలేకపోయింది. ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది.

ఆమెకు స్పృహ రప్పించడానికి వైద్యులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆమె కోమాలోకి వెళ్ళిపోతుందని వారు ఇప్పుడు భయపడుతున్నారు. లేదా ఇప్పటికే, ఆమె ఒక రకమైన కోమాలో ఉండి ఉండవచ్చు.

ఆమె సన్నిహితులైనా ఎవరైనా ఆమె చేతులు పట్టుకుని ఆమెతో మాట్లాడుతుంటే ఆమె స్పృహలోకి రావచ్చు.

నేను అలా చేయటానికి ప్రయత్నించాను, శివా. కాని నేను ఆమెను ఆ స్థితిలో చూసినప్పుడు నేను బాధతో కేకలు వేయగలిగాను. ఒక్క మాట కూడా నా నోటి నుండి రాలేదు.

నువ్వే ఏదో ఒకటి చేయి, శివా. నా ఏకైక కుమార్తె జీవితం నీ చేతుల్లో ఉంది. ప్లీజ్… శివా…”

ఏం చేయాలో శివకి తెలుసు.

“అలా చేయడానికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు సర్. ఇప్పుడే ఆయన్ని పిలుస్తాను. ”

డాక్టర్ కన్నప్పన్‌కి శివ చెప్పినది అర్థం కాలేదు. లేదా ఆయన అర్థం చేసుకునే మానసిక స్థితిలో లేరు.

***

శివ పక్కకు వెళ్లి సంజన ప్రేమికుడు శంకర్‌కి ఫోన్ చేశాడు. అతనికి ఎక్కువ షాక్ ఇవ్వకుండా అగ్ని ప్రమాదం గురించి, సంజన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాడు. సంజనని స్పృహ లోకి రప్పించడానికి సహాయం కోరాడు.

శంకర్ స్వరం అసాధారణంగా ప్రశాంతంగా ఉంది.

“శివా, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా?”

“ఇదేంటి సార్? ఇది సందేహించే సమయమా? మీరు మీ స్నేహితులతో వచ్చి నన్ను కొట్టారు. అయినా కూడా మీ సందేహాలు తొలగలేదు. సర్, సంజన మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తోంది.

నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్, నేను మీ ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నాను, దయచేసి… దయచేసి ఆమెను నిరాశపరచవద్దు. ఆమెకు మీరు ఇప్పుడెంతో అవసరం.”

“నిన్ను కొట్టడం నా జీవితంలో నేను చేసిన అత్యంత మూర్ఖపు పనులలో ఒకటి. అందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను, శివా. ప్లీజ్ నన్ను క్షమించు. ”

“సర్, నేను ఇప్పటికే అవన్నీ మర్చిపోయాను. మీరు మేడమ్ ప్రియులు. ప్రస్తుతం మేడమ్‌కు మీరు కావాలి. ఆమె కోమా నుండి మేల్కొలపడానికి ఆమెకు మీ ప్రేమపూర్వక మాటలు అవసరం. దయచేసి రండి సర్.”

“నేను వస్తాను. కానీ ఒక షరతుపై. నువ్వు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. నువ్వు సంజనను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పకుండా మొదటి నుండి తప్పించుకుంటున్నావు.”

“ఆ ప్రశ్న లేదా నా సమాధానం ఇప్పుడు అవసరం కాదు సర్. సంజనని స్పృహలోకి రప్పించాలి. ఇది మాత్రమే ముఖ్యం. “

“చూడు, శివా. నువ్వు ఇప్పుడు కూడా దీనికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు చాలా మంచి మనిషివి. నీకు ఇప్పుడు కూడా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీకు మనసు రావడం లేదు.”

“కానీ సంజన మిమ్మల్ని ప్రేమిస్తుంది సార్. అదే ఇప్పుడు ముఖ్యం.”

“నీ నిజాయితీకి నా నమస్కారం, శివా. కానీ నేను చెబుతున్నాను, నువ్వో మూర్ఖుడివి. అవివేకివి. తెలివితక్కువ వాడివి.”

“సర్, ఏమంటున్నారు…“

శివ విస్తుపోయాడు. ఈ సమయంలో శంకర్ తన ఉద్రేకాన్ని చూపిస్తాడని శివ ఎప్పుడూ ఊహించలేదు.

“ఓరి మూర్ఖుడా, దద్దమ్మా… సంజన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తోందని నీకు తెలియదా? అవును, ఆమె నాతో ఒకప్పుడు ప్రేమలో ఉండేది. మేము తరచూ కలుసుకున్నాం, చాలా మాట్లాడుతున్నాం, కాని అంతకు మించి ముందుకు వెళ్ళడానికి భయపడ్డాం.

పైగా నేను నిన్ను కొట్టడం నాకు మేలు చేయలేదు. ఆమె తనతో రెండు నెలలు మాట్లాడవద్దని చెప్పడానికి ఆ రాత్రి నాకు ఫోన్ చేసింది. ఇది నాకు శిక్ష అనీ, అందుకు నేను అర్హుడినని భావించాను.

ఆ రెండు నెలల్లో చాలా విషయాలు జరిగాయి. నేను ఆమెకంటే 14 సంవత్సరాలు పెద్దవాడిని. మేం పెళ్ళి చేసుకుంటే ఈ వయస్సు వ్యత్యాసం మా మధ్య అంతరాలు కలిగిస్తుందని నేను భావించాను.

“పాపం ఆ అమ్మాయి, ఇప్పటికే జీవితంలో చాలా బాధపడింది. ఇప్పుడీ సంబంధం కూడా అపజయంలో ముగియాలని నేను కోరుకోను. రెండు నెలల విరామం ఆమెను కూడా మార్చింది.

ఆమె నిన్ను ప్రేమిస్తోందని నాకు చెప్పడానికి ఆమె గడువు చివర్లో ఫోన్ చేసింది. ఆమె నీ గురించి తప్ప మరెవరి గురించి ఆలోచించలేదు.

అయితే ఆమె తన ప్రేమను వెల్లడించడానికి కొంచెం సంకోచించింది, ఎందుకంటే ఆమె నీకన్నా ఐదేళ్ళు పెద్దది, పైగా చాలా అందంగా ఉన్నావని; ఇంకా నీకు గొప్ప భవిష్యత్తు ఉందని ఆమె భావించింది. తనను తాను నీపై రుద్దడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమె నీ గురించి రాత్రింబవళ్ళూ ఆలోచిస్తూనే ఉంది.

శివా, ఇదే సరైన సమయం. ఆమె గదిలోకి వెళ్ళు. తన చేతులు పట్టుకో. ఆమె కాలిన ముఖాన్ని ముద్దాడు. నీ ప్రేమను వెల్లడించు. ఆమె మేల్కొంటుంది. నువ్వు అదృష్టవంతుడివి, శివా. ఆ అందమైన దేవకన్యలాంటి అమ్మాయితో నీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడవాలని కోరుకుంటున్నాను.”

శివ ఏదో గొణుగుతూ, డిస్‌కనెక్ట్ చేసి, సంజన గదికి పరిగెత్తాడు.

***

డాక్టర్ కన్నప్పన్ ఇన్‌ఛార్జి డాక్టర్‌తో మాట్లాడుతున్నారు.

శివ వారిని పట్టించుకోలేదు. సంజన అపస్మారక స్థితిలో ఉంది. ఆమె నుదుటి మీద పెద్ద కట్టు ఉంది. ఆమె కుడి కాలు స్లింగ్ మీద వేలాడదీయబడింది.

ఆ గదిలో మరో ఇద్దరు పురుషులు ఉన్నారని శివ పట్టించుకోలేదు. వంగి కట్టు కట్టి ఉన్న సంజన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు.

అతను ఆమె సన్నని చేతిని తీసుకొని తన చేతిలో ఉంచుకున్నాడు. అప్పుడు అతను వంగి, తన నోటిని ఆమె కుడి చెవి దగ్గరికి తీసుకువచ్చాడు, తన ప్రేమను వెల్లడించాడు.

సంజన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రియా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

నేను మొదటిసారిగా నువ్వు కారు నుండి దిగడం చూసినప్పుడు, మీ సెక్యూరిటీ గార్డు నా తలపై కొట్టినప్పుడు, నేను నీతో ప్రేమలో పడ్డాను.

కానీ నీకు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వు ప్రపంచస్థాయి అందగత్తెవి. లక్షాధికారికి ఏకైక కూతురివి.

నేను మీ దగ్గర జీతానికి పని చేసే ఉద్యోగిని. కానీ నేను నా మనస్సును నీపై నుంచి తప్పించలేకపోయాను. నీ వల్ల నేను చాలా రోజులుగా నిద్ర పోలేకపోయాను.

వినూ నా చదువు, నా డిజైనింగ్ సామర్ధ్యాల గురించి చెప్పినప్పుడు, నీ పుట్టినరోజున నువ్వు నాకు ట్రీట్ ఇచ్చినప్పుడు, నేను నీకు ప్రపోజ్ చేయాలని అనుకున్నాను.

కానీ అదే సమయానికి నువ్వు శంకర్‌తో నీ ప్రేమ గురించి మాట్లాడావు. నేను హృదయం బద్దలైంది, నిజం సంజూ. నా గుండె ముక్కలైంది. మా నాన్న  చనిపోయినప్పుడు లేదా మా బాబాయిలు మా వ్యాపారాలను మోసంతో చేజిక్కించుకున్నప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు. నేను ఆ రాత్రి నిద్రపోలేదు.

రెండవ సారి జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయాను.

నేను అసూయపడే ఏకైక వ్యక్తి శంకర్. ఆయన మంచివారే. కానీ నేను ఆయనని అమితంగా అసహ్యించుకున్నాను ఎందుకంటే అతను నా దేవకన్యని నా కళ్ళ ముందే తాకారు.

నువ్వు నాతో ప్రేమలో ఉన్నావని కొద్ది నిమిషాల క్రితం మాత్రమే నాకు తెలిసింది, అది కూడా శంకర్ నుండే.

నేనో పెద్ద ఫూల్‌ని సంజూ. నీ అందమైన హృదయంలో ఉన్న ప్రేమ నాకు ఎప్పుడూ తెలియలేదు.

సంజూ డార్లింగ్, నీకు బాగయిన వెంటనే, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిన వెంటనే, నేను అమ్మ, అక్క, మా పిన్నితో కలిసి సంబంధం మాట్లాడడానికి వస్తాం.

ఒకవేళ మీ నాన్నగారు కాదంటే, నేను నిన్ను ఆయన కళ్ళ ముందే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను. నిన్ను సంతోషపెట్టడానికి నా జీవితాన్ని ఇస్తాను.

చనిపోయిన మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.

సంజూ కన్నా! నీకు నయం అయిన తర్వాత మీ ఇంటికే వెళ్లవలసిన అవసరం లేదు. దయచేసి నాతో మా ఇంటికి రా.

అమ్మ, అక్క, పిన్ని, ఇంకా నేను నిన్ను మా గుండెల్లో పెట్టుకుంటాం, నిన్ను సంతోషపెట్టడానికి ప్రతిదీ చేస్తాను.

మా అక్క, పిన్నిలకి నీపట్ల ఉన్న ప్రేమ, ప్రపంచంలోని అన్ని ఔషధాలకన్నా చాలా శక్తివంతమైనది.

ఆ ప్రేమ పగిలిన హృదయాలను, నీ విరిగిన కాలును కూడా చక్కదిద్దగలదు. నీకు ఎప్పుడైనా నయం అవుతుంది, సంజూ. దయచేసి నువ్వు మాతో వస్తావా?

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సంజూ. ఐ లవ్ యు సంజూ. ఐ లవ్ యు సంజూ.

ఒక మంత్రం పునరావృతం చేసే భక్తుడిలాగే శివ ఈ మాటలను పదే పదే చెబుతున్నాడు.

సంజన ఇంకా కోమాలోనే ఉంది.

***

సమయం రాత్రి ఒంటిగంట. శివ రెండున్నర గంటలకు పైగా అవే పదాలను పునరావృతం చేస్తున్నాడు. అతను సగం నిద్రపోయాడు. కానీ అతని నోరు ఇంకా “ఐ లవ్ యు సంజూ” అనే పదాలను పదే పదే చెబుతూనే ఉంది.

శివకి అకస్మాత్తుగా మెలకువ వచ్చించి. తన చేతిలో సంజన చేయి ఉండడం కొంచెం బరువుగా అనిపించింది.

అతను ఆమెను చూశాడు. ఆమె కళ్ళు ఇంకా మూతపడే ఉన్నాయి. కానీ అతను ఆమె కనుమూలల్లో కన్నీళ్లు చూడగలిగాడు. ఆ కన్నీళ్లను ముద్దాడటానికి శివ వంగాడు.

విచిత్రంగా ఆ ఉప్పటి ద్రవం శివకి చాలా తియ్యగా అనిపించింది.

శివ తన చేతిని తన పట్టును బిగించాడు.

సంజన స్పందన కొద్దిగా బలంగా ఉంది.

శివ ఆమె అందమైన ముఖాన్ని చూస్తున్నాడు. ఆమె సెకనులో కొంత భాగం కళ్ళు తెరిచింది.

శివని చూసింది, నవ్వి, ఆపై తిరిగి తన పూర్వ స్థితికి వెళ్ళింది.

“డాక్టర్” అంటూ అరిచాడు శివ.

డాక్టర్ కన్నప్పన్, ఇన్-ఛార్జ్ డాక్టర్ ఇద్దరు నర్సులతో పాటు గదికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

సంజన కళ్ళు తెరిచి అతనిని చూసి నవ్విందని శివ వారితో చెప్పాడు.

“మీరు దయచేసి బయట ఉండండి. ఇక మేము చూసుకుంటాము.”

శివ బయటకు వచ్చాడు.

డాక్టర్ కన్నప్పన్ కూడా బయటకు వచ్చారు.

“శివా, నా దగ్గర ఉన్నదంతా తీసుకో; నా ఆసుపత్రి, నా ఇల్లు, నా కార్లు, ప్రతిదీ. నువ్వు మా అమ్మాయిని నాకు తిరిగి ఇచ్చావు.”

‘పెద్దాయనా, ఎక్కువగా సంతోషపడద్దు. త్వరలో ఆమెను తిరిగి తీసుకెళ్తాను’ అని శివ ఆయనని ఆటపట్టించాలనుకున్నాడు, కానీ అది సమయం కాదని ఆగాడు.

డాక్టర్ కన్నప్పన్ చిన్నపిల్లాడిలా తన ముఖాన్ని శివ చేతుల్లో దాచుకుని ఏడ్వసాగారు. శివ తనకు సంజన పట్ల ఉన్న ప్రేమ గురించి, కోమా నుండి ఆమెను మేల్కొలపడానికి తానేం చేశాడో చెప్పాడు.

డాక్టర్ కన్నప్పన్ మరింతగా రోదించారు.

కొంత సమయం తరువాత ఇద్దరూ కళ్ళు తుడుచుకుని అక్కడ్నించి కదిలారు.

***

బయటి దృశ్యాన్ని చూసిన శివ కళ్ళు చెమర్చాయి.

మాల్య, పద్మ ఒక చెక్క బెంచ్ మీద కూర్చుని ఒకరిపై ఒకరు వాలి నిద్రపోతున్నారు.

శివ ఉక్కిరిబిక్కిరవుతున్న గొంతులో డా. కన్నప్పన్‌తో చెప్పాడు.

“సర్, మా అక్క నగరంలో బెస్ట్ ఇంటీరియర్ డెకరేటర్, ఇక మా పిన్ని కోటల్లో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్.

వాళ్ళిద్దరూ ఎయిర్ కండిషన్డ్ గదులలో మెత్తటి పడకలపై నిద్రించడానికి అలవాటు పడ్డారు. కేవలం నా కోసం, ఇంకా సంజన కోసమే చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారి ప్రేమకు నేను ఎలా అర్హుడిని?”

“శివా, మీ కోసం ఒక గదిని కేటాయించమని ఆసుపత్రి వాళ్ళని నేను అడుగుతాను. కొంచెం నిద్రపోవడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడే ఉంటాను. అవసరమైతే నేను మిమ్మల్ని లేపుతాను.”

***

తెల్లవారు జామున ఐదు గంటలకి డాక్టర్ కన్నప్పన్ శివని నిద్రలేపారు.

“నిద్ర లేపినందుకు సారీ, శివా. కానీ సంజనకి స్పృహ వచ్చింది. నీతో మాట్లాడాలనుకుంటుంది. దయచేసి నాతో రా.”

సంజన చాలా బలహీనంగా ఉంది. ఆమె కళ్ళు చూసి శివ కరిగిపోయాడు. ఆమె చూపులు శివ ముఖం మీద నిలిచాయి, అక్కడి నుండి కొంచెం కూడా కదలలేదు. డాక్టర్ కన్నప్పన్ వారికి ఏకాంతం అవసరమని అర్థం చేసుకుని, గది నుండి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయారు.

శివ సంజన మాటలు వినలేకపోయాడు. తన నోటికి దగ్గరగా రమ్మని ఆమె అతనికి సైగ చేసింది.

శివ అలాగే చేశాడు.

సంజన నోరు శివ చెవుల నుండి కొన్ని మిల్లీమీటర్ల దూరంలో ఉంది.

“ఇప్పటి దాకా నువ్వు నన్ను మేడమ్ అని పిలిచేవాడివి. ఉన్నట్టుండి నన్ను సంజూ అని అంటున్నావు. శివా నీకు ఏమైంది?

నేను నీ బాస్‌ని, పైగా నీకన్నా ఐదేళ్ళు పెద్దదాన్ని.”

శివ చాలా షాక్ అయ్యాడు, ఎలా ప్రతిస్పందించాలో తెలీలేదు.

‘శంకర్ నాకు అబద్ధం చెప్పారా? ఓరి దేవుడా! ఓహ్ ఆయన కావాలనే చెప్పారా!’ అనుకున్నాడు. ‘నేను శంకర్ మాటలను విశ్వసించి ఉండకూడదు. నేను ఎంత మూర్ఖుడిని’ అనుకున్నాడు.

ఆమె నుండి దూరంగా జరగటానికి ప్రయత్నించాడు. కానీ సంజన అతన్ని అలా చేయనివ్వలేదు. ఆమె అతన్ని తన వైపుకు లాగి అతని చెంపలపై గట్టిగా తడి ముద్దు పెట్టింది.

“హే, ఫూల్, భయపడ్డావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రియమైన శివా, డార్లింగ్ నిన్ను ప్రేమిస్తున్నాను.”

శివ ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాడు. అతను పాలపుంత గెలాక్సీ నుండి బయటకు వెళ్లి మన గెలాక్సీ పొరుగున ఉన్న ఆండ్రోమెడా తలుపులు తట్టాడు.

సంజన అతన్ని మరోసారి భూమిపైకి తీసుకువచ్చింది.

“నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? లేక జాలి పడి అలా చెప్పావా? అలా మాట్లాడమని డాక్టర్లు అడిగారా?”

ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి శివ మాటలని మాధ్యమంగా ఎంచుకోలేదు. ఆమె పెదవులపై ముద్దాడాడు. వారి పెదవులు కొన్ని సెకన్ల పాటు కలిసి ఉన్నాయి.

ఈ ఉద్వేగం పాలు సంజనకి ఎక్కువయింది, గాఢ నిద్రలోకి జారిపోయింది.

శివ పెదాలను తుడుచుకుని సంతోషంతో గది నుండి బయటకు నడిచాడు.

***

మాల్య, పద్మ నిద్ర లేచారు. వారు నిన్న రాత్రి కూర్చున్న చోటనే కూర్చున్నారు.

వారు శివని పలకరించి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు.

తన ప్రేమ గురించి చెబుతూ శివ సిగ్గుపడ్డాడు. ఆ ఇద్దరి మహిళల ఆనందానికి హద్దుల్లేకపోయింది.

డాక్టర్ కన్నప్పన్ వారికి కాఫీని ఏర్పాటు చేశారు. వారు చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు.

***

ఉదయం ఆరున్నర గంటలకు రవికాంత్ గారి పిఎ వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“శివా, కొద్ది నిమిషాల్లో సూపర్ స్టార్ ఇక్కడకి వస్తారు. ఇక్కడే ఉండు ప్లీజ్.”

పిఎ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

అప్పటి వరకు శివ సంజన జీవితం గురించి మాత్రమే బాధపడుతున్నాడు. నటుడి కుమార్తె వివాహం కోసం ఉద్దేశించిన చీరలన్నీ కూడా మంటల్లో కాలిపోయాయని శివకి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది.

“అక్కా, ఆయన చీరలన్నీ కాలిపోయాయి. పైగా నేను ఆయన దగ్గర నుండి మొత్తం డబ్బు తీసేసుకున్నాను. మనం ఇప్పుడు ఏం చేయగలం?”

“శివ, మన కుటుంబంలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటామని నీకు తెలుసు, పైగా మన నిబద్ధత అన్నిటికంటే ముఖ్యమైనది. మనం మన ఇంటిని అమ్మేసి ఆ డబ్బును ఆయనకి తిరిగి చెల్లిద్దాం.”

పద్మ కూడా చర్చలో చేరింది.

“శివా, నేనింత వరకూ మా బ్యాంకు నుండి లోన్ తీసుకోలేదు. నాకొచ్చే ప్రతీ లోన్ తీసుకుంటాను, డబ్బును అధికం చేస్తాను. మాల్య, ఇంటిని అమ్మవలసిన అవసరం లేదు. అయితే శివా, దయచేసి ఆయనని కొంత సమయం అడుగు.”

“అది సరే, పిన్నీ. పాపం, ఆయన కూతురు పెళ్ళికి మూడు వారాల గడువే ఉంది. చీరల కోసం ఆయన ఏం చేస్తారు? వివాహాన్ని ఎలా వాయిదా వేయగలరు?”

ఆ కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడు, సూపర్ స్టార్ వారి వైపు వేగంగా నడుస్తూ వస్తున్నారు.

తెల్లటి కుర్తా సెట్ ధరించి ఉన్న ఆయన ముఖం ఆందోళనగా ఉంది.

శివ లేచి నిలబడి ఆయనకి నమస్కరించాడు. శివ నమస్కారాలను పట్టించుకోకుండా ఆయన కోపంతో మాట్లాడారు.

“మీరు పొరపాటు చేశారు, శివా. నిజంగా పెద్ద తప్పు చేశారు. అందుకు ప్రతిఫలం చెల్లించబోతున్నారు.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here